ఉదయాన్నే బంగారు ఉదయకిరణాలు కిటికీ లోనుండి వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకుని డ్రెస్ చేసుకుని క్రింద సోఫా లో కూర్చున్నాను. క్రూరమయిన మూడు నెలల చికాగో చలికాలం తరువాత ఎంతో ఫ్రెష్ గ ఉంది. ఇవ్వాళ IHOP (International House of Pancakes) లో బ్రేక్ ఫస్ట్. వారెవ్వా ఆ పాన్ కేకులు ఎక్కడా దొరకవు. బొద్దుగా మెత్తగా సుతారంగా ఉడికీ ఉడక నట్లు, కాలీ కాలనట్లు, బంగారం రంగుతో, వావ్ తలుచుకుంటేనే నోరూరుతుంది. "హాష్ బ్రౌన్స్" ఇంక వాటిగురించి చెప్పక్కర్లేదు. పైన కొద్దిగా బ్రౌన్ మధ్య మల్లెపువ్వు లాంటి సుతి మెత్తని తరిగిన పొటాటో రెక్కలు. వాడి కాఫీ ఉంది చూడండి ఇక చెప్పలేము. ఒకప్పుడు కాఫీ అక్కడ తాగాలంటే భయమేసేది. ఇప్పుడు చాలా డిఫరెంట్. మైల్డ్ బోల్డ్ సున్నితమయిన ఫ్రాగ్రన్సు. ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ టేబుల్ మీద పెడతారు. కావాల్సినన్ని సార్లు తాగచ్చు. నేనయితే రెండు కాకపోతే మూడు సార్లు తాగుతాను. కనీసం తినే ముందర తిన్న తరువాత.
నా సంతోషాన్ని నా దగ్గర వాళ్ళతో పంచుకోవటం నాకు చాలా ఇష్టం. అందుకనే పరంధామయ్య నీ ఆయన భార్యనీ రమ్మన్నాను. మా ఆవిడ ఎల్లాగూ వస్తుందనుకోండి. నిజం చెప్పొద్దూ అసలు పరంధామయ్య ని పిలవటానికి కారణం నాకూ మా ఆవిడకీ మధ్య బఫ్ఫర్ గ ఉంటాడని. ముఫై ఏళ్ళ కాపురం తరువాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మాట్లాడేవి ఏమి ఉంటాయి?
అప్పుడే పది గంటలయింది. ఆవిడ గారు లేచారల్లె ఉంది పైన శబ్ద మవుతోంది. బ్రేక్ ఫస్ట్ టైము పదిన్నరకు అయిపోతుంది. మా రిటైర్మెంట్ అగ్రీమెంట్ ప్రకారము ఎవరూ ఎవరిని తొందర పెట్ట కూడదు. తొందరగా వస్తే వెళ్ళొచ్చు అని కొంచెం చిగురాశ ఉంటే పరంధామయ్య కి ఫోను చేసాను. ఎవ్వరూ పలకటల్లేదు. నా ఆశలన్నీనీరు కారి పోతున్నాయి. పొద్దుటి నుండీ ఎదురుచూస్తున్న బ్రేక్ ఫస్ట్ కి ఇంతే సంగతులు.
పదకొండున్నరకి పరంధామయ్య దిగాడు వాళ్ళ ఆవిడతోటి.
"బ్రేక్ ఫస్ట్ కి వస్తానన్నావు?"
"మాస్టారూ క్షమించండి లేటయింది"
"ఉదయం నుండీ ఎదురు చూస్తున్నాను పరం ధామా"
"పొద్దున్నే కూరలకు వెళ్ళాల్సొచ్చింది" "ఆ తరువాత ఆయిల్ ఛేంజి."
"ఇవ్వాళే వెళ్ళాలా నాయనా"
"లేదండి వెళ్ళక తప్పలేదు"
"కొంచెం లేవటం కూడా లేటుగా లేచాము"
"నిన్ననీకు రెండు సార్లు ఫోను చేసాను IHOP కి వెళ్దాము పొద్దున్నే రమ్మని"
" ఫరవాలేదండీ ఎప్పుడయినా వెళ్ళచ్చుట, నిన్నమేము పిలిచి కనుక్కున్నాము"
"ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ అక్కడ."
"బ్రేక్ ఫస్ట్ కుక్, లంచ్ కుక్, డిన్నర్ కుక్ వేరు వేరు" అన్నాను నేను.
"కుక్ లందరూ ఒకటే. అయినా మీరు తినే pancakes కి ఏ కుక్ అయితే నేం?" మా ఆవిడ అందుకుంది.
ఇంకా నేను ఆగ లేక పోయాను. "యాభై ఏళ్ళకు పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్ళ బాలాకుమారి గ ఉండాలంటే కష్టం"
ఎవ్వరికీ అర్ధం కాలా. నేను మాట్లాడేదాన్ని co-relations అంటారు. అందరికీ అర్ధం కావు. విశదీకరించా.
"పెళ్లి ఏ వయసులోనయినా చేసుకోవచ్చు (అంటే అది ట్వంటీ ఫొర్ అవర్స్ బ్రేక్ ఫస్ట్ లాంటిది). యాభై ఏళ్లకు (అంటే లంచ్ టైము లో) పెళ్లి చేసుకుని ఇరవ్వై ఏళ్ళ వాళ్ళు లాగా ( అంటే బ్రేక్ ఫస్ట్ లాగా) ఆనందించాలంటే కష్టం. బ్రేక్ ఫస్ట్ pancakes వేరు లంచ్ టైం pancakes వేరు."
అంతా నిశ్శబ్దం. నేను అన్నదానికి రియాక్షన్ ఏమీ కనపడటల్లేదు.
ఇంకా ఏ విధంగా అర్ధమయ్యేటట్లు చెప్పాలో తెలియటల్లా.
"ఒకపూట వంట తప్పుతుందని ఆమ్మ గారూ నేనూ లంచ్ టైముకి వెల్దామను కున్నాము. ఏ కుక్ అయితే ఏమి, తినేది Pancakes యే కదా అని ఆమ్మ గారు అన్నారు" తనతప్పేమి లేదని పందామయ్య భార్య అసలు విషయం బయట పెట్టింది.
"మీరేవన్నా చెప్పండి కుక్కులు అందరూ ఒకటే" తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఇదేనేమో.
తెల్లబోయాను. నాకు కోపము ఆగటల్లేదు. తను ఒకటి తలిస్తే దైవము ఒకటి తలుస్తుందిట. కాదు తను ఒకటి తలుస్తే పెళ్ళాలు ఇంకొకటి తలుస్తారుట. ఆడవాళ్ళ గూడుపుఠాణీ తెలిసి పోయింది. ఏదో అనాలని అనిపిస్తోంది.
నా మనస్సు గట్టిగా నోరుమూసుకోరా అని చెప్తూనే ఉంది. ఆగలేక నోరు విప్పాను.
"బార్బరులు అందరూ ఒకటే, రోజూ గుండు చేసే బార్బర్ దగ్గరకి క్రాఫ్ కోసం వెళ్తామా? " అని నాలిక కరుచుకున్నాను.
"ఏ సమయానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ" పాట మనస్సులో మెదుల్తోంది.
అంతే నిశ్శబ్దం. తలుపుతీసిన శబ్దం అయ్యింది. మొదట మా ఆవిడ. తరువాత పరంధామయ్య భార్య ఆ తరువాత ఆవిడ కొంగు పుచ్చుకుని పరంధామయ్య నిష్క్రమించారు. పరంధామయ్య వెళ్తూ నా వంక చూసి బేల మొహం పెట్టాడు. కారు స్టార్ట్ చేసిన చప్పుడయింది. తరువాత కారు వెళ్ళిపోయింది. కఠోరమయిన నిశ్శబ్దం.
ఆకలవుతోంది. మనస్సంతా కటిక చీకటిగా ఉంది. నాకు పెద్దగా అరిచి బల్ల గుద్దాలని ఉంది. కానీ ఫ్యూచర్ భయ పెట్టింది. ఇంక కూర్చుని లాభంలేదు. లేచాను. భయాలతోటి బాధలతోటీ ఫ్యూచర్ ని ఆపలేము. వారం రోజులకు సరిపడా వంట చెయ్యటం మొదలెట్టాలి.
*Pancakes ఒక రకమయిన అట్లు. సామాన్యంగా పోద్దునపూట తింటారు.
*Hash Browns బంగాళా దుంపల ని చాలా సన్నగా తరిగి (Shredding) చేసి ఉడకపెట్టి పెనం మీద వేయిస్తారు.