Tuesday, April 13, 2010

18. ఓ బుల్లి కథ 6 ---- శనగలతో నా చిట్కా వైద్యం

శనగలతో నా చిట్కా వైద్యం ----
ఇవాళ రహస్యముగ  ఒక కొత్త పరిశోధన చేయవలయునని  నిర్ణయించు కొంటిని.  మద్య నాకు కొంచం మతిమరుపు ఎక్కువ అయినది దానికి చిట్కా మందు కనిపెట్టవలె నని అనుకొనుచుండగా ఒక మంచి "క్లూ" దొరికినది. ఇంటి ఆవిడ ఆఫీసు కి వెళ్ళిన వరకు ఆగి ఒక "క్యాన్" "గర్బాన్జో" కొనుక్కుని వచ్చితిని. వచ్చి కట్ చేయుచుండగా "క్యాన్" ఒపెనేర్ మధ్య మధ్యలో స్లిప్ అయి మూత వచ్చుటలేదు. రేకు వంచి తీయుదమని ప్లయర్సు కోసం వెతుకుట జరిగినది. అవి కనపడలేదు. మా ఇంటిలో ఇటువంటివి ఎచ్చట ఉండునో నాకు తెలియదు. టూల్స్ అన్నీ ఒక చోట పెట్ట మని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినరు. కాగా పోగా ఉపయోగించే వాళ్లకి ఎక్కడ ఉన్నయ్యో తెలుసు అని ఎద్దేవా చేస్తారు. మా ఇంటిలో చేతి వాటం వాడిని (హండీ మాన్ ) నేను కాదు. నా పరిశోధన విరమించుకునే పరిస్థితి ఏర్పడి నాకు చాలా బాధ వేసినది.

అసలు నేను చేసిన తప్పు ఉబుసుపోక "నాన్న" బ్లాగ్ చదువుట. దానిలో శనగలు ఎంత మంచివో వ్రాసితిరి. శనగలు తింటే ఎలా ఉండునో చూపుటకు ఒక ఫోటో గూడ ఉంచిరి. అది చాలా బాగుగ  ఉన్నది. మొన్న అటువంటిది ఒకటి తీయించు కుంటిని గాని, అది
సైడ్ ఫోజులో తీయటముతో నా బొజ్జ బయట పడెను.  వ్యాయామ యంత్రముల ముందర బొజ్జ బాగుండదు కదా అందుకని నా ఫోటో పెట్టలేదు. ఇంతకీ చెప్పొచ్చే దేమిటనిన అది చదివి తరువాత, శనగలు తినిన మైండ్ చాలా బాగా పనిచేయునని  గట్టి నమ్మకము  కలిగినది. ఎందువలన అనిన శరీరం చక్కగా ఉండుటకు  మైండ్ కదా ముఖ్యము .అందుకనే పేరంటపు  శనగలు తిని తిని మన ఆడవాళ్ళకి చాలా తెలివి తేటలు వచ్చి ఉంటవని నా అనుమానము. మనని పేరంటములకు చస్తే పిలవరు కదా. మధ్య మా ఆవిడ పేరు గూడా గుర్తు ఉండక "ఆవిడ" అని అనుచుంటిని. ఆవిడ ఆఫీసు నుండి వచ్చే లోపల శనగలు తో మైండ్ చిట్కా మందు తయ్యారుచేయుదమని అని అనుకుంటిని. ఇప్పుడు "క్యాన్" మూత వచ్చుటలేదు. డబ్బా లో నుండి శనగలు ఎటుల తీయ వలయునో ఏమి చేయవలయునో తోచటము లేదు.

పెద్ద పెద్ద వాళ్ళు స్నానము చేస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి క్లిష్ట మయిన సమస్యలని పరిష్కరించారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అది కూడా ప్రయత్నించితిని. అరగంట స్నానము చేసినను సమాధానము దొరకలేదు. దిగులుగా డ్రెస్ వేసుకుని తలదువ్వుటకు దువ్వెన కొరకు మధ్య అర తీసితిని, ఎదురుకుండా ప్లయర్సు కనపడినది. రిలేటివిటీ థియరీ ని మళ్ళా కనుక్కున్నంత ఆనందము కలిగినది.

ఇంక నా పని నల్లేరు నడక నుండి పచ్చగడ్డి మీద పరుగుగ మారి పోయినది. వెంటనే రేకు వంచి శనగలు తీసి మూడు సార్లు బాగా కడిగి ఆరబోసితిని. రెండు నోట్లో వేసుకొంటిని. పచ్చివి రుచిగ లేవు. రుచి తెప్పించుట  నాకు పెట్టిన విద్య. భగుణె లో రెండు స్పూన్స్ నూనె (ఆలివ్ అయితే ఇంకా మంచిది) వేసి, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు జీల కర్ర, నాలుగు మెంతులు, చిటికెడు పసుపు , ఒక ఎండు మేరప తుంచి వేసితిని. వేగిన తరువాత ఆరిన శనగలు పోసితిని . శనగలు వేగుతున్నప్పుడు నీళ్ళు ఉండటము వలన  
పేలును. నీళ్ళు పోవు వరకు వేయించి పావు స్పూన్ కారము ఉప్పు వేసి పులుపు కోసం నిమ్మకాయ పిండితిని.

ఇంక నా ఆనందమునకు అంతు లేదు. ఎందుకైనా మంచిదని
పొటాసియం కోసం అరిటిపండు ఒకటి తింటిని. నా మెదడుకి మందు ఇప్పుడు నా చేతులలో ఉంది. రెండు గింజలు నోట్లో వేసుకుని రుచి చూసితిని. బ్రహ్మాండముగా ఉండెను. గబా గబా ఒక గుప్పెడు తీసుకు ని తింటిని. తలుపు తాళం తీసుకుని వచ్చుచున్న చప్పుడు అయినది. స్వరాజ్యం వచ్చావా అని సంతోషం పట్టలేక పెద్దగ అంటిని. పేరుపెట్టి పిలుస్తున్నారు? ఏమిటి విశేషం అన్న సమాధానం నా చెవులకు విందయినది. ఇన్నాళ్ళకు మా ఆవిడ అసలు పేరు తిరిగి గుర్తుకు వచ్చెను. "యురేకా" అని అరిచితిని. నా చిట్కా మందు పనిచేసినది. నా పరిశోధన ఫలించినది. నా కనులు ఆనంద భాష్పముల తోటి నిండిపోయినవి.

మాతృక "నాన్న" బ్లాగు లో "మీకు తెలుసా" పోస్ట్ (ఏప్రిల్ 7, 2010). వ్రాసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

లక్కరాజు శివరామ కృష్ణారావు

7 comments:

 1. హ హ హ అయితే శెనగలు పనిచేసాయన్నామాట....కానీ ఓ ముప్పు ఉందండోయ్, శెనగలు ఎక్కువగా తింటే గేస్ సమస్యలు వస్తాయి. కడుపులో గేస్ పెరిగి మంట, అజీర్ణం సమస్యలు వస్తాయి. ఏదైనా శ్రుతి మించకూడదు కదా....జాగ్రత్తలు పాటిస్తారని చెప్పాను అంతే, అపార్థం చేసుకోకండేం :)

  ReplyDelete
 2. ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
  Dear L.S.R.,
  I just read the story (your latest).I am too lazy to cook,but enjoyed your narration of "Chick peas". Compared with Indian chana with skin, chick Peas must be a bargain. (I have to worry about gas, though)
  Prasad

  ReplyDelete
 3. ఇ-మెయిల్ లో వచ్చిన వ్యాఖ్య.
  అవును మగవాళ్ళు కుడా పేరంటాలకు వచ్చి శనగలు తినడం మొదలు పెట్టి తెలివి పెంచు కుంటే ఆడవాళ్ళకి అప్పడాల కర్రలు సరిపోవు.

  రాజేశ్వరి

  ReplyDelete
 4. @sowmya, @Prasad
  ఇద్దరు PhD లు అసౌకర్యముగా ఉంటుంది అని చెబితే నేను ఒప్పుకో కుండా ఉంటానా. నా తరువాత పోస్ట్ లో దానిని గురించి వ్రాస్తాను. చిక్కు ఎక్కడ వచ్చిందంటే సున్నితంగా మ్రుదు మధురంగా ఎలా వ్రాయాలా అని. మీరు వ్యాఖ్యానించి నందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. @రాజేశ్వరి గారికి
  మేము ముందే గ్రహించి ఇప్పుడు అప్పడాల కర్ర లని ప్లాస్టిక్ తో చేయించి చైనా నుండి దిగుమతి చేసు కుంటున్నాము. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 6. లక్కరాజుగారికి, నమస్కారములు.

  సెనగలతో వంట-వార్పు-చిట్కాలు చాలా బాగుందండీ. సెనగలు తింటానికి మరొక చిట్కా, గాస్ రాకుండా వుండటానికి, అవి మొలకెత్తిన తరువాత తినటం.
  భవదీయుడు,
  మాధవరావు.

  ReplyDelete