Monday, October 6, 2014

106 ఓ బుల్లి కథ 94 -- ఇటలీ లో ఓ వారం - రోమ్

రోమ్ ఎయిర్పోర్ట్ లో దిగేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. మేము అమెరికా నుండి రిజర్వు చేసిన టాక్సీ లో మా మా అపార్ట్ మెంట్ కి బయల్దేరాము. ఇక్కడ కొద్దో గొప్పో ఇంగ్లీష్ మాట్లాడుతారు. మనమేం చెబుతున్నామో అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తారు. పారిస్ కన్నా బెటర్.

దోవంతా గలీజుగా ఉంది. చుట్టూతా ఉన్న బిల్డింగ్స్ మీద graffiti బాగా ఉంది. ఇంతలో కొన్ని శిధిలాలు కనబడ్డాయి. వాటి చుట్టూతా తిప్పాడు. ఇది coliseum అని చెప్పాడు. మేము రోమ్ లో చూడవలసిన వాటిలో అది ఒకటి. నాకు దాని మీద ఇంప్రెషన్ పోయింది.  డిల్లీ లో ఉన్న జంతర్ మంతర్ కి నాలుగు రెట్లు ఉంది. మనసులో దీనిని చూడవలసిన అవసరం లేదని నిర్ధారించు కున్నాను. ఇంతలో మా అపార్ట్ మెంట్ వచ్చింది. ఈ వీధి కూడా oneway. రెండు వేపులా పార్కింగ్. చాలా పాత బిల్డింగ్. గబగబా దిగి ఇంట్లోకి వెళ్ళాము. ఎత్తయిన సీలింగ్. ముగ్గురు మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు నుంచోవచ్చు. ఆశ్చర్య పోయాము రెండు పెద్ద పెద్ద బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ అల్ట్రా మోడరన్ కిచెన్, డ్రాయింగ్ రూం గోడల నిండా పెయింటింగ్స్ ఉన్నాయి.
Vatican City Model

స్నానాలు చేసి బ్రెడ్ వగైరా ఉంటే తినేసి కూర్చున్నాను.  దగ్గరలో షాపులూ, coliseum  ఉన్నాయి వెళ్దా మన్నారు. ఇక్కడ అంతా ఎత్తు పల్లాలు. అసలు మా ఇల్లు కొండ మీదికి ఎక్కే రోడ్ మధ్యలో ఉంది.  నేను రోడ్డు దిగగలను కానీ ఎక్కాలంటే ఆయాస పడాల్సి వస్తుంది. నేను రానన్నాను. పిల్లలు ఆవిడా వెళ్ళారు.

రాత్రి పది గంటలకి ఒక కప్పు mango  "జిలాటొ(Gelato)" తోటి తిరిగి వచ్చారు.  ఇటలీ లో "జిలాటొ" ప్రసిద్ది. ఇది చూడటానికి మిల్క్ షేక్ కి, ఐస్క్రీం కి మధ్యలో ఉంటుంది. రకరకాల ఫ్లేవర్లు. మా వాళ్ళు చేసిన పనులు క్లుప్తంగా చెప్పాలంటే  వాళ్ళు తాగారు, తిన్నారు, తిరిగారు, రాత్రిపూట లైట్లతో మెరిసిపోతున్న coliseum చూసి వచ్చారు. కాకపోతే నాకు  mango  "జిలాట" తీసుకురావటానికి చాలా కష్ట పడాల్సి వచ్చిందిట. ఒక పాతిక శాంపిల్ లు తింటే గానీ దాన్ని సెలెక్ట్ చెయ్యలేక పోయారుట. (ఇక్కడ ఫ్రీ శాంపిల్ లు ఇస్తారు. కొట్టు ఓనర్ ఇంక "జిలాటొ" శాంపిల్ లు ఇవ్వము అనే దాకా ఒక్కొక్కటే రుచి చూశారు.)
Museum

ఉదయం లేచాము. వర్షం బాగా పడుతోంది. ఆరవ అంతస్తు కిటికీ లోనుండి చూస్తున్నాను. గొడుగులమ్మేవాడు బజార్లో తడిసి వెళ్లే వాళ్ళ నందరినీ  కొనుక్కోమని అడుగుతున్నాడు. ఖరీదు ఎక్కువల్లేవుంది బేరాలు కుదరటల్లేదు. నాకు కొంచెం దిగులుగా ఉంది. మేము ఒకరోజే ఇక్కడ ఉండేది ఆ రోజు ప్లాన్ ప్రకారం ఇవాళ Vatican city చూడాలి. మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు మిగతావి చూడాలి. ఏమవుతుందో ఇవాళ అని విచారించి లాభంలేదు. నాకు ఎందుకో కాఫీ తాగుతూ కిటికీ లోనుండి వర్షం పడుతుంటే చూస్తూ ఉండటం ముచ్చటగా ఉంటుందని అనిపించింది. "కాఫీ" అని పెద్దగా అరిచాను. అంటే ఇది చాలా అర్జెంట్ విషయమని చెప్పటం. ఇక్కడ  కాఫీ మెషిన్ లేదు ఎలా చేస్తారో చేసుకోండి అని సమాధానం వచ్చింది. 

వర్షం బాగా వస్తోంది. దగ్గరలో రెస్టో రెంట్లు లేవు. నడిచి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్ద్ఫున్నే కాఫీ టిఫిన్ లేకపోతే కొంచెం కష్టం. మేము ఇంటువంటి పరిస్థితి వస్తుందని కొంచెం ప్రిపేర్ అయ్యాము. instant ఉప్మా తయారు చేసి జిప్ లాక్ బాగ్ లో తీసుకు వచ్చాము. ఉప్మా రవ్వ (soji), పచ్చి పోయేట్లు కొంచెం దోరగా వేయించి, విడిగా చేసిన తిరగమోత కలపటమే. వేరుశనగ, జీడిపప్పు కూడా తిరగామోతలో వేసి వెయించచ్చు. నేనయితే ఒక కప్పుకి క్వార్టర్ స్పూన్ ఉప్పు వేసి కలిపాను. ఒకటిన్నర కప్పుల నీళ్ళు మరగపెట్టి ఒక కప్ ఈ mixture వేసి మూతపెట్టి స్టవ్ మీద మీడియం లో ఉంచితే అయిదు నిమిషాలలో ఉప్మా రెడీ.
Espresso Coffee Maker  

కాఫీకి మాత్రం పెద్ద ప్రాబ్లం అయ్యింది. అలవాటయిన కాఫీ మెషీన్  లేదు. కాఫీ ఫిల్టర్ లాంటిది ఒకటి కనపడింది. వెల్, గూగులమ్మని పట్టుకున్నాము. దీనిని espresso maker  అంటారు. కింద నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే, నీళ్ళు మధ్య filter లో  వేసిన కాఫీ పొడి ద్వారా, కాఫీగా రూపాంతరం చెంది పై భాగం లోకి వస్తాయి.

ఉప్మా, కాఫీ చాలా బాగా వచ్చాయి. ఇంతలో వర్షం బాగా తగ్గిపోయి సూర్యభగవానుడు వచ్చాడు. ubar taxi ని పిలిచి Vatican కి బయల్దేరాము. టాక్సీ రోమ్ వీదులకుండా వెళ్తోంది. రోడ్లన్నీ దాదాపు రాళ్ళతో పరిచినవి. Roman Empire ప్రపంచ చరిత్రలో ఎక్కువకాలం పాలనలో నిలిచిన సామ్రాజ్యం. ఈ కాలంలో వాళ్ళు చాలా యుద్ధాలు చేశారు. గెలిచినప్పుడల్లా ఒక రోడ్డు వేయటమో, ఒక ఫౌంటెన్ కట్టించటమో, ఒక స్థూపం కట్టించటమో, ఒక భవనం కట్టించటమో  చేశారు. చాలా వరకు వీటిని కొండ రాళ్ళతో నిర్మించటం మూలంగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇటలీ వెళ్ళి చూసేది అవ్వే. ఆ కట్టడాలు, ఆ శిల్పాలు చూసి ముచ్చట పడక తప్పదు.

River God (Arno)
ప్రపంచంలో మొదటి మతాలు Polytheistic Religions. అంటే వీటిలో చాలా  దేవుళ్ళు ఉంటారు.  ఆ కాలంలో మన మనుగడకు అవసరమయి (గాలి, వర్షం నీరు, సూర్య కాంతి మొదలయినవి) మన కంట్రోల్ లో లేని వాటికి, కంట్రోల్ చేసే వాళ్ళు ఇంకొకళ్ళు ఉండవచ్చు అనుకుని, వాళ్ళను దేవుళ్ళుగా సృష్టించి ప్రార్ధించటం మొదలు పెట్టారు. అందుకనే   Polytheistic Religions లో అంతమంది దేవుళ్ళు ఉన్నారని నా ఉద్దేశం. తరువాత దేవుడు(సృష్టికర్త) ఒకడే, Monotheism, అనే  కాన్సెప్ట్ బయటికి వచ్చింది. యుద్ధాలు చంపుకోటాలు తరువాత ఎవరు గెలిస్తే వాళ్ళ కాన్సెప్ట్ రాజ్య మేలేది. ఒక యుద్ధంలో Constantine అనే Roman Emperor గెలవటం మూలంగా Monotheism గ ఉన్న Christianity కి Roman Empire లో ప్రోద్భలం వచ్చింది. అదే రాచరికపు మతమైంది. రోమ్ కి దగ్గరున్న Vatican అనే చోట మత పెద్దలతో కేంద్రీకరింప బడి ప్రపంచమంతా పాకింది. 1929 లో Vatican City  ఒక  దేశంగా గుర్తింపబడింది. దీని ముఖ్యాదిపతి Pope. దీని జనాభా 2013 లో 839. ఇక్కడ పనిచేసే దాదాపు 3000 మంది రోమ్ లో నివసిస్తారు.

Beautiful Paintings on the Dome
Vatican City లో చూడవలసినవి Vatican museums, Sistine Chapel, St. Peters Basilica. Vatican Museums లో చూసేవి beautiful sculptures, paintings. అన్నీ Christianity ఎల్లా evolve అయ్యింది దాని ప్రచారకులు వాళ్ళ కధలు. మీరు Sistine Chapel పేరు వినే ఉంటారు. Pope ని ఎన్నుకునే కమిటీ ఇక్కడే కలుసుకుని కొత్త Pope ని ఎన్నుకుంటుంది. ఇక్కడ చుట్టూతా బిబ్లికల్ కధల పెయింటింగ్స్, డోమ్ లోపల చక్కటి Michelangelo పెయింటింగ్స్ ఉన్నాయి, చాలా పవిత్రమైన చోటు. చాలా మంది కూర్చుని ప్రార్ధిస్తూ ఉంటారు. మేము అదే చేశాము. ఇక్కడ నుండి St. Peters Basilica కి వెళ్ళాము. ఇది ఒక పవిత్రమైన చర్చి. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కూడా కూర్చుని ప్రార్ధించవచ్చు. మేమూ అదే చేశాము. దేవుని ప్రార్ధించటానికి ఏ ప్రార్ధనా మందిరమయినా ఒకటే. అక్కడినుండి బయటకు వచ్చాము. విశాలమైన బహిరంగ సమావేశ స్థలము. పొప్ క్రిస్మస్ అప్పుడు ప్రజలని దీవించేది ఇచ్చటి నుంచే.

మేము తరువాత టాక్సీ ని పిలిచి రోమ్ లో Spanish steps దగ్గరకి వెళ్ళాము. దీనిని గురించి చాలా చెప్పాల్సినది ఉంది మళ్ళా రోమ్ వచ్చినప్పుడు చెప్తాను. ఆకలి దంచేస్తోంది దగ్గరలో ఉన్న మంచి రేస్టోరెంట్ కి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు ప్లేట్లోపెట్టే పోర్షన్ అమెరికా లో కంటే చాలా తక్కువ. పీజ్జా చాలా పల్చగా ఉంటుంది. ఒక్కళ్ళకి కూడా సరిపోదు. తర్వాత దగ్గరలో ఉన్న"జిలాటో" ప్లేస్ కి వెళ్ళాము.  మళ్ళా samples. ఎన్ని రుచి చూసినా నాకు నిరాశే మిగిలింది. mango జిలాటో లాంటిది అక్కడ లేదు.

రాత్రికి ఇంటికి జేరుకున్నాము. మర్నాడు ట్రైన్ లో ఫ్లారెన్సు కి ప్రయాణం.



8 comments:

  1. ఎంత ఓపిక గా ,ఎంత బాగా వివరిస్తూ వ్రాస్తున్నారండీ! చాలా చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. @nagarani yerra గారూ నా శ్రమ ఫలించినట్లే. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు

      Delete
  2. Madhavarao Pabbaraju
    7:58 AM (1 hour ago)
    శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
    విశేషాలతో టపా చాలా బాగుంది. మాకు చాలా ఖర్చు తగ్గిస్తున్నారు. ఎందుకంటే, ఆయా దేశాలు చూడకుండానే మీ ఫోటోస్ మరియు వివరాలతో అన్నీ చూసేస్తున్నాము.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
    Replies
    1. @మాధవరావు గారూ వీలయినంతవరకూ నాకు నచ్చినవి పంచుకుందామని. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  3. Vasanta Brahmandam
    10:28 PM (11 hours ago)
    రావు గారు ,
    నమస్తే !

    very nicely written ! you have a nice and natural flair for writing . I have read your Paris and Rome stories. you described them so well.
    thanks to you Bhargavi, for sharing.

    regards,
    Vasanta

    ReplyDelete
    Replies
    1. @ వసంత గారూ వారానికి ఒక పోస్ట్ వ్రాసే సరికి ముచ్చెమటలు పడుతున్నాయి. మీకు నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  4. మాకు తెలియని విషయాలను ఎన్నింటినో చక్కగా ఫోటోలతో సహా వివరంగా తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి.

    ReplyDelete
  5. @ anrd గారూ నేను చూసిన వాటిలోని అందాలని విశేషాలతో మాటలతో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete