వసంత కాలం వచ్చింది. వింటర్ లో స్నో కి చలికి తట్టుకోలేక వెచ్చదనం లోకి పారిపోయిన పక్షులన్నీ తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నాయి. అవి ప్రతిరోజూ తెల్లవారు ఝామున 4:30 కి కిచ కిచలతో నిద్దరలేపు తాయి. ఆ కిచ కిచలు కొందరికి మధుర గానం గా వినపడుతుంది కానీ మా ఇంట్లో కొందరికి దరిద్రపు రోదనలా వినపడుతుంది. ఏది ఏమయినా ఈ శబ్దాలు కిటికీలు వేసుకుని పడుకుంటే తప్ప తప్పవు . నా కయితే మాత్రం ఈ శబ్దాలు మేలుకొలుపుగా ఉంటాయి. నా చిన్నప్పుడు మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున లేచి పద్యాలూ పాటలూ పాడుతుండే వాడు. నాకు అటువంటి పరిస్థుతులు లేవు గనుక శబ్దం చెయ్యకుండా కదలకుండా పడుకుని మనస్సుకి ఏమన్నా మంచి ఆలోచనలు వస్తాయేమోననని ఎదురుచూస్తూ ఉంటాను, కాఫీ పెట్టేవాళ్ళు లేచేదాకా.
ఆరోజు పొద్దున్నే పేపర్ తీసుకుని వస్తుంటే బయట పోర్చ్ లైట్ వింతగా కనపడింది. ఏమిటా అని చూస్తే లాంప్ కి గోడకి మధ్యన పుల్లలు కనపడ్డాయి. ఇక్కడికి అవి ఎల్లా వచ్చాయా అని ఆశ్చర్య పోయాను. సరే చూద్దాంలే అని వదిలేశాను. కానీ రోజురోజుకీ అవి పెరగటం మొదలెట్టి గూడు ఆకారం వస్తోంది. ఇంట్లో పక్షులు గూడు పెట్టబోతున్నాయని గ్రహించి ఇంకా ఊరుకుంటే లాభంలేదని పుల్లలన్నీ తీసేశాము. ఈ పక్షులు ఇంటి ముందరా ఇంటి వెనకాలా చెట్లు ఉంటే వాటి మీద గూడు పెట్టుకోక ఇంట్లోనే గూడు పెట్టాలా!
ఇంతలో వారంరోజులు ఇల్లు విడిచి న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది ( మా ఆవిడ వెకేషన్ తనతోపాటు నేనూను). తిరిగొచ్చి చూసేసరికి లాంప్ వెనకాల పూర్తి గా గూడు తయారయ్యింది. దానిలో గుడ్లు పెట్టిందేమో, పడగొట్టటానికి మనసొప్పలేదు. దానికి తోడు రోజూ వర్షం. ఎంత పక్షులనైనా వర్షంలో క్రూరంగా ఎల్లా బయటికి నెట్టేస్తాం ? ఇంక పక్షుల రాక పోక లని జాగర్తగా గమనించటం మొదలెట్టాము.
రోజూ ఎప్పుడూ ఒక పక్షి చెట్టు కింద కూర్చుని చూస్తూ ఉంటుంది. పొద్దున్న వాకిలి తలుపు తీయగానే చెట్టుకింద ఉన్న పక్షి "గాయ్" మంటుంది. ఇంటి బయటికి రాంగానే "గాయ్ గాయ్" మంటుంది. ఇలా రోజూ తలుపు తీసినప్పుడల్లా జరుగుతుంటే ఏమిటా ఇది అనే ఆలోచన మొదలయింది. ఒక రోజు తెల్లవారు ఝామున పక్షుల కోడ్ ఒక మెరుపులా తట్టింది. మొదటి అరుపు "గాయ్" డేంజర్ అని చెప్పటం రెండో అరుపు "గాయ్ గాయ్" ఆల్ క్లియర్ అని. ఈ సమాచారం ఆ కాపలా కాసే పక్షి ఎవరికి చేరవేస్తోందో తెలియదు. అందుకని చాలా జాగర్తగా మసులుకున్నాము. మా రాకపోకలు తప్పుగా అర్ధం చేసుకున్నాయంటే మా మీద ఎన్ని పక్షులు దండెత్తేవో !
ఇలా రోజులు గడుస్తున్నాయి. ఏవో శబ్దాలు, కిచ కిఛలు వినపడుతుంటాయి. ఒకరోజు కిటికీ లోనుండి చూశాను, పిల్లలు అమ్మ చుట్టూ చేరాయి, అమ్మ ఆహారం పట్టుకొచ్చి పిల్లలకి పెడుతోంది. ఫోటోలు తియ్యాలని ఉంది కానీ ఆ మధురమైన తల్లీ పిల్లల మధ్య మాధుర్యాన్ని శబ్దం చేసి చెదరగొట్టటం ఇష్టం లేక పోయింది. తల్లీ పిల్లల మధ్య ప్రేమ ప్రకృతిలో అన్ని జీవులలోనూ ఒకటే. వారం పదిరోజులయ్యింది. పిల్లలు పెద్దవయినాయి. మీరు క్రింద ఫోటోని పెద్దది చేసుకుని చూస్తే బుజ్జి బుజ్జి పిల్లలు కనపడతాయి.
ఒకరోజు పొద్దున్న మా దివ్య మొక్కలకి నీళ్ళు పోస్తుంటే పక్షి పిల్లలు గబుక్కున రెక్కలు విదిలించుకుని ఎగిరిపోయాయి.
పక్షులు ఎగిరి పోయాక రెండు రోజులు ఆగి గూడులో ఏమన్నా పిల్లలు ఉన్నాయేమో నని కుర్చీ వేసుకుని ఎక్కి చూశాము. అంతా ఖాళీ. "యమ్టీ నెస్ట్" అంటే ఇదే నెమో. లాంప్ చుట్టూతా శుభ్రం చేశాము. చిత్రంగా ఉంటుంది, పక్షులు గూడుని పకడ్బందీగా ఎంత జాగర్తగా అల్లుతాయో. ఫోటో తీసి దాచి పెట్టుకున్నాము.
మా అదృష్ట మేమిటో , ఈ వసంతంలో ప్రకృతిలో జరిగే మృదు మధురమయిన మహత్తర ఘట్టం మా పోర్చ్ లో జరిగింది.
No comments:
Post a Comment