Monday, May 5, 2014

100 ఓ బుల్లి కథ 88 --- దేవుడు మన కోర్కెలన్నీ ఎందుకు తీర్చాలి ?

సామాన్యంగా కోర్కెలు అందరికీ ఉంటాయి. సన్యాసులకి కోరికలుండ వంటారు నిజమెంతో అబద్దమేంతో తెలియదు. మానవ మాత్రులకి కోరికలు లేకుండా ఉండటం చాలా కష్టం. ఏ చిన్న కోరికయినా రేపు తీరవచ్చు అనే ఆశ తోటి మనం ఉత్సాహంగా జీవిస్తూ ఉంటాము. ఆ కోరికలు లేకపోతే ఆ ఆశా ఉండదు జీవితంలో ఆ ఉత్సాహమూ ఉండదు. ఆశ ఉత్సాహం లేని జీవితం వృధా.

కోర్కెలు తీర్చుకోవాలంటే దాదాపు ఇంకొకళ్ళ సహాయం తప్పక కావలసి వస్తుంది. ఉదాహరణకి నాకు రోజూ పోద్దునపూట మంచి కాఫీ తాగాలని కోరిక. దానికి మా ఆవిడ సహాయం తప్పకుండా కావాలి. ఏది మంచి కాఫీ అనే దాని నిర్వచనం మా ఇద్దరిదీ ఒకటి కాక పోవటం మూలంగా ఆ కోరిక రోజూ నెరవేరదు. ఇంకొకళ్ళు సహకరించక కోరికలు తీరకపోతే, ఆ కోరికలు చంపు కోవటమో లేక సూపర్ పవర్స్ ని ప్రార్ధించటమో చెయ్యాల్సి వస్తుంది. నేను అప్పుడప్పుడూ సూపర్ పవర్స్ ని ప్రార్ధిస్తాను.

సూపర్ పవర్స్ అంటే ఏమిటి? మనకు తెలిసినంతవరకూ ఏకారణం లేకుండా ఏదీ మన ఎదురుకుండా అమాంతంగా ప్రత్యక్ష మవదు. పనులు వాటంతట అవి జరగవు కాబట్టి, ఈ సృష్టి అనే క్రియకి ఒక కర్త ఉన్నాడని తెలుస్తోంది. ప్రత్యక్షంగా మన ఎదురుకుండా కనపడే సృష్టికి ఒక కర్త ఉన్నారని అనుకుంటే ఈ సృష్టి కంతా కారణం సృష్టికర్త ఒక రున్నారని చెప్పవచ్చు. ఆ సృష్టికర్తనే మనము దేవుడని అంటాము. ఆయనకున్నవే సూపర్ పవర్స్, జగతిని సృష్టించ గలిగే పవర్. మనకులేని ప్రజ్ఞ.

మనని సృష్టించిన వాళ్ళని మనం సుఖంగా ఉండటానికి కోరికలు కోరుకోవటంలో తప్పులేదు. అంతపెద్ద ప్రకృతినే సృష్టించిన వానికి మన చిన్నకోరికలు తీర్చటం పెద్ద కష్టం కాదని మన నమ్మకం. ముఖ్యంగా ఆ కోరికలన్నీదాదాపు మనకో మన కుటుంబానికో మంచి జరగాలని. అలాగే ఒక్కొక్కప్పుడు శత్రువులకి మంచి చెయ్యకూడదని కూడా కోరుకుంటాము. ముఖ్యంగా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ పూజలు చేస్తూ ఉంటే మనము అడిగింది తప్పకుండా చేస్తాడని మన నమ్మకం. అందరం ఆయన సృష్టే కాబట్టి అందరికీ కోరికలు ఉంటాయి కాబట్టి కోరిక కలగగానే వెంటనే ప్రార్ధించటం మంచిది. మన లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కోరికలు కోరుకునే వాళ్ళ లైనులో మనం ముందర ఉండటం బాగుంటుంది. ఫస్ట్  కం ఫస్ట్ సర్వుడ్. లేదంటే మీ కోరిక ఎందుకు ముందర తీర్చాలో విశదీకరించాలి .

మనని సృష్టించినంత మాత్రాన సృష్టికర్త (దేవుడు) మన కోర్కెలు తీర్చాలని ఎక్కడుంది? ఎంత ప్రార్ధించినా కీర్తించినా అడిగిన మన కోరికలన్నీ తీర్చబడవు. ఇది మనకి తెలుసు. మన కోరికల్లో ఏవి తీర్చ బడతాయి ఏవి తీర్చ బడవు అనేది మనము చెప్పలేము. అసలు మనము కోరికలు కోరాలా? అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. ఉదాహరణకి మన పిల్ల లున్నారు. వారి సృష్టికర్తలు మనమేకదా. వారి కోరికలు కొన్ని వారు కోరకుండానే తీరుస్తున్నాము, కొన్నికోరినా తీర్చటల్లేదు.

ఇంకో కోణం లో నుండి చూస్తే, మనని సృష్టించిన సృష్టికర్తకి కూడా కోరికలు ఉండచ్చు కదా, మనము తీర్చ గలుగుతున్నామా? వప్పుకుంటాను దేవుడికి ఏమి కోర్కెలు ఉన్నయ్యో మనకి తెలియదు. అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా మనకి తెలియదు. ఒకవేళ  సృష్టి కర్త ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆయన కోర్కెలు తీర్చ లేమేమో! ఎందుకంటే మనకు తెలిసిన మన సృష్టి కర్తలు మన తల్లి తండ్రులు కదా. వాళ్ళ కోర్కెలు అన్నీమనం తీర్చగలుగు తున్నామా? అయినప్పుడు దేవుడి కోర్కెలు మనమేమి తీర్చగలం!.

మనకు తెలిసిన మన సృష్టి కర్తల కోర్కెలే మనము తీర్చలేనప్పుడు మనకు తెలియని సృష్టికర్త మన కోర్కెలు ఎందుకు తీర్చాలి?

(ఈ పోస్ట్ కి మూల కారణం ఆలోచింప చేసే ప్రశ్నవేసిన ఈమని శ్రీనివాస్ గారు)

2 comments:

  1. anrd by e-mail
    12:43 AM (7 hours ago)

    to me

    సర్ ! ఇంత ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి. ఏం జరిగిందంటే, నేను మెయిల్స్ చూడటం చాలా తక్కువ. ఒక పాత పోస్ట్ చూడటం కోసం చాలా నెలల తరువాత నిన్ననే మెయిల్ చూసాను. అప్పుడు మీరు పంపిన పోస్ట్ కనిపించిందండి.

    ( ఈ మధ్యన మీరు కొత్త పోస్ట్ వ్రాయలేదేమిటో అనుకున్నాను. )
    పోస్ట్ బాగుందండి.

    * నిజమే, మీరు వ్రాసినట్లు ,మనని సృష్టించిన సృష్టికర్తకి కూడా కోరికలు ఉండచ్చు.

    అయితే, దైవం యొక్క కోరికలంటే.....
    లోకంలోని ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించాలని సృష్టికర్త కోరుకుంటారనిపిస్తోంది. అందరూ నిజాయితీగా జీవిస్తే దైవానికి ఇష్టం.

    * మనకు తెలిసిన మన సృష్టి కర్తల కోర్కెలే మనము తీర్చలేనప్పుడు మనకు తెలియని సృష్టికర్త మన కోర్కెలు ఎందుకు తీర్చాలి?

    దైవానికి స్వార్ధం ఏ కోశానా ఉండదు. దైవం అపారమైన దయామయులు కాబట్టి, వారు మన కోరికలను తీరుస్తున్నారని అనిపిస్తోందండి.

    ReplyDelete
  2. anrd గారూ ఆలోచింపచేసే మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete