Friday, April 30, 2010

20. ఓ బుల్లి కథ 8 ---- వసంతం లో ఆరోజు

వసంతం లో ఆరోజు ----
వసంత కాలము వచ్చెను. చెట్లు చిగిర్చి పూవులు పూయుచుండెను. స్నో తీయుట ఆపి గడ్డి కోయు సమయము ఆసన్న మాయెను. ఉదయముననే సూర్యుడు ఉదయించెను. పక్షులు కిల కిలా రావములు చేయుచుండెను. బయట మలయ మారుతము వీచు చుండెను. నా మనస్సు ప్రశాంతము గ నుండెను. ఉద్యోగ విరమణ చేసిన తరువాతి కాలములో అది కదా ముఖ్యము. నా ఈ ప్రశాంతతకు కారణము నా ధర్మపత్ని సేవా దక్షిత అని గర్వముగా చెప్పు చుంటిని. ఉదాహరణకు ఈ నాటి నా కార్యక్రమము కాల క్రమముగా (రియల్ టైం లో ) వివరించెదను.

కాల కృత్యములు తీర్చుకొని నా కంప్యూటర్ నకు విద్యుత్ ప్రవాహము ను పంపి 'ఈనాడు' పత్రిక చదువు చుంటిని. క్రింద నుండి కాఫీ అని పిలుపు వినిపించెను. క్రిందకు వెడలి కాఫీ సేవించి 'ఈనాడు' పత్రిక మరల చదువుట ప్రారంభిచితిని. ఆంధ్రలో సంగతులు తెలిసిన వెనుక నా ఈ -మెయిలు లు చూచుట ప్రారంభించి తిని. అవి అయిన వెంటనే ఈ నాటి వాతావరణము మొదలుకొని అమెరికా వార్తలు యాహూ న్యూస్ వారి ద్వారా చదువు చుంటిని. ఐస్లాండ్ లో అగ్ని పర్వతము పేలుట. దానివలన ఏర్పోర్టులు మూసివేయుట. మధ్యలో చిక్కుకున్న ప్రయాణీకుల ఇబ్బందులు చదువుటతో కళ్ళు చెమర్చెను. అంతటిలోనే లంచ్ పిలుపు వినపడెను. పిలిచినప్పుడు వెళ్ళక పోయిన మనకు మనమే భోజన సదుపాయములు చేసుకొన వలసి వచ్చును (పళ్ళెము పెట్టుకుని వడ్డించు కొనుట, తినిన తరువాత వస్తువులు తీసివేయుట వంటివి). అందుకని పిలువగనే బద్ధకము లేకుండగ క్రిందకు వెళ్లి కాఫీ తో సహా భోజనాది కార్యక్రమములు చేయుదును. మనము ఇంకొకరి కష్ట సుఖములు కూడ చూడ వలయును కదా. వెంటనే వెళ్లి మధ్యాహ్న భోజనము చేసి పయికి వచ్చి ఈ నాటి వ్యాపార వార్తలు స్టాక్ మార్కెట్టు గురించి చదువు చుంటిని. మరల కాఫీ అని పిలుపు వినవచ్చెను. క్రిందకు వెళ్లి యాఫ్టర్ నూన్ కాఫీ త్రాగి వచ్చితిని.

కూడలి బ్లాగులను చూచుట ప్రారంభించితిని. కాబేజీ వడలు చేయుట తెలిసి కొనిన తదుపరి నాకు ఉదయము 'ఐ లవ్ యు' అను సబ్జెక్టు తో వచ్చిన ఈ- మేయిలులు గుర్తుకు వచ్చినవి. నేను తీరికగా చదువుదమని వాటిని విడిగా ఉంచితిని. క్లిక్ చేసి చదువుట ప్రారంభించితిని. అంతియే నా ఎదురుగ చిత్ర విచిత్రము లయిన బొమ్మలు వచ్చు చుండెను. కంప్యూటర్ వైరస్ ట్రోజన్ హార్స్ తో వెడలి వచ్చి నా కంప్యూటర్ ని ఆక్రమించినదని చెప్పక తెలియ చెప్పు చున్నది. దానికి తోడు నీ కంప్యూటర్ పాడు అయినది డబ్బులు కట్టిన బాగు చేయుదమని మెరుపులతో కనపడు చుండెను. అవి తీసి వేయుద మనిన పోవుటలేదు. అవి భార్య గారు చూచుటకు తగిన బొమ్మలు కాక పోవుటచే పాత సి డీ లు తీసి విండోస్ లోడ్ చెయ్యుట మొదలు పెట్టితిని. భార్యామణి పయికి వాచ్చునను తొందరలో ప్రశ్నకు ఒక సమాధానము బదులు ఇంకొక సమాధానము ఇచ్చితిని. దానితో కంప్యూటర్ పనిచేయు పద్ధతులను తనంతట తనే తొలగించు కొనెను. ఆ జాగాను కూడ శుభ్రము చేసి తను పని చేయు విధానములను పాత సి డీ ల లో నుండి పెట్టు చుండెను. ఈ పనులన్నియు స్క్రీన్ మీద మెరుపుల ద్వారా బుద్ధిగా చెప్పు చుండెను.ఎంత వరకూ కూర్చొన వలయునో కూడా చెప్పును. మనము ఈ సమయములో చేయవలసినది ఏమియు లేదు. అంతయు అయిపోయి న దని చెప్పిన వెంటనే చూడగా స్క్రీను మీద పెద్ద పెద్ద అక్షరములు కనపడుచు కొత్తగా ఉండెను. ఇంటర్నెట్ లోకి వెళ్ళుటకు కూడా ఏమాత్రము వీలు కనుపడ లేదు. కంప్యూటర్ భీష్మించుకు కూర్చొనెను. సూత్రములు తొలగించి జాగాను శుభ్రము చేయుట వలన కంప్యూటర్ దాని స్క్రీన్ నే గుర్తించ లేక పోయెను. దీనిని కంప్యూటర్ పరిభాషలో డ్రయివరులు లేని కంప్యూటర్ గ గుర్తించి తిని. డ్రయివరులు కోసము వెతక ప్రారంభించితిని.

సాయంత్ర మయ్యెను. కొత్త 'ఈ నాడు' వచ్చును. బిజినెస్ న్యూస్ ఏమిటో తెలియదు. స్టాక్ మార్కెట్టు ఎమయినదో తెలియదు. కూడలి లో వచ్చు బ్లాగులు చూడక పోయిన బ్లాగరులు బాధ పడుదురు. నేను ఇంక ఆగలేక లాప్ టాప్ కొరకు మా ఆవిడని అడిగితిని. లాప్ టాప్ ఆవిడ కోసము ప్రత్యేకముగా ఇచ్చినది. లాప్ టాప్ వాడుట నాకు నామోషి. పెద్ద పెద్ద కంప్యూటర్ లను వాడిన నేను డెస్క్ టాప్ ను వాడుటకే సంకోచించి తిని. చూపుడు వేలుతో నడిపే లాప్ టాప్ అనిన నాకు చులకన. అందుకని నేను దానిని వాడుట నేర్చుకొన లేదు. కంప్యూటర్ లో ఈనాటి సంగతులు చదువక పోయిన యడల ఈ రాత్రికి నాకు నిదుర పట్టు యోగము ఉండదు. అందుకని భర్తగా అధికారము తో నాకు లాప్ టాప్ మీద పని చేయుట నేర్పమని అడిగితిని. మనకు అవసరము ఉన్నప్పుడు, అధికారము చూపుట అంత మంచిపని కాదని తరువాత తెలిసికొంటిని. ఆతరువాత ఎమయినదో నాకు వ్రాయుటకు ఇష్టము లేదు. కొన్ని గంటల వాద ప్రతి వాదముల తరువాత రాత్రి పన్నెండు గంటలకు ఒక అగ్రీమెంట్ కు వచ్చితిమి. దానిని క్లుప్తముగా ఈ క్రింద ఇచ్చు చుంటిని. కాగితము మీద కాంట్రాక్టు వ్రాసి సంతకములు చేసితిమి. వెంటనే ట్రైనింగ్ తీసుకుని లాప్ టాప్ మీద రెండు గంటలలో సంగతులు చదివి హాయిగ నిదుర పోతిని.

మా అగ్రీమెంట్: 1. నేను లాప్ టాప్ వాడిన సమయము గంటలలో లెక్కించి ఆ సమయము లో మరునాడు ఆవిడ చెప్పిన పనులు చేయవలయును. షరా: ఒక గంట పది నిమిషములు వాడినను అది రెండు గంటల క్రిందకు వచ్చును.

2. తను లాప్ టాప్తో పనిచేయుట నేర్పును గనుక నేను డెస్క్ టాప్ బాగు చేయునపుడు ఆవిడకి చూపి నేర్ప వలయును. ఆవిడ వేసిన ప్రశ్నలకు ఓర్పుతో సమాధానములు చెప్పవలయును.

3.లాప్ టాప్తో పనిచేయునప్పుడు 'ఐ లవ్ యు' వంటి ఈ-మెయిల్సు చూడ కూడదు. అడ్డ దిడ్డ మయిన బ్లాగులు కూడ చూడ కూడదు.

4. పయిన చెప్పినవి ఏవిధముగనైన ను అతిక్రమించిన లాప్ టాప్ ప్రివిలేజెస్ పోవును. అతిక్రమణ నిర్ణయము తన పరిధి లోనిది.

సశేషం - ఇంకా ఉంది

2 comments:

  1. నమస్కారములు.
    మీ వసంత కాల వర్ణన చాలా బాగుంది చెట్లు చిగిరిచ్చి కొత్తగ విరిసిన పూలు చాలా అందంగా ఉంటాయి కదు !ఇక స్నొ తీయడం ,గడ్డి కోయడం ,దిన పత్రిక చదవడం [ ఇంచక్కా కాఫీ తాగుతు ] ఈ దిన చరలు తరువాత కంప్యూటర్ రిపేరు. అదీ స్ర్కీన్ మీద చూస్తు శుభ్రం చేస్తూ ? ఎంత పద్దపనొ ? చెయ్యె తిరిగిన మీకు అవలీలగా రిపేరు చేయగలరు కదా ? సరె ఇంతకీ డ్రైవర్లు దొరికాయా ? పాపం బ్లాగర్లను బాధించ కుండా , బిజినెస్సు, స్టాక్ మార్కెట్టు ,బుద్ధి గా అంత చూసారన్న మాట. అవును లాప్టాప్ ను మరీ అంత చులకన చేయకూడదు కదా ? అది అవుసరానికి ఆదుకొనే ఆపత్బాంధువు. పైగ అధి కారముతొ ప్చ్ ! ఏపనీ జరగదు సరికదా వాద ప్రతి వాదాలు పెరుగి మొదటికే మోసం వస్తుంది. అందుకె మమకారంతొ మంచి గా సాధనమున పనులు సమకూర గలవు. ఇక వాగ్వివాదముల పిమ్మట మీ ఎగ్రిమెంటు బాగుంది. గో హెడ్ .మీ వసంత కాలపు అనుభూతి నిత్య నూతనం కావాలని సరేన ?
    ఆలస్యం ఐనందుకు క్షమాపణలతొ

    ReplyDelete
  2. @నేదునూరి గారూ మీకు ఈ పోస్ట్ చాలా నచ్చినందుకు థాంక్స్. ఇంకొంచం బాగా వ్రాయటానికి ప్రయత్నిస్తాను నా డెస్క్ టాప్ బాగయిన వచ్చిన తరువాత, మా ఇంటావిడకి కంప్యూటర్ బాగు చెయ్యటం నేర్పిన తరువాత. మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.

    ReplyDelete