Saturday, October 4, 2025

216 ఓ బుల్లి కధ --- AI--Agent

కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడేది 

Workflow ని పెద్దది చేస్తే 

నేను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నది TIFR (Tata Institute of Fundamental Reaserch) బొంబాయి లో. అది ఇండియా లో మొదటి పెద్ద కంప్యూటర్ . కాగితం మీద FORTRAN ప్రోగ్రాం వ్రాసి ఇస్తే , కీ పంచ్ వాళ్ళు కార్డులు తాయారు చేసి ఇస్తే, ఆపరేటర్లు వాటిని కంప్యూటర్లో లోడ్  చేస్తారు. రిజల్ట్స్  రెండు మూడు గంటల తర్వాత వస్తాయి .ఆ  కంప్యూటర్ పేరు CDC3600. ఇప్పుడు లాప్టాప్ పైథాన్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ . కానీ కంప్యూటర్ పనిచేసే విధానం మాత్రం ఏమీ మారలేదు.

అసలు మనం ఇంకొకళ్ల  చేత పని చేయించు కోవాలంటే మనము వాళ్లకి వాళ్లకి తెలిసిన భాషలో సరిఅయిన instructions  ఇవ్వాలి . పని మనుషులకైనా , కంప్యూటర్ల కైనా , AI తో అయినా సరే ఇది నిజం. మీరు సరీగ్గా చెప్పకపోతే దానికి ఇష్టమయిన విధంగా చేసేస్తుంది . మీరు అప్పుడప్పుడూ వింటూ ఉంటారు "కంప్యూటర్ తప్పు చేసిందని " . ఇది నిజం కాదు . అనుకున్నదొక్కటి అయినది మరొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా . మనం దానికి చెప్పిన instructions తప్పు .

ప్రస్తుతం AI లో హాట్ టాపిక్ AI -Agent . మనకు కావాల్సిన పని చేయించుకోటానికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క  పనిమనిషిని పెట్టుకున్నట్లు, కంప్యూటర్ చేత మనకు కావాల్సిన పనులు  చేయించుకోటానికి AI-Agent లని పెట్టుకుంటాము. 

ఉదాహరణలు :  పెద్ద పెద్ద కంపెనీలలో రోజూ కొన్ని వందల  emails వస్తూ ఉంటాయి .  అన్నీ  చదవాలంటే చాలా కష్టం. వాటినన్నిటినీ మనకు కావాల్సిన, అవసరమైన వేమిటో AI - Agent కి చెప్పి తే , అది చదివి మనకు కావాల్సినవి మనకు ఇస్తుంది . అల్లాగే ఉద్యోగాలకోసం బోలెడుమంది apply చేస్తూ ఉంటారు. అదే AI - Agent కు చెపితే తాను చదివి మనకు కావాల్సిన వాటిని ఇస్తుంది . ఈ మధ్య చాలా మంది apply apply noreply అంటున్నారు. మీ సమాచారం   exiting  గా లేదు (AI - Agent) కి. 

నాకు ఈమధ్యన ఒక AI - Agent ని తయారు చెయ్యాలని అనిపించింది . అందరిలా లక్షలు సంపాయించాలని కాదు. వాటిని  ఎల్లా create చేస్తారో తెలుసుకోవాలని. ఇది కొంచెం ఖరీదయిన విషయం కాబాట్టి, వెతగ్గా వెతగ్గా , n 8 n వాళ్ళు ఈ ఏజెంట్లు చెయ్యటం నేర్చుకోటానికి 15 రోజులు ఫ్రీగా వారి ప్రోగ్రామ్లు వాడుకోవచ్చని తెలిస్తే నేను దాన్ని ఉపయోగించి ఒక AI - Agent ని create చేశాను . 

నేను ముందర చెప్పినట్లు కంప్యూటర్ తో ఏపని చేయించాలన్నా దానికి సరిఅయిన instuctions ఇవ్వాలి. దాన్నే కంప్యూటర్ భాషలో (ఈ AI - Agent భాషలో ) workflow అంటారు. సింపుల్ గా నాకు  AI - Agent చెయ్యాల్సిన పని ఏమిటంటే పొద్దున్నే లేచి మావూళ్ళో ఆరోజు వాతావరణం ఎల్లా ఉంటుందో చూసి email ద్వారా నాకు తెలియ చేయాలి. మేము ఉండే  ఈ చలిదేశంలో మాకు వాతా వరణం చాలా ముఖ్యం. మొదటి బొమ్మలో నేను తయారు చేసిన workflow ఉంది చూడండి. దాన్నే రెండో బొమ్మలో పెద్దది చేసి ఇచ్చాను . 

మొదట చెయ్యాల్సింది దానితో ఏ విధంగా మాట్లాడతానో చెప్పాలి. నేను దానితో సంభాషణ (chat ) ద్వారా అని చెప్పాను . అక్కడ "+" అనేది  కనపడుతొందే , అది నొక్కితే దానితో సంభాషించే వివిధ మార్గాలు  చెబుతుంది . అల్లాగే రోజూ పొద్దునపూట ఆరు గంటలకు మేల్కొని నాకు చెయ్యాల్సిన పని చెయ్యి అని AI -Agent కి చెప్పొచ్చు. 

రెండోపని దానికి తెలివితేటలు అమర్చటం . అక్కడ కనపడుతున్న "+" నొక్కటమే .  దానికి తెలివితేటలు ఏవిధంగా ఇవ్వచో చెబుతుంది .  ChatGpt, Deepseek , Gemini వగైరా కనపడతాయి .  నేను Gemini ని ఎన్నుకున్నాను . Gemini అయితే ఫ్రీగా వాడుకోవచ్చు అందుకని . 

దీనికి బుర్ర ఇచ్చాము కానీ చెప్పినపని గుర్తు పెట్టుకోటానికి memory ఇవ్వాలి .  లేకపోతే చెప్పినపని అలా గాలిలోకి వదిలేస్తుంది . అందుకని అక్కడ "+" నొక్కి మెమరీ ఇచ్చి, నేను చెప్పిన 10 సంభాషణలు గుర్తు పెట్టుకోమని చెప్పి మూడవ పని ముగించాను . 

ఇంక నాలుగో పని అది పని చేయటానికి  కావలసిన  పరికరాలు (Tools  ) ఇవ్వాలి . మా ఆవిడ నన్ను కూరలు తరగమంటుంది గానీ  దానికి కావలసిన కత్తులూ కటార్లూ ఇవ్వదు . AI Agent తోటి అలా కుదరదు. మళ్ళా Tools దగ్గర "+" నొక్కి తే దాని దగ్గర ఉన్న tools అన్నీ వస్తాయి . మనకు  కావాల్సినది ఎంచుకోవటమే . నాకు కావాల్సినవి ఎంచుకుని చెప్పాను. నాకు Date Time కావాలి. రెండవది ఆరోజు వాతావరణం కావాలి. డేట్ టైం tool అక్కడ ఉంది అది పెట్టేశాను .

కానీ వాతావరణంకి  వచ్చేసరికి, ఆ వాతావరణము ఎక్కడ ఉంటుందో దానికి చెప్పాలి . నాకు ఆ చెప్పేచోటు తెలుసు (open.meteo.com ) అక్కడకి వెళ్ళమని చెప్పటానికి  http అనే tool ని వాడాలి . ఇంటర్నెట్లో ఆ site లోకి వెళ్లి మీ ఊరు చెప్పుకుని (దానికి longitude latitude మాత్రమే తెలుసు ) API అనేది కాపీ చేసుకుని http టూల్ లో paste చేశాను.  మనం API Key ద్వారా వాళ్ళు సృష్టించిన  సమాచారం మనము వాడుకోటానికి తీసుకోవచ్చన్న మాట . చాలా మంది API కి డబ్బులు అడుగుతారు . వీళ్ళు ధర్మాత్ములు ఊర్కేనే ఇస్తున్నారు .  థాంక్స్ .

ఇంక అయిదోది నాకు email పంపించమన్నాను కాబట్టి GMAIL tool ని పెట్టాను . tools కోసం చేసేది  "+" నొక్కటమే. ఆ టూల్కి కావాల్సిన సమాచారం ఇవ్వాలి. నా ఇమెయిల్ దానిలో టైపు చేశాను. మీరు ఎన్ని tools అయినా పెట్టుకోవచ్చు . 

ఇంకా టెస్ట్ చెయ్యటమే తరువాయి . Chat Box లో "Send today's weather to the connected email.' అని AI -Agent కి  ఒక ఆజ్ఞ జారీ చేశాను .

కింద email నా inbox లోకి  వచ్చింది. పదిహేను రోజుల ఫ్రీ టైం తో  చేసిన పరిశోధన ఇది.టెస్ట్ సక్సెస్ అయ్యింది . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ agents ఎల్లా పని చేస్తాయో తెలుసుకున్నాను .  

us@gmail.com

Fri, Sep 19, 6:24 PM (13 days ago)
to me
The current date and time is 2025-09-19T18:24:16.846-05:00 and the current temperature is 56.8°F.

---
This email was sent automatically with n8n
https://n8n.io


Wednesday, September 24, 2025

215 ఓ బుల్లి కధ --- జెమినీ AI -- స్టోరీ బుక్

పిల్లలు 

కుందేలు కోపం 


కీరా బన్నీ 


స్క్వీకీ 

సామాన్యంగా అమెరికాలో  చిన్న పిల్లలని  నిద్రపుచ్చే ముందు వాళ్ళని పడుకోబెట్టి పుస్తకాలు చదువుతారు . ఇంట్లో చిన్న పిల్లలుంటే పెద్దవాళ్ళకి  ఆనవాయితీ గా పుస్తకాలు చదవటం అలవాటు అవుతుంది. ఈ పిల్లల పుస్తకాలు సామాన్యంగా బయట కొనుక్కోవచ్చు. కానీ చాలామంది దగ్గరలో ఉన్న లైబ్రరీ నుండి తెచ్చు కుంటారు . మా ఇంట్లో అయితే శని ఆదివారాలలో ఒకప్పుడు ఇది మామూలు గ చేసేదే. ఇప్పుడయితే మనవళ్ళు మానవరాళ్ళకోసం, వాళ్ళు ఇంటికొచ్చే ముందర అమ్మమ్మ లైబ్రరీకి వెళ్లి ఒక ఇరవై పుస్తకాలు చదవటానికి పట్టుకొస్తుంది . మా చిన్నప్పుడు మాకు పుస్తకాలు చదివే వెసులుబాటు  లేదుకానీ మా నాన్నగారు పడుకునే ముందు కధలు చెప్పేవారు . చెప్పిన కధలే మళ్ళా  ఇష్టంగా చెప్పించుకునే వాళ్ళం. 

ఈ పుస్తకాలు చదివే అలవాటు చిన్నప్పుడే అలవాటైతే తీరిక ఉన్నప్పుడల్లా పుస్తకం పట్టుకోవాలని మనసులో పీకుతుంది. అందుకే ఇప్పుడు పిల్లలు తీరిక ఉన్నప్పుడల్లా ఐపాడ్ పట్టుకుని అమ్మమ్మనో బామ్మనో పుస్తకాలు చదవమని పిలుస్తూ ఉంటారు. ఒక్కక్కప్పుడు వాళ్ళే వాళ్లకి ఇష్టమయిన పుస్తకాలు తీసుకు వచ్చి చదవమంటారు. 

ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చింది . AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) తోటి మనమే మనకి ఇష్టమయిన కధల తోటి పుస్తకాలు తయారు చేసుకోవచ్చు . అటువంటిది ఒకటి గూగుల్ వారి జెమినీ (gemini ) సాఫ్ట్వేర్ . దీనిని ఉపయోగించి ఒక కధని "స్టోరీ బుక్" గా తాయారు చెయ్యవచ్చు. దీనిని వాడుకోటానికి ప్రస్తుతం డబ్బేమీ కట్టక్కరలేదు. 

దాదాపు AI (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) తో పనిచేసేవాటన్నిటికీ ముందర మనకి ఏది కావాలో చాట్ బాక్స్ ద్వారా చెప్పితే అది చేయగలదో  లేదో చెబుతుంది . దాని చేతే ఒక పంచతంత్ర కధని  పుస్తకంగా వ్రాయించాను . మా మనవడు ఒక కధ చెప్పి పుస్తకంగా వ్రాయమంటే పుస్తకం చేసింది కానీ కధ తన ఇష్టమొచ్చినట్లు మార్చేసింది . దానిని తప్పులు సరిచేయమంటే సరిచేస్తుంది కానీ ఒక్కక్కప్పుడు మోరా ఇస్తుంది . నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను నన్ను గొడవ చెయ్యద్దంటుంది. 

ఉదాహరణకి నేను దాన్ని ఒక తెలుగు స్టోరీ వ్రాయమన్నాను . దానికి అది చెప్పిన సమాధానం కింద ఇస్తున్నాను:. 

నమస్కారం! మీరు ఒక స్టోరీబుక్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. మీ కోసం మరింత వ్యక్తిగతీకరించిన కథను రూపొందించడానికి కొన్ని వివరాలు అవసరం. ఇవి కేవలం సూచనలు మాత్రమే.

  • పాఠకుల వయస్సు ఎంత?

  • కథాంశం ఏమిటి?

  • ఇలస్ట్రేషన్ శైలి ఎలా ఉండాలి? (ఉదాహరణకు, వాటర్ కలర్ లేదా కార్టూన్)

మీరు అది అడిగిన ప్రశ్నలకి సమాధానాలు వ్రాస్తే తప్పకుండా మీ స్టోరీ బుక్ తయారు చెయ్యటానికి ప్రయత్నిస్తుంది. మీకు అది తయారు చేసిన కధా  బొమ్మలు మొదలయినవి నచ్చక పోతే మీరు దానికి చెబితే సరిచేస్తుంది . ఉదా:  పిల్లలు ఇండియా వాళ్ళని చెప్పవచ్చు. వాళ్ళ కనుబొమ్మలు నల్లగా ఉండాలని చెప్పొచ్చు . 

నేను తయారు చేసిన స్టోరీబుక్ లు వాటి లింకులూ క్రింద ఇస్తున్నాను . వీటిలో కొన్ని కధలు మా మనవలు మనవరాళ్లు సృష్టించినవి. వీటిని మీ పిల్లలకి చదివి వినిపించండి. మీరు కూడా మీ పిల్లల చేత స్టోరీలు తాయారు చేయించి జెమినీ చేత వ్రాయించి వాళ్ళ క్రియేటివిటీ ని పెంచండి.

స్టోరీ బుక్ పైన "cover" అని వస్తుంది .  దాని పక్కన గుర్తులు  "<  >" నొక్కితే పుస్తకంలో పేజీలు మారుతాయి. అల్లాగే కుడివైపు పైభాగంలో  "Listen " అని కనపడుతుంది , అది నొక్కితే పుస్తకాన్ని అదే చదివి వినిపిస్తుంది . 

1. Go to School Everyday

2. తెలివైన కాకి నీలా

3. వాన్రాజ్ మరియు చతుర నక్క

4. Kira Bunny and the Snowy Trick

5. కుందేలు కోపం

6. Norval and spicy clam

7. The boy with the kind heart

8. The Grand Adventure

9. కుందేలు సింహం

10. The Clever Family

11. The Story of Michael Faraday

Monday, July 14, 2025

214 ఓ బుల్లి కధ --- ఉదయాద్రిపై దివ్వె

 

ఫొటో గూగుల్ నుండి 

ఉదయాద్రిపై దివ్వె పాట  : 

రచన : రాచకొండ విశ్వనాధ శాస్త్రి 

స్వర కర్త  : మల్లాది సూరిబాబు 

రాగం :  మధువంతి 

పాడిన వారు :  మల్లాది వారు 


ఏ మహా శక్తి ఉదయాన్నే వేయి వెలుగుల సొగసుతో విశ్వ వీధుల్లో (సూర్య  కిరణాలు) చల్లుతోంది ?

భూమి ఆకాశము కలిసినట్టు కుండపోతగా వర్షం కురిసిన తర్వాత 

కోటి రంగులతో దేదీప్యమానంగా వెలుగు (ఇంద్రధనుస్సు ) నిచ్చే ఆ మహా శక్తి  ఎవరు ? 

ఆ మహాశక్తికి నా శతకోటి వందనాలు .   


ఈ పాట మాతృక : 

ఉదయాద్రి పై దివ్వె
పదిలపరచే దెవరో

వేయి వెలుగుల సొగసు
విశ్వ వీధుల విరియ          :ఉదయాద్రి :

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట

ఆకసము పొగబారి
చీకట్లు కొడిగట్ట              

కొడిరాల్చి క్రొందివ్వె
కుదుటపరచే దెవరో        :ఉదయాద్రి :

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

మన్నుమిన్నై పుడమి
విన్నబోయిన జూచి

తరుల తీగలపూలు
మురిసి రంగుల విరియ     :ఉదయాద్రి :


యే మహాశక్తి కృప
ఈ విశ్వమును బ్రోచు
ఆమె పూజాపీఠ
మలరింప జ్యోతిగా          :ఉదయాద్రి :



మనం జీవితంలో కొన్నిటికి పూర్తిగా అలవాటు పడ్డాము, వెలుగు ,  చీకటి ,  గాలి ,  వర్షం, భూమి . మనం వాటిని సృష్టించే ప్రశ్నయే  లేదు . ఎవరో సృష్టించిన వాటిని రోజూ  సులభంగా వాడు కోవటం మనకి అలవాటు అయింది . వాటిని సృష్టించిన వారికి ఒకసారైనా కృతజ్ఞత చెప్పలేమా ?     .  

మీకోసం ఈ పాట మల్లాది వారి  స్వరంతో  పాట లింక్ : : 

ఉదయాద్రి పై దివ్వె 

ఫొటో గూగుల్ నుండి 


Monday, April 7, 2025

213 ఓ బుల్లి కధ --- మిలియాన్నైర్ పెళ్ళాం

ఏప్రిల్ నెల తో అమెరికాలో వసంతకాలం మొదలైనట్లే . లివింగ్ రూమ్ కిటికీ లోనుండి చూస్తున్నా . ఎదురింట్లో లాన్ మీద హడావుడిగా ఉంది . ఆకాశాన్ని అంటుతున్న చెట్టు పైన రెండు పక్షులు చేరి సరసా లాడుకుంటున్నాయి . పిల్లలు చెట్లకేసిన ఉయ్యాలలో  ఊగుతున్నారు . పెద్దలు నుంచుని బీర్ తాగుతున్నారు . అమ్మలు గ్రిల్ మీద "హాట్ డాగ్ "  లు కాలుస్తున్నారు. 

మార్చి తో చూస్తే ఒకనెలలో ఎంత మార్పు . నెల క్రిందట ఇదే కిటికీ లోనుండి  చూస్తే --- ఆకాశం నుండి ఎవరో ముగ్గు చల్లుతున్నట్లు "స్నో "  పడుతోంది . అది ఆకులులేని మోడులుగా ఉన్న చెట్లకొమ్మలపై పడి పేరుకుని వీధిలోఉన్న చెట్లకి ఒక అందాన్ని ఇస్తున్నాయి . రోడ్లమీద ఫుట్ పాత్ మీద "స్నో " పడి సన్నటి గాలికొడుతుంటే రేగిపోతూ ఇక్కడ ఉండేదా పోయేదా అనుకుంటూ చెలరేగుతోంది . నెల క్రిందటకీ ఇప్పటికీ ఎంత తేడా ! 

ఒక గంటలో అంతా మారిపోయింది .  స్నోపడటం ఆగిపోయింది .  గంభీరమైన నిశ్శబ్దం . ఎవరో వచ్చి ప్రకృతినంతా పెయింట్ చేసి వెళ్ళినట్లు  ఉంది . చెట్ల కొమ్మ లన్నీ  ఎవరో తెల్ల పెయింట్ పూసునట్లు  తెల్లగా ఉన్నాయి . వీధులూ , ఫుట్ పాత్ లూ తెల్లగా మెరుస్తున్నాయి . ఇది నెలరోజుల కిందటి వాతావరణం .  మళ్ళా ఇంకొక సంవత్సరం దాకా అటువంటి దృశ్యాలు కనపడవు .  

తలుపు చప్పుడయినది పక్కింటి  పరమేశం వచ్చాడు .  సామాన్యంగా వీకెండ్ తప్ప పరమేశం కనిపించడు . స్టాక్ మార్కెట్ ఎదో చూసుకుంటూ ఉంటాడు .  ఇంకా మాట్లాడితే ఏవో "అప్షన్స్ " లట వాటితో  డబ్బులు సంపాయిస్తాడుట . రిటైర్ అయ్యిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడైతే బాగుంటుంది కదా !  ఇవ్వాళ ఇంటావిడ లేదు , వర్క్ కి వెళ్ళింది . నేనే కాఫీ పెట్టి ఇచ్చాను.

ఏం పరమేశం స్టాక్ మార్కెట్ ఎల్లా ఉంది అని అడిగాను . తను  వెంటనే సమాధానం ఇవ్వలేదు. TV లో వింటున్నాను ఏవో  "టారిఫ్" ల తోటి స్టాకులకి గడ్డు పరిస్థితి అని . 

నెమ్మదిగా అన్నాడు "మా ఆవిడని మిల్లియన్నీర్  చేద్దామనుకున్నాను " అని .  ఇదేదో కొత్తగా ఉంది .  సామాన్యంగా ఇంటావిడకి ఏదో పండగలకి పట్టు చీర కొందా మనో , ఎదో "నెక్ లెస్"  కొందామనో అనుకుంటారు కానీ ఇలా వాళ్ళ ఆవిడని మిల్లియన్నీర్ చేద్దామనే కోరిక వినలేదు . 

మరి ఏమయ్యింది అని అడిగాను .  మార్కెట్లు కుదేలు అయినాయి అన్నాడు .  పోన్లే మళ్ళా మెరుగవుతాయిలే అన్నాను . లేదు మన జీవిత కాలంలో అవ్వవు అన్నాడు . ఏమిటో ఇంత నిరాశ రావటానికి అంత ఉపద్రవం ఏమొచ్చిందో ! 

ఇంకా ఎదో అంటూనే ఉన్నాడు ,  కాల్స్ ట, పుట్స్ ట, ఆప్షన్ ఎక్సపైరీ ట, అసైన్మెంట్ ట ---  ఏవేవో ఆపకుండా గొణుగు తున్నాడు .  

నాకు ఎల్లా సముదాయించాలో అర్ధం కాలా .  పరమేశం మా ఇంట్లో సాయంత్రం భోజనం "ఉప్పుడు పిండి", ఆవురావురు మంటూ మా ఆవిడ వర్క్ నుండి వచ్చే లోపల చెయ్యాలి. ఈ  నాలుగు పచ్చిమిరప కాయలూ అల్లం ముక్క దంచిపెట్టు ,  నేను పెసరపప్పు నానేసి ఎసరు పోస్తాను అన్నాను . 

ఏదోవిధంగా బాధపడుతున్న వాళ్ళని ఇంకో వైపు తిప్పితే కొంచెం ఉపశమనం కలుగుతుంది . పాపం పరమేశం కోరిక ఎప్పుడు తీరుతుందో ! .    

Monday, January 27, 2025

212 ఓ బుల్లి కధ --- డీప్ సీక్ (DEEPSEEK ) తో తెలుగు పద్యం

 

ఇవ్వాళ అమెరికా స్టాక్  మా ర్కెట్ ని కుదిపేస్తున్న చైనీస్ AI  'DEEPSEEK ' ని తెలుగులో nature మీద ఒక పద్యం వ్రాయమని అడిగాను . ఒక నిమిషంలో వచ్చిన దాని సమాధానం క్రింద  ఉంచుతున్నాను . భవిష్యత్ లో జీవితం ఎల్లా ఉంటుందో తెలపటానికి ఇది ఒక నిదర్శనం . 


write a poem in telugu about nature

Here’s a poem in Telugu about nature (ప్రకృతి):

ప్రకృతి సౌందర్యం
చిరునవ్వు చిందించే తెల్లమేఘాలు,
కొండల మీద నిద్రించే పచ్చని పర్వతాలు.
నదులు పాడే గీతాలు, గాలి పాడే పాట,
ప్రకృతి అందం ఒక్కటే అమూల్యమైన వాట.

పూలతోటలో రంగురంగుల పూలు,
తుమ్మెదలు గుంపుగా విన్నపాలు.
చెట్లు చాటున నీడలో శాంతి,
పక్షుల కిలకిలారావాలతో ఆనందం.

సూర్యుడు ఉదయించే సమయం,
కాంతులు చెరగని అద్భుతమైన క్షణం.
చంద్రుడు వెన్నెలలో ముగ్ధమైన రాత్రి,
ప్రకృతి అందం అనంతమైన కథ.

ప్రకృతిని కాపాడుదాం, దాన్ని ప్రేమిద్దాం,
ఈ అందమైన భూమిని మనందరం కాపాడుదాం.
పచ్చదనం నింపే ఈ ప్రకృతి,
మన జీవితానికి అందమైన వాస్తవం.


This poem celebrates the beauty of nature and emphasizes the importance of preserving it. Let me know if you'd like any changes or further assistance! 🌿

New chat
DeepThink (R1)
Search

Monday, December 30, 2024

211 ఓ బుల్లి కధ --- చికాగో లో క్రిస్టమస్

 

మ్యూజియం క్రిస్మస్ ట్రీ 


ఇండియా క్రిస్మస్ ట్రీ 

మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ 

అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ లో వచ్చే థాంక్స్ గివింగ్ దగ్గర నుండీ డిసెంబర్ లో వచ్చే   క్రిస్మస్ - న్యూ ఇయర్ దాకా క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉంటాయి . సామాన్యంగా ప్రతీ ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీ ,  ఇంటిముందు డెకొరేషన్స్, రంగు రంగుల  దీపాలూ సర్వ సాధారణం .  ఈ సమయంలో బంధువుల మధ్య స్నేహితుల మధ్య  బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలు జరుగుతూ ఉంటాయి . ఇంట్లో పిల్లలకి చాలా సంబరంగా ఉంటుంది . క్రిస్మస్ ముందురోజు రాత్రి శాంటా క్లాస్ వచ్చి వాళ్ళ ప్రెజెంట్స్ క్రిస్మస్ ట్రీ క్రింద పెట్టి వెళ్లి పోతాడు .  క్రిస్మస్ రోజున పొద్దున లేచేసరికి క్రిస్మస్ ట్రీ కింద ప్రెజెంట్స్ కనపడంగానే పిల్లలకి ఎంత ఆనందమో .   కొందరు పిల్లలయితే రాత్రిపూట  శాంతా క్లాస్ కి పాలూ బిస్కట్లు కూడా పెట్టి ఉంచుతారు మంచి మంచి ప్రెజంట్స్ కోసం  . ఒక మాటలో చెప్పాలంటే క్రిస్మస్, సంవత్సరంలో వచ్చే చాలా పెద్ద పండగ .  పిల్లలూ పెద్దలూ వాళ్లకి కావాల్సిన ప్రెజెంట్స్ గురుంచి బాహాటంగా చెబుతూ ఉంటారు .  వాళ్లకి కావాల్సినవి రాకపోతే , కొంచెం నిరాశ ఉన్నా వచ్చే సంవత్సరానికి వస్తుందిలే అనుకుని వచ్చిన దాంతో తృప్తి పడతారు . 

మా ఇంట్లో ప్రతీ సంవత్సరం క్రిస్మస్ ట్రీ పెడతాము . ప్రెజెంట్స్ కూడా  దాని క్రిందకి వస్తూ ఉంటాయి . మా మనవరాలికి కూడా శాంతాక్లాస్ ఈ సంవత్సరం క్రిస్మస్ ట్రీ కింద ప్రెజెంట్స్ పెట్టి పోయాడు . మన మనసంప్రదాయాలు ఎలాఉన్నా మన పిల్లల సంప్రదాయాలు , ప్రేమలూ వాళ్ళు పెళ్లి చేసుకునే  వాళ్ళని  బట్టి ఎలా మారతాయో  చెప్పలేము కాబట్టి గుంపులో గోవిందా అనుకుంటూ విభిన్న సంప్రదాయాల గురించి తెలుసుకోవటంమంచిది .  

ఈ సంవత్సరం క్రిస్మస్ టైం లో మేము ముఖ్యంగా చూసినది /చేసినది చికాగో లో ఉన్న సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియంకి వెళ్ళటం . అక్కడ క్రిస్మస్ సమయంలో అన్ని దేశాల క్రిస్మస్ ట్రీస్ ఆయా దేశాల డెకొరేషన్స్ తో పెట్టి చూపిస్తారు . మా పిల్లల్ని వాళ్ళ చిన్నప్పుడు అక్కడకి తీసుకు వెళ్లాము. ఇప్పుడు  వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకు వెళ్తూ మమ్మల్ని కూడా తీసుకు వెళ్లారు . 

ఈ సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియం 1890 లో అనుకుంటాను వరల్డ్ ఫెయిర్ అప్పుడు నిర్మించారు .   అప్పటినుండీ ఇప్పటిదాకా  ఎప్పటికప్పుడు కాలాన్నిబట్టి మార్పులూ చేర్పులూ చేస్తూ అధునాతకంగా ఉంచుతారు .  ఇప్పుడు దాని పేరు గ్రిఫ్ఫిన్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ మ్యూజియం. బహుశా  గ్రిఫిన్ గారు కొన్ని మిల్లియన్స్ డబ్బులు దీనికి  ఇచ్చి ఉంటారు .  నేను చెప్పటం మర్చి పోయాను , సామాన్యంగా  క్రిస్మస్ సమయంలో అందరూ  ఎవరికి  తోచినంత వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు . 

ఈ మ్యూజియం గురించి తలచుకున్నప్పుడల్లా  నా మనస్సు ఎక్కడికో వెళ్లి పోతుంది . పాత జ్ఞాపకాలు బయటికి వస్తాయి .  యాభై ఏళ్ళ  క్రిందట దాదాపు రోజూ ఈ మ్యూజియంకి సాయంత్రం భోజనం చేసిన తరువాత వెళ్ళే  వాణ్ని. నేను చికాగో యూనివర్సిటీ లో పని  చేసినప్పుడు ఇంటెర్నేషనల్  హౌస్ లో ఉండేవాణ్ణి .  అది ఇక్కడికి చాలా దగ్గిర. అప్పుడు దీనికి ఎడ్మిషన్ ఫీ  కూడా ఉండేది కాదు .  రోజుకో సెక్షన్ చూసే వాణ్ని .  ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సైన్స్ పుస్తకం . అక్కడ ఎక్జిబిట్స్  చదువుతూ చూస్తూ ఉంటే సైన్సు  పుస్తకాలు చదవక్కర్లా.  నేను అక్కడ చాలా సంగతులు తెలుసు కున్నాను .  కోల్ మైన్స్ ఎల్లా ఉంటయ్యి , భూమిలోంచిపెట్రొల్ ఎల్లా తీస్తారు ,  రైలు ఇంజను కార్ ఇంజన్లు ఎల్లా పని చేస్తాయి . ట్రాన్సిస్టర్ లు ఎల్లా తయారు చేస్తారు, ఎల్లా పనిచేస్తయ్యి .  పూర్వ కాలంలో అమెరికాలో వీధులు ఎల్లా ఉండేవి . ఇక్కడ చూడటానికి రెండవ ప్రపంచ యుద్ధంలో పట్టుబడ్డ uboat జర్మన్ సబ్మేరీన్ కూడా ఉంది .దీనిలో ఉన్న IMAX థియేటర్లో సినిమాలు కూడా చూశాను .  మీరు కూడా సినీమా తో పాటు తిరుగుతున్న భావన కలుగుతుంది . ఇక్కడ ఒక పెండ్యులం రెండవ అంతస్థు నుండి క్రిందకి వేళ్లాడుతూ ఆగకుండా అప్పటి  టైం చూపెడుతూ ఉంటుంది. ఎప్పటినుండో  ఉన్న ఈ  పెండ్యులం ని  , భావి  తరాల వారు ఎంతమంది దాన్ని చూడబోతున్నారో .  

ఈ తడవ కొత్త ఎక్జిబిట్ , ఫైటర్  పైలట్ .  మీరు ఫైటర్ ప్లేన్ లో  కూర్చుని గన్సు ఫైర్ చెయ్యాలి . దానికి ఒక పది నిమిషాలు ట్రైనింగ్ కూడా ఉంటుంది . ప్లేన్ ఉల్టాసీదా కూడా అవుతుంది .  నేను దానిలోకి వేళ్ళ లేదు కానీ , మా ఇంట్లో ఎడ్వెంచరర్స్ మా అమ్మాయి వాళ్ళమ్మా  వెళ్లారు. నేను మనవరాలిని తో బయట ఉన్నాను . 

మా మానవరాల్ని అక్కడి పిల్లల కోసం వేసిన మైదానంలో ఆడించి,  ఇంటినుండి తెచ్చుకున్న (గోంగూర ముద్ద  ) తిని  కాఫీ తాగి ఇంకా కొన్ని ఎక్సిబిట్స్ చూసి  , పిల్లలు ఆడుకునే ఆటవస్తువులు ఎల్లా రోబోలు తయారు చేస్తయ్యో చూసి ,  ప్రపంచంలో ,  ప్రకృతిలో  కనపడే వాటిల్లో గోల్డెన్ రెష్యు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుని అక్కడే ఉన్న అమెరికాలో మొదటి లాంగ్ డిస్టెన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసి  సాయంత్రానికి ఇంటికి చేరాము .   

మ్యూజియం గూగుల్ ఫోటో 


Saturday, November 16, 2024

210 ఓ బుల్లి కధ --- చారులతా మణి సింహేంద్రమధ్యమం

కర్నాటిక్  సంగీతంలో "సింహేంద్రమధ్యమం" ఒక రాగం . నాకెందుకో బాగా నచ్చిన రాగం . సంగీతంలో నచ్చటమంటే అదివింటూ తన్మయత్వం చెందుతూ భౌతిక బాధలు కొంతసేపు మర్చిపోవటం . ఇది చాలా చిన్న విషయంగా కనపడవచ్చు కానీ , పరుగులుతీసే మనస్సుని తాత్కాలికంగా ఆపగలగటం చిన్న విషయం కాదు . 

నాకు చిన్నప్పుడు ఒక విథంగా చెప్పాలంటే సంగీత జ్ఞానం అంటూ ఏమీ లేదు .  ఎదో పల్లెటూరిలో పెరిగాము కాబట్టి అమ్మతో పేరంటాలకు వెళ్ళటం దానిలో వారు పాడే పాటలు వినటం శనగల వాయనాలు తెచ్చుకుని ఇంట్లో గుగ్గెళ్ళు చేసుకుని తినటం తప్ప సంగీతానికి పెద్ద గుర్తింపు లేదు .  కాకపోతే సినిమా పాటలు పాడుకుంటూ గంతులు వేసే వాళ్ళం .  ఆ పాటలు ఆవిధంగా కూర్చటానికి పాడుకునేటట్టు చెయ్యటానికి వెనుక చాలా పెద్ద సైన్సు ఉన్నదని  తెలియదు .  

నేను హైస్కూల్ లో చదివేటప్పుడు మా ఇంటికి శ్రీనివాసన్ గారు వచ్చారు . ఆయన అప్పట్లో AIR విజయవాడలో పొద్దున పూట  వచ్చే భజగోవిందం ప్రోగ్రాంలో పాడేవారు .  ఆయన ఆ రాత్రి ఎవరింట్లో నో  పెళ్ళిలో పాట  కచ్చేరీ  ఇస్తున్నారు . ఇంటి అతిధి కదా ఆయనతోటి మా నాన్నగారూ నేనూ కచ్చేరీ కి  వెళ్ళాము .  మూడు గంటలు ఓపికగా కూర్చుని పాట కచ్చేరీ విన్నాను . అప్పుడు అనుకోలేదు కానీ అది నా జీవితాన్ని మార్చేసింది .  సంగీతమంటేనూ సంగీతంపాడే వాళ్ళంటేనూ  ఇష్టం ఏర్పడింది . 

 "స"  "రి" "గ" "మ" "ప" "ద" "ని" , అనే ఏడు అక్షరాలు వివిధ  permutation combinations లతో హ్రస్వాలూ దీర్ఘాలతో  వివిధ మేళకర్త రాగాలు గుర్తించి చెవుల కింపుగా మలచిన  మహాను భావులకు  చెయ్యెత్తి  నమస్కరించాలి .  వాటిల్లో  ఒక రాగం "సింహేంద్రమధ్యమం ". నాకెందుకో బాగా నచ్చింది . 

సంగీతంలో లోతుపాతులు తెలుసుకోవాలంటే ఒక జీవితం చాలదు . అదే జీవిత ధ్యేయంగా మలుచుకుని శ్రమించి సాధించిన వాళ్ళంటే నా కెందుకో చాలా ఇష్టం . వారిలో ఒకరు చారులతా మణి . "సింహేంద్రమధ్యమం " మీద వారు తయారు చేసిన వీడియోలు యూట్యూబ్ నుండి తీసి మీతో  పంచుకుంటున్నాను .  అవి తమిళం లో ఉన్నప్పటికీ సంగీత ఆస్వాదనకి అడ్డురావు . 



చారులత "సింహేంద్రమధ్యమం "


"సింహేంద్రమధ్యమం " సినిమా పాటలు