"అక్కడికి వెళ్ళవోకు పిన్నమ్మా దోమలు కుట్టి గొడవ చేస్తాయి" అంటే "నెల్లూరి దోమలు కుట్టినా చమ్మగా ఉంటుంది" అనే సమాధానం చెప్పే మా పిన్నమ్మకి నేనేమి చెప్తాను. పుట్టి పెరిగిన ఊరంటే అంతప్రేమ.
" NCC డ్రెస్ వేసుకుని కాలేజీకి వెళ్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది మా పిన్నమ్మ. NCC లో ఆ కాలంలో ఆడపిల్లల్ని చేర్చుకుంటారని నాకు తెలియదు. నాకు తెలియని సంగతులు ఎన్నో వున్నాయి పిన్నమ్మలో.
"బాధ పడకే చిన్నమ్మా రోజులన్నీ ఒకలాగే ఉండవు కోలుకుంటావు" రెండు సార్లు కేన్సర్ బారిన పడి తిప్పికొట్టి విజయం సాధించిన పిన్నమ్మ మాటలు మణిపూసలు, ఎవరికైనా ధైర్యం ఇస్తాయి .
నీకోసం మీ అబ్బాయి నువ్వు మెట్లు ఎక్కలేవని కింద గది ఉన్న ఇల్లు కొన్నాడు. ఆ గదిని రీమోడల్ చేసి స్నానాదులకి కూడా పక్కనే ఏర్పాటు చేశాడు. ఇంక నువ్వు ఎప్పుడూ రావని ఎంత బాధ పడిపోతున్నాడో. అయినా నువ్వెప్పుడూ మనసులో ఉంటావుగా .
"ఎందుకమ్మా అల్లా అర్ధాంతరంగంగా వెళ్ళిపోయావు. మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేశావు. నువ్వు త్వరలో వస్తావనుకున్నాను. నీకోసం నీ సుఖం కోసం ఇల్లు కొని నిన్ను నా దగ్గర పెట్టుకుందామని అనుకున్నాను. ఎందుకమ్మా అల్లా వెళ్ళిపోయావు. ఆస్పత్రిలో ఉంటే కనీసం చూడటానికి కూడా రాలేకపోయానే. ఈ ఇల్లూ వాకిలీ డబ్బులూ దస్కాలూ చదువులూ సంస్కారాలూ , ఈ COVID ముందు ఎందుకూ పనికిరావని తేలిపోయింది. "
"అయినా ఎందుకమ్మా ప్రజల జీవితాలు కాపాడిల్సిన పెద్దలు ఇలా చేశారు. ప్రతీ వంద ఏళ్ళకీ ఇటువంటి పాడు అంటువ్యాధి (Pandemic) వస్తుందని తెలుసు కదా. అది వచ్చిందంటే మూడు సార్లు పీడించి పెద్దల్ని, మధ్య వయస్సు వాళ్ళనీ, పిల్లల్ని వరసగా పొట్ట బెట్టు కుంటుందని తెలుసుకదా ! ఎందుకు ముందు జాగర్త పడలేదు ? "ప్రకృతి" సైన్సు టెక్నాలజీలకి అందదేమో ! , ఎప్పుడూ కొత్త పొంతలు తొక్కుతూ వింతల తోటి వచ్చే దానిని అర్ధం చేసుకోవటం చాలా కష్టం "
"ఏమిటో అమ్మా అన్నీ ఉన్నా, నీ చివరి దశలో నిన్ను చూడలేక పోయానే అని ఏమిటో బాధగా ఉంది. ప్రకృతి ముందు మనం ఎంత చిన్న వాళ్ళమో ఇప్పుడు తెలుస్తోంది . అది వక్రిస్తే మనం చేసేది చాలా తక్కువ."
చేసుకుందామనుకున్న కార్యానికి చివరలో అనుకోకుండా పూజారి గారు రాలేకపోతే , చివరి క్షణంలో కుదిరిన ఇంకొక పూజారితో అంత్య కార్యక్రమం సక్రమంగా జరుపుకున్న కృష్ణకి వందనాలు. ఎప్పుడైనా సహాయానికి మేమందరం ఉన్నాము మరచిపోకు క్రిష్ణా .
అమెరికాలో మా పక్క ఊరులో ఉన్న మా కృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి పదమూడవ రోజు ఏకరుద్రాభిషేకం లో పాల్గొని, ఆ తర్వాత "Zoom" ద్వారా చిన్నలూ పెద్దలూ పిన్నమ్మను గుర్తు చేసుకున్న మాటలతో రూపొందించిన రూపకం ఇది. విశాలాక్ష్మి పిన్నమ్మ గారూ మీ రెప్పుడూ మా మనస్సుల్లొ మెదులుతూనేఉంటారు. ఉంటాము మరి. నమస్కారాలు.
No comments:
Post a Comment