Monday, June 28, 2021

168 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -3 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతుని కిచ్చిన మూడవ కోరిక తీర్చటానికి రెండొవ భాగంలో యముడు నచికేతునికి మన అందరిలో ఉండే ఆత్మ గురించి చెబుతాడు. ఆత్మ అందరి  హృదయాలలోనూ నాడీ సముదాయం మధ్య ఆసీనమై ఉంటుంది కానీ, అది ఎవరికీ కంటికి కనపడదు , దానికి ఆకారం లేదు.  దానికి క్షీణత్వం లేదు. దేహానికి ప్రాణ మిచ్చేది అదే తీసుకుపోయేది అదే. అన్ని ప్రాణులలో ఉన్నదీ అదే. అది నశించదు , అది ఉన్న దేహం క్షీణించి నశించిపోతే ఇంకొక దేహం వెతుక్కుని దానిలో ప్రవేశిస్తుంది. 

మన  మనసు (mind ) జ్ఞానేంద్రియాల ద్వారా  బయట వస్తువులని గుర్తిస్తుంది. ఈ మనసువెనుక తెలివి తేటలు (intellect ) ఉన్నాయి. ఆతెలివితేటల తరువాత ఉన్నది ఆత్మ(Self ). దాని తర్వాత అవ్యక్తం (avyaktham ). దాని తర్వాత పురుష (Purusha ). దానితర్వాత ఏమీలేదు.

పుస్తకాలు తిరగ వెయ్యటం మూలానో, వేదాలు చదవటం మూలానో , తెలివితేటల మూలానో ఆత్మ జ్ఞానం (realization ) కలుగదు. బ్రహ్మ మనకి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనటానికి జ్ఞానేంద్రియాలు పెట్టాడు కానీ మనలో ఉన్న ఆత్మని  చూసుకోటానికి ఏమీ పెట్టలేదు.

ఈ ఆత్మకి పేరుకూడా పెట్టలేము. అతీతుడు (infinite ), ఆకారము లేనివాడు, మనకు తెలిసిన మాటలకి అందని వానికి ఏ పేరు పెడతాము ! అందుకనే ఋషులు "ఓం" అని సంభోదించారు. 

యోగా (Yoga ) తో ఆత్మను కనుగొన వచ్చు అంటారుగానీ అది కుదరదు. ఎందుకంటే యోగ అంటే జ్ఞానేంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవటం. ఇది తాత్కాలికం. వస్తూ పోతూ ఉంటుంది.

మనలో ఉన్న ఆత్మే మన తెలివితేటల్ని, మన జ్ఞానేంద్రియాలనీ పని చేయించేది. కానీ "మాయ" ఆత్మని గుర్తించకుండా చేస్తుంది. ఆత్మని గుర్తించ కలిగేది "నిర్వికల్ప సమాధి" తోనే.

ఎవరైతే కోరికలకు (Vishaya kara Vrittis ) అతీతుడో , మనసునీ జ్ఞానేంద్రియాలనీ అదుపులో ఉంచుకుంటాడో , సద్గుణుడో, తమలోని ఆత్మను అనుభూతి (feeling ) (Brahmakara Vritti ) ద్వారా గుర్తించ గలుగుతారో వారికి బాధలూ భయాలూ మరణము ఉండవు. బాధలూ భయాలూ మరణాలూ ఉండేది అశాశ్వితమయిన శరీరానికి గానీ శాశ్వితమైన ఆత్మకు కాదు. 

ఆత్మ  ఉనికిని కనుగొనుటకు ధ్యాన మార్గం (Meditation ) ఒక్కటే దారి. నువ్వు ఆత్మ కోసం వెదుకుతున్నావని నీ మనసుకుచేప్పు, మనసు చేత నీ తెలివికి(Intellect ) చెప్పి దానిచేత ఆత్మని వెతికించు. ఆత్మని కనుగొనవచ్చు. మొదట్లో బొటనవేలంత జ్యోతిని మనసులో సృష్టించుకొని దానిమీద ఓంకార జపం(Meditate ) చెయ్యి. ఆత్మ సంధానం పొందవచ్చు. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో సాధించ వచ్చు.


ఫల శృతి:

నచికేతుడు యముని ఉపదేశం ననుసరించి కామక్రోధాదులను, మరణమును జయించి బ్రహ్మైక్యము పొందెను. 

ఎవరైతే నచికేతుడు, యముని కధ విందురో వారికి ఆత్మజ్ఞానం కలుగును.

ఎవరైతే వారి పూర్వికుల శ్రార్ధ కర్మలప్పుడు భక్తితో ఈ కధ చదువుతారో వారి పూర్వికులు మోక్ష్మము  పొందుదురు.

ఓం:  మనమెప్పుడూ ద్వేషించు కోకుండా, పోట్లాడుకోకుండా చేసి మనందరినీ ఆ పరమాత్మ రక్షించి ముక్తి ప్రసాదించు గాక. 


నా మాట:

ఈ ఉపనిషత్ లో చివర ఫల శృతి ఉంది. ఆ రోజుల్లో కూడా అసూయలూ వైషమ్యాలూ పోట్లాడుకోటాలూ ఉన్నాయన్నమాట. (మనలోమన మాట ఇద్దరు ఋషులు  పోట్లాడుకుని రెండు యజుర్వేదాలువ్రాశారు. మన ఈ ఉపనిషత్ కృష్ణ యజుర్వేదంలో నుండి తీసుకొనబడినది.)

ఆత్మ మన శరీరానికి ప్రాణంపోసి అన్ని అవయవాల చేత పని చేయిస్తుంది. కంప్యూటర్ భాషలో మాట్లాడితే కంప్యూటర్ పనిచేయటానికి ప్రాణం పొసే విద్యుత్ కిందకి వస్తుంది. 

( త్యాగయ్య గారు 250 ఏళ్ళ క్రిందట మననుండి హృదయాన్ని కదిలించే ధ్వని ఎల్లా వస్తుందో చెప్పారు. మనం  "ఓం " శబ్ద వ్యక్తీకరణకి వాటిని ఉపయోగించుకోవచ్చు.

1. ప్రాణానల సంయోగము వల్ల   ప్రణవనాద సప్త స్వరములు.

2. నాభీ హృద్ కంఠ రసనా నాసాదుల  

3. నిద్దుర నిరాకరించి  వేకువజామున లేచి 

4. శోభిల్లు సప్తస్వర 

ధ్వని పుట్టించాలంటే వాయువు అవసరం. తెల్లవారు ఝామున లేచి నిశ్చలత్వముతో, ఆ వాయువుని నాభి లో పుట్టించి హృదయం మీదకుండా కంఠమును తాకుతూ కదిలిస్తూ నాసికా ముఖ ద్వారాలనుండి బయటికి తెచ్చి సప్తస్వరాలను పలికించు.

మన "ఓం" శబ్ద సృష్టికి తద్వారా  మనలోని "ఆత్మ " ని కనుగొనటానికి (realization )  త్యాగయ్యగారి మాటలు ఎంతోఉపయోగపడతాయి.

త్యాగయ్య గారి గురించి పై చెప్పిన మాటలన్నీ ఈ క్రింది విజయ శివ గారి వీడియొ నుండి సేకరించినవి.

Margam - Tyagaraja

Monday, June 21, 2021

167 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -2 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతా నీ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని, ఆ ప్రశ్నకి బదులు నీకు భోగభాగ్యాలూ, వజ్ర వైఢూర్యాలూ, అప్సరసలూ ఇస్తానన్నాను. అవి అన్నీ అశాశ్విత ఉల్లాస వస్తువులు (Pleasurables ) అని వాటిని తిరస్కరించావు. నేర్చుకోవాలనే జిజ్ఞాస నీలో ఉంది అందుకే క్లిష్టమైన నీ ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబట్టావు. నచికేతా నువ్వు నాకు నచ్చావు నీలో మంచి విద్యార్థి లక్షణాలు ఉన్నాయి. గురువుకి మంచి విద్యార్థి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పి నచికేతుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఉపక్రమించాడు యమ ధర్మరాజు.

మన జీవిత రధానికి (Chariot ) పంచేంద్రియాలనబడే  అయిదు గుర్రాలతో సవారీ కట్టాము అనుకుంటే, వాటిని విభిన్న కోరికలతో తోలుతుంటే మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్తాయో  చెప్పలేము. అదే ఒకే కోరికతో  మనస్సుని కేంద్రీకరించి సవారీని నడిపితే మనము అనుకున్న చోటుకు (Our Goal ) అవి చేరుస్తాయి. ప్రలోభాలకు ఆకర్షణలకీ లొంగకుండా మనం సాధించ వలసిన పని మీద మనస్సుని కేంద్రీకృతం చేస్తే ఆ పని సాధ్యమవుతుంది.

మానవులకు జీవిత పయనంలో ఎదురుకుండా కనపడేవి రెండే రెండు మార్గాలు. మొదటిది మంచి మార్గం (Sreyas  ) రెండొవది ఉల్లాస  (Preyas  ) మార్గం. ఏ మార్గములో వెళ్ళాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇది దేవుడు నీ కిచ్చిన వరం. 

నేను అంటే ఈ దేహమే అనుకుని, ఈ దేహం కృంగి కృశించి క్షీణించి పోయి మాయమయ్యేదాకా  పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ ఉల్లాసంగా తిరగవచ్చు. ఈమార్గం పాటిస్తే వివిధ దేహాలతో పునర్జన్మించి మరల మరల నా (యముని) కట్టడికి చేరాల్సి వస్తుంది. 

పంచేంద్రియాల ఆకర్షణలకి లోబడకుండా రెండవ మార్గంలో వెళ్ళి తన దేహంలోని అంతరాత్మ తో మమేకమయితే జన్మ రాహిత్యంతో మోక్షం సంపాదించ వచ్చు.

ఈ మనలోని ఆత్మ ఎవరిలోనో ఒకచోట మాత్రమే జన్మించటం జరగలేదు. అందరిలోనూ ఉంది. దానికి ఆకారం లేదు దానికి చనిపోవటం కూడా లేదు. అది చూడటానికి కనపడదు. కానీ అది ఉందని కనుక్కో వచ్చు (realization ). ప్రతి వారిలోనూ గుండె చుట్టూతా నూటొక్క నరాలు ఉంటాయి. అందులో ఒక నాడి కపాలానికి వెళ్తుంది. దాని పేరు సుషుమ్న(Sushumna ) నాడి. వాటితో ఈ ఆత్మ గుండె లోతుల్లో ఆసీనమై ఉంది. ఎవరైతే  వారి పంచేంద్రియాలనూ అధికమించి కోరికలను జయించి వారి లోని ఆత్మను కనుగొంటారో వారికి బాధలూ భయాలూ లేకుండా జన్మ రాహిత్యం కలుగుతుంది.

ఆత్మ చూసేది కాదు, అది కనపడదు, చెప్పేది కాదు, మాటలతో చెప్పలేము, తెలివితో వెతకలేము, అది మన తెలివికి అందదు. ఎవరికీ వారు ఆస్వాదించి అనుభవించాల్సిందే. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో (సహాయంతో) సాధించ వచ్చు.


ఈ పోస్ట్ ఇంతటితో ముగిస్తాను. చెప్పిన వన్నీ నెమరువేసుకుని జీర్ణించుకుని , ఆత్మ గురించి అంతా చెప్పానో లేదో ఆత్మ పరిశీలన చేసుకుని తర్వాతి పోస్ట్ తో వస్తాను. ఇంతలో మీరుకూడా ఆత్మను గురించి ఆలోచించండి.


నా మాట:

వేల ఏళ్ళక్రిందట నరములు (Nerves System ) గురించి ఆలోచించి దాని ఉనికిని చెప్పటం !, అప్పటి ఋషుల ఆలోచనా ప్రతిభకి వందనాలు. వాళ్ళ ధ్యేయం ఒకటే మానవులు సుఖంగా  బాధలూ భయాలూ లేకుండా జీవించటానికి మార్గాలు వెదకటం. వారందరూ ఆశ్రమాలు స్థాపించి  పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు. జీవనాధారం యాచన. పతంజలి యోగ శాస్త్రము, ధన్వంతరి ఆయుర్వేదం, శు ష్రుత సంహిత (Medicine and surgery )  మొదలగునవి వీటికి ఉదాహరణలు.

ఋషులు వారి వారి మేధా శక్తులతో కొన్ని మంచి పద్దతులను కనుగొన్నారు. మనందరికీ అర్ధం చేసుకునే తెలివితేటలు ఒకేవిధంగా ఉండవు కనుక, ఆ మంచి పద్దతులను, అందరికీ ఉపయోగ పడేలా దైనందిన జీవన శైలిలో ఆచారాలుగా మార్చారని నా నమ్మకం. 

ఇంద్రుడు , యముడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని దేవుడు మొదలగు నవి దేవలోకంలో ఆయా శాఖల అధిపతులపేర్లు(Titles ). వారు సంపాయించిన పుణ్యం బట్టి వారు సీట్లు మారుతూ ఉంటారు. వారి కన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తే సీటు ఇవ్వాల్సిందే. ఉదాహరణకి యమధర్మరాజు తనకు ఆ  ఉద్యోగం రావటానికి కారణం తాను చేసిన యజ్ఞమని నచికేతునితో ఒకానొక సమయంలో చెబుతాడు.


ఈ నా పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda,  and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.

Monday, June 14, 2021

166 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -1 (Kathopanishad)

కఠో పనిషత్ వ్రాసి కొన్ని వేల సంవత్సరాలయింది. అందుకని దీనిలోని ఘటనలన్నీ  సంవత్సరాల క్రిందటి సాంఘిక పరిస్థుతులలో జరిగిన సంఘటనలుగా గుర్తించాలి. 

అప్పుడు ఉన్న నమ్మకాలలో, మానవులు మరణానంతరం వారివారి పాప పుణ్యాల ఫలితంగా నరకంలోనో స్వర్గంలోనో కొంతకాలం గడిపి మరల భూమి మీద పునర్జర్మి స్తారని నమ్మకం ఒకటి. యజ్ఞ యాగాదులు దాన ధర్మాలూ  చేస్తే పుణ్య మోస్తుందనీ చంపటాలూ దోపిడీలు చేస్తే పాపం వస్తుందనీ నమ్మకాలు. స్వర్గంలో ఎక్కువ రోజులు గడపటానికి ఆ కాలంలో దేవుళ్ళకి యజ్ఞాలు చేసి పుణ్యం సంపాయించటానికి ప్రయత్నించే వాళ్ళు. పాప భయంతో దోపిడీలుగట్రా ఎక్కువగా ఉండేవి కాదు. ఎంత పుణ్యం కూర్చుకుంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చు. హిందూ మతంలోనే కాదు దాదాపు అన్ని మతాల్లోనూ ఈ స్వర్గ (Heaven ) ప్రస్తావన ఉంది. 

పదకొండేళ్ళ "నచికేతుడు"  తండ్రిచేస్తున్న "విశ్వజిత్ " యజ్ఞం ఆసక్తితో గమనిస్తున్నాడు. యజ్ఞంలో చివరికి దానాల దగ్గరకివచ్చేసరికి నచికేతుడికి తండ్రి చేస్తున్న పని నచ్చలేదు. పుణ్యం రావాలంటే ఈ యజ్ఞంలో తనకున్న వస్తువులన్నీ దానం చేసెయ్యాలి. మంచి ఆవుల్ని తాను ఉంచుకుని, పనికిరాని వట్టిబోయిన ముసలి ఆవుల్ని తన తండ్రి ఎందుకు దానంగా ఇస్తున్నాడో అర్ధం కాలేదు. ఇలా చేస్తే యజ్ఞ కర్త  కి కావలసిన ఫలితం రాకపోవచ్చు. తండ్రికి యజ్ఞ ఫలితం తప్పకుండా రావాలి. తాను కూడా తండ్రికి కావాల్సిన వస్తువేగా తనని దానం చెయ్యమని వెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రి సమా ధానంచెప్పలేదు అయినా ఆగకుండా మరల మరల "నాన్నా నన్ను ఎవరికి దానం చేస్తావు ?  అని తండ్రిని ప్రశ్నిస్తాడు. తండ్రి చివరికి విసిగి కోపం మీదున్నాడో ఏమో  "యముడికి (God of death )" అని సమాధానం ఇస్తాడు.

తన తండ్రికి ఎల్లాగయినా యజ్ఞ ఫలితం రావాలి అని తానే ముందరగా యముడిని చూడటానికి వెళ్తాడు. సింహద్వారం దగ్గర భటులు ప్రస్తుతం "యముడు" బయటకి వెళ్ళారు అని చెబితే, వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని సింహద్వారం దగ్గరే నచికేతుడు కాచుకు కూర్చుంటాడు. "యముడు"  తిరిగివచ్చే సరికీ,  నచికేతుడు తిండీ తిప్పలూ లేకుండా మూడు రోజులు మూడు రాత్రులు గడపాల్సొస్తుంది.

ఏమీ తీసుకోకుండా మూడు రోజులు గడిపిన నచికేతుడి సంగతి తెలిసి, అప్పుడే తిరిగివచ్చిన యముడు చాలా బాధపడతాడు. తాను ఇంటిలో లేక పోవటాన నచికేతుడికి తగిన మర్యాదలు చేయలేకపోయానని చెప్పి ఆతిధ్య లోపం ఉన్న ఆ మూడు రోజులకీ మూడు వరాలు ఇస్తాను కోరుకోమంటాడు.

తాను తిరిగి వెళ్ళినప్పుడు తన తండ్రి కి తన మీద కోపం ఉండకుండా చూడమని మొదటి వరంగా  కోరుకుంటాడు నచికేతుడు. యముడు వెంటనే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అంటాడు.

మనుషుల్ని స్వర్గానికి చేర్చే యజ్ఞాల గురించి రెండవ వరంగా చెప్పమంటాడు. దానికి యముడు ఆ రహస్యాలన్నీ చెప్పటమే కాకుండా అవి నచికేతుడి యజ్ఞాలుగా వాడుకలో ప్రసిద్ధి చెందుతాయని చెబుతాడు. దానికితోడు "మంచిబాలుడు" నచికేతుడికి  అందమయిన కంఠహారంగూడా కానుకగా ఇస్తాడు. 

మూడవ కోరికకి వచ్చే సరికి నచికేతుడు "ప్రభూ మనుషులు తనువు చాలించిన తరువాత కొందరు ఆ మనిషి  చనిపోయాడంటారు కొందరు చనిపోలేదంటారు " దీనిలో ఏది నిజమో వివరించి చెప్పమంటాడు.

యముడు (Lord of Death ) చాలా ఇరకాటంలో పడతాడు. తన ఈ రహస్యాలు (Job Secrets) ఎవ్వరికీ చెప్పకూడదు ఇంకేమన్నా అడుగు వజ్రవైఢూర్యాలూ రాజభోగాలూ అప్సరసలూ స్వర్గ సౌకర్యాలూ ఏమైనా అడుగు ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు దేనికీ వప్పుకోడు తాను అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబడతాడు.

నచికేతుడి ఈ కోరిక నుండి తప్పించలేక యముడు దానికి సమాధానం ఇస్తాడు. ఈ  ఉపనిషత్ లో ఎక్కువ భాగం నచికేతుడి సంశయానికి యముడి వివరణే.  తర్వాతి పోస్టులో దీనిని గురించి వివరంగా వ్రాస్తాను.


నా మాట:

దీని back drop వేల ఏళ్ళ క్రిందట గుళ్ళు గోపురాలు లేని రోజుల్లో ఉన్న ఆచారాలు. స్వర్గానికి పోవాలని ప్రతీవాడికీ కోరిక.  

వేల ఏళ్ళ  క్రిందట కూడా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించటం ఆచారంగా ఉండేది. పొరపాటున ఏమన్నా పొరపాటు జరిగితే క్షమించ మనటం కూడా ఆచారమే. ఇప్పటికీ ఇళ్ళల్లో ఈ  ఆచారం ఉంది. ఆచారాల్ని ఎవరూ పనిగట్టుకుని చెప్పరు. ఇవన్నీ వారివారి ఇళ్ళల్లో వాడుకని బట్టి గ్రహించేవే.  

హిందువులు ఆచరించే అన్ని ఆచారాలలోనూ (యజ్ఞాలూ, యాగాలూ, నోములూ,  పండగలూ  వగైరా) చివరిలో దాన ప్రక్రియ ఉంటుంది (తనకున్న వాటిని పంచుతారు). ఒక విధంగా ఇది Distribution of Wealth (ఉన్న వాళ్ళు లేనివాళ్ళకి పంచటం)  క్రిందికి వస్తుంది. ఇటువంటి దాతృత్వాన్ని సంఘంలో ఒక మంచి ఆచారంగా మార్చారు.

నచికేతుడి యమలోక యాత్రని మీరు  realistic గ చూడలేకపోతే అది ఒక పెద్ద నచికేతుడి కల అనుకోండి.  యమలోకంలో యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణలు చాలా realistic గ ఉంటాయి. ఇక్కడే నాకు సంస్కృతం నేర్చుకుంటే ఎంత బాగుండేదో అనిపించేది.

నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda,  and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.

Monday, June 7, 2021

165 ఓ బుల్లి కథ -- కేనోపనిషత్ (Kenopanishat)

మనకీ  కంప్యూటరికీ ఉండే జ్ఞానేంద్రియాలు దాదాపు సమానమే. వినటం, మాట్లాడటం,చూడటం, స్పర్శ. ఒక్క వాసన చూడటం తప్ప అన్నీ ఉన్నాయి. అది కూడా ఎప్పుడో వస్తుంది. కంప్యుటర్లో అవి ఎల్లా పనిచేస్తాయి అంటే మనం చెప్పగలం. Operating system (OS). DOS, Windows 10, UNIX, LINUX. సులభంగా చెప్పాలంటే ఈ OS (మొదట్లో దీన్ని సూపర్వైజర్ అనే వాళ్ళు) కంప్యూటర్ తన జ్ఞానేంద్రియాల నుండి వచ్చిన సంకేతాల్ని గ్రహించి, తాను ఏమిచేయాలో నిర్ణయించుకుని క్రమం తప్పకుండా ఆజ్ఞలు జారీ చేస్తుంది. కంప్యూటర్ OS ను సృష్టించిన వాళ్ళు మన లాంటి వాళ్ళే, మానవులు. కానీ OS పనిచేయాలంటే ఏమి కావాలి ?  విద్యుత్. అది లేకపోతే OS  పనిచేయదు కంప్యూటర్ పనిచేయదు. విద్యుత్ అంటే ఏమిటో చెప్పగలమా ? అది ఏమిచేస్తుందో చెప్పగలం (దీపాలు వెలిగించటం వగైరా)  కానీ అది ఏమిటో చెప్పటం చాలా కష్టం.

అదే మన జ్ఞానేంద్రియాలు ఎల్లా పనిచేస్తాయని మనం ప్రశ్నించుకుంటే, మన మెదడు ద్వారా అని సంకొచెం లేకుండా చెబుతాము. మనలోని ఈ మెదడు అనే కంప్యూటర్ ని  సృష్టించిన వాళ్ళు ఎవరు ? దానిలో పనిచేసే OS  ని సృష్టించిన వాళ్ళెవరు ? ఖచ్చితంగా మనం మాత్రం  కాదు. మన గర్భంలో అది తయారు అవటానికి సహాయం చేస్తాం కానీ మనకి  మెదడు ఎల్లా చెయ్యాలో తెలియదు. దానిలో ఉండే OS ఎల్లా ఉంటుందో  తెలియదు.  అసలు ఈ మెదడు అవయవాలూ పనిచెయ్యటానికి  ఏమి కావాలి. చైతన్య శక్తి   "ప్రాణం". ఆ "ప్రాణం" గురించి అది ఏమిటో చెప్పగలమా? పోనీ ఆ "ప్రాణం" ఎక్కడ నుండి వచ్చిందో ఎవరిచ్చారో చెప్పగలమా?

ఇటువంటి ప్రశ్న ఒక రోజు శిష్యుడు "విచార చైతన్య" గురువుగారిని అడుగుతాడు. మన శరీరంలో జ్ఞానేంద్రియాల చేత ఎవరు పని చేయిస్తున్నారని. దీనికి గురువుగారి సమాధానం, సామవేదము లోని 35 శ్లోకాల కేనోపనిషత్  లో ఉంది. 

మొదటి మంత్రం:

కేనేషితం పతతి ప్రేషితం మనః  :       ఏ చైతన్యం వల్ల  ఈ మనస్సు పనిచేస్తోంది  

కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తాః  (క్త ) : ఏ చైతన్యం వల్ల ఈ ప్రాణం పనిచేస్తోంది  

కేనిశితం వచమిమాం వదన్తి  :              ఏ చైతన్యం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాము  

చ క్షు (హు ) శ్రోత్రం  క ఉ దేవో యునక్తి  : ఏ చైతన్యం వల్ల ఈ కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి 

దేనివల్ల (ఎవరి ప్రేరణ మూలాన) మనలోని మనసు, ప్రాణం, పంచేంద్రియాలూ పనిచేస్తున్నాయి ?. అని శిష్యుని ప్రశ్న.

జీవాత్మ అనే శక్తి  వీటన్నిటి చేతా పనిచేయిస్తుందని గురువుగారి సమాధానం. 

ఏవన్నా పనిచేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని మనం గుర్తించ గలమా ? గుర్తించ వచ్చు. దానిని వర్ణించ గలమా? లేదు. మాటల్లో చెప్ప గలమా ? మనకు తెలిసిన మాటల్తో చెప్పాలేము. కొత్త మాటలు నేర్చుకుని వర్ణించ గలమా? లేదు. మన ఊహకి అందే, మనం మాటల్లో వర్ణించ గలిగే పరిస్థితి లేదు. 

ఆ శక్తి గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే మన చేత మాట్లాడించేది ఆ శక్తే కదా. దానినివర్ణించే మాటలు మనదగ్గర లేవు అది మనకి ఇవ్వ లేదు. దానిని మనం చూడలేము ఎందుకంటే అది అతీతము మనలోఉంటుంది కానీ మనకి కనపడదు. అదే మనలోని ఆత్మ. తనలో ఉన్న ఆ చైతన్య శక్తి  ఉనికిని ఎవరికి వారే గుర్తించాలి. దానిని గుర్తించాలంటే ఏకోన్ముఖంగా చూసే ప్రజ్ఞ కావాలి. వంద ఆలోచనలతో ఎప్పుడూ మునిగితేలే మనస్సుతో ఉండే మనం ఏకాగ్రతతో ఒక దానిమీద ఆలోచించటం కష్టం కానీ చెయ్యొచ్చు. ఏకాగ్రతతో  తపస్సు (meditation ) చేసి దాని సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు (బుద్ధుడు, ఆది శంకర ). మనం అది ఉన్నదని  గ్రహిస్తే చాలు.

నామాట: 

మనకు తెలిసిన శక్తులు  విద్యుత్, అగ్ని లని రోజూ వాడుతాము. వాటిని ఎల్లా వర్ణిస్తాము.  మనకు తెలిసిన భాషతో అవి ఏమి చేయగలవో చెప్పగలం కానీ వాటిని వర్ణించటానికి మాటలు లేవు. 

అల్లాగే మనలోని  "ఆత్మ " వర్ణనకు అతీతం. మనం చూడలేము కాబట్టి మనకి అది లేదని అనుకోటం తప్పు.  దానివల్లనే మనం జీవిస్తున్నాము.

రోజూ రాత్రి చంద్రుడిని చూస్తాము. "చల్లని రాజా" అంటూ పాటలు కూడా వ్రాస్తాము. అసలు చంద్రుడికి వెలుగు నిచ్చే శక్తి లేదు. సూర్యుడి నుండి వస్తుంది. మనము చంద్రుడిని చూస్తున్నప్పుడు సూర్యుడిని చూడము కదా అందుకని చంద్రుడిది సూర్య శక్తి కాదంటామా? 

అల్లాగే గాలిని మనము చూడలేము. గాలి మూలాన ఆకులు కదులుతూంటేనూ, కాగితాలు ఎగురుతూంటేనూ మనం గాలి వచ్చిందని గ్రహిస్తాము. అందుకని "గాలి" లేదు అనలేము కదా?

మీరు రాత్రి గాఢ నిద్ర పోయారు. పోదున్నే రాత్రి బాగా పడుకున్నారా అంటే మీరేమి చెబుతారు. గాఢంగా నిద్ర పోయారని చెబుతారు. అది ఎల్లా తెలిసింది మీకు ?. గాఢ నిద్రలో అవయవాలు పని చెయ్యవే ! అదే  మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మీ ఆత్మ చెబుతోంది.

మనలో ఒక "ఆత్మ" అనే శక్తి  ఉందనీ  అదే మనం చూడలేకపోయినా , మనని అన్నివేళలా కనిపెట్టుకుని పని చేయిస్తోందనే నమ్మకం కలిగితే మనకి కోటి ఏనుగుల బలమొస్తుంది. మన బొందిని నడిపే వాడున్నప్పుడు దానిలో చక్కగా కూర్చుని నిశ్చింతగా ప్రయాణించటమే మన కర్తవ్యం.


నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda and Lectures of Swami Sarvapriyananda.