Monday, August 29, 2011

68 ఓ బుల్లి కథ 56 ---- ఇష్టమైనవి మితంగా తినటం ఎట్లా?

ముందుమాట: మనలో చాలా మంది "సీ ఫుడ్ ఈటర్స్". ఇక్కడ "సీ" అంటే  "see ". ఎదురుకుండా ఫుడ్ ఉంటే చాలు తినటం మొదలెట్టేస్తాము. అందులో కొంచెము రుచికరంగా నోటికి కనిపిస్తే ఇంక ఆగలేము. అల్లా బొక్కేసిన  తరువాత బాధ పడతాం. అలా ఎందుకు జరుగుతుందో దానిని ఆపటం ఎట్లాగో తెలిపేదే ఈ పోస్ట్.

అమెరికాలో ఇండియానా స్టేట్ యునివర్సిటీ లో జీన్ క్రిస్తేల్లెర్ (Jean Kristeller, PhD)  అనే ప్రొఫెసర్ గారు "బుద్ధిగా తినటం" (Mindfulness-Based Eating Awareness Training (MB-EAT)) అనే కోర్సు ని మొదలు పెట్టారు. దాని సారంశం ఇక్కడ చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను.

పరిశోధనలలో తేలింది: మనకు రుచి తెలిసేది మొదటి ముద్దలోనే. తరువాత తినే ముద్దల్లో రుచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాకపోతే మనం ఆ మొదటి ముద్ద రుచి మనసులో మెదులుతుంటే ఆ జ్ఞాపకం తోటే మళ్ళా మళ్ళా లాగిస్తాము. దానితో ఎక్కువ తినటం అవుతుంది. (నా మాట: పదార్ధం రుచి ఎక్కడికీ పోదు. మనం తిన్నకొద్దీ ఆ పదార్ధంలో మన రుచి గ్రహింపు తగ్గుతూ వస్తుంది. ఈ ప్రక్రియ మన శరీరం తనకు తాను రక్షించుకోవటములో ఒక మార్గం అవ్వచ్చు. లేకపోతే అలా పొట్ట పగిలేదాకా తింటూనే ఉంటాము.)

పరిష్కారం: మీ మనస్సు మొదట  అనుభవించిన(గ్రహించిన) రుచినే పట్టుకుని మిమ్మల్ని తినమని నిర్దేశిస్తోంది కాబట్టి మీ మనస్సుని ప్రతీ రెండు ముద్దలకీ రుచి ఎల్లా ఉందో అడుగుతూ ఉండండి. అంటే మీరు మీ మనస్సు లోని " పదార్ధ రుచి" సమాచారాన్ని తాజాగా (update) చేస్తున్నారు అన్నమాట. దీనివల్ల మీకు రుచి తగ్గినట్లు అనిపించటం మూలంగా మీ మనస్సు లో ఇంకా తినాలనే కోరిక తగ్గి పోతుంది.

ఎక్కువగా తినకుండా ఉండటానికి ప్రొఫెసర్ గారు ఇంకొక సలహా కూడా చెప్పారు. మీ మనస్సులో ఒక కొలమానం (Meter ) తయారు చేసుకోండి. మీరు భోజనం మొదలు పెట్టి నప్పుడు 1 తో ప్రారంభించి, మీ మనస్సుకి  మీరు సుష్టుగా తిన్నాను అని అనిపించినప్పుడు ఆ కొలమానం 10 చూపించే  టట్లు చెయ్యండి. అంటే మీరు మీ "Meter " ని calibrate చేస్తున్నారన్నమాట. ఇంక మీరు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు నా కడుపు ఎంత నిండింది అని మీలో మీరు ప్రశ్నించుకొని మీ కొలమానం, 5 లేక 6 దగ్గరకు రాంగానే తినటం ఆపేయ వచ్చు.(సూచన: మీలో మీరు ప్రశ్నించు కొనే ముందర మీరు ఈ విధంగా భోజనం చేసేటప్పుడు మనస్సు తో మాట్లాడతారని ఇంట్లోవాళ్ళకి చెప్పండి.)


చివరిమాట: ఈ పద్ధతి డూయబుల్. మీరు చేయవలసిందల్లా భోజనము చేసేటప్పుడు మీ మనస్సుని అప్పుడప్పుడూ పొట్ట నిండినదో లేక ఎంతవరకు నిండినదో అడగటం. అది చెప్పినట్లు నడుచుకోవటం. లేకపోతే కుమ్మేసిన తరువాత బాధపడాల్సి వస్తుంది. మనకి కడుపు నిండే సంకేతం మనస్సు నుండి కొంచెం ఆలేస్యంగా (Delay తో ) వస్తుంది. అందుకని మనము చేస్తున్నదల్లా "కడుపు ఎంతవరకు నిండింది" అని మనకి తెలిపే సమాచారాన్నిమనస్సు నుండి రియల్ టైములో రాబట్టు కొని దాని ప్రకారం నడవటానికి ప్రయత్నిస్తున్నామన్నమాట.




15 comments:

  1. e-mail from b.prasad
    Dear L.S.R., I enjoy reading your blogs very much. The latest is funny ("see food" and keep going at it"). Human nature is funny.
    While cooking, if I am feeling hungry, I keep munching on nuts or raisins. I finish all I cook, so there is no left-overs. Over the
    years, I know what I consume.

    ReplyDelete
  2. నమస్కారములు రావు గారూ !
    ఇష్టమైనవి తినడం గురించి భలేగా చెప్పారు.మనస్సుని అడిగి తెలుసుకుని తినేం తవరకు అంత టైము గడిపితే ఇంక ఏమీ తినలేము. తినడమే ఆగిపోతుంది. తిండి మీదనుంఛి మనసు మళ్ళిపోతుంది. ఒకే వస్తువుని ఒకటికి రెండు సార్లు తింటే ఇక ఇష్టం తగ్గి పోతుంది. " అంటే నాకు తెలిసి " లా ఆఫ్ డిమినిషిమ్గ్ యుటిలిటీ " అనుకుంటున్నాను. ఏది ఏమైనా " సరదాగా చక్కగా చెప్పారు. " అంటే తినగా తినగా గారెలు చేదైనట్టు .! బాగుంది . హేట్సాఫ్ !

    ReplyDelete
  3. @రాజేశ్వరి గారూ
    I can not believe this. నాకు తట్ట లేదు మనం లక్షసార్లు అనుకునే "తినగా తినగా గారెలు చేదైనట్టు .!" అనుకునేదాన్ని పట్టుకుని పరిశోధనలు చేసి ఏదో కొత్తది కనిపెట్టినట్లు "తిన్నకొద్దీ రుచి తగ్గుతుందని" సీను ఇచ్చారు. నిజంగా మన పూర్వులు ఎన్ని PhD లకి అర్హులో. లేబర్ డే వీకెండ్ బోస్టన్ ట్రిప్ బాగా అయ్యిందనుకుంటాను. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  4. తెలుగు లో క్షీణొప్రాంత సిద్ధాంతం అని అంటారనుకుంటాను కందండి . బావుంది మీ వ్యాసం !

    ReplyDelete
  5. @Sravya Vattikuti గారూ
    ఈ "క్షీణొప్రాంత సిద్ధాంతం" ముందరగా తెలిస్తే మనము PhD in Nutrition తెచ్చుకునే వాళ్ళమేమో. శ్రావ్య గారూ థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  6. నాకు తెలిసి " సాపేక్ష క్రమ క్షీణ సిద్ధాంతము " అని చదివిన గుర్తు. బోస్టన్ ట్రిప్ బాగా జరిగింది రావు గారూ ! ఇంకా బోలెడు మీ కలం నుంచి జాలువారాలని ఎదురు చూస్తూ మీ అభిమాని

    ReplyDelete
  7. "@రాజేశ్వరి గారూ
    I can not believe this. నాకు తట్ట లేదు మనం లక్షసార్లు అనుకునే "తినగా తినగా గారెలు చేదైనట్టు .!" అనుకునేదాన్ని పట్టుకుని పరిశోధనలు చేసి ఏదో కొత్తది కనిపెట్టినట్లు "తిన్నకొద్దీ రుచి తగ్గుతుందని" సీను ఇచ్చారు"
    ----
    హ హ హ హ
    on a second thought...

    "తినగా తినగా గారెలు చేదు,
    తినగా తినగా వేము తియ్యనుండు"

    తమాషాగా ఉంది కదా, ఏదో విలువైన జీవిత పాఠమొకటి ఆ రెండు బౌండరీల మధ్యలో దాగున్నట్లుంది :-)

    ReplyDelete
  8. "తినగా తినగా గారెలు చేదు,
    తినగా తినగా వేము తియ్యనుండు"
    --------------------
    @KumarN గారూ జీవితాన్ని వేదాంత భావనతో చూస్తే మీరు చెప్పింది చాలా నిజం సుఖంగా ఉండాలంటే ఆ మధ్యలో ఒక చోట ఉండాలి. కానీ scientific గ చూస్తే మీరు చెప్పిన రెండు సామెతలూ ఒకటే చూపెడుతున్నాయి. Taste Sensors మొదట సూచించిన రుచిని, రాను రానూ తగ్గుతూ చూపెడుతున్నాయి. చివరికి రుచి రివర్స్ అవుతోంది.

    అన్నట్లు చికాగో రావటం ఏమయింది. మా యింటి దగ్గర IHOP లో క్రిప్స్ తో కొత్త డిష్ చేస్తున్నాడు.

    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  9. సీ-ఫుడ్ భలే ఉందండీ. పొట్ట నిండా తినకుండా మీరు చెప్పినట్టు ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  10. మనం నిజంగా ప్రశ్నించు కుంటూ ఉంటె తినవలసిన వరకే తింటాము. అల్లాగే ఖర్చు పెట్ట వలసినంత వరకే ఖర్చు పెడతాము. జీవితం సుఖంగా ఉంటుంది. @శ్రీ గారూ థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

    ReplyDelete
  11. ఈ విషయం లో నేను పాటించే పధ్ధతి.. ఫలానా ఆరోగ్యకరమైనవి తినేసాకే నాకిష్టమైన ఫలానావి ముట్టుకుంటాను.. అని నియమం పెట్టుకోవటం.

    తినగ తినగ .. :) నైస్!

    ReplyDelete
  12. "తరువాత తినే ముద్దల్లో రుచి క్రమంగా తగ్గుతూ వస్తుంది." "మనం తిన్నకొద్దీ ఆ పదార్ధంలో మన రుచి గ్రహింపు తగ్గుతూ వస్తుంది. ఈ ప్రక్రియ మన శరీరం తనకు తాను రక్షించుకోవటములో ఒక మార్గం అవ్వచ్చు. లేకపోతే అలా పొట్ట పగిలేదాకా తింటూనే ఉంటాము."బాగా వ్రాసారండి.

    అందుకేనేమో , మన పెద్దలు ఆహారాన్ని నెమ్మదిగా , బాగా నమిలి తినాలని చెప్పటం కూడా జరిగింది. దంతాలతో నెమ్మదిగా నమిలి తినటం వల్ల ...... తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము, దంతాలూ దృఢంగా ఉంటాయి. ఇంకా జీర్ణవ్యవస్థ బాగుంటుంది. కానీ దురదృష్టం ఏమంటే ,

    నెమ్మదిగా తినటం వల్ల చాలా లాభాలున్నా కూడా, ఈ రోజుల్లో చాలామందికి.. నెమ్మదిగా ఆహారాన్ని తీసుకునేంత తీరిక ఉండటం లేదు ..

    ReplyDelete
  13. @కృష్ణప్రియ గారూ నా ప్రాబ్లం ఏమిటంటే సెకండ్ హేల్పింగ్స్. ప్లేట్ లంచ్ తో సరిపెట్టుకోవాలి, లేక చర్నక్కోలుతో ఎవరన్నా(ఇంట్లో దేవత) పక్కన కూర్చోవాలి. ఇదంతా ఎందుకని నాలో నేనే మనస్సుతో మాట్లాడుకోటం "కడుపు నిండిందా నాయనా" అనుకోటం ప్రారంభించాను. ఇట్ ఈస్ హార్డ్ బట్ ఇట్ వర్క్స్.
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete
  14. నెమ్మదిగా తినటం వల్ల చాలా లాభాలున్నా కూడా, ఈ రోజుల్లో చాలామందికి.. నెమ్మదిగా ఆహారాన్ని తీసుకునేంత తీరిక ఉండటం లేదు ..
    ---------
    కొత్త నాగరికతకు అలవాటు పడ్డాము. విచారకరం.
    @anrd గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete