ప్రశ్నోపనిషత్ లో ఇంతవరకూ అయిదుగురు శిష్యులు వేసిన వేదాంత ప్రశ్నలకు గురువుగారు పిప్పలాదుల సమాధానాలు చూశాము. చివరి ప్రశ్న ఆరో ప్రశ్న సుకేశ భరద్వాజ క్రింది విధంగా వేశాడు :
"కోసల దేశానికి యువరాజయిన హిరణ్యనాభుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, పదహారు అంగాల పురుషుడు (షోడశకలం పురుషం వేత్థ ) ఎవరో నీకు తెలుసా ? అని. అబధ్ధం చెబితే వారు సమూలంగా నశించి పోతారు. (అందుకని)నాకు తెలియదు అని చెప్పాను. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి " అని . (6-1)
అతనితో మహర్షి ఇలా చెప్పాడు: "ఓ సౌమ్యా ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోపల హృదయంలో ఉన్నాడు. ఆ బ్రహ్మ నుంచే పదహారు అంశాల ప్రపంచం ఉద్భవించింది"అని. (6-2)
ఆత్మ నుండి ప్రాణము, తన నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇంద్రియాలూ, మనస్సు, ఆహారం ఉద్భ వించాయి. ఆహారం నుండి శక్తి , తపస్సు, మంత్రాలూ, లోకాలూ, క్రియలూ వచ్చాయి. లోకాల పేర్లు సృష్టించ బడ్డాయి. (6-4)
మంత్రంలో చెప్పినవన్నీ మనం బ్రతకటానికి కావాలి. "బ్రతకటం" అనేది శరీరమునుండి విడిపోయినప్పుడు, శక్తి స్వరూపాలు అన్నీ వాటి వాటి మూలాల్లో కలిసి స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. అంతేకాదు నదులు, ఏ విధంగా సముద్రంలో కలిసినప్పుడు వాటి నామరూపాలు వదిలే స్తాయో ఆవిధంగా, జీవించటానికి సృష్టించ బడిన వన్నీ మరణ కాలంలో వాటి వాటి నామరూపాలు వదిలి ఆత్మలో కలిసిపోతాయి.
(పిప్పలాదులు) వారితో చెప్పాడు : నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినదింతే . ఇంతకుమించి ఏమీ లేదు. (6-7)
గురువుగారు తనకు తెలిసిన దంతా చెప్పాను అన్న తరువాత శిష్యు లందరూ వారికి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించినందుకు గురువుగారికి, గురువుగారి గురువులందరికీ (గురు పరంపర) నమస్సులు అర్పిస్తారు. (6-8)
నామాట:
వేటినయినా సృష్టించాలంటే శక్తి (energy ) కావాలని మనందరికీ తెలుసు. దానికి ఆకారం, రంగు రుచి వాసనా లేవని కూడా తెలుసు. దానిని చూడలేము పట్టుకోలేమని కూడా తెలుసు. ఉదా: విద్యుత్, మైక్రోవేవ్, ఆకర్షణా శక్తి వగైరా.
విద్యుత్ శక్తి నుండి మైక్రోవేవ్ శక్తి వస్తుంది, ఆకర్షణా శక్తి కూడా వస్తుంది. మనం అర్ధం చేసుకోవటం కోసం మూడింటినీ శక్తి-1, శక్తి-2, శక్తి-3 అని పిలవకుండా విడి విడిగా పేర్లు పెట్టుకున్నాము.
అల్లాగే శక్తి స్వరూపమయిన సృష్టికర్తకు, తాను సృష్టించిన శక్తి స్వరూపాలకు, మన అవగాహన కోసం పేర్లు పెట్టి పిలుస్తున్నాము.
విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రాణం, సూక్ష్మ శరీరం, కారణశరీరం ఇవన్నీ శక్తి స్వరూపాలు. శరీరం లోకి జేరి దానికి జీవత్వం ఇస్తాయి, వచ్చిన పని అయిపోగానే జీవాత్మ లోకి శక్తి స్వరూపాలు మిళిత మవుతాయి; అస్తమించే టప్పుడు సూర్య భగవానుడు లోకి కిరణాలు కలిసిపోయి నట్లు. మళ్ళా ఇంకొక శరీరం చూసుకుని ఆ శరీరంలో విప్పారి, ఉదయపు సూర్య కిరణాలు విప్పారినట్లు, మిగిలి పోయిన పాప కర్మలు అనుభవించేటట్లు చేస్తాయి.
జీవితంలో మనకిచ్చిన చిన్న విచక్షణ జ్ఞానంతో చేసిన పాప పుణ్యాలన్నీ సూక్ష్మ, కారణ శరీరాల్లో క్రోడీకరించి ఉంటాయి, తప్పించుకోలేము. మనసులో వాటిని తలుచుకోండి చాలు బయటికి వస్తాయి. వాటి పరిణామాలు మనం అనుభవించే దాకా మనము పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అందుకనే ఈ చావు బ్రతుకుల విలయం నుండి తప్పించుకోటానికి మంచి పనులు చెయ్యటానికి ప్రయత్నించటం మంచిది.
క్లుప్తంగా ఇదీ సంగతి.
మీరు ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :
Prashna Upanishad - Ancient Indian View on Creation, Time, Matter and Soul
No comments:
Post a Comment