మానస లీల
రచన: లక్కరాజు శివ రామకృష్ణారావు
రచన: లక్కరాజు శివ రామకృష్ణారావు
మురహరి రావు గారి అమ్మాయి లీల అంటే నా కెందుకో చాలా ఇష్టం. కోల ముఖం. చక్కని కనుతీరు. ఎర్రగా బుర్రగా ఉంటుంది. నేను ఎప్పుడూ లీలతో మాట్లాడినట్లు గుర్తు లేదు కానీ ఆ అమ్మాయంటే అదొక ఇది. సావిత్రీ గౌరీ దేవి నోములకి మా అమ్మతో నేను వెళ్తే తనూ వాళ్ళమ్మతో వచ్చేది. రోజుకో వంట చేసేవారు - అప్పాలనీ, కలగాయ పులుసనీ. పూర్వకాలంలో వ్రతాలు చేయించి వంటలు నేర్పించే వాళ్ళనుకుంటాను. నేను అందుకనే వ్రతాలు చేసుకున్న వాళ్ళనే పెళ్ళి చేసుకోవాలని తీర్మానించుకున్నాను. ఎంచక్కా అప్పాలు, బూరెలు, గారెలు, పరమాణ్ణం తింటూ ఉండచ్చు. ఏమో లీల నాకెందుకో చాలా నచ్చింది. పట్టు పరికిణీ కట్టుకుని పసుపు కాళ్ళతో పేరంటానికి వచ్చేది. ఆ కాలంలో పిల్లలందరం పేరంటానికి అమ్మలతో వెళ్ళేవాళ్ళం. ఒక వారం రోజులు "ఏమన్నా" తినటానికి చలిమిడి, శనగ గుగ్గిళ్ళు, కొబ్బరి ఉండేవి. ఇన్ని పప్పులు తిన్నా మేమెవ్వరం లావు ఎక్కలేదు! బహుశ ఎక్కువ తిరిగే వాళ్ళమేమో అప్పుడు.ఏదో రూపేణా సినిమాలకనో, వేచ్చాలకనో రోజూ తెనాలి నడిచి వెళ్ళి వస్తూ ఉండే వాళ్ళం.
ఏమిటో ఆరోజులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. ఆ రోజు లీలా వాళ్ళతో వన భోజనానికి వెళ్దామని పదిగంటలకే గ్లాసు పుచ్చుకుని బయట నుంచున్నాను. "అప్పుడే బయల్దేరా వేరా! ఇప్పుడే గాడి పొయ్యి తీస్తున్నారు" అని బాబాయి అంటే సిగ్గుపడి లోపలికి వెళ్ళాను. నిమిషానికి ఒకసారి ఇంటిలోంచి తొంగి చూస్తూ లీలా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి లీల ఎదురుకుండా కూర్చున్నాను. ఆ జాకెట్టుతో ఆపరికిణీతో ఎంతో హుందాగా ఉంది! సుతి మెత్తని వేళ్ళతో ముద్దలు కలుపుకుని అలా నోట్లో పెట్టుకుంటూ ఉంటే, అబ్బా నాక్కూడా ఆ చేతులతో ముద్దలు పెట్టించుకోవాలని అనిపించింది. గాడి పొయ్యి మీద చేసిన గుమ్మడికాయ పులుసూ, వంకాయ కూరా ఎంత బాగున్నాయో! సాయంత్రం పూట స్నానం చేసి చాకలాడు తెచ్చిన బట్టలు వేసుకుని జామ చెట్టెక్కి కూర్చునే వాడిని. కింద లీల ఆడ పిల్లకాయలతో తొక్కుడుబిళ్ళ ఆడుతూ ఉండేది. నన్ను జామకాయ కోసి ఇమ్మని అడుగుతుందని అనుకునేవాణ్ణి. ఎప్పుడూ అడగలేదు.
మనుషులమీద మమకారం పుట్టటానికి వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉండక్కరలేదేమో! ఒకసారి మా ఇంట్లో వాళ్ళందరం "స్వర్గసీమ" సినిమా చూడటానికి తెనాలి వెళ్ళాము. ఎల్లాగూ అందరం ఇక్కడికి వచ్చాము కదా అని చెప్పి దగ్గరలో ఫోటో స్టూడియో ఉంటే దానిలోకి వెళ్ళాము. ఫోటో తీసే వాడు నల్ల ముసుగులోంచి మమ్మల్ని చూస్తూ మమ్మల్ని సరీగ్గా కూర్చోపెట్టాడు. నాకు బాగా గుర్తు. నేను సైడు ఫోజులో బాగుంటానని చెప్పి, నన్ను చివర నుంచోపెట్టి సైడు ఫోజు ఇప్పించాడు. ఎంతో బాగున్నాను ఆ ఫోటోలో. అందుకని లీల చూస్తుందని లీల వాళ్ళింటి ముందర ఏదో పని కలిపించుకుని సైడు ఫోజులో నడిచే వాణ్ణి. ఇంత చేసినా లీల నాతో ఎప్పుడూ మాట్లాడలేదు.
దసరా అప్పుడు పంతుళ్ళతో పప్పు బెల్లాలకి లీలా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు "పంతులికి ఇవ్వాలి ఐదు వరహాలు పిల్లలకి పెట్టాలి పప్పు బెల్లాలు" అని గట్టిగా రాగ యుక్తంగా కూడా పాడాను. చివరికి వేసంకాలం శలవలకి మా తాతయ్యగారి వూరు వెళ్ళబోయే ముందర లీలా వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళాము. లీలని కూర్చోపెట్టి పేరంటం చేసి చిమ్మిరి ఉండలు పెట్టారు. భలే బాగున్నాయి చిమ్మిరి ఉండలు.
ప్రతీ వేసంగి శలవలకీ మా తాతయ్యగారి ఊరు నెప్పల్లి వెళ్తాము. చెరుకు బళ్ళని ఉయ్యూరు పంచదార ఫాక్టరీకి తీసుకుపోతూ, కరణంగారూ చెరుకు, ఫాక్టరీకి తీసుకు వెళ్తున్నామని నాలుగు గడలు ఇంటిముందు పడేసేవాళ్ళు. వేసవిలో తాటి ముంజలు ఎన్ని తినే వాళ్ళమో. మా తాతయ్యతో వెళ్లి ఎంతమందికో అక్షరాభ్యాసం చేశాము. వెళ్ళినప్పుడల్లా పలకా బలపము వచ్చేది. మా తాతయ్యతో మొదట అక్షరాలు దిద్దిన వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారో !
శలవలయిన తరువాత కఠారం వచ్చాము. మళ్ళా మామూలు పనులు మొదలు. మా పెద్దనాన్నగారు స్కూల్ హెడ్మాస్టారు. మేము పొద్దున్నేలేచి చద్దన్నం తిని స్కూల్ తెరిచి ఫస్టు బెల్ కొట్టేవాళ్ళం. సాయంత్రం చివరి పిరియడ్లో స్కూల్ వెనుక అందరిచేతా ఎక్కాలు వంత పాడించే వాళ్ళం. అందుకనే ఎక్కాలు ఇంకా గుర్తున్నాయి. శలవల్లో బాగమ్మ నాకోసం తేగలు దాచిపెట్టింది - శీనయ్య కొడుకుని కదా నేను. మా నాన్న బాగమ్మ కొడుకూ మంచి స్నేహితులట. పాపం బాగమ్మ కొడుకు మునసబు చచ్చిపోయాడు ! నేనంటే బాగామ్మకు చాలా ఇష్టం. పాతిపెట్టిన తాటి టెంకలు తీసి పగలకొట్టి పెట్టేది. ముంతలో అన్నం తీసి వెల్లుల్లి కారం నెయ్యి కలిపి తినమని ఇచ్చేది. ఎంతబాగుందేదో వెన్నపూస వేసుకు తింటూంటే. మీగడపెరుగు. అబ్బా! ఎందుకో ఎవ్వరికీ చెప్పవద్దనేది. ఈ హడావుడిలో లీల కనపడటల్లేదు అనే సంగతి పట్టించుకోలేదు. ఏదో శలవలకి ఎక్కడికన్నా వెళ్ళినదేమో అని ఊరుకున్నాను. తరువాత చాలా రోజులకి కనపడకపోతే మా అమ్మ నడిగాను. వాళ్ళు తెనాలి వెళ్ళిపోయారుట.
మళ్ళా లీలని చూడలేదు. మాకు ఉద్యోగరీత్యా ఊళ్లుమారటం, దేశాలు తిరగటం తోటి రోజులూ సంవత్సరాలూ గడిచిపోయాయి. రిటైరు అయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. కొన్ని రోజులు అమ్మతో ఉందామని ఇంటికి వెళ్లాను. పొద్దున్నే లేచి పాల పేకెట్లు తీసుకురావటం ఆ తరవాత మార్కెట్ కెళ్ళి కూరగాయలు తీసుకురావటం. పేపరు చదివి స్నానం చేసి భోజనం చేయటం. మళ్ళా పేపరు రెండోసారి చదవటం, నిద్రపోయి నాలుగు గంటలకు లేవటం. కాఫీ తాగి షికారు కెళ్ళి సాయంత్రం ఇంటికి చేరటం. పిచ్చా పాటీ తరువాత నిద్ర. ఇదీ వరస రోజూ.
ఆ రోజు బజారునుండి వచ్చి వరండాలో ఈజీ చైర్ లో కూర్చున్నాను. హాలు లోనుండి మాటలు వినపడుతున్నాయి. నేను వచ్చిన శబ్దం విని అమ్మ "మురహరిరావు గారి అమ్మాయి లీల నన్ను చూడటానికి వచ్చిందిరా" అన్నది. లేచి కిటికీలోనుంచి చూశాను. పెద్ద ఎక్కువగా మారలేదు. అదే కోల ముఖం. అదే వర్చస్సు. 30 ఏళ్ళ సంసారిక బడలికలు మోహంలో కొద్దిగా కనపడుతున్నాయి. తలమీద తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలతో దోబూచులాడు తున్నాయి. పిల్లలు పెద్దవాళ్ళయి ఎవళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారల్లె ఉంది, ఎక్కడలేని తెరిపి మొహంలో కనపడుతోంది. ఒక్కసారి మా కళ్ళు ఏవో మాట్లాడుకున్నాయి. తృప్తిగా లేచి కుర్చీలో కూర్చున్నాను.
నాకు లీలతో ఏదో మాట్లాడాలని ఉంది. కానీ ఏమి మాట్లాడాలి ? ఎంతో కావాలనుకున్నది హఠాత్తుగా ఎదురు పడితే మాట్లాడటానికి మాటలు రావు. కాఫీ టిఫ్ఫెన్లు అయిన తరువాత ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. కఠారం నుండి వెళ్ళిన తరువాత ఏమి జరిగిందో అంతా విన్నాను. తన పిల్లలు ఏం చేస్తున్నారో విన్నాను. రోజూ తనేం చేస్తోంది చెప్పింది. నా గురించి కూడా అడిగింది. ఇంక మాటలు అయిపోయినట్లున్నాయల్లె ఉంది " వెళ్ళొస్తా నండీ మామ్మ గారూ" అనే మాటలు వినపడ్డాయి..
నాకు చెమటలు పోస్తున్నాయి. ఇంకొక్క క్షణంలో లీల నాముందు నుంచి వెళ్తుంది. క్రికెట్ కోర్టులా ఓవల్ షేప్ లో ఉన్న నా బట్టతల, దాద్దామన్నా వీలు లేకుండా బయటకు వస్తున్న బొజ్జ. నెరసిన మీసాలతో దాగని వయసు. నేను ఎదుట పడలేను. లీల గుమ్మం దాటి బయటకు వస్తోంది. హఠాత్తుగా నాకు చిన్నప్పుడు ఫోటోగ్రాఫర్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే సైడ్ ఫోజు పెట్టేశాను, లీల కనుమరుగయ్యేదాకా. మళ్ళా ఎప్పుడు చూస్తానో లీలని.
---------
ఈ నా చిన్న కథ మార్చ్ 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు (చేతి వ్రాతతో). నా కెందుకో ఈ వేలెంటైన్ డే కి తెలుగులో టైపు చేసి దీన్ని పోస్ట్ చెయ్యాలనిపించింది.
మీ కధ [ మీరు వ్రాసిన కధ ] చాలా బాగుంది . నిజమే చిన్న నాటి జ్ఞాపకాలు తల్చు కుంటే ఏదో హాయి . మనసుకి వింత అనుభూతి.
ReplyDeleteఆ చిన్న నాటి అనుభవాలు వ్రాయాలను కుం టూనే అశ్రద్ధ. " తాత గారితో గుఱ్ఱం మీద తిరగడం , పొలం లొ తాటి ముంజలు తినడం , లాంటి మధుర మైన క్షణాలు ప్చ్ ! ఇక జీవితంలో మళ్ళీ రావు కదా ! సుభాష్ . కొన్ని ఏళ్ళు వెనక్కి పంపారు. హేట్సాఫ్ .
పాత రోజులు తలుచుకుంటే గమ్మత్తుగా ఉంటాయి. మన పాత అనుభవాలని చాలావరకూ తిరిగిపొందాలేం. కానీ ఈ సంగతి అప్పుడు మనకి తెలియదు. అంతా విచిత్రం.
ReplyDelete@రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
nice story....
ReplyDelete@maha గారూ
ReplyDeleteమనం రోజూ చూసే వాళ్ళల్లో కొందరు మనకి చాలా బాగా నచ్చుతారు. ఎందుకో చెప్పలేము కానీ వాళ్ళంటే మనకి ఇష్టం. ఇది జీవిత సత్యం కదా.
కధ మీకు నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.