మనకీ కంప్యూటరికీ ఉండే జ్ఞానేంద్రియాలు దాదాపు సమానమే. వినటం, మాట్లాడటం,చూడటం, స్పర్శ. ఒక్క వాసన చూడటం తప్ప అన్నీ ఉన్నాయి. అది కూడా ఎప్పుడో వస్తుంది. కంప్యుటర్లో అవి ఎల్లా పనిచేస్తాయి అంటే మనం చెప్పగలం. Operating system (OS). DOS, Windows 10, UNIX, LINUX. సులభంగా చెప్పాలంటే ఈ OS (మొదట్లో దీన్ని సూపర్వైజర్ అనే వాళ్ళు) కంప్యూటర్ తన జ్ఞానేంద్రియాల నుండి వచ్చిన సంకేతాల్ని గ్రహించి, తాను ఏమిచేయాలో నిర్ణయించుకుని క్రమం తప్పకుండా ఆజ్ఞలు జారీ చేస్తుంది. కంప్యూటర్ OS ను సృష్టించిన వాళ్ళు మన లాంటి వాళ్ళే, మానవులు. కానీ OS పనిచేయాలంటే ఏమి కావాలి ? విద్యుత్. అది లేకపోతే OS పనిచేయదు కంప్యూటర్ పనిచేయదు. విద్యుత్ అంటే ఏమిటో చెప్పగలమా ? అది ఏమిచేస్తుందో చెప్పగలం (దీపాలు వెలిగించటం వగైరా) కానీ అది ఏమిటో చెప్పటం చాలా కష్టం.
అదే మన జ్ఞానేంద్రియాలు ఎల్లా పనిచేస్తాయని మనం ప్రశ్నించుకుంటే, మన మెదడు ద్వారా అని సంకొచెం లేకుండా చెబుతాము. మనలోని ఈ మెదడు అనే కంప్యూటర్ ని సృష్టించిన వాళ్ళు ఎవరు ? దానిలో పనిచేసే OS ని సృష్టించిన వాళ్ళెవరు ? ఖచ్చితంగా మనం మాత్రం కాదు. మన గర్భంలో అది తయారు అవటానికి సహాయం చేస్తాం కానీ మనకి మెదడు ఎల్లా చెయ్యాలో తెలియదు. దానిలో ఉండే OS ఎల్లా ఉంటుందో తెలియదు. అసలు ఈ మెదడు అవయవాలూ పనిచెయ్యటానికి ఏమి కావాలి. చైతన్య శక్తి "ప్రాణం". ఆ "ప్రాణం" గురించి అది ఏమిటో చెప్పగలమా? పోనీ ఆ "ప్రాణం" ఎక్కడ నుండి వచ్చిందో ఎవరిచ్చారో చెప్పగలమా?
ఇటువంటి ప్రశ్న ఒక రోజు శిష్యుడు "విచార చైతన్య" గురువుగారిని అడుగుతాడు. మన శరీరంలో జ్ఞానేంద్రియాల చేత ఎవరు పని చేయిస్తున్నారని. దీనికి గురువుగారి సమాధానం, సామవేదము లోని 35 శ్లోకాల కేనోపనిషత్ లో ఉంది.
మొదటి మంత్రం:
కేనేషితం పతతి ప్రేషితం మనః : ఏ చైతన్యం వల్ల ఈ మనస్సు పనిచేస్తోంది
కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తాః (క్త ) : ఏ చైతన్యం వల్ల ఈ ప్రాణం పనిచేస్తోంది
కేనిశితం వచమిమాం వదన్తి : ఏ చైతన్యం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాము
చ క్షు (హు ) శ్రోత్రం క ఉ దేవో యునక్తి : ఏ చైతన్యం వల్ల ఈ కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి
దేనివల్ల (ఎవరి ప్రేరణ మూలాన) మనలోని మనసు, ప్రాణం, పంచేంద్రియాలూ పనిచేస్తున్నాయి ?. అని శిష్యుని ప్రశ్న.
జీవాత్మ అనే శక్తి వీటన్నిటి చేతా పనిచేయిస్తుందని గురువుగారి సమాధానం.
ఏవన్నా పనిచేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని మనం గుర్తించ గలమా ? గుర్తించ వచ్చు. దానిని వర్ణించ గలమా? లేదు. మాటల్లో చెప్ప గలమా ? మనకు తెలిసిన మాటల్తో చెప్పాలేము. కొత్త మాటలు నేర్చుకుని వర్ణించ గలమా? లేదు. మన ఊహకి అందే, మనం మాటల్లో వర్ణించ గలిగే పరిస్థితి లేదు.
ఆ శక్తి గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే మన చేత మాట్లాడించేది ఆ శక్తే కదా. దానినివర్ణించే మాటలు మనదగ్గర లేవు అది మనకి ఇవ్వ లేదు. దానిని మనం చూడలేము ఎందుకంటే అది అతీతము మనలోఉంటుంది కానీ మనకి కనపడదు. అదే మనలోని ఆత్మ. తనలో ఉన్న ఆ చైతన్య శక్తి ఉనికిని ఎవరికి వారే గుర్తించాలి. దానిని గుర్తించాలంటే ఏకోన్ముఖంగా చూసే ప్రజ్ఞ కావాలి. వంద ఆలోచనలతో ఎప్పుడూ మునిగితేలే మనస్సుతో ఉండే మనం ఏకాగ్రతతో ఒక దానిమీద ఆలోచించటం కష్టం కానీ చెయ్యొచ్చు. ఏకాగ్రతతో తపస్సు (meditation ) చేసి దాని సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు (బుద్ధుడు, ఆది శంకర ). మనం అది ఉన్నదని గ్రహిస్తే చాలు.
నామాట:
మనకు తెలిసిన శక్తులు విద్యుత్, అగ్ని లని రోజూ వాడుతాము. వాటిని ఎల్లా వర్ణిస్తాము. మనకు తెలిసిన భాషతో అవి ఏమి చేయగలవో చెప్పగలం కానీ వాటిని వర్ణించటానికి మాటలు లేవు.
అల్లాగే మనలోని "ఆత్మ " వర్ణనకు అతీతం. మనం చూడలేము కాబట్టి మనకి అది లేదని అనుకోటం తప్పు. దానివల్లనే మనం జీవిస్తున్నాము.
రోజూ రాత్రి చంద్రుడిని చూస్తాము. "చల్లని రాజా" అంటూ పాటలు కూడా వ్రాస్తాము. అసలు చంద్రుడికి వెలుగు నిచ్చే శక్తి లేదు. సూర్యుడి నుండి వస్తుంది. మనము చంద్రుడిని చూస్తున్నప్పుడు సూర్యుడిని చూడము కదా అందుకని చంద్రుడిది సూర్య శక్తి కాదంటామా?
అల్లాగే గాలిని మనము చూడలేము. గాలి మూలాన ఆకులు కదులుతూంటేనూ, కాగితాలు ఎగురుతూంటేనూ మనం గాలి వచ్చిందని గ్రహిస్తాము. అందుకని "గాలి" లేదు అనలేము కదా?
మీరు రాత్రి గాఢ నిద్ర పోయారు. పోదున్నే రాత్రి బాగా పడుకున్నారా అంటే మీరేమి చెబుతారు. గాఢంగా నిద్ర పోయారని చెబుతారు. అది ఎల్లా తెలిసింది మీకు ?. గాఢ నిద్రలో అవయవాలు పని చెయ్యవే ! అదే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మీ ఆత్మ చెబుతోంది.
మనలో ఒక "ఆత్మ" అనే శక్తి ఉందనీ అదే మనం చూడలేకపోయినా , మనని అన్నివేళలా కనిపెట్టుకుని పని చేయిస్తోందనే నమ్మకం కలిగితే మనకి కోటి ఏనుగుల బలమొస్తుంది. మన బొందిని నడిపే వాడున్నప్పుడు దానిలో చక్కగా కూర్చుని నిశ్చింతగా ప్రయాణించటమే మన కర్తవ్యం.
నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda and Lectures of Swami Sarvapriyananda.
No comments:
Post a Comment