ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.
ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ?
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రాహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
రెండవ అధ్యాయం మొదటి మంత్రం.
అధ హైనం భార్గవో వైదర్భి: పప్రచ్చ : ఆ తర్వాత విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అడిగాడు
భగవన్కత్యేవ దేవాః ప్రజాం విధారయన్తే ? : ఏ దేవతలు ఒక వ్యక్తికి స్థితికారకులు
కతర ఏతత్ప్రకాశయన్తే ? : వారిలో ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు
కః పునరేషాం వరిష్ఠ ఇతి : వారిలో ఎవరు శ్రేష్ఠులు అని ( 2-1)
కబంధీ కాత్యాయనుడి మొదటి ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత భార్గవుడు రెండవ ప్రశ్న వేశాడు. ఏ దేవతలు ఒక వ్యక్తి జీవించటానికి కారకులు ? వారిలో ఎవరు శ్రేష్ఠులు అని.
భార్గవుని ప్రశ్నలో దేవతలు అనే పదం వాడారు కానీ ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి లో ఉన్న ఇంద్రియాలు పని చేయటానికి ఎవరు కారకులు, వారిలో ఎవరు గొప్ప అని. మనం దీన్ని ఉదాహరణకి మనకు తెలిసిన జ్ఞానేంద్రియాలు అని అనుకుందాము. జ్ఞానేంద్రియాలు లేక పోతే మనిషికి ఒక స్థితి అంటూ ఉండదు.
మనం ఇంకో ఉదాహరణకి కన్ను తీసుకుంటే, కన్ను ఒక గాజు ముక్క, తన పని అల్లా కాంతికిరణాలని వెనకాల ఒక తెరమీదికి చేర్చటమే. మనము ఆ కిరణాల సముదాయాన్ని గుర్తించటం అనే పని ఇంకొక చోట, మనము చూడలేని చోట, జరుగుతుంది. మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఈ విధంగానే పని చేస్తాయి.
వేల సంవత్సరాల క్రిందట ఈ ప్రశ్న వచ్చిందంటే నిజంగా గొప్పే. ఏ సమాధానం కనపడని ప్రశ్నలకి మనకు కనపడని దేవతలు చేస్తున్నారు అనుకోవటం నా ఉద్దేశంలో సహజమే.
రెండవ అధ్యాయం రెండొవ మంత్రం. (2-2)
తస్మై స హోవాచ : అతడితో పిప్పలాద చెప్పాడు
ఆకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాప: : ఆకాశం వాయువు అగ్ని నీరు
పృథివీ వాజ్ఞ న శ్చక్షు: శ్రోత్రం చ : పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు
తే ప్రకాశ్యాభివదన్తి : దేవతలు వాటి పనిని గురించి గొప్పల చెప్పుకుంటున్నాయి
వయమే తద్బాణ మవష్టభ్య విధారయా మః : శరీరం కలిపివుంచి మేమే శరీరాన్ని భరిస్తున్నాము
మొదట ఆకాశం వాయువు అగ్ని నీరు పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ శరీరాన్ని కలిపివుంచి శరీరాన్ని భరిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని పిప్పలాదుడు చెప్పారు.
నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం , వారే (సంసారం) అంతా భరిస్తున్నా రంటారు.
తాన్వరిష్ఠ: ప్రాణ ఉవాచ : వాటిలో శ్రేష్ఠమైన ప్రాణం అన్నది
మా మొహమా ప ద్యధాహ మేవై : ఎవరుగొప్ప అను భ్రాంతి లో పడకండి (2-3)
కానీ మధ్యలో "ప్రాణం" వచ్చి నన్ను నేనే ఐదుగా విభజించుకుని ఈ శరీరాన్ని స్థంబం లాగా నిలబెడుతున్నాను. ఇంకొకళ్ళు గొప్ప అనే భ్రాంతి లో పడవోకండి అని అన్నది. కానీ ఆ దేవతలు నమ్మలేదు అని చెప్పారు.
అందుకని "ప్రాణం" ఊర్ధ్వ దిశగా వెళ్ళిపోదామని బయలు దేరింది. జ్ఞానేంద్రియాలలో "ప్రాణం" ఉన్నది కాబట్టి అవి కూడా ప్రాణంతో వెళ్ళటానికి సిద్దమైనాయి. మరల "ప్రాణం" తన యధాస్థితికి వచ్చిన వెంటనే అవి గూడావాటి యధాస్థితికి జేరినాయి. అందుకని అన్నిటికన్నా ప్రాణమే శ్రేష్టమైనది అని పిప్పలాదులు అన్నారు.
నా మాట:
నిజ జీవితం లో కూడా ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో గమనించకపోతే కాపురాలూ, కంపెనీలూ పేక మేడల్లాగా కూలిపోతాయి. అటువంటప్పుడే "ప్రాణం" లాగా ఎవరో వచ్చి మేలుకొలిపి రక్షిస్తూ ఉంటారు.
మన దేహం లో అగ్ని లేకపోతే శక్తి లేదు. నీరు లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవదు. వాయువు లేకపోతే మన శ్వాస లేదు. అల్లాగే మిగతా దేవతలన్నీ "ప్రాణ" ప్రేరేపణతో పనిచేసేవే.
ఈ రెండో అధ్యాయం లో మిగతా విశ్లేషణ అంతా "ప్రాణ" స్తుతి. అది ఎంత గొప్పదో చెబుతారు. మనిషిలో ప్రాణం లేకపోతే ఏమిజరుగుతుందో మనకందరికీ తెలుసు.
Like it🙏
ReplyDeleteశర్మ గారూ థాంక్స్.
Delete