విష్ణుమూర్తి బ్రహ్మని సృష్టించి తనని ప్రపంచమును సృష్టించమని చెప్తాడు. బ్రహ్మ "జగత్" ని సృష్టించటం జరిగింది(పరమాత్మ). సృష్టించటమే కాదు దానిని "ఆటోమేట్" కూడా చేశాడు (అది పూర్ణం దాని నుండి వచ్చిన ఇది పూర్ణం). అంతేకాదు తాను సృష్టించిన ప్రతిదానిలోనూ తన "అంశ" ఉంచటం జరిగింది (జీవాత్మ ). జీవు లన్నిటిలో ఉండే జీవాత్మని బ్రహ్మన్ (Brahman ) అనికూడా అంటారు.
బ్రహ్మ తన సృష్టి రహశ్యాలన్నీ మొదట తన జేష్ఠ పుత్రుడు అధర్వునికి చెప్పాడు. అప్పటినుండీ తరతరాలుగా ఆ రహస్యం ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెంది అంగీరసుని వరకూ చేరింది.
ఈ ఉపనిషత్ లో ముఖ్యభాగం గురుశిష్యుల సంవాదాము. శిష్యుడు గృహస్థు మహాశాలి శౌనికునికి, గురువుగారు బ్రహ్మజ్ఞాని అంగీరసునికి మధ్యన అంగీరసుని ఆశ్రమంలో జరిగిన సంవాదన.
జీవితమంతా శాస్త్ర ప్రకారం నిత్యకర్మలూ యజ్ఞ యాగాదులూ చేస్తూ మేటి గృహస్థుడు గా పేరుబడ్డ శౌనికుడు
"ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోటానికి ఇంకేమీ ఉండదు? అంతా తెలుకున్నట్లు అవుతుంది? "
అని గురువుగారైన బ్రహ్మజ్ఞాని అంగీరసుని అడుగుతాడు. దానికి గురువుగారు సమాధానం చెబుతారు.
విద్యలు రెండు రకాలు అపరా విద్యలు, పరా విద్యలు. అపరా విద్య లన్నీ బయట ప్రపంచానికి సంబంధించినవి. బయట ప్రపంచానికి సంబంధించి, పంచేంద్రియాల కోరికలు తీర్చటానికి ఫలాపేక్షతో నేర్చుకున్న విద్యలన్నీ అపరా విద్యల కిందకి వస్తాయి. ఆత్మకు సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం నేర్చుకున్నది పరా విద్య.
ఫలాపేక్షతో చేసిన యజ్ఞ యాగాదులు మొదలయినవి అపరా విద్యలు. వీటి వలన ఫలితం తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.
బ్రహ్మ జ్ఞాన విద్య పరా విద్య. ఫలా పేక్ష లేకుండా చేసిన పరా విద్య తో కలిగే ఫలితం శాశ్వితం. ఇదే మోక్ష మార్గం. ఇంతవరకూ అపరా విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వారు అదే జిజ్ఞాసతో పరా విద్యలు అభ్యసిస్తే/ఆచరిస్తే పర త్త్వాన్ని పొంది మోక్షము సాధిస్తారు.
*************************
మొదటి ముండకం మొదటి ఖండం మంత్రం 2 (1-1-2):
అథర్వ ణే యాం ప్రవదేత బ్రహ్మా : బ్రహ్మ దేవుడు దేనిని అథర్వునికి చెప్పాడో
అథర్వా తాం పురోవాచాంగిరే బ్రహ్మవిద్యమ్ : ఆ బ్రహ్మవిద్యను అథర్వుడు పూర్వం అంగిరునుకి చెప్పాడు
స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ : అంగిరుడు భారద్వాజ గోత్రమునకు చెందిన సత్యవాహినికి చెప్పాడు
భరద్వాజో అంగీరసే పరవరామ్ : భరద్వాజుడు అంగిరసునికి బోధించాడు
లోకం సృష్టించిన బ్రహ్మ దేవుడు ఆ రహస్యాలన్నీ తన పెద్ద కుమారుడు అథర్వునికి చెప్పాడు. అధర్వుడు అంగిరునికి చెప్పాడు. అంగిరుడు భరద్వాజ గోత్రుడైన సత్యవాహినికి చెప్పాడు. భరద్వాజుడు అంగీరసునికి చెప్పాడు.
********************
మొదటి ముండకం రెండవ ఖండం 10వ మంత్రం (1-2-10):
ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం : అనేక యజ్ఞాలూ అనేక పుణ్యకార్యాలూ ఇవే గొప్పవనుకుంటారు
నాన్యచ్చ్రేయో వేదయన్తే ప్రమూడా: : తక్కిన శ్రేష్ఠమయినవి తెలిసికొనుటలేదు పరమ మూర్ఖులు
నాకన్య పృష్టే తే సుకృతే నుభూత్వా : వారు స్వర్గంలో పైలోకాలు పుణ్యఫలం అనుభవించాక
ఇమంలోకం హీనతరం వా విశన్తి : ఈ భూలోకంలో పుడతారు లేదా ఇంకా హీనమైన లోకాల్లో పుడతారు
ఫలాపేక్షతో యజ్ఞ యాగాదులు మొదలైయినవి చేసి అవే గొప్ప అనుకుంటారు. వీటి వలన ఫలితం లభిస్తుంది కానీ అది తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.
********************
నా మాట:
సంవత్సరాల క్రిందట కమ్యూనికేషన్ చాలావరకు వాక్ (నోటి) ద్వారానే ఉండేది. నోటికీ మనసుకీ ఇంపుగా ఉండి గుర్తు పెట్టుకునే విధంగా ఉండటానికి ఛందో నియమాలు సృష్టించి నోటి మాటలుగా రచనలు చేసేవారు. గురువులు వాటిని ఆశ్రమాల్లో (ఆ నాటి పాఠశాలలు ) శిష్యుల చేత వల్లె వేయించేవారు. ఆ విధంగా తరతరాలుగా వేదాలూ ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి.ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment