Monday, November 26, 2018

148 ఓ బుల్లి కథ ---- అమ్మా మాయమ్మా

"అమ్మా మాయమ్మా అని నే పిలచితే నాతో మాట్లాడరాదా  (నీ కిది) న్యాయమా మీనాక్షమ్మా"
"సరసిజ భవహరి హరనుత సులలిత నీ పదపంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితి"

నాకు చిన్నప్పుడు సంగీతమంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ రోజూ ఏవో పాటలు పాడుతూ నే ఉండేది. మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున పాటలు పాడేవాడు.  గుడికెళ్ళినప్పుడల్లా మా అమ్మక్కయ్యా మా అమ్మ తప్పకుండా గుళ్ళో పాటలు పాడే వారు. అల్లాగే పెళ్ళిళ్ళల్లో కూడా భోజనాలు చేసిన తర్వాత అందరూ కూర్చుని పాడేవాళ్ళు. ఇలా సంగీతం తో పెరిగినా  నా కెందుకో సంగీతం మీద పెద్ద మక్కువ రాలేదు. కాకపోతే బుద్ధిమంతుడి లాగా మాట్లాడకుండా వినేవాడిని.

సంగీతం మీద నా ఇష్టా ఇష్టాలన్నీ ఒక రాత్రితో తారుమారు అవుతాయని  నేను అనుకోలేదు. నేను అప్పుడు 5th ఫారం అనుకుంటా రేపల్లె లో చదువుతున్నాను. ఒక రోజు మాయింటికి శ్రీనివాసన్ గారు వచ్చారు. రాత్రికి ఎవరింట్లోనో పెళ్ళిలో ఆయన పాట కచ్చేరీ. (1950's లో బాలమురళీకృష్ణ  గారు విజయవాడ రేడియో నుండి పొద్దునపూట "భక్తిరంజని " కార్యక్రమం చేసేటప్పుడు, దానిలో శ్రీనివాసన్ గారు పాల్గొనే వారు.ఆయన గుంటూరు Indian Bank లో పని చేసే వారు.)

రాత్రికి  శ్రీనివాసన్  గారి పాట కచ్చేరీ కి మా నాన్న గారితో పాటు నేనూ వెళ్ళా ను. పిల్లాడినని నాకు పక్కవేసి పరుపు వేసి పడుకో మన్నారు. నేను పౌరుషంతో పడుకోలేదు. రాత్రి ఒంటి గంట దాకా పాట కచేరి వింటూ మూడు గంటలు అలాగే మేల్కొని కూర్చున్నాను.

తెలిసిన పాటలే. తెలిసిన రాగాలే. అమ్మ పాడుతుంటేనూ తాతయ్య పాడుతుంటేనూ విన్నవే. మూడు గంటలు వరసగా కూర్చుని విన్న తర్వాత ఎందుకో వాటిమీద ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం రాను రాను పెరగటం తప్పితే తరగలేదు. యూనివర్సిటీ లో దుర్గా ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సుందరరామ శర్మ, కృష్ణారావు(voilin ) ల పరిచయాలు కూడా దీనిలో ఒక కారణం కావచ్చు. వాళ్ళు పాట వింటూ ఏ రాగమో చెప్పే వాళ్ళు. నాకు ఇప్పటికీ అది చేత కాదు.

అప్పటినుండీ ఎప్పుడు శాస్త్రీయ సంగీతం విన్నా మనసంతా ఒక విధంగా అయిపోతుంది. తన్మయత్వం అంటే అదేనేమో. నా ఉద్దేశంలో అది ఒక Neural Resonance. అదో చెప్పలేని అనుభూతి. మీకు కూడా ఆ తన్మయత్వం తో ఆ అనుభూతి కలిగించాలని నా ప్రయత్నం.

ఈ క్రింది వీడియో IndianRaga Labs లో సభ్యుడు లలిత్ సుబ్రమణియన్ పాడిన, శ్యామ శాస్త్రి విరచిత "అమ్మా మాయమ్మా ". ఇది విన్న తరువాత మీకూ శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కలగవచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పాలేము! అదొక మరువరాని అనుభూతి. శాస్త్రీయ సంగీతం వింటున్నప్పుడు దానిలోకి వెళ్ళి పోయి వేరొక ఆలోచనలు దగ్గరకు రాకుండా మనసుల తలుపులు మూసేస్తాము. అదొక Yoga , అదొక Meditation.

The timeless classic 'Mayamma' in the rare and beautiful Ragam Ahiri rendered by 2015 IndianRaga Fellow Lalit Subramanian.


Monday, November 12, 2018

147 ఓ బుల్లి కథ ---- బ్రోకలీ కూర (Broccoli Curry )


ఎప్పుడో కొన్నేళ్ల క్రిందట సురేష్ బాబు, బ్రోకలీ హైదరాబాద్ లో దొరుకుతోంది "బ్రోకలీ కూర" చెయ్యటం గురుంచి ఒక పోస్ట్ పెట్టమన్నారు. ఆయనకి email ద్వారా చెప్పటం జరిగింది గానీ పోస్ట్ పెట్టటం ఇప్పటికి గానీ కుదరలేదు. బ్రోకలీ cruciferous vegetables ఫ్యామిలీ లోది. అందుకని ఆరోగ్య పరంగా దీనికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమయినది కేన్సర్ ని తగ్గించే గుణం. ఆకు పచ్చగా ఉండే కూరలు వంటికి చాలా మంచివి. ఈ ఫామిలీ లో క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ తో కూర చెయ్యటం గురుంచి ఇదివరలో పోస్ట్ పెట్టాను.

కూర మొదలెట్టే ముందు ఒకటి రెండు పనులు ముందర చెయ్యాలి. ఒక గంట ముందు రెండు స్పూన్ల  పెసర పప్పు (moong dal ) నీళ్ళల్లో నాన  వెయ్యాలి. బ్రోకలీ నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి (కాడలు కూడా వాడ వచ్చు). అమెరికాలో మీకు కావాలంటే బ్రోకలీ ముక్కల పాకెట్, 15oz సైజులో  frozen section లో దొరుకుతుంది.


కావలసిన పదార్ధాలు:
1. వంట నూనె -- రెండు టేబుల్ స్పూనులు. (నేను వాడేది ఆలివ్ ఆయిల్ మీడియం హీట్)
2. మినపపప్పు  -- 1/2 టీస్పూన్
3. మెంతులు  -- ఆరు గింజలు
4. జీలకర్ర -- 1/2 టీస్పూన్
5. ఆవాలు -- 1/2 టీస్పూన్
6. ఎండుమిరప -- ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి )
7. పసుపు -- చిటికెడు
8. ఇంగువ -- చిటికెడు

9. నాన పెట్టిన పెసరపప్పు -- 1/2 స్పూన్

10. బ్రోకలీ ముక్కలు -- 15oz (3 కప్పులు)

11. ఉప్పు -- 1/2 స్పూన్

ఈ కూర చెయ్యటం చాలా తేలిక:
1.ఒక బాణీ లో నూనెవేసి కాగిన తరువాత తిరగమాత వేయాలి (1--8 స్టెప్స్).
   తిరగమోత మాడ్చ వద్దు.
2. నానిన పెసరపప్పు వేసి ఒకనిమిషం కలియపెట్టాలి.
3. పోపులో బ్రోకలీ ముక్కలు , ఉప్పువేసి కాసిని నీళ్ళు జల్లి మూత బెట్టాలి .
4. షుమారు 15 నిమిషాలకి నీళ్లంతా పోయి ముక్కలు ఉడికి కూర తినటానికి తయారు అవుతుంది.




ఈ కూరకి నేను ఉపయోగించే చిట్కాలు:
1. Frozen 15oz బ్రోకలీ పాకెట్ కొంటాను.
2. ముందుగా బ్రోకలీ ముక్కలని pressure cooker లో 3 నిమిషాలు స్టీమ్ చేస్తాను.(ఒక విజిల్ దాకా అనుకోండి). దీని మూలంగా బ్రోకలీ త్వరగా ఉడికి, కూర త్వరగా తయారు అవుతుంది.
3. అసలు బ్రోకలీ ఉడకపెట్టి ఉత్తగా కూడా తినవచ్చు.


వంటలకు సంబంధించిన నా ఇతర పోస్టులు:

70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు

87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి

123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర

Broccoli compound targets key enzyme in late-stage cancer

Tuesday, October 30, 2018

146 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్



న్యూయార్క్ దరిదాపుల్లోకి వెళ్ళినప్పుడల్లా మెన్హాటన్ కి వెళ్ళటం ఒక అలవాటై పోయింది. మెన్హాటన్ డౌన్ టౌన్ న్యూయార్క్. న్యూయార్క్ కి "Town never sleeps " అనే పేరుంది. మనకు అవసరాలకు కావలసిన కూరగాయాల నుంచీ హెయిర్ కట్ దాకా ఎప్పుడూ ఎక్కడో ఒక షాపు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాడ్వే వీధి నాటకాలకి ప్రసిద్ధి. మేము వచ్చినప్పుడల్లా ఎదో నాటకానికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వెళ్తాము. కాకపోతే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. ఇంతదానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే అని బాధ పడాల్సి వస్తుంది. ఒకరోజు రాత్రి సినీమా అయిన తరువాత (ఆదో పెద్ద గాథ ) ఆకలయి రెస్టారంట్ కోసం చూస్తే ప్రతి చోటా జనం క్యూ లో నుంచున్నారు. చివరికి ఒక "వేగన్" రెస్టారెంట్ లో సీట్లు దొరికాయి. నిజంగా చెప్పాలంటే పచ్చ గడ్డి పెట్టి వంద డాలర్లు తీసుకున్నాడు. అందుకనే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాము.

ఈ తడవ "LA LA Land " అనే సినిమాకి వెళ్ళాము. ఈ సినీమాకి oscars లో తప్పు చదవటం మూలంగా ఒక క్షణం "Best Picture " అయింది. అబ్బాయి మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపి, మన పేరు మీద సీట్లు రిజర్వ్ చేశాను టిక్కెట్స్ తీసుకోండి అని కారు పార్క్ చెయ్యటానికి వెళ్ళాడు. నాకు ఎప్పటినుండో కోరిక, టిక్కెట్లు, రిజర్వ్ డ్  కౌంటర్ దగ్గర తీసుకోవాలని, పెద్ద వాళ్ళలాగా ఫీల్ అవ్వచ్చు. సామాన్యంగా ఎడ్వన్చెరస్ పనులకి మా ఆవిడని పంపిస్తూ ఉంటాను. ఆవిడ ఎడ్వన్చెరస్ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మొగుడు తాళి కట్టి అమెరికాకి వెళ్తే, మూడునెలల తరువాత తను వీసా పుచ్చుకుని అమెరికా వంటరిగా వచ్చింది. ఇది నలభై ఏళ్ళ క్రిందటి మాట. అప్పుడు ప్లేన్లు అమెరికాకి అంచెలంచెలుగా వచ్చేవి. వస్తూంటే మధ్యలో పారిస్ లో ప్లేన్ ఆగిపోయింది "mechanical failure ". సరే అది బయల్దేరి మర్నాడు న్యూయార్క్ చేరేముందర న్యూయార్క్ airport (Kennedy ) లో బస్సు హైజాక్ చేసి రన్వే మీద పెడితే ప్లేన్లు లాండ్ అవటం గొడవయింది. ఇంకొకటి, ఒక ఇరవై ఏళ్ళ క్రిందట దేశం కాని దేశం హాంకాంగ్ లో subway టిక్కెట్లు కొనుక్కురమ్మని పంపించాను. విజయవంతంగా తీసుకు వచ్చింది. అందుకని ఈ మిషన్ కి ఆవిడే తగినదని నిర్ణయించుకున్నాను. వెళ్ళి అడిగింది ఇవ్వనన్నాడు. ఎందుకని అడిగింది. ఏ క్రెడిట్ కార్డు మీద రిజర్వ్ చేశారో చెప్పమన్నాడు. అబ్బాయి ఏకార్డు ఉపయోగించాడో తెలియదు. టిక్కెట్లు రాలేదు. అబ్బాయి కారు పార్క్ చేసి వచ్చి టిక్కెట్లు తీసుకున్నాడు. మా ఆవిడ గొప్పలు చెప్పటానికీ, నేను గొప్పగా ఫీల్ అవటానికీ ఇవాళ అవకాశం లేదు.

"LA LA Land" అంటే అది ఒక విధంగా కృత్రిమ ప్రదేశం అనే అర్ధమొస్తుంది. LA అంటే లాస్ ఏంజెలెస్, "హాలివుడ్" ఉన్న చోటు. ఈ సినీమా ఒక musical. అంటే పాటలు ఉంటాయన్న మాట.ఈ అర్ధంతో చూస్తే మన తెలుగు సినీమాలన్నీ musicals. ఇది "My fair lady ", "Fiddler on the Roof", "Sound of Music" లాంటి musical  కాదు కాకపోతే చాలా పాటలు ఉన్నాయి. మొదటి పాట "LA " హైవే మీద ట్రాఫిక్ జామ్ లో మొదలవు తుంది. అక్కడే అమ్మాయి అబ్బాయి  కలుసుకుంటారు కూడా. అమ్మాయి త్వరగా కారు ముందుకి నడపదు. వెనక కారులో ఉన్న అబ్బాయికి కోపమొచ్చి తన కారు పక్క లైన్ నుండి తెచ్చి అమ్మాయి కారు పక్కకి పెట్టి, డ్రైవర్లు పంచుకునే భీకర సౌజ్ఞలతో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించటం. ఎవరి అభిరుచుల ప్రకారం వారు ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం తో చివరికి వారాల  తరబడి అమ్మాయి గారు  ఒక చోట, అబ్బాయి గారు దేశంలో ఇంకోచోటా, ఉండటంతో, అమ్మగారు అలిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్బాయి గారు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి గారు ఉండరు. కానీ అమ్మాయి గారిని ఒక సినీమా కోసం audition కు రమ్మనే మెసేజ్ ఉంటుంది. అమ్మాయిగారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి ఆ మెసేజ్ ఇచ్చి ఆడిషన్ కి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. మిగతా కధంతా మామూలే. అమ్మాయిగారు పెద్ద నటి అయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాజెల్లా తో హాయిగా ఉంటుంది. అబ్బాయి గారు రెస్టారంట్ లో పియానో వాయించే రోజూ వారీ పనివాడుగా మిగిలిపోతాడు.

సినీమా అవగానే వెతుక్కుంటూ కారు దగ్గరకి వెళ్ళి ఇంటికి జేరాము. రాత్రి పూట వెతికితే మెన్హాటన్ లో కూడా వీధి పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే సినీమా కన్నా పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.

(ఇది సంవత్సరం కింద ఎప్పుడో వెయ్యాల్సిన పోస్ట్. ఇప్పటికి వెలుగు చూసింది)


Monday, October 8, 2018

145 ఓ బుల్లి కథ ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part-9 - పంచేంద్రియాలు Our Senses


మనకున్న పంచేంద్రియాలు senses  ) పేరుకు తగ్గట్టు అయిదు, కళ్ళు, ముక్కు, చెవి, రుచి (నాలిక), మన దేహమంతా ఆక్రమించుకున్న స్పర్శ (తోలుskin ). అవే మన జ్ఞానేంద్రియాలు కూడా ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చేది  వీటి ద్వారానే.

మనము పుట్టినప్పుడు మనకున్న జ్ఞానం శూన్యం. మనకి తెలిసినదల్లా ఏడవటం. అప్పటినుండీ  పంచేంద్రియాల నుండి వచ్ఛే సంకేతాలను మన మనస్సులో గుప్త పరుచుకుంటూ వాటిద్వారా బయటి పరిమాణాలకి స్పందిస్తూ జీవిస్తున్నాము.

అందుకనే సంవత్సరాల పాటు మనం జీవించిన జీవన విధానము, మనం పెరిగిన వాతావరణము, మన జీవితానికి పునాది అవుతుంది. మనం అందరం పెరిగిన వాతావరణాలు వైవిధ్యం కాబట్టి మన ఆలోచనలు వైవిధ్యంగా ఉండటంలో ఆశ్చర్యము లేదు. ఉదా : మనం చిన్నతనంలో దైవత్వం అంటూ పండగలు చేసుకుంటూ గుళ్ళకి గోపురాలకు తిరిగామనుకోండీ, అవి జీవితాంతం మన జీవితంలో భాగమవటానికి ఆస్కారం ఉంటుంది. అదే చైనా నుండి వచ్చిన వారిని దైవం గురించి అడగండి, వాళ్ళకి అదంటే ఏమిటో తెలియదు, ఆ దృక్పధంతో వాళ్ళు పెరగలేదు.

ఒకసారి మన మెదడులో మనము పెరిగిన వాతావరణ సమాచారము గుప్త పడిన తరువాత వాటిని తీసి వెయ్యటం చాలా కష్టం. పేరుకుపోయిన భావజాలాన్ని మార్చటం చాలా కష్టం. ప్రపంచం లోని సైఖియాట్రిస్టులందరూ ప్రయత్నించేది అదే.  అమెరికాలో ఉన్నా ఆవకాయ తినాలనిపిస్తుంది. ఎన్ని సార్లు ఇంటిని రీమోడల్ చేసినా పునాదిని మార్చలేము.

ఈ జ్ఞానేంద్రియాలు ఏవిధంగా పనిచేస్తా యనే వాటిమీద చాలా మంది పరిశోధనలు చేశారు.  నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. అందులో Georg Von Bekesy ఒకరు.ఆయనకి  మన చెవి ఎల్లా పనిచేస్తుందో కనుగొన్నందుకు 1961 లో నోబెల్ వచ్చింది. నా జీవితంలో నోబెల్ ప్రైజ్ కి దగ్గరైంది, University of Hawaii లో ఆయన Research Lab లో పనిచేయటం వరకే. This is the nearest I got to the nobel prize.

మన పంచేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియమూ ఒక్కొక్క పరిస్థితికి స్పందిస్తుంది. ఆ స్పందనలు విద్యుత్ సాంకేతికాలుగా మారి మెదడుకు పంపబడతాయి. మెదడులో కొన్ని సంకేతాలు నిలువ ఉంటాయి కొన్ని అదృశ్యమవుతాయి. ఇదికూడా మన చేతుల్లో లేదు. కాకపోతే ఒకటి మాత్రం అందరికీ స్వానుభవం. మనం చిన్నప్పుడు బట్టీపట్టిన ఎక్కాలు, పద్యాలూ (ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు ) ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. కారణం బహుశా ఎక్కువసార్లు వల్లెవేయటం మూలంగా మన మెదడు వాటిని ముఖ్యమైనవని గుర్తించి దాచిపెట్టిందేమో.

ఇవిగో మన పంచేంద్రియాలు అవి పని చేసే విధానము:

1. కన్ను: కంటి లో పడిన కాంతి కిరణాలు విద్యుత్ ప్రకంపనలు కలిగించి మెదడుకి అందిస్తాయి. వస్తువుల మీద పడిన కాంతి కంటికి తగలటం మూలంగా ఆ వస్తువుల ఆకారాలు మనము చూడకలుగు తున్నాము.

2. చెవి: శబ్దము చేసినప్పుడు, గాలి అలలు ఏర్పడి (నీటి కెరటాలు లాగా), అవి చెవిని తాకి విద్యుత్ సాంకేతికాలు గా మారి మెదడును చేరుతాయి.
మనకి ఏవైపు నుండి శబ్దం వస్తోందో తెలుసుకునేది రెండు చెవుల నుండీ వచ్చే సంకేతాల తేడా వలన. మనం బజార్లో చూస్తూ ఉంటాము, earplugs పెట్టుకుని నడిచే వాళ్ళని. వాళ్ళు ఎప్పుడో అప్పుడు చిక్కుల్లో పడతారు. ఎందుకంటే నడిచేటప్పుడు బయట శబ్దం ఏవైపు నుండి వస్తోందో వారికి తెలుసుకోవటం కష్టమవుతుంది.

3. ముక్కు: వాసన నుండి వచ్చే సూక్ష్మ కణములు (particles ) గాలిలో ప్రయాణించి ముక్కులో వున్న mucas లో రంగరించ బడి (dissolve ) నరాలకు తాకి విద్యుత్ సాంకేతాలుగా మారి మెదడును చేరుతాయి. అందుకనే వాసన లేని కార్బన్ మోనాక్సయిడ్ ని మనం గుర్తించలేము (mucas లో dissolve కి ఏమీ లేవు). అందుకనే గుర్తించటానికి వాసనలేని వంట గ్యాస్ కి వాసన కలుపుతారు.

4. రుచి: నాలిక మీద ఉన్న రుచి మొగ్గలు(taste buds ), తిన్న ఆహారంలోని రుచిని గ్రహించటం మూలంగా మెదడుకి విద్యుత్ సంకేతాలు వెళ్తాయి. మామూలుగా మనము గుర్తించే రుచులు నాలుగు. తీపి(sweet ), వగరు(sour ), ఉప్పు(salty ), చేదు(bitter ). వాటితో కొత్తగా ఉమామి(umami ) అనే రుచిని అయిదవ రుచిగా కలిపారు.

5. స్పర్శ : తాకిన స్పర్శకు చర్మము క్రింద ఉన్న నరములు స్పందించి విద్యుత్ సంకేతాలు మెదడుకి పంపుతాయి.

ఈ జ్ఞానేంద్రియాలు ఒక్కోక్కటిగాను , రెండుమూడు కలిసికట్టుగానూ పని చేస్తాయి. ఉదా: మనం ఇంట్లోకి వ్రవేశిస్తున్నాము, వంటగది నుండి మంచి వాసన వస్తోంది(ముక్కు). తినాలని కోరిక పుడుతుంది. వంటింట్లోకి వెళ్ళి చూస్తే (కన్ను), మనకు ఆ వంటకం తిన బుద్ది పుట్టా వచ్చు
లేక ఏహ్యం కూడా రావచ్చు. తినబుద్ది పుట్టి తిన్నామనుకోండి ఆనందంతో ఆస్వాదించ వచ్చు లేక ఉప్పు ఎక్కువయ్యి మింగలేక బాధపడ వచ్చు(రుచి).

మన కళ్ళు, చెవులు, చర్మము మన కదలికల గురించి సంకేతాలు ఎల్ల వేళలా మెదడుకి పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల కలయికతో మన మెదడు మన కండరములను ప్రేరేపించి, మనము క్రిందపడకుండా (balanced ) నడిచేటట్లు చూస్తుంది. వీటి సంకేతాల సమన్వయం (coordination )లేక పోతే బాలన్స్ తప్పిపోయి తూలవచ్చు.
నిద్రపోతూ మంచం మీద నుండి లేచినప్పుడు, షవర్లో నుంచిని స్నానం చేసేటప్పుడు (మొఖానికి సబ్బు రాసుకొని  కళ్ళు మూసి కదిలేటప్పుడు ) కొంచెం జాగర్తగా ఉండండి బాలన్స్ పోయి పడటానికి ఆస్కారం ఉంది.

మనము ప్రకృతిలో ఒక భాగం కనుక అందరం ఒకే విధంగా ఉండటం జరగదు (mutation ఒక కారణం అవుతుంది). మన  పంచేంద్రియాల ప్రతిస్పందనలలో కూడా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. కొందరిలో నాలిక మీద tastebeds ఎక్కువగా ఉండి ఉండవచ్చు. కొందరిలో తక్కువ ఉండవచ్చు. "మా ఆయన ఏమి పెట్టినా గుట్టు చప్పుడుగా తింటాడు", "మా ఆయన ప్రతి వంటనీ వంక పెడాతాడు" అనే మాటలకి అర్ధాలు ఇవే.

మనకి కనపడని వాటిని గుర్తించటానిని (instinct ), sixthsense అంటారు. ఉదా : మన వెనకాల ఎవరున్నారో గుర్తించటం, కళ్ళు మూసుకుని నడవటం వగైరా.

మనకి వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఇంద్రియాలలో పస తగ్గిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఆయా ఇంద్రియాలకు కావలసిన ఇంధనాలు (vitamins etc ) సరీగ్గా అందక పోవటం అవ్వచ్చు. దానికి కారణం మన జీర్ణ శక్తి తగ్గి, పోషక పదార్ధాలు రక్తంలోకి రావటం తగ్గటమేమో.

మాతృకలు :
1. Understanding the Senses (2010), Carol Ballard, Rosen Publishing Group Inc.
2. How does the Balance System Works

Thursday, September 27, 2018

144 ఓ బుల్లి కథ ---- అమెరికాలో వచ్ఛేస్తోంది చలికాలం




నా చిన్నప్పుడు మానాన్న గారు పళ్ళు తోముకోటానికి పందుంపుల్ల నోట్లోపెట్టుకుని మెట్లుదిగి భావి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. తిరిగి పైకి వచ్చేటప్పుడు ఆరోజు కూరగాయలు తుంపుకుని వచ్చే వారు. ఆ ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. బహుశ పల్లెటూరిలో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ దొడ్లో భావి లేదు, పందుంపుల్లలూ లేవు. కానీ అదేపని నేను చాలా ఏళ్ళు సాయంత్రం పూట చేసేవాణ్ణి. ఇప్పుడు మా ఆవిడ చేస్తుంది. ఆవిడ చెల్లెలు క్రిందటి సంవత్సరం ఇక్కడ ఉన్నప్పుడు రోజూ పెరట్లోనుండి ఒక దోసకాయ కోసుకువచ్చి పచ్చడి చేసేది. పిలిచినప్పుడు వెళ్ళి ఆరగించటమే మన పని.

సెప్టెంబర్ వచ్చేసింది దానితో చలికూడా వచ్చేసింది. ఇంక చికాగో లో చెట్ల ఆకులు రంగులు మారి రాలి పోవటం మొదలెడతాయి. అందుకనే వచ్చే మూడు నెలలని Fall అంటారు. పెరట్లో వేసిన మొక్కలన్నీ ఎండిపోతాయి అందుకని మొక్కల మీద ఉన్న కూరగాయలు అన్నీ కోసేస్తారు. పై ఫోటో నిన్న మా ఆవిడ కోసుకువచ్చిన ఈ సంవత్సరపు చివరి పంట.

మీరు గమనించారో లేదో పంట ఎక్కువ పండలేదు. దానికి కారణం ఉంది. ఈ సంవత్సరం పెరటి తోట గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు. మొదట్లో నేల దున్నిపెట్టాను అంతే.  ఆ తర్వాత మొక్కలు పెట్టటంలో బేదాభి ప్రాయాలు తన్నుకోవటం దాకా వచ్చి పీసుఫుల్ గ తోటపని ఇంట్లో ఆడవాళ్ళకి అప్పచెప్పాను. ఎప్పుడో అప్పుడు మనకి ప్రియమయిన పనులు ఇంకొకళ్ళకి అప్పగించాలి కదా. మొక్కలన్నీ ఆవిడే పెట్టింది. ఈ సంవత్సరం అందరికీ పంచి పెట్టేటంత పంట రాలేదు. ఒకప్పుడు నా హయాంలో సొరకాయ పాదు పెరటంతా పాకి  ఏభయి అరవై కాయలదాకా ఇస్తే వాటిని  కారు ట్రంకు లో వేసుకుని గుడికి తీసుకు వెళ్ళి పంచాము.

మా చికాగో ప్రాంతంలో, పెరట్లో మొక్కలు వేసి పండించుకుని  తినే భాగ్యం సంవత్సరానికి ఆరు నెలలు కూడా ఉండదు ( మే నుండి సెప్టెంబర్). సెప్టెంబర్ వచ్చేసరికి చలి వచ్చేస్తుంది. పెట్టిన మొక్కలు ఎండిపోవటం మూలంగా కూరగాయలన్నీ కోసెయ్యాలి లేకపోతే పాడయి పోతాయి. కొందరి ఇళ్ళల్లో పంట (ఇంట్లో ఉపయోగించే దానికన్నా) ఎక్కువ పండుతుంది. వీరు మిగిలిన వాటిని చుట్టు పక్కల వాళ్ళకి పంచుతూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం వెంకట్ ఇంటినుండీ, శోభా వాళ్ళ ఇంటినుండీ వాళ్ళ పెరటి కాయగూరలు వచ్చాయి.

వెంకట్ పెరటి నుండి ఒక సొరకాయ,బీర కాయలు, పొదీనా ఆకు వచ్చింది. వెంకట్ నేను ఇమ్మిగ్రెంట్స్ కి ఇచ్చే క్లాస్ కి వస్తూ ఉంటాడు. మహారాష్ట్రలో ఎదో కుగ్రామంలో లెక్కల మాష్టారి ఉద్యోగం చేసి రిటైర్ అయి భార్యతో, పిల్లల దగ్గర ఉండటానికి వచ్చాడు. చిత్రం అమెరికాలో వాళ్ళది కంబైన్డ్ ఫామిలీ, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు. వెంకట్ వేదిక్ మాథ్స్ లో ఎక్స్పర్ట్. ఎప్పుడో ఆయన్ని ఇంటర్వ్యూ  చేసి ఒక పోస్ట్ వెయ్యాలి.

శోభా వాళ్ళ నుండి బీరకాయలు మిరపకాయలూ వచ్చాయి. వాళ్ళింట్లో బీరకాయ పాదు వేస్తే వెనకాల వాళ్ళింట్లోకి పాకి కాయలు కాచింది. సెప్టెంబర్ లో వెనకాల వాళ్ళింటికి వెళ్ళి బీరకాయలు కోసుకు వచ్చారు. ఎక్కువయితే అందరికీ పంచి పెట్టారు. మేము బీరకాయ తొక్కుతో పచ్చడి, బీరకాయ లతో కూర, పచ్చడి చేసుకున్నాము. మిరపకాయలు పొడుగ్గా మిరపకాయ బజ్జీలలో వాడేవి లాగా వున్నాయి కాకపోతే ఇవి జపనీస్ వేమో ఉట్టిగా తినచ్చు అసలు కారంగా లేవు. వాటితో మిరపకాయల బాజ్జీలు చేసుకుని తిన్నాము.

వచ్ఛే సంవత్సరం ఏమి చెయ్యాలో ఇప్పటినుండే ఆలోచించు కోవాలి. బహుశా పెరటితోట మళ్ళా నా చేతుల్లోకి తీసుకుంటాను. అక్టోబర్ లో ఇక్కడ  "ఇండియన్ సమ్మర్" అంటూ ఒక వారంరోజులు బయట ఉష్ణోగ్రత పెరుగుతుంది. నేల దున్ని (నా దగ్గర ఒక యంత్రం ఉంది), పెరటి తోటని వచ్ఛే సంవత్సరం పంటకి రెడీ చెయ్యాలి. వచ్చే సంవత్సరం పొట్లకాయ గింజలు ఎక్కడయినా దొరికితే పెరట్లో వెయ్యాలి. హెయిర్లూం టొమాటోలు తప్పకుండా వెయ్యాలి. ఇక ఉంటా మరి.

Monday, August 27, 2018

143 ఓ బుల్లి కథ -- ఇటువంటిది అమెరికాలోనే ! ఒక ముద్దుగుమ్మ కధ

ముందరే చెబుతున్నాను ఈ ముద్దుగుమ్మ కధ వింటే మీకు కళ్ళు చెమరుస్తాయి. చాలా జాలిపడిపోయి బాధ పడి పోతారు. పాపం ఈ భామ, తను జీవితంలో ఎంతో కోరుకున్న పెళ్ళి డబ్బులేక మానుకోవాల్సొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే ఈ ముద్దుగుమ్మ తన 14 ఏళ్ళప్పుడే ప్రేమలో పడింది.  యువ ప్రేమికులిద్దరూ  పెళ్లి చేసుకుందామని 18 ఏళ్ళకే  తాంబూలాలు పుచ్చు కుని సహజీవనం చేపట్టారు. వాళ్ళ 20 వ పడిలో పిల్లలని కన్నారు. కష్టపడి చదువుకుని డిగ్రీ తెచ్చుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ భామకి ఎంతో గ్రాండ్ గ పెళ్లి చేసుకోవాలని ఉంది. దానికి $60,000 డాలర్లు ఖర్చు అవుతుందని లెక్క కట్టారు. వాళ్ళు ఎంత కష్టపడ్డా $15,000 డాలర్ల కన్నా దాచి పెట్ట లేక పోయారు. అందుకని పెళ్ళి శుభలేఖలు వేసి పెళ్ళి కి వచ్చే వాళ్లందర్నీ, ఒక్కొక్కళ్ళనీ బహుమతుల బదులు, $1500  డబ్బు లిచ్చి,పెళ్ళికి సహాయం చెయ్యమన్నారు. ఆహ్వానితులలో చాలామందికి ఇది నచ్చక పెళ్ళికి రామన్నారు. దానితో పెళ్ళి మానుకోవాల్సొచ్చింది.

దీనికితోడు పెళ్ళి ఆగిన తర్వాత  కాబోయే పెళ్ళికొడుకు తన బెస్ట్ ఫ్రెండ్ తో కులుకుతున్నాడని తెలుసుకుంది.

పెళ్ళి ఆగిపోయింది,పెళ్ళి కొడుకు చెయ్యి జారిపోయాడు, మనస్తాపంతో మనస్సు క్లియర్ చేసుకోటానికి, ఈ  కలుషపూరిత పరిసరాలు వదలి కొంత కాలం సౌత్ అమెరికాలో కొండల్లో కూనల్లో ఒంటరిగా తిరగాలనుకుంటోంది. జీవితంలో అన్నీ మనమనుకున్నట్లు జరగవు అని తెలుసుకుంది.

ఈ ముద్దుగుమ్మ పూర్తి కధ  ఇక్కడ చదవండి:

https://www.yahoo.com/lifestyle/bride-canceled-her-wedding-guests-133300785.html




Monday, April 23, 2018

142 ఓ బుల్లి కథ ---- లక్కీ వెంకీ

పక్కింటి పరమేశం మాట్లాడకుండా ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సామాన్యంగా ఇట్లా ఉండడు. ఏదో మాట్లాడుతూ నవ్వు మొహం తో ఇంట్లోకి వస్తాడు. నాకు అనిపించింది ఇక్కడ ఎదో తిరకాసు ఉందని.

మొహం చూస్తే ఎదో బాధపడుతున్నట్లు ఉంది   -- ఏమిటి సంగతి ? అన్నాను. సమాధానం లేదు. సామాన్యంగా బాధపడుతున్న వాళ్ళని "ఏమిటి బాధ" అని అడిగితే చెప్పలేరు. ఇంకో రూటులో పోవాలి.

ఇంట్లోకి పోయి బ్రూ కాఫీ చేసి తీసుకు వచ్చాను. ఇంటావిడ చేసిన కాఫీ రోజుకో విధంగా ఉంటే నేనే కాఫీ చెయ్యటం నేర్చుకున్నాను. బ్రూ కాఫీ పౌడర్ ఒక చెంచా (తలగొట్టి), రెండు చెంచాల (రౌండెడ్ ) coffeemate కప్పులో వేసి, ఒక అర చెంచా బ్రౌన్ షుగర్ కలిపేసి, కప్పులో ముప్పాతిక వరకూ వేడినీళ్లు పోస్తే కాఫీ బ్రహ్మాండం. కప్పులో వేడినీళ్లు ఎక్కువ తక్కువలయి రుచి కొంచెం అప్పుడప్పుడూ తేడా వస్తుంది కానీ దీనితో భార్య వేసిన కాఫీ సంకెళ్ళ నుండి బయటపడ్డాను. రోజూ ఆవిడ లేచి కాఫీ ఎప్పుడు పెడుతుందా అని చూసే వాడిని. ఇప్పుడు నేనే చేసుకుంటాను కాఫీ. నా కాఫీ బ్రహ్మాండం. ఇదో పాటగా వ్రాయచ్చల్లే వుంది. ఒకటి వ్రాసి పారెయ్యాలి త్వరలో.

పరమేశం కాఫీ ఎల్లా ఉందో చెప్పు అన్నాను. బాగుంది అన్నాడు. తరువాత నిశ్శబ్దం.

నా చిన్నప్పుడు కాఫీ ఇవ్వలేదని గొడవపెడితే మా అమ్మ ఓవల్టీన్ మీద కొద్దిగా కాఫీ కాషాయం పోసిచ్ఛేదని చెప్పాను. వింటున్నాడు. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక పొద్దున్నేఅమ్మ కాఫీ కాస్తుంటే కుంపటి చుట్టూ ఎల్లా చేరేవాళ్ళమో చెప్పాను. రోజూ అమ్మ చేతి  కాఫీ ఒకే విధంగా ఉంటుందని కూడా చెప్పాను. వెంటనే మా ఆవిడ కాఫీ రుచి రోజుకో విధంగా ఉంటుందని కూడా అంటించాను. ఇప్పుడు నీకిచ్చిన కాఫీ నేనే చేశానని గర్వంగా చెప్పేశాను. పరమేశం లో చలనం లేదు. ఎదో ఆలోచిస్తున్నాడు.

నిశ్శబ్దంగా మొహాలు చూస్తూ కూర్చోటం నాకు ఇష్టం ఉండదు. ఇంక నేను కాఫీ చేయటం ఎల్లా నేర్చుకున్నానో చెప్పటం మొదలెట్టాను. మొదట నాదంతా self taught అని చెప్పాను. మొదట్లో బ్రూ కాఫీ సీసా మీద ఉన్న రెసిపీ తో ప్రారంభించానని చెప్పాను. దాని మీద ఒక చెంచా కాఫీ పొడి వెయ్యాలని చెప్పారు గానీ అది తలగొట్టి వెయ్యాలనేది నేను కనుగొన్నానని చెప్పాను. గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి సున్నితంగా medium heat లో వేడిచేయాలని చెప్పాను. ఎందుకో ఉదహరించాను.  నీళ్ళు మరిగే టప్పుడు ఆవిరి గా కొన్నినీళ్ళు పోతాయి అందుకని నీళ్లు కావలసిన దానికన్నా కొంచెం ఎక్కు వగా పోయాలని చెప్పాను. నీళ్ళు మరిగేటప్పుడు వచ్ఛే మ్యూజిక్  తప్పకుండా వినాలని చెప్పాను. సరిఅయిన సమయానికి, నేను రెడీ, కాఫీ కలుపుకో అని సిగ్నల్ వస్తుంది అని చెప్పాను. నేను కప్పులో cofeemate (పాలపొడి) ఎంత వెయ్యాలో చెప్పబోతుంటే;

పరమేశం పెద్దగా అరిచాడు. "శ్రీదేవి" అని. పరమేశానికి నా సొళ్ళు కబుర్లు వినే ఓపిక పోయింది. నేను చెప్పేవి వినలేక కొందరు లేచిపోతారు కొందరు అలా అరుస్తూ ఉంటారు. నాకు కావాల్సింది అదే. నా కోరిక ఫలించింది. పరమేశం ప్రాబ్లమ్ తెలిసిపోయింది. "శ్రీదేవి" అని.

శ్రీదేవి ప్రాబ్లమ్ ఎల్లా అయింది?  నాకు అర్ధం కాలా. "శ్రీదేవి" చని పోయి చాలా కాలం అయింది కదా.  నాకు బాగా గుర్తు నెలల క్రితం న్యూజెర్సీ  "BJs " లో షాపింగ్ చేస్తుంటే మా అబ్బాయి ఫోన్లో చూసి వార్త చెప్పాడు . నేను పెద్ద పట్టించు కోలేదు. అప్పుడు నా ద్రుష్టి అంతా "free samples " మీద ఉంది.

శ్రీదేవి ఇంకా పరమేశం మనసులో మెదులుతోందా! నాకు ఆశ్చర్య మేసింది.

"శ్రీదేవి" అంటే నా కిష్టం అన్నాడు. నాకు తెలుసు ఆనకట్టకు గండి పడింది. ఇంక దానిని కొద్దిగా కెలికితే చాలు అన్నీమనస్సులోనుండి బయటికి వస్తాయి.

రామగోపాల్ వర్మకి కూడా  శ్రీ దేవి అంటే ఇష్టం అన్నాను.

నాది అటువంటి ఇష్టం కాదు. అన్నాడు. ఏమిటో ఇష్టాలలో రకాలు ఉంటా యల్లె ఉంది.

పరమేశం నువ్వు బాధపడటం నా కిష్టం లేదు. పోయిన వాళ్ళు తిరిగి రారు కదా! ఇదంతా విధి చేసే నాటకంట అన్నాను. బాధపడి లాభంలేదు. మరిచిపోవటం మంచిది. చూడు జిలేబీ గారు శ్రీదేవి మీద ఒక చక్కటి పద్యం వ్రాసి ఎలా మర్చి పోయారో !
"అందాలమ్మికి దేవుడు తొందర గా జోల పాడి తోడ్కొని పోయెన్", "డెందము దుఃఖంబాయె న్నందరికి జిలేబియ విధి నాటక మిదియే !" 

తన బాధలని ఇంకోళ్ళతో పంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. పోనీ జిలేబీ గారి లాగా ఒక పద్యం ఆటవెలదో తేటగీతో వ్రాయి నా బ్లాగ్ లో వేస్తాను అన్నాను. నాకు అవి వ్రాయటం చేత కాదు అన్నాడు.

వేణు శ్రీకాంత్ అనే ఆయన, ఆయన బ్లాగ్ "పాటతో నేను" లో "మార్చి" నెల అంతా శ్రీదేవి పాడిన పాటలు వేశారు అన్నాను.

ఆ నెలరోజులూ శ్రీదేవి కోసం ఆయన బాధపడి నన్ను బాధ పెట్టారు అన్నాడు. పోనీ ఏమి చేయమంటావో చెప్పు నీ బాధ నేను చూడలేను అన్నాను. అంతా నిశ్శబ్దం.

"లక్కీ వెంకీ" అని అరిచాడు. కొందరికి మనసులోవి బయట పెడితే ఎవరేమి అనుకుంటారేమో నని భయం. చివరిదాకా లా గి, మనస్సు అతలా కుతల మైతే, మాటలు అరుపులుగా బయటికి కక్కు తారు. ఎవ్వరీ వెంకీ అన్నాను. మళ్ళా నిశ్శబ్దం.

"అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవార నీయనంతే ". నాకు వెంకీకి ఉన్న ధైర్యం ఉంటే ఎంత బాగుండేదో అన్నాడు. నోట్లో నుండి మాటలొస్తున్నాయి.వాటిని ఆపటం నాకిష్టం లేదు. ఇదేదో పాట లో చరణం లాగా ఉంది అన్నాను.

"అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మో అన్నీ గొడవలే". చూడు శ్రీదేవి ఎంత చక్కగా సమాధానం చెప్పిందో అన్నాడు. ఆ గ్రేస్, ఆ వాయిస్.

ఇదేదో డ్యూయట్ అని తెలిసిపోయింది. ఆపాట నీకు ఇష్టమా అన్నాను. అది ప్రాణం అన్నాడు. ఎవరికి  ఏది ప్రాణమో ఈరోజుల్లో చెప్పటం చాలా కష్టం. శ్రీదేవిని మిస్ అవుతున్నావా  అని అడిగాను. సిగ్గుతో తలవూపాడు.

ఏమి  చేయమంటావు. నీ బాధ ఎలా తీరుతుంది , ఆపాట నా బ్లాగ్ లో వేయమంటావా?  అన్నాను. అందుకే వచ్చాను అన్నాడు. నీ మీద ఎంత ఇష్టమున్నా, వేణూ శ్రీకాంత్ లాగా నెలరోజులు పోస్ట్ వెయ్యలేను, మాలిక వాళ్ళు వప్పుకోరు. ఒక సారే వేస్తాను అని చెప్పాను. సరే అన్నాడు.

OK folks . Hear it Goes.

అమ్మా శ్రీదేవీ పరమేశం అనే నీ ఫ్యాన్  తనకిష్టమైన పాటతో నీకు తెలిపే సందేశం:
                        "నువ్వెక్కడున్నా నా మనసులో ఎప్పుడూ ఉంటావు".




Tuesday, March 20, 2018

141 ఓ బుల్లి కథ ---- "పైథాన్ అది నాపాలిట సైతాన్"

ఆఫీసు నుండి వచ్చిన కామేశ్వరమ్మకి మొగుడు ఇల్లా ఎందుకు మారిపోయాడో అర్ధం కావటల్లేదు. చెప్పినపని చెయ్యడు. ఒకటో రెండో చేస్తున్న పనులు కూడా సరీగ్గా చేయటల్లేదు. మొన్న రైస్ కుక్కర్లో బియ్యం నీళ్లు పోసి కుక్ స్వీచ్ నొక్కటం మర్చిపోయాడు. ఆకలితో ఆఫీస్ నుంచి వచ్చి   అన్నం వండుకోవాల్సి వచ్చింది. నిజం చెప్పొద్దూ  కూర మాత్రం చేశాడులే. పైకెళ్ళి బట్టలు మార్చుకొచ్చి గిన్నెలు కడుక్కుని కంచాలూ మంచినీళ్లు పెట్టేసరికి అన్నం ఉడికిపోయింది. ఇదివరకు ఇవన్నీ తాను చేసేవాడు. ఎందుకండీ కష్టపడతారు అంటే "ముఫై ఏళ్ళు నాకు ఆఫీసు నుండి రాంగానే భోజనం పెట్టావు రిటైర్ అయిన తరువాత నీకు ఈ మాత్రం చెయ్యలేనా" అనేవారు. మా బుజ్జి నాయన. ఇప్పుడేమో అంతా మారిపోయింది. తింటాడు పోతాడు కంప్యూటర్ ముందు కూర్చుంటాడు.

నిన్నటికి నిన్న తను ఆఫీస్ నుండి వచ్చిన సంగతే గమనించలేదు. ఇదివరకు గారేజ్ తలుపు శబ్దం అవగానే వచ్చి తలుపు తీసే వాడు. రెండు మూడు సార్లు కంప్యూటర్ గదిలోకి తొంగి చూసింది. అలా స్క్రీన్ వేపు చూస్తూ ఉంటాడు. మొదట ఏమన్నా దెయ్యం పట్టిందేమో అని భయపడింది కానీ ఒక నిర్ధారణకు రాలేక పోయింది. మూడు పూట్లా తింటాడు, ఏవో అవసరం వచ్చి నప్పుడు ప్రేమ మాటలు చెప్పి తన పని కానిచ్చు కుంటూ ఉంటాడు. మళ్ళా ఆ ప్రేమ మాటలు ఆ కుతి వచ్చినప్పుడే.

పోనీలే తన పని తాను చేసుకుంటున్నాడు, చిరుతిళ్ళు ఏమీ అడగడు. అప్పుడప్పుడూ  "బర్గర్కింగ్  ఫ్రెంచ్ ఫ్రైస్ " తెచ్చిపడేస్తే సంతృప్తి పడతాడు. అని ఊరుకుంది. కానీ తాను చెప్పిన మాట వినటల్లేదనే పాయింట్ మనస్సుని తొలిచేస్తోంది.

తెగేసి అడిగింది "ఏమి చేస్తున్నారు కంప్యూటర్ మీద" అని. "పైథాన్ " నేర్చుకుంటున్నాను అన్నాడు. "పైథాన్ " అంటే ఏమిటని తాను అడగలేదు. అడిగితే కూర్చోబెట్టి ఒక లెసన్ పీకుతాడని తెలుసు. మొగుడినుండి లెసన్లు తీసుకునే అవసరం తనకు లేదు. ఆయన చెప్పిన డ్రైవింగ్ లెసన్స్ నలభై ఏళ్ళ తర్వాత గూడా గుర్తున్నాయి!. ఆ రోజులు పోయినాయి. తాను కంప్యూటర్ వాడుతుంది కానీ, కంప్యూటర్ ఎల్లా పనిచేస్తుందో ఎవరికి కావాలి. అసలు ఫోన్ కూడా కంప్యూటరేట. తనకి ఫోన్ చెయ్యటం కూడా చేత కాదు. నేను ఐఫోన్ వాడతాను. తనకి దాన్ని వాడటం చేతకాదు. మొన్నటికి మొన్న మేనార్డ్స్ కి వెళ్తా నంటే నా ఫోన్ ఇచ్చాను. కారులో తాళంచెవులు పడేసుకుని కార్ లాక్ చేసుకున్నారు. ఫోన్ లో ఎదో నంబర్ కనపడిందిట ఫోన్ చేశారు. మా అబ్బాయి వెయ్యి మైళ్ళ దూరం లో ఉన్న న్యూయార్క్ నుండి నాకు ఫోన్ చేసి నాన్న మేనార్డ్ పార్కింగ్ లాట్ లో ఉన్నారు, కారు తాళంచెవులు తీసుకు వెళ్ళు అని చెప్పాడు. అస్సలు నేనివ్వాలి లెసన్. వళ్ళు మండిపోతుంది. తను రోజూ కారు వాడుతుంది, లోపల ఇంజిన్ ఎల్లా పని చేస్తుందో లెసన్ పీకుతానంటే ఎవరు వింటారు. అదీ కూడా ట్రై చేశాడు ఆయన.

ఏదోలే పోనీలే అని రెండురోజులు ఓపిక పట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటోంది. భరించలేకుండా ఉంది. తిట్టుకున్నా కొట్టుకున్నాఆయన ఎదురుకుండా ఉంటే టైమ్ తొందరగా గడిచి పోతుంది. ఇంక పట్టలేక ఈ కంప్యూటర్ వ్యవహారం ఎప్పుడవుతుంది అని అడిగింది. ఒక పది రోజులలో అయిపోతుంది అని సమాధానం వచ్చింది. ఏదో పదిరోజులేగా సరిపెట్టుకుంటే   మొగుడు తన కంట్రోల్ కి వస్తాడు కదా అని గొడవ చెయ్యకుండా ఊరుకుంది. అంతేకాదు కాఫీ ఫలహారాలు కూడా కంప్యూటర్ గదికి తెచ్చి ఇవ్వటం మొదలెట్టింది.

పది రోజులయ్యింది ఇరవై రోజులయ్యింది. ఉలుకూ పలుకూ లేకుండా  కంప్యూటర్ గదిలో కూర్చుని హాయిగా తెచ్చినవన్నీ ఆరగిస్తూ అనుభవిస్తున్నాడు. అతగాడు "పైథాన్" పేరుతో తనని వాడుకుంటున్నాడనే అనుమానం వచ్చింది. నిలదీసి మొహమాటం లేకుండా అడిగింది. ఏమిటి సంగితి ఇంట్లో పనులు చెయ్యటం ఎప్పుడు మొదలెడతావు అని. "పైథాన్" నేర్చుకున్నాను. కానీ అది బాగా పని చెయ్యాలంటే "పాండాస్" నేర్చు కోవాలి అది నేర్చుకుంటున్నాను అన్నాడు. సరే ఊరుకుంది. తర్వాత "నంపై" అన్నాడు. ఆ తర్వాత "జూపిటర్ నోట్బుక్ " అన్నాడు. పని ఎగకొట్టటానికి  ప్లాన్ ఏమో అనే అనుమానం వచ్చింది.

వాళ్ళబ్బాయికి ఫోన్ చేసింది. మొన్నేదో అయ్యా కొడుకూ మాట్లడుకుంటుంటే వింది. "పండాస్" లో "గ్రూప్బై" బాగా పనిచేస్తుందని. ఏమిట్రా అబ్బాయి మీ నాన్న నామాట వినటం మానేశారు. కంప్యూటర్ స్క్రీన్ వేపు అల్లా చూస్తూ కూచుంటారు. కాసేపు "పైథాన్" అంటారు, తర్వాత "నంపై" అంటారు, "పండాస్ " అంటారు. ఏమిటిదంతా. అవి నిజమా అబద్దమా ఏమిటి సంగతి అని.

మదర్ నీవు చెప్పిన వన్నీ కంప్యూటర్ భాషలు. కంప్యూటర్ భాషలతో అంతే అమ్మా. మనము ఒకటని దానికి చెబుతాం. అది ఒకటి చేస్తుంది. ఎందుకు అలా చేసిందని స్క్రీన్ వేపు చూస్తూ కూర్చుంటాము. అందరూ చేసేపని అదే. నువ్వేమీ గాభరా పడవోకు అని చెప్పాడు. కంప్యూటర్ భాష అంటే ఏమిటో చెప్పమని అడిగింది. ఏమన్నా అడిగితే  కొడుకులూ కూతుళ్ళూ లెసన్ పీకరు. టూకీగా చెప్పేసి అయిందని పిస్తారు. వాళ్లకి టైం ఉండదు.

అమ్మా ఏ కంప్యూటర్ కైనా తెలిసినవి రెండే రెండు "సున్నా" "ఒకటి". ఆ రెండు అంకెలతో దానికి మనకి కావాల్సిన పని చెప్పి చేయించటం కష్టం. అందుకని కంప్యూటర్ భాషలు సృష్టించారు. అవి మనం మాట్లాడుకునే భాషల్లాగానే ఉంటాయి. మనకేమి కావాలో ఆ భాషలతో  చెబితే  అవి    వాటిని కంప్యూటర్ భాషలో కి మార్చి అర్థమయ్యేటట్లు కంప్యూటర్ కి చెబుతాయి. ఆ కంప్యూటర్ భాషలు అందరికీ నేర్చుకోటం కష్టం కాబట్టి కంప్యూటర్ కి చెప్పటానికి మూగభాషలు, సైన్ భాషలు కూడా  తయారు చేశారు. నువ్వు ఐఫోన్ వాడతావే అది అటువంటిదే. అని చెప్పి అమ్మా నాకింకో ఫోన్ వస్తోందని ఫోన్ పెట్టేశాడు.

కామేశ్వరమ్మకి ఏమి చేయాలో అర్ధం కావటల్లా. ఈ "పైథాన్" అనే  "సైతాన్ " చేతుల్లోనుండి  మొగుడు తన చేతుల్లోకి రావాలని రోజూ పూజలు, ఎక్కువ చెయ్యటం మొదలు పెట్టింది.

The technical names used are Python, Rodeo, Numpy, Pandas, Matplotlib, Jupyter notebook. All others except Rodio comes with Anaconda distribution. Rodeo which is an IDE could be downloaded from the internet.

Saturday, February 10, 2018

140 ఓ బుల్లి కథ ---- పరమేశం పరకాయ ప్రవేశం

కాఫీ తాగి బయట ఎలా ఉందో అని కిటికీ లోనుండి చూస్తున్నాను. వాళ్ళు చెప్పినట్లు అప్పుడే స్నో మొదలయింది. ఒక అడుగు దాకా పడుతుందని చెబుతున్నారు. చికాగో ఎయిర్పోర్ట్ నుండి వెళ్లే ప్లేన్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. లేకపోతే ఈ పాటికి న్యూయార్క్ లో వుండే వాళ్ళం. చూస్తున్నాను పక్కింటి పరమేశం మాఇంటికి ఎందుకో పరిగెత్తుకు వస్తున్నాడు.

పరమేశం, భార్యా పక్కింట్లో ఉంటారు. రిటైర్ అయినవాళ్ళం కాబట్టి సామాన్యంగా రోజూ మా భార్యలు ఉద్యోగాలకి వెళ్లిన తరువాత కలుసుకుంటూ ఉంటాము. భర్త రిటైర్ అయిన తర్వాత భార్యలు వర్క్ కి వెళ్ళి ఏవో నాలుగు రాళ్ళు తెస్తూ ఉంటారు. అదే మాకు తీరిక సమయం. ఎదో పిచ్చాపాటీ, భార్యల గురించీ మాట్లాడుకుంటూ ఉంటాము.

భార్యలు వర్క్ కి వెళ్ళేటప్పుడు, వాళ్ళు వచ్ఛేటప్పటికీ ఏవేం పనులు చెయ్యాలో భర్తలకి చెప్పి వెళ్తారు. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఏదోవిధంగా మానేజ్ చెయ్యచ్చు. అప్పుడొచ్చే స్వేచ్ఛకోసం, ఆ freedom కోసం రోజూ ఎదురుచూస్తూ ఉంటాము. ప్రతి సుఖానీకీ ఏవో బాధలు వెనకాల ఉంటాయని మా తెలుగు మాస్టారు క్లాస్ లో చెబుతూ ఉండే వారు. ఆయన చెప్పే ఉదాహరణలు నేను ఇక్కడ వ్రాసేవి  కాదనుకోండీ. అందుకని సర్ది పెట్టుకోవాలి. ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే మన పెద్ద వాళ్లకి ఎంత ముందు చూపో. వాళ్ళబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు తక్కువ వయస్సు ఉండేలా చూస్తారు. రిటైర్ అయిన తరువాత వాళ్ళ అబ్బాయి, రోజుకి కొన్ని గంటలు అయినా  ఫ్రీగా ఉంటాడని.

తలుపు తీశాను. పరమేశం మొహం దేదీప్య మానంగా వెలిగి పోతోంది. కొత్తగా ఏదో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉన్నాడు. ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఆలాస్యం చెయ్యకుండా అసలు సంగతి చెప్పేశాడు, ఇవ్వాళ బ్లడ్ ప్రెషర్ చాలా నార్మల్ కి వచ్చేసిందని. ఇది నిజంగా సంతోషించ వలసిన విషయం. ఎక్సరసైజ్ లు చేసి, మందులేసుకుని చాలా బాధ పడుతున్నాడు. కొత్త రెగ్యులేషన్ కన్నానా, పాత రెగ్యులేషన్ కన్నానా అని అడిగాను. కొత్త రెగ్యులేషన్ కన్నా అన్నాడు.

ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికాలో ప్రభుత్వం, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చాలా ప్రయాస పడుతుంది. అందుకని మొన్న డాక్టర్లకి కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. బ్లడ్ ప్రెజర్ 130/80 కన్నా ఎక్కువుంటే వాళ్లకి బ్లడ్ ప్రెజర్ ఉన్నట్టని డాక్టర్లకి చెప్పి పేషేంట్స్ ని అల్లా treat  చెయ్యమంది. ఇదివరకు అదే గయిడ్లైన్ 140/90 ఉండేది. లక్షల మంది ఒక్క దెబ్బతో బీపీ పేషంట్స్ అయ్యారు. అమాంతంగా గయిడ్లైన్ ఎల్లా మారిపోయిందో అర్ధం కాదు.

అల్లాగే అర్ధం అవనివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పులని డాక్టర్ దగ్గరకి వెళ్తే, జాయింట్ లో ఎముకలు అరిగి పోయా యని చెబుతారు. ఎందుకు అరుగుతాయి అని అడిగితే పుట్టినప్పటినుండీ నడుస్తున్నావు కదా అంటారు. ఏమి చెయ్య మంటారు అంటే "ఈ మందులు వేసుకుని రోజూ ఎక్సరసైజ్ చెయ్య" అంటారు. ఏమి ఎక్సరసైజ్ అంటే రోజుకి పది వేల అడుగులు నడవ మంటారు. అసలు నడిస్తేనే కదా ఎముకలు అరిగినాయి !  కొందరు అయితే అదేదో 'fit bit ' ట ఒక గడియారం చేతికి పెట్టుకుని అడుగులు లెక్కపెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు.

ఏమిటి పరమేశం ఎదో అన్నావు, మళ్ళా చెప్పు నేను విన్నది నమ్మలేక పోతున్నాను అని అడిగాను. మళ్ళా చెప్పాడు.నేను విన్నది కరెక్టే. బీపీ 103 కి తగ్గిందిట. నాకు నమ్మ బుద్ది కాలేదు. కొత్త బీపీ మెషిన్ కొన్నావా అని అడిగాను. లేదన్నాడు. మందు ఎక్కువ వేసుకున్నావా అని అడిగాను. లేదన్నాడు. డయట్ మార్చావా అన్నాను. లేదన్నాడు.

నాకు ఏమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠత ఎక్కువయింది. ఇవ్వాళ ఒక్క రోజేనా ఆ రీడింగ్ వచ్చింది అని అడిగాను. కాదు నాలుగు రోజులబట్టీ అన్నాడు. ఇంకేమై ఉంటుందని పరమేశ్వరానికి కాఫీ ఇచ్చి ఆలోచిస్తున్నాను.

కాఫీ ని అదేదో అమృతంలాగా తాగుతున్నాడు. ఇవాళ కాఫీ తాగలేదా అని అడిగాను. లేదు నేను లేచేసరికి ఆవిడ వర్క్ కి వెళ్ళిపోయింది అన్నాడు. అటువంటి పరిస్థుతులలో మా ఆవిడ కాఫీ అక్కడ పెట్టి వెళ్లి పోతుంది. అదే అడిగాను. లేదన్నాడు.

 నేను వంట చేశాను లంచ్ చేసి వెళ్తావా అని అడిగాను. తప్పకుండా అన్నాడు. నాలుగు రోజులయింది సరైన భోజనం చేసి అన్నాడు. మీ ఆవిడకి ఈ  బీపీ సంగతి చెప్పావా అని అడిగాను. చెప్పలేదన్నాడు. నా రిసెర్చ్ మైండ్ కి పని చెప్పాను. నాలుగు రోజులబట్టీ బీపీ రీడింగ్ మారింది. నాలుగు రోజులబట్టీ సరీగ్గా భోజనం చెయ్యటల్లేదు.

"డయట్ చేస్తున్నావా " అని అడిగాను. లేదు మేము నాలుగురోజుల కింద పోట్లాడుకున్నాము అన్నాడు.మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారు. అది పెద్ద విషయం కాదు. దాని మూలాన బీపీ పెరుగుతుంది గానీ తగ్గదు. ఇంకా ఏమి జరిగింది అని అడిగాను. అప్పటి నుండీ విడిగా ఇంకో గదిలో పడుకుంటున్నాము  అన్నాడు. ఎందుకు పోట్లాడు కున్నారని నేను అడగలేదు. నాకు అనవసరం. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది.

కాసేపు కళ్ళుమూసుకుని తెరిచి సీరియస్ గా  "పరమేశ్వరం మీ ఆవిడ నీకు బీపీ ఇస్తోంది" అన్నాను. అని నా discovery చెప్పి, నాలుగు రోజుల క్లూ లు చెప్పి ఋజువు చేశాను. నీ బీపీ తగ్గటానికి కారణం విడివిడిగా పడుకోవటం అని ముగించాను. ఇంత పెద్ద నా discovery కి వళ్ళంతా  గగుర్పొడిచింది.

వెంటనే నా మనస్సులో తళుక్ మని ఒక మెరుపు మెరిసింది. ఈ నా డిస్కవరీ ని  మా ఇంట్లో test చెయ్యాలి అని నిర్ణయించు కున్నాను. నాకూ బీపీ ఉంది. మా ఇంట్లో మూడు గదులు ఉన్నాయి విడిగా పడుకోటానికి. త్వరలో ఆవిడ వచ్చే లోపల ఏ విషయం మీద పోట్లాడాలో నిర్ణయించుకోవాలి.

Monday, February 5, 2018

139 ఓ బుల్లి కథ 127 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 8- మనలోని కంప్యూటర్

మన శరీరంలో చాలా ముఖ్యమయిన భాగం మన మెదడు. మనం చేస్తున్నామనుకుని మనం చేస్తున్న పనులన్నీ అది మన చేత చేయించినవే. మనం తీసుకునే చర్యలన్నిటికీ కారణం అదే. అది చర్యలు తీసుకునేందుకు ఉపయోగించిన సమాచారం మన పంచేంద్రియాల నుండి వచ్చినదే. అది మనం చదివినది, చూసినది, విన్నది. మన పరిచయాలూ, చదువులూ, సన్నిహితులూ, మన అనుభవాలూ వేరు కాబట్టి మనం తీసుకునే చర్యలు అందరివీ ఒకటిగా ఉండవు. ఈ క్రింద మనము తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు పొందు పరుస్తున్నాను.

ముఖ్యంగా మన బ్రెయిన్ రెండు భాగాలుగా ఉంటుంది (left ,right ). Left Brain logical thinking
(numbers, words, finding solutions ). Right Brain artistic (colors, shapes, sounds, music and imagination ).

1. మనలో ఉన్న కంప్యూటర్ పేరు మెదడు  (Brain ). ఇది పనిచేయటానికి తోడ్పడే వాటిని న్యూరాన్స్ (neurons ) అంటారు. వీటికి తెలిసినవి రెండే రెండు పనులు. విద్యుత్తుని పంపటం లేక ఊర్కేనే కూర్చోటం. ఒక విధంగా binary code transmitter.

2. తెలివితేటలతో మనం మంచి నిర్ణయాలు తీసుకుంటామని అనుకుంటాము. కానీ ఆపనులు చేసేది మన బ్రెయిన్. బ్రెయిన్, తాను దాచి పెట్టుకున్న సంబంధించిన సమాచారాన్ని బయటికి తీసి విచారించి తీర్పు (decision) చెబుతుంది. దానిలో దాచిపెట్టిన సమాచారం ఎక్కడినుండో రాలేదు. మన మిచ్చినదే. మన చదువు, అనుభవాల మీద దానికి  ఇచ్చినదే. మనకన్నా ఎక్కువ చదివిన వారు, అనుభవజ్ఞులు ఇంకా మంచి decisions తీసుకో గలరేమో. అందుకనే మన నిర్ణయాలు ఎప్పుడూ ఒకటిగా ఉండవు.

3. మన అవయవాలతో పని చేయించాలన్నా మెదడే చెయ్యాలి. అందుకనే దానికి శక్తి  నిచ్చే మంచి ఆహారం కావాలి. మన బ్రెయిన్ బరువు, మన బరువులో 2% (షుమారు 3 pounds , 1.4 kilos )అయినప్పటికీ మనము తిన్న ఆహారంలో 20% శక్తిని తీసుకుంటుంది. దీనిలో మూడు వంతులు నీళ్ళు. అందుకని నీళ్ళు ఎక్కువగా తాగాలి.

4. మన మనస్సు లో ఉన్న కంప్యూటర్ స్టోరేజ్ 100,000 gigabytes. దీనికి కారణం మనలో ఉన్న 100 బిలియన్ neurons (brain cells). మనలో ఉన్న neurons కలిసి కట్టు గా పని చెయ్యటం మూలంగా అంత స్టోరేజ్ వస్తుంది.

5. పంచేంద్రియాల ద్వారా మనమిచ్చే సమాచారాన్ని కలిసికట్టుగా neurons దాస్తాయి. దీనినే Neural Network అంటారు. ఒకటే సమాచారం ఎక్కువ సార్లు వస్తే అది ముఖ్యమని గమనించి ఆ దాచి పెట్టుకున్న చోటుని పఠిష్టం చేస్తుంది. Text Book ఎన్ని సార్లు చదివితే అంత గుర్తు ఉంటుంది. చిన్నప్పుడు వల్లెవేస్తాము కాబట్టి, మనకి ఎక్కాలు ఎప్పటికీ గుర్తుంటాయి.

6. మన శరీరం అంతా వ్యాపించిన ఈ Neural Network (Nervous System ) పొడుగు 93,000 మైళ్ళు (150,000 kilometers ). భూమిని మూడు సార్లు చుట్టేసినట్లు అన్న మాట. Earth circumference  29000 miles (40000 kilometers ).

7. మనలోని Neural Network (Nervous System ) విద్యుత్ తో పని చేస్తుంది. న్యూరోన్ లో నుండి ప్రవహించే విద్యుత్ 0.1 volts ఉంటుంది.

8. మనం పుట్టిన మొదటి సంవత్సరములో అనుభవాలూ ఆలోచనలూ పెరగటంతో,  మన బ్రెయిన్ మూడు రెట్లు పెరుగుతుంది. వయస్సు పెరుగుతుంటే మన అనుభవాలని బట్టి neurons మధ్య connections పెరుగుతాయి. పెద్దయిన కొద్దీ కొన్ని connections గట్టి పడతాయి , కొన్ని connections మూత పడతాయి.

9. మన ముక్కునుండి వచ్చే సమాచారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ సమాచారం క్రోడించే చోటు మన ఫీలింగ్స్ ని కూడా process చేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని వాసనలు కొన్ని కొన్ని అనుభూతులని గుర్తు చేస్తాయి. మల్లెపూలు పట్టెమంచం వగైరా .

10. మన మెదడు కొన్ని పనులను (గుండె కొట్టుకోటం వగైరా ) దానంతట అదే  చేస్తుంది. మిగతావి మనం కల్పించుకోవాలి. మనం నడుద్దామని అనుకున్నా మానుకోండి, మెదడులో motor విభాగంలో విద్యుత్ మొదలవుతుంది. అది నరాల ద్వారా కాళ్లకు వచ్చి, కండరాలని కదల్చటం మూలంగా మనం నడవ గలుగు తున్నాము. ఈ సమయం కొద్ది అయినప్పటికీ, అనుభవంలో తేలికగా కనపడుతుంది. మనం 40 మైళ్ళ (64 km /h ) స్పీడ్ లో డ్రైవ్ చేస్తుంటే మనం బ్రేక్ వెయ్యాలని బ్రేక్ వేస్తే 79 ft (24 m ) వెళ్ళిన తర్వాత గానీ కారు ఆగదు. దీనికి కారణం మనం మనస్సులో అనుకున్న సంకేతం (బ్రేక్ వెయ్యాలి) కాలి లోని కండరాలకు వెళ్ళి బ్రేక్ వేయాలి కదా !  టైం తీసుకుంటుంది.

11. మెదడు పంపించే signals గంటకి 270 miles (435 kilometers ) వేగంతో ప్రయాణిస్తాయి.

12. మన మెదడుని సరీగ్గా చూసుకుంటే , మానసిక వ్యాధులను దగ్గరకు రాకుండా చేసుకోవచ్చు. మన మెదడు లో మూడు వంతులు నీరు. అందుకని మంచినీరు తప్పకుండా తీసుకోవాలి (కనీసం 6 గ్లాసులు (8oz glass ). సమీకృతాహారం ముఖ్యం. మెదడుని ఊర్కేనే కూర్చో పెట్టకుండా పనులు కల్పించి చేయించాలి. ఎప్పుడూ మెదడుకి మేత వేస్తూ ఉండాలి. రాత్రి పూట విరామం చాలా ముఖ్యం. దానికి కూడా విశ్రాంతి కావాలి కదా.

13. మనము ఎప్పుడూ మంచి సంగతులు తలుచు కుంటూ ఉంటే అవి మనసులో నిలిచి పోతాయి. మనం చాలా కాలంగా తలుచుకోని సంగతులు మాయమవుతాయి. కానీ మనకి చాలా బాధని గుర్తు చేసే సంగతులు అలా మనసులో ఉండిపోతాయి. Safety mechanisms ఏమో. మళ్ళా అవి మనకు జరగకుండా ఉండాలని గుర్తు పెట్టుకుంటుందేమో.

మాతృక:
Your Brain
Understanding with Numbers.(2014)
Melanie Waldron
RAINTREE, Chicago, Illinois

Tuesday, January 23, 2018

138 ఓ బుల్లి కథ 126 ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part 7--Executive Brain

జుబీన్ మెహతా symphony conduct చేస్తున్నారంటే వెళ్ళి చూడాలని ఎంతమందికో కోరిక ఉంటుంది. చేతితో పట్టుకున్న కర్రని తిప్పుతూ orchestra తో స్వరాలని మేళవిస్తుంటే మనో రంజకంగా ఉండి తన్మయత్వంలో మునిగిపోతాము. కర్ర తిప్పుతూ అన్ని వాయిద్యాలనీ సమయ స్ఫూర్తి తో సంకలనం చేయించి మధుర స్వరాలను మిళితం చెయ్యటం symphony conductors కే సాధ్యం.

మన తలలో Prefrontal Cortex అనేది మెదడు పై భాగంలో ఉంటుంది. ఇది జుబిన్ మెహతా (Zubin Mehta ) కర్ర పెత్తనం లాగా బుర్ర పెత్తనం చేస్తుంది. మన పంచేంద్రియాల నుండీ
సేకరించిన సమాచారం అంతా దీని అందుబాటులో ఉంటుంది. అందుకని మన జీవన ప్రణాళిక లో వాయిద్యాలు వాయించేది ఇదే. మన చేత పనులు చేయించేది ఇదే. జుబిన్ మెహతా కర్ర తిప్పి symphony వాయిద్యాలనుండి చక్కటి సంగీతం రాబట్టి నట్లే, మన అవయవాలకి సరి అయిన సమయంలో సరి అయిన సౌజ్ఞలు పంపి పని చేయిస్తుంది. అందుకనే దీనిని Executive Brain అన్నారు.

కర్ర తిప్పటం చాలా తేలికగా కనపడుతున్నప్పటికీ, ఎంత ఇష్ట మున్నా ఆ పని మనం చేయలేము. ఇందుకు కారణం నేర్చుకోటానికి ఆయన పడ్డ శ్రమ మనం పడలేదు. ఇంకో విధంగా చెప్పాలంటే మన మెదడులో ఆ సమాచారం లేదు. సమాచారం లేనప్పుడు ఎల్లా ప్రయత్నిస్తాము. మన మెదడులోకి సమాచారం చేరాలంటే ఒకే మార్గం, మన పంచేంద్రియాలు. మనలో సమాచారణ సేకరణ వాటి ద్వారానే. చదువులు ఆటలు పాటలు సాన్నిహిత్యం వీటన్నిటి నుండీ సమాచారణ సేకరణ జరుగుతుంది. పై బొమ్మలో చూడండి సేకరించిన సమాచారం మన మెదడులో ఎక్కడ దాచి పెట్ట బడుతుందో. సరి అయిన సమాచారం లేకుండా కర్ర తిప్పుతానంటే నవ్వుల పాలవుతాము.

సమాచారం ఉందిపో, వాటిని కాచి వడబోసి చిలకరించి నిర్ణయాలు తీసుకుని అవయవాలకు ఆజ్ఞలను పంపించాలి. Prefrontal Cortex చేసే పని ఇదే. మన అవయవాలకు ఆజ్ఞలు పంపించాలంటే ఒకటే మార్గం, ఆ అవయవాలకు సమాచారం చేరవేసే మార్గం ఉండాలి అదే  neural network. సరి అయినా సమయంలో enzymes, neurotransmitters కలిసి పని చేయటం మూలంగా సంకేతాలు మన శరీరంలో ఒక చోటునుండి ఒక చోటికి వెళ్తాయి.

Neural Network పనిచేయాలంటే దానికి కావలసిన enzymes, neurotransmitters  సరీగ్గా తయారు అయి ఉండాలి. ఇవన్నీ సరీగ్గా ఉంటే అవయవాలకు వెళ్ళే విద్యుత్ సంకేతం తయారు అయి న్యూరల్ తీగల్లో (నరాలు) ఆయా అవయవాలకు చేరి వాటి చేత పనులు చేయిస్తుంది(మాట్లాడటం,నడవటం మొదలయినవి).

మన ఇంట్లో విద్యుత్ తీగల మీద ఉండే ప్లాస్టిక్ లాగానే శరీరంలో neural తీగల మీద Myelin  (ఒక విధమయిన fat ) పూత ఉంటుంది. ఇది సరీగ్గా లేకపోతే సిగ్నల్ వెళ్ళదు. మనం మాట్లాడాలన్నా, చేతులతో పనిచేయాలన్నా, నడవాలన్నా ఇంత తంతు జరుగుతుంది.  మానసిక జబ్బులన్నిటికీ కారణం సంకేతాలు సరీగ్గా తయారు కాకపోవటం లేదా  తయారు అయిన సంకేతాలు గమ్యానికి చేరకపోవడం. అందుకని మనం చెయ్యాల్సిన పని శరీరానికి  అవసరమైన పదార్ధాలు తయారు చేసుకోటానికి కావలసిన మూల పదార్ధాలు అందించటమే.

శరీరంలో ఎంజైమ్స్ హార్మోన్స్ సరీగ్గా తయారు అవ్వాలంటే, 20 amino acids కావాలి. మన శరీరం 11 మాత్రమే తనంతట తాను తయారు చేసుకో గలదు. మిగతా 9 మనం తినే ఆహారం నుండి రావాలి. వీటిని essential amino acids అంటారు.  మాంసాహారం తినేవాళ్ళకి అవన్నీఒక దాని లోనే లభ్యమవుతాయి కానీ శాకాహారులు మాత్రం అన్నీ ఒక చోట లేక, వివిధ పదార్ధాలు తినవలసి వస్తుంది. కొత్తగా  కీన్వా ధాన్యం(Quinoa) లో essential amino acids అన్నీ ఉన్నాయని తెలుసుకున్నారు. అందుకని శాకాహారులు కొద్దిగానైనా కీన్వా  తినటం మంచిది.

మన శరీరంలో విద్యుత్ తయారు సోడియం (Na), పొటాషియం (K), కాల్షియం (Ca), క్లో రీన్(Cl)
అయాన్లు(ions) neural membrane లో నుండి అటు ఇటూ కదలికల మూలంగా జరుగు తుంది. అందుకని ఇవి చాలా ముఖ్యం. అల్లాగే మెగ్నీషియం కూడా ముఖ్యమని గమనించారు. వాటికి తగిన ఆహార పదార్ధాలు తినటం చాలా మంచిది.

అల్లాగే myelan కరిగి పోవటం మూలంగా electrical signals చేరవలసిన చోటికి చేరవు. మరీ fat తగ్గాలని పూర్తిగా fat తినటం మానేయటం మంచిది కాదేమో.

పై చెప్పిన విషయాలు గమనిస్తూ పౌష్టిక సమీకృతాహారం తిన గలిగితే మనలోని ఎగ్జిక్యూటివ్ బ్రెయిన్ చేత సరిఅయిన పనులు చేయించు కోవచ్చు.

మాతృక:
The New Executive Brain (2009)
Frontal Lobes in a complex world
By Elkhonon Goldberg, Ph D
OXFORD Press.