Thursday, January 13, 2022

190 ఓ బుల్లి కథ -- అదో క్రేజీ బ్రేక్ఫాస్ట్ డే

 


పొద్దున్న తొమ్మిదిన్నరకి అక్కడుండాలి. బయట కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అంటే,
పొద్దున్న ఆరున్నరకే లేచి ప్రయత్నాలు మొదలెట్టాము. ఇక్కడ రెండు మూడు సంగతులు చెప్పాలి. పిల్లలకి వాళ్ళ తలిదండ్రులు వచ్చినప్పుడు కొత్త డిస్కవరీస్ చూపించాలని కోరిక. దీనికి ఎన్నుకున్నది వాళ్ళ కిష్టమయిన రెస్టరెంట్. అమెరికాలో ఓమిక్రాన్ ఉదృతంగా ఉండటంతో రెస్టరెంట్ లోపల కాకుండా బయట కూర్చుని తినటం. మూడవది తినే పదార్ధాలు మా కిష్టమైన విధంగా తయారు చేయించుకోవటం.

మాకు రెస్టోరెంట్ బయట తినటం గురించి తెలుసు. మేము న్యూయార్కులో ఒక గ్రీక్ రెస్టారెంట్ ముందర డేరాలో కూర్చుని తిన్నాము. వాళ్ళు వేడి కోసం హీటర్లు అవీ పెడతారని, మాకు ఫరవా లేదు అనిపించింది. గార్లిక్ తినని వాళ్ళు గ్రీక్ రెస్టారెంట్ కి ఎల్లా వెళ్లారు అనే అనుమానం వస్తే అది పెద్ద గాధ ఇప్పుడు చెప్పలేను కానీ ఒక క్లూ ఇస్తాను "నేచర్స్ కాల్".

మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇంటిదగ్గర తొమ్మిదికి బయలుదేరాలి.  ఎనిమిది గంటలకి రెస్టారెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బయట సీటింగ్ కుదరదని. ఏం చెయ్యాలి ఇప్పుడు ?. నేనయితే వెళ్ళటం మానేద్దాము అనుకున్నాను. కొన్ని కొన్ని చోట్ల మన ఇష్ట ఇష్టాలు కుదరవు. అందుకని గమ్మున ఊరుకున్నాను. వాటెవర్ హప్పెన్స్  విల్ హప్పెన్. 

మేము ఏమీ చెప్పలేదు. బిజినెస్ పోతుందేమో అని అనుకున్నారేమో (మేము 9 మంది ఆయె ) ఎనిమిదిన్నరకి రెస్టారెంట్ నుండి మళ్ళా ఫోన్ వచ్చింది. బయట సీటింగ్ పెడతాము కానీ పదిన్నర కల్లా మీరు వెళ్ళిపోవాలని. మేము సరే అన్నాము.

అనుకున్న సమయానికి రెస్టారెంట్ కి వెళ్ళాము. మీరు పైబొమ్మలో చూస్తున్నారే రెండుకుర్చీలు. అవి తీసేసి పెద్ద బల్లలు రెండు, 10 మంది పట్టేటట్లు కుర్చీలు, వరండాలో వేశారు. పైనుండి వేడి గాలి వచ్చేటట్లు హీటర్ ఉంది. టేబుల్ కి రెండు పక్కలా కింద హీటర్లు పెట్టారు. ప్రతి కుర్చీలోనూ కప్పుకోటానికి జంపాకానలు ఉన్నాయి. నేను కప్పుకున్నాను. మిగతావారు కప్పుకున్నారో లేదో నేను చూడలేదు. ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్డర్ చేసుకోవటం, రావటం తినటం కూడా చక చకా అయిపోయాయి. ఫ్రూట్ బార్ కూడా ఉందిట. పిల్లలు లోపలి వెళ్లి తెచ్చుకున్నారు. నేను వెళ్ళ లేదు, తరువాత డబ్బులు వాయిస్తారని భయం. మా ఆవిడ స్వీడిష్ పాన్కేక్స్ ఆర్డర్ చేసింది. నాకు రుచి చూపిస్తానన్నది కానీ చూపించాలేదు. స్వీడిష్ పాన్కేక్స్ మన రవ్వ దోశలు లాగా ఉంటాయి. మేము ఇదివరకు ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసుకుని తీసుకు వెళ్ళి వాటిని తినే వాళ్ళము. ఏదేశం పోయినా జిహ్వ మారదు .

పక్కన కార్లూ జనం పోతూ ఉంటే, సూర్యుడి కిరణాలు కళ్ళల్లో పడుతూ ఉంటే,రోడ్డుపక్కన మా బ్రేక్ఫాస్ట్, మా కున్న సమయంలో ముగిసింది. బిల్లు ఎంతయిందో తెలియదు, మాలోని కొ త్తగా కస్టమ్ మేడ్ BMW ని జర్మనీ నుంచి తెప్పిచుకున్న కుర్రాడు పే చేశాడు. "సూర్యకిరణాల" ని గుచ్చిపెట్టి వ్రాశాను ఎందుకంటే, అది ఒక అదృష్టం,  సియాటిల్ లో మేమున్న రెండు వారాల్లో సూర్యుణ్ణి చూసింది నాలుగు సర్లే మిగతా రోజులన్నీ రోజంతా వర్షం లేక మబ్బులు. తరువాత నన్ను ఇంట్లో వదిలేసి మిగతా వాళ్ళు పార్కులకు బీచ్ లకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చారు.

నేను ఫోటో పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు దీనికి కారణం ఉంది. ఆదివారం బయట 40F (అంటే 4.4C) పొద్దున్న 10 గంటలు , చలి, నేను లోపల థర్మల్ వేర్ వేసుకున్నాను దానిపైన Columbia Zip కోటు దానిపైన winter coat , దానిపైన వాళ్ళిచ్చిన జంపఖానా, నెత్తిన కుచ్చు టోపీ, నన్ను మీరు చూడలేరు.

No comments:

Post a Comment