Friday, April 30, 2010

20. ఓ బుల్లి కథ 8 ---- వసంతం లో ఆరోజు

వసంతం లో ఆరోజు ----
వసంత కాలము వచ్చెను. చెట్లు చిగిర్చి పూవులు పూయుచుండెను. స్నో తీయుట ఆపి గడ్డి కోయు సమయము ఆసన్న మాయెను. ఉదయముననే సూర్యుడు ఉదయించెను. పక్షులు కిల కిలా రావములు చేయుచుండెను. బయట మలయ మారుతము వీచు చుండెను. నా మనస్సు ప్రశాంతము గ నుండెను. ఉద్యోగ విరమణ చేసిన తరువాతి కాలములో అది కదా ముఖ్యము. నా ఈ ప్రశాంతతకు కారణము నా ధర్మపత్ని సేవా దక్షిత అని గర్వముగా చెప్పు చుంటిని. ఉదాహరణకు ఈ నాటి నా కార్యక్రమము కాల క్రమముగా (రియల్ టైం లో ) వివరించెదను.

కాల కృత్యములు తీర్చుకొని నా కంప్యూటర్ నకు విద్యుత్ ప్రవాహము ను పంపి 'ఈనాడు' పత్రిక చదువు చుంటిని. క్రింద నుండి కాఫీ అని పిలుపు వినిపించెను. క్రిందకు వెడలి కాఫీ సేవించి 'ఈనాడు' పత్రిక మరల చదువుట ప్రారంభిచితిని. ఆంధ్రలో సంగతులు తెలిసిన వెనుక నా ఈ -మెయిలు లు చూచుట ప్రారంభించి తిని. అవి అయిన వెంటనే ఈ నాటి వాతావరణము మొదలుకొని అమెరికా వార్తలు యాహూ న్యూస్ వారి ద్వారా చదువు చుంటిని. ఐస్లాండ్ లో అగ్ని పర్వతము పేలుట. దానివలన ఏర్పోర్టులు మూసివేయుట. మధ్యలో చిక్కుకున్న ప్రయాణీకుల ఇబ్బందులు చదువుటతో కళ్ళు చెమర్చెను. అంతటిలోనే లంచ్ పిలుపు వినపడెను. పిలిచినప్పుడు వెళ్ళక పోయిన మనకు మనమే భోజన సదుపాయములు చేసుకొన వలసి వచ్చును (పళ్ళెము పెట్టుకుని వడ్డించు కొనుట, తినిన తరువాత వస్తువులు తీసివేయుట వంటివి). అందుకని పిలువగనే బద్ధకము లేకుండగ క్రిందకు వెళ్లి కాఫీ తో సహా భోజనాది కార్యక్రమములు చేయుదును. మనము ఇంకొకరి కష్ట సుఖములు కూడ చూడ వలయును కదా. వెంటనే వెళ్లి మధ్యాహ్న భోజనము చేసి పయికి వచ్చి ఈ నాటి వ్యాపార వార్తలు స్టాక్ మార్కెట్టు గురించి చదువు చుంటిని. మరల కాఫీ అని పిలుపు వినవచ్చెను. క్రిందకు వెళ్లి యాఫ్టర్ నూన్ కాఫీ త్రాగి వచ్చితిని.

కూడలి బ్లాగులను చూచుట ప్రారంభించితిని. కాబేజీ వడలు చేయుట తెలిసి కొనిన తదుపరి నాకు ఉదయము 'ఐ లవ్ యు' అను సబ్జెక్టు తో వచ్చిన ఈ- మేయిలులు గుర్తుకు వచ్చినవి. నేను తీరికగా చదువుదమని వాటిని విడిగా ఉంచితిని. క్లిక్ చేసి చదువుట ప్రారంభించితిని. అంతియే నా ఎదురుగ చిత్ర విచిత్రము లయిన బొమ్మలు వచ్చు చుండెను. కంప్యూటర్ వైరస్ ట్రోజన్ హార్స్ తో వెడలి వచ్చి నా కంప్యూటర్ ని ఆక్రమించినదని చెప్పక తెలియ చెప్పు చున్నది. దానికి తోడు నీ కంప్యూటర్ పాడు అయినది డబ్బులు కట్టిన బాగు చేయుదమని మెరుపులతో కనపడు చుండెను. అవి తీసి వేయుద మనిన పోవుటలేదు. అవి భార్య గారు చూచుటకు తగిన బొమ్మలు కాక పోవుటచే పాత సి డీ లు తీసి విండోస్ లోడ్ చెయ్యుట మొదలు పెట్టితిని. భార్యామణి పయికి వాచ్చునను తొందరలో ప్రశ్నకు ఒక సమాధానము బదులు ఇంకొక సమాధానము ఇచ్చితిని. దానితో కంప్యూటర్ పనిచేయు పద్ధతులను తనంతట తనే తొలగించు కొనెను. ఆ జాగాను కూడ శుభ్రము చేసి తను పని చేయు విధానములను పాత సి డీ ల లో నుండి పెట్టు చుండెను. ఈ పనులన్నియు స్క్రీన్ మీద మెరుపుల ద్వారా బుద్ధిగా చెప్పు చుండెను.ఎంత వరకూ కూర్చొన వలయునో కూడా చెప్పును. మనము ఈ సమయములో చేయవలసినది ఏమియు లేదు. అంతయు అయిపోయి న దని చెప్పిన వెంటనే చూడగా స్క్రీను మీద పెద్ద పెద్ద అక్షరములు కనపడుచు కొత్తగా ఉండెను. ఇంటర్నెట్ లోకి వెళ్ళుటకు కూడా ఏమాత్రము వీలు కనుపడ లేదు. కంప్యూటర్ భీష్మించుకు కూర్చొనెను. సూత్రములు తొలగించి జాగాను శుభ్రము చేయుట వలన కంప్యూటర్ దాని స్క్రీన్ నే గుర్తించ లేక పోయెను. దీనిని కంప్యూటర్ పరిభాషలో డ్రయివరులు లేని కంప్యూటర్ గ గుర్తించి తిని. డ్రయివరులు కోసము వెతక ప్రారంభించితిని.

సాయంత్ర మయ్యెను. కొత్త 'ఈ నాడు' వచ్చును. బిజినెస్ న్యూస్ ఏమిటో తెలియదు. స్టాక్ మార్కెట్టు ఎమయినదో తెలియదు. కూడలి లో వచ్చు బ్లాగులు చూడక పోయిన బ్లాగరులు బాధ పడుదురు. నేను ఇంక ఆగలేక లాప్ టాప్ కొరకు మా ఆవిడని అడిగితిని. లాప్ టాప్ ఆవిడ కోసము ప్రత్యేకముగా ఇచ్చినది. లాప్ టాప్ వాడుట నాకు నామోషి. పెద్ద పెద్ద కంప్యూటర్ లను వాడిన నేను డెస్క్ టాప్ ను వాడుటకే సంకోచించి తిని. చూపుడు వేలుతో నడిపే లాప్ టాప్ అనిన నాకు చులకన. అందుకని నేను దానిని వాడుట నేర్చుకొన లేదు. కంప్యూటర్ లో ఈనాటి సంగతులు చదువక పోయిన యడల ఈ రాత్రికి నాకు నిదుర పట్టు యోగము ఉండదు. అందుకని భర్తగా అధికారము తో నాకు లాప్ టాప్ మీద పని చేయుట నేర్పమని అడిగితిని. మనకు అవసరము ఉన్నప్పుడు, అధికారము చూపుట అంత మంచిపని కాదని తరువాత తెలిసికొంటిని. ఆతరువాత ఎమయినదో నాకు వ్రాయుటకు ఇష్టము లేదు. కొన్ని గంటల వాద ప్రతి వాదముల తరువాత రాత్రి పన్నెండు గంటలకు ఒక అగ్రీమెంట్ కు వచ్చితిమి. దానిని క్లుప్తముగా ఈ క్రింద ఇచ్చు చుంటిని. కాగితము మీద కాంట్రాక్టు వ్రాసి సంతకములు చేసితిమి. వెంటనే ట్రైనింగ్ తీసుకుని లాప్ టాప్ మీద రెండు గంటలలో సంగతులు చదివి హాయిగ నిదుర పోతిని.

మా అగ్రీమెంట్: 1. నేను లాప్ టాప్ వాడిన సమయము గంటలలో లెక్కించి ఆ సమయము లో మరునాడు ఆవిడ చెప్పిన పనులు చేయవలయును. షరా: ఒక గంట పది నిమిషములు వాడినను అది రెండు గంటల క్రిందకు వచ్చును.

2. తను లాప్ టాప్తో పనిచేయుట నేర్పును గనుక నేను డెస్క్ టాప్ బాగు చేయునపుడు ఆవిడకి చూపి నేర్ప వలయును. ఆవిడ వేసిన ప్రశ్నలకు ఓర్పుతో సమాధానములు చెప్పవలయును.

3.లాప్ టాప్తో పనిచేయునప్పుడు 'ఐ లవ్ యు' వంటి ఈ-మెయిల్సు చూడ కూడదు. అడ్డ దిడ్డ మయిన బ్లాగులు కూడ చూడ కూడదు.

4. పయిన చెప్పినవి ఏవిధముగనైన ను అతిక్రమించిన లాప్ టాప్ ప్రివిలేజెస్ పోవును. అతిక్రమణ నిర్ణయము తన పరిధి లోనిది.

సశేషం - ఇంకా ఉంది

Thursday, April 22, 2010

19. ఓ బుల్లి కథ 7 ---- ఇది కధ కాదు - నిజం

ఇది కధ కాదు - నిజం-
@sowmya, @Prasad :ఇద్దరు PhD లు శనగలు తిన్నయడల అసౌకర్యముగా ఉంటుంది అని చెబితే నేను ఒప్పుకో కుండా ఉంటానా. నా తరువాత పోస్ట్ లో దానిని గురించి వ్రాస్తాను. ఇదిగో నా పోస్ట్:

ఇది ఒక బుల్లి వస్తు గుణ దీపిక. ఇందులో వస్తువు శనగలు అనే బీన్సు. నా శనగల పోస్ట్ లో వచ్చిన వ్యాఖ్యలకు సమాధానం ఈ పోస్ట్.
శనగలు బీన్స్ అనే జాతి లోనివి. ఇవి తిన్న యడల కోలేస్టేరోల్ తగ్గుట, రక్తము లోని షుగర్ పరిమితులు నిశ్చలముగా నుండుట, ప్రోస్టేట్ మరియు బ్రేస్ట్ కాన్సర్ రిస్క్ తగ్గుట మరియు, డయాబెటిస్ ఉన్న వాళ్ళ హృద్రోగ రిస్క్ తగ్గుట మొదలయినవి జరుగును అని నిరూపించట మైనది.

పని చేయుటకు కారణములు:బీన్సు లో 1) కాంప్లెక్స్ కార్బోహైద్రే టులు, రెండు రకముల పీచులు (2)కరిగేవి 3)కరగని fibers. మొదటి వి షుగర్ గ మారటానికి అరగటానికి ఎక్కువ కాలము పట్టును. అందువలన షుగర్ లెవల్ లు అకస్మాత్తుగా పెరుగవు. కరిగే
fibers కోలేస్టేరోల్ ని పట్టుకుని అది అరిగే లోపల బయటకి పంపుట మూలమున కోలేస్టేరోల్ తగ్గును. దానికి తోడు ఇన్సులిన్ receptors ను పెంచుటము వలన సెల్ల్స్ ఇన్సులిన్ వాడకము పెరుగును. కరగని fibers నీళ్ళని పీల్చటము మూలముగ ఉబ్బి, తుక్కు ను పెద్ద ప్రేవుల నుండి బయటకు పంపుట తేలిక అగును. వీటి మూలమున కొద్దిగా తినిననూ కడుపు నిండి నటులను, కడుపు ఉబ్బినటుల ను ఉండును.
బీన్సు లో అన్నిటికన్నా ఎక్కువ
fibers , తక్కువ fat ఉండును. అందుకని బరువు తగ్గుటకు ఇవి చాలా మంచివి.
బీన్సు లోని
fibers తొందరగా అరుగవు కనుక ప్రేవులలో పులువుట(ఫేర్మేంట్) మూలముగా గ్యాస్ వచ్చును.
కొద్ది కొద్ది గ తినుట మొదలు పెట్టి క్రమముగ దేహములో బీన్సు జీర్ణశక్తిని పెంచుట మూలముగ అజీర్ణ బాధను తగ్గించ వచ్చును.
ఇన్ని మంచి గుణములు గలిగిన
శనగలను రోజుకు నాలుగు తినిన మంచిది కదా.

బీన్సు వండు విధానము:
మొదట బీన్సు ని గిన్నెలో నీళ్ళ లో పోసి కనీసము రెండు అంగుళముల నీరు పయిన ఉండునటుల చూసి బోయిల్ అయ్యేదాకా ఎక్కువ సెగ లో పెట్టండి. ఆ తరువాత సెగ తగ్గించి పది నిమిషములు మరగ పెట్టండి.

తరువాత నీళ్ళు అన్నీ పారబోసి కొత్త నీరు పోసి కనీసం రెండు అంగుళముల నీరు పయిన
ఉండునటుల చూసి
ముప్పది నిమిషములు ఆగండి.

తరువాత నీళ్ళు అన్నీ పారబోసి కడిగి మరుల కొత్త నీరు కనీసం రెండు అంగుళముల పయిన
ఉండునటుల చూసి చిన్న సెగ లో రెండు గంటలు మెత్త పడే దాకా ఉడికించండి.

ఈ విధముగా చేసిన బీన్సు లో ఉండు గ్యాస్ తయారు చేయు షుగర్స్ అన్నీ పోవుటకు అవకాశము కలదు.
బీన్సు తో వంటపదార్ధములు తయారు చేయునప్పుడు ఒక టీ స్పూను అల్లము వేసినను ఫలితము వచ్చును.
బీన్స్ తినునప్పుడు వాటితో caraway seeds తిన్న నూ , one caraway capsule... or one parsley oil capsule వేసుకోనిన ఫలితము కలుగును.

నేను వైద్యుడిని కాను. క్షణిక(పార్ట్ టైం) ఆనందము కోసము వంట చేయు అల్ప సంతోషిని. బీన్స్ గురించి ఇంకనూ విశేషములు కావలసిన ఈ క్రింది వాటిని చూడగలరు. గూగుల్ తో కూడా పరిశోధించ వచ్చును.

The Doctors Book of Food Remedies By Selene Yeager
Prevention Health Books( Rodale Inc.)

Bottom Line/Women’s Health interview Violet I. Haraszthy, DDS, PhD,

"నాన్న" బ్లాగు లో "మీకు తెలుసా" పోస్ట్ (ఏప్రిల్ 7, 2010).


Tuesday, April 13, 2010

18. ఓ బుల్లి కథ 6 ---- శనగలతో నా చిట్కా వైద్యం

శనగలతో నా చిట్కా వైద్యం ----
ఇవాళ రహస్యముగ  ఒక కొత్త పరిశోధన చేయవలయునని  నిర్ణయించు కొంటిని.  మద్య నాకు కొంచం మతిమరుపు ఎక్కువ అయినది దానికి చిట్కా మందు కనిపెట్టవలె నని అనుకొనుచుండగా ఒక మంచి "క్లూ" దొరికినది. ఇంటి ఆవిడ ఆఫీసు కి వెళ్ళిన వరకు ఆగి ఒక "క్యాన్" "గర్బాన్జో" కొనుక్కుని వచ్చితిని. వచ్చి కట్ చేయుచుండగా "క్యాన్" ఒపెనేర్ మధ్య మధ్యలో స్లిప్ అయి మూత వచ్చుటలేదు. రేకు వంచి తీయుదమని ప్లయర్సు కోసం వెతుకుట జరిగినది. అవి కనపడలేదు. మా ఇంటిలో ఇటువంటివి ఎచ్చట ఉండునో నాకు తెలియదు. టూల్స్ అన్నీ ఒక చోట పెట్ట మని ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినరు. కాగా పోగా ఉపయోగించే వాళ్లకి ఎక్కడ ఉన్నయ్యో తెలుసు అని ఎద్దేవా చేస్తారు. మా ఇంటిలో చేతి వాటం వాడిని (హండీ మాన్ ) నేను కాదు. నా పరిశోధన విరమించుకునే పరిస్థితి ఏర్పడి నాకు చాలా బాధ వేసినది.

అసలు నేను చేసిన తప్పు ఉబుసుపోక "నాన్న" బ్లాగ్ చదువుట. దానిలో శనగలు ఎంత మంచివో వ్రాసితిరి. శనగలు తింటే ఎలా ఉండునో చూపుటకు ఒక ఫోటో గూడ ఉంచిరి. అది చాలా బాగుగ  ఉన్నది. మొన్న అటువంటిది ఒకటి తీయించు కుంటిని గాని, అది
సైడ్ ఫోజులో తీయటముతో నా బొజ్జ బయట పడెను.  వ్యాయామ యంత్రముల ముందర బొజ్జ బాగుండదు కదా అందుకని నా ఫోటో పెట్టలేదు. ఇంతకీ చెప్పొచ్చే దేమిటనిన అది చదివి తరువాత, శనగలు తినిన మైండ్ చాలా బాగా పనిచేయునని  గట్టి నమ్మకము  కలిగినది. ఎందువలన అనిన శరీరం చక్కగా ఉండుటకు  మైండ్ కదా ముఖ్యము .అందుకనే పేరంటపు  శనగలు తిని తిని మన ఆడవాళ్ళకి చాలా తెలివి తేటలు వచ్చి ఉంటవని నా అనుమానము. మనని పేరంటములకు చస్తే పిలవరు కదా. మధ్య మా ఆవిడ పేరు గూడా గుర్తు ఉండక "ఆవిడ" అని అనుచుంటిని. ఆవిడ ఆఫీసు నుండి వచ్చే లోపల శనగలు తో మైండ్ చిట్కా మందు తయ్యారుచేయుదమని అని అనుకుంటిని. ఇప్పుడు "క్యాన్" మూత వచ్చుటలేదు. డబ్బా లో నుండి శనగలు ఎటుల తీయ వలయునో ఏమి చేయవలయునో తోచటము లేదు.

పెద్ద పెద్ద వాళ్ళు స్నానము చేస్తూ ఉన్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి క్లిష్ట మయిన సమస్యలని పరిష్కరించారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అది కూడా ప్రయత్నించితిని. అరగంట స్నానము చేసినను సమాధానము దొరకలేదు. దిగులుగా డ్రెస్ వేసుకుని తలదువ్వుటకు దువ్వెన కొరకు మధ్య అర తీసితిని, ఎదురుకుండా ప్లయర్సు కనపడినది. రిలేటివిటీ థియరీ ని మళ్ళా కనుక్కున్నంత ఆనందము కలిగినది.

ఇంక నా పని నల్లేరు నడక నుండి పచ్చగడ్డి మీద పరుగుగ మారి పోయినది. వెంటనే రేకు వంచి శనగలు తీసి మూడు సార్లు బాగా కడిగి ఆరబోసితిని. రెండు నోట్లో వేసుకొంటిని. పచ్చివి రుచిగ లేవు. రుచి తెప్పించుట  నాకు పెట్టిన విద్య. భగుణె లో రెండు స్పూన్స్ నూనె (ఆలివ్ అయితే ఇంకా మంచిది) వేసి, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు జీల కర్ర, నాలుగు మెంతులు, చిటికెడు పసుపు , ఒక ఎండు మేరప తుంచి వేసితిని. వేగిన తరువాత ఆరిన శనగలు పోసితిని . శనగలు వేగుతున్నప్పుడు నీళ్ళు ఉండటము వలన  
పేలును. నీళ్ళు పోవు వరకు వేయించి పావు స్పూన్ కారము ఉప్పు వేసి పులుపు కోసం నిమ్మకాయ పిండితిని.

ఇంక నా ఆనందమునకు అంతు లేదు. ఎందుకైనా మంచిదని
పొటాసియం కోసం అరిటిపండు ఒకటి తింటిని. నా మెదడుకి మందు ఇప్పుడు నా చేతులలో ఉంది. రెండు గింజలు నోట్లో వేసుకుని రుచి చూసితిని. బ్రహ్మాండముగా ఉండెను. గబా గబా ఒక గుప్పెడు తీసుకు ని తింటిని. తలుపు తాళం తీసుకుని వచ్చుచున్న చప్పుడు అయినది. స్వరాజ్యం వచ్చావా అని సంతోషం పట్టలేక పెద్దగ అంటిని. పేరుపెట్టి పిలుస్తున్నారు? ఏమిటి విశేషం అన్న సమాధానం నా చెవులకు విందయినది. ఇన్నాళ్ళకు మా ఆవిడ అసలు పేరు తిరిగి గుర్తుకు వచ్చెను. "యురేకా" అని అరిచితిని. నా చిట్కా మందు పనిచేసినది. నా పరిశోధన ఫలించినది. నా కనులు ఆనంద భాష్పముల తోటి నిండిపోయినవి.

మాతృక "నాన్న" బ్లాగు లో "మీకు తెలుసా" పోస్ట్ (ఏప్రిల్ 7, 2010). వ్రాసిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

లక్కరాజు శివరామ కృష్ణారావు

Monday, April 5, 2010

17. ఓ బుల్లి కథ 5 ---- మీరంటే నా కెంతో ఇష్టం

మీరంటే నా కెంతో ఇష్టం ----
ముప్పది ఏళ్ల క్రిందట, మాత్రు దేశానికీ పదివేల మైళ్ళ దూరం లో ఉన్నా, ఔత్సాహిక తెలుగు సంసారాలని వేళ్ళ మీద లెక్కించినా, నావి అని చెప్పుకోటానికి ఉన్నవి తక్కువైనా, ఇది నా మాతృభాష ఇది నాది ఇది గుర్తు పెట్టుకోవాలి అని నడుము బిగించి గొంతు సవరించి ఒక బృహత్కార్యముగా ఉద్యమించి చికాగో లో తెలుగు వెలుగు పత్రిక నడిపిన వారు అంటే నా కెంతో ఇష్టం.
మీరు ఈనెల తప్పకుండా వ్రాసి పంపించాలి అంటూ ఫోనుల మీద ఫోనులు చేసిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన వాటిని శ్రద్ధగా కూర్చుని తెలుగు లో చక్కగా స్వదస్తూరితో కాగితము మీద పెట్టిన వాళ్ళు అంటే నాకు చాలా చాలా ఇష్టం.

నాతో పరిచయమున్న వీళ్ళకి

ద్రోణంరాజు అనసూయ, ద్రోణంరాజు శ్రీరామకృష్ణ, ద్రోణంరాజు వాసవి, దామరాజు మూర్తి, దామరాజు లక్ష్మి, యడవల్లి రమణమూర్తి, శ్రీపాద నాగేంద్ర, వేలూరి వెంకటేశ్వరరావు, చింతా రాణి సంయుక్త.

ఇంకా నాకు పరిచయము లేని వాళ్ళ కేందరికో, మన తెలుగు మనతో పాటే జీవిస్తుంది అని చూపించి నందుకు నా ధన్య వాదాలు. వీళ్ళందరూ చికాగో లో తెలుగు కి వెలుగు నిచ్చిన వాళ్ళూ వీళ్ళూ.

లక్కరాజు శివరామకృష్ణారావు

నా చిన్న కవిత జనవరి 1989 తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు.

ఇలా మొదలవు తుంది
నువ్వంటే నాకెంతో
ఇష్టం
కమ్మగా చెప్పాను
సత్యం
ఇంక మీరు బొమ్మని క్లిక్ చేసి చదవండి