Monday, September 26, 2011

72 ఓ బుల్లి కథ 60 --- పరంధామయ్య పెళ్ళి

                       పరంధామయ్య పెళ్ళి
                                                     రచన: లక్కరాజు శివ రామకృష్ణ రావు

     పరంధామయ్య కోసం అరగంట నుండీ ఎదురు చూస్తున్నాను. పెళ్ళి గురించి చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. సమయం తక్కువ. పెద్దలు ఏ విషయంలో ఆలేస్యం చేసినా పెళ్ళి విషయంలో చెయ్యవద్దంటారు. మా పెళ్ళి ముహూర్తానికి ఖచ్చితంగా మంగళసూత్రం కట్టక పోతే జీవితం ఎల్లా ఉండేదా అని నేను అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. మా ఇంటావిడ గ్రహాలూ నా గ్రహాలూ కూడబలుక్కుని సామరస్యంగా ఉండే ముహూర్తం కుదరటానికి నేను నెల రోజులు శలవ పొడిగించి తెల్లవార్జామున నాలుగు గంటలకు లేవ వలసి వచ్చింది. ఇప్పటికీ నాకు ఇంకా అనుమానం వస్తూ ఉంటుంది, మాకు పెళ్ళి  చేయించిన అయ్యవార్ల గడియారం నిమిషమో అరనిమిషమో తప్పని. ఈ తెలివి నా కప్పుడు ఉంటే  పెళ్ళి ముందర ఒక మంచి స్విస్ గడియారం అయ్యవార్లకి బహుమతిగా తెచ్చే వాణ్ణి.

పరంధామయ్య మా ఆవిడని అడిగాడుట "నేను పెళ్ళిచేసుకోటానికి ఇండియా వెళ్తున్నాను ఏ విధంగా పెళ్ళి కూతురిని సెలెక్టు చేసుకోవాలి" అని. మా ఆవిడ  ఊరుకుండ లేక , "మొగవాళ్ళు ఆడవాళ్ళలో ఏమిచూసి పెళ్ళి చేసుకుంటారో నా కెల్లా తెలుస్తుంది, ఆ మహరాజునే అడుగు" అందిట. ఇంకా బాధ్యత నా మీద పడింది. "పరంధామయ్యా ఇది చాలా జాగర్తగా ఆలోచించ వలసిన విషయం. రేపు ఇంట్లో వాళ్ళందరూ టప్పర్వేర్ పార్టీకి వెళ్తారు. తప్పకుండా ఆరు గంటలకి వచ్చావంటే తీరిగ్గా మాట్లాడుకుందాము" అని చెప్పి పంపించాను.

పరంధామయ్య మెల్లిగా తలుపు తీసుకు వచ్చాడు. నేను ముభావంగా కూర్చున్నాను. నాలో అసంతృప్తి మోహంలో  కనపడుతున్నదల్లెవుంది  "క్షమించండి మాస్టారూ కొంచెం ఆలేస్యం అయ్యింది" అని చేతిలో ఉన్న డూనట్ బాక్సు ఎదురుకుండా పెట్టాడు. దానిలో నాలుగు ఫ్రెంచ్ కర్లర్స్ కనపడేసరికి నాకు ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది. వెంటనే క్షమించేసాను. కుర్రవాడికి ఎదుటి వాణ్ని ఎల్లా మంచి చేసుకోవాలో తెలుసు. బాగుపడతాడు. మంచి లక్షణం.

"పరంధామయ్యా అసలే ఆలేస్యం అయ్యింది. త్వరగా నేను చెప్పెవేవో చెప్పేస్తాను. నువ్వు మాత్రం నా ధోరణికి అడ్డురాకు. నీకేమన్నా సందేహాలు ఉంటే అంతా అయ్యే దాకా ఆగు" అని వెంటనే మొదలు పెట్టాను.

" ఏ విధంగా చెప్పాలో రాత్రి నుండీ ఆలోచిస్తున్నాను. సూక్ష్మంగా  సింపుల్ గ చెప్తాను. మూడే మూడు సూత్రాలు గుర్తుపెట్టుకో. మొదటిది భోజనం. రెండొవది చదువు. మూడొవది  అందం" అని ఒక ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. వీళ్ళు ఎల్లా చేస్తారో గానీ ఒకసారి రుచి చూస్తే మళ్ళా మళ్ళా తినాలని అనిపిస్తుంది. పాలకొల్లు పూత రేకుల్లా నోట్లో వేసుకుంటే కరిగి పోతాయి.

"నాయనా పరంధామయ్యా జాగర్తగా విను. భోజనం అనేది చాలా ముఖ్యమైనది. భోజనం లేనిది జీవించలేము. జీవితం లేక పోతే భార్యా పిల్లలు, ఇల్లూ వాకిళ్ళూ, అందం చందం, డబ్బూ గిబ్బూ, సెక్సూ గిక్సూ ఇవన్నీ ఉండవు. కావాలంటే రెండు రోజులు పస్తు పడుకొని చూడు జీవితంలో ఏది ముఖ్యమో తెలుస్తుంది. మొగుడూ పెళ్ళాలలో ఎవరో ఒకరికి వంట రావాలి. నీకు ఎల్లాగూ వంట రాదు. నీవు వంట బాగా చేసే అమ్మాయిని చేసుకున్నావంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది నాయనా" అని చెప్పి రెండో ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. దాని తస్సాదియ్యా ఏమి రుచి. ఫ్రెంచ్ వంటకాలు బ్రహ్మాండంగా ఉంటాయని వినటమేగానీ ఫ్రెంచ్ కర్లర్ తినేదాకా ఇంత మహదానందం కలగచేస్తాయని   అనుకోలేదు.

"రెండవది చదువు నాయనా. భార్యా భర్తలు మాట్లాడుకోటం చాలా ముఖ్యం. నువ్వు సైన్సు చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే --- బ్యురెట్ల గురించి పిప్పెట్ల గురించీ మాట్లాడుకోవచ్చు. లేకపోతే పక్కింటావిడ మొన్నీ మధ్య చేయించుకున్న నగల గురించి మాట్లాడవలసి వస్తుంది. అది డేంజర్. ఆ తరువాత మూగ చూపులూ మూగ భాషలూ వస్తాయి. వాటి అర్ధం ఏమిటో తెల్సా !. నీకు ఇష్టం లేకపోతే నువ్వే వంట చేసుకో. నీ బట్టలు నువ్వే ఉతుక్కో. నీ అంట్లు నువ్వే తోముకో అని". 

"ఇంకా నీకు ఇష్టమయితే కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళని చేసుకున్నావంటే ఇంకా మంచిది. కట్నం గిట్నం కోసం బలవంతం చేయ్యబోకు. మనింటికి రాంగానే పనిలో పెట్టచ్చు. అక్షయ పాత్ర లాంటిది నాయనా. నెల నేలా పది రూకలు వస్తూ ఉంటాయి" అంటూ మూడో ఫ్రెంచ్ కర్లర్ నోట్లో వేసుకున్నాను. తస్సాదియ్యా వీటి మాజిక్ ఏమిటో.

"మూడోది అందం నాయనా. అందానికి అర్ధం లేదు. ఏ రంభని చేసుకున్నా చూస్తూ కూర్చునేది మొదటి నాల్గు రోజులే. ఆతర్వాత ఏమిటలా చూస్తూ కూర్చున్నారు? --- ఆ గార్బెజీ బైట పెట్టండి. బట్టలు మాసినట్లున్నాయి ఉతకకూడదూ! ఈ వంట ఎంత సేపటికీ అవటల్లేదు, పార్టీకి టైము అవుతోంది. ఆ బాత్రూం కొంచెం క్లీన్ చెయ్యకూడదూ --- ఇటువంటివన్నీ వింటావు నాయనా. అందుకని ఏదో సింపుల్ గ చూపులకి నచ్చిన అమ్మాయిని చేసుకున్నావంటే జీవితం బాగుపడుతుంది" అంటూ చివరి ఫ్రెంచ్ కర్లర్ తినేశాను.

పరంధామయ్య ఏమీ మాట్లాడే పరిస్థితి లో లేడు. మంచి దీర్ఘాలోచనలో ఉన్నాడు. నా మాటలు పెద్ద నచ్చలేదని మోఖంలోనే కనపడుతోంది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగమన్నాను. 

"మీరు చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ బోజనానికి మొదటి ఇంపా ర్టేన్సు ఇవ్వటం అంత బాగా లేదండి. ఈ మైక్రోవేవ్ కాలంలో నీకు వంటవచ్చునా అని ఎల్లా అడిగేదండీ" అన్నాడు.

"నాయనా నేను చెప్పవలసినదేదో చెప్పాను. మైక్రోవేవ్ తిండి నువ్వు తినలేవు. నేను తినలేను. మనకి చింతకాయ ముద్దో, కందిపచ్చడి ముద్దో ముందు పడితే కానీ ముద్ద గొంతు నుంచి దిగదు. నేను ఆఫీస్ మూయగానే ఇంటికి ఎందుకు పరిగెత్తుకు వస్తానంటావు?" అని ఎఫెక్ట్ కోసం ఆగాను. పరంధామయ్య ముఖంలో ఏమీ మార్పు కనపడలేదు. చెప్పేవాళ్ళు అల్లా ఆగినప్పుడు వినేవాళ్ళు చప్పట్లు కొట్టడం ధర్మం. లేదా కనీసం మీరు చెప్పేది నిజం అనాలి. లేదా కనీసం భళిరే అంటూ తల అన్నా ఊపాలి. నాకు కొంచెం బాధగానే ఉంది. నా మాటలు దున్నపోతు మీద వర్షం లాగా అవుతున్నాయి. 

కుర్రవాడి ప్రశ్నకు నేను సరీగ్గా సమాధానం చెప్పినట్లు నాకు అనిపించలేదు. నాకూ బాధ గానే ఉంది. ఎదుటి వారు వంట సరీగ్గా చెయ్యగలరో లేదో వారిని అడగకుండా తెలుసుకోవటం ఎట్లా? అందులో పెళ్లి చూపుల్లో !. దీనికి సరియిన సమాధానం నాకే తోచలేదు. అందుకనే వెంటనే ప్రారంభించాను కర్మ సిద్ధాంతం తోటి. వారానికి ఒకసారి గుడికెళ్ళి ఉపన్యాసాలు వినటం భలే పనిచేసింది. 

"నాయనా మన ప్రయత్నం మనం చెయ్యాలి. చివరికి మన ఖర్మ ఎల్లా ఉంటే అలా అవుతుంది. నీకు ప్రయత్నం చేసినా వంట చేసే భార్య దొరక లేదనుకో. నీవు బాధ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పాట్లక్ సంఘంలో చేర్పిస్తా.  నెలకోసారి తృప్తిగా భోజనం చెయ్యొచ్చు. ఆచార్లు గారింట్లో కొబ్బరి పచ్చడి ఉంది చూసావ్. అదేమిటోనోయ్ ఏవిధంగా చేస్తారోగానీ ఆ రుచి ఎక్కడా రాదు. శాస్త్రి గారింట్లో కందిపచ్చడి! నువ్వు తప్పకుండా తినాలి." అన్నాను.

"మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ" అంటుండగానే కారు శబ్దం వినపడింది. వెంటనే మాటకి అడ్డుపడి " పరంధామయ్యా ! ఆడంగులు వచ్చారల్లె ఉంది ఇంకా ఆపేద్దాము. నేను చెప్పిన ఆ మూడు సూత్రాల గురించీ కొంచెం ఆలోచించు" అని చెప్పి "ఇదుగోనేవ్, పరంధామయ్య నీ కోసం డూనట్లు తెచ్చాడు" అని మాట మార్చేశాను. మొగవాళ్ళు ఏం మాట్లాడు కుంటున్నారో ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ రోజు తరువాత పరంధామయ్యతో తీరిగ్గా మాట్లాడటం పడలేదు. ఇవ్వాళే ఇండియా వెళ్ళిపోతున్నాడు. నేనే స్వయంగా కారులో ఎయిర్పో ర్టుకి తీసుకు వచ్చాను. నా సూత్రాలు ఆచరణలో పెట్టించాలిగా మరి. మనస్సులో ఏదో బాధగా ఉంది. ఏదో చెప్పాలని అనిపిస్తోంది. ఇద్దరం మౌనంగా ఉన్నాము. మూగభావాలు మా ఇద్దరి మనస్సుల్లో ఏవో మెదులుతూనే ఉన్నాయి.

పరంధామయ్య తో గేటు దాకా వచ్చాను. చివరి గూడ్బై చెప్పాను. ఇంకొక క్షణంలో కనుమరుగవుతాడు. ఇంక నేను ఆగలేక పోయాను. "పరంధామయ్యా ఆ మూడు సూత్రాలూ మర్చెపోబోకు" అని పెద్దగా అరిచాను. చుట్టూతా ఉన్న జనం నా కేసి వింతగా చూస్తున్నారు. ఎవ్వరేమనుకుంటే నాకేం కుర్రవాడు జారిపడకుండా నేను చెప్పవలసినది చివరిదాకా చెప్పాను అనుకుంటూ తృప్తిగా ఇంటి దోవ పట్టాను.

(స్వగతం: అప్పుడప్పుడూ నేను వ్రాసిన పాత కధలు చదువుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాను.ఈ నా చిన్న కథ ఆగుస్టు 1992 లో తెలుగు వెలుగు (చికాగో తెలుగు అసోసియేషన్ ) లో ప్రచురించారు. అచ్చుతప్పులు సవరించి పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ముసి ముసి నవ్వులు తెప్పిస్తుంది అని అనుకుంటాను.)


13 comments:

  1. ముసిముసినవ్వులేం ఖర్మ, బాగానే నవ్వించింది. కొన్ని వ్యాక్యాలు సింప్లీ ఆసమ్

    "మనస్సులో ఏదో బాధగా ఉంది. ఏదో చెప్పాలని అనిపిస్తోంది. ఇద్దరం మౌనంగా ఉన్నాము. మూగభావాలు మా ఇద్దరి మనస్సుల్లో ఏవో మెదులుతూనే ఉన్నాయి." హ హ హ
    - తెల్లవార్జామున నాలుగు గంటలకు లేవ వలసి వచ్చింది (ఇదో అడిషనల్ టార్చర్:-)
    - పాట్లక్ సంఘంలో చేర్పిస్తా. నెలకోసారి తృప్తిగా భోజనం చెయ్యొచ్చు.
    --చెప్పేవాళ్ళు అల్లా ఆగినప్పుడు వినేవాళ్ళు చప్పట్లు కొట్టడం ధర్మం. లేదా కనీసం మీరు చెప్పేది నిజం అనాలి. లేదా కనీసం భళిరే అంటూ తల అన్నా ఊపాలి. నాకు కొంచెం బాధగానే ఉంది.
    -ఏ రంభని చేసుకున్నా చూస్తూ కూర్చునేది మొదటి నాల్గు రోజులే

    ReplyDelete
  2. మీరు చెప్పిన విధానం చాలా బాగుందండి.

    ReplyDelete
  3. మజ్జిగాన్నంలో మామిడికాయ ముక్క చీకుతున్నంత ఆనందంగా ఉంది మీ వ్యాఖ్య. KumarN గారూ థాంక్స్ ఫర్ ది కామెంట్.

    ReplyDelete
  4. వివాహం అనేది ప్రతీ వారి జీవన బాటలో సామాన్యంగా సంభవించేది.దీనికి కుస్తీలుపట్టి జుట్టుపీక్కుని నిర్ణయాలు తీసుకోవాలి అని భావించ వలసిన అవసరం లేదు. మనము అనుకున్నవి జీవితంలో అనుకున్నట్లు ఎప్పుడూ జరగవు. ఏదో సరిపెట్టుకుని తృప్తిగా జీవిస్తాము. పెళ్లి కూడా అంతే. anrd గారూ మీ వ్యాఖ్యకు థాంక్స్.

    ReplyDelete
  5. "కుస్తీలుపట్టి జుట్టుపీక్కుని నిర్ణయాలు తీసుకోవాలి"
    Rao గారూ, you are frikking awesome :-)))))))))))))))).

    చాలా సార్లు కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోతాను కానీ, నేను మీకు వీరాతివీర పంకానండీ. ఆయురారోగ్యానందాలతో కలకాలం వర్ధిల్లండి!

    ReplyDelete
  6. నమస్కారములు రావు గారూ !
    పరంధామయ్య పెళ్లి బాగుంది. మంచి హాస్యం తొ చక్కని ఆర్టికల్నిఅందించారు. ధన్య వాదములు . ఇంకా ఇలాంటివి మరిన్ని మీ కలం నుంచి జారువాలాలని

    ReplyDelete
  7. @KumarN గారూ థాంక్స్.

    @రాజేశ్వరి గారూ మనస్సు లో ఏ ఆలోచనలు ఎలా ఎప్పుడు వస్తయ్యో తెలియరాలేదు. ఇంకా బ్రెయిన్ పుస్తకాలు చదవటం పూర్తి కాలేదు.ఆహ్లాదకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు అంతర్జాలంలో అందరికోసం వదిలేస్తా మిగతావి మా ఇంటావిడ మీద ప్రయోగిస్తా. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  8. శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
    `పరంధామయ్య పెళ్లి' కథ చదివి, నా మాటలు కొన్ని చెబుదామని వాటిని పోస్ట్ చేస్తే, పోస్ట్ కావటంలేదు మీ సైట్ లో. అందుకని, విడిగా పంపుతున్నాను.
    `` శ్రీ లక్కరాజు గారికి, నమస్కారములు.
    కధ అదిరింది. అయితే, ఇది `పురుషులకి మాత్రమే' అని ముందుగా వ్రాయకపోతే, కష్టాలు తప్పవేమో! `జీవితం అంటే జీవితంలో సర్దుకుపోవటమే ' అని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అయినా, ఎదురు కాళ్ళతో పుట్టిన వారిని మినహాయిస్తే (వీరు నిజ జీవితంలో అన్నిటిని ఎదుర్కోగలమనే ధీమాతో వుంటారు) పుట్టిన ప్రతి జీవి, పుట్టకముందే, `అమ్మ పొట్టలో సర్దుకొని బతకటం' నేర్కుకొనే వుంటాడు. కాబట్టి, మీరన్నట్లుగా నిజ జీవితంలో సర్దుకోక తప్పదు.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
  9. @మాధవరావు గారూ
    పెళ్ళిళ్ళు మన ముందు తరాల వాళ్ళలో జరిగినాయి మనతరంలో జరుగుతున్నాయి ముందర తరాల్లో జరగబోతాయి. స్త్రీ పురుషులు కలిసి సంసారం చేస్తారు. కొట్టుకుంటారు, గుద్దుకుంటారు. జీవించాలి కాబట్టి సద్దుకు పోతారు. ఇది ప్రకృతి సహజం. పెళ్ళి చేసుకోవటం ఎంత తేలికో చూపించటమే ఈ బుల్లి కధ ఉద్దేశం. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  10. @శ్రావ్య గారూ
    ఊళ్లు తిరుగుతున్నాను. ఆలేస్యమయింది. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete
  11. chaka bavundi...evo choclates chapparistu advise cheppatam bhalega vundi....sentences bavunnayi..naku ilanti small stories ante chala ishtam...

    ReplyDelete
  12. @maha గారూ
    పెళ్ళంటే జీవితాంతం చాకోలేట్లు చప్పరించాలనే ఊహతో చేసే ప్రయత్నం. చాకోలేట్లు చప్పరిస్తూ(పెళ్ళి అయినవారు) చెప్పే సలహాలు తప్పకుండా వినాలి. మీకు కధ నచ్చినందుకు, మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete