|
Caboose |
మా US వెస్ట్ కోస్ట్ ప్రయాణంలో సియాటిల్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కి మా అమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అదో గంటన్నర ప్లేన్ ప్రయాణం. ఇక్కడ దదాపు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కాకపోతే సూర్యుడు కనపడుతూ ఉంటాడు. మేముండే చోట రిచ్ మండ్ లో బయట నడుస్తూంటే ఆలివ్ చెట్లూ నారింజ చెట్లూ నిమ్మ చెట్లూ, ఇంటి ముందర పెరుగుతూ పేవుమెంట్ మీద కాయలు రాల్చు తున్నాయి. నేను కొందరి పెరట్లో తాడి చెట్లు కూడా చూశాను.
ఈరోజు ఉష్ణోగ్రత 40F (అంటే 4.4C) డిగ్రీలు. దగ్గరలో ఉన్న బర్కిలీ లో ఉన్న స్టీమ్ ట్రైన్ ఎక్కు దామని వెళ్ళాము (Tilden Park Steam Train). ఇంజిన్ లో బొగ్గులు వేసి నీళ్లు కాగబెట్టి వచ్చిన ఆవిరితో ఇంజిన్ చక్రాలు తిప్పుతారు. ఆ ఇంజిన్ కి పెట్టెలు తగిలించి దానిలో ప్రయాణీకులిని కూర్చోబెట్టి ఇంకో ఊరుకి చేర్చుతారు. మా చిన్నప్పుడు ప్రయాణాలన్నీ పెద్ద పెద్ద స్టీమ్ ఇంజిన్ తో నడిచే రైళ్ళల్లో జరిగేవి. ఈ రైలు ప్రయాణానికి ఎంతో ఆనందంతో ఎదురు చూసే వాళ్ళం. ప్రయాణం పూర్తయ్యేసరికి చొక్కాలమీద అంతా బొగ్గు నలుసులు పేరుకుంటాయి కానీ అప్పట్లో అవి మాకు బాధ పెట్టలేదు.
ఈ పిల్లల స్టీమ్ ట్రైన్ బర్కిలీ అనే ఊరులో ఉంది( ప్రఖ్యాత బెర్కిలీ యూనివర్సిటీ ఇక్కడే). ఇక్కడ కనపడే ఇళ్ళన్నీ బొమ్మరిల్లు లాగా ఉంటాయి. అవే ఒక్కొక్కటీ మిలియన్ డాలర్స్ పైనే. ఇక్కడకి వెళ్లాలంటే కొండా కోనల్లో ఒక గంట ప్రయాణించాలి. డ్రైవింగ్ ఎత్తులూ పల్లాలూ. మేము మూడు సార్లు దోవ తప్పాము. దోవ సరి చేసుకోవటం కూడా కష్టమే. థాంక్ గాడ్ మాకు దగ్గరలో పార్కింగ్ దొరికింది. ప్లాట్ఫారం మీదికి వెళ్ళి టిక్కెట్లు కొనుక్కొని రైలెక్కాము. రైలు ఎక్కటం దిగటం నాలాంటి వాళ్లకి కొంచెం కష్టమే. ఇక్కడ హైస్కూల్ పిల్లలు పనిచేస్తారు. వాళ్ళు ఎక్కటానికి దిగటానికి సహాయం చేస్తారు.
రైల్ ప్రయాణం 12 నిమిషాలు, కొండమీద అడవిలో తిప్పుతూ చివరికి బయలుదేరిన చోటికి తీసుకువచ్చి దింపుతారు. మాతో ఉన్న మా మనవరాలు ఇంకోసారి రైల్ ప్రయాణం చేద్దామంది. దానితో పిల్లా పెద్దా (నేను తప్ప) మళ్ళా టిక్కెట్లు కొనుక్కొని రైలు ఎక్కారు. నేను ప్లాట్ఫార్మ్ మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. రైలు ప్రతి సారీ షుమారు 50 మంది పిల్లా పాపా తో సగం దాకా నిండుతోంది.
|
Berkeley Rose Garden |
ఇంటికి వెళ్ళటానికి క్రిందికి దిగివస్తూ బర్కిలీ "రోజ్ గార్డెన్ " దగ్గర ఆగాము. గులాబీలు ఇంకో రెండు మూడు నెలల్లో "బ్లూమ్" అవుతాయిట. ఈ తోటని చూడటానికి ముచ్చటగా ఒక కొండలోయలో నిర్మించారు. ఇక్కడ చదువుకునే పిల్లలూ పెద్దలూ వచ్చి పోతూ ఉన్నారు. పక్కన టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.
|
బుద్ద ప్రార్ధన శాల |
|
Prayer Wheels |
|
Buddhist Monks |
వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర ఉన్న "Gyuto Foundation" వారి "Buddhist Monastery" కి వెళ్ళాము. ఇక్కడ బౌద్ధ భిక్షువులకి చదువు చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం. పచ్చటి చెట్లతో విశాలమైన ప్రాంగణం ఆకర్షణీయంగా ఉన్నది.అక్కడవున్న ప్రార్ధన శాలలో కాసేపు కూర్చుని ప్రేయర్ చక్రాలు తిప్పి ఇంటికి బయలుదేరాము. ప్రసాదం నారింజ కాయలు ఒక పళ్లెంలో పెట్టి ఉన్నాయి. మేము తీసుకున్నాము.
వస్తూ వస్తూ "Trader Joe " లో ఆగి పిల్లలకి మరునాడు సంక్రాంతి భోగి పళ్ళు పొయ్యటానికి పూలు సామగ్రి కొనుక్కుని ఇంటికి జేరాము.
No comments:
Post a Comment