అమెరికాలో సియాటిల్ పట్టణానికి 165 మైళ్ళ దూరంలో "లేక్ ష లా న్ " అనే ఒక సరస్సు ఉంది. అది 50 మైళ్ళ పొడుగూ ఒక మైలు వెడల్పు 1400 అడుగుల లోతు ఉన్న పెద్ద సరోవరం. ఊరు పేరు కూడా అదే. ఈ ఫ్యూరీ జనాభా 8 వేలు. చిన్నప్పుడు హిమాలయాల్లో మానససరోవరం గురించి తెలుసుకున్నప్పుడు, కొండల్లో చెరువు ఎల్లా ఉంటుందనేది అర్ధం కాలేదు. పైనున్న రెండు ఫోటోలు మేముంటున్న "ఎయిర్ బియన్ బీ " ఇంట్లో నుండి తీసినవి. చుట్టూతా కొండలూ వాటి మీద పడ్డ స్నో, కింద ఉన్న చెరువు. అర్ధమయ్యింది కదా సరోవరాలు కొండల్లో ఎల్లా పుడుతాయో. స్నో కరిగిన నీళ్లు. ఇంకోటి కూడా తెలుసుకున్నాను జారుడు నీళ్ళల్లో ద్రాక్ష బాగా పెరుగుతుందని. కొండల మీదా కిందా బోలెడన్ని ద్రాక్ష తోటలు (ద్రాక్ష తీగలన్నీ చలికాలం లో నిద్రుస్తున్నాయి). రోడ్డు పక్కన బోలెడన్ని "ద్రాక్ష రసం " రుచి చూసే షాపులు. దీనిని "wine tasting " అంటారు. ఊర్కెనే రుచి చూపిస్తారు అనుకునేరు. మేము అల్లాగే బోల్తా పడ్డాము.
ఒకసారి కాలిఫోర్నియా లో "thousand buddhas " అనే చోటికివెళ్ళి తిరిగివస్తూ ఊరుకోలేక రోడ్డుపక్కన కనపడ్డ "wine tasting " కి వెళ్ళాము. డబ్బులు వదిలించుకుని "తాగు బోతు" అనే బోర్డు తగిలించు కోవాల్సొచ్చింది. నా ఉద్దేశంలో ఒక చుక్క తాగినా తాగుబోతు కింద లెక్కే. అనవసరంగా డబ్బులు పెట్టామనే బాధో, లేక ఆ వైన్ తయారు చేసిన మూలాలు తెలుసుకోవాలనే పట్టుదలో, లేక "wine tasting " మైకమో, చూడటానికి మనోజ్ఞంగా ఉన్న నల్ల ద్రాక్ష గుత్తులో, తిరిగివస్తూ రోడ్డు పక్క ఆగి మా ఇంటావిడా ఆవిడ స్నేహితురాలూ పక్కన తోటలోకి దిగి ద్రాక్ష గుత్తులు కోసుకుని తిన్నారు. మేము మగవాళ్ళం, ఎవరన్నా వచ్చి అడిగితే "చూడటానికి వెళ్ళారు" అని చెబుదామని కారులో కూర్చుని ఉన్నాము. మీరు మాత్రం ఈ విధంగా "wine tasting " చెయ్య బోకండి.
ఈ "లేక్ ష లా న్" సరోవరం ఒక చివరి అంచునుండి ఒక సన్నటి జలపాతం కొలంబియా రివర్ అనే నదిలో పడుతుంది. ఇంకో విచిత్రం ఇక్కడ ఏమి చేశారంటే లేక్ లో నుండి ఒక సొరంగం తవ్వి దాని చివర హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
2022 సంవత్సరం ని ఆహ్వానించటం ఇక్కడే జరిగింది. అందరూ తాగుతూ నాకూ రెండు చుక్కలు "షామ్ పైన్" పోశారు. బయట చలి విపరీతంగా ఉంది (17F అంటే -8.33C). ఈ సమయంలో మీరు బయటికి వెళ్ళాలంటే కనీసం రెండు వరసల దుస్తులు అవసరం. నెలల క్రిందట రిజర్వేషన్ చేసినప్పుడు వాతావరణం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు. పొద్దునపూట స్క్రామ్ బుల్డ్ ఎగ్స్ సాయంత్రం పిజ్జా. ఇక్కడ "Safeway " గ్రోసరీ స్టోర్ ఉంది కాబట్టి తినటానికి ఇబ్బంది లేదు. అయినా మా ఆవిడ రైస్ కుక్కర్, బియ్యం తోటి వస్తుంది కాబట్టి నాకెప్పుడూ ఇబ్బంది ఉండదు. తిండి సరీగ్గా తినక బోతే నేను రోజంతా నసుగుతానుట. అన్నము కందిపొడి గోంగూర చింతకాయ మాగాయ, "yogurt " అనే గడ్డ పెరుగుంటే ఇంకేమికావాలి ? అది రోమ్ అయినా పారిస్ అయినా హాంకాంగ్ అయినా హొనలులూ అయినా అల్బుకర్క్ అయినా నాకేటి కొదవ.
ఇక్కడికి వచ్చే టప్పుడు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళు దాటి వచ్చాము (మచ్చుకి వాటిలో రెండు పేర్లు Cashmere , Sultan). ఒక పల్లెటూరు లో (Leavenworth) బోర్డులన్నీ జర్మన్ పేర్లతో కనపడ్డాయి. ఆరా తీస్తే తెలిసిందేమంటే, ఆ ఊళ్ళో పర్యాటకులు ఆగటల్లేదని బాధేసి, ఆవూరి పెద్దలు, అన్నిటికీ జర్మన్ పేర్లు పెట్టి, అలంకరణలు చేసి ఒక "బెవే రియన్ (జర్మన్)" పల్లెటూరుగా తయారు చేశారు. ఇక్కడ ప్రసిద్ధి "nutcracker museum" (కాయల్ని పగలగొట్టే వస్తువులు ). అప్పటినుండీ ఈ ఊరికి పర్యాటకులు ఎక్కువైనారు. మేమూ వెళ్ళాము (నేను తప్ప -- చలి). పై ఫోటోలు అక్కడివే.
ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణించిన 165 మైళ్ళలో మొదటి 50 మైళ్ళు చదును ప్రదేశం తర్వాత అంతా కొండలు ఎక్కటమే. "ఇక్కడి నుండీ కారు టైర్లకి "chains " వెయ్యాలి లేకపోతే కారు all wheel drive అన్నా అవ్వాలి" అనే బోర్డు కనపడింది. రోడ్లమీద స్నో తో కారు జారచ్చని ముందు హెచ్చరిక. రోడ్డుపక్కన కార్లు ఆపి టైర్లకి చాలామంది గొలుసులు వేసుకుంటున్నారు (మాది AWD). వెళ్తూ ఉంటే కొలంబియా రివర్ దానిపక్కన చిన్న ఊళ్ళు వస్తూ పోతూఉన్నాయి. మేము ఊరు చేరుకోటానికి సియాటిల్ నుండి 5 గంటలు పట్టింది.
తిరిగివచ్చేటప్పుడు మంచు తుఫాను వస్తుందని తెలిసి కొంచెం ముందర బయలుదేరాము. పెద్ద గందరగోళం, ఉత్కంఠ. మా బృందంలోని ఎనిమిది మందిలో ఏడాది పిల్లాడి నుండీ 80 ఏళ్ళ కుర్రాడి వరకూ ఉండటంతో వాళ్ళ వాళ్ళ అవసరాలు వివిధ రకాలు. మొదట మాకున్న కారులో అందరం పట్టం కాబట్టి పెద్ద వాన్ అద్దెకు తీసుకోవాల్సొచ్చింది.
వచ్చేటప్పుడు కొంచెం దారి తప్పి ఒక చిన్న ఊళ్లోకి వెళ్ళి పోయి గూగుల్ మా ప్స్ తో సరి అయిన దోవలోకి వచ్చాము. మొదటి 50 మైళ్ళు బాగానే గడిచింది కానీ తర్వాత "snow storm " మొదలైంది. రోడ్డు సరీగ్గా కనపడక చాల నెమ్మదిగా పోవాల్సి వచ్చింది. ప్రపంచం లో మీరు గమనించారో లేదో కొందరికి కష్టమయినది ఇంకొందరికి ఇష్టంగా ఉంటుంది. స్కీ చేసేవాళ్ళకి స్నోపడటం అంటే చాలా ఇష్టం, వాళ్ళు వాళ్ళ ఆటవస్తువులని పట్టుకుని ఆ సన్నటి దోవలో రోడ్డు పక్కన ఉత్సాహంగా నడుస్తున్నారు. జాగర్తగా కారు తోలుకుంటూ కొంత దూరం వచ్చేసరికి స్నో పోయి వర్షం రావటం మొదలయింది. అదీ గొడవే. అది దాటుకుని వచ్చేసరికి పిల్లలు ఆకలి గొడవ. "subway " మహత్యంతోటి అందరినీ శాంతపరిచి, చీకటి పడుతుంటే ఇంటికి జేరుకున్నాము.
ఇదీ క్లుప్తంగా మా "వింటర్ ఔటింగ్".
బలే అండీ! పైన చలాన్ అని రాసారు ఇంగిలీషులో షరాన్ అని పలికారు :)
ReplyDeleteలేక్ పదానికి చెరువు అన్నది తోచక సరస్సు,వగైరాలన్నారు, నా లాగే స్టూల్ కి ఎత్తు పీట మాట గుర్తురాక నేను కొట్టుకున్నట్టు :)అలాగే స్నో స్టారం అన్నారు, మంచు స్టారంకి ఒక మంచి పదం ఉందండీ అదే మంచు తుఫాను.
అంత చలిలో ముసలి ముతక వామ్మ్మో! అదేం సరదా బాబూ!! :)
మొన్నీ మధ్య చదివా అస్ట్రేలియాలో నారింజ తోటల్లోకి అనుమతిస్తారట, ఇరవై డాలర్లు టిక్కట్టు, తిన్నన్ని తిని ఇచ్చే బుట్టనిండా కోసుకు తెచ్చుకోవచ్చట. అటువంటి ఏర్పాటేంలేదూ ద్రాక్ష తోటలకి?
ద్రాక్షాసవం మందు ఆయుర్వేదంలో, వైన్ బి.పి కి మంచి మందు, బి.పి దిగిరానంటోంది,పోనీ రెడ్ వైన్ మంచిదన్నారని దానికోసం వెతికా? దాని ధర చూసి బి.పి మరికొంచం పెరిగింది.
ఫోటో లు బాగున్నాయి.ఎక్కడికెళ్ళినా ఆంధ్ర భోజనం కూడా ఉంటే నరకంలో నైనా గడిపేయచ్చంటారు :)
శర్మ గారూ : స్పెల్లింగ్ కీ, పలకటానికీ తేడా ఉన్న పదాలు కోకొల్లలు. సామాన్యంగా ఇతర దేశస్థులు పెట్టినపెట్టిన పేర్లవి. ఇక్కడ Delhi Salem కూడా ఉన్నాయి కానీ వాటిని పలకటం వేరు.
ReplyDeleteఅమెరికా కదా చెరువని వ్రాస్తే ఫ్యాషన్ కాదని సరస్సు అని వ్రాశా ను. మంచు తుఫాను అంటే మనకి పొద్దునపూట పట్టే మంచు అనుకుంటారేమోనని స్నో స్టారం కి దిగాను. ఇక్కడ కూడా యాపిల్ తోటలకి ఆ వెసులుబాటు ఉంది కానీ నేను అటువంటి వాటి జోలికి పోను. మొన్న వాళ్ళమ్మ తో వస్తూ ఒక కాయ తెచ్చుకుందిట పోలీసుల్ని పిలిచారు.
ఇక్కడ ముసలితనంలో portable ఆక్సిజన్ పెట్టుకుని తిరిగే వాళ్ళు చాలామంది.
బీపీ మందు పొద్దున్న బదులు సాయంత్రం వేసుకుంటే బాగుంటుందేమో మీ డాక్టర్ని అడగండి. కొందరికి అల్లా తగ్గింది.
మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.