Monday, June 28, 2021

168 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -3 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతుని కిచ్చిన మూడవ కోరిక తీర్చటానికి రెండొవ భాగంలో యముడు నచికేతునికి మన అందరిలో ఉండే ఆత్మ గురించి చెబుతాడు. ఆత్మ అందరి  హృదయాలలోనూ నాడీ సముదాయం మధ్య ఆసీనమై ఉంటుంది కానీ, అది ఎవరికీ కంటికి కనపడదు , దానికి ఆకారం లేదు.  దానికి క్షీణత్వం లేదు. దేహానికి ప్రాణ మిచ్చేది అదే తీసుకుపోయేది అదే. అన్ని ప్రాణులలో ఉన్నదీ అదే. అది నశించదు , అది ఉన్న దేహం క్షీణించి నశించిపోతే ఇంకొక దేహం వెతుక్కుని దానిలో ప్రవేశిస్తుంది. 

మన  మనసు (mind ) జ్ఞానేంద్రియాల ద్వారా  బయట వస్తువులని గుర్తిస్తుంది. ఈ మనసువెనుక తెలివి తేటలు (intellect ) ఉన్నాయి. ఆతెలివితేటల తరువాత ఉన్నది ఆత్మ(Self ). దాని తర్వాత అవ్యక్తం (avyaktham ). దాని తర్వాత పురుష (Purusha ). దానితర్వాత ఏమీలేదు.

పుస్తకాలు తిరగ వెయ్యటం మూలానో, వేదాలు చదవటం మూలానో , తెలివితేటల మూలానో ఆత్మ జ్ఞానం (realization ) కలుగదు. బ్రహ్మ మనకి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనటానికి జ్ఞానేంద్రియాలు పెట్టాడు కానీ మనలో ఉన్న ఆత్మని  చూసుకోటానికి ఏమీ పెట్టలేదు.

ఈ ఆత్మకి పేరుకూడా పెట్టలేము. అతీతుడు (infinite ), ఆకారము లేనివాడు, మనకు తెలిసిన మాటలకి అందని వానికి ఏ పేరు పెడతాము ! అందుకనే ఋషులు "ఓం" అని సంభోదించారు. 

యోగా (Yoga ) తో ఆత్మను కనుగొన వచ్చు అంటారుగానీ అది కుదరదు. ఎందుకంటే యోగ అంటే జ్ఞానేంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవటం. ఇది తాత్కాలికం. వస్తూ పోతూ ఉంటుంది.

మనలో ఉన్న ఆత్మే మన తెలివితేటల్ని, మన జ్ఞానేంద్రియాలనీ పని చేయించేది. కానీ "మాయ" ఆత్మని గుర్తించకుండా చేస్తుంది. ఆత్మని గుర్తించ కలిగేది "నిర్వికల్ప సమాధి" తోనే.

ఎవరైతే కోరికలకు (Vishaya kara Vrittis ) అతీతుడో , మనసునీ జ్ఞానేంద్రియాలనీ అదుపులో ఉంచుకుంటాడో , సద్గుణుడో, తమలోని ఆత్మను అనుభూతి (feeling ) (Brahmakara Vritti ) ద్వారా గుర్తించ గలుగుతారో వారికి బాధలూ భయాలూ మరణము ఉండవు. బాధలూ భయాలూ మరణాలూ ఉండేది అశాశ్వితమయిన శరీరానికి గానీ శాశ్వితమైన ఆత్మకు కాదు. 

ఆత్మ  ఉనికిని కనుగొనుటకు ధ్యాన మార్గం (Meditation ) ఒక్కటే దారి. నువ్వు ఆత్మ కోసం వెదుకుతున్నావని నీ మనసుకుచేప్పు, మనసు చేత నీ తెలివికి(Intellect ) చెప్పి దానిచేత ఆత్మని వెతికించు. ఆత్మని కనుగొనవచ్చు. మొదట్లో బొటనవేలంత జ్యోతిని మనసులో సృష్టించుకొని దానిమీద ఓంకార జపం(Meditate ) చెయ్యి. ఆత్మ సంధానం పొందవచ్చు. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో సాధించ వచ్చు.


ఫల శృతి:

నచికేతుడు యముని ఉపదేశం ననుసరించి కామక్రోధాదులను, మరణమును జయించి బ్రహ్మైక్యము పొందెను. 

ఎవరైతే నచికేతుడు, యముని కధ విందురో వారికి ఆత్మజ్ఞానం కలుగును.

ఎవరైతే వారి పూర్వికుల శ్రార్ధ కర్మలప్పుడు భక్తితో ఈ కధ చదువుతారో వారి పూర్వికులు మోక్ష్మము  పొందుదురు.

ఓం:  మనమెప్పుడూ ద్వేషించు కోకుండా, పోట్లాడుకోకుండా చేసి మనందరినీ ఆ పరమాత్మ రక్షించి ముక్తి ప్రసాదించు గాక. 


నా మాట:

ఈ ఉపనిషత్ లో చివర ఫల శృతి ఉంది. ఆ రోజుల్లో కూడా అసూయలూ వైషమ్యాలూ పోట్లాడుకోటాలూ ఉన్నాయన్నమాట. (మనలోమన మాట ఇద్దరు ఋషులు  పోట్లాడుకుని రెండు యజుర్వేదాలువ్రాశారు. మన ఈ ఉపనిషత్ కృష్ణ యజుర్వేదంలో నుండి తీసుకొనబడినది.)

ఆత్మ మన శరీరానికి ప్రాణంపోసి అన్ని అవయవాల చేత పని చేయిస్తుంది. కంప్యూటర్ భాషలో మాట్లాడితే కంప్యూటర్ పనిచేయటానికి ప్రాణం పొసే విద్యుత్ కిందకి వస్తుంది. 

( త్యాగయ్య గారు 250 ఏళ్ళ క్రిందట మననుండి హృదయాన్ని కదిలించే ధ్వని ఎల్లా వస్తుందో చెప్పారు. మనం  "ఓం " శబ్ద వ్యక్తీకరణకి వాటిని ఉపయోగించుకోవచ్చు.

1. ప్రాణానల సంయోగము వల్ల   ప్రణవనాద సప్త స్వరములు.

2. నాభీ హృద్ కంఠ రసనా నాసాదుల  

3. నిద్దుర నిరాకరించి  వేకువజామున లేచి 

4. శోభిల్లు సప్తస్వర 

ధ్వని పుట్టించాలంటే వాయువు అవసరం. తెల్లవారు ఝామున లేచి నిశ్చలత్వముతో, ఆ వాయువుని నాభి లో పుట్టించి హృదయం మీదకుండా కంఠమును తాకుతూ కదిలిస్తూ నాసికా ముఖ ద్వారాలనుండి బయటికి తెచ్చి సప్తస్వరాలను పలికించు.

మన "ఓం" శబ్ద సృష్టికి తద్వారా  మనలోని "ఆత్మ " ని కనుగొనటానికి (realization )  త్యాగయ్యగారి మాటలు ఎంతోఉపయోగపడతాయి.

త్యాగయ్య గారి గురించి పై చెప్పిన మాటలన్నీ ఈ క్రింది విజయ శివ గారి వీడియొ నుండి సేకరించినవి.

Margam - Tyagaraja ) 

Monday, June 21, 2021

167 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -2 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతా నీ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని, ఆ ప్రశ్నకి బదులు నీకు భోగభాగ్యాలూ, వజ్ర వైఢూర్యాలూ, అప్సరసలూ ఇస్తానన్నాను. అవి అన్నీ అశాశ్విత ఉల్లాస వస్తువులు (Pleasurables ) అని వాటిని తిరస్కరించావు. నేర్చుకోవాలనే జిజ్ఞాస నీలో ఉంది అందుకే క్లిష్టమైన నీ ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబట్టావు. నచికేతా నువ్వు నాకు నచ్చావు నీలో మంచి విద్యార్థి లక్షణాలు ఉన్నాయి. గురువుకి మంచి విద్యార్థి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పి నచికేతుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ఉపక్రమించాడు యమ ధర్మరాజు.

మన జీవిత రధానికి (Chariot ) పంచేంద్రియాలనబడే  అయిదు గుర్రాలతో సవారీ కట్టాము అనుకుంటే, వాటిని విభిన్న కోరికలతో తోలుతుంటే మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్తాయో  చెప్పలేము. అదే ఒకే కోరికతో  మనస్సుని కేంద్రీకరించి సవారీని నడిపితే మనము అనుకున్న చోటుకు (Our Goal ) అవి చేరుస్తాయి. ప్రలోభాలకు ఆకర్షణలకీ లొంగకుండా మనం సాధించ వలసిన పని మీద మనస్సుని కేంద్రీకృతం చేస్తే ఆ పని సాధ్యమవుతుంది.

మానవులకు జీవిత పయనంలో ఎదురుకుండా కనపడేవి రెండే రెండు మార్గాలు. మొదటిది మంచి మార్గం (Sreyas  ) రెండొవది ఉల్లాస  (Preyas  ) మార్గం. ఏ మార్గములో వెళ్ళాలనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది. ఇది దేవుడు నీ కిచ్చిన వరం. 

నేను అంటే ఈ దేహమే అనుకుని, ఈ దేహం కృంగి కృశించి క్షీణించి పోయి మాయమయ్యేదాకా  పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ ఉల్లాసంగా తిరగవచ్చు. ఈమార్గం పాటిస్తే వివిధ దేహాలతో పునర్జన్మించి మరల మరల నా (యముని) కట్టడికి చేరాల్సి వస్తుంది. 

పంచేంద్రియాల ఆకర్షణలకి లోబడకుండా రెండవ మార్గంలో వెళ్ళి తన దేహంలోని అంతరాత్మ తో మమేకమయితే జన్మ రాహిత్యంతో మోక్షం సంపాదించ వచ్చు.

ఈ మనలోని ఆత్మ ఎవరిలోనో ఒకచోట మాత్రమే జన్మించటం జరగలేదు. అందరిలోనూ ఉంది. దానికి ఆకారం లేదు దానికి చనిపోవటం కూడా లేదు. అది చూడటానికి కనపడదు. కానీ అది ఉందని కనుక్కో వచ్చు (realization ). ప్రతి వారిలోనూ గుండె చుట్టూతా నూటొక్క నరాలు ఉంటాయి. అందులో ఒక నాడి కపాలానికి వెళ్తుంది. దాని పేరు సుషుమ్న(Sushumna ) నాడి. వాటితో ఈ ఆత్మ గుండె లోతుల్లో ఆసీనమై ఉంది. ఎవరైతే  వారి పంచేంద్రియాలనూ అధికమించి కోరికలను జయించి వారి లోని ఆత్మను కనుగొంటారో వారికి బాధలూ భయాలూ లేకుండా జన్మ రాహిత్యం కలుగుతుంది.

ఆత్మ చూసేది కాదు, అది కనపడదు, చెప్పేది కాదు, మాటలతో చెప్పలేము, తెలివితో వెతకలేము, అది మన తెలివికి అందదు. ఎవరికీ వారు ఆస్వాదించి అనుభవించాల్సిందే. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో (సహాయంతో) సాధించ వచ్చు.


ఈ పోస్ట్ ఇంతటితో ముగిస్తాను. చెప్పిన వన్నీ నెమరువేసుకుని జీర్ణించుకుని , ఆత్మ గురించి అంతా చెప్పానో లేదో ఆత్మ పరిశీలన చేసుకుని తర్వాతి పోస్ట్ తో వస్తాను. ఇంతలో మీరుకూడా ఆత్మను గురించి ఆలోచించండి.


నా మాట:

వేల ఏళ్ళక్రిందట నరములు (Nerves System ) గురించి ఆలోచించి దాని ఉనికిని చెప్పటం !, అప్పటి ఋషుల ఆలోచనా ప్రతిభకి వందనాలు. వాళ్ళ ధ్యేయం ఒకటే మానవులు సుఖంగా  బాధలూ భయాలూ లేకుండా జీవించటానికి మార్గాలు వెదకటం. వారందరూ ఆశ్రమాలు స్థాపించి  పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు. జీవనాధారం యాచన. పతంజలి యోగ శాస్త్రము, ధన్వంతరి ఆయుర్వేదం, శు ష్రుత సంహిత (Medicine and surgery )  మొదలగునవి వీటికి ఉదాహరణలు.

ఋషులు వారి వారి మేధా శక్తులతో కొన్ని మంచి పద్దతులను కనుగొన్నారు. మనందరికీ అర్ధం చేసుకునే తెలివితేటలు ఒకేవిధంగా ఉండవు కనుక, ఆ మంచి పద్దతులను, అందరికీ ఉపయోగ పడేలా దైనందిన జీవన శైలిలో ఆచారాలుగా మార్చారని నా నమ్మకం. 

ఇంద్రుడు , యముడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని దేవుడు మొదలగు నవి దేవలోకంలో ఆయా శాఖల అధిపతులపేర్లు(Titles ). వారు సంపాయించిన పుణ్యం బట్టి వారు సీట్లు మారుతూ ఉంటారు. వారి కన్నా ఎక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళు వస్తే సీటు ఇవ్వాల్సిందే. ఉదాహరణకి యమధర్మరాజు తనకు ఆ  ఉద్యోగం రావటానికి కారణం తాను చేసిన యజ్ఞమని నచికేతునితో ఒకానొక సమయంలో చెబుతాడు.


ఈ నా పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda,  and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.

Monday, June 14, 2021

166 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -1 (Kathopanishad)

కఠో పనిషత్ వ్రాసి కొన్ని వేల సంవత్సరాలయింది. అందుకని దీనిలోని ఘటనలన్నీ  సంవత్సరాల క్రిందటి సాంఘిక పరిస్థుతులలో జరిగిన సంఘటనలుగా గుర్తించాలి. 

అప్పుడు ఉన్న నమ్మకాలలో, మానవులు మరణానంతరం వారివారి పాప పుణ్యాల ఫలితంగా నరకంలోనో స్వర్గంలోనో కొంతకాలం గడిపి మరల భూమి మీద పునర్జర్మి స్తారని నమ్మకం ఒకటి. యజ్ఞ యాగాదులు దాన ధర్మాలూ  చేస్తే పుణ్య మోస్తుందనీ చంపటాలూ దోపిడీలు చేస్తే పాపం వస్తుందనీ నమ్మకాలు. స్వర్గంలో ఎక్కువ రోజులు గడపటానికి ఆ కాలంలో దేవుళ్ళకి యజ్ఞాలు చేసి పుణ్యం సంపాయించటానికి ప్రయత్నించే వాళ్ళు. పాప భయంతో దోపిడీలుగట్రా ఎక్కువగా ఉండేవి కాదు. ఎంత పుణ్యం కూర్చుకుంటే అంతకాలం స్వర్గంలో ఉండవచ్చు. హిందూ మతంలోనే కాదు దాదాపు అన్ని మతాల్లోనూ ఈ స్వర్గ (Heaven ) ప్రస్తావన ఉంది. 

పదకొండేళ్ళ "నచికేతుడు"  తండ్రిచేస్తున్న "విశ్వజిత్ " యజ్ఞం ఆసక్తితో గమనిస్తున్నాడు. యజ్ఞంలో చివరికి దానాల దగ్గరకివచ్చేసరికి నచికేతుడికి తండ్రి చేస్తున్న పని నచ్చలేదు. పుణ్యం రావాలంటే ఈ యజ్ఞంలో తనకున్న వస్తువులన్నీ దానం చేసెయ్యాలి. మంచి ఆవుల్ని తాను ఉంచుకుని, పనికిరాని వట్టిబోయిన ముసలి ఆవుల్ని తన తండ్రి ఎందుకు దానంగా ఇస్తున్నాడో అర్ధం కాలేదు. ఇలా చేస్తే యజ్ఞ కర్త  కి కావలసిన ఫలితం రాకపోవచ్చు. తండ్రికి యజ్ఞ ఫలితం తప్పకుండా రావాలి. తాను కూడా తండ్రికి కావాల్సిన వస్తువేగా తనని దానం చెయ్యమని వెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రి సమా ధానంచెప్పలేదు అయినా ఆగకుండా మరల మరల "నాన్నా నన్ను ఎవరికి దానం చేస్తావు ?  అని తండ్రిని ప్రశ్నిస్తాడు. తండ్రి చివరికి విసిగి కోపం మీదున్నాడో ఏమో  "యముడికి (God of death )" అని సమాధానం ఇస్తాడు.

తన తండ్రికి ఎల్లాగయినా యజ్ఞ ఫలితం రావాలి అని తానే ముందరగా యముడిని చూడటానికి వెళ్తాడు. సింహద్వారం దగ్గర భటులు ప్రస్తుతం "యముడు" బయటకి వెళ్ళారు అని చెబితే, వచ్చేదాకా ఇక్కడే ఉంటాను అని సింహద్వారం దగ్గరే నచికేతుడు కాచుకు కూర్చుంటాడు. "యముడు"  తిరిగివచ్చే సరికీ,  నచికేతుడు తిండీ తిప్పలూ లేకుండా మూడు రోజులు మూడు రాత్రులు గడపాల్సొస్తుంది.

ఏమీ తీసుకోకుండా మూడు రోజులు గడిపిన నచికేతుడి సంగతి తెలిసి, అప్పుడే తిరిగివచ్చిన యముడు చాలా బాధపడతాడు. తాను ఇంటిలో లేక పోవటాన నచికేతుడికి తగిన మర్యాదలు చేయలేకపోయానని చెప్పి ఆతిధ్య లోపం ఉన్న ఆ మూడు రోజులకీ మూడు వరాలు ఇస్తాను కోరుకోమంటాడు.

తాను తిరిగి వెళ్ళినప్పుడు తన తండ్రి కి తన మీద కోపం ఉండకుండా చూడమని మొదటి వరంగా  కోరుకుంటాడు నచికేతుడు. యముడు వెంటనే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అంటాడు.

మనుషుల్ని స్వర్గానికి చేర్చే యజ్ఞాల గురించి రెండవ వరంగా చెప్పమంటాడు. దానికి యముడు ఆ రహస్యాలన్నీ చెప్పటమే కాకుండా అవి నచికేతుడి యజ్ఞాలుగా వాడుకలో ప్రసిద్ధి చెందుతాయని చెబుతాడు. దానికితోడు "మంచిబాలుడు" నచికేతుడికి  అందమయిన కంఠహారంగూడా కానుకగా ఇస్తాడు. 

మూడవ కోరికకి వచ్చే సరికి నచికేతుడు "ప్రభూ మనుషులు తనువు చాలించిన తరువాత కొందరు ఆ మనిషి  చనిపోయాడంటారు కొందరు చనిపోలేదంటారు " దీనిలో ఏది నిజమో వివరించి చెప్పమంటాడు.

యముడు (Lord of Death ) చాలా ఇరకాటంలో పడతాడు. తన ఈ రహస్యాలు (Job Secrets) ఎవ్వరికీ చెప్పకూడదు ఇంకేమన్నా అడుగు వజ్రవైఢూర్యాలూ రాజభోగాలూ అప్సరసలూ స్వర్గ సౌకర్యాలూ ఏమైనా అడుగు ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు దేనికీ వప్పుకోడు తాను అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలని పట్టుబడతాడు.

నచికేతుడి ఈ కోరిక నుండి తప్పించలేక యముడు దానికి సమాధానం ఇస్తాడు. ఈ  ఉపనిషత్ లో ఎక్కువ భాగం నచికేతుడి సంశయానికి యముడి వివరణే.  తర్వాతి పోస్టులో దీనిని గురించి వివరంగా వ్రాస్తాను.


నా మాట:

దీని back drop వేల ఏళ్ళ క్రిందట గుళ్ళు గోపురాలు లేని రోజుల్లో ఉన్న ఆచారాలు. స్వర్గానికి పోవాలని ప్రతీవాడికీ కోరిక.  

వేల ఏళ్ళ  క్రిందట కూడా ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించటం ఆచారంగా ఉండేది. పొరపాటున ఏమన్నా పొరపాటు జరిగితే క్షమించ మనటం కూడా ఆచారమే. ఇప్పటికీ ఇళ్ళల్లో ఈ  ఆచారం ఉంది. ఆచారాల్ని ఎవరూ పనిగట్టుకుని చెప్పరు. ఇవన్నీ వారివారి ఇళ్ళల్లో వాడుకని బట్టి గ్రహించేవే.  

హిందువులు ఆచరించే అన్ని ఆచారాలలోనూ (యజ్ఞాలూ, యాగాలూ, నోములూ,  పండగలూ  వగైరా) చివరిలో దాన ప్రక్రియ ఉంటుంది (తనకున్న వాటిని పంచుతారు). ఒక విధంగా ఇది Distribution of Wealth (ఉన్న వాళ్ళు లేనివాళ్ళకి పంచటం)  క్రిందికి వస్తుంది. ఇటువంటి దాతృత్వాన్ని సంఘంలో ఒక మంచి ఆచారంగా మార్చారు.

నచికేతుడి యమలోక యాత్రని మీరు  realistic గ చూడలేకపోతే అది ఒక పెద్ద నచికేతుడి కల అనుకోండి.  యమలోకంలో యముడికి నచికేతుడికి జరిగిన సంభాషణలు చాలా realistic గ ఉంటాయి. ఇక్కడే నాకు సంస్కృతం నేర్చుకుంటే ఎంత బాగుండేదో అనిపించేది.

నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda,  and Lectures of Swami Tejomayaananda and Swami Sarvapriyananda.

Monday, June 7, 2021

165 ఓ బుల్లి కథ -- కేనోపనిషత్ (Kenopanishat)

మనకీ  కంప్యూటరికీ ఉండే జ్ఞానేంద్రియాలు దాదాపు సమానమే. వినటం, మాట్లాడటం,చూడటం, స్పర్శ. ఒక్క వాసన చూడటం తప్ప అన్నీ ఉన్నాయి. అది కూడా ఎప్పుడో వస్తుంది. కంప్యుటర్లో అవి ఎల్లా పనిచేస్తాయి అంటే మనం చెప్పగలం. Operating system (OS). DOS, Windows 10, UNIX, LINUX. సులభంగా చెప్పాలంటే ఈ OS (మొదట్లో దీన్ని సూపర్వైజర్ అనే వాళ్ళు) కంప్యూటర్ తన జ్ఞానేంద్రియాల నుండి వచ్చిన సంకేతాల్ని గ్రహించి, తాను ఏమిచేయాలో నిర్ణయించుకుని క్రమం తప్పకుండా ఆజ్ఞలు జారీ చేస్తుంది. కంప్యూటర్ OS ను సృష్టించిన వాళ్ళు మన లాంటి వాళ్ళే, మానవులు. కానీ OS పనిచేయాలంటే ఏమి కావాలి ?  విద్యుత్. అది లేకపోతే OS  పనిచేయదు కంప్యూటర్ పనిచేయదు. విద్యుత్ అంటే ఏమిటో చెప్పగలమా ? అది ఏమిచేస్తుందో చెప్పగలం (దీపాలు వెలిగించటం వగైరా)  కానీ అది ఏమిటో చెప్పటం చాలా కష్టం.

అదే మన జ్ఞానేంద్రియాలు ఎల్లా పనిచేస్తాయని మనం ప్రశ్నించుకుంటే, మన మెదడు ద్వారా అని సంకోచం లేకుండా చెబుతాము. మనలోని ఈ మెదడు అనే కంప్యూటర్ ని సృష్టించిన వాళ్ళు ఎవరు ? దానిలో పనిచేసే OS  ని సృష్టించిన వాళ్ళెవరు ? ఖచ్చితంగా మనం మాత్రం  కాదు. మన గర్భంలో అది తయారు అవటానికి సహాయం చేస్తాం కానీ మనకి  మెదడు ఎల్లా చెయ్యాలో తెలియదు. దానిలో ఉండే OS ఎల్లా ఉంటుందో  తెలియదు.  అసలు ఈ మెదడు అవయవాలూ పనిచెయ్యటానికి  ఏమి కావాలి. చైతన్య శక్తి   "ప్రాణం". ఆ "ప్రాణం" గురించి అది ఏమిటో చెప్పగలమా? పోనీ ఆ "ప్రాణం" ఎక్కడ నుండి వచ్చిందో ఎవరిచ్చారో చెప్పగలమా?

ఇటువంటి ప్రశ్న ఒక రోజు శిష్యుడు "విచార చైతన్య" గురువుగారిని అడుగుతాడు. మన శరీరంలో జ్ఞానేంద్రియాల చేత ఎవరు పని చేయిస్తున్నారని. దీనికి గురువుగారి సమాధానం, సామవేదము లోని 35 శ్లోకాల కేనోపనిషత్  లో ఉంది. 

మొదటి మంత్రం:

కేనేషితం పతతి ప్రేషితం మనః  :       ఏ చైతన్యం వల్ల  ఈ మనస్సు పనిచేస్తోంది  

కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తాః  (క్త ) : ఏ చైతన్యం వల్ల ఈ ప్రాణం పనిచేస్తోంది  

కేనిశితం వచమిమాం వదన్తి  :              ఏ చైతన్యం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాము  

చ క్షు (హు ) శ్రోత్రం  క ఉ దేవో యునక్తి  : ఏ చైతన్యం వల్ల ఈ కళ్ళు చెవులు పనిచేస్తున్నాయి 

దేనివల్ల (ఎవరి ప్రేరణ మూలాన) మనలోని మనసు, ప్రాణం, పంచేంద్రియాలూ పనిచేస్తున్నాయి ?. అని శిష్యుని ప్రశ్న.

జీవాత్మ అనే శక్తి  వీటన్నిటి చేతా పనిచేయిస్తుందని గురువుగారి సమాధానం. 

ఏవన్నా పనిచేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని మనం గుర్తించ గలమా ? గుర్తించ వచ్చు. దానిని వర్ణించ గలమా? లేదు. మాటల్లో చెప్ప గలమా ? మనకు తెలిసిన మాటల్తో చెప్పాలేము. కొత్త మాటలు నేర్చుకుని వర్ణించ గలమా? లేదు. మన ఊహకి అందే, మనం మాటల్లో వర్ణించ గలిగే పరిస్థితి లేదు. 

ఆ శక్తి గురించి మాటల్లో చెప్పలేము ఎందుకంటే మన చేత మాట్లాడించేది ఆ శక్తే కదా. దానినివర్ణించే మాటలు మనదగ్గర లేవు అది మనకి ఇవ్వ లేదు. దానిని మనం చూడలేము ఎందుకంటే అది అతీతము మనలోఉంటుంది కానీ మనకి కనపడదు. అదే మనలోని ఆత్మ. తనలో ఉన్న ఆ చైతన్య శక్తి  ఉనికిని ఎవరికి వారే గుర్తించాలి. దానిని గుర్తించాలంటే ఏకోన్ముఖంగా చూసే ప్రజ్ఞ కావాలి. వంద ఆలోచనలతో ఎప్పుడూ మునిగితేలే మనస్సుతో ఉండే మనం ఏకాగ్రతతో ఒక దానిమీద ఆలోచించటం కష్టం కానీ చెయ్యొచ్చు. ఏకాగ్రతతో  తపస్సు (meditation ) చేసి దాని సంగతి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు (బుద్ధుడు, ఆది శంకర ). మనం అది ఉన్నదని  గ్రహిస్తే చాలు.

నామాట: 

మనకు తెలిసిన శక్తులు  విద్యుత్, అగ్ని లని రోజూ వాడుతాము. వాటిని ఎల్లా వర్ణిస్తాము.  మనకు తెలిసిన భాషతో అవి ఏమి చేయగలవో చెప్పగలం కానీ వాటిని వర్ణించటానికి మాటలు లేవు. 

అల్లాగే మనలోని  "ఆత్మ " వర్ణనకు అతీతం. మనం చూడలేము కాబట్టి మనకి అది లేదని అనుకోటం తప్పు.  దానివల్లనే మనం జీవిస్తున్నాము.

రోజూ రాత్రి చంద్రుడిని చూస్తాము. "చల్లని రాజా" అంటూ పాటలు కూడా వ్రాస్తాము. అసలు చంద్రుడికి వెలుగు నిచ్చే శక్తి లేదు. సూర్యుడి నుండి వస్తుంది. మనము చంద్రుడిని చూస్తున్నప్పుడు సూర్యుడిని చూడము కదా అందుకని చంద్రుడిది సూర్య శక్తి కాదంటామా? 

అల్లాగే గాలిని మనము చూడలేము. గాలి మూలాన ఆకులు కదులుతూంటేనూ, కాగితాలు ఎగురుతూంటేనూ మనం గాలి వచ్చిందని గ్రహిస్తాము. అందుకని "గాలి" లేదు అనలేము కదా?

మీరు రాత్రి గాఢ నిద్ర పోయారు. పోదున్నే రాత్రి బాగా పడుకున్నారా అంటే మీరేమి చెబుతారు. గాఢంగా నిద్ర పోయారని చెబుతారు. అది ఎల్లా తెలిసింది మీకు ?. గాఢ నిద్రలో అవయవాలు పని చెయ్యవే ! అదే  మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మీ ఆత్మ చెబుతోంది.

మనలో ఒక "ఆత్మ" అనే శక్తి  ఉందనీ  అదే మనం చూడలేకపోయినా , మనని అన్నివేళలా కనిపెట్టుకుని పని చేయిస్తోందనే నమ్మకం కలిగితే మనకి కోటి ఏనుగుల బలమొస్తుంది. మన బొందిని నడిపే వాడున్నప్పుడు దానిలో చక్కగా కూర్చుని నిశ్చింతగా ప్రయాణించటమే మన కర్తవ్యం.


నా ఈ పోస్టుకి ఆధారాలు ముఖ్యంగా చెప్పుకో వలసినవి: Upanishad Drama by Swami Sivananda and Lectures of Swami Sarvapriyananda.

Saturday, May 29, 2021

164 ఓ బుల్లి కథ -- పిన్నమ్మ

 "అక్కడికి వెళ్ళవోకు పిన్నమ్మా దోమలు కుట్టి గొడవ చేస్తాయి" అంటే  "నెల్లూరి దోమలు కుట్టినా చమ్మగా ఉంటుంది" అనే సమాధానం చెప్పే మా పిన్నమ్మకి నేనేమి చెప్తాను. పుట్టి పెరిగిన ఊరంటే అంతప్రేమ.

" NCC డ్రెస్ వేసుకుని కాలేజీకి వెళ్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది మా పిన్నమ్మ. NCC లో ఆ కాలంలో ఆడపిల్లల్ని చేర్చుకుంటారని నాకు తెలియదు. నాకు తెలియని సంగతులు ఎన్నో వున్నాయి పిన్నమ్మలో.

"బాధ పడకే చిన్నమ్మా రోజులన్నీ ఒకలాగే ఉండవు కోలుకుంటావు" రెండు సార్లు కేన్సర్ బారిన పడి  తిప్పికొట్టి విజయం సాధించిన పిన్నమ్మ మాటలు మణిపూసలు, ఎవరికైనా ధైర్యం ఇస్తాయి . 

నీకోసం మీ అబ్బాయి నువ్వు మెట్లు ఎక్కలేవని కింద గది ఉన్న ఇల్లు కొన్నాడు. ఆ గదిని రీమోడల్ చేసి  స్నానాదులకి కూడా పక్కనే ఏర్పాటు చేశాడు. ఇంక నువ్వు ఎప్పుడూ రావని ఎంత బాధ పడిపోతున్నాడో. అయినా నువ్వెప్పుడూ మనసులో ఉంటావుగా .

"ఎందుకమ్మా అల్లా అర్ధాంతరంగంగా  వెళ్ళిపోయావు. మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేశావు. నువ్వు త్వరలో వస్తావనుకున్నాను. నీకోసం నీ సుఖం కోసం ఇల్లు కొని నిన్ను నా దగ్గర పెట్టుకుందామని అనుకున్నాను. ఎందుకమ్మా అల్లా వెళ్ళిపోయావు.  ఆస్పత్రిలో ఉంటే కనీసం చూడటానికి కూడా రాలేకపోయానే. ఈ ఇల్లూ వాకిలీ డబ్బులూ దస్కాలూ చదువులూ సంస్కారాలూ ,  ఈ  COVID ముందు ఎందుకూ పనికిరావని తేలిపోయింది. "

"అయినా ఎందుకమ్మా ప్రజల జీవితాలు కాపాడిల్సిన పెద్దలు ఇలా చేశారు. ప్రతీ వంద ఏళ్ళకీ ఇటువంటి పాడు అంటువ్యాధి (Pandemic) వస్తుందని తెలుసు కదా. అది వచ్చిందంటే మూడు సార్లు పీడించి పెద్దల్ని, మధ్య వయస్సు వాళ్ళనీ, పిల్లల్ని వరసగా పొట్ట బెట్టు కుంటుందని తెలుసుకదా ! ఎందుకు ముందు జాగర్త పడలేదు ?  "ప్రకృతి" సైన్సు టెక్నాలజీలకి  అందదేమో ! ,  ఎప్పుడూ కొత్త పొంతలు తొక్కుతూ వింతల తోటి వచ్చే దానిని అర్ధం చేసుకోవటం చాలా కష్టం "

"ఏమిటో అమ్మా అన్నీ ఉన్నా, నీ చివరి దశలో నిన్ను చూడలేక పోయానే అని  ఏమిటో బాధగా ఉంది. ప్రకృతి ముందు మనం ఎంత చిన్న వాళ్ళమో ఇప్పుడు తెలుస్తోంది . అది వక్రిస్తే మనం చేసేది చాలా తక్కువ."

చేసుకుందామనుకున్న కార్యానికి చివరలో అనుకోకుండా  పూజారి గారు రాలేకపోతే , చివరి క్షణంలో కుదిరిన ఇంకొక పూజారితో అంత్య కార్యక్రమం సక్రమంగా జరుపుకున్న కృష్ణకి వందనాలు. ఎప్పుడైనా సహాయానికి మేమందరం ఉన్నాము మరచిపోకు క్రిష్ణా . 

అమెరికాలో మా పక్క ఊరులో ఉన్న మా కృష్ణ ఇంటికి వెళ్ళి  వాళ్ళ అమ్మగారి పదమూడవ రోజు  ఏకరుద్రాభిషేకం లో పాల్గొని, ఆ తర్వాత "Zoom" ద్వారా చిన్నలూ పెద్దలూ  పిన్నమ్మను గుర్తు చేసుకున్న మాటలతో రూపొందించిన రూపకం ఇది. విశాలాక్ష్మి పిన్నమ్మ గారూ మీ రెప్పుడూ మా  మనస్సుల్లొ  మెదులుతూనేఉంటారు. ఉంటాము మరి. నమస్కారాలు.

Saturday, March 27, 2021

163 ఓ బుల్లి కథ -- తెనాలి తో సంబంధం తెగి పోయింది

 పరమేశం, భార్యా మా పక్కింట్లో ఉంటారు. రిటైర్ అయినవాళ్ళం కాబట్టి సామాన్యంగా రోజూ మా భార్యలు ఉద్యోగాలకి వెళ్లిన తరువాత కలుసుకుంటూ ఉంటాము. భర్త రిటైర్ అయిన తర్వాత భార్యలు వర్క్ కి వెళ్ళి ఏవో నాలుగు రాళ్ళు తెస్తూ ఉంటారు. అదే మాకు తీరిక సమయం. ఎదో పిచ్చాపాటీ, భార్యల గురించీ మాట్లాడుకుంటూ ఉంటాము. 

ఇవ్వాళ ఎందుకో పరమేశం నిర్లిప్తంగా ఉన్నాడు. "టేస్టర్స్ ఛాయిస్" కాఫీ చేసి ఇచ్చాను. ఎందుకు అల్లా ఉన్నాడో  నేను అడగ తలుచుకోలేదు. చెప్పాలనుకుంటే తనే చెపుతాడు లేకపోతే లేదు. కొన్ని రోజులు అలా నిశబ్దంగా గడిపిన రోజులున్నాయి. కాఫీ తాగుతూ నెమ్మదిగా చెప్పటం మొదలెట్టాడు. మనం అడగాల్సిన పని లేదు. లోపలి మనస్తాపం ఎప్పుడో అప్పుడు బయటికి వస్తుంది. ఇటువంటి సమయంలో మనం ప్రశ్నలు వేయాల్సిన అవుసరం లేదు. అన్నీ నెమ్మదిగా బయటికి వస్తాయి. మనస్తాపం తగ్గుతుంది.

"మాది తెనాలి దగ్గర ఒకపల్లెటూరు, కఠెవరం. దాదాపు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ  ఏదోరూపేణా  రోజు కొకసారి తెనాలి వెళ్ళి వస్తూ ఉంటారు. పిల్లలు అయిదవ క్లాసు దాకా అక్కడే చదువు కోవచ్చు  గానీ ఆ తరువాత చదువులకి తెనాలి వెళ్లాల్సిందే. పెద్దలయితే ఇంటి అవసరాలకి, వెచ్చాలకి, సినీమాలకి తప్పకుండా  తెనాలి వెళ్ళాలి. మా ఊళ్ళో సుబ్బయ్య కోమటి కొట్టు ఉంది. పిల్లలకి అదంటే చాలా ఇష్టం. "కానీ" పెట్టి ఏదోఒకటి కొనుక్కోవచ్చు. పిల్లలం సాయంత్రం ఆటలు (బిళ్ళంగోడు గోళీలు బచ్చాలు) ఆడుకుంటున్నప్పుడు శనగలూ శనక్కాయలూ బఠాణీలు చాకోలెట్లూ, అక్కడే  కొనుక్కునే వాళ్ళం. నాకయితే మాత్రం సుబ్బయ్యకొట్లో పప్పు చెక్కలు చాలా ఇష్టం.  అప్పుడప్పుడూ పెద్దవాళ్ళు పేకాడుతుంటే పిల్లలం మేము వెళ్ళి సుబ్బయ్య కొట్లో బీడీలు, గోల్డ్ ఫ్లెక్ సిగరెట్లు కొనుక్కొచ్చే వాళ్ళం. సుబ్బయ్య,  కొట్లో అమ్మకానికి వస్తువులన్నీ తెనాలి వెళ్ళి కొనుక్కొస్తాడుట. నేను మా నాన్నతో  తెనాలి వెళ్ళి క్రాఫ్ చేయించుకునే వాడిని. అక్కడున్న వాళ్లందరికీ రోజూ తెనాలిలో ఎదో పనివుంటుంది. చాలా మంది సాయంత్రం షికారుకి తెనాలి వెళ్ళి కాఫీ తాగొస్తారు. 

దీపావళికి మందు సామానులు కొనుక్కోవాలంటే తెనాలే వెళ్ళేది. నిజంగా చెప్పాలంటే దాదాపు ప్రతీ పండగకి తెనాలి వెళ్ళే వాళ్ళం. శ్రీరామ నవమికి ఊరంతా పందిళ్లు వేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వడపప్పు పానకం పెట్టేవాళ్ళు. సినీమా చూడాలంటే తెనాలి వెళ్లాల్సిందే. నేను "స్వర్గసీమ" సినీమా తెనాలి రత్నా టాకీస్ లో చూశాను. తెనాలి మధ్యలో రెండు కాల్వలు వెళ్తాయి. వాటి మీద రెండుచోట్ల వంతెనలున్నాయి. ఒక వంతెన మీద వెళ్తే కూరగాయల మార్కెట్ వస్తుంది. రెండవ వంతెన మీద వెళ్తే, వంతెన దిగంగానే రోడ్డుకి ఎదురుగుండా ఒక పార్క్ వస్తుంది. ఆ పార్కుకు కుడి వైపు వెళ్తే మా మామయ్యగారి ఇల్లు వస్తుంది. ఎడమవైపు వెళ్తే రాముడన్నయ్య శివుడన్నయ్యా వాళ్ళ ఇల్లు వస్తుంది. ముందర రాముడన్నయ్య గారి ఇంటికి వెళ్లి మామయ్యా గారింటికి చూడటానికి తర్వాత వెళ్ళే వాళ్ళం. మామయ్యగారింటి లోపలికి వెళ్ళా లంటే స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి. బయటే ఉండి పిల్లలతో  తొక్కుడు బిళ్ళా, దొంగాట ఆడుకుని కఠెవరం తిరిగి వచ్చేవాళ్ళం. 

తెనాలి వెళ్ళినప్పుడల్లా బస్టాండ్ లో మంత్రజాలం చూస్తున్న గుంపులోనుండి తొంగి చూడటం అలవాటు. మామిడి కాయ టెంక పాతిపెట్టి నాలుగు సార్లు ముసుగు వేసి తీసే సరికి దాని నుండి మామిడి చెట్టు మామిడికాయ మామిడి పండు --- మాంత్రికుడు ఎల్లా  తెప్పిస్తాడో  నా కిప్పటికీ అర్ధం కాదు. అది నిజం కాదనుకోటానికి వీల్లేదు, మామిడి పండుకొసి ముక్కలు కూడా పెడతాడు. 

నా ఐదో క్లాసు తరువాత మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఊళ్ళు మారాము. అందుకని నా చదువు చాలా ఊళ్ళల్లో సాగింది. కానీ సంవత్సరంలో చాలా సార్లు పెళ్ళిళ్ళకీ పబ్బాలకీ తెనాలి, కఠెవరం వచ్చేవాళ్ళం. నేను చివరికి యూనివర్సిటీ లో చదువు కుని అమెరికా రావటం జరిగింది. మాతృ దేశం వచ్చినప్పుడల్లా తెనాలి కఠెవరం తప్పకుండా వెళ్ళే వాళ్ళం.

దేశం వదిలి దాదాపు ఏభైయేళ్ళయ్యింది. ఇప్పుడు కఠెవరం లో మా వాళ్ళెవరూ లేరు. కాకపోతే పెద్దలు కట్టించిన గుడి ఉంది. ఈ మధ్య  మా వదినగారి (శివుడన్నయ్య భార్య) ఆధ్వర్యంతో మనవలూ మనవరాండ్రు అందరూ కలిసి గుడిని బాగు చేయించి మళ్ళా కుంభాభిషేకం చేశారు. తెనాలిలో మామయ్యగారు పోయి చాలా యేళ్ళ య్యింది. రాముడన్నయ్య శివుడన్నయ్య కాలం చేశారు. పిల్లలందరూ దేశవిదేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. మొన్నటిదాకా మా వదినగారు తెనాలి లో ఉండేది. ఆవిడా ఈ మధ్య పోయింది. దాంతో తెనాలితో ఉన్న చివరి బంధం విడి పోయింది".  

అంటూ ఆగి పోయాడు పరమేశం.

నాకు ఏమి మాట్లాడాలో తెలియటల్లేదు. "మనకి ఇష్టమయిన వాళ్ళతో ఎప్పుడూ  గడపాలని అనిపిస్తుంది. మనం మాట్లాడిన పరుషపు మాటలు వెనక్కు తీసుకోవాలని పిస్తుంది. కానీ పరమేశం, దేముడి  చదరంగపు ఎత్తుల్లో మనం పావులం. రాజులూ రాణులూ మంత్రులూ బంట్లూ ఏనుగులూ గుర్రాలతో సహా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఆటలోనుండి బయటికి రావాల్సిందే. వాటిని గురించి విచారించి మనసు పాడు చేసు కోవటం అనవసరం" అన్నాను.

Sunday, November 8, 2020

162 ఓ బుల్లి కథ -- నాకు నచ్చిన సినీమా - 2

కరోనా Lockout తోటి ఇంట్లో కూర్చుని యూట్యూబ్ సినిమాలు చూడటం మొదలెట్టాను. చూసిన తర్వాత నాకిష్టమయిన వాటిమీద నా అభి ప్రాయాలు వ్రాయాలని పించింది. నేను వ్రాసే విధానం కొత్తగా ఉండచ్చు. గాభరా పడవోకండి.


సినిమా పేరు:  Movie Name:

శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ 
Sri kanakamahalakshmi recording dance troupe

నటీనటులు:

గోపాలం (నరేష్), సీత (మాధురి), దొరబాబు (భరణి).
ఇంకా చాలామంది ఉన్నారు గానీ, కధంతా ఈ ముగ్గురి మీదా  నడుస్తుంది.

సంక్షిప్తంగా  కధ :

ఒక అమాయక పిల్లోడు (నరేష్) తన  మేనమామ టిఫిన్ సెంటర్లో సహాయం చేస్తూ తనకి ఇష్టమయిన డాన్స్ ట్రూపులో నటిస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు. ఈ డాన్సు ట్రూప్ ఒక డొక్కు బస్సులో ఊరుఊరికీ తిరుగుతూ కార్యక్రమాలు జరుపుతూ ఉంటుంది.

ఆ ఊళ్ళో ఉన్న ఒక కన్నెపిల్ల సీత(మాధురి) అమాయక పిల్లోడు గోపాలం (నరేష్) మీద కన్నేస్తుంది. కానీ తన ఇష్టం తెలపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమాయక పిల్లోడు తెలుసుకోటల్లేదు. ప్రియుణ్ణి వలలో వేసుకోటానికి తను గోపాలం కనుసన్నలలో దగ్గరగా ఉంటేనే   సాధ్యమవుతుందని, గోపాలం ఎక్కువగా గడిపే నాటక కంపెనీ లో హీరోయిన్ గా  జేరుతుంది.

సిగ్గు బెరుకులతో ఉన్న గోపాలాన్ని "వెన్నెలై పాడనా", "నువ్వునా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జివ్వుమంటుంది మనసు, రివ్వు మంటుంది వయసూ ", అంటూ మురిపిస్తే కాముడి తాళికి ఆగలేక పిరికి గోపాలం సీత నిద్రపోతున్నప్పుడు సీత మెడలో పసుపుకొమ్ము తాళి కడతాడు. ఆ తర్వాత "ఏనాడు విడిపోని ముడివేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపుతాడు" అనుకుంటూ "ఏ జన్మ స్వప్నాల అనురాగమో మూసినదినేడు ఈ పసుపుతాడు " అంటూ ఆనందంగా పాడుకుంటారు . కానీ వచ్చిన గొడవ ఏమిటంటే ఇద్దరూ పరాధీనులు, స్వంతంగా ఏనిర్ణయం తీసుకోలేని వాళ్ళు. 

ఇదిలా నడుస్తూ ఉండగా నాటక కంపెనీ ఓనర్(కోట శ్రీనివాసరావు ) మేనల్లుడు దొరబాబు సీత మీద కన్నేస్తాడు. ఎలాగయినా సీతని దక్కించుకోవాలని సీతను తనవైపు తిప్పుకోవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతాడు.

తనకు ఇష్టమయిన ఆభరణాన్ని దక్కించుకోటానికి  ఒక సీత, ఒక దొరబాబు వేసే పన్నాగాలే ఈ సినిమా. 

చివరగా గోపాలం సీత నిజం పెళ్ళి ఘట్టం చాలా నాటకీయం గా జరిగి సుఖాంతం అవుతుంది.

ఆడపిల్లలూ మగపిల్లలూ, ఒక సమస్యని పరిష్కరించటానికి ఎంత విభిన్నంగా ప్రయత్నిస్తారో కన్నులకి కట్టినట్లు కనపడుతుంది ఈ సినిమాలో. 

నా కెందుకు నచ్చింది : 

మనుషుల్లో ఇష్టాఇష్టాలూ ప్రేమానురాగాలూ ఎల్లా పుడతాయో (వస్తాయో) చాలావరకు తెలియదు. వాటికోసం తపన పడి సాధించుకునే వాళ్ళు ఉంటారు మధ్యలో విసుగొచ్చి వదిలేసేవాళ్ళూ వుంటారు. ఈ సినీమాలో ప్రేమ మొదటి కోవకి చెందినది. అందుకే నాకిష్టం.