Thursday, September 16, 2010

28. ఓ బుల్లి కథ 16 -- వరండా లో బల్ల ఎత్తుకు పోయారు --

మామయ్య గారింట్లో వరండాలో బల్ల ఎత్తుకు పోయారు అని వినం గానే నాకు చాలా బాధ వేసింది. ఆ బల్ల మీద కూర్చొని ఎంతమందికో చదువులు చెప్పారు మా మామయ్య గారు, వాళ్ళ పిల్లలు, అప్పుడప్పుడూ నేను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమందో ఆ వరండాలో కూర్చొని హోం వర్క్ లు చేశారు, తెలియనివి చెప్పించు కున్నారు. బాగా చదువుకునే వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. పనికి  పంపిస్తే ఇంట్లోకి చేదోడు వాదోడుగా ఉంటాడు అనే మాటని అడ్డుకుని, భోజనం పెట్టి, పనిమనిషి కొడుక్కి చదువు చెప్పారు. ఇప్పుడు అతను సబ్ ఇనస్పెక్టరు అయ్యాడుట.


నాకు మా మామయ్య గారంటే ఎందుకు ఆత్మీయత పెరిగిందో అర్ధం కాదు. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. మా నాన్న గారు, సీనయ్య, అంటే ఆయనకి చాలా ఇష్టం అని నాకు బాగా తెలుసు. బహుశా వారిద్దరూ దాదాపు ఒకటే వయస్సు అయి ఉండవచ్చు. అందుకని నేనంటే ఆయనకీ ఇష్టమేమో. 


మొదట్లో తెనాలిలో వాళ్ళింటికి పిల్లలం వెళ్ళేవాళ్ళం కాదు. వెళ్ళినా బయట బల్ల మీద కూర్చునో, పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆడో, మా వూరు కట్టేవరం సాయంత్రానికి జేరుకునే వాళ్ళం. ఒకసారి అత్తయ్య "కృష్ణా నీ అత్తయ్య నే  కదా ఎందుకు ఇక్కడ ఉండవు?" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది . మేము అక్కడ ఉండక పోటానికి అసలు కారణం,  వాళ్ళింట్లో బయట బట్టలు కలపరు. బయటనుంచి వచ్చిన వాళ్ళు ఎవరయినాసరే వాళ్ళిచ్చిన ఉతికిన బట్టలు కట్టుకుని ఇంట్లోకి రావాలిసిందే. అప్పటినుండీ శలవలకి రేపల్లె నుండి వచ్చినప్పుడల్లా అత్తయ్య గారింట్లో  రెండు రోజులుండే వాణ్ని. అత్తయ్య దోసకాయ పప్పు అంటే నాకు చాలా ఇష్టం.


మామయ్య గారు అప్పుడప్పుడూ గమ్మత్తు గా మాట్లాడు తారు. నా చిన్నప్పుడు తెనాలి నుండి రేపల్లె వెళ్ళే ట్రైన్ ఎక్కించటానికి స్టేషన్ కి వచ్చారు. ట్రైను కదల బోతోంది. "కృష్ణా నీ రెండు రూపాయలు నీకు ఇచ్చేశాను. అవునా " అన్నారు. నేను వెంటనే ఇచ్చేశారండీ అన్నాను. ఆయనదగ్గర చిల్లర లేక పోతే నేను రెండు రూపాయలు ఇచ్చాను. తరువాత తిరిగి ఇచ్చేశారు. నాకు ఎందుకు అలా అన్నారో అర్ధం గాక మా నాన్నగారిని అడిగాను.


టూకీగా మా నాన్నగారు చెప్పినది ఇది, ఒకప్పుడు మా మామయ్య గారి ఇంట్లో ఏ గూట్లో చెయ్యి పెట్టినా రూపాయ నాణాలు ఉండేవిట. కొద్దిగా మీరు  డెబ్బై ఏళ్ళ క్రిందట పరిస్థుతులు గమనించాలి. ---- పల్లెటూళ్ళు, పెంకుటిళ్ళు, మట్టి గోడలు, ఇనప పెట్టెలు, గూళ్ళు.---- అప్పటి ఉన్నవాళ్ళ ఇళ్ళు అలా ఉండేవి. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత, విడిపోయిన అన్నలు,  నాన్నగారికి అప్పిచ్చామని చాలా ఆస్తి తీసుకున్నారు. తరువాత  ఆయనకి వచ్చిన డబ్బుల్లో బంధువులకి వ్యవసాయానికి అప్పిచ్చారు. ఆ సంవత్సరం పంటలు పండక కరువుతో ఉంటే ప్రభుత్వము రైతుల అప్పును మాఫీ చేసింది. అంతే బంధువులయినా ఈయన డబ్బులు వారు తిరిగి ఇవ్వాలేదు. ప్రభుత్వం అప్పులని మాఫీ చేస్తే మునిగి పోయేవాళ్ళు అప్పిచ్చిన వాళ్ళు. ప్రభుత్వం ఎంతమందిని ఇలా దివాలా తీయించిన్దో. 


అప్పటి నుండీ ఆయనకి అప్పులు ఇవ్వటం తీసుకోవటం అంటే భయం. చివరికి ఉన్న చదువుతో  ట్రైనింగ్ తీసుకుని బ్రతక లేక బడి పంతులు అయ్యారు. పల్లెటూరు నుండి తెనాలి వచ్చారు. నాకు ఇంకో సంగతి కూడా చెప్పారు ఆయన్ని గురించి. చిన్నప్పుడు ఆయన స్లీప్ వాకింగ్  చేసేవారుట. ఇంట్లో వాళ్ళ ఉపాయం, ఆయన పిలకని నులకమంచానికి కట్టేవారుట. కొంత కాలానికి స్లీప్ వాకింగ్ పోయిందిట.


ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా బాధ పడుతూ ఉంటాను. ఇంటి చుట్టూతా తడికల గోడ కన్నా, ప్రహరీ గోడ ఉంటే బల్లని ఎవరూ తీసుకు పోయే వారు కాదేమో అని. పిల్లలందరూ ఎవరికి వారు రెక్కలొచ్చి వెళ్లి పోయారు. బల్ల పోయింది. ఆ తరువాత మా అత్తయ్య పోయింది. చివరికి ఆయనా పోయారు. 


నా కెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మన ప్రభుత్వం పంతుల గార్లని ప్రోత్సహించి,  ఒక్కొక్క పంతులు గారు కనీసం ఒక్కొక్క పనిమనిషి పిల్లలకి చదువు చెప్పి పైకి తీసుకు వచ్చేటట్లు చేస్తే, మనదేశం ఎల్లా ఉండేదో!. 

8 comments:

 1. By e-mail
  Rajeswari Nedunuri to me
  show details 10:28 AM (3 hours ago)
  బాగుంది మీ ఆర్టికల్ నిజమే మీరన్నట్టు మన తాత గారి ఊరంటే " పెంకుటిళ్ళు,ధాన్యం పురిలు,గడ్డి వాములు,ఇనప్పెట్టిలు, భోషా ణాలు, ఒక్కొక్క గూటికి ఒక్కొక్క పేరు. ఒక్కొక్క గదికి ఒక్కొక్క పేరు. పొలం గట్లు తాటి ముంజలు ఇవన్ని గుర్తు కొస్తున్నాయి.చదువు తుంటే నాకు మాఊరి గురించి రాయాలని పిస్తుంది. మీ రాన్నట్టు మనదేశానికి అంతటి అదృష్టం వస్తుమ్డంటారా ? అదే కలనైనా ?

  ReplyDelete
 2. @bachisri
  వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 3. @రాజేశ్వరి గారికి
  వ్యాఖ్యకి ధన్యవాదములు. మీ ఊరు గురుంచి తప్పకుండా వ్రాయండి. పాత జ్ఞాపకాలు పంచుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. మళ్ళా తిరిగిరావు కదా.

  ReplyDelete
 4. శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

  మీరు వివరించిన సంఘటనలు హృదయాన్ని కదిలించేవిగా వున్నాయి. మన చిన్నప్పటి కొన్ని సంఘటనలు మనకు ఊహ తెలుస్తున్నప్పుడు మన మనసుపై చెరగని ముద్రని వేస్తాయి; కొన్ని కొంత పెద్దయినతరువాత మనకు మార్గదర్శకం చేస్తాయి. బహుశా ఈ విషయంలో, మీ విషయంలో, ఇదే మార్గదర్శకం అయింది కాబట్టే, బహుశా మీరు ఉద్యోగ విశ్రాంతి తీసుకున్న తరువాత " అమెరికాలోని పిల్లలకు" ఆంగ్ల పాఠాలు ఉచితంగా చెబుతున్నారని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా, చాలా చక్కటి విషయాన్ని తెలియచేశారు.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
 5. మాధవరావు గారూ

  మార్గదర్శకం గురించి మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం. నిజంగ ఆలోచిస్తే మనకి తెలివితేటలు అనుకునేవి ఎల్లా వచ్చాయి? వెళ్లనని ఎంత మొరాయిన్చినా నయానో భయానో బడికి పంపిన తల్లితండ్రులు, ఓర్పుతో పాఠాలు చెప్పిన మాస్టర్లు, పాఠాలు చెప్పటానికి ఓపికగా పుస్తకాలు వ్రాసిన విజ్ఞులు, మనతో ఎండా వానల్లో పూసుకు తిరిగిన స్నేహితులు, మానని ప్రేమతో చూసిన మన పెద్దవాళ్ళు. ఇవన్నీ కలిపితేగదా మనకు తెలివితేటలు వచ్చింది. మనము ఇంకొకళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాము మనము ఇంకొకళ్ళకి నేర్పాలి. అంతే కదా మరి. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. chala baga rasaru.chivariki vachesariki chadivina vallaki kuda వరండా లో బల్ల povadam ento badha kaligistundi. konnisarlu ante pranam leni vastuvula mida kuda ento prema penchukuntam.vastuvuki pranam lekapoyina gnapakalaku untundi kada marchipolem.
  http:/kallurisailabala.blogspot.com

  ReplyDelete
 7. సంవత్సరాల తరబడివాటిని వాడుకుంటూ జీవిస్తే, ప్రాణం లేని వస్తువులయినా అవి మన అలవాట్లలో దైనందిన కార్యక్రమాలలో కలిసిపోతాయి మీరన్నట్లు వాటితో మన ప్రేమ పంచుకుంటూ ఉంటాము. మీలాగా నవలలు వ్రాయలేననుకోండి, మీ అభిప్రాయాలని పంచుకున్నందుకు థాంక్స్.

  ReplyDelete