ముందుమాట: మనలో చాలా మంది "సీ ఫుడ్ ఈటర్స్". ఇక్కడ "సీ" అంటే "see ". ఎదురుకుండా ఫుడ్ ఉంటే చాలు తినటం మొదలెట్టేస్తాము. అందులో కొంచెము రుచికరంగా నోటికి కనిపిస్తే ఇంక ఆగలేము. అల్లా బొక్కేసిన తరువాత బాధ పడతాం. అలా ఎందుకు జరుగుతుందో దానిని ఆపటం ఎట్లాగో తెలిపేదే ఈ పోస్ట్.
అమెరికాలో ఇండియానా స్టేట్ యునివర్సిటీ లో జీన్ క్రిస్తేల్లెర్ (Jean Kristeller, PhD) అనే ప్రొఫెసర్ గారు "బుద్ధిగా తినటం" (Mindfulness-Based Eating Awareness Training (MB-EAT)) అనే కోర్సు ని మొదలు పెట్టారు. దాని సారంశం ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.
పరిశోధనలలో తేలింది: మనకు రుచి తెలిసేది మొదటి ముద్దలోనే. తరువాత తినే ముద్దల్లో రుచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాకపోతే మనం ఆ మొదటి ముద్ద రుచి మనసులో మెదులుతుంటే ఆ జ్ఞాపకం తోటే మళ్ళా మళ్ళా లాగిస్తాము. దానితో ఎక్కువ తినటం అవుతుంది. (నా మాట: పదార్ధం రుచి ఎక్కడికీ పోదు. మనం తిన్నకొద్దీ ఆ పదార్ధంలో మన రుచి గ్రహింపు తగ్గుతూ వస్తుంది. ఈ ప్రక్రియ మన శరీరం తనకు తాను రక్షించుకోవటములో ఒక మార్గం అవ్వచ్చు. లేకపోతే అలా పొట్ట పగిలేదాకా తింటూనే ఉంటాము.)
పరిష్కారం: మీ మనస్సు మొదట అనుభవించిన(గ్రహించిన) రుచినే పట్టుకుని మిమ్మల్ని తినమని నిర్దేశిస్తోంది కాబట్టి మీ మనస్సుని ప్రతీ రెండు ముద్దలకీ రుచి ఎల్లా ఉందో అడుగుతూ ఉండండి. అంటే మీరు మీ మనస్సు లోని " పదార్ధ రుచి" సమాచారాన్ని తాజాగా (update) చేస్తున్నారు అన్నమాట. దీనివల్ల మీకు రుచి తగ్గినట్లు అనిపించటం మూలంగా మీ మనస్సు లో ఇంకా తినాలనే కోరిక తగ్గి పోతుంది.
ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రొఫెసర్ గారు ఇంకొక సలహా కూడా చెప్పారు. మీ మనస్సులో ఒక కొలమానం (Meter ) తయారు చేసుకోండి. మీరు భోజనం మొదలు పెట్టి నప్పుడు 1 తో ప్రారంభించి, మీ మనస్సుకి మీరు సుష్టుగా తిన్నాను అని అనిపించినప్పుడు ఆ కొలమానం 10 చూపించే టట్లు చెయ్యండి. అంటే మీరు మీ "Meter " ని calibrate చేస్తున్నారన్నమాట. ఇంక మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు నా కడుపు ఎంత నిండింది అని మీలో మీరు ప్రశ్నించుకొని మీ కొలమానం, 5 లేక 6 దగ్గరకు రాంగానే తినటం ఆపేయ వచ్చు.(సూచన: మీలో మీరు ప్రశ్నించు కొనే ముందర మీరు ఈ విధంగా భోజనం చేసేటప్పుడు మనస్సు తో మాట్లాడతారని ఇంట్లోవాళ్ళకి చెప్పండి.)
చివరిమాట: ఈ పద్ధతి డూయబుల్. మీరు చేయవలసిందల్లా భోజనము చేసేటప్పుడు మీ మనస్సుని అప్పుడప్పుడూ పొట్ట నిండినదో లేక ఎంతవరకు నిండినదో అడగటం. అది చెప్పినట్లు నడుచుకోవటం. లేకపోతే కుమ్మేసిన తరువాత బాధపడాల్సి వస్తుంది. మనకి కడుపు నిండే సంకేతం మనస్సు నుండి కొంచెం ఆలేస్యంగా (Delay తో ) వస్తుంది. అందుకని మనము చేస్తున్నదల్లా "కడుపు ఎంతవరకు నిండింది" అని మనకి తెలిపే సమాచారాన్నిమనస్సు నుండి రియల్ టైములో రాబట్టు కొని దాని ప్రకారం నడవటానికి ప్రయత్నిస్తున్నామన్నమాట.
మాతృక:
Mark A. Stengler interview with Jean Kristeller, PhD, professor of psychology at Indiana State University.
Mark A. Stengler interview with Jean Kristeller, PhD, professor of psychology at Indiana State University.