Tuesday, December 18, 2012

88 ఓ బుల్లి కథ 76 --- మళ్ళా సంవత్సరం ముగుస్తోంది

ఈ సంవత్సరంలో ఎన్నో జరిగాయి. భూకంపాలు, సునామీలు, వరదలూ, యుద్ధాలూ, చంపుకోటాలు, కొట్టుకోటాలూ, కరువులూ, కాటకాలూ. వీటన్నిటిలోనూ అనుకోకుండా బాధల్లో పడి రోదించే వా రెందరో. తుఫానులో ఇళ్ళు కొట్టుకుపోయి, ఉన్న ఆస్తి అంతా నీళ్ళ పాలై బజార్లో పడ్డ వాళ్ళు మన ఎదురుకుండా ఉన్నారు. వారు ఏదో విధంగా వాటిని తట్టుకుని బతికి బయటపడాలి. మనమందరం పుట్టిన తరువాత ఏదోవిధంగా జీవించాలి కదా.

వారి తాత్కాలిక జీవిత కష్టకాలంలో మనమేమన్నా సహాయం చెయ్యగలమా?  ప్రపంచం లో అందరికీ మనం సహాయం చేద్దామన్నా చెయ్యలేము. చేసే స్థోమతా మనకి ఉండదు. కానీ మనందరం కలిసి చేస్తే, నార పోగులు కలిస్తే బలమైన చాంతాడుగ మారినట్లు మన శక్తి బలోపేతం అవుతుంది. అలా మన శక్తులని కలిపి ప్రజల నాదుకునే సంస్థలు, ప్రపంచములో ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోటానికి ముందుకి వచ్చే సంస్థలు చాలా ఉన్నాయి, సాల్వేషన్ ఆర్మీ, రెడ్ క్రాస్, డాక్టర్స్ వితౌ ట్ బోర్దేర్స్ మొదలయినవి.

అమెరికాలో ప్రతీ సంవత్సరం నవంబర్ డిశెంబరు లు చాలా హడావుడిగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు నెలలూ పండగరోజులు. ఇళ్ళ బయట అలంకరిస్తారు, షాపులన్నీ అలంకరిస్తారు. క్రిస్మస్ పాటలు మార్మోగుతూ ఉంటాయి. అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సంవత్సరంలో చాలా వ్యాపారం ఈ రెండు నెలలలోనే జరుగుతుంది. సంవత్సరానికి కావలసిన వస్తువులూ, దగ్గర వాళ్లకి ఇచ్చే బహుమతులూ, ఈ సమయంలోనే కొనుక్కుంటారు. ముఖ్యంగా అన్నదానాలూ ఆదుకోటాలు ఇప్పుడే జరిగేవి. సహాయ సంస్థలు వచ్చే సంవత్సరంలో జరగబోయే అవాంతరాలని ఆదుకోటానికి  కావలసిన ధన సామర్ధ్యం ఈ కాలంలోనే సంపాదించుకుంటాయి. మీ కిష్ట మైన సంస్థలకి మీకు చేతనయినంత సహాయము చెయ్యండి.

నాకు ఇష్టమయిన సంస్థ Kiva. వాళ్ళ వెబ్సైట్  kiva.org. వీళ్ళు ప్రపంచములో  ఏ దేశం వారికయినా "మీరు కొంచెం పెట్టుబడి పెట్టండి, పాలో పెరుగో, కూరగాయలో కొనుక్కుని అమ్ముకుని మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తాము" అనే వాళ్ళకి,  మనందరి నుండీ చిన్న చిన్న డొనేషన్లు తీసుకుని వాటిని కలిపి వారికి సహాయం చేస్తారు. "నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను"  అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?

ఇంతకీ చెప్పోచే దేమంటే మీకు ఇష్టమయిన వాటికి మీకు తోచిన సహాయం చెయ్యండి. మీరు అమెరికాలో ఉంటే ఈ పాటికి చాలా రిక్వెస్ట్ లు వచ్చి ఉంటాయి. ఉడతా భక్తిగా ఎవరో ఒకరికి ఎంతో కొంత సహాయం చేసి తోటి మానవుడుగా వాటిని ఆదుకోండి.


8 comments:

  1. నమస్కారములు .
    ఈ మధ్య ఎక్కువగా వ్రాస్తున్నట్టు లేరు బిజీ అనుకుంటాను.చాలా మంచి విషయాలు చెప్పారు.ఇప్పుడేకాదు ఎప్పుడు మావాళ్ళు కంప్యూటర్లు , బట్టలు , బొమ్మలు , [ టెడ్డి బేర్లు ] ఇలా చాలా చాలా శరణాలయం వాళ్ళకి ఇస్తూనె ఉంటారు. అసలు అది మంచి పద్ధతి.మనకి మనం ఎంత చేసుకున్నా మనవరకె ఉంటుంది.దానం చేసిందే మనకి మిగుల్తుంది.చాలా బాగుంది మంచి సలహా ఇచ్చి నందుకు ధన్య వాదములు ఇచ్చిన దానికి తిరిగి పుచ్చుకో కూడదు.వ్యాపార నిమిత్తం ఐతె పుచ్చు కో వచ్చును . అప్పుడు అది దానం కాదు

    ReplyDelete
  2. @రాజేశ్వరి గారూ కొందరు కష్టాల్లో ఉన్నా దానంగా ఇస్తే తీసుకోరు. వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ప్రగాఢ నమ్మకం ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొంచెం చేయూత నిస్తే బాధల లోనుండి బయట పడతారు. ఆ చేయూత ఇవ్వటం కూడా చాలా మంది చెయ్యరు. అటు వంటి వాళ్ళ కోసం పెట్టిందే KIVA.org.

    మన ఇంట్లో ఉన్న పాత సామానులు వగైరా GOODWILL కి ఇవ్వటం మామూలే. ఇచ్చిన పాత కంప్యూటర్లు మాత్రం రిసైకిల్ చేసి దక్షిణ అమెరికా దేశాల్లో స్కూళ్ళకి ఇస్తున్నారు. అది కూడా మెచ్చుకో దగ్గదే.

    అమాంతంగా ఒక్కొక్కప్పుడు ఏమీ చెయ్య బుద్ది పుట్టదు. అందుకనే ఎక్కువగా వ్రాయటల్లేదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. పనివత్తిడి వల్ల ఆలస్యంగా ( అంటే కొద్దిసేపటి క్రితమే ) టపాను చదివానండి.

    నిజమేనండి. కష్టాలలో ఉన్నవారికి చేతనయినంత సహాయము చేయటం అనేది మంచి విషయం. ఇలా చేయటం వల్ల సమాజం బాగుంటుంది.

    ReplyDelete
  4. @anrd గారూ మన చిన్ని పొట్ట గడుపుకుని జీవించటానికి ఎంత కావాలి? ఇప్పుడే చూశాను వార్త పేస్ బుక్ మొదలెట్టిన కుర్రాడు తన బిల్లియన్స్ దాదాపు అన్నీ దానం చేసేస్తున్నాడుట. సమాజం బాగుండాలంటే మీరు చెప్పినది అక్షరాలా నిజం. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు.
      మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలండి.

      Delete
    2. ధన్యవాదములు.
      మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలండి.

      Delete
  5. /"నేను కష్టపడి పనిచేస్తాను. నన్ను కొంచెము ముందుకు వెళ్ళేలా సహాయం చెయ్యండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను" అంటూంటే మనము ఇవ్వకుండా ఎలా ఉంటాము?/
    Harshad Mehta :D

    Happy Mayan Doomsday, Rao gaaru. :) ;)

    ReplyDelete
  6. @SNKR గారూ అయ్యో! మెహతా గారు అల్లా అన్నారని తెలియదు. అయినా కలికాలం ఏమిచేస్తాం. ఇంట్లో పెళ్ళామే చేస్తానన్నది చెయ్యదు!

    మాకు స్నో పడింది. Mayan Doomsday కొంచెం ప్రశ్నార్ధకం అయ్యింది. కానీ "ఫిస్కల్ క్లిఫ్" ట. అదేదో కూడా గట్టేక్కితే మాయా జాలం నుండి తప్పించు కుంటాము.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.


    ReplyDelete