Sunday, February 12, 2023

202 ఓ బుల్లి కధ --- మామా మియా (Mamma Mia )

మొదట ఈ మూవీ 2008 లో వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చూడటానికి వెళ్తుంటే, ఆ సినీమా నాకు చూడటం ఇష్టం లేదు అని చెప్పి నేను వెళ్ళ లేదు. ఇది సంగీత ప్రధానమైన సినీమా. అన్నీ పాటలే. కానీ ఎందుకో కధ నాకు నచ్చలేదు. 

కడుపుతో ఉన్నదని దగ్గరవాళ్ళందరూ వెలివేస్తే, ఒక పెళ్ళి కాని అమ్మాయి గ్రీక్ దేశంలోని ఒక లంకకు వచ్చి హోటల్ పెట్టుకుని జీవిస్తూ తన కూతుర్ని పెద్దది చేస్తుంది. కూతురికి యుక్త వయస్సు వస్తే పెళ్ళి నిర్ణయించి పెళ్ళికి తన స్నేహితురాళ్ళని పిలుస్తుంది. 

పెళ్ళికూతురికి తన కిష్టమయిన వాడితో పెళ్ళి జరుగబోతోందని సంతోషంగా ఉన్నా, తనని కన్యాదానం చేసే తండ్రి ఎవరూ లేరే అని బాధగా ఉంది. తన తండ్రి ఎవరో తల్లి ఎప్పుడూ తనకి చెప్పలేదు. 

ఇక్కడ పెళ్ళిళ్ళల్లో తండ్రి అమ్మాయిని చేత్తో పట్టుకుని పెళ్ళి కొడుకు దగ్గరకు తీసుకు వస్తాడు. పెళ్ళిలో ఇది ఒక ముఖ్య ఘట్టం.ఆ తరువాత చర్చిలో పూజారి వధూవరుల చేత పెళ్ళి  ప్రమాణాలు చేయించి పెళ్ళి ముగిస్తాడు. 

పెళ్ళిలో తన తండ్రి తో నడవాలని కోరికతో, తన తల్లికి తెలియకుండా ఆవిడ డైరీ చదివి, తల్లితో  సన్నిహితంగా గడిపిన ముగ్గుర్ని గుర్తించి, వారిని తన పెళ్ళికి ఆహ్వానిస్తుంది. వాళ్ళల్లో తన తండ్రిని గుర్తు పట్టగలననే ధీమా. మిగతా సినీమా అంతా పెళ్ళికి వచ్చిన, ముగ్గురు అమ్మ స్నేహితురాళ్ళు, ముగ్గురు పెళ్లికూతురు స్నేహితురాళ్ళు , రహస్యంగా పిలవబడ్డ ముగ్గురు తండ్రులతో , వాళ్ళ ఆటపాటలతో గడుస్తుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లి కూతురు తన తండ్రిని గుర్తుపట్టలేక పోతుంది.

మీకు నచ్చిందా ఈ కథ. నాకయితే నచ్చలేదు. ఇంట్లో వాళ్ళఅందరూ వెళ్ళి చూసి వచ్చి ఆహా  ఊహూ అంటూ మెచ్చుకుని దానిలో పాటలు కూడా పాడటం మొదలెట్టారు.

కొన్ని ఏళ్ళ తరువాత మా అబ్బాయి న్యూయార్క్ రావటం మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇంకోళ్ల  ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడయినా మీరు చేసే పనులు మీ స్వతంత్ర భావాలకి అనుగుణంగా ఉండవు. అందరితోపాటు వెళ్లి పోవాల్సిందే. ఆ ఫ్లో లో వెళ్ళవలసి వచ్చింది బ్రాడ్వే మ్యూజికల్  "మామా మియా " కి . ఒక గంట హల్లో స్టేజ్ నాటకం చూసిన తర్వాత నాకు బాగా నచ్చేసింది. మొదట నాకెందుకు నచ్చలేదో అర్ధం కాలేదు. బహుశ నా శంకుచ మనస్తత్వం అనుకుంటా.

ఇప్పుడు తెలిసొచ్చిందేమిటంటే మన మొదటి ఒపీనియన్ అంత సరియైనది కాదేమోనని. ఇదే దృష్టి నాకు మొదట్లో ఉంటే పెళ్ళికి అంతమందిని చూడవలసి ఉండేది కాదు. ఇప్పుడు హాయిగా  పదిమంది పిల్లలతో ఎక్కడో పాఠాలు చెప్పుకుంటూ ఉండేవాడిని. వయస్సు పెరుగుతున్న కొద్దీ భావాలు మారుతూ ఉంటాయి.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే దానికి ఒక కారణం ఉంది. మొన్న మా అమ్మాయి, మానవరాలూ ఒక వారం రోజులు ఉండటానికి మా ఇంటికి వచ్చారు. "మామా మియా " సీక్వల్ వచ్చింది చూద్దామన్నారు. ఇంట్లో "ఎమజాన్"  లో చూశాము. నాకు నచ్చలేదు. అంతటితో ఆగిపోతే బాగుండేది. నాలుగేళ్ళ మనమరాలు "మామా మియా ", "మామా మియా " అంటూ మర్నాడు గొడవచెయ్యటం మొదలెట్టింది. పిల్లలు కూడా గుర్తుంచుకుని అనే "క్యాచీ నేమ్"  అది.

"మామా మియా " మళ్ళీ చూశాము. మనుమరాలు "మామా మియా " అనటం మానేసి సినీమా చూస్తూ  పాటలు వాళ్ళ అమ్మతో పాడటం మొదలెట్టింది. ఆ పాటలు అంత ఎడిక్టివ్ . మీరుకూడా వీలుంటే చూడండి. చూడటానికి ఇష్టం లేని సీన్ లు వస్తే  ఒక క్షణం కళ్ళు మూసుకోండి సీన్ మారిపోతుంది.

2 comments:

  1. Really nice as usual! Thanks for sharing!

    ReplyDelete
    Replies
    1. I do not know how I missed it. Thanks for your comment. Sorry for the late reply.

      Delete