కాఫీ తాగేసి ఎంచేద్దామా అని ఆలోచిస్తున్న భార్గవికి, కాఫీ తాగి ఊర్కెనే కూర్చున్న భర్తా, డైనింగ్ టేబుల్ మీద ఉన్న దానిమ్మ కాయలూ కనపడ్డాయి. వెంటనే ఈ రెండు జడపదార్ధాలని ఎందుకు కలపకూడదనే ఆలోచన వచ్చింది.
భార్గవికి ఇటువంటి ఆలోచన వస్తుందనుకుంటే, బహుశా వల్లి Costco లో కొన్న దానిమ్మకాయలు, భార్గవికి ఇచ్చేదికాదు.
రిటైర్ అయిన భర్త అలా ఊర్కేనే కూర్చోటం ఏమాత్రం మంచిది కాదు. If you don't use it you loose it. మనిషిలో ఉన్న కీళ్ళు, బుర్రా రోజూ ఉపయోగించక పోతే అవి ఉపయోగం లేకుండా పోతాయి. అల్లాగే మనుషులు కూడా. మొన్నెవరో ఆయన భార్య పేరే మర్చె పోయాడుట. ఇటువంటి పరిస్థితి తన భర్తకు కలగ కూడదు అని భావించింది భార్గవి.
దానిమ్మ కాయలు ఎంత బాగున్నాయో అని మురిసిపోతూ వాటికి ఒక ఫోటో తీసి, తన కిష్టమని తెచ్చిన వల్లీ గారు ఎంత మంచివారో అనికూడా పెద్దగా అనుకుంది. క్రింది సంభాషణలన్నీ ఆ తరువాత జరిగినవి.
"దానిమ్మ గింజలు తింటే శరీరానికి చాలా మంచిదట "
"అవును చాలా మంచివి. రక్త శుద్ధికి చాలా దోహదం చేస్తాయి"
"పైకెళ్ళి కంప్యూటర్ ముందర కూర్చునే ముందర వాటిని కొంచెం వలిచి పెట్టండి."
అయ్యో ఏమిటన్నాను అని నాలిక కరుచుకుంది. తాను ఎన్ని సార్లో చెప్పాడు పెళ్ళాం చెబితే పనులు చెయ్యటం ఇష్టముండదని. అందుకనే ఆఫీస్ కి వెళ్ళే ముందర భగుణ కూరగాయలు కత్తీ కౌంటర్ టాప్ మీద పెట్టివెళ్తుంది. తాను వచ్చేటప్పటికి కూర తయారు అయి ఉంటుంది. భర్త కొంచెం Old fashioned. తను భోజనంలో కూర పచ్చడి పప్పు పులుసూ లేకపోతే అది భోజనం కాదంటాడు.
తనచేత పని చేయించాలంటే వేరే రూట్లో వెళ్ళాలి. ఒక్కొక్కరోజు ఆయనకి ప్రేమ పొర్లి పోతూ ఉంటుంది. అప్పుడు ఏపనయినా అడగకుండానే చేస్తాడు. మగవాళ్లందరికీ ప్రతిరోజూ రూపాలు మారిపోతూ ఉంటాయి. నిన్న ఏ రూపంలో ఉన్నాడో రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాడు. ఇవ్వాళ ఇంకా ఆ ప్రేమ కొద్దిగా మిగిలి ఉంటుందనుకుని:
"నాకు దానిమ్మ గింజలంటే చాలా ఇష్టం" అన్నది.
"ఇష్టమయితే వలుచుకు తిను"
"కొంచెం వొలిచి పెడతారా"
"దానిమ్మ గింజలు వలవటం నా కిష్టం లేదు. వలుస్తుంటే రసం చింది చొక్కా పాడవుతుంది "
ఇప్పుడేం చెయ్యాలో అర్ధం కాలా. ఎల్లాగయినా తన చేత ఆ పని చేయించాలి.
"మరి "రిచ్ మండ్" లో పార్వతి వాళ్ళ ఇంట్లో ఎల్లా చేశారు"
"పార్వతి వేరు"
"అంటే నేను వేరా "
"తాను దానిమ్మ వలుస్తుంటే మరకలు పడితే వెంటనే వెళ్ళి కొత్త చొక్కా కొని తీసుకు వచ్చింది "
"నేనూ కొని పెడతాను"
"నా కక్కరలేదు ఇప్పటికే ఇరవై చొక్కలున్నాయి. బట్టలు ఉతుక్కునే సరికి నాపని అవుతోంది"
"వాషింగ్ మెషీన్ లో వెయ్యటం కూడా ఉతుక్కోవటమేనా. అయినా ఎవరి బట్టలు వారు ఉతుక్కుంటే తప్పేమిటి "
"నీ లంగాలు కూడా ఉతకాలసొస్తోంది. నా బుట్టలో ఎందుకేస్తున్నావు"
సమస్య ఇంకో చోటికి వెళ్తోందని గ్రహించింది భార్గవి
"పోనీ లాగూ కొనిపెడతాను"
"చొక్కాకి మరకలయితే లాగూ కొని పెడతానంటా వేమిటి"
ఎలాగయినా ఈయనతో దానిమ్మలు వొలిపించాలి.
"పోనీ మీ కిష్టమయిన బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర చేసి పెడతాను"
"మొన్న నాకిష్టమైనదని తెలిసికూడా దాన్ని చెడగొట్టావు. పెళ్లి చేసుకునే ముందర నీ వంట ప్రతాపం తెలిస్తే బాగుండేది "
"నా వంట ప్రతాపం పెళ్ళిలో చూపాను. లొట్టలేస్తూ తిన్నారు"
"పెళ్ళి వంటలు బాగానే ఉన్నాయి నువ్వు చెయ్యలేదుగా"
"నేను చేసినది గుట్టు చప్పుడుగా తిన్నారు"
"నాకెప్పుడు పెట్టావు"
"పెళ్ళిలో "స్తా ళీ పాకం" లో పొయ్యి మీద వంట చెయ్యలా"
"ఆ పొగలో ఏమి పెట్టావో ఏమిటో "
"నన్ను చూస్తూ లొట్టలేస్తూ తిన్నారు. మీ చెయ్యి కూడా తగిల్చారు బాగుందని "
"కానీ ఇప్పుడు నాకు భోజనం సరీగ్గా పెట్టటల్లేదు"
"సరే ఇవ్వాళ నుండీ మీ కిష్ట మైనవి చక్కగా చేసి పెడతాను"
"తిని నేను లావెక్కాలని నీ కోరికా"
తలకేస్తే కాలికి కాలికేస్తే తలకీ ముడిపడుతోందని గమనించింది. పని అయ్యేటట్లు కనపడలా.
"ముసుగులో గుద్దులాట ఎందుకు పోనీ ఏమి కావాలో చెప్పండి"
ఆ తరువాత జరిగిన సంభాషణ వ్రాయటం ఇష్టంలేదు. కానీ జరిగింది చెప్తాను.
వెంటనే భార్యా విధేయుడై చొక్కా మీద మరకలు పడకుండా పాతచీర కప్పుకుని దానిమ్మకాయలు వలిచి గింజలు తీయటం జరిగింది. ఆ రాత్రి బెడ్ రూమ్ కిటికీ లోనుంచి తొంగి చూస్తూ వెళ్తున్న పౌర్ణమి చంద్రుడు సిగ్గుపడుతూ మబ్బుల్లో దాక్కున్నాడు.
శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.
ReplyDeleteఇప్పటివరకూ మీరు వ్రాసినవాటిల్లో ఇది అద్భుతం. మీ వర్ణన శృంగార నైషద కావ్యాన్ని తలపిస్తున్నది.( ఆ కావ్యం గురించి విన్నానేకానీ నేను చదవలేదనుకోండి ). చాలా ఆహ్లాదకరంగా వున్నది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
భర్తని వలచి దానిమ్మని వలిపించిన విధానం - భలే, భలే!!
ReplyDeleteజీవితంలో అన్నీ ఇచ్చి పుచ్చుకోటాలే కదా.
Deleteఇక్కడ దానిమ్మను వలిచి,వలపించుకోవటం జరిగింది.
లలిత గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
మాధవరావు గారూ ఒక్కొక్కప్పుడు అలా వస్తూ ఉంటాయి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
ReplyDeleteబాగుందండి. మీరు ఏ విషయాన్నయినా సరళంగా, అరటిపండు వలిచిపెట్టినట్లు చెబుతారు.
ReplyDelete