పరమేశం, భార్యా మా పక్కింట్లో ఉంటారు. రిటైర్ అయినవాళ్ళం కాబట్టి సామాన్యంగా రోజూ మా భార్యలు ఉద్యోగాలకి వెళ్లిన తరువాత కలుసుకుంటూ ఉంటాము. భర్త రిటైర్ అయిన తర్వాత భార్యలు వర్క్ కి వెళ్ళి ఏవో నాలుగు రాళ్ళు తెస్తూ ఉంటారు. అదే మాకు తీరిక సమయం. ఎదో పిచ్చాపాటీ, భార్యల గురించీ మాట్లాడుకుంటూ ఉంటాము.
ఇవ్వాళ ఎందుకో పరమేశం నిర్లిప్తంగా ఉన్నాడు. "టేస్టర్స్ ఛాయిస్" కాఫీ చేసి ఇచ్చాను. ఎందుకు అల్లా ఉన్నాడో నేను అడగ తలుచుకోలేదు. చెప్పాలనుకుంటే తనే చెపుతాడు లేకపోతే లేదు. కొన్ని రోజులు అలా నిశబ్దంగా గడిపిన రోజులున్నాయి. కాఫీ తాగుతూ నెమ్మదిగా చెప్పటం మొదలెట్టాడు. మనం అడగాల్సిన పని లేదు. లోపలి మనస్తాపం ఎప్పుడో అప్పుడు బయటికి వస్తుంది. ఇటువంటి సమయంలో మనం ప్రశ్నలు వేయాల్సిన అవుసరం లేదు. అన్నీ నెమ్మదిగా బయటికి వస్తాయి. మనస్తాపం తగ్గుతుంది.
"మాది తెనాలి దగ్గర ఒకపల్లెటూరు, కఠెవరం. దాదాపు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏదోరూపేణా రోజు కొకసారి తెనాలి వెళ్ళి వస్తూ ఉంటారు. పిల్లలు అయిదవ క్లాసు దాకా అక్కడే చదువు కోవచ్చు గానీ ఆ తరువాత చదువులకి తెనాలి వెళ్లాల్సిందే. పెద్దలయితే ఇంటి అవసరాలకి, వెచ్చాలకి, సినీమాలకి తప్పకుండా తెనాలి వెళ్ళాలి. మా ఊళ్ళో సుబ్బయ్య కోమటి కొట్టు ఉంది. పిల్లలకి అదంటే చాలా ఇష్టం. "కానీ" పెట్టి ఏదోఒకటి కొనుక్కోవచ్చు. పిల్లలం సాయంత్రం ఆటలు (బిళ్ళంగోడు గోళీలు బచ్చాలు) ఆడుకుంటున్నప్పుడు శనగలూ శనక్కాయలూ బఠాణీలు చాకోలెట్లూ, అక్కడే కొనుక్కునే వాళ్ళం. నాకయితే మాత్రం సుబ్బయ్యకొట్లో పప్పు చెక్కలు చాలా ఇష్టం. అప్పుడప్పుడూ పెద్దవాళ్ళు పేకాడుతుంటే పిల్లలం మేము వెళ్ళి సుబ్బయ్య కొట్లో బీడీలు, గోల్డ్ ఫ్లెక్ సిగరెట్లు కొనుక్కొచ్చే వాళ్ళం. సుబ్బయ్య, కొట్లో అమ్మకానికి వస్తువులన్నీ తెనాలి వెళ్ళి కొనుక్కొస్తాడుట. నేను మా నాన్నతో తెనాలి వెళ్ళి క్రాఫ్ చేయించుకునే వాడిని. అక్కడున్న వాళ్లందరికీ రోజూ తెనాలిలో ఎదో పనివుంటుంది. చాలా మంది సాయంత్రం షికారుకి తెనాలి వెళ్ళి కాఫీ తాగొస్తారు.
దీపావళికి మందు సామానులు కొనుక్కోవాలంటే తెనాలే వెళ్ళేది. నిజంగా చెప్పాలంటే దాదాపు ప్రతీ పండగకి తెనాలి వెళ్ళే వాళ్ళం. శ్రీరామ నవమికి ఊరంతా పందిళ్లు వేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వడపప్పు పానకం పెట్టేవాళ్ళు. సినీమా చూడాలంటే తెనాలి వెళ్లాల్సిందే. నేను "స్వర్గసీమ" సినీమా తెనాలి రత్నా టాకీస్ లో చూశాను. తెనాలి మధ్యలో రెండు కాల్వలు వెళ్తాయి. వాటి మీద రెండుచోట్ల వంతెనలున్నాయి. ఒక వంతెన మీద వెళ్తే కూరగాయల మార్కెట్ వస్తుంది. రెండవ వంతెన మీద వెళ్తే, వంతెన దిగంగానే రోడ్డుకి ఎదురుగుండా ఒక పార్క్ వస్తుంది. ఆ పార్కుకు కుడి వైపు వెళ్తే మా మామయ్యగారి ఇల్లు వస్తుంది. ఎడమవైపు వెళ్తే రాముడన్నయ్య శివుడన్నయ్యా వాళ్ళ ఇల్లు వస్తుంది. ముందర రాముడన్నయ్య గారి ఇంటికి వెళ్లి మామయ్యా గారింటికి చూడటానికి తర్వాత వెళ్ళే వాళ్ళం. మామయ్యగారింటి లోపలికి వెళ్ళా లంటే స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. బయటే ఉండి పిల్లలతో తొక్కుడు బిళ్ళా, దొంగాట ఆడుకుని కఠెవరం తిరిగి వచ్చేవాళ్ళం.
తెనాలి వెళ్ళినప్పుడల్లా బస్టాండ్ లో మంత్రజాలం చూస్తున్న గుంపులోనుండి తొంగి చూడటం అలవాటు. మామిడి కాయ టెంక పాతిపెట్టి నాలుగు సార్లు ముసుగు వేసి తీసే సరికి దాని నుండి మామిడి చెట్టు మామిడికాయ మామిడి పండు --- మాంత్రికుడు ఎల్లా తెప్పిస్తాడో నా కిప్పటికీ అర్ధం కాదు. అది నిజం కాదనుకోటానికి వీల్లేదు, మామిడి పండుకొసి ముక్కలు కూడా పెడతాడు.
నా ఐదో క్లాసు తరువాత మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఊళ్ళు మారాము. అందుకని నా చదువు చాలా ఊళ్ళల్లో సాగింది. కానీ సంవత్సరంలో చాలా సార్లు పెళ్ళిళ్ళకీ పబ్బాలకీ తెనాలి, కఠెవరం వచ్చేవాళ్ళం. నేను చివరికి యూనివర్సిటీ లో చదువు కుని అమెరికా రావటం జరిగింది. మాతృ దేశం వచ్చినప్పుడల్లా తెనాలి కఠెవరం తప్పకుండా వెళ్ళే వాళ్ళం.
దేశం వదిలి దాదాపు ఏభైయేళ్ళయ్యింది. ఇప్పుడు కఠెవరం లో మా వాళ్ళెవరూ లేరు. కాకపోతే పెద్దలు కట్టించిన గుడి ఉంది. ఈ మధ్య మా వదినగారి (శివుడన్నయ్య భార్య) ఆధ్వర్యంతో మనవలూ మనవరాండ్రు అందరూ కలిసి గుడిని బాగు చేయించి మళ్ళా కుంభాభిషేకం చేశారు. తెనాలిలో మామయ్యగారు పోయి చాలా యేళ్ళ య్యింది. రాముడన్నయ్య శివుడన్నయ్య కాలం చేశారు. పిల్లలందరూ దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. మొన్నటిదాకా మా వదినగారు తెనాలి లో ఉండేది. ఆవిడా ఈ మధ్య పోయింది. దాంతో తెనాలితో ఉన్న చివరి బంధం విడి పోయింది".
అంటూ ఆగి పోయాడు పరమేశం.
నాకు ఏమి మాట్లాడాలో తెలియటల్లేదు. "మనకి ఇష్టమయిన వాళ్ళతో ఎప్పుడూ గడపాలని అనిపిస్తుంది. మనం మాట్లాడిన పరుషపు మాటలు వెనక్కు తీసుకోవాలని పిస్తుంది. కానీ పరమేశం, దేముడి చదరంగపు ఎత్తుల్లో మనం పావులం. రాజులూ రాణులూ మంత్రులూ బంట్లూ ఏనుగులూ గుర్రాలతో సహా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆటలోనుండి బయటికి రావాల్సిందే. వాటిని గురించి విచారించి మనసు పాడు చేసు కోవటం అనవసరం" అన్నాను.
No comments:
Post a Comment