Sunday, December 26, 2021

187 ఓ బుల్లి కథ -- స్నో ఇన్ సియాటిల్

Snow in Seattle 




"స్నో ఇన్ సియాటిల్ " అంటే దాదాపు హైదరాబాద్ లో "స్నో"  పడినంత విచిత్రం. "సియాటిల్ 'Seattle ' " పట్టణం అమెరికాలో "వాషింగ్టన్ "అనే రాష్ట్రం లో పడమటి తీరంలో సముద్రం పక్కన ఉంటుంది. సామాన్యంగా చలికాలంలో కొద్దిగా చలిగా ఉంటుంది కానీ "స్నో" పడటం అనేది సామాన్యంగా ఉండదు. ఈ సంవత్సరం క్రిస్మస్ కాలంలో స్నో పడటం అనే "White Christmas "  ఇక్కడ చాలా అరుదు. ప్రకృతి వైపరీత్యం. 

ఒక నెల రోజులు పిల్లల దగ్గర గడపటానికి చికాగో నుండి రెండు రోజుల క్రిందట సియాటిల్  వచ్చాము. కొన్ని ఏళ్ళ క్రిందట ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా పుట్టింటికి వెళ్తున్నట్లు ఇక్కడికి వచ్చే వాళ్ళం. ఇప్పుడు చికాగో నుండి అదే నాలుగు గంటల విమాన ప్రయాణం ఒక యుగం లాగా తయారయింది. బహుశ దీనికి కారణం "సెక్యూరిటీ చెక్" లు కోవిడ్ లూ అయ్యుంటాయి. ఒకప్పుడు ఆనందించే విమాన ప్రయాణం, ఎప్పుడు అయిపోతుందా ఇంటికి ఎప్పుడు జేరుతామా అనే తీరుకు వచ్చింది. దానికితోడు పరిగెడుతున్న వయస్సు కూడా ఒక కారణం కావచ్చు.

మేము ఇంటికి రాంగానే "క్రిస్మస్ ట్రీ" పెట్టి "ఆర్నమెంట్స్" తో  అలంకరించి దీపాలు వెలిగించాము. "క్రిస్మస్ ట్రీ"  చిమ్నీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. చిమ్నీ లో నుంచి దూరి వచ్చి ప్రెజంట్సు ఇచ్చే "శాంతాక్లాస్ " ని ఇబ్బంది పెట్ట కూడదు కదా ! స్కూల్ పిల్లలు ఈ పండగ కోసం, దానితో వచ్చే ప్రెజంట్స్ కోసం నెలల బట్టీ ఎదురుచూస్తూఉంటారు. రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత పిల్లలకీ పెద్దలకీ ప్రెజంట్స్ ప్యాక్ చేశాము. "క్రిస్మస్" రోజు పొద్దున్నే లేచి ఎవరి ప్రజంట్స్ వాళ్ళం తీసుకున్నాము. పిల్లలు వాళ్ళ "లెగో " పజిల్స్ చెయ్యటం మొదలెట్టారు. 

కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. సాయంత్రం పండగ భోజనానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము. వంటలు చెయ్యటంలో అందరూ తలో చెయ్యి వేశారు. లేకపోతే, "లజానియా ",  వెజిటబుల్ పులావ్ దానిలోకి రైతా, డిజర్ట్ కి "panettone " ఒక్కళ్ళే చెయ్యటం చాలా కష్టం.   

అనుకోని వైట్ క్రిస్మస్ తో పండగ రోజు చల్లగా ముగిసింది. 

Sunday, December 19, 2021

186 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ -7 (Prasnopanishad )

ప్రశ్నోపనిషత్ లో ఇంతవరకూ అయిదుగురు శిష్యులు వేసిన వేదాంత ప్రశ్నలకు గురువుగారు పిప్పలాదుల  సమాధానాలు చూశాము. చివరి ప్రశ్న ఆరో ప్రశ్న సుకేశ భరద్వాజ క్రింది విధంగా వేశాడు : 

"కోసల దేశానికి యువరాజయిన హిరణ్యనాభుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, పదహారు అంగాల పురుషుడు (షోడశకలం పురుషం వేత్థ ) ఎవరో నీకు తెలుసా ? అని.  అబధ్ధం చెబితే వారు సమూలంగా నశించి పోతారు. (అందుకని)నాకు తెలియదు అని చెప్పాను. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడో  చెప్పండి " అని . (6-1)

అతనితో మహర్షి ఇలా చెప్పాడు: "ఓ సౌమ్యా ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోపల హృదయంలో ఉన్నాడు. ఆ బ్రహ్మ నుంచే పదహారు అంశాల ప్రపంచం ఉద్భవించింది"అని. (6-2)

ఆత్మ నుండి ప్రాణము, తన నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇంద్రియాలూ, మనస్సు, ఆహారం ఉద్భ వించాయి. ఆహారం నుండి శక్తి , తపస్సు, మంత్రాలూ, లోకాలూ, క్రియలూ వచ్చాయి. లోకాల పేర్లు సృష్టించ బడ్డాయి. (6-4)

మంత్రంలో చెప్పినవన్నీ మనం బ్రతకటానికి కావాలి. "బ్రతకటం" అనేది శరీరమునుండి విడిపోయినప్పుడు, శక్తి స్వరూపాలు అన్నీ వాటి వాటి మూలాల్లో కలిసి స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. అంతేకాదు నదులు, ఏ విధంగా సముద్రంలో కలిసినప్పుడు వాటి నామరూపాలు వదిలే స్తాయో ఆవిధంగా, జీవించటానికి సృష్టించ బడిన వన్నీ మరణ కాలంలో వాటి వాటి నామరూపాలు వదిలి ఆత్మలో కలిసిపోతాయి.

(పిప్పలాదులు) వారితో చెప్పాడు : నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినదింతే . ఇంతకుమించి ఏమీ లేదు. (6-7)

గురువుగారు తనకు తెలిసిన దంతా చెప్పాను అన్న తరువాత శిష్యు లందరూ వారికి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించినందుకు గురువుగారికి, గురువుగారి గురువులందరికీ (గురు పరంపర) నమస్సులు అర్పిస్తారు. (6-8)

నామాట:

వేటినయినా సృష్టించాలంటే శక్తి (energy ) కావాలని మనందరికీ తెలుసు. దానికి ఆకారం, రంగు రుచి వాసనా లేవని కూడా తెలుసు. దానిని చూడలేము పట్టుకోలేమని కూడా తెలుసు. ఉదా: విద్యుత్, మైక్రోవేవ్, ఆకర్షణా శక్తి  వగైరా. 

విద్యుత్ శక్తి నుండి మైక్రోవేవ్ శక్తి  వస్తుంది, ఆకర్షణా శక్తి  కూడా వస్తుంది. మనం అర్ధం చేసుకోవటం కోసం మూడింటినీ శక్తి-1, శక్తి-2, శక్తి-3 అని పిలవకుండా విడి విడిగా పేర్లు పెట్టుకున్నాము.  

అల్లాగే శక్తి స్వరూపమయిన సృష్టికర్తకు, తాను సృష్టించిన శక్తి  స్వరూపాలకు, మన అవగాహన కోసం పేర్లు పెట్టి పిలుస్తున్నాము.

విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రాణం, సూక్ష్మ శరీరం, కారణశరీరం ఇవన్నీ శక్తి  స్వరూపాలు. శరీరం లోకి జేరి దానికి జీవత్వం ఇస్తాయి, వచ్చిన  పని అయిపోగానే జీవాత్మ లోకి శక్తి స్వరూపాలు మిళిత మవుతాయి; అస్తమించే టప్పుడు సూర్య భగవానుడు లోకి కిరణాలు కలిసిపోయి నట్లు. మళ్ళా ఇంకొక శరీరం చూసుకుని ఆ  శరీరంలో విప్పారి, ఉదయపు సూర్య కిరణాలు విప్పారినట్లు, మిగిలి పోయిన పాప కర్మలు అనుభవించేటట్లు చేస్తాయి. 

జీవితంలో మనకిచ్చిన చిన్న విచక్షణ జ్ఞానంతో చేసిన పాప పుణ్యాలన్నీ సూక్ష్మ, కారణ శరీరాల్లో క్రోడీకరించి ఉంటాయి, తప్పించుకోలేము. మనసులో వాటిని తలుచుకోండి చాలు బయటికి వస్తాయి. వాటి పరిణామాలు మనం అనుభవించే దాకా మనము పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అందుకనే ఈ చావు బ్రతుకుల విలయం నుండి తప్పించుకోటానికి మంచి పనులు చెయ్యటానికి ప్రయత్నించటం మంచిది.

క్లుప్తంగా ఇదీ సంగతి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

Prashna Upanishad - Ancient Indian View on Creation, Time, Matter and Soul

ఉపనిషత్ లు    

Monday, December 6, 2021

185 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 6 (Prasnopanishad )

సూక్ష్మంగా చెప్పాలంటే ప్రశ్నోపనిషత్ అంతా ఆరుగురు శిష్యులు అడిగిన ప్రశ్న లకు గురువుగారి సమాధానములు. నలుగురు శిష్యుల ప్రశ్నలకి గురువుగారు సమాధానములు చెప్పిన తరువాత, గురువుగారిని శిష్యుడు శైబ్య సత్యకామ అయిదవ ప్రశ్న క్రింది విధంగా వేశాడు : 

అధ్యాయం 5 శ్లోకం 1: (5-1)

అథ హైనం శై బ్య:  సత్యకామః  ప్రపచ్చ  : దాని తర్వాత శైబ్య సత్యకామ అడిగాడు 

స యో హ వై తద్భగవన్మనుష్యేషు  : ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా 

ప్రాయణా న్త మో ర  మభిధ్యాయీత : మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే  

కతమం వావ స  తేన లోకం జయతీతి : అతడు దానివలన ఏ లోకానికి వెళ్తాడు అని 

ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకాలకి వెళ్తారు? అని శిష్యుడు  శైబ్య సత్యకామ గురువుగారు పిప్పలాదుడిని అడిగాడు.

ఇక్కడ ఓం కారం గురించి ఒక మాట చెప్పాలి. "ఓం" అని నోటితో అనాలంటే మనం  "అ " "ఉ " "మ " అనే మూడక్షరాలను కలిపి ఉచ్చరించాలి.  

అధ్యాయం 5 శ్లోకం 6: (5-6)

తిస్రో మాత్రా మృత్యుమత్య: ప్రయుక్తా అన్యోన్యసక్తా :  : ఈ మూడు మాత్రలూ విడిగా వాడితే (ఉచ్చరిస్తే ) అనిత్య ఫలం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా 

అనవిప్రయుక్తా:  క్రియాసు : ధ్యానంలో సరీగ్గా వాడితే 

బాహ్యాభ్యన్తరమధ్యమాసుజ్ఞ సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతేజ్ఞః  : జాగృత్ సుషుప్తి స్వప్నావస్తలకు పరమాత్మను గుర్తించిన జ్ఞాని చలించడు.

ఇక్కడ చెప్పేదేమిటంటే విడి విడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే అది పనిచేయదు, ఓంకార ఫలం పొందాలంటే ఓంకారం జపించేటప్పుడు అక్షరాలన్నీ పెనవేసుకుని ఒకటిగా రావాలి.

విడివిడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే, ఒక మాత్ర  "అ " తో జపిస్తే నూ, రెండుమాత్రలు "అ " "ఉ " లతో జపిస్తే దేవతలు వారి వారి లోకాలకు తీసుకువెళ్ళి వారి వారి ఫలితం అనుభవించిన తరువాత మనుష్యలోకానికి తెస్తారు. మూడక్షరాలూ పెనవేసుకుని ఓంకారం జపిస్తే సామవేద దేవత వల్ల  బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం పొందుతారు.    (5-7)

నామాట :

"పై లోకాలు" అనే మాటని అర్ధం చేసుకోటానికి ఈ క్రింది విశ్లేషణ ఉపయోగ పడచ్చు :

1. లోకాలు ఉన్నాయి అనే మాట విని ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు. మన ఎదురుకుండా మనమే ఒక లోకాన్ని సృష్టించాము. అదే "Satellite " లోకం. మనము సృష్టించిన కొన్నివేల ఉపగ్రహాలు దానిలో తిరుగుతున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడికి మానవులు వెళ్తున్నారు వస్తున్నారు (space Station). 

2. మన శరీరం ఒకటిగా పైకి కనిపించినా అది వేద శాస్త్ర ప్రకారం మూడు శరీరాల కలయిక అని చెబుతారు ("స్థూల శరీరం" (physical body ) , "సూక్ష్మశరీరం" (subtle body ), "కారణ శరీరం" (casual body )). 

మన "స్థూల శరీరం" (physical body ) మనకు కనపడే మన శరీరం. 

జ్ఞానేంద్రియాలనుండి వచ్చే సంకేతాలను వాటికి తగినట్టు ప్రతిస్పందన చేసిన తర్వాత  "మనసు" లో నిక్షిప్తం (record ) చేసేది "సూక్ష్మశరీరం" . మన జీవత్వానికి కారణం ఇదే.

మన మనసులో దాచిపెట్టబడిన సంకేతాలతో మన మనస్సు మనకి కొన్ని గుణాలు ఇస్తుంది.

"బుద్ధి" "జ్ఞానం" అనేవి నిక్షిప్తమైన సంకేతాల్ని వడగట్టితే (process ) వచ్చేది. 

"చిత్తం " అనేది మనసులోనున్న సాంకేతాలను అవసరమైనప్పుడు బయటకు తెచ్చేది.

"అహంకారం" మన మనసులో పోగు చేసుకున్న సమాచారాన్ని మన సొంతం అని వక్రీకరించగా వచ్చేది. ఇవి మనం అందరం మనకు తెలీకుండా రోజూ ఉపయోగించేవే. 

మన జీవిత రహస్యాలను దాచి పెట్టుకునేది "కారణ శరీరం" (casual body ). మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనని కనిపెట్టుకుని ఉండేది ఇదే. మనం గాఢ నిద్ర పోయామని మరునాడు గుర్తు పెట్టు కొని చెప్పేది కూడా మనలోని "కారణ శరీరం".  

మన శరీరం వదిలిన తరువాత మన జ్ఞాపకాలతో ప్రయాణించేవి సూక్ష్మ, కారణ శరీరాలు. మన ప్రారబ్ధం నిర్ణయించేది వీటిలో నిక్షిప్తం చేసిన సమాచారమే.

మనం నిద్ర కుపక్రమించే టప్పుడు wake up state లో ఉంటాము , తరువాత Dream లోకి వస్తాము ఆ తరువాత Deep Sleep లోకి వెళ్తాము  వీటినే జాగృత్, స్వప్న, సుషిప్తి అంటారు. వీటిని గురించి మాండూక్యోపనిషత్ లో వివరంగా తెలుసుకుందాము.

3. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్ గురించి చర్చించే టప్పుడు ఇంకా తెలుసుకుందాము.  ఓంకారం ఏవిధంగా ఉచ్చరించాలనేది గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి క్రింద లింక్ ఒకటి ఇచ్చాను.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

ఓం

ఉపనిషత్ లు    

11-Neema Majmudar

Wednesday, December 1, 2021

184 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 5 (Prasnopanishad )

 శిష్యుల వేదాంత ప్రశ్నలకి గురువుగారి సమాధానాలే  ఈ  ప్రశ్నోపనిషత్.  ఇంతవరకూ వేసిన ప్రశ్నలు, జగత్ సృష్టి ఎల్లా మొదలయింది, దానిలో మనుషులు ఎల్లా ఉద్భవించారు, ఎల్లా జీవిస్తున్నారు, ఎల్లా నిష్క్రమిస్తారు అని.

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

"ప్రాణం" శరీరం లోకి ప్రవేశించి అయిదు విధాలుగా విభజించుకుని మానవునిలో జీవత్వానికి మూలం అవుతుంది. కర్మ ఫలములు అనుభవించిన తరువాత  "ప్రాణం" శరీరంలోనుండి నిష్క్రమించిన వెంటనే శరీరంలో జీవత్వం పోతుంది.

ఇంక ఈ నాలుగవ అధ్యాయంలో శిష్యుడు అడిగిన నాల్గవ ప్రశ్నకి గురువుగారిసమాధానం చూద్దాం.

అధ్యాయం 4 శ్లోకం 1: (4-1)

అధ హైనం సౌర్యాయణీ గార్ఘ్యహః ప్రపచ్చ : మూడవ ప్రశ్న తరువాత సౌర్యాయణీ గార్గ్యుడు గురువుగారిని అడిగాడు 

భగవన్నెత స్మిన్పురుషే కాని స్వపస్తి కాన్యస్మి  జ్ఞాగ్రతి ? : ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేలుకొని ఉంటాయి?

కతర ఏష దేవః  స్వప్నాన్పశ్యతి కస్త్యైతత్సుఖం భవతి? : ఏ దేవుడు కలలను చూస్తాడు? ఈ సుఖం ఎవరికి చెందుతుంది?

కస్మిన్ను సర్వే  సమ్ప్రతిష్ఠితా భవన్తీతి   : ఎందులో అన్నీ లయమవుతాయి అని.

మనని ఎవరన్నా రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగితే ఏం చెబుతాము ? నిద్ర పట్టలేదనో, లేక రాత్రంతా కలలు అనో లేక హాయిగా నిద్ర పోయననో చెప్తాము.నిద్ర పట్టక పోవటం, రాత్రి కలలు రావటం ఒక విధంగా మనకు తేలుస్తాయనుకోవచ్చు. కానీ గాఢనిద్ర పోతున్నప్పుడు మన అవయవాలు ఏమీ పని చేయవే అటువంటప్పుడు మనము  హాయిగా  నిద్ర పోయామని ఎలా గుర్తుపెట్టుకుని చెబుతాము?

ఇదే సందేహం శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  కి వచ్చి గురువుగారిని అడుగుతాడు.

ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో నిద్రిస్తున్నప్పుడు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి , ఏవి కలలను చూస్తాయి, (గాఢనిద్ర) పోతున్నప్పుడు వ్యక్తి శరీరంలో ఆ సుఖం అనుభవించి గుర్తుపెట్టుకుని చెప్పే వారు ఎవరు ? అని అడుగుతాడు. (4-1)

గురువు పిప్పలాదుడు శిశుడు గార్గ్యకి చెబుతాడు: అస్తమించే సూర్యుడు తన కిరణాలనన్నీ తీసుకు పోయి మరునాడు ఉదయిస్తున్నప్పుడు తన కిరణాలను ఎలా విస్తరిస్తాడో అలాగే  శరీరంలోని ఇంద్రియాలు నిద్రలో మనసుతో లీనమయి, మెలుకవ తో వాటి పనులతో ప్రజ్వరిల్లుతాయి. అందుకని నిదురలో ఉన్న వ్యక్తి,  వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించడు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు , నిద్రిస్తాడు. (4-2)   

ప్రాణ రూపంలో ఉన్న అగ్నులు మాత్రమే ఈ శరీరంలో మేలుకొని ఉంటాయి. (4-3)

( పంచ ప్రాణాలూ, మనస్సు మాత్రమే మేలుకొని ఉంటాయి. ఇక్కడ అగ్నులు అంటే మనం మనశరీరంలో కణాలలో అగ్ని ద్వారా జరిగే శక్తి  ప్రక్రియ అని అన్వయించుకోవచ్చు.  )

"సమానం" ఉచ్వాస నిశ్వాసాలను సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాగే "ఉదానం" మనసనే యజమానిని (నిద్రతో) ఆనందం పొందేలా చేస్తుంది. (4-4) 

ఇక్కడ ఈ మనస్సు అనే దైవం కలలో, చూసిన వాటినీ చూడనివాటినీ , చూస్తుంది, వినినవాటినీ వినని వాటిని కూడా వింటుంది, అనుభవించినవీ అనుభవించనివీ, నిజమైనవీ నిజంకానివీ అన్నింటినీ చూస్తుంది.  (4-5)

(ఇక్కడ అనుభవించనివీ, చూడనివీ ఎల్లా చూస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి పండితులు చెప్పే సమాధానం అవన్నీ పూర్వ జన్మ వాసనలయి ఉండచ్చని. ).

వాసనలు నిలువచేసి ఉన్న చిత్తానికి అడ్డు తగిలినప్పుడు కలలు వచ్చుటకు వీలులేక "సుషుప్తి" (గాఢ నిద్ర) శరీరానికి వచ్చి ఆనందిస్తుంది. (4-6)

ఓ సౌమ్యుడా పక్షులు పగలు ఏవిధంగా దేశసంచారము  చేసి రాత్రికి వాటి చెట్టులో ఉన్న గూటికి చేరుకుంటాయో అటులనే అవి అన్నీ (శరీరంలో ని వన్నీ) పరమాత్మను చేరుకుంటాయి.  (4-7)

అవి అంటే శరీరంలో ఉన్న పంచ భూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచప్రాణాలూ, నాలుగు అంతః కరణాలూ  పరమాత్మను చేరుకుంటాయి (తురీయంలో లయమవుతాయి).  (4-8)

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

అన్నీ బ్రహ్మలో ఐక్యమయిన తరువాత బ్రహ్మ గురించి ఎల్లా తెలుస్తుంది. మనమే బ్రహ్మగా మారినప్పుడు బ్రహ్మ జ్ఞానము ఎల్లా తెలుస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

హే సౌమ్యుడా కారణ శరీరంలేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

జీవాత్మ, ఇంద్రియాలూ, పంచ ప్రాణాలూ, పంచ భూతాలూ అన్నీ దేనిలో లీనమవుతాయో (అక్షర బ్రహ్మలో) తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వ వ్యాపకం చెందుతాడు.  

నా మాట:

శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  "నిద్ర " గురించి అడిగిన ప్రశ్నకి  గురువుగారు పిప్పలాద మహర్షి చక్కటి ఉపమానం చెబుతారు. 

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన కిరణాలు లోపలికి ఎల్లా తీసుకుంటాడో , "నిద్ర" వచ్చేటప్పుడు ఒక వ్యక్తిలో అటువంటిదే జరుగుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా వాటి పాటవాన్ని తగ్గించుకుంటూ విశ్రమణకు చేరుకుంటాయి. అందుకనే ఆ వ్యక్తి  నెమ్మదిగా విశ్రమించు స్థితి లోకి జారుకుంటాడు. రాను రానూ వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించ డు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు, నెమ్మదిగా నిద్రకి ఉపక్రమిస్తాడు. 

జీవితంలో మనస్సులో నిక్షిప్త మయి సంఘటనలు కలల రూపంలో నిద్రలో కనిపిస్తాయి. ఒకప్పుడు మనకెప్పుడూ జరగని సంగతులు కూడా కలల లోకి రావచ్చు. వాటికి కారణం మన పూర్వ జన్మ నిక్షేపాలు కావచ్చు. కలల గమనానికి అడ్డు తగిలినప్పుడు, కలలు ఆగిపోయి "గాఢ నిద్ర" లో మునిగిపోతారు.

సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాల్ని ఎలా వ్యాపిస్తాడో అల్లాగే వ్యక్తి మేలుకుని నిద్ర లేస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి వాటి స్వస్థానాలకి వచ్చి తమ తమ పనులను చెయ్యటానికి ఉపక్రమిస్తాయి. 

పక్షులు పగలు దేశసంచారము చేసి రాత్రికి చెట్టులో ఉన్న గూటికి ఎలా చేరుకుంటాయో  అటులనే రాత్రిపూట ఇంద్రియాలు వాటి వాటి స్వస్థలానికి చేరుకుంటాయి. "ప్రాణం", మనస్సు తోపాటు అన్నీ జీవాత్మలో విలీనం అవుతాయి.

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

హే సౌమ్యుడా కారణం శరీరం లేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే  అని ఎవరు గ్రహిస్తాడో  అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు