Monday, May 7, 2012

84 ఓ బుల్లి కథ 72 --- ఎముకల బలహీనత -- Osteoporosis

జీవత్వం ఉన్న ప్రతి జీవి లోనూ జీవ కణాలు చస్తూ, పుడుతూ ఉంటాయి. ఈ పునరుత్పత్తి మనకు తెలియకుండానే జరుగుతుంది. కానీ ఆ పునరుత్పత్తి కి కావలసిన ముడిపదార్ధములు లేకపోతే అది ఆగిపోతుంది. మనకి కలిగే శరీర బాధలకి అనారోగ్యాలకీ కొంత కారణం ఈ పునరుత్పత్తి తగినంత లేకపోవటమే.

మన శరీరంలో ఎముకల బలహీనత వలన వచ్చే వ్యాధిని Osteoporosis అంటారు. శరీరంలో కాల్షియం తగ్గితే ఈ వ్యాధి రావటానికి అవకాశం ఉంది. గట్టిగా ఉండాల్సిన ఎముకలు మెత్తగా అయి వంగి పోతాయి. దురదృష్ట వశాత్తూ ఈ వ్యాధి ముదిరిపోయిన తరువాత కానీ దాని చెడ్డ లక్షణాలు బయటికి కనపడవు. ఉదా: ఎత్తు తగ్గటం, వంగి నడవటం, కాళ్ళ నెప్పులు, ఎముకలు విరగటం, విరిగినవి సరి అవటానికి చాలా కాలం పట్టటం మొదలయినవి. 

మన శరీర భాగాలు అన్నీ మనమనుకున్నట్లు కలిసికట్టుగా పని చెయ్యాలంటే మన శరీరంలో కాల్షియం (Calcium) తగిన మోతాదు లో ఉండాలి. బ్రెయిన్ సరీగ్గా పని చెయ్యాలన్నా, దాని నుండి వివిధ శరీర అవయవాలకు పంపే సంకేతాలు సరీగ్గా చేరాలన్నా, కాల్షియం చాలా ముఖ్యం. అల్లాగే మన శరీరానికి ఒక ఆకృతి నిచ్చే బొమికలకు (Bones) కూడా కాల్షియం చాలా ముఖ్యం. అందుకని మన శరీరం, అవసరాలకు అందుబాటులో ఉంటుందని ముందు జాగర్తగా కాల్షియంని ఎముకలలో దాచి పెట్టుకుంటుంది. తనకు అవసరమయినప్పుడు ఎముకల నుండి తీసుకుని మనము తినే ఆహారము నుండి కాల్షియంని తయారు చేసి ఎముకలకి సద్దుబాటు చేస్తుంది. ఈ ఇచ్చి పుచ్చుకునే సద్దుబాట్లు మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. జీవితంలో అన్నిట్లో లాగా తీసుకునేది ఎక్కువగా ఉండి  తిరిగి ఇచ్చేది తక్కువగా ఉంటే ఇచ్చిన వాళ్ళ ఇల్లు గుల్లవుతుంది, ఎముకలు గుల్లలుగా (బోలగా) తయారు అవుతాయి. ఇదే ఈ వ్యాధికి కారణం. మన శరీరంలో కాల్షియం పరిణితిని కొలిచే సాధనాల ద్వారా దీనిని నిర్ణయించ వచ్చు.

మన శరీరం మనం తినే ఆహారముల నుండి కాల్షియం, ఫాస్ఫేటులను తీసుకుని ఎముకలని నిర్మిస్తుంది. మన అందరిలో దాదాపు 25 ఏళ్ళప్పుడు మన శరీరంలో కాల్షియం అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మన జీవిత కాలంలో అంతకన్నా పెరగదు. ఆ తరువాత అంతా ఇచ్చి పుచ్చుకోటాలే. అందుకనే ఆ వయసులోపల కాల్షియం ఉన్న పౌష్టికాహారం తీసుకొనుట చాలా ముఖ్యం.

అమెరికాలో ఏభై ఏళ్ళ తరువాత, స్త్రీలలో అయిదుగుర్లో ఒకరికి , మగవాళ్ళల్లో ఎనిమిదిలో ఒకరికి ఈ వ్యాధి వస్తోంది. ఇది రావటానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్య కారణం శరీరంలో తగినంత కాల్షియం తయారు అవక పోవటం, తయారయిన కాల్షియం మూత్రము ద్వారా బయటికి వెళ్ళిపోవటం. వయస్సు పెరిగిన కొద్దీ సెక్సు హార్మోనులు తగ్గటం కూడా ఒక కారణం. పొగ త్రాగుట, మద్యము సేవించుట, పని చేయకుండా సోమరిగా ఒక చోట కూర్చుండుట కూడా కారణాలే. ఉప్పు ఎక్కువ తినుట కూడా ఒక కారణం. ఎంత ఎక్కువ ఉప్పు తింటే అంత కాల్షియం మూత్రము ద్వారా పోతుంది.

మనము రెండు విధములుగా కాల్షియం ను శరీరమునకు అందించ వచ్చును. మొదటిది మాత్రల ద్వారా. మాత్రల ద్వారా శరీరమునకు కాల్షియం అందిన, అది జీర్ణించి పనిచేయుటకు విటమిన్ D3 కావలయును. రోజుకి 1,200 mg కాల్షియం, 800 mg D3 వేసుకొనుట మంచిది (సూర్యరశ్మిలో పది నిమిషములు కూర్చున్ననూ ఈ విటమిన్ ను పొందవచ్చును). ముందుగా మీ వైద్యుని సంప్రదించుట మంచిది.

ఆహార పదార్దముల ద్వారా కూడా శరీరమునకు కాల్షియం ఇవ్వ వచ్చును. పచ్చటి ఆకులున్న కూరలన్నిటి లోనూ కాల్షియం ఉంటుంది. Low-fat dairy products (పాలు పెరుగు మజ్జిగ) , Dark green leafy vegetables పచ్చటి ఆకు కూరలు, Broccoli, Canned salmon or sardines with bones, Soy products such as tofu, సోయా బీన్స్ , Calcium-fortified cereals and orange juice.ఈ విధముగా అందిన కాల్షియం శరీరములో జీర్ణించుటకు విటమిన్ K అవసరము. దీనికి మనము తిన వలసిన ఆహారములు: Chard, Brussels sprouts, kale, cauliflower and spinach (బచ్చలి), the herb parsley.

చివరి మాట:  నా ఉద్దేశంలో మన భోజన సాంప్రదాయం " కూర, పచ్చడి, పప్పు, పులుసు, మజ్జిగ" సమీకృత పౌష్టిక ఆహారానికి గీటు రాయి. మనం ఆరోగ్యముగా ఉండటానికి మన శరీరానికి కావలసిన మూల పదార్ధాలను పంచి ఇస్తుంది. వీలయినంత వరకూ ఆహారములో మన సాంప్రదాయాలు పాటించండి. మీ ఆరోగ్య విషయములలో చర్యలు తీసుకునేముందు తప్పకుండా మీ సొంత వైద్యుని సంప్రదించండి.

మాతృక:

http://www.emedicinehealth.com/osteoporosis/article_em.htm

http://saveourbones.com/natural-bone-building-handbook/

7 comments:

 1. సర్ ! చక్కటి వ్యాసం. ఎముకల బలహీనత గురించి ఎన్నో విషయాలను తెలియజేసారండి.
  " ఈ వ్యాధి ముదిరిపోయిన తరువాత కానీ దాని చెడ్డ లక్షణాలు బయటికి కనపడవు. " ...ఇది చదివిన తరువాత ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.

  ReplyDelete
 2. మన తరుఫున మనం చెయ్యగలిగింది అల్లా వ్యసనాలు లేకుండా సరి అయిన ప్రకృతి పరమైన ఆహారం తీసుకోవటమే. @anrd గారూ మీవ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. well said అండీ! ఇన్ని ఉపయోగాలు చెప్పిన మీరు దంతాల పటిష్టత గురించీ, హృదయ స్పందన గురించి మరిచారు. అవి కూడా చేర్చినట్టయితే సంపూర్ణంగా ఉండేది!

  ReplyDelete
 4. @శ్రావ్య గారూ, రసజ్ఞ గారూ
  ఈ Osteoporosis స్త్రీ లలో ముందరగా వస్తుందట. ప్లీజ్ టేక్ కేర్.
  న్యురాల్ సిస్టమ్స్ కొంచెం వెనక్కు నెట్టాల్సి వచ్చింది. హృదయ స్పందనల మీద తప్పకుండా వ్రాస్తాను. మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. నమస్కారములు
  ఛాలా మంచి విషయాలు చెప్పారు .కాక పొతే ఈ రోజుల్లో పద్దతిగా పప్పు కూర పులుసు పచ్చడి , అని ఎంత మంది తింటున్నారు ? ఈ బ్రెడ్డు ఆ చీజు అని అల్లా ఏదో ఒకటి తిని గడి పేస్తున్నారు .కొందరికి వండ డానికి బద్ధకం , ఇంకొందరికి టైము లేదని , మరి కొందరు ఏం తింటే సరి పోదు ? అనీ అనేక కారణాలు. నిజానికి వెనకటి రోజులే మంచివి. ఇంటి వంటలు , పాడీ పంటా , ఆరోగ్య కరంగా ఉండేవి . ఇప్పుడు తేలిక పద్ధతులు , బరువు శరీరం , తేలిక వ్యాధులు .ప్చ్ ! అన్నీ" టేక్ ఇట్ ఈజీ " మీ సలహాలను కొంద రైనా పాటించ గలిగితే అంత కంటె అదృష్టం మరే ముంది ? మంచి మెళకువలు తెలిపి నందులకు ధన్య వాదములు .

  ReplyDelete
 6. @రాజేశ్వరి గారూ
  మన భోజనం సరీగ్గా తింటే ఆరోగ్యంగా ఉంటామని నా నమ్మకం. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయి, కాయ గూరలతో చేస్తాము కాబట్టి కూర, పులుసు, పచ్చళ్లలో మినరల్స్ విటమిన్లు ఉన్నాయి. పెరుగు, మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. మనం తినే అన్నంలో కార్బ్స్ ఎక్కువని చాలా మందికి బాధ. బ్రౌన్ రైస్ తినచ్చు లేకపోతే అన్నం తక్కువతో కూరలెక్కువగా తినచ్చు. ఏమిటో పిజ్జా తింటూ అన్నంలో కార్బ్స్ ఎక్కువ అనటం అన్యాయం.
  మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete