Monday, November 15, 2010

35 ఓ బుల్లి కథ 23 -- బెలూన్ ఫెస్టివల్ లో ఒకరోజు --

ముందు మాట: అక్టోబర్ మొదటి వారంలో అమెరికా లో అల్బుకర్క్(Albuquerque)  అనే ఊళ్ళో ప్రతీ సంవత్సరం వారం రోజులు బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. దానికి మేము వెళ్లటం జరిగింది. దానిని గురించే ఈ పోస్ట్.

ఇంట్లో పుట్టినరోజు పండగలకీ వాటికి బూరలూది కట్టడం తప్పితే బెలూనులంటే పెద్ద వ్యామోహం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ లో రోజూ సాయంత్రం వాతావరణ బెలూనులు ఎగరేసేవారు అంతకు తప్పితే వాటి ఉపయోగాలు కూడా ఎక్కువ తెలియవు. అప్పుడప్పుడూ హాట్ ఎయిర్ బెలూన్స్ లో ఎగిరే వారిని చూస్తూ, ఎందుకు వీళ్ళకి ఈ పిచ్చ అనుకునే వాణ్ని. కానీ నా అంతట నేను తెల్లవారుఝామున నాలుగున్నరకు చీకట్లో వణుకుతూ, కారు చీకటిలో బెలూనులు ఎగరేయ్యటం చూట్టానికి వెళ్తానని నేను ఎప్పుడూ కలలోనయినా అనుకోలేదు. ఏడుగంటలకి మొదలయ్యే పండగకి ముందరగా వెళ్ళకపోతే చాలాసేపు క్యు లో నుంచో వలసి వస్తుందిట. అప్పుడు ఎంత చలి అంటే గడ్డి మీద పరుచుకున్దామని తీసికెళ్ళిన దుప్పటిని, బట్టతల ఫ్రీజ్ అవుతుంటే ఆగలేక తలకి చుట్టుకున్నాను. పగలుపూట అచ్చు ఇండియా లో లాగా ఉంటుంది అంటే చికాగో నుండి చలికాగే బట్టలు తెచ్చుకోలేదు. కానీ రాత్రిపూట అలాస్కా లాగా ఉంటుందని ఎవరూ చెప్పలేదు.

అల్బుకర్క్ అమెరికా లో నివసించటానికి  ఒక మంచి ఊరని ఒక చోట Newsweek లో అనుకుంటా చదివాను. అది అమెరికాలో New Mexico అనే రాష్ట్రం లో ఉంది. Mexico కి దగ్గర అవటం మూలంగా  Mexico జీవన విధానము ఎక్కువగా కనపడుతుంది. ఎడారి ప్రదేశము అయినప్పటికీ చుట్టూతా ఎటుచూసినా కొండలు. కొండలపయిన దూది పింజల వంటి తెల్లటి  మేఘాలు. ఆ మేఘాలు కలుపుతూ అనంతమయిన నీలి ఆకాశం. వీటన్నిటి క్రిందా బుజ్జి బుజ్జి ఇళ్ళు, ఊళ్ళు. బంగారు కాంతులతో వీటన్నిటి మీదా తాపడం పెట్టి కనుల పండగ చేసే అస్తమించే సూర్యుడు చూడటానికి చాలా బాగుంటాడు. అసలు ఎయిర్ పోర్ట్ తోనే ప్రారంభము అవుతుంది మెచ్చుకోలు. కొండరాళ్ళ బ్రిక్స్ తో చేసిన ఫ్లోరింగ్ రంగు రంగులతో కళకళ లాడుతూ ఉంటుంది. ప్రపంచం లో ఇటువంటి ఎయిర్ పోర్ట్ నేను ఎక్కడా చూడలేదు . ఇక్కడ నేటివ్ అమెరికన్ ఇండియన్స్ ఉండటము మూలాన వాళ్ళ పద్ధతులు ఎక్కువగా కనపడుతూంటాయి. ఓల్డ్ సిటీ చావిళ్ళల్లో పూసల దండలనుండీ చేత్తో చేసిన అనేక ఆభరణాలు అమ్ముతారు. ప్రతీ షాప్ ముందరా ఎండు మెరపకాయల దండలు వెళ్ళాడేస్తారు. దుష్ట శక్తులు రాకుండా ఉండటానికి.

ఇంక బెలూన్స్ సంగతికి వస్తే, అసలు మాకు ఈ బెలూన్ల పిచ్చ రావటానికి కారణం, మొన్న మార్చి లో ఇక్కడకి వచ్చినప్పుడు, ఉబుసుపోక బెలూన్ మ్యుజియం కి వెళ్ళటం జరిగింది. అది ఒక చూడవలసిన ప్రదేశము ఇక్కడ. హాట్ ఎయిర్ బెలూన్స్ ఎల్లా తాయారు చేస్తారో, ఎంతమంది దానిలో ఎక్కి ప్రపంచం చుట్టి వద్దామని ప్రయత్నించారో, యుద్ధం లో వాటిని ఎల్లా ఉపయోగించేవాళ్ళో , ఇంగ్లాండ్ నుండి అమెరికాకి బెల్లూన్ షిప్ లో ఎలా వచ్చేవాళ్ళో అంతా తెలుసు కున్నాము. సిమ్యులేటర్ లో బెలూన్ నడపటానికి ప్రయత్నించాము కూడా. కాకపోతే అది గాలికి కొట్టుకు పోయి దిగవలసిన చోట దిగలేదు. అంతా ముగించుకుని వెళ్లబోతుంటే, అక్కడ పనిచేసే ఆయన, మేము బెలూన్ల గురించి చాలా అడగటం గమనించి, అక్టోబర్ లో బెలూన్ల పండగ ఉంది రమ్మన్నాడు. అక్కడ వచ్చింది గొడవ. ఏమయినా సరే అక్టోబర్ లో ఇక్కడికి రావాల్సిందే అని నిర్ధారణ అయిపొయింది. వయసు పెరిగినకొద్దీ మన పెద్దరికం నిలబెట్టుకోవాలంటే, అన్నిటికీ తలతిప్పుతూ ఉండాల్సిందే. అయినా మనదేమి పోయింది సుబ్బరంగా తీసుకువెళ్ళి తిప్పుతానంటే.

ఇక్కడ జరిగేది International Balloon Festival అంటారు. International వాళ్ళని చూడలేదు గానీ అమెరికాలో మిగతా చాలా  రాష్ట్రాలనుండి ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఎగరవేయ్యటానికి వచ్చిన వారిని చూశాను. ఒక్కొక్కళ్ళు తమ బెలూన్ సరంజామాతో పెద్ద పెద్ద వానుల్లో వచ్చారు. అక్కడ దాదాపు వంద షాపులు గుడారాల్లో ఉన్నాయి. చాలావరకు రకరకాల తినే వస్తువులు. మొదట తినటం ముఖ్యం కదా. నాకు ఫన్నేల్ కేక్ అంటే ఇష్టం. పిల్లలు క్యు లో నుంచుని తెచ్చి పెట్టారు. మీరు చూసే మొదటి ఫోటో మేము బెలూన్స్ ఎగరేసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు చిమ్మ చీకట్లో తీసిన ఫోటో. మొట్టమొదట బెలూన్ ని క్రింద పరుస్తారు. అది దాదాపు ముప్పై అడుగులు ఉంటుంది. దాని ముఖద్వారములో చాలా శక్తివంతమయిన ఫ్యాన్ పెట్టి గాలి గట్టిగా విసురుతారు. అది హోండా కంపెని తయారు చేసిన ఫ్యాన్. చూసి ఆశ్చర్య పోయాను. కొన్ని నిమిషాలకి బెలూన్ కొంచము పైకి లేస్తుంది. అప్పుడు propane గ్యాస్ కొద్దిగా వెలిగిస్తారు. బెలూన్ లో ఉన్న గాలి వేడెక్కి బెల్లూన్ లేచి నుంచుంటుంది. దానికింద ఒక పెద్ద బుట్ట ఉంటుంది. దానిలో propane గ్యాస్ వెలిగించటానికి కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. దానిలో నలుగురు ఎక్కవచ్చు. అందులో ఒకళ్ళు పైలట్,  propane గ్యాస్ తో బెలూన్ లో గాలిని వేడిచేస్తూ బెలూన్ ని కంట్రోల్ చేస్తాడు. ఇప్పటి దాకా బెలూన్ ఎగరకుండా పదిమంది పట్టుకుంటారు. బుట్టలోకి ప్రయాణీకులు ఎక్కంగానే, వాళ్ళు దాన్ని వదిలేస్తారు. బెలూన్ పైకి ఎగురుతుంది. అప్పటినుండి పైలట్ కంట్రోల్ లో ఉంటుంది. అల్లా ఒక్కొక్క వరుసలో పది బెలూన్స్, దాదాపు పది వరసల నుండి ఎగరటం మొదలెడు తాయి. నిమిషాల్లో ఆకాశం అంతా బెలూన్ల మయం. కొన్ని బెలూన్స్ మనకు తెలిసిన ఆకారాలుగ కూడా చేశారు. తొమ్మిది గంటలకి అంతా అయిపోయి ఇంటిముఖం పట్టాము. మళ్ళా సాయంత్రం చీకట్లో బెలూన్స్ లో propane మెరుపులు చూడటానికి, బాణసంచా చూడటానికి, వచ్చాము. కానీ కారు చీకట్లు కమ్మి, మేఘావ్రుతమయి ఇసుక తుఫాను రావటం తో చూడటము పడక త్వరగా ఇంటికి చేరుకున్నాము. నేను చెప్పినవన్నీ క్రింద ఫోటోలలో చూడచ్చు.

చివరిమాట: రెండవ ప్రపంచ యుద్ధానికి చరమ గీతం పాడిన యాటమిక్ బాంబ్ తయారు చేసిన ప్రదేశం, లాస్ ఎలామోస్, అల్బుకర్క్ కి దగ్గరే. లేకపోతే జపాన్, జర్మనీ ప్రపంచాన్ని పంచుకునేవాళ్ళు. అల్బుకర్క్ లో న్యుక్లియర్ మ్యుజియం కూడా
ఉన్నది. దగ్గరలో ఉంటే తప్పక వెళ్ళండి.





































































5 comments:

  1. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    ఫోటోలతో కూడిన వివరణ చాలా బాగుంది. ఫోటోలు చూస్తున్నప్పుడు కాసేపు నేనుకూడా ఆ ప్రదేశంలోనే వున్నట్లు అనుభూతి చెందాను. ఫొటోలు స్పష్టంగా వున్నాయి. అయితే, "widescreen" mode లో తీసివుంటే, ఇంకా బాగుండేది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  2. నా కళ్ళతో చూస్తూ వచ్చిన అనుభూతులను మాటల్లో పెట్టాలని ప్రయత్నం. Digital Photography for Dummies అనే పుస్తకాన్ని ఆరు ఏళ్ళ క్రిందట కొనుక్కున్నాను కానీ చదవటం పడలేదు. Wide screen mode అంటే ఏమిటో తెలుసుకోటానికి ప్రయత్నిస్తాను. నాదంతా automatic mode. comment కి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

    function button ని నొక్కినప్పుడు, picture format "L, M1, M2, M3, S, W " అని కనిపిస్తాయి. L for large; M1, M2, M3, means smaller size formats, S for small; and W for Wide screen format. If you select W, the picture format will be in RECTANGLE i.e. Left to Right will be wide; Up to Down will be less. This Widescreen will cover wide-area from left to right sides.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  4. నమస్కారములు రావు గారు
    న్యు మెక్సికొ రాస్ట్రం లోని మెక్సికో వారి జీవన విధానం గురించి అక్కడి ప్రకృతి ని గురించిన మీ వర్ణనలు అద్భుతం గా ఉన్నాయి.నీలి ఆకాశం కింద బుజి బుజ్జి ఇళ్ళు బంగారు కాంతులు పడి .అద్భుతమైన వర్ణన.ఎయిర్ పోర్టు గురించి బాగా చెప్పారు.బెలూన్ ఫెస్టివల్ ఫొటొలు ఎంతో బాగున్నాయి. నాకసలు తెలియదు.ఆ ఫెస్టివల్ ఒకటి ఉందని. మీ ఆర్టికల్స్ చదువు తుంటే తెలియని ఎన్నొ తెలుసుకో గలుగు తున్నందుకు చాలా ఆనందం గా ఉంది. మరిన్ని మీ కలం నుంచి జాలువారాలని కోరుతు.

    ReplyDelete
  5. @మాధవరావు గారూ త్వరలో మీ సలహాని ఉపయోగించటం జరగబోతోంది, నేను కొత్త దేశం లాంటి ఊరు కి వెళ్తున్నాను కెమెరా తో సహా. థాంక్స్.

    @రాజేశ్వరి గారూ మీ బహామా ట్రిప్ గురించి వ్రాయండి. వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete