Tuesday, October 8, 2019

155 ఓ బుల్లి కథ -- రోజుకో దోసకాయ నాలుగు చిక్కుళ్ళ కధ


అప్పుడే తెల తెల వారు చుండెను. పక్షులు కిల కిలా రావములు చేయుచుండెను. బయట మలయ మారుతము వీచు చుండెను. నా మనస్సు ప్రశాంతముగ నుండెను. అప్పుడు సమయము చూడగా తెల్లవారు ఝాము నాలుగున్నర గంటలయ్యెను. నిశ్శబ్దముగా కాలకృత్యములు తీర్చుకొని మేడ మీది నుండి దిగి కాఫీ ప్రయత్నములు చేసితిని.

అవి ఆరు నెలల క్రిందటి రోజులు. త్వరలో వేసవి వచ్చునని ఆనందించిన రోజులు. వసంత కాలమూ వేసవి కాలము వచ్చి వెళ్ళిపోయెను. ప్రస్తుతము ఇది అక్టోబర్ నెల. పక్షుల కిలకిలా రావములు లేవు. మలయమారుతములూ లేవు. బయట ఉష్ణోగ్రత రోజురోజుకీ తగ్గిపోవుచుండెను. చెట్ల మీది ఆకుల రంగులు మారు చుండెను. ఇంకొక నెల రోజులలో ఆకులు అన్నియూ రాలి   నేలమీద పడి చెత్త బుట్టల లోకి వెళ్ళును. ఇక త్వరలో చలికాలము వచ్చునని వాటి సూచన. నాకు గ్రాంధిక భాష వచ్చుచుండెను. ఎంతవరకూ సాగునే చూచెదను.

ఉదయము ఆరు గంటలకు లేచుదమనుకుని ఏడున్నర గంటలకు లేచితిని. ఇంట్లో చలిగా ఉండెను. ఇంటిలోకి వేడి గాలి పంపే కొలిమిని (furnace ) ని మొదలెడుదామనుకుంటిని గానీ భార్యాగారికి అది చేసే శబ్దము నిద్రాభంగము కలుగునని భయపడి వణుకుచూ  కాఫీ ప్రయత్నములు చేసితిని. ఇంట్లో మొదట లేచి కాఫీ ప్రయత్నములు చేయునది నేనే. నాకూ ఇది సమ్మతమే. ఉదయమున కనీసము రెండు గంటలు ఎవరి ప్రకంపనలూ లేకుండగ   కాలము గడపవచ్చును.

వంటశాల (kitchen ) కిటికీ నుండి పెరటిలోకి చూసితిని. బిక్కు బిక్కు మంటూ ఎండి పోవు చున్న మా పెరటి తోట కనపడెను. దానికి ఈ సంవత్సరము సరి అయిన న్యాయము చెయ్యలేదని నా మనస్సులో బాధగా ఉండెను. పది మందికి కూరగాయలు పంచిన తోట ఈ సంవత్సరం కాసిని దోసకాయలు చిక్కుళ్ళతో సరిపెట్ట వలసి వచ్చినది కదా అని మనసులో బాధ వేసినది. పరిస్థుతుల ప్రభావం మార్చలేము కదా. వాతావరణం మనం చెప్పినట్లు వినదు కదా అని సరిపెట్టు కుంటిని గానీ మిత్రులు వారి పెరటి తోట నుండి వంకాయలు,టొమాటోలు, సొరకాయలు, కుకుంబర్, మిరపకాయలు తెచ్చి ఇస్తుంటే "పుండు మీద కారం చల్లినట్లో లేక దేనిమీదో ఆజ్యం పోసినట్లో" ఇంట్లో పరిస్థితి ఉండును. వాతావరణము అందరికీ ఒకటే కదా వారి తోట పెరుగుట ఏల మన తోట పెరగకపోవుట ఏల అనే ఇంటావిడ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఏదో నా బాధని వినేవారులేక, మీతో పంచుకుని కొంచెం ఉపశమనం పొందుదమని ఇక్కడ వ్రాయుచుంటిని. నా కెందుకో బాధల్లో వ్రాయుటకు గ్రాంధికము వచ్చును.

అమెరికాలో మేముండే ప్రాంతములో (చికాగో) బయట వాతావరణం వెచ్చ పడుట ఏప్రిల్ నుండీ ప్రారంభమగును. "మే" మొదటి వారములో పెరట్లో మొక్కలు వేయుదురు. అంతకు ముందు వేసిన మొక్కలు బతికి బట్టకట్టవు. ఈ సంవత్సరము కొంచెము బద్దకం, కొంచెం వాతావరణము అనుకూలించక పోవుట వలన  (ఎడతెగని వర్షాలు ) మా పెరట్లో మొక్కలు వెయ్యలేదు. పక్కింట్లో మొక్కలు పెరుగుతుంటే ఇంట్లో గొణుగుడు మొదలయింది. కానీ ఏమి చేయగలను? నేనూ మనిషినే. భర్త అయినంత మాత్రమున నా ఇష్టా ఇష్టములు మానగలనా?  నాకూ ఇష్టాయిష్టములు ఉన్నవి. నేను సూర్యుడు ఉన్న గానీ బయట పని చేయను. నేను చేద్దా మనుకున్నప్పుడు సూర్యుడు ఉండడు. ఈ సంవత్సరం దాదాపు వేసవి యంతయూ ఈ సమస్యతో  కాలము గడిచిపోయెను. మేము మొక్కలు వేయుచోట గడ్డి పెరుగుట మొదలిడెను.

నేను సరేలే ఈ సంవత్సరం పెరటి తోట మర్చి పోదాము అనుకున్నాను. కానీ మా పక్కింటి చిట్టెమ్మ "టామీ" కి మా పెరట్లో మొక్కలు వెయ్యక పోవటం నచ్చలేదు ఆ ప్రదేశంలో గడ్డిపెరగటం అసలు నచ్చలేదు. తాను సహాయం చేస్తానని ఎప్పుడో మా ఇంటావిడకి చెప్పెందిట, ఆవిడ లేనప్పుడు వచ్చి మొక్కలు వేసేచోట కూచుని గడ్డి పీకటం మొదలెట్టింది. నాకు స్వతహాగా ఆడవారు కష్ట పడటం చూడలేని హృదయం గనుక వెంటనే వెళ్ళి నువ్వు కష్టపడద్దమ్మా నాగలి తీసుకు వచ్చి దున్నుతాను నువ్వు నాకు సహాయం చెయ్యి చాలు అనిచెప్పాను. నేను గారేజ్ లోనుండి electrical cultivator (tiller ) తీసుకువచ్చి దున్నితిని. తాను ఎలక్ట్రికల్ వైర్ సంగతి చూసుకుంది. తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళం వెళ్లి పోవుట జరిగెను.

మళ్ళా వర్షాలు మొదలయ్యాయి. వర్షములో మొక్కలు వెయ్యలేము కదా. నేను మొక్కలు వేద్దా మనుకున్నప్పుడు సూర్యుడు రావటల్లేదు. సూర్యుడు ఉన్నప్పుడు నాకు తీరిక దొరకటల్లేదు. తీరిక దొరకటానికి మీరేమి వెలగ పెడుతున్నారని మా ఆవిడ అంటుంది గానీ అది నిజం కాదు. ప్రతీ మనిషికీ ఏదో చెయ్యాలనే తపన ఉంటుంది. ఆ తపన తోటి రోజులు గడిచిపోతుంటాయి. అది సాధించాడా అనేది ముఖ్యం కాదు. ఆ కారణము వలన మొక్కలు పెట్టలేదు.

ఇంతలోకే మా బావమరిది, వాళ్ళ అమ్మాయి పార్వతి తో మా యింటికి వస్తున్నారని తెలిసింది. ఈ సంవత్సరం మా పెరటితోట వారితో ఎందుకు ప్రారంభించ కూడదు అనే బ్రహ్మాండమయిన ఆలోచన నాకు వచ్చెను. వాళ్ళు ఒక్కరోజే ఉండుదురు గనుక వారు వచ్చిన వెంటనే తోట ప్రారంభోత్సవం గురించి చెప్పితిని. బయట సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుచుండెను. వారు వెంటనే అంగీకరించి పనిముట్లు తీసుకుని సిద్ధమయితిరి.

మా దగ్గర ఉన్న దోసకాయ గింజలూ చిక్కుడు కాయ గింజలూ తోటలో వేసితిరి. మా ఆవిడ "నేను పని "ఎగ్గొట్టి" వాళ్ళ చేత చేయించానని అంటుంది గానీ అది నిజము కాదు. వాళ్ళకి హస్త వాసి ఉందని నేను గ్రహించి గింజలు నాటించితిని. అందుకనే ఒక వారము రోజుల్లో మొక్కలు బయటకి వచ్చెను.

ఆలాస్యంగా మొక్కలు వెయ్యటం మూలంగా మాకు పంట ఆగస్టు లో గానీ చేతికందలేదు.మొదటి ఫోటో లో ఉన్న దోసకాయ నాలుగు చిక్కుళ్ళతో మొదలుపెట్టి  దాదాపు  దోసకాయతో రోజూ ఏదో చేసుకుని తింటూనే ఉన్నాము (దోసకాయ పప్పు, కూర, పులుసు,  పచ్చడి). ఇంటి చిక్కుడు కాయ, వంకాయ తో కలిపి కూర చేస్తే చాలా బాగుంటుంది. అల్లాగే చిక్కుడు బంగాళాదుంప కూర కూడా బ్రహ్మాండం.

చివరి ఫోటో లో మాకిచ్చిన మా పక్కింటి టామీ పెరటి తోటలో పండించిన మిరపకాయలు. ఆవిడ వాటిని ఓవెన్లో ఎండబెట్టి బ్లెండర్ తో క్రష్ చేసి సంవత్సరానికి పనికొచ్చేలా దాచిపెట్టుకుంటుంది. అమెరికన్లు మన వంటని "స్పైసీ" అని సన్నాయి నొక్కులు నొక్కుతారు గానీ వాళ్ళు crushed red pepper పిజ్జా మీద వేసుకుని రోజుతూ తింటారు.

రమణా, పార్వతీ, పక్కింటి "టామీ" మీరు కల్పించుకోపోతే ఈ సంవత్సరం మా పెరటి తోట ఉండేది కాదు. తోటలో దోసకాయలకీ చిక్కుళ్ళకీ మీకు థాంక్స్ చెప్పాలి.

PS : మధ్య ఫొటోలో  "ఇదిగో ఫోటో తీసుకో" అని ఒక కాగితం పెట్టుంది గమనించారో లేదో. మీరేమీ అనుకోకండి. ఆరోజు నేను మా ఆవిడ మాట్లాడు కోటల్లేదు. "పుస్తకం హస్త భూషణం " లాగా   "మౌనం భర్త భూషణం" అని నేను కొన్ని రోజులు భార్యతో మాట్లాడను.

4 comments:

 1. మౌనం భర్త భూషణం - Nice one mestaaru.

  ReplyDelete
  Replies
  1. పవన్ గారూ అంతే కదండీ మరి. మాట్లాడకుండా ఊరుకుంటే "నోరుమూసుకుని పనిచేస్తున్నానని" అర్ధం తీసుకుని మనమీద కొత్త బాణాలు పడవు. థాంక్స్ ఫర్ ది కమీంట్.

   Delete
 2. శ్రీ లక్కరాజుగారికి నమస్కారములు. మీ దోసతీగ కథాసారంబు బహుబాగుగా సాగింది. భార్యామణి గారిపై విరుపులు కూడా ఇంపుగా వున్నాయి.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
  Replies
  1. మాధవరావు గారూ మీకు కధ నచ్చినందుకు సంతోషము. తన గురించి ఏమీ వ్రాయలేదని మా ఆవిడ చాలా బాధపడినది. నేనూ బాధపడ్డాను. నిజంగా ఆవిడే రోజూ పాదులకి నీళ్ళుపోసి వాటి బాగోగులు చూసేది. ఇంటి పెద్ద ఆవిడే కాబట్టి అవన్నీ ఆవిడ బాధ్యతలే అని అన్నాను. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినందుకు థాంక్స్ చెప్పవలసిన అవుసరము లేదు కదా !మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

   Delete