Monday, March 29, 2010

16. ఓ బుల్లి కథ 4 ---- మా తాతయ్య ----

మా తాతయ్య ----

ఏవో పాత టేపులు తిరగేస్తుంటే అమ్మవారి మీద మా అమ్మ పాడిన పాట వినపడింది. మనస్సు ఎక్కడికో వెళ్లి పోయింది. "రాజ రాజేశ్వరి --- దేవి కన్యా కుమారి --- రక్షించు జగదేశ్వరీ ' అని మా తాతయ్య రోజూ తెల్లారు ఝామున లేఛి పాడే పాటలు పద్యాల్లో ఒకటి. తెల్లారకుండా తాతయ్య ఎందుకు ఇలా పాటలు పాడుతారు అని నేనెప్పుడు ప్రశ్నించు కోలేదు. అల్లాగే తెల్లవారుతుంటే కోడి ఎందుకు కూస్తుందో కూడా నాకు తెలియదు.

పాటల తరువాత లేచి నిత్య కృత్యాలు జరిగేవి. ఆయన కాఫీ తాగేవారో లేదో నాకు గుర్తు లేదు గాని 8 గంటల కల్లా ఆఫీసు తెరిచే వారు. ఆ ఊరి ఉత్త రాల సంచి అప్పుడే వచ్చేది. నేను అక్కడ ఉంటె ముద్దర్లు వేయటం నా వంతు. అదేకాదు ఉత్తరాలు చదవలేని వారికి చదివి వినిపించటం, సమాధానం వ్రాయడం నా వంతు.

మా తాతయ్య నెప్పల్లి అనే పల్లెటూరికి కరణం గారు, పోస్ట్ మాస్టారు గూడాను. పోస్ట్ జవాను ఉత్తరాలు వూర్లో ఇవ్వటానికి వెళ్ళగానే మా కార్యక్రమం మొదలయ్యేది. సామాన్యంగా ఎవరింటిలోనో పిల్లలకి అక్షరాభ్యాసం చెయ్యటమో , శుభ కార్యాలు అవుతుంటే దీవించ టానికో వెళ్ళేవాళ్ళం. నాకు అక్షరాభ్యాసంకి వెళ్ళటం చాలా ఇష్టం. కొత్త పలకా బలపం వచ్చేవి. తాతయ్య చేత్తో అక్షరాలు దిద్దిన వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారో. ఆ తరువాత ఇంటికి రావడం భోజనం చెయ్యటం విశ్రాంతి. భోజనాలయిన తర్వాత మా అమ్మమ్మ తీరికగా చూరులోనించి పాత ఉత్తరాలు తీసి ప్రతి మాట కూడబలుక్కుంటూ మధ్యాహ్నం ఎండలో పెరటి గుమ్మం దగ్గర చదువు కుంటూ కూర్చుంటుంది. రోజూ అందర్నీ తలుచు కోవటం ఆవిడ కదో తృప్తి.

సరిగ్గా 3 గంటలకి ఆఫీసు తెరుస్తాము. పోస్ట్ బాక్సు లొ ఉన్న ఉత్త రాలు తీసి ముద్దర వెయ్యటం, టపా సంచీ కట్టి బెజావాడ బస్సు దగ్గరకి పంపించటం. ఎవరో ఓకరు వస్తూ పోతూ వుంటారు. దాస్తా వేజులు వ్రాయటం దగ్గరనుండి వంట్లో బాగుండక పోవటం వరకూ మాట్లాడు కుంటారు. మా తాతయ్య దగ్గర వస్తు గుణ దీపిక అనే పుస్తకం ఉండేది. ఏకూరగాయలు తింటే ఏబాధలు పోతయ్యో చూసి చెప్పే వాళ్ళు. వాము వాటరు తోటి కూరగాయల చిట్కాల తోటి బాధలు తగ్గక పోతే ఆచార్లు గారు ఉన్నారుగా గుళిక లివ్వటానికి.

సాయంత్రం మశాయిదు కి వెళ్ళేవాళ్ళు. పొలాలు అమ్మకాలు జరిగినా, హద్దులలో పోట్లాటలు వచ్చినా గొలుసులు తీసుకుని వెళ్లి కొలిచి పోట్లాటలు సద్దేవారు. ఊళ్ళో ఉన్న పొలాలు ఎవరివో వాటి సరిహద్దులు ఏమిటో తాతయ్యకి బాగా తెలుసు ఆ ఊరుకి కరణం గారు కదా. నేను గ్రమఫోనే పెట్టుకుని "కొరీ భజింతుని గోవిందుని మది " పాట మళ్ళా మళ్ళా వింటూ ఉండే వాణ్ని. అదేమిటో గమ్మత్తు గా ఉండేది రికార్డ్ మీద సూది తిరుగు తుంటే పాట వచ్చేది.

నాకు బాగా నచ్చేవి పొలాల రిజిస్టర్ కి కంకిపాడు వెళ్ళితే సాయంత్రం వచ్చే మిఠాయి సున్ని ఉండలు. నాకు ఇంకా బాగా నచ్చేవి పక్కింటి దాక్షాయణి భోషాణం లోనించి తీసి నాకు పెట్టే అరిసలు లడ్డూలు.సాయంత్రం స్నానం చేసి దాక్షాయణి నేను వెళ్లి ఆంజనేయ స్వామీ గుడిలో దీపం పెట్టి వచ్చేవాళ్ళం. రాత్రి బుడ్డి దీపం దగ్గర కాసేపు చదువు కోవటం భోజనం పడక. దాక్షాయణి ఏమి చేస్తుంటుందో ఇప్పుడు.

ఆ తరువాత తాతయ్య కి వంశ పారం పర్యంగా వచ్చే కరిణీకం పోయింది. ఆ వూళ్ళో ఎవరి పొలాలు ఎవరివో అనే గుర్తింపు ఒక్కసారి పోయింది. బాధ్యతగా తగాదాలు తీర్చే పెద్దతనం మూగ బోయింది. అమ్మమ్మ చని పోయింది. ఆతరువాత వయసు మూలాన పోస్ట్ ఆఫీసు ఉద్యోగం కూడా పోయింది. ఆయన గూడా చని పోయారు తొంభై నాలుగు ఏళ్ళకి. కానీ మా తాతయ్య పాడిన పాటలు పద్యాలు అలా మనస్సులో నిలిచి పోయి మా మా గమ్యాల వేపు నడిపిస్తూ ఉంటాయి.

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కుంటూ నిశ్శబ్దంగ తమ పని తాము చేసుకుంటూ పోతూ పరులకి చేయూత నిచ్చే తాతయ్య లాంటి వాళ్ళు మన జీవితం లో ఎందరో కనిపిస్తారు. వారందరినీ తలుచుకుని నమస్కరించటానికే ఈ రచన.

4 comments:

  1. బాగా రాసారండీ :)

    ReplyDelete
  2. wonderfull rao garu

    ReplyDelete
  3. మీ తాత గారితొ పాటు మాతాతగారిని కుడా గుర్తు చేసినందుకు ధన్య వాదములు. ఎందుకంటే ఆ యనకుడా కరణం+ పోస్ట్ మాస్టరూ తాడే పల్లి గూడెం దగ్గర " ఆరుగొలను " అని పల్లెటూరు. ఆ చుట్టు పక్కల 4,5,ఊళ్ళకి మా తాత గారు కరణం.మీరు రాసినవన్నీ అక్షరాల మా అనుభవాలు. కాక పోతె మా తాత గారికి గుఱ్రం ఉండేది. దానికొ బుల్లి పిల్ల గుఱ్రం. ఇక తాత గారి పయనం అంత ఆ గుఱ్రమ్మీదె .మేము కుడా సరదాగా టపా కట్టే వాళ్ళం. మాకు ఏలూరు కాలవ అడ్డం. అందుకని బల్లకట్టు వెంకన్నతో కబుర్లు చెబుతు అవతలి ఒడ్డుకు వెళ్ళే వాళ్ళం. కరణం గారి తాలూకు ఆంటే చాల గౌరవం. అది మనకెంతో గర్వం. ప్చ్! ఆ రోజులు ఆ పల్లెల అందాలు మన తాతలు గత వైభవపు ఆ నందాలు మిగిల్చిన అనుభూతులు.ఇప్పుడు ఏవి ? చాలా బాగుంది మీ కధ కాదు మన కధ నిజమె ఎక్కడ ఏ శుభ కార్యమైన కరణం గారు వెళ్ళాలి. సీతారామ కల్యాణం బామ్మ తాత గారు చేసే వారు. ఇక తాటి ముంజలు తేగలు మామిడి కాయలు కొబ్బరి దానిమ్మ ఇంటిపాడి ఇల ఈ గత వైభవాలు ఎంత మధురమైనవి ? ఆ ప్రేమలు మధుర శ్మృతులు ఎంత అదృష్టం మంచి రచన అందించారు. అభినందనలు.

    రాజేశ్వరి

    ReplyDelete
  4. @రాణి గారికి ధన్యవాదములు. మీ కాలీఫ్లోవర్ ఊరగాయ చెయ్యాలని ఉంది. నాకు గార్లిక్ ఎలర్జీ కాబట్టి కొద్దిగా మారుస్తాను.ఎన్ని రోజుల వరకు ఉండుందో వీలుంటే చెప్పండి.
    @అజ్ఞాత గారికి నమస్కారములు. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
    @రాజేశ్వరి గారికి పాత సంగతులు గుర్తుకు వచ్చినందుకు సంతోషం. పాత సంగతులు నాకు చాలా ఇష్టం. మనకు ఇష్టమయినవి గుర్తు తెచ్చుకుని ఆనందించ వచ్చు. పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

    ReplyDelete