ఇంతవరకూ జరిగిన వృతాంతం:ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు పిప్పలాద ఋషి .
ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ?
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
రెండవ ప్రశ్న భార్గవ వైదర్భి గురువుగారికి వేస్తాడు : భగవాన్ ఒక వ్యక్థి స్థితికి ఎవరు కారకులు వారిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఇక్కడ స్థితి అంటే జీవించటం అని అర్ధం చెప్పుకోవచ్చు.
దానికి గురువుగారు పిప్పలాదులు చెబుతారు : మొదట ఇంద్రియాలు, వాటి వల్లనే వ్యక్తి జీవించకలుగుతున్నాడని గర్వంగా చెప్పేవి కానీ "ప్రాణం" మధ్యలో వచ్చి తానే జీవత్వానికి కారణం అని చెప్పి నిరూపిస్తుంది. అందుకని అన్ని ఇంద్రియాలకీ "ప్రాణం" పొసే "ప్రాణం" శ్రేష్టమైనది అని పిప్పలాదులు సమాధానం చెబుతారు.
మూడవ అధ్యాయం లో గురువుగారికి శిష్యుడు మూడవ ప్రశ్న వేస్తాడు.
మూడవ అధ్యాయం మొదటి మంత్రం: (3-1)
అధ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః ప్రపచ్చ : ఆ తరువాత కౌసల్య అశ్వలాయన అడిగాడు
భవన్కుత ఏష ప్రాణో జయతే కధమాయాత్యస్మిరీరే ? : మహర్షీ ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ శరీరంలోకి ప్రాణం ఎల్లా వచ్చింది ?
ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే ? : తనను తాను విభజించుకుని ఎల్లా ప్రతిష్ఠించు కున్నది?
కేనో త్క్ర మతే ? కథం బాహ్య మభిధత్తే ?: ఎలా బయటకు వెళ్తుంది (శరీరం నుండి) ? ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది ?
కధ మధ్యా త్మ మితి ? :
మూడవ అధ్యాయం రెండవ మంత్రం: (3-2)
తస్మై స హోవాచాతి ప్రశ్నా స్ప్రుచ్చ సి : శిష్యునితో (గురువుగారు) అన్నారు నువ్వు కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు
బ్రాహ్మిష్టో సీతి తాస్మాత్తే హం బ్రవీమి : నీవు బ్రహ్మజ్ఞానివి (అర్ధం చేసుకునే శక్తి ఉన్నది) అందుకు దీనికి సమాధానం చెబుతాను
మూడవ అధ్యాయం మూడవ మంత్రం: (3-3)
ఆత్మన ఏష ప్రాణో జాయతే : ఆత్మ నుండి ప్రాణం పుట్టింది
యథైషా పురుషే చ్చ యైత స్మిన్నే తదాత తం : పురుషుని వల్ల ఏర్పడిన నీడలా
మనోకృతేనా యాత్య స్మి ఇంమి రీరే : కర్మల వలన శరీరంలోకి వస్తుంది
కౌసల్య అశ్వలాయన గురువుగారికి వేసిన మూడవ ప్రశ్న,మనిషిలో "ప్రాణం" ఎల్లా వస్తుంది, శరీరంలో ఎల్లా ప్రతిష్ఠించు కుంటుంది, చివరికి శరీరాన్ని వదలి ఎల్లా వెళ్ళి పోతుంది?, చెప్పమని. (3-1)
గురువుగారు శిష్యుడికి తన సమాధానం అర్ధం కాదేమోనని కొంత తటపటాయించినా, శిష్యుని సామర్ధ్యం తెలిసినవాడు కనుక, ఇది చాలా క్లిష్టమయిన ప్రశ్న అంటూనే దానికి సమాధానం చెబుతారు. (3-2)
ఈ జగత్ అంతటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుండి "ప్రాణం" పుట్టింది. ఎల్లా పుట్టింది అంటే మనం ఎండలో నుంచుంటే నీడ వస్తుందే అలా. "ప్రాణం" పరమాత్ముని నీడ లాంటిది. నీడ ఎంత మిధ్యో పరమాత్ముని అంశం ఈ జగం కూడా అంతే మిధ్య . అది ఏశరీరంలోకి వస్తుంది? మనం చేసిన పూర్వ జన్మ కర్మల ప్రభావం వలన. (3-3)
ఏవిధంగా ఒక చక్రవర్తి పరిపాలన సౌలభ్యంకోసం మంత్రులూ సామంత్రులు మొదలగు వారిని నియమించుకుని పాలిస్తారో అటులనే "ప్రాణం" శరీరంలో తన వారిని విడివిడిగా తగిన స్థానాలలో నియమించుకుని శరీరాన్ని పరిపాలిస్తుంది. (3-4)
"ప్రాణం" తన అంశతో నలుగురు సహాయకులను సృష్టించుకుని , అపానం, సమానం, వ్యనం, ఉదానం అనే నలుగురు, శాఖా బాధ్యతలు అప్పజెప్పింది. అపానం బాధ్యత విసర్జన క్రియ, జీవోత్పత్తి , సమానం కి జీర్ణక్రియ, వ్యనం కి రక్తప్రసరణ క్రియ, ఉదానం కి తిరోగమన క్రియ అప్పజెప్పి ముఖ్యమయిన శ్వాసక్రియ దానికి కావాల్సిని కళ్ళు చెవులు ముక్కు (చక్షు శ్రోత్రే ముఖ నాసికాభ్యం ) తన పరిధిలో ఉంచుకుంది "ప్రాణం". (3,5) (3,6) (3,7)
"సమానం" కి ఉన్న శాఖ జీర్ణక్రియ. తనకు హోమాగ్ని లాగా అర్పించబడిన ఆహారాన్ని తీసికుని పోయి ఏడు జ్వాలలను ఉత్పత్తి చేసి ఏడు ఇంద్రియాలకు శక్తిగా ఇస్తుంది (2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక )
"వ్యానం " శాఖ రక్త ప్రసరణం. ఆత్మ హృదయంలో ఉంది. ఈ హృదయంనుండి 101 నాడులు వస్తాయి (నాడీ నామ్ ఏతత్ ఏకశతమ్ ). వాటిలో ఒక్కొక్క దానికీ నూరు శాఖా నాడులు ఉన్నాయి. ప్రతి శాఖా నాడికీ 72000 ఉపనాడులు ఉన్నాయి (సహస్రాణీ ద్వాసప్తతి:). వీటిల్లో రక్త ప్రసరణక్రియ "వ్యానం "నిర్వహిస్తుంది. (3-6)
"ఉదానం" స్థానం ఊర్ధ్వ భాగం. దీని శాఖ తిరోగమన క్రియ. మనం పడంది తింటే విసర్జన ద్వారా బయటికి పంపుతుంది. ప్రాణాన్ని సరి అయిన లోకాలకు చేర్చటం కూడా దీని పనే. పైకి వెళ్ళే ముఖ్యమైన నాడి "సుషుమ్న" నాడి ద్వారా ఉపాసన చేసిన వారిని "ఉదానం" బ్రహ్మ లోకానికి తీసుకు వెళ్తుంది. మిగతా నాడులు మిగతా వారిని వారి వారి ప్రారబ్ధ కర్మ ప్రకారం, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి , పాపం చేస్తే నరకానికీ తీసుకు వెళ్తాయి. రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి తీసుకు వెళ్తాయి (పాప ముభాభ్యామేవ మనుష్యలోకమ్ ). (3-7)
సూర్యుడే బాహ్య రూపంలో "ప్రాణం". పృథ్వి బాహ్య రూపంలో"అపానం". అంతరిక్షం బాహ్య రూపంలో "సమానం". వాయువు బాహ్య రూపంలో "వ్యానం " (3-8)
శరీరంలో అగ్ని తత్త్వం వెళ్ళి పోయినప్పుడు అన్ని ఇంద్రియాలూ మనస్సులో లీనమయి పోయి ఇంకొక జన్మలో మరల బయటికి వస్తాయి. (3-9)
మరణం సమయంలో అయిదు ప్రాణులూ ఏకమవుతాయి. అందుకనే జీర్ణక్రియ లాంటివి జరుగవు. ఈ సమైఖ్య "ప్రాణం ", మనిషి కోరిన చివరి సంకల్పం ప్రకారం దాని స్ధానానికి వెళ్తుంది. (3-10)
ఎవరైతే "ప్రాణం" గురించి అర్ధంచేసుకుని ఉపాసన చేస్తారో అతని సంతతి ఎన్నటికీ నశించదు, బ్రహ్మ లోకానికి వెళ్తాడు. (3-11)
ఫల శృతి:
"ప్రాణం" ఎలాపుట్టింది? శరీరంలోకి ఎలా వచ్చింది? శరీరంలో ఎక్కడ ఉంది? ఎలా పరిపాలిస్తోంది? ఐదుగా ఎలా విభజించుకుంది ? ఇవన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వ్యక్తి అమరత్వం పొందుతాడు. (3-12)
నా మాట :
మొదట ఈ అధ్యాయం క్లిష్టంగా కనపడుతుంది గానీ రెండుమూడు సార్లు చదివితే తేలికగా అర్ధం చేసుకోవచ్చు.
సూక్ష్మంగా చెప్పాలంటే "ప్రాణం" మానవ శరీరంలోకి ప్రవేశించి, శరీర దైనందిన కార్యక్రమాలకోసం, తనకుతాను అయిదు భాగాలుగా విభజించుకుని, జీవి చేత ప్రారబ్ధ కర్మ ప్రకారం "మానవ జన్మ" అనే శిక్ష అనుభవింప చేసి చివరకి "సుషుమ్న" నాడి ద్వారా నిష్క్రమిస్తుంది.
ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన శాలలో రోజూ ఇటువంటివే ముఖ్యమయిన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.
అది ఏమిటి? ఎలా వచ్చింది ? ఏమి పనిచేస్తుంది? మనకేమి ఉపయోగం? ఎట్లా పోతుంది? అనేవి.
ఎన్నో వేల ఏళ్ళ నాటి క్రింద భారత దేశంలో మన పూర్వికులు ఈ పంధాలో ఆలోచించారంటే నిజంగా మనకి మనం మెచ్చుకోవాలి గర్వపడాలి.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది: