Tuesday, November 8, 2022

199 ఓ బుల్లికధ --- ఓ పరుగులెత్తే గంగమ్మ కధ

16వ అంతస్తు నుండి --- బెంగుళూరు 

గంగమ్మ వయస్సు ఎంతో గంగమ్మకి తెలియదు. జీవితంలో తన వయస్సు తెలుసుకోవాలనే అవసరం గంగమ్మకి లేదు. వయస్సు అడిగే ఉద్యోగాలు ఎప్పుడూ చెయ్యలేదు. ముగ్గురు చెల్లెళ్ళు  ముగ్గురు తమ్ముళ్ళ తో జీవితం గడిపింది. ఇంట్లో పెద్దదవటంతో పాఠశాల వైపు పోకుండా చిన్నప్పటి నుండీ ఇంటిపనులతోనూ పొలం పనులతోనూ కాలం గడిపింది.  

ఆమెకు పెళ్ళంటే తెలియని పన్నెండేళ్ళ వయసులో పెళ్ళి చేశారు. ఇంక అత్తారింట్లో కాపరం దానితో వచ్చే మంచి చెడ్డలితో కాలం గడిచిపోయింది. పిల్లలు పుట్టటం వాళ్ళ పెంపకం. భర్త ఇళ్ళ  నిర్మాణాల్లో మేస్త్రీ పని చేసేవారు. ఒక ప్రమాదంలో కాలు విరిగింది. జీవితంలో ఏవి ఎప్పుడు జరుగుతయ్యో చెప్పలేము. ధైర్యంగా ముందుకి సాగి పోవటమే. పనులు చెయ్యలేని భర్త, ఇద్దరి కొడుకులు ఒక కూతురితో తన సొంత ఊరు, తమిళనాడులో ధర్మపురి వదిలేసి దగ్గరున్న పట్టణం, కర్ణాటక లోని బెంగుళూరుకి  బస్ ఎక్కింది. 

బెంగుళూరులో అందరికీ అవసరమయ్యే ఇంటిపనిని తన వృత్తిగా మార్చుకుంది. కంప్యూటర్లతో సతమత మవుతూ ఆకాశ హర్మ్యాలలో నివసించే బెంగుళూరు వాసులకు ఒక పెన్నిధిగా మారింది. పొద్దున్నే ఏడింటికి బస్సు లో రావటం, అయిదు ఆరు ఇళ్ళల్లో పనిచేయటం, మళ్ళా సాయంత్రం ఏడింటికి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళటం మామూలు అయిపొయింది. పనిచేసే ఇంటి అవసరాల్ని బట్టి తన సమయాన్ని ఇంటింటికీ కేటాయించేది. ఒక ఇంటిలోనే అంత సమయమూ గడపకుండా ఇంటిపనులన్నీ విడివిడిగా చేసి అన్ని ఇళ్ళకీ సమయం కేటాయించేది. దానినే బిజినెస్ గురువులు కస్టమర్ సెగ్మెంటేషన్ అంటారు. సామాన్యంగా ఏదో ఇంట్లో కాఫీ ఇస్తారు ఎవరో మధ్యాన్నం భోజనం పెడతారు సాయంత్రం ఇంటికి తీసుకు వె ళ్ళటానికి ఏవేవో ఇస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ తినేవి ఎప్పుడూ మిగులుతూనే ఉంటాయి కదా!.

అల్లా 20 ఏళ్ళు గడిచింది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ గవర్నమెంటు పాఠశాలల్లో హైస్కూ ల్ పూర్తి చేశారు. పిల్లలకి పెద్ద చదువులు చెప్పించే పరిస్థితి లేక వాళ్ళని చిన్న వ్యాపారులుగా మార్చింది. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళకి పిల్లలు. ఒక చిన్న స్థలం కొనుక్కుని ఇల్లు కట్టించుకుంది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉంటారు. అత్తగారినీ, భర్తనీ ఇంట్లో పెట్టి చివరి వరకూ వారిని చూసుకుంది.

కోవిడ్ తర్వాత ఇండియాకి వచ్చిన ట్రిప్ లో బెంగుళూరు లో ఎక్కువ రోజులు గడపటం జరిగింది. ఎందుకో రోజూ మా ఇంట్లో పనిచేసే గంగమ్మ కధ  చెప్పాలని అనిపించింది. నిశ్శబ్దంగా తమపని తాము చేసుకుపోతూ జీవితం గడిపే గంగమ్మ లాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది  ఉన్నారు. వారి మూలానే ఈ దేశం నడుస్తోందనే మాటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Wednesday, September 28, 2022

198 ఓ బుల్లి కథ -- పెళ్ళికి ముందర ప్రేమించాలా ?

మన సమాజంలో "ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే క్రేజ్" మొదలయినదని తెలిసిన దగ్గరనుండీ నాకు నేను జీవితంలో ఏదో  మిస్ అయిపోయాననే శంక పీకుతూ ఉంటుంది. యాఫ్ట్రాల్ జీవితంలో ఒక్కసారే కదా పెళ్ళి  చేసుకునేది ! పెళ్ళికి ముందు ఆ అనుభవం అనుభవిస్తే ఎంతో బాగుండేదని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

నలభై ఏళ్ళ క్రిందట ఒక నెల శలవబెట్టి అమెరికా నుండి వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్ళాను . కాకపోతే అది నే ననుకున్నట్లు  జరగక మూడుముళ్ళూ వెయ్యటానికి  రెండు నెలలు పట్టింది. అప్పుడు అమెరికా వాళ్ళు అదొక రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు రోజూ  "ప్రేమ పెళ్ళి క్రేజ్"  వింటూ ఉంటే జీవితంలో నేను ఏదన్నా మిస్ అయిపోయుంటానా అనే అనుమానం నాకు రోజూ వస్తూ ఉంటుంది. 

ఎదో అమ్మాయితో అలా ప్రేమ యాత్రలకి బీచికి వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరం ఏదో రెస్టోరెంట్ కి వెళ్ళటం, మనసు మనసూ కలిసేలా మాట్లాడు కోవటం. ఇవన్నీ నేను ఒక్కణ్ణే మిస్ అయ్యానా ? అనేది నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. అందుకని నేనేనా, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని ఒక చిన్న పరిశోధన చెయ్యాలనే కోరిక మొదలయింది. అందుకని నాకు తెలిసిన వాళ్ళతో ముందర ప్రారంభించాలని అనుకున్నాను.

మేము నాలుగైదు ఫ్యామిలీలు నెలకోసారి మెడిటేషన్ కి కలుస్తూ ఉంటాము. ఒక సారి ఈ ప్రశ్న వేశాను. మీ పెళ్ళి ఎల్లా జరిగింది ? అని. అంటే ఎంత వైభవంగా జరిగింది అనికాదు. ఎట్లా మీ ఇద్దరికీ ముడి పడిందని.

నేను ఆ ఫ్యామిలీల గురించి ఒక ముక్క చెబుతాను. నేను ఒక్కణ్ణే ఆ చిన్న గుంపులో రిటైర్ అయిన  వాడ్ని. మా ఆవిడ ఇంకా పనిచేస్తోంది. మిగతా వాటిల్లో రెండు ఫ్యామిలీల లో అయ్యగార్లు  పనిచేస్తారు కానీ అమ్మగార్లు పని చేయరు. మిగిలిన రెండు ఫ్యామిలీలలో అమ్మగారూ అయ్యగారూ ఇద్దరూ పనిచేస్తారు.మొన్ననే ఒకళ్ళింట్లో వాళ్ళ 25 ఏళ్ళ కాపురానికి పండగ జరుపుకున్నాము. ఆంటే ఈ శాంపిల్ పోల్ లో ఇప్పటి వరకూ 25 ఏళ్ళ నుండీ 40 ఏళ్ళ పాటు సంసారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారన్న మాట. ఇంకొకఆయనకి పెళ్ళి అయినది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్యా వాళ్ళింటికి వెళ్ళాడు. నువ్వు యూనివర్సిటీ లో చదువుకున్నావు కదా నీ స్నేహితులు ఎవరన్నా పెళ్ళికున్నారా, చిట్టికి  పెళ్ళి సంబంధాలు చూస్తున్నాము అని అడిగిందిట. చిట్టి తన కూతురు. నేనున్నా కదా ఎందుకు చూట్టం అన్నాడుట. ఇష్టా ఇష్టాలు ఎంత చమత్కారంగా ఆవిడ అడిగిందో మేనల్లుడు అంతే చమత్కారంగా ఎల్లా సమాధానం  చెప్పాడో చూడండి. ఆయన  అత్తకూతురుతో ఆయనకి పెళ్ళయి పోయి శుభాంతంగా ముగిసి పిల్లా పాపాలతో కాపరం చేస్తున్నారు. 

వారి సమాధానాలు మీరు వింటే నమ్మరు కానీ నాది తప్ప అందరివీ పెద్దలు కుదిర్చిన సంబంధాలే. (నేనంతట నేనే నా పెళ్ళాన్ని ఎతుక్కోవాల్సి వచ్చింది.) పెళ్ళి చూపుల ముందు వాళ్ళకి  కూడా పరిచయాలు లేవు. ఒకళ్ళయితే ఆయనకి పెళ్ళి చూపులు కూడా లేవు. వాళ్ళ ఫ్యామిలీ లో అది ఆచారం కాదుట. 

పెళ్ళికి ముందర పరిచయం లేకపోయినా ఏళ్ళ తరబడి సంసారాలు సాగి పోతున్నాయి. సుఖంగా సంసారం చేసుకుంటున్న వాళ్ళని  మీ సంసారంలో ప్రాబ్లమ్స్ ఉన్నయ్యా  అని అడిగే ధైర్యం లేక అడగలేదు. వాళ్ళ జీవితంలో ఏదీ మిస్ అయినట్లు నాకేమీ కనపడటల్లేదు. పెళ్ళి ముందు ప్రేమ ఉండాలనేది చెప్పటం ఈ శాంపిల్ తో నిర్ధారించలేము. 

నేను ఇదే ప్రశ్నని నా క్లాసులో  పిల్లలకి వేశాను. నేను ఇక్కడ పది ఏళ్ళబట్టీ ఇమ్మిగ్రెంట్స్ కి  ఇంగ్లీషు మాట్లాడటం నేర్పు తున్నాను. రిటైర్ అయ్యిన తరువాత  కాలక్షేపం volunteer పని ఇది. ఈ ప్రశ్నకి సమాధానాలు వింటే మీరు ఆశ్చర్య పోతారు. పెళ్లిచేసుకోవటం ఎంత కష్టమో తెలిసిపోతుంది.

ఒక S. Korea అమ్మాయి చిన్ననాటి స్నేహితుడి తో కొంత కాలం తిరిగిందిట కానీ  యూనివర్సిటీ డిగ్రీ తెచ్చుకొన్న తరువాత ఇంకోళ్ళతో పరిచయమయ్యి రెండు సంవత్సరాలు తిరిగిన తరువాత పెళ్ళి చేసుకుందిట. అంటే ఇంకొకళ్ళు దొరికిన తరువాత మొదటివాడిని వదిలేసింది.

ఒక ఇటాలియన్ అమ్మాయి పన్నెండేళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తూ ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పెళ్ళి  చేసుకుందిట.

ఒక పోలిష్ అమ్మాయికి అబ్బాయి పరిచయ మయిన తరువాత పెళ్ళి  చేసుకోటానికి రెండేళ్లు పట్టిందిట. ఆ రెండేళ్లూ చేసుకుంటాడో లేదో అనే సందిగ్దావస్థ.

వెనుజువెలా అమ్మాయికి అయితే మాత్రం చెట్టా పట్టా లేసుకు తిరగ కుండా వెంటనే పెళ్లి అయి పోయింది. పెళ్లి ఇద్దరికీ అవసరం. వాళ్ళాయన కంప్యూటర్ ఇంజినీర్ దేశాలు తిరుగుతూ ఉంటాడు.

అదే రష్యా అమ్మాయికి పెళ్ళికోసం దేశం విడిచి పెట్టాల్సి వచ్చింది. అమెరికాకి మూడు నెలలకని వచ్చి అవసర రీత్యా  ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. ఇంకో సంగతి కూడా చెప్పింది. రష్యాలో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు  సామాన్యంగా అయిదు ఏళ్ళు సహజీవనం చేస్తారుట. ఆ తరువాత పెళ్ళి అయితే అవుతుంది లేక పోతే లేదు. 

ఈ పోల్ లో తేలింది,పెళ్లి చేసుకోటానికి తంటాలు పడటం తప్ప పెళ్ళికి ముందు చల్ మోహన రంగా అంటూ తిరిగిన సూచనలు లేవు.

నా unscientific పోల్ రిజల్ట్స్ inconclusive. పెళ్ళికి ముందు ప్రేమ ఉండాలా ? తెలియదు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ కధలు పేపర్లో చూస్తూ ఉంటే, తిట్టుకోటాలు కొట్టుకోటాలు, కత్తితో పొడుచుకోటాలు సూసైడ్ లూ, ఈ  ప్రేమా గీమా లో పస ఏమీ లేదని తెలుస్తోంది. ప్రేమించి పెళ్ళి  చేసుకోక పోవటం మూలంగా  జీవితంలో నేనేమీ మిస్  అవలేదు అని ప్రస్తుతం నేను గట్టిగా చెప్పగలను. 

Sunday, July 17, 2022

197 ఓ బుల్లి కథ -- సియాటిల్ లో ఒక వారం

House with ADU

 ADU లో పడుకుని ఆలోచిస్తున్నాను.  " ఇవ్వాళ ఎండగా  ఉంది  బయటికి వచ్చి కూర్చోండి" అన్న మా అబ్బాయి మాటలు వినటానికి బాగున్నా నేను మాత్రం బయటికి వెళ్ళ లేదు. నా లాంటి వాళ్ళకి ఇంకా బయట చలిగానే ఉంది. కొన్ని కొన్ని ఊళ్ళల్లో రోజూ ఎండ  రావటం ఒక వరం. సియాటిల్ ఆ ఊళ్ళల్లో ఒకటి. చికాగో నుండి ఈ ఊరు వచ్చి నాలుగు రోజులయింది. ప్లేన్లో  నాలుగు గంటల ప్రయాణం. అంటే దాదాపు 2,000 మైళ్ళు దూరం. వచ్చిన  రోజు కొంచెం ఎండ పొడ ఉన్నా తర్వాత రోజులన్నిట్లో ఎప్పుడో ఒకప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. 

ప్రతీ దానికీ మంచీ చెడూ, బొమ్మా బొరుసూ ఉంటాయి. వాటిని గ్రహించి  జీవితం గడుపుతుంటే  జీవితం ఆనందంగా హాయిగా ఉంటుంది. లేకపోతే జీవితంలో తరచు ఉరుములూ మెరుపులతో వర్షాలు కురుస్తూనే ఉంటాయి. 

రోజూ వర్షం మూలంగా ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం. చుట్టూతా ఎప్పుడో ఎవరో వేసిన చెట్లు నిటారుగా ఆకాశంలోకి చూస్తూ ఉంటాయి. పెరట్లోనూ ఇంటిముందూ ఎక్కడ చూసినా పూల చెట్లు. దాదాపు ఈ ఊరంతా  కొండల మీద మలిచిందే. పచ్చటి నేల మీద ఎటువైపు చూసినా రకరకాల పూల చెట్లతో , ఎత్తు పల్లాలలో సన్నగా పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద వృక్షా లతో, నేల మీద ఒక పెద్ద పెయింటింగ్ పరిచినట్లుగా ఉంటుంది. 

ఆకాశానికి తాకుతున్న చెట్లు 

కనులకు విందయిన  పచ్చదనాన్ని ఆస్వాదించటానికి ఇక్కడ ఇళ్ళు  కూడా అల్లాగే కడతారు.ఇల్లంతా కిటికీల మయం.  పడుకుని ఏ కిటికీ లో నుండి చూసినా చూడటానికి బ్రహ్మాండ మయిన పైంటింగ్స్ . ఊరంతా  కొండలని మలచి కట్టింది కాబట్టి  ఎత్తూ పల్లాల తో ఉంటుంది.  చుట్టూతా పెరట్లో చెట్లు. చెట్లు అనే కంటే వృక్షాలంటే బాగుంటుందేమో. అంత పెద్దవి ఎన్నేళ్ల క్రిందట  ఎవరు నాటారో ! చల్లటి వాతావరణం కనక  ఇక్కడ పెరట్లో పళ్ళ చెట్లు బాగా పెరుగుతాయి. పళ్ళన్నీ వాళ్ళే తినలేరు కదా, అందరికీ పంచిపెడతారు. మాకు "ప్లమ్స్ " అల్లాగే పక్కింటి వాళ్ళు ఇచ్చారు. సామాన్యంగా ప్రతి  ఇంటి ముందరా,పెరట్లో, పచ్చగడ్డి, పూల చెట్లు.

మీకు  ADU అంటే ఏమిటో చెప్పలేదు కదూ. దాని అర్ధం  Accessory ( Additional) Dwelling Unit. ఇంటి ఆవరణలో ఇంకొక చిన్న ఇల్లు ఉంటుంది. తల్లి తండ్రులో, అత్తామామలో వస్తే ఉండటానికి పనికొస్తుంది.  వాళ్ళని స్వతంత్రంగా ఉంటుందని   చెప్పి, బేస్మెంట్ లో పడేయకుండా, పక్కనే ఉంచుకోటానికి బాగుంటుంది. పైన  ఫొటోలో వన్  కార్ గ్యారేజ్ తో ఉన్న చిన్న ఇల్లు ADU. పెళ్ళైన వాళ్ళు ఏకాంతం కోరుకున్నప్పుడు దానిలోకి వెళ్ళి దాక్కోవచ్చు. ఇక్కడి మునిసిపాలిటీ వాటిని ప్రోత్సహించు తుందిట. మాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళ అమ్మకోసం పెరట్లో ఒక ADU కట్టించారు. కావలసిన పర్మిషన్స్ అన్నీ చెక  చెకా వస్తాయి. TSLA మస్క్ గారు కూడా  SpaceX ఆఫీసుకి కి అరిజోనా వెళ్ళినప్పుడు ఇటువంటి దానిలోనే ఉంటారుట. దాని ఖరీదు చిన్నది దాదాపు $80,000 ఉంటుంది.

మా ఇంటి ADU లో మేడమీద గదిలో పడుకుని చూస్తున్నాను. ఈ గదికి మూడు కిటికీలు ఉన్నాయి. రెండు చిన్నవి సన్నవి. మూడోది దాదాపు ఆ రెండూ కలిపిన దానికి సమానంగా ఉంటుంది. కిటికీల ఎత్తు దాదాపు గోడలో సగం ఉంటుంది. పెద్ద కిటికీ లోంచి చూస్తే, సర్వి చెట్లు. దాని ఆకులు పచ్చగా సూదుల్లా ఉంటాయి. పొద్దున్నే సూర్యకిరణాలు వాటిల్లోనుండి దూసుకు వస్తుంటే చూడటానికి సూర్య భగవానుడు మనని ఆశీర్వదిస్తున్నట్లు ఉంటుంది. అది తెల్లటి ఆకాశం మీద ప్రకృతి  సృష్టించిన ఓ వర్ణ చిత్రం. మిగతా రెండు కిటికీల్లో దృశ్యాలు రెండు వైవిధ్య వర్ణ చిత్రాలు. ఒక కిటికీలో దృశ్యం మెలికలు తిరిగిన చెట్ల కొమ్మలపై అల్లుకు పోయిన ఆకులు. రెండవ కిటికీలో కనపడేది, కొండ మీద పచ్చటి మైదానం దాని మీద రెండు పెద్ద పెద్ద చెట్ల బోదెలు వాటి మధ్య  పచ్చటి గడ్డి మీద విరచిన పూల మొక్కలు. అది ఒక 3D పిక్చర్. వాటిని చిత్రాలుగా వర్ణించి మీ కళ్ళలో కనిపించేటట్లు చేసే శక్తి నాకు లేదు.

గోడల మీద పెయింటింగ్స్ పెట్టవలసిన అవసరం లేదు. కిటికీలే పెయింటింగ్స్. రోజంతా కిటికీల వేపు చూస్తూ గడిపేయ వచ్చు. అలా చూస్తూ ఉంటే ఏమిటేమిటో ఆలోచినలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఎదో ఒక కొత్త పని క్రియేటివ్ గా చెయ్యాలనిపిస్తుంది.

అందుకనే కొత్త కొత్త  వాటికి ఈ ఊరు పుట్టినిల్లు. "అమెజాన్" "మైక్రోసాఫ్ట్" "బోయింగ్" "స్టా ర్బ క్స్" ,"కాస్టుకో(Costco )". ఎదో చెయ్యాలనే కోరిక ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు చెయ్యటానికి వీలుగా అనుకూలమయిన సమయం వస్తుంది. చెయ్యొచ్చు. ఆ చేద్దామనే కోరిక మాత్రం నిరంతరం ఉండాలి.

ఇక్కడ ఒకటే ఒక పెద్ద ప్రాబ్లమ్. ఎప్పుడో ఒకప్పుడు చలికాలంలో ఒక రోజు ఒక అంగుళం స్నో పడుతుంది. అంతే దాదాపు జీవితం స్థంభించి పోతుంది. స్నో తీసే పరికరాలు లేక రోడ్లన్నీ స్నోతో  నిండి పోయి ఉంటాయి. సందులు గొందుల్లో గార్బేజ్ తీసుకు వెళ్లే బళ్ళు కదలటానికి వీల్లేక అవి రావు. కార్లు స్నోలో నడపటం చాలామందికి చేతకాదు. అందుకని ప్రమాదాలు. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగి స్నో అంతా కరిగిపోతుంది. అప్పటిదాకా జీవితం కొంచెం మందగిస్తుంది. చికాగోలో సంవత్సరాలు గడిపిన నాలాంటి వాళ్ళకి ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది.

ఇంకో విచిత్రం ఇక్కడ మీరు ఇంట్లో కూరగాయలు తరుగు తున్నప్పుడు పారవేసే వ్యర్ధ పదార్ధాలని మునిసిపాలిటీ వాళ్ళు తీసుకుని "కంపోస్ట్" క్రింద మారుస్తారు. ప్రతి వారం గార్బేజ్, రీసైకిల్ తో పాటు మునిసిపాలిటీ వాళ్ళు దీనిని వేరే డబ్బాలో వేస్తే తీసుకుంటారు.

చికాగో తిరిగి వెళ్ళటానికి పెట్టెలు సర్దుకుంటున్నాము.  జీవితంలో మనం అనుకోని సంఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకరినుండి ఒకరికి సోకి ఇంటావిడ నలత పడింది. దానితో క్వారంటైన్ . ADU లో నా వంట. చిన్నప్పుడు ఇంట్లో నేర్చుకున్న మాటలు, స్కిల్స్ (అన్నం వండటం వగైరా ) బాగా ఉపయోగపడ్డాయి. "మంచి నీళ్లు పోస్తా గ్లాస్ బయట పెట్టు", "కాఫీ, టిఫిన్ తలుపు దగ్గర పెట్టాను. తీసుకో", "భోజనం గుమ్మం దగ్గర పెట్టాను. తీసుకు తిను". "ఇవ్వాళ కూర లేదు పచ్చడి  ముద్దే". "స్నానం చేసి బట్టలు ఉతికి ఆరేసుకో, వాటిని అన్నిటితో కలపవోకు ", ఈ మాటలన్నీ చిన్నప్పుడు ఇంట్లో నాన్న అంటూ ఉంటే నేర్చుకున్నవే. అన్నీ వాడుకున్నాను.

తిరుగు ప్రయాణానికి కొన్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని , ఇంకో ప్లేన్ లో టికెట్స్ కొనుక్కొని, వారం అనుకున్నది పది రోజుల తర్వాత, ప్లేన్ లో మాస్కులు పెట్టుకుని, జాగర్తగా ఇంటికి  జేరాము.

Friday, June 10, 2022

196 ఓ బుల్లి కథ -- ఓ కన్నీటి బొట్టు

ఈ రోజు ఓ కన్నీటి బొట్టు తో, నా అశృ నయనాలతో మీకు కృతజ్ఞలతలు చెప్పుకుంటున్నాను. మీ మీ ఇళ్లకు వచ్చినప్పుడల్లా, విడిచి పెట్టకుండా దానిని గురించి అడిగే వాడిని . మీరు విసుక్కోకుండా  దానిని గురించి చెప్పేవారు. అంతేకాదు దానిని చూపించి ఎల్లా పని చేస్తుందో కూడా చెప్పేవారు. ఆ చెప్పే సమయంలో మీ మీ కన్నులలో మెరిసే స్పార్క్స్ నన్ను ఉత్తేజ పరిచేవి. 

నేనూ ఎన్నో అనుకున్నాను. దానితో ఏవేవో కొత్త కొత్తవి చేద్దామని కొత్త పుంతలు తొక్కుదామనీ. యాఫ్ఫ్ట్రాల్ ఒక కొత్త మెషిన్ కొనుక్కుంటే దానితో కొత్త పనులు చెయ్యకపోతే ఎలా ! ఇంటర్నెట్ అంతా వెదికాను కొత్త మోడల్ వచ్చిందేమో చూద్దామని. మీ వన్నీ పాత మోడల్స్ కదా (మీరేమీ అనుకోవోకండి).  కొన్ని నచ్చాయి కానీ ఖరీదు ఎక్కువ. కొన్ని చూడటానికి బాగుండలేదు. మన ఇంటి డెకోర్  కి సరిపోవాలి కదా. ఇటువంటి సందిగ్ద పరిస్థుతులలో మా ఆవిడకి  నా కొత్త ప్రాజెక్ట్ గురించి నా సందిగ్దావస్థ గురించి చెప్పాను. ఇంట్లో వంటింటి కౌంటర్ ఆధీనురాలు ఆవిడే కదా !

తను నాకు 100% సపోర్ట్ ఇస్తానని చెప్పింది. అది నాలో నూతన ఉత్సాహము కలిగించింది. కానీ మనసులో తనకి నేను చెప్పినది అర్ధం కాలేదనే శంక ఉండిపోయింది. ఏ భార్య అయినా భర్త చెప్పిన దానికి 100% సపోర్టు ఇస్తుందా!  నేను సరీగ్గా చెప్పి ఉండకపోవచ్చు అని నాకు ఓ చిన్న సందేహం ఉంది. దీనిలో తన తప్పు ఏమీలేదు. ఉత్సాహంతో ఎగ్జైట్మెంట్ తో ఉన్నప్పుడు నాకు  మాటలు సరీగ్గా రావు. 

వాటిని ఎంచుకోవటం చాలా కష్టంగా ఉందని చెప్పాను. తాను ముందర దానితో ఏమి చెయ్యాలనుందో ఆలోచించుకోమంది. ఆ తరువాత వాటికోసం వెతకటం మొదలు పెట్టమని  చెప్పింది. ఆ సెలెక్ట్ చేసిన వాటిల్లో ఇంటి డెకోర్ కి సరిపోయేది  సెలెక్ట్  చేయటం సులభం అంది. అది మంచి సలహా. అందుకనే వారిని భర్తల తలలో నాలికలంటారు.

నా ఉత్సాహం రెండింతలయింది. దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించి వాటిని  క్రోడీకరించటం మొదలు పెట్టాను. ఇక్కడ చాలా  జాగర్తగా ఉండాలి. మీ కొత్త కొత్త ఐడియాస్ అన్నీ చెప్పేస్తే, గిట్టని వాళ్ళు అవి చెత్త అని తోసిపారేస్తారు. గిట్టిన  వాళ్ళు  అవి కష్టమేమో అని ఉత్సాహం మీద నీళ్లు చల్లచ్చుఁ . అందుకని నేను చాలా ఆలోచించి, అసలు చేద్దా మనుకున్నవి రహస్యంగా పెట్టుకుని,  అందరికీ అర్ధమయ్యే చిన్న చిన్న పనులు చెయ్యటాన్ని గురించి చెప్పాను. మీ మీ కొత్త ఐడియాస్ ఎవ్వరికీ, చివరికి భార్యకు కూడా, చెప్పవలసిన అవుసరం లేదు. పెళ్లి కాంట్రాక్టులో ఇది లేదు. ఒకవేళ నా  ప్రాజెక్ట్  ఫెయిల్  అయితే రిటర్న్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు అని చెప్పంగానే, నాకు కొనటానికి ఓకే వచ్చింది.

వెంటనే walmart లో ఆర్డర్ చేశాను . వారంరోజుల్లో అది ఇంటికి వచ్చింది. ఉత్సాహంగా అన్నీ ఊడదీసి సెటప్ చేశాను. మా స్నేహితులని మా ఇంటికి వచ్చి మా కొత్త మెషిన్ ని ప్రారంభోత్సవం చెయ్యమని అడిగాము. వారు (AVL ,శోభ దంపతులు ).  మా కోరికను మన్నించి మా ఇంటికి వచ్చి బొట్టుపెట్టి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. వారికి మా కృతజ్ఞతలు. 

ఒక నెల రోజులు ప్రయత్నించాను. పాత వంటలే దానిమీద చేయలేక పోయాను, ఇంక కొత్త  వంటలు సృష్టించటం ఎక్కడ ? చెప్పద్దూ  ఫ్రెంచ్ ఫ్రైస్ బాగానే వచ్చాయి. సగ్గుబియ్యం వడియాలు కూడా బాగా వచ్చాయి. కానీ ఆ రెండూ రోజూ తినము. గంట కష్టపడి చేసిన సగ్గు బియ్యం వడియాలు అయిదు నిమిషాల్లో అయిపోయినాయి. పెట్టిన కష్టానికి సరిఅయిన ఫలితం రాలేదని బాధ. చివరికి ఓటమిని అంగీకరించక తప్పలేదు. అనుకున్న ప్రకారం  తిరిగి ఇచ్చేయవలసి వచ్చింది. 

రిటర్న్ చేద్దా మనుకున్న కున్న రోజు రానే వచ్చింది. దాన్ని  శుభ్రం చేసి జాగర్తగా ప్యాకేజ్ లో  పెట్టాము. వాతావరణం చక్కటి సూర్యరశ్మి తో ప్రకాశిస్తోంది. కానీ ఎక్కడలేని నిశ్శబ్దం. మనస్సు  ఏదో శంకిస్తూనే ఉంది. walmart రిటర్న్ కౌంటర్ దగ్గరకి వెళ్ళాము. మేము రెండో వాళ్ళము. సంతోషించాము. ఎంతసేపటికీ కౌంటర్ దగ్గరున్న మా ముందర ఉన్న అమ్మాయి పని తెమలట ల్లేదు. చివరికి రిటర్న్ లో కంప్యూటర్లు పని చెయ్యటల్లేదని చెప్పారు. ప్యాకేజీ ని ఇంటికి తీసుకు వచ్చాము. 

మర్నాడు  మళ్ళా వెళ్ళాము. నాకు రిటర్న్ చెయ్యాలనంటే బాధగా ఉంది.  నేనే కాదు ప్రకృతి కూడా ఆరోజు శోకించింది. ఆకాశం అంతా మేఘాలతో నిండివుంది. పార్కింగ్  లాట్ లోనుండి కార్ట్ లో దాన్ని రిటర్న్ చెయ్యటానికి తీసుకు వస్తుంటే హఠాత్తుగా ఆకాశం నుండి ప్యాకేజ్ మీద చినుకులు పడటం మొదలయింది. సున్నితంగా దాని మీద నా గొడుగు వేసి తడవకుండా చేసి లోపలి వచ్చాము . నాకు దానిమీద ప్రేమ ఇంకా పోలేదు. నెల రోజుల అనుబంధం కదా ! 

walmart  లో రిటర్న్ కౌంటర్ పనిచేస్తోంది. క్యూలో ఎవ్వరూ లేరు. మా ఆవిడ నా ముఖంలో బాధ కనపడుతోంది అని చెప్పింది. బాధ పడద్దని ధైర్యం చెప్పింది. రిటర్న్స్ తీసుకునే కుర్రది నా బాధని పట్టించుకోలేదు. ఒక నిమిషంలో మీ ఎకౌంటు లో డబ్బు పంపిస్తున్నాము అని చెప్పి కార్ట్ ను అక్కడ పెట్టమంది. చివరిగా నేను ప్యాకేజ్ ఉన్న కార్టుని రిటర్న్ వస్తువులు పెట్టిన స్థలంలో పెట్టి, దాన్ని మృదువుగా స్పృశించి, బాధగా వీడ్కోలు చెప్పి దిగులు ముఖంతో బయటకు వచ్చాను. పక్కనున్న మా ఆవిడ కొంచెం నాకు ధైర్యం చెప్పి ఉపశమనానికి "సబ్  వే "  వెజ్జీ మాక్స్ విత్  ఇటాలియన్ బ్రెడ్"  ని కొనిపెడతానని చెప్పింది. దానితో నాకు జీవితం మీద కొంచెం ధైర్యం వచ్చింది.


గుడ్బై మై డియర్ ఎయిర్  ఫ్రయర్ .

**** "ఎయిర్  ఫ్రయర్" వేడి గాలులతో దానిలో పెట్టిన వస్తువులని ఉడక పెడుతుంది. వేసవి  కాలంలో గుంటూరు లాగా.

Thursday, May 5, 2022

195 ఓ బుల్లి కథ -- లెంపలేసుకున్న రోజులు !



ఏప్రిల్ చివర్లో మా పెరటి చెట్లు 

తెల తెల వారుతుండగా పక్షులు "చిక్ చిక్, చిక్ చిక్ " అంటూ శబ్దం చెయ్యటం మొదలుపెడతాయి. ఉదయాన్నే ఉడతలు నేల మీద పరుగెడుతూ తినటానికి ఎదో వెతుక్కుంటూ ఉంటాయి. మధ్యాహ్నం కుందేళ్లు అప్పుడే చిగురించిన లాన్ మీద గడ్డిని కొరుక్కు తింటూ ఉంటాయి. చలికాలంలో మోళ్ళు గా మారిన చెట్టు కొమ్మలు, చిన్న చిన్న మొగ్గలతో పలకరిస్తాయి. మొన్న పక్కనున్న చెరువు లోనుండి బాతులు మా లాన్  మీద వయ్యారంగా నడుచుకుంటూ పోతున్నాయి. ఇది మా పెరట్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరిగే వసంతోత్సవం. దీనికోసం చలికాలంలో వణుకుతూ ఎదురు చూస్తూ ఉంటాము. ఏప్రిల్ అయిపోగానే  "మే " లో అంతా పచ్చదనంతో నిండి పోతుంది. 

ఇవే చికాగో దగ్గర మా ఇంటి ఎదుట ప్రతి ఏటా జరిగే పరిణామాలు. నలభై ఏళ్ళబట్టీ  "ఏప్రిల్" కోసం, పక్షులు చేసే మేలుకొలుపులకోసం ఎదురు చూడటం అది వెళ్లి పొగానే అప్పుడే వెళ్లిపోయిందా అనుకోవటం మామూలే. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ వస్తుంది , "వసంతం" తెస్తుంది. ఇది తాత్కాలమని తెలిసినా ఉన్నంతసేపూ ఆనందించటం అలవాటయి పోయింది. పై ఫోటో అప్పుడే చిగురించిన ఆకులతో విరాజిల్ల బోతున్న మా పెరటి చెట్లు.

అసలు రెండు నెలల బట్టీ వ్రాద్దామనుకుంటున్నది ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జరిగిన సంఘటన గురించి. ఎంత వ్రాద్దామని ప్రయత్నించినా "మెంటల్  బ్లాక్" తో  వ్రాయటం కుదరలేదు. ఇంకోటి ఏమన్నా వ్రాద్దామనుకుంటే నాగురించి రాస్తేగానీ వదలను అని మొరాయించింది. దాని గురించి వ్రాద్దామనుకుంటే ఇంకో సంగతి నా గురించి వ్రాయవా అంటూ ముందుకి వచ్చింది. ఈ రెండింటికీ నాకు పడ్డ శిక్ష ఒకటే. "లెంపలేసుకోవటం".

ఇది చాలా కాలం క్రిందట జరిగింది కానీ అప్పుడప్పుడూ మనస్సులో "కిలిక్" మంటూ ఉంటుంది. అప్పుడే ఫ్లారిడా "ఓర్లాండో" నుండి చికాగో "ఓ హే ర్ " ఏర్పోర్ట్ లో దిగాము. సామాను తీసుకోటానికి మా ఇంటావిడ తిరిగే బెల్టు దగ్గరకు వెళ్ళింది. అల్లాగే మాతో పాటు ప్లేన్ లో వచ్చిన ఒక జంటలో ఆయన సామాను తెచ్చు కోటానికి వెళ్ళాడు. నేను వంటరిగా ఉన్న ఆవిడతో మాటలు కలిపి పిచ్చాపాటీ మాట్లాడు తున్నాను. అది సూట్కేసు తీస్తున్న మా ఆవిడ కంటబడింది. రమ్మని ఒక కేక తో గర్జించింది. కోపంతో వణికి పోతోందల్లేవుంది, ఆవిడ చేతులో ఉన్న ఫోన్ కిందపడి పగిలి పోయింది. మమ్మల్ని ఇంటికితీసుకు వెళ్ళటానికి వచ్చిన, "సెల్ లాట్" లో ఉన్న, "లిమో" ని పిలవాలంటే ఫోన్ కావాలి. కోపంతో ఉన్న ఆవిడతో మాట్లాడటం చాలా కష్టం. ఆవిడ పబ్లిక్  ఫోన్  కోసం వెతుకుతుంటే నేను మాట్లాడకుండా ఫాలో అయ్యాను. ఆవిడకి  ఫోన్ నంబర్లు కంఠతా వచ్చు దానితో బతికిపోయాము లేక పోతే ఏమయ్యేదో. ఆ రోజునుండీ ఇతర స్త్రీలతో మాట్లాడకూడదని (మా ఆవిడ ఎదురుకుండా ఉంటే ), లెంపలేసుకున్నాను.

"వేడి నీళ్ళన్నీ మీరే పోసేసుకున్నారా?" అనే మాట వినే  సరికి నేను కొంచెం గాభరా పడ్డాను. ఎందుకు ఇల్లా అంటోందో మొదట అర్ధం కాలా. "మీరే" అని వత్తి పలకడంలో  నేనేదో తప్పు చేసినట్లు చెబుతూ, మర్యాదగా చెబుతున్నట్లు గా చివరలో "రా " తగిలించింది. ఈ  "రా " , "ఏరా", "పోరా", "వెళ్ళి రా", "బుజ్జిరా" లాంటి వాటిల్లో "రా " కాదు. ఇది గౌరవిస్తున్నట్లు కనిపిస్తూ కఠినంగా  కోపంతో చెప్పే "రా".

ఎదో తప్పుచేసిన వాడిలా క్షమించ మని చెప్పాలా? లేక ఆవిడకు ఇష్టమయినది ఎమన్నా చెయ్యాలా? అంతు పట్టలా. మాకు నలభయ్ గాలెన్ల  వేడి నీళ్ళ ట్యాంక్ ఉంది. ఇంట్లో ఉన్నది ఇద్దరు. నేను రోజూ ఒక అరగంట స్నానం చేసినా ఎప్పుడూ ఈ ప్రశ్న రాలా.  

సరే నీ స్నానమయిందిగా వేడి నీళ్ళ సంగతి రేప్పొద్దున చూద్దాములే అని చెప్పి ఆ పూటకి ఆ సమస్య పరిష్కరించాను. 

ఆరోజు సాయంత్రమే  "సియాటిల్"  నుండి ఇంటికి వచ్చాము. అది ఫిబ్రవరి మిడ్ చికాగో వింటర్ . ఇంట్లోకి రాంగానే ఇంట్లో వేడి సరీగ్గా ఉందో  లేదో, వేడి నీళ్ళ హీటర్ సరీగ్గా పనిచేస్తుందో లేదో చూశాను . ఇంట్లో వేడి గానే ఉంది, వాటర్ హీటర్ బ్లింక్ అవుతోంది అంటే అది పనిచేస్తోందన్నమాట. కాకపోతే వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రత తగ్గించి పెడతాము, వాటిని సరిచేయమని ఆవిడకి సూచించాను. 

రాత్రంతా ఆలోచించాను. నాకు తెలుసు ఇది రేపు పెద్ద సమస్య అవుతుందని. ఫిబ్రవరి మిడ్ వింటర్ లో, బయట వాతావరణం జీరో డిగ్రీలు ఉన్నప్పుడు, పెళ్ళాం చేత చల్ల నీళ్ల స్నానం చేయించటం సరికాదు, అది తెలీకుండా చేసినా సరే. రాత్రంతా ఆలోచించి మరుసటి రోజు ఎల్లా ఉండాలో నిర్ణయించుకున్నాను. ఎక్కువ మాట్లాడ కూడదు. వీలయినంతవరకూ మౌనంగా ఉండటం మంచిది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు  "లే లో " అన్నారు ఇంగిలీషు వాళ్ళు. అదీ పద్ధతి.

తెల్లారింది కాఫీలు తాగాము. "వాటర్ హీటర్" సంగతి చూడాలని నిర్ణయించటం జరిగింది. అది "బ్లింక్" అవుతోంది. నాకు తెలిసినంత వరకూ "బ్లింక్" అవుతుంటే పనిచేస్తున్నట్లే. మరి ఎందుకు చల్ల నీళ్లు వచ్చాయి? నా దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పటం సరిగాదు అని నిర్ణయించు కున్నా. ముఖ్యులు ఇది తప్పు అని నిర్ణయిస్తే, అది ఫైనల్. ఎదురు సమాధానం చెప్పటం అంత మంచిది కాదు. 

ఇప్పుడు అన్నీ పనిచేసేవి కంప్యూటర్లతో కాబట్టి, కంప్యూటర్ "రీసెట్" లాగా "ఆఫ్" చేసి "ఆన్" చేద్దామని నిర్ణయించటం జరిగింది. నేను తల ఊపాను. వాటర్ హీటర్ ఆఫ్ చేశాము. మళ్ళా  "ఆన్" చెయ్యటానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఎన్ని సార్లు చేసినా  అది "ఆన్" అవలేదు. పక్కింటి వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళకీ కుదరలేదు. "వేడి నీళ్లు" లేవు అని తలుచుకోటానికే భయంగా ఉంది. ఆవిడ వర్క్ కి వెళ్ళాలి. స్టవ్ మీద నీళ్లు కాచుకుని, మేడమీదికి తీసుకు వెళ్లి స్నానం చేసి నీ సంగతి నువ్వు చూసుకోమని వెళ్లి పోయింది. 

మిడ్ వింటర్ లో చల్ల నీళ్ల స్నానం. తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎందుకు గంగిరెద్దు తలూపినట్లు వాటర్ హీటర్ ఆఫ్ చెయ్యటానికి వప్పుకున్నాను. "బ్లింక్" అవుతుంటే పనిచేస్తున్నట్లే కదా. మరి చల్ల నీళ్లు ఎందుకు వచ్చాయి. చలికాలంలో మొదట చల్ల నీళ్లు కాకుండా వేడి నీళ్లు వస్తాయా? చెప్పే ధైర్యంలేదు. మౌనంగా ఊరుకుంటే వచ్చే తిప్పలు ఇలాంటివే.

"బ్లింక్" చేస్తూ నేను పనిచేస్తున్నాను మొర్రో అని మొత్తుకుంటున్నా వాటర్ హీటర్ ని "ఆఫ్" చెయ్యటానికి ఎందుకు తలూపానా అని పెద్దగా లెంపలేసుకున్నాను.

రెండు రోజుల్లో కొత్త హీటర్ పెట్టటం జరిగింది. అనుకోకుండా వెయ్యి డాలర్లు ఖర్చు. పాత వాటర్ హీటర్ పోయినందుకు పెద్ద బాధ పడలేదు. పదమూడేళ్ళు పని చేసింది చాల్లే అని సంతోషించాను. 

Monday, February 14, 2022

194 ఓ బుల్లి కథ -- డిన్ టాయ్ ఫంగ్ Din Tai Fung (A Taiwanese Restaurant)

Din Tai Fung restaurant 

ఇవ్వాళ డిన్నర్ చైనీస్ అంటేను నేను రాను ఇంట్లోఉంటాను అని చెప్పాను. ఆరోజే కొత్తింట్లోకి మారాము. నీకు టెలిఫోన్ లేదు ఇంట్లో వైఫై లేదు కనీసం టీవీ కూడా లేదు ఏంచేస్తావు, ఇక్కడ కూర్చునేది అక్కడేకూర్చుందు గాని రమ్మన్నారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, ప్రియమైన భార్యవైపు చూస్తే ఆవిడ మొహం తిప్పేసుకుంది, ఆవిడ అప్పటికే తయ్యారు అయ్యి కూర్చుంది. ఇంక తప్పదు వెళ్లాను. సామాన్యంగా చైనీస్ రెస్టరెంట్ లో ఆర్డర్ చేసినవన్నీ మధ్యలో పెట్టి ఎవరికి ఇష్టమయినవి వాళ్ళు తమ ప్లేట్లల్లో వేసుకుని తింటారు. ఊర్కేనే కూర్చోవచ్చులే అనుకున్నాను.

నా ఉద్దేశంలో చైనీస్ రెస్టరెంట్ అంటే, చాప్ సూయీ, ఎగ్ ఫు యంగ్, ఫ్రైడ్ రైస్, ఎగ్ డ్రాప్ సూప్ మొదలయినవి . అక్కడ వాసన భరించటం కొంచెం కష్టం. ఇండియన్ రెస్టరెంట్ అయినా అంతే అనుకోండి కానీ అది మనకు తెలిసిన భరించే వాసన.

రెస్టారెంట్ యూనివర్సిటీ విల్లేజ్ అనే షాపింగ్ సెంటర్ లో ఉంది. తీరా చూస్తే ఆ  చైనీస్ రెస్టరెంట్ మల్టి లెవెల్ పార్కింగ్ లాట్లో ఉంది. జీవితంలో ఎప్పుడూ పార్కింగ్ లాట్లో ఉన్న రెస్టారంట్ చూడలేదు. రోడ్ పక్కన టిఫిన్ తిన్నాను, కాఫీ టీ తాగాను ( అందులో ఒకటి, భోపాల్ ట్రైన్ స్టేషన్ దగ్గర పొద్దున్న ఆరింటికి పరగడుపున పళ్ళు తోముకోకుండా తాగిన టీ ఎంత బాగుందో అది ఇప్పటికీ గుర్తుంది)   కానీ ఇంత వరకూ పార్కింగ్ లాట్ రెస్టరెంట్ లో తినలేదు. 

అక్కడికి వెళ్లేసరికి పెద్ద క్క్యూ. మా కోడలు వెళ్లి రిజర్వేషన్ చేసింది. దాదాపు లోపలకి వెళ్ళటానికి ఒక అరగంట పట్టవచ్చన్నారు. మేము పదిమంది అంత మందికి ముందర రిజర్వేషన్ సౌకర్యం లేదుట.

మా మనవడు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పదార్ధాలు ఎల్లా చేస్తారో చూపెట్టాడు. పై బొమ్మలో ఎడమ వైపున వంటవాళ్లు పదార్ధాలు చెయ్యటం చూడవచ్చు.ఇది తైవానీస్ చైనీస్ రెస్టరెంట్. బహుశ మెన్యు లో తేడా ఉండవచ్చు . దాదాపు ఇరవై మంది అయిదు బల్లల దగ్గర నుంచుని పని చేస్తున్నారు. కజ్జికాయల్లాగా కొన్ని, కుడుములు లాగా కొన్ని చేస్తున్నారు. వాటిని డంప్లింగ్స్ అంటారుట. 

 వీటిని తయారు చేసిన తర్వాత  ఒక చిన్న జల్లెడ లాగా ఉండే ట్రే లో పెడతారు .


ఆ ట్రే లన్నీ ఒక దాని మీద ఒకటి పేర్చి వాటి అన్నిట్లోకీ నీటి ఆవిరి పంపి ఉడికిస్తారు.

లోపలికి రమ్మని పిలుపు కోసం బయట కూర్చున్నాము. ఇది మిడ్ వింటర్, సియాటిల్ అయినా బయట 30F (-1.1C). చలి. ఇంకో ఫ్లోర్ కి వెళ్లి కొంచెం వెచ్చగా ఉండే చోట కూర్చున్నాము. పిల్లలూ కొందరు పెద్దలూ షాపింగ్ సెంటర్ చూడటానికి వెళ్లారు. ఇది కొంచెం ఖరీదయిన షాపింగ్ సెంటర్ ట. 

ఒక అరగంట తర్వాత లోపలికి రమ్మని పిలుపు వచ్చింది. ఒక పెద్ద డైనింగ్ హాల్ లో నుండి పెద్ద ఫామిలీ రూమ్ లోకి తీసుకు వెళ్లారు.  రక రకాల డంప్లింగ్స్, తీపి కుడుములు తీసుకు వచ్చి టేబుల్ మధ్యలో పెట్టారు. వచ్చిన పదార్ధాలన్నీ వేగన్. తెచ్చిన కుడుముల్లో రెండు రకాలు నువ్వులు బెల్లం మధ్యలోపెట్టినవి, తీపి రెడీబీన్స్ మధ్యలోపెట్టినవి. చాప్ స్టిక్స్ ఉన్నాయి కానీ నాకు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా వాడటం చేత కాలేదు. నాబోటి వాళ్ళకోసం ఫోర్క్స్ ఉంటే అవి వాడాను. 

Server 

అందరూ వారికి కావాల్సినవి వారు తిన్నారు. నేను చైనీస్ టీ తాగి బీన్స్, ఫ్రైడ్ రైస్, తీపికి రెడ్ బీన్ డంప్లింగ్ తిన్నాను. చెప్పద్దూ అంత రుచికరమైన బీన్స్ నేను ఎప్పుడూ తినలేదు. 


రెడ్ బీన్ డంప్లింగ్ 

తిని, తాగి ఒక గంట తర్వాత ఇంటికి బయలుదేరాము. నేను మొదట దీని గురించి వ్రాద్దామని అనుకోలేదు. కానీ ఈ రెస్టారెంట్ గురించి చదువుతుంటే క్రింది విషయం వెలుగులోకి వచ్చింది.
వ్రాయక తప్పలేదు. నేను ప్రపంచం లో ఉన్న పది మంచి రెస్టారెంట్లల్లో ఒక రెస్టారెంట్ లో భోజనం చేశాను అని గర్వంగా చెప్పుకోవచ్చు.


Named one of the top ten gourmet restaurants in the world by The New York Times.


Tuesday, February 1, 2022

193 ఓ బుల్లి కథ -- భాషలు ఎల్లా పుట్టాయి ? (Evolution of Languages )

మనం జీవించాలంటే రెండు పనులు రోజూ చేస్తుండాలి. శరీరానికి మనస్సుకి ఆహారం. దీనికి మనం పంచేంద్రియాల సహాయం తీసుకుంటాము. ఈ రెండింటికీ నోరు చాలా ముఖ్యం. మొదట్లో ఆహారం తీసుకోటానికి నోరు ఉపయోగించినప్పుడు, దానితో శబ్దాలు చెయ్యవచ్చు అని గ్రహించారు. ఆ శబ్దాలు విన సొంపుగా చెయ్యవచ్చుఅని తెలుసుకొని ఆచరించటమే సంగీతం. ఆ శబ్దాలతో  మనసులో భావాలు వ్యక్తం చెయ్యవచ్చు అని తెలిసికొనటం ఒక భాషకు పునాది. మానవులు ప్రపంచం లో పలు చోట్ల గుంపులుగా ఉండటం వలన, వారి అవసరాలకి గుంపుకో భాష తయారు అయ్యింది. 

సియాటిల్ ఇంటిలో  పుస్తకాల కోసం వెతుకుతుంటే "The Evolution of Language" అనే పుస్తకం దొరికింది. పెద్ద పుస్తకం. చదవటానికి ఉపక్రమించాను. ఇది March 2008 లో బార్సిలోనా, స్పెయిన్ లో జరిగిన "Evolution  of Language " కాన్ఫ రెన్స్ లో సమర్పించిన పరిశోధనా పత్రాల సంకలనం.

 కొంచెం కష్టమైనా విషయం తెలుసుకుందామనే జిజ్ఞాసతో చదవటం ప్రారంభించాను.  ఈ పోస్టు లో ఆ పరిశోధనా పత్రాల నుండి నేను తెలుసుకున్న కొంత సమాచారం మీతో పంచుకుంటున్నాను. దీనిలో రెండు పరిశోధన పత్రాలు వ్రాసిన వాడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నా సందేహాల నివారణ తేలిక అయింది.

Paper By: Xavier Castello, Lucia Loureiro - Porto , Ritta Toivonen , J. Saramaki and K. Kaski (page 59): ప్రపంచం లో చాలా సమాజాలలో రెండు మూడు భాషలు ప్రాచూర్యంలో ఉన్నవి కానీ వాటి భవిష్యత్ ఎట్లావుంటుందో చెప్పటం కష్టం. ఇప్పుడు ప్రపంచం లో ఉన్న దాదాపు 6000 భాషల భవిష్యత్తు ప్రశ్నార్ధకము. వీటిలో 50% ఈ శతాబ్దంలో మాయ మవుతాయి. దీనికి కారణము ప్రపంచంలో  ప్రజల భాషల వాడుక సమానత్వం లేదు. ఎందుకంటే 96% ప్రజలలో వాడుకలో  4% భాషలే ఉన్నాయి. అందులో 25% భాషలు మాట్లాడే వాళ్ళు 1000 మంది కూడా లేరు. కొన్ని కొత్త భాషలు రావటానికి ప్రయత్నిస్తున్నాయి కానీ అంతరించే భాషలతో పోలిస్తే అవి చాల తక్కువ.

Jean-Louis Dessalles (page 91) : మానవు లందరూ వాళ్ళ వాళ్ళ భాషా పటిమని  ప్రదర్శించు కోవాలని చూస్తూ ఉంటారు. సామాన్యంగా ఒక్కొక్కళ్ళూ రోజుకి 15,000 పదాలు ఉపయోగిస్తారని గమనించారు  (Mehl et al. 2007). ఎక్కువ సమయం వాదనకో లేక జరిగిన ఒక సంగతి గురించి చెప్పటానికో ఉపయోగిస్తారు. ఆఫీసులో పనిచేసేవాళ్ళు వాళ్ళ బ్రేక్ సమయంలో చేసే సంభాషణలు క్రింది విధంగా ఉంటాయి.

దేనిగురించో కధ చెప్పటం -------------------------  43.4%

తాను చూసిన / విన్న  వాటి గురించి చెప్పటం--- 19.75%

వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల గురించి చెప్పటం---  16.8%

ఊహాగానం (Gossip )  --------------------------------  13.8%

జోక్ లు చెప్పటం  -----------------------------------    6.3%

అల్లాగే  భోజన సమయంలో మాట్లా డే మాటల్లో  చాలావరకూ జరిగిన వృత్తాంతాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో గొణుగుడు లేక నిశ్శబ్దంగా ఉండటం కూడా మామూలే.

చాలా మంది సంభాషణల్లో చెప్పే కధలు వాళ్ళ కు జరిగిన  అనుభవంతో చెప్పినవి కావు. చాలా వరకు ఇంకొకళ్ళ దృష్టిని ఆకర్షించటానికి ఈ విధంగా చెబుతూ ఉంటారు. మానవులకు సమాచారం అంటే చాలా ఇష్టం. అందుకని స్నేహితులను ఆకర్షించటానికి సమాచార కేంద్రములుగా మారుతారు.

Paper by Juan C Moreno Cabrera : మొదట సంజ్ఞలు, తరువాత మాటలు, ఆ తరువాత వాక్యాలూ, ఆ తరువాత వాక్యాల కుదింపులూ (syntactic Complexity ) వచ్చాయి. ఉదా హరణకి :I know that , It is true  రెండు వాక్యాలు మాటని ఒక వాక్యంలో  I know that it is true. ఇటువంటివి దాదాపు అన్ని భాషల్లో ఉన్నాయి. ఈ వ్యాసంలో అవి ఎలా వచ్చాయి అనే దాని మీద చర్చించారు. 

Paper by Dennis Philps (page 251): ఆది మానవుడు సంజ్ఞల నుండి మాటలకు ఎలామారాడు అనేది చాలా క్లిష్టమయిన సమస్య. దీనికి నోరు, కన్నుల సమన్వయం చాలా ముఖ్యము (Mouth-Eye Coordination).

Paper by Kiran Lakkaraju and Les Gasser (page 456) : భాష ఒకరి  సొత్తు కాదు. భాష నిలవాలంటే ఆ భాష మాట్లాడే వాళ్ళందరూ సహకరించాలి. చాల మంది పరిశోధకులు దీనికి  "Multiagent Agreement Problem(MAP)" కింద పరిశీలించారు కానీ మేము చెప్పే క్రింద కారణాల వల్ల MAP తో పరిశోధనా ఫలితాలు సరీగ్గా ఉండవని గుర్తించవచ్చు. ఈ MAP విధానంలో పరిశీలించాలంటే MAP కు కొన్ని సవరణలు తప్పవు.

"Signal" అనే పదానికి తెలుగు గుర్తురాకపోతేమా ఆవిడని అడిగాను. ఎందుకు అని ఎదురు ప్రశ్న వేసింది. భాష అనేది ఎల్లా పుట్టిందో పరిశీలిస్తున్నాను అన్నాను. ఎందుకు పనికిరాని అనవసరపు వాటి మీద సమయము వ్యర్ధము చేస్తారు సాయంత్రం భోజనానికి కూర చెయ్యమంది. Mouth-Hand-Eye Coordination తోటి కాలిఫ్లవర్ తరిగి కూర చెయ్యాలి. భాష కన్న భోజనం ముఖ్యం. అందుకని దీనిని ఇంతటితో ముగిస్తాను. గ్రేట్ రిసెర్చికి ఇటువంటి అడ్డంకులు ఎప్పుడూ వస్తుంటాయి. అందుకనే కొత్తవి డిస్కవర్ చెయ్యటం చాలా కష్టం. I got to go. అంటే నేను వెళ్ళాలి అని అర్ధం. సామాన్యంగా సంభాషణ తెంపటానికి (ఆపటానికి) అంటూ ఉంటారు.

PS: I got money. I got fame. I got food. ఇవన్నీ బాగానే అర్ధమవుతాయి కానీ ఇంగిలీషు వాడి I got to go. ఏమిటి ?

Sunday, January 23, 2022

192 ఓ బుల్లి కథ -- మీ అమ్మమ్మా తాతయ్యా ఇల్లాగే ఉంటారా ?

 

మా మనవరాలు అవును అంటోంది.



అమ్మమ్మా  తాతయ్యా మనవరాలు 


Richmond , California, US   లో ఇంటి అరుగు మీద వేసిన చిత్రం.

      



Tuesday, January 18, 2022

191 ఓ బుల్లి కథ -- ఛూ ఛూ ట్రైన్ --- బర్కిలీ Berkeley

 


Caboose 


మా US వెస్ట్ కోస్ట్ ప్రయాణంలో సియాటిల్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కి మా అమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అదో గంటన్నర ప్లేన్ ప్రయాణం. ఇక్కడ దదాపు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. కాకపోతే సూర్యుడు కనపడుతూ ఉంటాడు. మేముండే చోట రిచ్ మండ్ లో బయట నడుస్తూంటే ఆలివ్ చెట్లూ నారింజ చెట్లూ నిమ్మ చెట్లూ, ఇంటి ముందర పెరుగుతూ పేవుమెంట్ మీద కాయలు రాల్చు తున్నాయి. నేను కొందరి పెరట్లో తాడి చెట్లు కూడా చూశాను.

ఈరోజు  ఉష్ణోగ్రత 40F (అంటే 4.4C)  డిగ్రీలు. దగ్గరలో ఉన్న బర్కిలీ లో ఉన్న స్టీమ్ ట్రైన్ ఎక్కు దామని వెళ్ళాము (Tilden Park Steam Train). ఇంజిన్ లో బొగ్గులు వేసి నీళ్లు కాగబెట్టి వచ్చిన ఆవిరితో ఇంజిన్ చక్రాలు తిప్పుతారు. ఆ ఇంజిన్ కి పెట్టెలు తగిలించి దానిలో ప్రయాణీకులిని కూర్చోబెట్టి ఇంకో ఊరుకి  చేర్చుతారు. మా చిన్నప్పుడు ప్రయాణాలన్నీ పెద్ద పెద్ద స్టీమ్ ఇంజిన్ తో నడిచే రైళ్ళల్లో జరిగేవి. ఈ రైలు ప్రయాణానికి ఎంతో ఆనందంతో ఎదురు చూసే వాళ్ళం. ప్రయాణం పూర్తయ్యేసరికి చొక్కాలమీద అంతా  బొగ్గు నలుసులు పేరుకుంటాయి కానీ అప్పట్లో అవి మాకు బాధ పెట్టలేదు. 

ఈ పిల్లల స్టీమ్ ట్రైన్  బర్కిలీ అనే ఊరులో ఉంది( ప్రఖ్యాత బెర్కిలీ యూనివర్సిటీ ఇక్కడే). ఇక్కడ కనపడే ఇళ్ళన్నీ బొమ్మరిల్లు లాగా ఉంటాయి. అవే ఒక్కొక్కటీ మిలియన్ డాలర్స్ పైనే. ఇక్కడకి  వెళ్లాలంటే కొండా కోనల్లో ఒక గంట ప్రయాణించాలి. డ్రైవింగ్ ఎత్తులూ పల్లాలూ. మేము మూడు సార్లు దోవ తప్పాము. దోవ సరి చేసుకోవటం కూడా కష్టమే. థాంక్ గాడ్ మాకు దగ్గరలో  పార్కింగ్ దొరికింది. ప్లాట్ఫారం మీదికి వెళ్ళి టిక్కెట్లు కొనుక్కొని రైలెక్కాము. రైలు ఎక్కటం దిగటం నాలాంటి వాళ్లకి కొంచెం కష్టమే. ఇక్కడ హైస్కూల్ పిల్లలు పనిచేస్తారు. వాళ్ళు ఎక్కటానికి దిగటానికి సహాయం చేస్తారు. 

రైల్ ప్రయాణం 12 నిమిషాలు, కొండమీద అడవిలో తిప్పుతూ చివరికి బయలుదేరిన చోటికి  తీసుకువచ్చి దింపుతారు. మాతో ఉన్న మా మనవరాలు ఇంకోసారి రైల్ ప్రయాణం చేద్దామంది. దానితో పిల్లా పెద్దా (నేను తప్ప) మళ్ళా  టిక్కెట్లు కొనుక్కొని రైలు ఎక్కారు. నేను ప్లాట్ఫార్మ్ మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. రైలు ప్రతి సారీ షుమారు 50 మంది  పిల్లా పాపా తో సగం దాకా నిండుతోంది. 

Berkeley Rose Garden 

ఇంటికి వెళ్ళటానికి క్రిందికి దిగివస్తూ బర్కిలీ "రోజ్ గార్డెన్ " దగ్గర ఆగాము. గులాబీలు ఇంకో రెండు మూడు నెలల్లో "బ్లూమ్" అవుతాయిట. ఈ తోటని చూడటానికి ముచ్చటగా ఒక కొండలోయలో నిర్మించారు. ఇక్కడ చదువుకునే పిల్లలూ పెద్దలూ వచ్చి పోతూ ఉన్నారు. పక్కన టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. 

బుద్ద ప్రార్ధన శాల 

Prayer Wheels

Buddhist Monks
వస్తూ వస్తూ మా ఇంటి దగ్గర ఉన్న "Gyuto Foundation" వారి "Buddhist Monastery" కి వెళ్ళాము. ఇక్కడ  బౌద్ధ భిక్షువులకి చదువు చెబుతారు. ప్రశాంతమైన వాతావరణం. పచ్చటి చెట్లతో విశాలమైన ప్రాంగణం ఆకర్షణీయంగా ఉన్నది.అక్కడవున్న ప్రార్ధన శాలలో కాసేపు కూర్చుని ప్రేయర్ చక్రాలు తిప్పి ఇంటికి బయలుదేరాము. ప్రసాదం నారింజ కాయలు ఒక పళ్లెంలో పెట్టి ఉన్నాయి. మేము తీసుకున్నాము.

వస్తూ వస్తూ "Trader Joe " లో ఆగి పిల్లలకి మరునాడు సంక్రాంతి భోగి పళ్ళు పొయ్యటానికి పూలు సామగ్రి కొనుక్కుని ఇంటికి జేరాము.

Thursday, January 13, 2022

190 ఓ బుల్లి కథ -- అదో క్రేజీ బ్రేక్ఫాస్ట్ డే

 


పొద్దున్న తొమ్మిదిన్నరకి అక్కడుండాలి. బయట కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అంటే,
పొద్దున్న ఆరున్నరకే లేచి ప్రయత్నాలు మొదలెట్టాము. ఇక్కడ రెండు మూడు సంగతులు చెప్పాలి. పిల్లలకి వాళ్ళ తలిదండ్రులు వచ్చినప్పుడు కొత్త డిస్కవరీస్ చూపించాలని కోరిక. దీనికి ఎన్నుకున్నది వాళ్ళ కిష్టమయిన రెస్టరెంట్. అమెరికాలో ఓమిక్రాన్ ఉదృతంగా ఉండటంతో రెస్టరెంట్ లోపల కాకుండా బయట కూర్చుని తినటం. మూడవది తినే పదార్ధాలు మా కిష్టమైన విధంగా తయారు చేయించుకోవటం.

మాకు రెస్టోరెంట్ బయట తినటం గురించి తెలుసు. మేము న్యూయార్కులో ఒక గ్రీక్ రెస్టారెంట్ ముందర డేరాలో కూర్చుని తిన్నాము. వాళ్ళు వేడి కోసం హీటర్లు అవీ పెడతారని, మాకు ఫరవా లేదు అనిపించింది. గార్లిక్ తినని వాళ్ళు గ్రీక్ రెస్టారెంట్ కి ఎల్లా వెళ్లారు అనే అనుమానం వస్తే అది పెద్ద గాధ ఇప్పుడు చెప్పలేను కానీ ఒక క్లూ ఇస్తాను "నేచర్స్ కాల్".

మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇంటిదగ్గర తొమ్మిదికి బయలుదేరాలి.  ఎనిమిది గంటలకి రెస్టారెంట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బయట సీటింగ్ కుదరదని. ఏం చెయ్యాలి ఇప్పుడు ?. నేనయితే వెళ్ళటం మానేద్దాము అనుకున్నాను. కొన్ని కొన్ని చోట్ల మన ఇష్ట ఇష్టాలు కుదరవు. అందుకని గమ్మున ఊరుకున్నాను. వాటెవర్ హప్పెన్స్  విల్ హప్పెన్. 

మేము ఏమీ చెప్పలేదు. బిజినెస్ పోతుందేమో అని అనుకున్నారేమో (మేము 9 మంది ఆయె ) ఎనిమిదిన్నరకి రెస్టారెంట్ నుండి మళ్ళా ఫోన్ వచ్చింది. బయట సీటింగ్ పెడతాము కానీ పదిన్నర కల్లా మీరు వెళ్ళిపోవాలని. మేము సరే అన్నాము.

అనుకున్న సమయానికి రెస్టారెంట్ కి వెళ్ళాము. మీరు పైబొమ్మలో చూస్తున్నారే రెండుకుర్చీలు. అవి తీసేసి పెద్ద బల్లలు రెండు, 10 మంది పట్టేటట్లు కుర్చీలు, వరండాలో వేశారు. పైనుండి వేడి గాలి వచ్చేటట్లు హీటర్ ఉంది. టేబుల్ కి రెండు పక్కలా కింద హీటర్లు పెట్టారు. ప్రతి కుర్చీలోనూ కప్పుకోటానికి జంపాకానలు ఉన్నాయి. నేను కప్పుకున్నాను. మిగతావారు కప్పుకున్నారో లేదో నేను చూడలేదు. ఎవరికి కావాల్సిన వాటిని వాళ్ళకి కావాల్సిన విధంగా ఆర్డర్ చేసుకోవటం, రావటం తినటం కూడా చక చకా అయిపోయాయి. ఫ్రూట్ బార్ కూడా ఉందిట. పిల్లలు లోపలి వెళ్లి తెచ్చుకున్నారు. నేను వెళ్ళ లేదు, తరువాత డబ్బులు వాయిస్తారని భయం. మా ఆవిడ స్వీడిష్ పాన్కేక్స్ ఆర్డర్ చేసింది. నాకు రుచి చూపిస్తానన్నది కానీ చూపించాలేదు. స్వీడిష్ పాన్కేక్స్ మన రవ్వ దోశలు లాగా ఉంటాయి. మేము ఇదివరకు ఇంట్లో కొబ్బరి పచ్చడి చేసుకుని తీసుకు వెళ్ళి వాటిని తినే వాళ్ళము. ఏదేశం పోయినా జిహ్వ మారదు .

పక్కన కార్లూ జనం పోతూ ఉంటే, సూర్యుడి కిరణాలు కళ్ళల్లో పడుతూ ఉంటే,రోడ్డుపక్కన మా బ్రేక్ఫాస్ట్, మా కున్న సమయంలో ముగిసింది. బిల్లు ఎంతయిందో తెలియదు, మాలోని కొ త్తగా కస్టమ్ మేడ్ BMW ని జర్మనీ నుంచి తెప్పిచుకున్న కుర్రాడు పే చేశాడు. "సూర్యకిరణాల" ని గుచ్చిపెట్టి వ్రాశాను ఎందుకంటే, అది ఒక అదృష్టం,  సియాటిల్ లో మేమున్న రెండు వారాల్లో సూర్యుణ్ణి చూసింది నాలుగు సర్లే మిగతా రోజులన్నీ రోజంతా వర్షం లేక మబ్బులు. తరువాత నన్ను ఇంట్లో వదిలేసి మిగతా వాళ్ళు పార్కులకు బీచ్ లకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చారు.

నేను ఫోటో పెడదామనుకున్నాను కానీ పెట్టలేదు దీనికి కారణం ఉంది. ఆదివారం బయట 40F (అంటే 4.4C) పొద్దున్న 10 గంటలు , చలి, నేను లోపల థర్మల్ వేర్ వేసుకున్నాను దానిపైన Columbia Zip కోటు దానిపైన winter coat , దానిపైన వాళ్ళిచ్చిన జంపఖానా, నెత్తిన కుచ్చు టోపీ, నన్ను మీరు చూడలేరు.

Sunday, January 9, 2022

189 ఓ బుల్లి కథ -- లింఫెటిక్ సిస్టం -- Lymphatic System

 

Lymph System - Cleveland Clinic

Lymph Nodes --- Plymouth Hospitals (UK)

మన శరీరంలో ప్రసరణ (circulatory system ) రెండు రకాలుగ జరుగుతుంది. రక్త ప్రసరణ, లింఫ్ ప్రసరణ. రక్త ప్రసరణ అంటే మనకందరికీ తెలుసు. 

మన శరీరం లో లింఫ్ ప్రసరణ రక్త ప్రసరణ కన్నా భిన్నంగా జరుగుతుంది. రక్తప్రసరణలో ఉండే "pump " , గుండె, లేకపోవటంతో లింఫ్, ముందుకు కదలటానికి, లింఫ్ నాళాలకు పక్కనున్న కండరాల సహాయం తీసుకుంటుంది. అందుకని లింఫ్ కదలాలంటే మన కండరాల కదలిక చాలా ముఖ్యము. ఇంకొకటి లింఫ్ నాళాలు గుండె వేపు వెళ్ళే రక్తనాళాల తోటి మాత్రమే కలుస్తాయి. అందుకని గుండెవేపు కదలికలే లింఫ్ ప్రసారానికి ముఖ్యము అవుతాయి. మన పూర్వికులు చెప్పిన, యోగా లో ఉన్న, దీర్ఘ ఉచ్వాస నిశ్వాసలు ఎంత మంచివో ఇప్పుడు అర్ధమవు తుంది. 

ఈ లింప్ శరీరంలోని అన్ని కణాలలోనూ ఉండి, అక్కడ తయారు అయిన చెడు పదార్ధాలను సేకరించి, వాటిని దగ్గరలో దాచి పెట్టి (nodes ), వాటి మలినాల్ని "తెల్ల కణాలు " ద్వారా నిర్వీర్యం చేసి వాటిని శరీరంలో నుండి బయటికి పంపటానికి రక్తంలో కలుపుతుంది. పై బొమ్మలోని "nodes " లో మనకు తెలిసిన గజ్జలు , చంకలను తేలికగా గుర్తించవచ్చు, ఈ nodes మెడ, మోకాలు వెనుక కూడా ఉన్నాయి.

లింఫ్ అంటే "గ్రీక్ " భాషలో "నీళ్ళు " అని అర్ధం. మనము వాడే మెడికల్ పదాలు దాదాపు అన్నీ "గ్రీక్" భాష నుండి వచ్చినవే. డెల్టా వేరియెంట్ , ఓమిక్రాన్ (ఒమేగా నుండి వచ్చింది). ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమేగా, సిగ్మా  ఇవన్నీ "గ్రీక్ " అక్షరాలు. లింఫ్ మన జీర్ణ ప్రక్రియలో వేరుపడ్డ కొవ్వుని (fat ) సేకరించటం మూలంగా దీని రంగు తెల్లగా ఉంటుంది. 

లింఫెటిక్ సిస్టం మన శరీరంలో "garbage collector " లాంటిది , చెడుపదార్ధాలను తీసివేసి, immunity cells ను శరీరమంతా వ్యాపించ జేసి, రోగ నిరోధ శక్తిని పెంచి, శరీరంలో fluid balance ను సరిచేసి, తిన్న ఆహారాన్ని సరీగ్గా జీర్ణం చేసి, చర్మానికి కాంతినిచ్చి, inflammation ను తగ్గించి, ఒక్కమాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది.

కొన్ని కొన్ని ఆపరేషన్స్ మూలంగానూ, కొన్ని వ్యాధుల మూలంగానూ లింఫ్ nodes కి హాని జరిగినప్పుడు, లింఫ్ ఎక్కడికీ పోలేక అక్కడే పేరుకుపోయి, చాలా బాధలకు దారి తీస్తుంది (Lymphatic congestion ). మందులు లేని ఈ వ్యాధులకు ఒకటే మార్గము,  Lymph Drainage ,పేరుకుపోయిన లింఫ్ ను బయటికి పంపి సరిచేయాలి.

మెదడులో ఉన్న కణాలు (cells ) కూడా అన్ని కణాలు లాగానే రోజూ మలినాలని ఉత్పత్తి చేస్తాయి. లింఫ్ పేరుకుపోవడం కూడా జరగవచ్చు. మెదడు కు వచ్చే రోగాలకి (Headache , MS ,Stroke etc.), Lymph Drainage ఎంతవరకూ ఉపయోగ పడుతుంది అనే అంశం మీద అమెరికా లోని Center for Brain Immunology and Glia (BIG) at the University of Virginia's Department of Neuroscience వారు పరిశోధనలు చేస్తున్నారు.

అటువంటి లింఫ్ మార్గాన్ని సరిచేసే నిపుణురాలు:

Lisa Levitt Gainsley, CLT (Certified Lymphedema Therapist) 

అమెరికాలో పెద్ద పెద్ద డాక్టర్లు మందుల్లేని రోగాల్ని సరిచెయ్యటానికి వారి వారి పేషంట్స్ ని ఈవిడ దగ్గరకి పంపిస్తూ ఉంటారు.

తన patients తోటి అనుభవాలు, తాను వారి బాధలను నివారించిన విధానాలు వివరిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఆ పుస్తకం పేరు This Book of Lymph, 2021 ప్రచురణ. 

లింఫ్ నాళములు చర్మము నకు దగ్గరగా ఉండుట మూలమున, Lymph Drainage కి, చాల మృదువుగా అంగ మర్దనము (massage ) చెయ్యాలి. ఆ విధి విధానాలు, అవి ఏ విధంగా శరీరంలోని శక్తి చక్రాలతోనూ (మూలాధార, స్వాధిష్టాన,  మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార ) , యోగా, ఆయుర్వేద, చైనీస్ మెడిసిన్ లతోనూ మిళితమై ఉన్నాయో ఈ పుస్తకంలో వివరించటం జరిగింది.

లింఫ్ సిస్టం ను జాగర్తగా ఉంచుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనేది నిర్వివాదాంశం. దీనికి కావలసింది మృదువుగా శరీరాన్ని హృదయం వేపు రుద్దటం. అదే మన పూర్వికులు తలస్నానం అని చెప్పి పండగలకి ముఖ్యంగా చేయించేవారు. నా చిన్నప్పుడు పండగలకి చిన్నపెద్ద అందరూ ఆముదం తలమీద అంటుకుని, సున్నిపిండితో వంటిమీద నలుగు పెట్టుకుని, తల స్నానం చేసేవారు. ఇండియాలో "ఆల్ జై మర్స్" తక్కువకి కారణం ఇదేనేమో. 

మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ధర $26.99.

The Book of Lymph (2021)

Self-Care Practices to Enhance
Immunity, Health, and Beauty
By Lisa Levitt Gainsley, CLT
HarperCollins Publishers
195 Broadway, New York, NY 10007

Summary of the post:

We have two  circulatory systems in the human body. One is the cardio vascular circulatory system which has heart as the "pump" to circulate the blood, the second one is the Lymph system where in there is no pump for circulating the Lymph; The movement of muscles around the vessels aids the movement of Lymph until it reaches the cardiovascular system to take advantage of its pumping system.

Lymph is a white colored fluid (white color comes because of its absorption of fat in the small intestine). It resides in all cells in the body and is called the body's garbage collector, filtering bacteria and toxins and channeling them to what are called Lymph Nodes in the body. The Lymphatic system is twice the size of the circulatory system and is an essential part of the immune system, producing white blood cells. 

The lymph vessels are connected to the veins carrying blood going towards the heart and mixed with the blood in the veins for further elimination and purification.

The Lymph System does not have a "heart" like pump in the circulatory system, to move the Lymph in the vessels. It depends upon the pulsing of nearby arteries and skeletal muscle contractions. As such self-massage, breathing and physical exercises are essential for good lymphatic health.

Problems may arise because of the elimination of lymph nodes in surgery. As lymph nodes do not regenerate, this may result blockages of the lymph flow resulting in unwanted problems in the body. By channeling the collected limp to the circulatory veins trough various means, we can eliminate these problems of the lymph blockage. 

This information is taken from the book published in 2021:  The Book of Lymph by Lisa Levitt Gainsley , CLT. This book may be available in the Libraries.



Wednesday, January 5, 2022

188 ఓ బుల్లి కథ -- లేక్ ష లా న్ Lake Chelan



అమెరికాలో సియాటిల్ పట్టణానికి 165 మైళ్ళ దూరంలో "లేక్ ష లా న్ " అనే ఒక సరస్సు ఉంది. అది 50 మైళ్ళ పొడుగూ ఒక మైలు వెడల్పు 1400 అడుగుల లోతు ఉన్న పెద్ద సరోవరం. ఊరు పేరు కూడా అదే. ఈ ఫ్యూరీ జనాభా 8 వేలు. చిన్నప్పుడు హిమాలయాల్లో మానససరోవరం గురించి తెలుసుకున్నప్పుడు, కొండల్లో చెరువు ఎల్లా ఉంటుందనేది అర్ధం కాలేదు. పైనున్న రెండు ఫోటోలు మేముంటున్న "ఎయిర్ బియన్ బీ " ఇంట్లో నుండి తీసినవి. చుట్టూతా కొండలూ వాటి మీద పడ్డ స్నో, కింద ఉన్న చెరువు. అర్ధమయ్యింది కదా సరోవరాలు కొండల్లో ఎల్లా పుడుతాయో. స్నో కరిగిన నీళ్లు. ఇంకోటి కూడా తెలుసుకున్నాను జారుడు నీళ్ళల్లో ద్రాక్ష బాగా పెరుగుతుందని. కొండల మీదా కిందా బోలెడన్ని ద్రాక్ష తోటలు (ద్రాక్ష తీగలన్నీ చలికాలం లో నిద్రుస్తున్నాయి). రోడ్డు పక్కన బోలెడన్ని "ద్రాక్ష రసం " రుచి చూసే షాపులు. దీనిని "wine tasting " అంటారు. ఊర్కెనే రుచి చూపిస్తారు అనుకునేరు. మేము అల్లాగే బోల్తా పడ్డాము. 

ఒకసారి కాలిఫోర్నియా లో "thousand buddhas " అనే చోటికివెళ్ళి తిరిగివస్తూ ఊరుకోలేక రోడ్డుపక్కన కనపడ్డ "wine tasting " కి  వెళ్ళాము. డబ్బులు వదిలించుకుని  "తాగు బోతు" అనే బోర్డు తగిలించు కోవాల్సొచ్చింది. నా ఉద్దేశంలో ఒక చుక్క తాగినా తాగుబోతు కింద లెక్కే. అనవసరంగా డబ్బులు పెట్టామనే బాధో, లేక ఆ వైన్ తయారు చేసిన మూలాలు తెలుసుకోవాలనే పట్టుదలో, లేక "wine tasting " మైకమో, చూడటానికి మనోజ్ఞంగా ఉన్న నల్ల ద్రాక్ష గుత్తులో, తిరిగివస్తూ రోడ్డు పక్క ఆగి మా ఇంటావిడా ఆవిడ స్నేహితురాలూ పక్కన తోటలోకి దిగి ద్రాక్ష గుత్తులు కోసుకుని తిన్నారు. మేము మగవాళ్ళం, ఎవరన్నా వచ్చి అడిగితే "చూడటానికి వెళ్ళారు"  అని చెబుదామని కారులో కూర్చుని ఉన్నాము. మీరు మాత్రం ఈ విధంగా "wine tasting " చెయ్య బోకండి.

ఈ   "లేక్ ష లా న్"  సరోవరం ఒక చివరి అంచునుండి ఒక సన్నటి జలపాతం కొలంబియా రివర్ అనే నదిలో పడుతుంది. ఇంకో విచిత్రం ఇక్కడ ఏమి చేశారంటే లేక్ లో నుండి ఒక సొరంగం తవ్వి దాని చివర హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పెట్టి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

2022 సంవత్సరం ని ఆహ్వానించటం ఇక్కడే జరిగింది. అందరూ తాగుతూ నాకూ రెండు చుక్కలు "షామ్ పైన్" పోశారు. బయట చలి విపరీతంగా ఉంది (17F అంటే -8.33C). ఈ సమయంలో మీరు బయటికి వెళ్ళాలంటే కనీసం రెండు వరసల దుస్తులు అవసరం. నెలల క్రిందట రిజర్వేషన్ చేసినప్పుడు వాతావరణం ఈ విధంగా ఉంటుందని ఊహించలేదు. పొద్దునపూట స్క్రామ్ బుల్డ్ ఎగ్స్ సాయంత్రం పిజ్జా. ఇక్కడ "Safeway " గ్రోసరీ స్టోర్ ఉంది కాబట్టి తినటానికి ఇబ్బంది లేదు. అయినా మా ఆవిడ రైస్ కుక్కర్, బియ్యం తోటి వస్తుంది కాబట్టి నాకెప్పుడూ ఇబ్బంది ఉండదు. తిండి సరీగ్గా తినక బోతే నేను రోజంతా నసుగుతానుట. అన్నము కందిపొడి గోంగూర చింతకాయ మాగాయ, "yogurt " అనే గడ్డ పెరుగుంటే ఇంకేమికావాలి ? అది రోమ్  అయినా పారిస్ అయినా హాంకాంగ్ అయినా హొనలులూ అయినా అల్బుకర్క్ అయినా నాకేటి కొదవ. 




ఇక్కడికి వచ్చే టప్పుడు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళు దాటి వచ్చాము (మచ్చుకి వాటిలో రెండు పేర్లు Cashmere , Sultan).  ఒక పల్లెటూరు లో  (Leavenworth) బోర్డులన్నీ జర్మన్ పేర్లతో కనపడ్డాయి. ఆరా తీస్తే తెలిసిందేమంటే, ఆ ఊళ్ళో పర్యాటకులు ఆగటల్లేదని బాధేసి, ఆవూరి పెద్దలు, అన్నిటికీ జర్మన్ పేర్లు పెట్టి, అలంకరణలు చేసి  ఒక "బెవే రియన్ (జర్మన్)" పల్లెటూరుగా తయారు చేశారు. ఇక్కడ ప్రసిద్ధి  "nutcracker museum" (కాయల్ని పగలగొట్టే వస్తువులు ). అప్పటినుండీ ఈ ఊరికి పర్యాటకులు ఎక్కువైనారు. మేమూ వెళ్ళాము (నేను తప్ప -- చలి). పై ఫోటోలు అక్కడివే.

ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణించిన 165 మైళ్ళలో మొదటి  50 మైళ్ళు చదును ప్రదేశం తర్వాత అంతా కొండలు ఎక్కటమే. "ఇక్కడి నుండీ  కారు టైర్లకి "chains " వెయ్యాలి లేకపోతే కారు all wheel drive అన్నా అవ్వాలి" అనే బోర్డు కనపడింది. రోడ్లమీద స్నో తో కారు జారచ్చని ముందు హెచ్చరిక. రోడ్డుపక్కన కార్లు ఆపి టైర్లకి చాలామంది గొలుసులు వేసుకుంటున్నారు (మాది AWD).  వెళ్తూ ఉంటే కొలంబియా రివర్ దానిపక్కన చిన్న ఊళ్ళు వస్తూ పోతూఉన్నాయి. మేము ఊరు చేరుకోటానికి సియాటిల్ నుండి 5 గంటలు పట్టింది.

తిరిగివచ్చేటప్పుడు మంచు తుఫాను వస్తుందని తెలిసి కొంచెం ముందర బయలుదేరాము. పెద్ద గందరగోళం, ఉత్కంఠ.  మా బృందంలోని ఎనిమిది మందిలో ఏడాది పిల్లాడి నుండీ 80 ఏళ్ళ కుర్రాడి వరకూ ఉండటంతో వాళ్ళ వాళ్ళ అవసరాలు వివిధ రకాలు. మొదట మాకున్న కారులో అందరం పట్టం కాబట్టి పెద్ద వాన్ అద్దెకు తీసుకోవాల్సొచ్చింది. 

వచ్చేటప్పుడు కొంచెం దారి తప్పి ఒక చిన్న ఊళ్లోకి వెళ్ళి  పోయి గూగుల్ మా ప్స్ తో సరి అయిన దోవలోకి వచ్చాము. మొదటి 50 మైళ్ళు బాగానే గడిచింది కానీ తర్వాత "snow storm " మొదలైంది. రోడ్డు సరీగ్గా కనపడక చాల నెమ్మదిగా పోవాల్సి వచ్చింది. ప్రపంచం లో మీరు గమనించారో లేదో కొందరికి కష్టమయినది ఇంకొందరికి  ఇష్టంగా ఉంటుంది. స్కీ చేసేవాళ్ళకి స్నోపడటం అంటే చాలా ఇష్టం, వాళ్ళు వాళ్ళ ఆటవస్తువులని పట్టుకుని ఆ సన్నటి దోవలో రోడ్డు పక్కన ఉత్సాహంగా నడుస్తున్నారు. జాగర్తగా కారు తోలుకుంటూ కొంత దూరం వచ్చేసరికి స్నో పోయి వర్షం రావటం మొదలయింది. అదీ గొడవే. అది దాటుకుని వచ్చేసరికి పిల్లలు ఆకలి గొడవ. "subway  " మహత్యంతోటి అందరినీ శాంతపరిచి, చీకటి పడుతుంటే ఇంటికి జేరుకున్నాము.

ఇదీ క్లుప్తంగా మా "వింటర్ ఔటింగ్".