Monday, February 6, 2012

80 ఓ బుల్లి కథ 68 --- నా కంప్యూటర్ బాగయ్యిందోచ్

రచన: లక్కరాజు శివ రామకృష్ణా రావు.

జీవితంలో సుఖానికి అలవాటుపడ్డ ప్రాణానికి అమాంతంగా కష్టాలు వస్తే జీవితం తారుమారు అవుతుంది. రెండువారాల క్రిందట నా డస్క్ టాప్ కంప్యుటర్ పని చెయ్యటం మానేసింది. కొంచెముసేపు పనిచేసి దానంతట అదే ఆగిపోతుంది, ఎందువల్ల పోతున్నానో చెప్పకుండా పోతోంది. రిపైర్ వాడి దగ్గరకు తీసుకు వెళ్ళుదామంటే,  ఇక్కడ అమెరికాలో రిపైర్ వాడు తీసుకునే డబ్బులతో రెండు కొత్త కంప్యూటర్లు కొనుక్కోవచ్చు.

రిటైరు అయ్యి ఒక పద్ధతికి అలవాటయిన జీవికి పద్ధతులు మార్చుకోవటం చాలా కష్టం. ఏమి చెయ్యాలో తోచక కాలుగాలిన పిల్లిలా పైకీ క్రిందకీ తిరుగుతున్నాను. రోజూ కంప్యూటరే లోకంగా చేసుకుని భోజనానికీ కాఫీకీ పిలుపు వస్తే కానీ క్రిందకు వెళ్ళే వాడిని కాను. ఇప్పుడు ఏమి చెయ్యాలో తోచటల్లేదు.

నేను ఊర్కేనే కూర్చున్నానని ఇంట్లో తెలిస్తే నా పని బేజారు అవుతుంది. ఊర్కేనే ఉన్నారుగా నేను పూజ చేసుకుంటున్నాను కొచెం రైసు కుక్కర్ లో అన్నం పడెయ్య కూడదూ. ఫోనులు వస్తే తీసుకోండి. కూర మాడుతోంది కొంచెం స్టవ్ తగ్గించండి. పోనీ హెల్ప్ చేద్దామని చేస్తే, ఎక్కడలేని కోరికలూ పుట్టుకు వస్తాయి. మళ్ళా ఆ కోరికలు కూడా తీర్చాల్సి వస్తుంది. సాయంత్రం ఉల్లిపాయతో వంకాయ కూర చేస్తే బాగుంటుంది (మీరు). రేపు పోద్దునకి సేమ్యా ఉప్మా బాగుంటుంది. మీరు ఆ ఉప్మా చాలా బాగా చేస్తారు. ఇలా హేల్పెర్ గ మొదలుపెట్టినది చివరికి నా పని కేరాఫ్ వంటిల్లు లాగా తయారవుతుంది.

మొన్న ఎదో పాపం కష్ట పడుతోంది కదా అని ఒక వారం కూరలు తరగటానికి వప్పుకున్నాను. ఉల్లిపాయలు చిట్ట  చివ్వరకి తరగండి లేకపోతే ఇల్లంతా వాసన వస్తుంది. కాలీఫ్లవరు సన్నగా తరగవోకండి, చేత్తో మొగ్గలుగా విరవండి. కాబేజీ ఇదుగో ఈ విధంగా సన్నగా తరగాలి.  బ్రోకలి మరీ పెద్ద ముక్కలు చేశారు, పెసరపప్పు వేసి చేస్తాను సరీగ్గా కలవదు. బ్రస్సెల్ స్ప్రౌట్స్ కాబేజీ లాగా తరగండి. కంది పప్పు కలిపి కూర చేస్తాను. కుకుంబర్ చెక్కు తీయండి లేకపోతే పులుసులోకి బాగుండదు (ఆవిడకి). దొండకాయలు నిలువుగా తరగండి చక్రాలుగా కాదు. ఆ బానిస బ్రతుకు తలుచుకుంటే వళ్ళు గగుర్పాటు చెందుతుంది. "చెవిలో ఫోను పెట్టుకుని వంట చెయ్య వోకు. ఉప్పూ కారాలు సరీగ్గా పడవు." అని అరవాలనిపిస్తుంది. కానీ నోరు పెగలదు. ఇంక నేను దీనిని గురించి తలుచుకోలేను. గది తలుపులు వేసుకు కూర్చున్నాను. కానీ ఎంతసేపని కూర్చుంటాను? ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంది. 

నాకు కావలసింది వంటగదా, కొత్త కంప్యుటరా అనే సమస్య మీద చాలా ఆలోచించాను. వంటగదికి వెళ్ళటం ఇష్టం లేదు. కొత్త కంప్యుటర్ అయితే గవర్నమెంటు వాళ్ళు నెల నెలా ఇచ్చే భత్యంలో కొంత భాగం ఎగిరిపోతుంది. అన్ని యప్రువల్స్ తీసుకుని బడ్జటులో పెట్టి కంప్యుటర్ కొనుక్కునే సరికి మళ్ళా క్రిస్మస్ వస్తుంది. అసలుకే మోసం రావచ్చు, అసలు అంత అవసరమా అని  రిక్వస్టు డినై  చెయ్యవచ్చు కూడా. ( అదేమీ తిండి పెట్టదు, రోజంతా దాని ఎదురుకుండా కూర్చుంటారు, అనారోగ్యం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కరెంటు వేస్టు, డబ్బుల వేస్టు.) ఏదో మార్గం ఆలోచించాలి.

నేను దీన్ని బాగు చెయ్యలేనా ? అని నా అంతరాత్మ ని ఒక ప్రశ్న వేశాను. సమాధానం వచ్చింది. వరల్డ్ వార్-2 లో మిగిలిపోయిన మాగ్నెట్ తో స్పెక్త్రోమేటర్  తయారు చేసి డాక్టరేట్లు తయ్యారు చేసిన పరిశోధన శాల నుండి వచ్చావు నువ్వు. ఈ ముసలి కంప్యుటర్ ని వదలలేక సంవత్సరాల బట్టీ దానితో ఏదో విధంగా సాగిస్తూనే ఉన్నావు. ఇప్పటికే రెండు మూడు సార్లు హార్డ్ డిస్క్ ని ఫార్మాట్ చేశావు. దాని మెమరీ(RAM) ని కూడా పెంచావు. ధైర్యే సాహసే లక్ష్మి. ఆలోచించు. వెలుగు చూస్తావు. అని అంతర్వాణి  చెప్పింది. 

నాకు ఇంకా ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆరోజు జరిగిన సంగతులన్నీ పరిశీలించటం మొదలు పెట్టాను. పొద్దున్నే కాఫీ తాగి పైకొచ్చి ఖుషీగా కంప్యుటర్లో ఈనాడు వార్తలు చూస్తున్నాను. మధ్యలో దానంతట అదే ఆగి పోయింది. ఏమిటా ఇది అని మళ్ళా స్టార్ట్ చేశాను. ఒక నిమిషం తర్వాత మళ్ళా అల్లాగే అయ్యింది. రెండు మూడు సార్లు అల్లాగే చేశాను. రాను రాను విండోస్ వస్తుంటేనే ఆగి పోవటం మొదలయ్యింది. ఆలోచిస్తున్నాను. నేను శాపాలు తాపాలూ నమ్ముతాను. "For every action there is an equal and opposite reaction" అన్న దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. (పెళ్ళి చేసుకున్న తరువాత చాలా సూత్రాలు తెలుస్తాయి, నమ్మకాలు పెరుగుతాయి.)

దిష్టి తగలటం, శాపనార్ధాలు పెట్టటం రియాక్షనుల క్రిందకు వస్తాయి కాబట్టి ఇవ్వాళ ఎప్పుడో ఎక్కడో ఎవరికో నేను వాళ్ళ దృష్టిలో తప్పుగా గ్రహించబడిన యాక్షను చేసి  ఉండాలి. ఏమి చేశానబ్బా ఇవ్వాళ. ఎవర్ని నొప్పించాను? అనే దృష్టి తో ఆలోచించటం మొదలెట్టాను.

ఏమితప్పు చేశాను? ఎవరు నన్ను పొద్దున్నే శపించారు? ఇంట్లో ఉన్నది ఇద్దరమే కాబట్టి దాన్ని కనిపెట్టటం చాలా తేలిక. ఆలోచిస్తే పొద్దున మా ఆవిడ కూరలు తరిగి పెట్టమని అరుస్తూ ఉన్నా, వినపడనట్లు నటిస్తూ కాఫీ తాగి పైకి వచ్చేశాను. అదే అయ్యుంటుంది.  ఆడవాళ్ళ శాపాలు చాలా గట్టివి. వెంటనే నవ్వు ముఖంతో కిందకి వెళ్లి కూరలు తరగనా అన్నాను. మౌనంగా పోపులో వేగుతున్న వంకాయకూర వేపు చూపటం జరిగింది. ఆ చూపులోనే తేలిపోయింది సమాధానం. శాప విముక్తికి ఏమి చెయ్యాలో అర్ధం కావటల్లేదు. కొంతన్నా ఫలితం వస్తుందని  కూర కలపటానికి ప్రయత్నించాను. భీకరమైన మొహం చూసి భయపడ్డాను. ఐ యాం డూమ్డ్. 

ఏం చెయ్యాలి?  కంప్యూటర్ బాగు చెయ్యటం మీద నేను ఇదివరకు వ్రాసిన పోస్ట్ లు గుర్తుకి వచ్చాయి. అన్ని చిట్కాలు   ట్రై చేసాను. ఒక్కటి కూడా ఉపయోగపడలేదు. విండోస్ వస్తుంటే safe mode లోకి వెళ్ళ లేక పోయాను. ఆపరేటింగ్ సిస్టం లేకపోతే  Restore Point కి వెళ్ళటం కుదరదు. విండోస్ కరప్ట్ అయ్యినదనుకుని బేకప్ డిస్క్ తో ప్రయత్నించాను. అసలు ఆపరేటింగ్ సిస్టమే ( విండోస్ xp ) లోడ్ అవటల్లేదు. నా దగ్గర DOS ఫ్లాపీ ఉంటె దానితో ప్రయత్నించాను Format C: చేద్దామని. లోడ్ అవలేదు. అసలు మాటా పలుకు లేకుండా జారుకుంటోంది.

పెళ్ళాల శాపాలు ఇంత గట్టిగా ఉంటాయని తెలిస్తే పొద్దున్నేకూర తరిగి ఇచ్చేసే వాడిని. తప్పొప్పుకుంటే శాపాలు పోతయ్యని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఏదో విధంగా ఈ సమస్య నుండి బయటపడితే ఇకనుండీ పొద్దున్నే పెళ్ళాం చెప్పిన పనులు తప్పకుండా చేస్తానని తలుపు గడియపెట్టి లెంపలేసుకున్నాను. నాకు గిల్టీ కాన్క్షన్సు పోయింది. నా మనస్సు కుదుట పడింది. గమ్మత్తుగా కారు మేఘాలన్నీ తొలగి పోయాయి. జయం మనదే అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక ధైర్యంతో ఆలోచించటం మొదలు పెట్టాను.

అసలు విండోస్ రాకుండానే  కంప్యూటర్ ఆఫ్ అవుతోంది. అదికూడా ఒక  వేరు వేరు సమయములలో పోతోంది.  ఒకసారి వెంటనే పోతుంది. ఒకసారి కొంచెం సేపు తరువాత. ఆన్  చెయ్యగానే కంప్యుటర్ చేసే మొట్ట మొదటి పని ఏమిటి? జాగర్తగా ఆలోచిస్తున్నాను.

కంప్యుటర్ కి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ ) చాలా ముఖ్యం. కంప్యుటర్ లో ఉన్న అన్ని భాగాల్తోటీ కలిసికట్టుగా పని చేయించేది ఇదే. అది మొట్టమొదట హార్డ్ డిస్క్ లోనుండి కంప్యుటర్ RAM లోకి లోడ్ అవుతుంది. RAM లో ఉంటే పనులు వేగంగా జరుగుతాయి కనుక. ఇప్పుడు ఆపని జరగటల్లేదు. అందుకని ప్రాబ్లం ఈ మూడింటిలోనే ఉండి ఉండాలి. హార్డ్ డిస్క్, విండోస్, RAM .

బాకప్ డిస్క్ లో నుండి కొత్త ఆపరేటింగ్ సిస్టం పెడదామంటే తీసుకోవటల్లేదు. బహుశా  RAM రిజెక్ట్ చేస్తోందేమో. కంప్యుటర్ లోకి వెళ్ళేవి అన్నీ RAM ద్వారా నే వెళ్తాయి. RAM సరి లేక పోతే కంప్యుటర్లో ఏ పనీ జరగదు. అందుకని RAM పాడయి ఉంటుందని  తేల్చుకున్నాను. ఇది కాకపోతే సెకండ్ గెస్, లాంగ్ షాట్, హార్డ్ డిస్క్ పాడవ్వచ్చు. నాలుగేళ్ల క్రిందట RAM expand చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. అది పాడయ్యిందేమో!! 

ఎటాక్ ప్లాన్ తయ్యారయ్యింది. కంప్యుటర్ ఓపెన్ చెయ్యటం. కొత్తగా పెట్టిన RAM ని బయటికి తీసి, కంప్యుటర్ తో వచ్చిన RAM తో కంప్యుటర్ ని స్టార్ట్ చెయ్యటం. కంప్యుటర్ పనిచేస్తే RAM ప్రాబ్లం లేక పోతే హార్డ్ డిస్క్ ప్రాబ్లం.

స్క్రూ డ్రయివర్లు తెచ్చుకుని కూర్చున్నాను. స్క్రూలు ఎక్కడా కనపడలేదు. నేను కంప్యుటర్ ఓపెన్ చేసిన కాలంలో స్క్రూ డ్రయివర్ తో ఓపెన్ చేసేవాణ్ణి. ఎన్ని తెలివితేటలు ఉన్నా మెకానికల్ బుర్ర లేకపోతే వృధా. సింకులో  నీళ్ళు పోకపోవటం దగ్గరనుండీ అరమరాల కిట్లు కొని బిగించటం వరకూ మా ఆవిడే చూసుకుంటుంది. ప్రస్తుతం మాటలు లేవు. అడగటానికి కొంచెం సిగ్గూ భయమూ రెండూ అడ్డుకున్నాయి. దానికితోడు ఆవిడకి  కంప్యూటర్ బాగుకి నాకు దోహదం చెయ్యాల్సిన అవుసరం లేదు. ఆవిడ లాప్ టాప్ ఆవిడకుంది. దాన్ని నేను ముట్టుకోనని ఆవిడకి బాగా తెలుసు. వేలుతో కంప్యుటర్ ఆడించటం నాకు చేతకాదు. 

ఆపద్భాన్ధవా  ఏమి చెయ్యాలి? మనము మంచిపనులు చేస్తూ ఉంటె దేముడు ఏదో రూపేణా తప్పకుండా ప్రత్యక్ష మవుతాడు. హటాత్తుగా ఫోన్ మోగింది. మా అబ్బాయి న్యూయార్క్ నుండి వీకెండ్ కి వస్తున్నాడు. RAM expand చేసింది కూడా వాడే. వాడు సర్ప్రైజ్ కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేసి పెట్టాలో వెంటనే చెప్పేశాను. నాలుగు రోజులు కంప్యూటర్ లేక పోతే ఫరవా లేదు ఏదోవిధంగా బిజీగా ఉన్నట్లు నటించగలను. వంగిపోతూ ఎగస్పార్టీకి సాక్షాత్ నమస్కారం చెయ్యవలసిన అవసరం లేదు.

మర్నాడు వీకెండ్ కి,  రెడ్ ఐ ఫ్లయిట్ లో న్యుయోర్క్ నుండి మా వాడు దిగాడు. మొదట పరిష్కరించాల్సిన సమస్య నాదే.  అయిదు నిమిషాల్లో మా అబ్బాయి కంప్యూటర్ ఓపెన్ చేసి RAM బయటికి తీసాడు. డాక్టరేట్ చేసిన వాళ్ళు పనులు చేస్తుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది. డస్క్ టాప్ కంప్యుటర్ చాస్సిస్ మీద ఒక లీవర్ ఉంటుంది. అది నొక్కితే పై ప్లేటు వచ్చేస్తుంది. విషయం తెలిస్తే ఎంత సులువు. మీరు కంప్యుటర్ ఓపెన్ చేస్తే వాక్యుం క్లీనర్ పక్కన పెట్టుకోండి. బోలెడంత బూజు, దుమ్మూ ధూళి ఉంటుంది తీసెయ్యండి.  

యురేకా! కంప్యుటర్, కంప్యుటర్ తో వచ్చిన ఒరిజినల్  RAM తో పని చేస్తోంది. బయట గట్టిగా స్నో పడుతోంది. ఆరోజు బయటకు వెళ్ళటానికి కుదరదు. ఇది చికాగో వింటర్. మర్నాడు CompUSA కంప్యుటర్ స్టోర్ కి వెళ్లి ఒక గిగ్ RAM కొనుక్కొచ్చి పెట్టాడు (ఈ కంప్యుటర్ అంతకన్నా తీసుకోదు.). ఖర్చు ముప్పైరెండు  డాలర్లు. రెండువారాలనుండీ టెస్ట్ చేస్తున్నాను. కంప్యుటర్ బాగానే పని చేస్తోంది.

కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం తయారు అయ్యింది. వ్యాక్యుం చేస్తుంటే కంప్యుటర్ లో నుండి రెండు క్లిప్పులు  ఊడి పడ్దాయి. అవి లేకుండానే కంప్యుటర్ నడుస్తోంది కాబట్టి అవి ముఖ్యమయినవి కాక పోవచ్చు అనుకున్నాము. ఇంటర్నెట్ లో వెతికితే అవి హీట్ సింక్ ని అణచి పెట్టి ఉంచే క్లిప్పులని తేలింది. కంప్యుటర్ నిలబెడితే హీట్ సింక్ క్రిందపడుతున్దేమోనని కంప్యుటర్ ని పడుకో బెట్టి పని గడుపు కుంటున్నాను.  

నుంచుని చేస్తే నాకేటి. పడుకుని చేస్తే నాకేటి. పనిచేస్తుంటే నా కిష్టం. 

                                              ---------

కంప్యుటర్ మీద నా ఇతర పోస్టులు:

21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి
http://mytelugurachana.blogspot.com/2010/05/21-9.html

కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే
22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే
http://mytelugurachana.blogspot.com/2010/05/22-10.html

కంప్యూటర్ మొరాయిస్తే
23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే --

40 ఓ బుల్లి కథ 28 -- కంప్యూటర్ కు గ్రహణం పట్టిన రోజు --
http://mytelugurachana.blogspot.com/2010/12/40-28.html

12 comments:

 1. మొత్తానికి సాధించారు రావు గారు :) నైస్ ! మరీ ముఖ్యం గా మీరు వంటగది కి భయపడి కంప్యుటర్ ని బతిమాలటం బావుంది :)))

  ReplyDelete
  Replies
  1. రోజూ వంట చెయ్యాలంటే కొంచెం కష్టమండీ. ఇంట్లో ఆడవాళ్ళు రోజూ వంట చేస్తుంటే చూడటానికి కష్టంగా ఉంటుంది. కానీ నాకయితే రోజూ ఇంట్లో చేస్తేనే తినటం ఇష్టం. ఏమిచేస్తాం ద్వంద ప్రమాణాలు. సానుభూతిగా నేను అప్పుడప్పుడూ వంట చేస్తూ ఉంటాను.

   మీ మార్కెట్ లో దొరికితే మా వంటింటి నుండి వచ్చిన రెండు కాంబి నేషన్ లు ట్రై చెయ్యండి, బ్రోకలి + పెసరపప్పు, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ + కందిపప్పు, పోపు లో వెయ్యటమే,కూరలో నీళ్ళు పోయే దాకా స్టవ్ మీద ఉంచండి. పప్పులు రెండూ విడివిడిగా కూరలో వేసేముందు ఒక గంట వడపప్పు లాగా నాన వెయ్యాలి.
   @శ్రావ్య గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

   Delete
 2. Suuuuper మాష్టారూ, I thoroughly enjoyed it :-)

  "ఐ యాం డూమ్డ్. " - హ హ హ హ Any-which-way we go, we are always doomed గురువు గారూ :-))

  ReplyDelete
  Replies
  1. నాకు రోజూ కామెంట్స్ చదువుకోటం చాలా ఇష్టం. అందులో Suuuuper అనేవి ఇంకా ఇష్టం. అయినా ఎప్పుడో అప్పుడు రిప్లయి ఇవ్వాలికదా. అన్నట్లు మర్చేపోయాను, ఈ డెస్క్ టాప్ ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో, నాకు కొత్త కంప్యుటర్ కావాలని మా యింట్లో పిటీషన్ పెట్టబోతున్నాను, నేను కంప్యుటర్ ముందర కూర్చోటం కొందరికన్నా సంతోషం ఇస్తోందని మీ కామెంట్ ప్రూఫ్ క్రింద ఉంచి.

   @KumarN గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

   Delete
 3. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.

  కథ అంతా చాలా హుషారుగా సాగింది, బాగుంది. వంటింటికి మీరు ఎంత దూరంగా వుండాలని కోరుకుంటున్నారో అన్న విషయాన్ని చదువుతుంటే, నా కొక పాత సినిమాలోని పాత గుర్తుకువచ్చి, కొంత భయంగా కూడా వున్నది: ``నాది, నాది అనుకున్నది నీది కాదురా... నీది కాదన్నది ఒకనాటికి నిజము అవునురా ...'' (నిజము కాకుండుగాక !!).

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete
  Replies
  1. "కానున్నది కాక మానదు కదా"
   @మాధవరావు గారూ మీ వ్యాఖ్యకి ధన్యవాదములు.

   Delete
 4. హన్నా! మేడమ్ గారిని అమాయకురాలిని చేసి అలా ఆడిస్తారా... ఈ పోస్ట్ లింక్ మేడమ్ గారికి పంపుతున్నాను ఉండండి.

  ReplyDelete
 5. అయ్యో అంతపని చేయ్యవోకండి.అర్జంటుగా మీకు రెస్పాన్స్ ఇస్తున్నాను.
  ఇంకా ఆవిడ పోస్టును చూడలేదు. ఎల్లా ఎదుర్కోవాలో ఇంకా ప్లాన్ సిద్ధం కాలేదు.

  @తేజస్వి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 6. వేలుతో కంప్యుటర్ ఆడించటం నాకు చేతకాదు. __________అబ్బ, రావు గారూ, నాక్కూడా నాక్కూడా!

  మొత్తానికి మేడమ్ గార్ని ఇన్నేళ్ల తర్వాత కూడా బాగానే హడల గొడుతున్నారన్నమాట మాత్రం అర్థమైంది. పెళ్ళాల శాపాలు గట్టిగా ఉంటాయని గ్రహించారు చాలు! ఊరికూరికే ఇచ్చేయరు కదండీ..జెన్యూన్ గా ఇస్తారు కాబట్టే ఆ గట్టిదనం!

  ఈ సారి నా కంప్యూటర్ కి ఏదైనా సమస్య వస్తే మీ దగ్గరికే వస్తా! ఇంట్లో అడగను.

  ReplyDelete
 7. బాబోయ్! పెళ్ళాల శాపాలు చాలా గట్టివి.
  తప్పకుండా మీ కంప్యుటర్ కి ప్రాబ్లమ్స్ వస్తే చెప్పండి. చాలావరకూ బాగు చెయ్యవచ్చు.
  @సుజాత గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. నమస్కారములు.
  ఇన్నాళ్లుగా ఇంత మంచి ఆర్టికల్ నేనెందుకు చదవ లేదో ? [ బహుశా ఎటైనా వెళ్ళి ఉండ వచ్చును ] . చాలా బాగుంది. ఇంతకీ శాప విముక్తికి కాసుల పేరా ? మువ్వల వడ్డా ణమా ? ? ? లేక ఒక నెలరోజులు వంటింటి పని ఒప్పుకున్నారా ?
  సునిసిత మైన హాస్యంతో చక్కగా చదివించారు

  ReplyDelete
 9. వడ్డాణము, కాసులపేరు రోజూ ఏ సహాయం చెయ్యవు కదా! ప్రస్తుతం రోజూ పక్కలెత్తి కూరలు తరుగుతున్నా. నెలరోజులు చేసిన తరువాత అలవాటయ్యింది. కానీ మీరు బలే కనిపెట్టేశారు!. @రాజేశ్వరి గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete