శిష్యుల వేదాంత ప్రశ్నలకి గురువుగారి సమాధానాలే ఈ ప్రశ్నోపనిషత్. ఇంతవరకూ వేసిన ప్రశ్నలు, జగత్ సృష్టి ఎల్లా మొదలయింది, దానిలో మనుషులు ఎల్లా ఉద్భవించారు, ఎల్లా జీవిస్తున్నారు, ఎల్లా నిష్క్రమిస్తారు అని.
విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు.
అంటే వరసగా మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)
"ప్రాణం" శరీరం లోకి ప్రవేశించి అయిదు విధాలుగా విభజించుకుని మానవునిలో జీవత్వానికి మూలం అవుతుంది. కర్మ ఫలములు అనుభవించిన తరువాత "ప్రాణం" శరీరంలోనుండి నిష్క్రమించిన వెంటనే శరీరంలో జీవత్వం పోతుంది.
ఇంక ఈ నాలుగవ అధ్యాయంలో శిష్యుడు అడిగిన నాల్గవ ప్రశ్నకి గురువుగారిసమాధానం చూద్దాం.
అధ్యాయం 4 శ్లోకం 1: (4-1)
అధ హైనం సౌర్యాయణీ గార్ఘ్యహః ప్రపచ్చ : మూడవ ప్రశ్న తరువాత సౌర్యాయణీ గార్గ్యుడు గురువుగారిని అడిగాడు
భగవన్నెత స్మిన్పురుషే కాని స్వపస్తి కాన్యస్మి జ్ఞాగ్రతి ? : ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేలుకొని ఉంటాయి?
కతర ఏష దేవః స్వప్నాన్పశ్యతి కస్త్యైతత్సుఖం భవతి? : ఏ దేవుడు కలలను చూస్తాడు? ఈ సుఖం ఎవరికి చెందుతుంది?
కస్మిన్ను సర్వే సమ్ప్రతిష్ఠితా భవన్తీతి : ఎందులో అన్నీ లయమవుతాయి అని.
మనని ఎవరన్నా రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగితే ఏం చెబుతాము ? నిద్ర పట్టలేదనో, లేక రాత్రంతా కలలు అనో లేక హాయిగా నిద్ర పోయననో చెప్తాము.నిద్ర పట్టక పోవటం, రాత్రి కలలు రావటం ఒక విధంగా మనకు తేలుస్తాయనుకోవచ్చు. కానీ గాఢనిద్ర పోతున్నప్పుడు మన అవయవాలు ఏమీ పని చేయవే అటువంటప్పుడు మనము హాయిగా నిద్ర పోయామని ఎలా గుర్తుపెట్టుకుని చెబుతాము?
ఇదే సందేహం శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య కి వచ్చి గురువుగారిని అడుగుతాడు.
ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో నిద్రిస్తున్నప్పుడు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి , ఏవి కలలను చూస్తాయి, (గాఢనిద్ర) పోతున్నప్పుడు వ్యక్తి శరీరంలో ఆ సుఖం అనుభవించి గుర్తుపెట్టుకుని చెప్పే వారు ఎవరు ? అని అడుగుతాడు. (4-1)
గురువు పిప్పలాదుడు శిశుడు గార్గ్యకి చెబుతాడు: అస్తమించే సూర్యుడు తన కిరణాలనన్నీ తీసుకు పోయి మరునాడు ఉదయిస్తున్నప్పుడు తన కిరణాలను ఎలా విస్తరిస్తాడో అలాగే శరీరంలోని ఇంద్రియాలు నిద్రలో మనసుతో లీనమయి, మెలుకవ తో వాటి పనులతో ప్రజ్వరిల్లుతాయి. అందుకని నిదురలో ఉన్న వ్యక్తి, వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించడు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు , నిద్రిస్తాడు. (4-2)
ప్రాణ రూపంలో ఉన్న అగ్నులు మాత్రమే ఈ శరీరంలో మేలుకొని ఉంటాయి. (4-3)
( పంచ ప్రాణాలూ, మనస్సు మాత్రమే మేలుకొని ఉంటాయి. ఇక్కడ అగ్నులు అంటే మనం మనశరీరంలో కణాలలో అగ్ని ద్వారా జరిగే శక్తి ప్రక్రియ అని అన్వయించుకోవచ్చు. )
"సమానం" ఉచ్వాస నిశ్వాసాలను సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాగే "ఉదానం" మనసనే యజమానిని (నిద్రతో) ఆనందం పొందేలా చేస్తుంది. (4-4)
ఇక్కడ ఈ మనస్సు అనే దైవం కలలో, చూసిన వాటినీ చూడనివాటినీ , చూస్తుంది, వినినవాటినీ వినని వాటిని కూడా వింటుంది, అనుభవించినవీ అనుభవించనివీ, నిజమైనవీ నిజంకానివీ అన్నింటినీ చూస్తుంది. (4-5)
(ఇక్కడ అనుభవించనివీ, చూడనివీ ఎల్లా చూస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి పండితులు చెప్పే సమాధానం అవన్నీ పూర్వ జన్మ వాసనలయి ఉండచ్చని. ).
వాసనలు నిలువచేసి ఉన్న చిత్తానికి అడ్డు తగిలినప్పుడు కలలు వచ్చుటకు వీలులేక "సుషుప్తి" (గాఢ నిద్ర) శరీరానికి వచ్చి ఆనందిస్తుంది. (4-6)
ఓ సౌమ్యుడా పక్షులు పగలు ఏవిధంగా దేశసంచారము చేసి రాత్రికి వాటి చెట్టులో ఉన్న గూటికి చేరుకుంటాయో అటులనే అవి అన్నీ (శరీరంలో ని వన్నీ) పరమాత్మను చేరుకుంటాయి. (4-7)
అవి అంటే శరీరంలో ఉన్న పంచ భూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచప్రాణాలూ, నాలుగు అంతః కరణాలూ పరమాత్మను చేరుకుంటాయి (తురీయంలో లయమవుతాయి). (4-8)
చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)
అన్నీ బ్రహ్మలో ఐక్యమయిన తరువాత బ్రహ్మ గురించి ఎల్లా తెలుస్తుంది. మనమే బ్రహ్మగా మారినప్పుడు బ్రహ్మ జ్ఞానము ఎల్లా తెలుస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం.
హే సౌమ్యుడా కారణ శరీరంలేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)
జీవాత్మ, ఇంద్రియాలూ, పంచ ప్రాణాలూ, పంచ భూతాలూ అన్నీ దేనిలో లీనమవుతాయో (అక్షర బ్రహ్మలో) తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వ వ్యాపకం చెందుతాడు.
నా మాట:
శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య "నిద్ర " గురించి అడిగిన ప్రశ్నకి గురువుగారు పిప్పలాద మహర్షి చక్కటి ఉపమానం చెబుతారు.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన కిరణాలు లోపలికి ఎల్లా తీసుకుంటాడో , "నిద్ర" వచ్చేటప్పుడు ఒక వ్యక్తిలో అటువంటిదే జరుగుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా వాటి పాటవాన్ని తగ్గించుకుంటూ విశ్రమణకు చేరుకుంటాయి. అందుకనే ఆ వ్యక్తి నెమ్మదిగా విశ్రమించు స్థితి లోకి జారుకుంటాడు. రాను రానూ వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించ డు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు, నెమ్మదిగా నిద్రకి ఉపక్రమిస్తాడు.
జీవితంలో మనస్సులో నిక్షిప్త మయి సంఘటనలు కలల రూపంలో నిద్రలో కనిపిస్తాయి. ఒకప్పుడు మనకెప్పుడూ జరగని సంగతులు కూడా కలల లోకి రావచ్చు. వాటికి కారణం మన పూర్వ జన్మ నిక్షేపాలు కావచ్చు. కలల గమనానికి అడ్డు తగిలినప్పుడు, కలలు ఆగిపోయి "గాఢ నిద్ర" లో మునిగిపోతారు.
సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాల్ని ఎలా వ్యాపిస్తాడో అల్లాగే వ్యక్తి మేలుకుని నిద్ర లేస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి వాటి స్వస్థానాలకి వచ్చి తమ తమ పనులను చెయ్యటానికి ఉపక్రమిస్తాయి.
పక్షులు పగలు దేశసంచారము చేసి రాత్రికి చెట్టులో ఉన్న గూటికి ఎలా చేరుకుంటాయో అటులనే రాత్రిపూట ఇంద్రియాలు వాటి వాటి స్వస్థలానికి చేరుకుంటాయి. "ప్రాణం", మనస్సు తోపాటు అన్నీ జీవాత్మలో విలీనం అవుతాయి.
చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)
హే సౌమ్యుడా కారణం శరీరం లేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:
No comments:
Post a Comment