Monday, November 26, 2018

148 ఓ బుల్లి కథ ---- అమ్మా మాయమ్మా

"అమ్మా మాయమ్మా అని నే పిలచితే నాతో మాట్లాడరాదా  (నీ కిది) న్యాయమా మీనాక్షమ్మా"
"సరసిజ భవహరి హరనుత సులలిత నీ పదపంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితి"

నాకు చిన్నప్పుడు సంగీతమంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ రోజూ ఏవో పాటలు పాడుతూ నే ఉండేది. మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున పాటలు పాడేవాడు.  గుడికెళ్ళినప్పుడల్లా మా అమ్మక్కయ్యా మా అమ్మ తప్పకుండా గుళ్ళో పాటలు పాడే వారు. అల్లాగే పెళ్ళిళ్ళల్లో కూడా భోజనాలు చేసిన తర్వాత అందరూ కూర్చుని పాడేవాళ్ళు. ఇలా సంగీతం తో పెరిగినా  నా కెందుకో సంగీతం మీద పెద్ద మక్కువ రాలేదు. కాకపోతే బుద్ధిమంతుడి లాగా మాట్లాడకుండా వినేవాడిని.

సంగీతం మీద నా ఇష్టా ఇష్టాలన్నీ ఒక రాత్రితో తారుమారు అవుతాయని  నేను అనుకోలేదు. నేను అప్పుడు 5th ఫారం అనుకుంటా రేపల్లె లో చదువుతున్నాను. ఒక రోజు మాయింటికి శ్రీనివాసన్ గారు వచ్చారు. రాత్రికి ఎవరింట్లోనో పెళ్ళిలో ఆయన పాట కచ్చేరీ. (1950's లో బాలమురళీకృష్ణ  గారు విజయవాడ రేడియో నుండి పొద్దునపూట "భక్తిరంజని " కార్యక్రమం చేసేటప్పుడు, దానిలో శ్రీనివాసన్ గారు పాల్గొనే వారు.ఆయన గుంటూరు Indian Bank లో పని చేసే వారు.)

రాత్రికి  శ్రీనివాసన్  గారి పాట కచ్చేరీ కి మా నాన్న గారితో పాటు నేనూ వెళ్ళా ను. పిల్లాడినని నాకు పక్కవేసి పరుపు వేసి పడుకో మన్నారు. నేను పౌరుషంతో పడుకోలేదు. రాత్రి ఒంటి గంట దాకా పాట కచేరి వింటూ మూడు గంటలు అలాగే మేల్కొని కూర్చున్నాను.

తెలిసిన పాటలే. తెలిసిన రాగాలే. అమ్మ పాడుతుంటేనూ తాతయ్య పాడుతుంటేనూ విన్నవే. మూడు గంటలు వరసగా కూర్చుని విన్న తర్వాత ఎందుకో వాటిమీద ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం రాను రాను పెరగటం తప్పితే తరగలేదు. యూనివర్సిటీ లో దుర్గా ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సుందరరామ శర్మ, కృష్ణారావు(voilin ) ల పరిచయాలు కూడా దీనిలో ఒక కారణం కావచ్చు. వాళ్ళు పాట వింటూ ఏ రాగమో చెప్పే వాళ్ళు. నాకు ఇప్పటికీ అది చేత కాదు.

అప్పటినుండీ ఎప్పుడు శాస్త్రీయ సంగీతం విన్నా మనసంతా ఒక విధంగా అయిపోతుంది. తన్మయత్వం అంటే అదేనేమో. నా ఉద్దేశంలో అది ఒక Neural Resonance. అదో చెప్పలేని అనుభూతి. మీకు కూడా ఆ తన్మయత్వం తో ఆ అనుభూతి కలిగించాలని నా ప్రయత్నం.

ఈ క్రింది వీడియో IndianRaga Labs లో సభ్యుడు లలిత్ సుబ్రమణియన్ పాడిన, శ్యామ శాస్త్రి విరచిత "అమ్మా మాయమ్మా ". ఇది విన్న తరువాత మీకూ శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కలగవచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పాలేము! అదొక మరువరాని అనుభూతి. శాస్త్రీయ సంగీతం వింటున్నప్పుడు దానిలోకి వెళ్ళి పోయి వేరొక ఆలోచనలు దగ్గరకు రాకుండా మనసుల తలుపులు మూసేస్తాము. అదొక Yoga , అదొక Meditation.

The timeless classic 'Mayamma' in the rare and beautiful Ragam Ahiri rendered by 2015 IndianRaga Fellow Lalit Subramanian.


Monday, November 12, 2018

147 ఓ బుల్లి కథ ---- బ్రోకలీ కూర (Broccoli Curry )


ఎప్పుడో కొన్నేళ్ల క్రిందట సురేష్ బాబు, బ్రోకలీ హైదరాబాద్ లో దొరుకుతోంది "బ్రోకలీ కూర" చెయ్యటం గురుంచి ఒక పోస్ట్ పెట్టమన్నారు. ఆయనకి email ద్వారా చెప్పటం జరిగింది గానీ పోస్ట్ పెట్టటం ఇప్పటికి గానీ కుదరలేదు. బ్రోకలీ cruciferous vegetables ఫ్యామిలీ లోది. అందుకని ఆరోగ్య పరంగా దీనికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమయినది కేన్సర్ ని తగ్గించే గుణం. ఆకు పచ్చగా ఉండే కూరలు వంటికి చాలా మంచివి. ఈ ఫామిలీ లో క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ తో కూర చెయ్యటం గురుంచి ఇదివరలో పోస్ట్ పెట్టాను.

కూర మొదలెట్టే ముందు ఒకటి రెండు పనులు ముందర చెయ్యాలి. ఒక గంట ముందు రెండు స్పూన్ల  పెసర పప్పు (moong dal ) నీళ్ళల్లో నాన  వెయ్యాలి. బ్రోకలీ నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి (కాడలు కూడా వాడ వచ్చు). అమెరికాలో మీకు కావాలంటే బ్రోకలీ ముక్కల పాకెట్, 15oz సైజులో  frozen section లో దొరుకుతుంది.


కావలసిన పదార్ధాలు:
1. వంట నూనె -- రెండు టేబుల్ స్పూనులు. (నేను వాడేది ఆలివ్ ఆయిల్ మీడియం హీట్)
2. మినపపప్పు  -- 1/2 టీస్పూన్
3. మెంతులు  -- ఆరు గింజలు
4. జీలకర్ర -- 1/2 టీస్పూన్
5. ఆవాలు -- 1/2 టీస్పూన్
6. ఎండుమిరప -- ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి )
7. పసుపు -- చిటికెడు
8. ఇంగువ -- చిటికెడు

9. నాన పెట్టిన పెసరపప్పు -- 1/2 స్పూన్

10. బ్రోకలీ ముక్కలు -- 15oz (3 కప్పులు)

11. ఉప్పు -- 1/2 స్పూన్

ఈ కూర చెయ్యటం చాలా తేలిక:
1.ఒక బాణీ లో నూనెవేసి కాగిన తరువాత తిరగమాత వేయాలి (1--8 స్టెప్స్).
   తిరగమోత మాడ్చ వద్దు.
2. నానిన పెసరపప్పు వేసి ఒకనిమిషం కలియపెట్టాలి.
3. పోపులో బ్రోకలీ ముక్కలు , ఉప్పువేసి కాసిని నీళ్ళు జల్లి మూత బెట్టాలి .
4. షుమారు 15 నిమిషాలకి నీళ్లంతా పోయి ముక్కలు ఉడికి కూర తినటానికి తయారు అవుతుంది.




ఈ కూరకి నేను ఉపయోగించే చిట్కాలు:
1. Frozen 15oz బ్రోకలీ పాకెట్ కొంటాను.
2. ముందుగా బ్రోకలీ ముక్కలని pressure cooker లో 3 నిమిషాలు స్టీమ్ చేస్తాను.(ఒక విజిల్ దాకా అనుకోండి). దీని మూలంగా బ్రోకలీ త్వరగా ఉడికి, కూర త్వరగా తయారు అవుతుంది.
3. అసలు బ్రోకలీ ఉడకపెట్టి ఉత్తగా కూడా తినవచ్చు.


వంటలకు సంబంధించిన నా ఇతర పోస్టులు:

70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు

87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి

123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర

Broccoli compound targets key enzyme in late-stage cancer