Friday, June 10, 2022

196 ఓ బుల్లి కథ -- ఓ కన్నీటి బొట్టు

ఈ రోజు ఓ కన్నీటి బొట్టు తో, నా అశృ నయనాలతో మీకు కృతజ్ఞలతలు చెప్పుకుంటున్నాను. మీ మీ ఇళ్లకు వచ్చినప్పుడల్లా, విడిచి పెట్టకుండా దానిని గురించి అడిగే వాడిని . మీరు విసుక్కోకుండా  దానిని గురించి చెప్పేవారు. అంతేకాదు దానిని చూపించి ఎల్లా పని చేస్తుందో కూడా చెప్పేవారు. ఆ చెప్పే సమయంలో మీ మీ కన్నులలో మెరిసే స్పార్క్స్ నన్ను ఉత్తేజ పరిచేవి. 

నేనూ ఎన్నో అనుకున్నాను. దానితో ఏవేవో కొత్త కొత్తవి చేద్దామని కొత్త పుంతలు తొక్కుదామనీ. యాఫ్ఫ్ట్రాల్ ఒక కొత్త మెషిన్ కొనుక్కుంటే దానితో కొత్త పనులు చెయ్యకపోతే ఎలా ! ఇంటర్నెట్ అంతా వెదికాను కొత్త మోడల్ వచ్చిందేమో చూద్దామని. మీ వన్నీ పాత మోడల్స్ కదా (మీరేమీ అనుకోవోకండి).  కొన్ని నచ్చాయి కానీ ఖరీదు ఎక్కువ. కొన్ని చూడటానికి బాగుండలేదు. మన ఇంటి డెకోర్  కి సరిపోవాలి కదా. ఇటువంటి సందిగ్ద పరిస్థుతులలో మా ఆవిడకి  నా కొత్త ప్రాజెక్ట్ గురించి నా సందిగ్దావస్థ గురించి చెప్పాను. ఇంట్లో వంటింటి కౌంటర్ ఆధీనురాలు ఆవిడే కదా !

తను నాకు 100% సపోర్ట్ ఇస్తానని చెప్పింది. అది నాలో నూతన ఉత్సాహము కలిగించింది. కానీ మనసులో తనకి నేను చెప్పినది అర్ధం కాలేదనే శంక ఉండిపోయింది. ఏ భార్య అయినా భర్త చెప్పిన దానికి 100% సపోర్టు ఇస్తుందా!  నేను సరీగ్గా చెప్పి ఉండకపోవచ్చు అని నాకు ఓ చిన్న సందేహం ఉంది. దీనిలో తన తప్పు ఏమీలేదు. ఉత్సాహంతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నప్పుడు నాకు  మాటలు సరీగ్గా రావు. 

వాటిని ఎంచుకోవటం చాలా కష్టంగా ఉందని చెప్పాను. తాను ముందర దానితో ఏమి చెయ్యాలనుందో ఆలోచించుకోమంది. ఆ తరువాత వాటికోసం వెతకటం మొదలు పెట్టమని  చెప్పింది. ఆ సెలెక్ట్ చేసిన వాటిల్లో ఇంటి డెకోర్ కి సరిపోయేది  సెలెక్ట్  చేయటం సులభం అంది. అది మంచి సలహా. అందుకనే వారిని భర్తల తలలో నాలికలంటారు.

నా ఉత్సాహం రెండింతలయింది. దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించి వాటిని  క్రోడీకరించటం మొదలు పెట్టాను. ఇక్కడ చాలా  జాగర్తగా ఉండాలి. మీ కొత్త కొత్త ఐడియాస్ అన్నీ చెప్పేస్తే, గిట్టని వాళ్ళు అవి చెత్త అని తోసిపారేస్తారు. గిట్టిన  వాళ్ళు  అవి కష్టమేమో అని ఉత్సాహం మీద నీళ్లు చల్లచ్చుఁ . అందుకని నేను చాలా ఆలోచించి, అసలు చేద్దా మనుకున్నవి రహస్యంగా పెట్టుకుని,  అందరికీ అర్ధమయ్యే చిన్న చిన్న పనులు చెయ్యటాన్ని గురించి చెప్పాను. మీ మీ కొత్త ఐడియాస్ ఎవ్వరికీ, చివరికి భార్యకు కూడా, చెప్పవలసిన అవుసరం లేదు. పెళ్లి కాంట్రాక్టులో ఇది లేదు. ఒకవేళ నా  ప్రాజెక్ట్  ఫెయిల్  అయితే రిటర్న్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు అని చెప్పంగానే, నాకు కొనటానికి ఓకే వచ్చింది.

వెంటనే walmart లో ఆర్డర్ చేశాను . వారంరోజుల్లో అది ఇంటికి వచ్చింది. ఉత్సాహంగా అన్నీ ఊడదీసి సెటప్ చేశాను. మా స్నేహితులని మా ఇంటికి వచ్చి మా కొత్త మెషిన్ ని ప్రారంభోత్సవం చెయ్యమని అడిగాము. వారు (AVL ,శోభ దంపతులు ).  మా కోరికను మన్నించి మా ఇంటికి వచ్చి బొట్టుపెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. వారికి మా కృతజ్ఞతలు. 

ఒక నెల రోజులు ప్రయత్నించాను. పాత వంటలే దానిమీద చేయలేక పోయాను, ఇంక కొత్త  వంటలు సృష్టించటం ఎక్కడ ? చెప్పద్దూ  ఫ్రెంచ్ ఫ్రైస్ బాగానే వచ్చాయి. సగ్గుబియ్యం వడియాలు కూడా బాగా వచ్చాయి. కానీ ఆ రెండూ రోజూ తినము. గంట కష్టపడి చేసిన సగ్గు బియ్యం వడియాలు అయిదు నిమిషాల్లో అయిపోయినాయి. పెట్టిన కష్టానికి సరిఅయిన ఫలితం రాలేదని బాధ. చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు. అనుకున్న ప్రకారం  తిరిగి ఇచ్చేయవలసి వచ్చింది. 

రిటర్న్ చేద్దా మనుకున్న కున్న రోజు రానే వచ్చింది. దాన్ని  శుభ్రం చేసి జాగర్తగా ప్యాకేజ్ లో  పెట్టాము. వాతావరణం చక్కటి సూర్యరశ్మి తో ప్రకాశిస్తోంది. కానీ ఎక్కడలేని నిశ్శబ్దం. మనస్సు  ఏదో శంకిస్తూనే ఉంది. walmart రిటర్న్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాము. మేము రెండో వాళ్ళము. సంతోషించాము. ఎంతసేపటికీ కౌంటర్ దగ్గరున్న మా ముందర ఉన్న అమ్మాయి పని తెమలట ల్లేదు. చివరికి రిటర్న్ లో కంప్యూటర్లు పని చెయ్యటల్లేదని చెప్పారు. ప్యాకేజీ ని ఇంటికి తీసుకు వచ్చాము. 

మర్నాడు  మళ్ళా వెళ్ళాము. నాకు రిటర్న్ చెయ్యాలనంటే బాధగా ఉంది.  నేనే కాదు ప్రకృతి కూడా ఆరోజు శోకించింది. ఆకాశం అంతా మేఘాలతో నిండివుంది. పార్కింగ్  లాట్ లోనుండి కార్ట్ లో దాన్ని రిటర్న్ చెయ్యటానికి తీసుకు వస్తుంటే హఠాత్తుగా ఆకాశం నుండి ప్యాకేజ్ మీద చినుకులు పడటం మొదలయింది. సున్నితంగా దాని మీద నా గొడుగు వేసి తడవకుండా చేసి లోపలి వచ్చాము . నాకు దానిమీద ప్రేమ ఇంకా పోలేదు. నెల రోజుల అనుబంధం కదా ! 

walmart  లో రిటర్న్ కౌంటర్ పనిచేస్తోంది. క్యూలో ఎవ్వరూ లేరు. మా ఆవిడ నా ముఖంలో బాధ కనపడుతోంది అని చెప్పింది. బాధ పడద్దని ధైర్యం చెప్పింది. రిటర్న్స్ తీసుకునే కుర్రది నా బాధని పట్టించుకోలేదు. ఒక నిమిషంలో మీ ఎకౌంటు లో డబ్బు పంపిస్తున్నాము అని చెప్పి కార్ట్ ను అక్కడ పెట్టమంది. చివరిగా నేను ప్యాకేజ్ ఉన్న కార్టుని రిటర్న్ వస్తువులు పెట్టిన స్థలంలో పెట్టి, దాన్ని మృదువుగా స్పృశించి, బాధగా వీడ్కోలు చెప్పి దిగులు ముఖంతో బయటకు వచ్చాను. పక్కనున్న మా ఆవిడ కొంచెం నాకు ధైర్యం చెప్పి ఉపశమనానికి "సబ్  వే "  వెజ్జీ మాక్స్ విత్  ఇటాలియన్ బ్రెడ్"  ని కొనిపెడతానని చెప్పింది. దానితో నాకు జీవితం మీద కొంచెం ధైర్యం వచ్చింది.


గుడ్బై మై డియర్ ఎయిర్  ఫ్రయర్ .

**** "ఎయిర్  ఫ్రయర్" వేడి గాలులతో దానిలో పెట్టిన వస్తువులని ఉడక పెడుతుంది. వేసవి  కాలంలో గుంటూరు లాగా.

2 comments: