Din Tai Fung restaurant |
ఇవ్వాళ డిన్నర్ చైనీస్ అంటేను నేను రాను ఇంట్లోఉంటాను అని చెప్పాను. ఆరోజే కొత్తింట్లోకి మారాము. నీకు టెలిఫోన్ లేదు ఇంట్లో వైఫై లేదు కనీసం టీవీ కూడా లేదు ఏంచేస్తావు, ఇక్కడ కూర్చునేది అక్కడేకూర్చుందు గాని రమ్మన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రియమైన భార్యవైపు చూస్తే ఆవిడ మొహం తిప్పేసుకుంది, ఆవిడ అప్పటికే తయ్యారు అయ్యి కూర్చుంది. ఇంక తప్పదు వెళ్లాను. సామాన్యంగా చైనీస్ రెస్టరెంట్ లో ఆర్డర్ చేసినవన్నీ మధ్యలో పెట్టి ఎవరికి ఇష్టమయినవి వాళ్ళు తమ ప్లేట్లల్లో వేసుకుని తింటారు. ఊర్కేనే కూర్చోవచ్చులే అనుకున్నాను.
నా ఉద్దేశంలో చైనీస్ రెస్టరెంట్ అంటే, చాప్ సూయీ, ఎగ్ ఫు యంగ్, ఫ్రైడ్ రైస్, ఎగ్ డ్రాప్ సూప్ మొదలయినవి . అక్కడ వాసన భరించటం కొంచెం కష్టం. ఇండియన్ రెస్టరెంట్ అయినా అంతే అనుకోండి కానీ అది మనకు తెలిసిన భరించే వాసన.
రెస్టారెంట్ యూనివర్సిటీ విల్లేజ్ అనే షాపింగ్ సెంటర్ లో ఉంది. తీరా చూస్తే ఆ చైనీస్ రెస్టరెంట్ మల్టి లెవెల్ పార్కింగ్ లాట్లో ఉంది. జీవితంలో ఎప్పుడూ పార్కింగ్ లాట్లో ఉన్న రెస్టారంట్ చూడలేదు. రోడ్ పక్కన టిఫిన్ తిన్నాను, కాఫీ టీ తాగాను ( అందులో ఒకటి, భోపాల్ ట్రైన్ స్టేషన్ దగ్గర పొద్దున్న ఆరింటికి పరగడుపున పళ్ళు తోముకోకుండా తాగిన టీ ఎంత బాగుందో అది ఇప్పటికీ గుర్తుంది) కానీ ఇంత వరకూ పార్కింగ్ లాట్ రెస్టరెంట్ లో తినలేదు.
అక్కడికి వెళ్లేసరికి పెద్ద క్క్యూ. మా కోడలు వెళ్లి రిజర్వేషన్ చేసింది. దాదాపు లోపలకి వెళ్ళటానికి ఒక అరగంట పట్టవచ్చన్నారు. మేము పదిమంది అంత మందికి ముందర రిజర్వేషన్ సౌకర్యం లేదుట.
మా మనవడు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పదార్ధాలు ఎల్లా చేస్తారో చూపెట్టాడు. పై బొమ్మలో ఎడమ వైపున వంటవాళ్లు పదార్ధాలు చెయ్యటం చూడవచ్చు.ఇది తైవానీస్ చైనీస్ రెస్టరెంట్. బహుశ మెన్యు లో తేడా ఉండవచ్చు . దాదాపు ఇరవై మంది అయిదు బల్లల దగ్గర నుంచుని పని చేస్తున్నారు. కజ్జికాయల్లాగా కొన్ని, కుడుములు లాగా కొన్ని చేస్తున్నారు. వాటిని డంప్లింగ్స్ అంటారుట.
వీటిని తయారు చేసిన తర్వాత ఒక చిన్న జల్లెడ లాగా ఉండే ట్రే లో పెడతారు .
లోపలికి రమ్మని పిలుపు కోసం బయట కూర్చున్నాము. ఇది మిడ్ వింటర్, సియాటిల్ అయినా బయట 30F (-1.1C). చలి. ఇంకో ఫ్లోర్ కి వెళ్లి కొంచెం వెచ్చగా ఉండే చోట కూర్చున్నాము. పిల్లలూ కొందరు పెద్దలూ షాపింగ్ సెంటర్ చూడటానికి వెళ్లారు. ఇది కొంచెం ఖరీదయిన షాపింగ్ సెంటర్ ట.
ఒక అరగంట తర్వాత లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. ఒక పెద్ద డైనింగ్ హాల్ లో నుండి పెద్ద ఫామిలీ రూమ్ లోకి తీసుకు వెళ్లారు. రక రకాల డంప్లింగ్స్, తీపి కుడుములు తీసుకు వచ్చి టేబుల్ మధ్యలో పెట్టారు. వచ్చిన పదార్ధాలన్నీ వేగన్. తెచ్చిన కుడుముల్లో రెండు రకాలు నువ్వులు బెల్లం మధ్యలోపెట్టినవి, తీపి రెడీబీన్స్ మధ్యలోపెట్టినవి. చాప్ స్టిక్స్ ఉన్నాయి కానీ నాకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాడటం చేత కాలేదు. నాబోటి వాళ్ళకోసం ఫోర్క్స్ ఉంటే అవి వాడాను.
Server |
అందరూ వారికి కావాల్సినవి వారు తిన్నారు. నేను చైనీస్ టీ తాగి బీన్స్, ఫ్రైడ్ రైస్, తీపికి రెడ్ బీన్ డంప్లింగ్ తిన్నాను. చెప్పద్దూ అంత రుచికరమైన బీన్స్ నేను ఎప్పుడూ తినలేదు.
రెడ్ బీన్ డంప్లింగ్ |
No comments:
Post a Comment