బ్రహ్మ నిష్ఠా గరిష్టు లైన ఆరుగురు శ్రోత్రియులు సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ కాత్యాయన, గురువు గారికి సరి అయిన కానుకలతో పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.
ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.
ఇక్కడ గమనించవలసినది ఎవరో వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత గురువుగారికి లేదు. పోనీ తాను చెబితే వాళ్ళకి తెలుస్తుందా లేక కంఠశోష మాత్రమే అవుతుందా అనేది గురువుగారికి తెలియదు. అందుకనే మీరు ఒక సంవత్సరం ఆశ్రమ నియమాలు పాటిస్తూ తన ఆశ్రమంలో ఉన్న తర్వాతే సందేహాలకి సమాధానాల సంగతి చూస్తాను అంటాడు గురువుగారు.
ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు.
భగవన్కుతో హ వా ఇమాః ప్ర జా: ప్రజాయన్తీ ఇతి : (1-3)
భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ?
కాత్యాయన ప్రశ్నకి గురువుగారు క్రింది మంత్రాలలో సమాధానం చెబుతారు.
ప్రజాకామోవై ప్రజాపతి: : ప్రాణులను సృష్టించ దలచి ప్రజాపతి
స తపః అతప్యత : తపస్సు చేశాడు
స తపః తపస్తప్యా స మిథునం ఉత్పాదయతే : తపస్సు తరువాత జంటను సృష్టించాడు
రాయించ ప్రాణం చేత్యేతౌ మే బహుధా ప్రజా: కరిష్యత ఇతి : రయిని, ప్రాణాన్ని (సృష్టించి) ఈ రెండూ నాకోసం అనేక జీవాల్ని ఉత్పత్తి చేస్తాయి అనుకున్నాడు. (1-4)
ప్రాణకోటి ఎల్లా పుట్టింది అనే కాత్యాయన ప్రశ్నకి గురువుగారు ప్రజాపతి తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించి, మూల ప్రకృతిగా (అనేక జీవుల పుట్టుకకు) దోహదపడుతుంది అని చెబుతారు.
ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరోకాదు విష్ణుమూర్తి సృష్టించిన బ్రహ్మ. (ముండక ఉపనిషత్)
ఈ మంత్రం అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం కానీ ప్రయత్నిద్దాము. "ప్రాణం" అనే దానికి శక్తి ఉత్పాదించేది అనే అర్ధం చెప్పుకుంటే, శక్తిని ఉపయోగించేది "రయి " అవుతుంది. ప్రపంచంలో మనం చూసేవన్నీ జంటలు. సూర్యుడూ చంద్రుడూ, మగా ఆడా, పగలూ రాత్రీ, పుట్టుక చావు, తయారుచేసేవి తినేవి.
ఉదాహరణకి సూర్యుడూ చంద్రుడూ తీసుకుందాము. సూర్య కాంతి లేనిది చంద్ర కాంతి లేదు. పగలూ రాత్రీ లేదు. శక్తి నిచ్చేది సూర్యుడు శక్తిని తీసుకునేది చంద్రుడు . వీటినుండి కాలమానం ఎల్లా వచ్చిందో చూడండి.
సూర్యుడు చంద్రుడూ తిరిగితే కానీ ఒక రోజు, 24 గంటలు పూర్తవదు. ఈ జంట వలన మనము కాలం గుర్తించి రోజులు గుర్తించ గలుగుచున్నాము, పూర్ణమి అమావాస్య, ఉత్తరాయణం దక్షిణాయనం, కృష్ణ పక్షం శుక్ల పక్షం. వీటినుంచి ఋతువుల క్రమం కూడా గుర్తించాము. ఇంతెందుకు మనం మన రోజూ దిన చర్య మొదలుకుని అంతా వీటి చుట్టూతా తిరుగుతాము.
ఇంకో ముఖ్య ఉదాహరణ ఆడా మగా. వీళ్లిద్దరూ కలియక పోతే మానవ జన్మ ఉండదు. భూమిమీద మనుషులు కూడా ఉండరు.
అన్నం వై ప్రజాప్రతిస్తతో హ వై తద్రేతస్తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి (1-14)
ఆహారమే ప్రజాపతి. అన్నం నుంచే మనుష్య బీజం ఉత్పత్తి అవుతుంది. ఆ బీజం నుండే మనుష్య సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది. (ఇక్కడ అన్నం అంటే తినే ఆహారమని అర్ధం)
శుక్రశోణిత సంయోగమేవ సృష్టి: : స్త్రీ పురుషుల నుండి శుక్ర శోణిత బీజాలు కలిస్తే సృష్టి జరుగుతుంది.
వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
నా మాట: మనంజీవించటానికి సూర్య చంద్రులు చాలాముఖ్యం. అందుకనే సూర్యనమస్కారాలు వచ్చాయి. మనం నమస్కారాలు చెయ్యవలసిన అవసరం లేదు సూర్య దేవు డేమీ బాధపడడు. కానీ జీవితంలో మనకు సహాయం చేసిన వారినీ చేస్తున్న వారిని గుర్తించటం మన సభ్యత భాద్యత కూడా.
కాలం సృష్టించిన సూర్య చంద్రులు వందేళ్ల క్రిందటా ఇలాగే ఉన్నారు వందేళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటారు. వారు సృష్టించే ఈ కాలంలో అరిగిపోయి ఒరిగిపోయేది మనమే .
తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.
Six pundits reached the Ashram of Rishi Pippalada and requested him to clear some doubts they gathered during their philosophical journey. Pippalada suggested to them that they should stay with him for an year and then if they ask he may tell if he know the answer to those questions.
The year went by and the first question came from Kathyayana about the theory of creation, how the creatures were born ?.
To that question the guru replied, Lord Vishnu created Prajapathi(Brahma) and assigned the duty of creating the world. Prajapathi meditated on this assignment and produced a pair "Rayi" and "Prana"to create the world.
That is why every significant thing in this world comes in pairs. Ex: Sun and Moon, Male and Female.
Without Sun and Moon there is no concept of time, Year, month and seasons.
Without Male and Female there is no human beings.
ఇంకా మీరు చదివి తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ లు ఉపయోగ పడతాయి.
No comments:
Post a Comment