"హమ్మయ్య! ఇంక "ఓహైర్ " ఎయిర్పోర్ట్ జేరితే, ప్లేన్ ఎక్కి "సియాటిల్" వెళ్లిపోవచ్చు, అనుకుంటూ "లిమో" లో కూర్చున్నాము. బయట చల్లటి ఈదురు గాలి . "సియాటిల్" అమెరికా పశ్చిమ తీరంలో ఉంది. అంటే ఉష్ణోగ్రత భరించలేని చలితో "చికాగో" లాగా ఉండదు.
"లిమో" అంటే టాక్సీయే కానీ కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టాలి. మాకు ఎయిర్పోర్ట్ దాదాపు ముఫై నలభై మైళ్ళు. ఈ "లిమో" వాళ్ళు రమ్మన్నప్పుడల్లా నమ్మకంగా ఇంటికి వచ్చి ఎయిర్పోర్ట్ కి తీసుకు వెళ్ళటమో లేక ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి తీసుకు రావటమో చేస్తూ ఉంటారు .
పొద్దుటి నుండీ ప్లేన్ రాకపోకలు చూస్తూనే ఉన్నాము. చాలా ఫ్లయిట్స్ కాన్సిల్ చేశామని వింటున్నాము కానీ మా ఫ్లయిట్ ఆన్ టైం అని చెబుతోంది. ఒకవేళ డిలే అయితే ఎయిర్పోర్ట్ లో కూర్చుందాములే అని అనుకున్నాము.
మేము దాదాపు ప్రతీ క్రిస్మస్, న్యూ ఇయర్ కి మా అబ్బాయి దగ్గరకు వెళ్తాము. మనవళ్ళు మనమరాళ్ళతో క్రిస్మస్ ట్రీ కి అలంకరణలు చేయటం మా ఆవిడకు చాలా ఇష్టం. న్యూ ఇయర్ అయిన తరువాత ఇంటికి తిరిగివస్తాము. ఈ సంవత్సరం కూడా అదే పని చెయ్యాలని ప్రయత్నం.
హైవే పైన స్నో ఉంది కానీ కార్లు బాగానే పోతున్నాయి. చికాగోలో చలికాలం మామూలే కాబట్టి జనం అంతగా పట్టించుకోరు. కానీ మనసులో కొంచెం సంకోచం గానే ఉంది. ఇంత 'ఆర్కి టిక్ ' వాతావరణంలో వెళ్ళటం అవసరమా అని. కొన్ని వేల ఫ్లయిట్లు నిన్న, ఇవాళ కూడా కేన్సిల్ చేశారు .
చిన్నప్పుడు స్కూల్లో చదివిన విమానాల పాఠం గుర్తుకొస్తోంది. విమానాలకు రెక్కలుంటాయి. ఆ రెక్కలకింద గట్టిగా గాలి కొట్టితే విమానం పైకి లేస్తుంది. తరువాత ఇంజిన్ లో చక్రాలు తిరగటం మూలంగా అది ముందరికిపోతుంది. స్క్రూ డ్రైవర్ తో స్క్రూ ని ముందరికి నెట్టినట్లు. కానీ అది అటువైపు ఇటువైపు తిరగాలన్నా, స్పీడ్ తగ్గించి ఎక్కడన్నా ఆగాలన్నా రెక్కల మీద "ఎయి రోలాన్లు " ఉంటాయి. అవి పైకి కిందకీ లేస్తూ ఆపని చేస్తాయట. ఇది అరవై ఏళ్ళ క్రిందట హైస్కూల్ సైన్స్ లో నేర్చుకున్న పాఠం . ఈ వాతావరణంలో అవి తెరుచుకోకపోతే మన గతి ఏమిటి. అందుకే రెక్కల మీద "డి ఐసింగ్" చేస్తారని తెలుసు. అయినా ఈ ఆర్కెటిక్ వాతావరణంలో పనిచేస్తుందా? ఈ వాతావరణంలో కార్లు పనిచేస్తున్నాయి కదా అని కొంచెం ధైర్యం. (ఇక్కడ రేడియేటర్ లో నీళ్ళు గడ్డ కట్టకుండా ఉండటానికి "యాంటీ ఫ్రీజ్" పోస్తారు.)
మా ఆవిడ కి కూడా కొద్దిగా అనుమానంగానే ఉంది ప్రయాణం ఎలా ఉంటుందో అని. ఫోన్లో అన్నీ చూస్తోంది. అంతా బాగానే ఉంది. ప్రశాంతంగా ఉందని అనుకుంటుంటే "మెసేజ్" రూపంలో ఫ్లయిట్ క్యాన్సిల్ అయినట్టు వచ్చింది. నాకు సంతోషించాలో విచారించాలో తెలియలేదు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా ప్రయోజనం లేదు. అంతా మనమంచికే అనుకుని "లిమో" డ్రైవర్ ని వెనక్కి తిప్పి ఇంటికి తీసుకు వెళ్ళమన్నాము.
"ఎయిర్పోర్ట్ " కి వెళ్లకుండా ఉన్నాము కాబట్టి ఆ డబ్బులు ఇవ్వాలి . ఇంటికి వెళ్తున్నాము కాబట్టి దానికి వేరే డబ్బులు ఇవ్వాలి. ఈ రెండు ట్రిప్ లకి రెండు టిప్ లు ఇవ్వాలి. మనము చేత్తో ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే తీసుకుంటారు. తడిసి మోపెడంత అయింది. గుడ్డిలో మెల్ల ఇంకానయం ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు, వెళ్తే అందరిలాగా నేలమీద పాడుకోవాల్సి వచ్చేది.
ఎలాగయితే నేం ఇంటికి చేరాము. ఇంక చేసేదేముంది లాప్టాప్ తెరిచి యూట్యూబ్ లోకి వెళ్ళాను . నా కుకింగ్ గుర్విణి "చిత్రా మురళి" అమావాస్య రోజు వంటకాలు విడియో పెట్టింది. అప్పుడు అర్ధమయ్యింది నాకు ఇవ్వాళ తిధి ఏమిటో ! . అమావాస్య రోజు ప్రయాణం పెట్టుకుంటే ప్రయాణం అవుతుందా ?
As usual very unusual and interesting way of looking at usual experiences! Thanks for sharing!
ReplyDelete😆😂
ReplyDeleteAnonymous గార్లూ నమస్కారాలు థాంక్స్.
ReplyDelete