లేక్ మిచిగన్ --చికాగో |
అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో చలికాలం ఎప్పుడూ స్నో పడుతూ చలిగా ఉంటుంది. ఇది మామూలే. చలికాలమైనా సామాన్యంగా అన్ని పనులూ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ కొన్ని సంవత్సరాలు చల్లగాలులు నార్త్ పోల్ నుండి వీచి జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తాయి. కాకపోతే ఎప్పుడు వస్తాయో ముందరే తెలుస్తుంది. కాబట్టి ముందర జాగర్త పడటానికి వీలుంటుంది. బుధవారం చలిగాలులు (Polar Vortex ) వస్తాయని చాలా రోజులబట్టీ చెబుతున్నారు. చాలా తీవ్రంగా ఉంటాయని కూడా చెబుతున్నారు.
బుధవారం గాలులు వస్తున్నాయంటే ముందు రోజులనుండీ స్నో పడుతూ ఉష్ణోగ్రత తగ్గి పోతూ ఉంటుంది. ఒక వారానికి ఇంటికి కావాలసిన కూరగాయలూ అవీ మొన్న ఆదివారం కొనుక్కున్నాము.మంచిదయింది. ఆదివారం నుండీ స్నో పడటం మొదలయితే, మూడు సార్లు స్నో తీయవలసి వచ్చింది. స్నో తీయకపోతే గారేజ్ లోనుండి కారు తియ్యలేము ఎక్కడికీ వెళ్ళటానికీ వీలుండదు. మేము ఒకళ్ళని పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చి తీసి వెళ్తారు. బయట వీధుల్లో మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి స్నో తీస్తారు. అందుకనే ఇంటావిడ మంగళవారం పనికి వెళ్ళటానికి వీలయింది. ఆవిడ దగ్గరలో లైబ్రరీ లో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతీ లైబ్రరీలో కంప్యూటర్ లు ఉంటాయి. మనం ఉపయోగించు కోవచ్చు. ఉపయోగించటం కష్టమయితే ఈవిడ సలహాలు ఇచ్చి సులభతరం చేస్తుంది.
మేము ఆదివారం నుండీ బుధవారం వచ్చే చలిగాలులు ఎదుర్కోటానికి ఇంట్లో సన్నాహాలు చేస్తున్నాము. కరెంటు పోవచ్చు, ఫ్లాష్ లైట్లు దగ్గర పెట్టుకున్నాము. పైపుల్లో నీళ్లు గడ్డకట్టుకు పోవచ్చు. ఇంట్లో పైపుల్లో నుండి ఎప్పుడూ సన్నగా కారుతూ ఉండేటట్టు చూసుకున్నాము. ఇల్లా చేసుకుంటే పైపుల్లో నీళ్ళు గడ్డకట్టవు. కొన్ని ఏళ్ళ క్రిందట వేడి నీళ్ళ పైపు లో నీళ్ళు గడ్డకట్టుకు పోయాయి. అదొక నరకం. మా అదృష్టం బాగుండి అది వేడి నీళ్ళ పైపు అయింది, చన్నీళ్ళు పట్టుకుని కాచుకుని స్నానాలు చేశాము. ఇంట్లో వేడి గాలులు వచ్ఛే furnace ని కంట్రోల్ చేసే దానికి బ్యాటరీస్ కావాలి అవి కొత్తవి మార్చుకున్నాము. Furnace గ్యాస్ తో పని చేస్తుంది.ఇంట్లో విద్యుత్ తీసుకుని వేడిగాలులు ఇచ్చేవి కూడా ఉన్నాయి.
మంగళవారం నుండీ ఈదురు గాలులు కొట్టటం మొదలెట్టాయి. బయట ఉష్ణోగ్రత పడిపోతోంది. మా ఆవిడ మూడు పొరల దుస్తులు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఉద్యోగానికి వెళ్ళింది. ముందరే ఆఫీసులు మూసేస్తే సాయంత్రానికల్లా ఇంటికి వచ్చింది. నేను ప్రతీ బుధవారం మా ఊరి లైబ్రరీలో ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్లకి ఇంగ్లిష్ మాట్లాడటం నేర్పుతాను. కానీ ఇవాళ బయట చలిగా ఉందని ఎగగొట్టాను.
బుధవారం పొద్దున చూస్తే బయట ఉష్ణోగ్రత -24F (-31C) (0C దగ్గర నీళ్లు ఐస్ గ మారుతుంది) . కాఫీ తాగి వంట చేసుకుని మధ్యాహ్న భోజనం చేశాము. ఇవాళ స్పెషల్ కూర కాలీఫ్లవర్ + రెడ్ బెల్ పెప్పర్. బయట నర సంచారం లేదు. నేనయితే పడుకుని నిద్రపోయాను. లేచిన తరువాత నాకెందుకో దోశెలు తినాలని పించింది. రెండు దోశెలు తిన్నాను. కాఫీ చేద్దామని ప్రయత్నిస్తే సరీగ్గా రాలేదు. బయట ఎండ బ్రహ్మాండంగా ఉంది. పోస్ట్ వెయ్యాలనిపించి, మా యింటి ముందర, వెనకాల ఫోటోలు తీసి వ్రాయటం మొదలెట్టాను. ఫొటోలు ఇంట్లో నుండే తీశాను. సరయిన బట్టలు లేకుండా బయటికి వెళ్తే వంట్లో ఏ భాగానికి ఆభాగం ఊడి వస్తుంది. ఊళ్ళో నీళ్ళ గొట్టాలు బద్దలయినట్లు, చాలా ఇళ్లల్లో పైపులు ఫ్రీజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఆఫీసులకీ ఇవాళ రేపుశలవు లిచ్చారు. ప్లేన్లు కూడా చాలా వరకు నడవటల్లేదు.రైళ్లు వెళ్ళటానికి పట్టాల మీద మంటలు పెట్టారు.సాయంత్రం అయ్యింది. చీకటి పడింది.ఇప్పుడు బయటి ఉష్ణోగ్రత -18F (-28C). రేపటికి ఉష్ణోగ్రత పెరుగుతుంది. శనివారం నాటికి 40F వస్తుందిట. అంటే ఆ రోజు మాకు శీతా కాలంలో వేసవి రోజు.
పైన మొదటి ఫోటో మా ఇంటి ముందరది. రెండవ ఫోటో మా ఇంటి వెనకాలది. వీటిల్లో తెల్లగా కనపడుతున్నది గడ్డకట్టిన స్నో. మధ్యాహ్నం ఎండ బాగా ఉంది. మా చెట్ల నీడలు ఫొటోలో కనపడుతున్నాయి. రోడ్లమీద స్నో తీశారు కానీ పై పొర అతుక్కుని ఉంది. దానిమీద డ్రైవ్ చెయ్యాలంటే గాజు మీద డ్రైవ్ చేసినట్లే. జారుతూ ఉంటుంది. చాలా జాగర్తగా చెయ్యాలి. మూడవ ఫోటో రైళ్లు పట్టాలు తప్పకుండా Switches ఫ్రీజ్ కాకుండా ఉండటానికి మంటలు వేసిన ఫోటో. చివరి ఫోటో చలి లో గడ్డకట్టిన చికాగో లోని లేక్ మిచిగన్.
మేము అమెరికాలో అరోరా అనే ఊళ్ళో ఉంటాము. ఇది చికాగోకు పశ్చిమంగా 35 మైళ్ళ దూరంలో ఉండే చిట్ట చివరి సబర్బ్.
99 ఓ బుల్లి కథ 87 --- ఆర్కిటిక్ వింటర్ లో ఓ రోజు
No comments:
Post a Comment