Tuesday, March 19, 2019

150 ఓ బుల్లి కథ ---- పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి

"నాకు ఇష్టంలేని పాత సంగతులు గుర్తుకు వస్తున్నాయి,ఏమి చేయమంటావు? " అన్న పరమేశానికి ఏమి చెప్పాలో అర్ధం కాలా.

'ఆ ఆలోచనలు వచ్చినప్పుడు బాధగా ఉంటుంది కదూ" అన్నాను.

"పరమేశం మన మనస్సు ఒక కంప్యూటర్ లాంటిది. దానికి మనం వినేది చూసేది చేసేది అన్నీ తెలుసు. కొన్ని గుర్తు పెట్టుకుంటుంది కొన్ని గుర్తుపెట్టుకోదు  " అన్నా.

"మనకు ఇష్టం లేనివే ఎందుకు గుర్తుకు వస్తుంటాయి " అన్నాడు.

" మనం అటువంటి పనులు మళ్ళా చెయ్యకుండా" అన్నాను.

"మనస్సులోకి ఆ ఆలోచనలు రాకుండా ఏమన్నా చేయగలమా" అన్నాడు.

"ఎక్కడో చదివినట్టు గుర్తు. మనస్సు కంప్యూటర్ లాంటిది కాబట్టి, ఆ ఇష్టంలేని ఆలోచనలు వచ్చినప్పుడు డిలీట్ డిలీట్ అను. ఆ ఆలోచనలు మనస్సు నుండి తొలగి పోతాయి."

"మనస్సులో కంప్యూటర్ కి డిలీట్ అంటే తెలుస్తుందా" అన్నాడు.

"ఎందుకు తెలీదు. మనం కీ బోర్డు మీద డిలీట్ బట్టన్ నొక్కుతున్నాము. డిలీట్ అంటే దానికి తెలుసు. Alexa weather అంటే Alexa  weather చెప్పటల్లా, అల్లాగే మనస్సుకి ఒక ముద్దుపేరు పెట్టుకుని పిలిచి డిలీట్ డిలీట్ అను".

"పనిచేస్తుందా" అన్నాడు

"పనిచేస్తే పనిచేస్తుంది లేకపోతే లేదు. పని చెయ్యక పోతే మన ఋషులు చెప్పే మెడిటేషన్ (ధ్యానం) మొదలెట్టు.తప్పకుండా పనిచేస్తుంది."

"అదెందుకు పనిచేస్తుంది?"

"ధ్యానం చేసేటప్పుడు దాని మీదే మనస్సు నిలబెట్టాలి ". "అంటే మనస్సులో ఆలోచినలు అటూ ఇటూ పోకుండా ఒక దాని మీదే నిలబడి ఉంటుంది"

"అయితే"

"సముద్రపు ఒడ్డునున్నావనుకో అలలు వస్తూ హోరు వినిపిస్తుంది ". "ఒక క్షణం అలలు రాకుండా ఉన్నప్పుడు ఉండే ప్రశాంతత నీవు నమ్మలేవు"

"నిజమే"

"మనస్సులో ఆలోచనలు అల్ల కల్లోలంగా అలలు లాగా వస్తూ ఉంటాయి. మనస్సుని ఒకే ఆలోచన (ధ్యానం) మీదే నిలబెట్టావనుకో ఆ ఆలోచినలు నిలిచిపోతాయి"."అదే మనకు కావాల్సింది"

"ధ్యానం చేసే దెల్లాగూ ?"

"పల్లా కొండలరావు గారు వారి బ్లాగ్ పోస్ట్ లో ధ్యానం మీద వారికి నచ్చిన వీడియో పోస్ట్ చేశారు.
http://blog.palleprapancham.in/2019/03/blog-post_19.html
అదే నాకు నచ్చింది కూడా. అదే నేను ఇక్కడ ఇస్తున్నాను. పరమేశం ఆ వీడియో చూసి ధ్యానం ఎల్లా చెయ్యాలో నేర్చుకో".





మన మెదడు లో ఉన్న కంప్యూటర్ గురించి Waldon Melanie వ్రాసిన పుస్తకం నుండి ముఖ్య విషయాలు ఈ క్రింద ఇస్తున్నాను:
The following information about brain is taken from the book:

Your Brain Understanding with numbers (2014)
Waldron, Melanie
Raintree, Chicago Illinois, USA

Remember, Your one amazing brain:

1. Has about 100 billion brain cells and is 75 per cent water.

2. Stores about 100,000 gigabytes worth of memories

3. Uses 20 per cent of your energy

4. Is connected to around 93,000 miles (150,000 kilometers) of nerves in your body

5. Sends messages around your body at upto 270 miles(435 kilometers) per hour

6. Sees, hears, smells, tastes, and feels for you

7. Keeps your heart pumping and your lungs breathing

8. Rests while you sleep.

Wednesday, January 30, 2019

149 ఓ బుల్లి కథ ---- మా ఊళ్ళో "Polar Vortex"




లేక్ మిచిగన్ --చికాగో 
                                       
అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో చలికాలం ఎప్పుడూ స్నో పడుతూ చలిగా ఉంటుంది. ఇది మామూలే. చలికాలమైనా సామాన్యంగా అన్ని పనులూ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. కానీ కొన్ని సంవత్సరాలు చల్లగాలులు నార్త్ పోల్ నుండి వీచి జీవితాన్ని అస్త వ్యస్తం చేస్తాయి. కాకపోతే ఎప్పుడు వస్తాయో ముందరే తెలుస్తుంది. కాబట్టి ముందర జాగర్త పడటానికి వీలుంటుంది. బుధవారం చలిగాలులు (Polar Vortex ) వస్తాయని చాలా రోజులబట్టీ చెబుతున్నారు. చాలా తీవ్రంగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

బుధవారం గాలులు వస్తున్నాయంటే ముందు రోజులనుండీ స్నో పడుతూ ఉష్ణోగ్రత తగ్గి పోతూ ఉంటుంది. ఒక వారానికి ఇంటికి కావాలసిన కూరగాయలూ అవీ మొన్న ఆదివారం కొనుక్కున్నాము.మంచిదయింది. ఆదివారం నుండీ స్నో పడటం మొదలయితే, మూడు సార్లు స్నో తీయవలసి వచ్చింది. స్నో తీయకపోతే గారేజ్ లోనుండి కారు తియ్యలేము ఎక్కడికీ వెళ్ళటానికీ వీలుండదు. మేము ఒకళ్ళని పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చి తీసి వెళ్తారు. బయట వీధుల్లో మునిసిపాలిటీ వాళ్ళు వచ్చి స్నో తీస్తారు. అందుకనే ఇంటావిడ మంగళవారం పనికి వెళ్ళటానికి వీలయింది. ఆవిడ దగ్గరలో లైబ్రరీ లో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతీ లైబ్రరీలో కంప్యూటర్ లు ఉంటాయి. మనం ఉపయోగించు కోవచ్చు. ఉపయోగించటం కష్టమయితే ఈవిడ సలహాలు ఇచ్చి సులభతరం చేస్తుంది.

మేము ఆదివారం నుండీ బుధవారం వచ్చే చలిగాలులు ఎదుర్కోటానికి ఇంట్లో సన్నాహాలు చేస్తున్నాము. కరెంటు పోవచ్చు, ఫ్లాష్ లైట్లు దగ్గర పెట్టుకున్నాము. పైపుల్లో నీళ్లు గడ్డకట్టుకు పోవచ్చు. ఇంట్లో పైపుల్లో నుండి ఎప్పుడూ సన్నగా కారుతూ ఉండేటట్టు చూసుకున్నాము. ఇల్లా చేసుకుంటే పైపుల్లో నీళ్ళు గడ్డకట్టవు. కొన్ని ఏళ్ళ క్రిందట వేడి నీళ్ళ పైపు లో నీళ్ళు గడ్డకట్టుకు పోయాయి. అదొక నరకం. మా అదృష్టం బాగుండి అది వేడి నీళ్ళ పైపు అయింది, చన్నీళ్ళు పట్టుకుని కాచుకుని స్నానాలు చేశాము. ఇంట్లో వేడి గాలులు వచ్ఛే furnace ని కంట్రోల్ చేసే దానికి బ్యాటరీస్ కావాలి అవి కొత్తవి మార్చుకున్నాము. Furnace గ్యాస్ తో పని చేస్తుంది.ఇంట్లో విద్యుత్ తీసుకుని వేడిగాలులు ఇచ్చేవి కూడా ఉన్నాయి.

మంగళవారం నుండీ ఈదురు గాలులు కొట్టటం మొదలెట్టాయి. బయట ఉష్ణోగ్రత పడిపోతోంది. మా ఆవిడ మూడు పొరల దుస్తులు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఉద్యోగానికి వెళ్ళింది. ముందరే ఆఫీసులు మూసేస్తే సాయంత్రానికల్లా ఇంటికి వచ్చింది. నేను ప్రతీ బుధవారం మా ఊరి లైబ్రరీలో ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్లకి ఇంగ్లిష్ మాట్లాడటం నేర్పుతాను. కానీ ఇవాళ బయట చలిగా ఉందని ఎగగొట్టాను.

బుధవారం పొద్దున చూస్తే బయట ఉష్ణోగ్రత -24F (-31C) (0C దగ్గర నీళ్లు ఐస్ గ మారుతుంది) . కాఫీ తాగి వంట చేసుకుని మధ్యాహ్న భోజనం చేశాము. ఇవాళ స్పెషల్ కూర కాలీఫ్లవర్ + రెడ్ బెల్ పెప్పర్. బయట నర సంచారం లేదు. నేనయితే పడుకుని నిద్రపోయాను. లేచిన తరువాత నాకెందుకో దోశెలు తినాలని పించింది. రెండు దోశెలు తిన్నాను. కాఫీ చేద్దామని ప్రయత్నిస్తే సరీగ్గా రాలేదు. బయట ఎండ బ్రహ్మాండంగా ఉంది. పోస్ట్ వెయ్యాలనిపించి, మా యింటి ముందర, వెనకాల ఫోటోలు తీసి వ్రాయటం మొదలెట్టాను. ఫొటోలు ఇంట్లో నుండే తీశాను. సరయిన బట్టలు లేకుండా బయటికి వెళ్తే వంట్లో ఏ భాగానికి ఆభాగం ఊడి వస్తుంది. ఊళ్ళో నీళ్ళ గొట్టాలు బద్దలయినట్లు, చాలా ఇళ్లల్లో పైపులు ఫ్రీజ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని ఆఫీసులకీ ఇవాళ రేపుశలవు లిచ్చారు. ప్లేన్లు కూడా చాలా వరకు నడవటల్లేదు.రైళ్లు వెళ్ళటానికి పట్టాల మీద మంటలు పెట్టారు.సాయంత్రం అయ్యింది. చీకటి పడింది.ఇప్పుడు బయటి ఉష్ణోగ్రత -18F (-28C). రేపటికి ఉష్ణోగ్రత పెరుగుతుంది. శనివారం నాటికి 40F వస్తుందిట. అంటే ఆ రోజు మాకు శీతా కాలంలో వేసవి రోజు.

పైన మొదటి ఫోటో మా ఇంటి ముందరది. రెండవ ఫోటో మా ఇంటి వెనకాలది. వీటిల్లో తెల్లగా కనపడుతున్నది గడ్డకట్టిన స్నో. మధ్యాహ్నం ఎండ బాగా ఉంది. మా చెట్ల నీడలు ఫొటోలో కనపడుతున్నాయి. రోడ్లమీద స్నో తీశారు కానీ పై పొర అతుక్కుని ఉంది. దానిమీద డ్రైవ్ చెయ్యాలంటే గాజు మీద డ్రైవ్ చేసినట్లే. జారుతూ ఉంటుంది. చాలా జాగర్తగా చెయ్యాలి. మూడవ ఫోటో రైళ్లు పట్టాలు తప్పకుండా Switches ఫ్రీజ్ కాకుండా ఉండటానికి మంటలు వేసిన ఫోటో. చివరి ఫోటో చలి లో గడ్డకట్టిన చికాగో లోని లేక్ మిచిగన్.

మేము అమెరికాలో అరోరా అనే ఊళ్ళో ఉంటాము. ఇది చికాగోకు పశ్చిమంగా 35 మైళ్ళ దూరంలో ఉండే చిట్ట చివరి సబర్బ్.

99 ఓ బుల్లి కథ 87 --- ఆర్కిటిక్ వింటర్ లో ఓ రోజు

Monday, November 26, 2018

148 ఓ బుల్లి కథ ---- అమ్మా మాయమ్మా

"అమ్మా మాయమ్మా అని నే పిలచితే నాతో మాట్లాడరాదా  (నీ కిది) న్యాయమా మీనాక్షమ్మా"
"సరసిజ భవహరి హరనుత సులలిత నీ పదపంకజముల స్థిరమని నమ్మితి నమ్మితి నమ్మితి"

నాకు చిన్నప్పుడు సంగీతమంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ రోజూ ఏవో పాటలు పాడుతూ నే ఉండేది. మా తాతయ్య రోజూ తెల్లవారు ఝామున పాటలు పాడేవాడు.  గుడికెళ్ళినప్పుడల్లా మా అమ్మక్కయ్యా మా అమ్మ తప్పకుండా గుళ్ళో పాటలు పాడే వారు. అల్లాగే పెళ్ళిళ్ళల్లో కూడా భోజనాలు చేసిన తర్వాత అందరూ కూర్చుని పాడేవాళ్ళు. ఇలా సంగీతం తో పెరిగినా  నా కెందుకో సంగీతం మీద పెద్ద మక్కువ రాలేదు. కాకపోతే బుద్ధిమంతుడి లాగా మాట్లాడకుండా వినేవాడిని.

సంగీతం మీద నా ఇష్టా ఇష్టాలన్నీ ఒక రాత్రితో తారుమారు అవుతాయని  నేను అనుకోలేదు. నేను అప్పుడు 5th ఫారం అనుకుంటా రేపల్లె లో చదువుతున్నాను. ఒక రోజు మాయింటికి శ్రీనివాసన్ గారు వచ్చారు. రాత్రికి ఎవరింట్లోనో పెళ్ళిలో ఆయన పాట కచ్చేరీ. (1950's లో బాలమురళీకృష్ణ  గారు విజయవాడ రేడియో నుండి పొద్దునపూట "భక్తిరంజని " కార్యక్రమం చేసేటప్పుడు, దానిలో శ్రీనివాసన్ గారు పాల్గొనే వారు.ఆయన గుంటూరు Indian Bank లో పని చేసే వారు.)

రాత్రికి  శ్రీనివాసన్  గారి పాట కచ్చేరీ కి మా నాన్న గారితో పాటు నేనూ వెళ్ళా ను. పిల్లాడినని నాకు పక్కవేసి పరుపు వేసి పడుకో మన్నారు. నేను పౌరుషంతో పడుకోలేదు. రాత్రి ఒంటి గంట దాకా పాట కచేరి వింటూ మూడు గంటలు అలాగే మేల్కొని కూర్చున్నాను.

తెలిసిన పాటలే. తెలిసిన రాగాలే. అమ్మ పాడుతుంటేనూ తాతయ్య పాడుతుంటేనూ విన్నవే. మూడు గంటలు వరసగా కూర్చుని విన్న తర్వాత ఎందుకో వాటిమీద ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం రాను రాను పెరగటం తప్పితే తరగలేదు. యూనివర్సిటీ లో దుర్గా ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సుందరరామ శర్మ, కృష్ణారావు(voilin ) ల పరిచయాలు కూడా దీనిలో ఒక కారణం కావచ్చు. వాళ్ళు పాట వింటూ ఏ రాగమో చెప్పే వాళ్ళు. నాకు ఇప్పటికీ అది చేత కాదు.

అప్పటినుండీ ఎప్పుడు శాస్త్రీయ సంగీతం విన్నా మనసంతా ఒక విధంగా అయిపోతుంది. తన్మయత్వం అంటే అదేనేమో. నా ఉద్దేశంలో అది ఒక Neural Resonance. అదో చెప్పలేని అనుభూతి. మీకు కూడా ఆ తన్మయత్వం తో ఆ అనుభూతి కలిగించాలని నా ప్రయత్నం.

ఈ క్రింది వీడియో IndianRaga Labs లో సభ్యుడు లలిత్ సుబ్రమణియన్ పాడిన, శ్యామ శాస్త్రి విరచిత "అమ్మా మాయమ్మా ". ఇది విన్న తరువాత మీకూ శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కలగవచ్చు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పాలేము! అదొక మరువరాని అనుభూతి. శాస్త్రీయ సంగీతం వింటున్నప్పుడు దానిలోకి వెళ్ళి పోయి వేరొక ఆలోచనలు దగ్గరకు రాకుండా మనసుల తలుపులు మూసేస్తాము. అదొక Yoga , అదొక Meditation.

The timeless classic 'Mayamma' in the rare and beautiful Ragam Ahiri rendered by 2015 IndianRaga Fellow Lalit Subramanian.


Monday, November 12, 2018

147 ఓ బుల్లి కథ ---- బ్రోకలీ కూర (Broccoli Curry )


ఎప్పుడో కొన్నేళ్ల క్రిందట సురేష్ బాబు, బ్రోకలీ హైదరాబాద్ లో దొరుకుతోంది "బ్రోకలీ కూర" చెయ్యటం గురుంచి ఒక పోస్ట్ పెట్టమన్నారు. ఆయనకి email ద్వారా చెప్పటం జరిగింది గానీ పోస్ట్ పెట్టటం ఇప్పటికి గానీ కుదరలేదు. బ్రోకలీ cruciferous vegetables ఫ్యామిలీ లోది. అందుకని ఆరోగ్య పరంగా దీనికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమయినది కేన్సర్ ని తగ్గించే గుణం. ఆకు పచ్చగా ఉండే కూరలు వంటికి చాలా మంచివి. ఈ ఫామిలీ లో క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ తో కూర చెయ్యటం గురుంచి ఇదివరలో పోస్ట్ పెట్టాను.

కూర మొదలెట్టే ముందు ఒకటి రెండు పనులు ముందర చెయ్యాలి. ఒక గంట ముందు రెండు స్పూన్ల  పెసర పప్పు (moong dal ) నీళ్ళల్లో నాన  వెయ్యాలి. బ్రోకలీ నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి (కాడలు కూడా వాడ వచ్చు). అమెరికాలో మీకు కావాలంటే బ్రోకలీ ముక్కల పాకెట్, 15oz సైజులో  frozen section లో దొరుకుతుంది.


కావలసిన పదార్ధాలు:
1. వంట నూనె -- రెండు టేబుల్ స్పూనులు. (నేను వాడేది ఆలివ్ ఆయిల్ మీడియం హీట్)
2. మినపపప్పు  -- 1/2 టీస్పూన్
3. మెంతులు  -- ఆరు గింజలు
4. జీలకర్ర -- 1/2 టీస్పూన్
5. ఆవాలు -- 1/2 టీస్పూన్
6. ఎండుమిరప -- ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా చెయ్యాలి )
7. పసుపు -- చిటికెడు
8. ఇంగువ -- చిటికెడు

9. నాన పెట్టిన పెసరపప్పు -- 1/2 స్పూన్

10. బ్రోకలీ ముక్కలు -- 15oz (3 కప్పులు)

11. ఉప్పు -- 1/2 స్పూన్

ఈ కూర చెయ్యటం చాలా తేలిక:
1.ఒక బాణీ లో నూనెవేసి కాగిన తరువాత తిరగమాత వేయాలి (1--8 స్టెప్స్).
   తిరగమోత మాడ్చ వద్దు.
2. నానిన పెసరపప్పు వేసి ఒకనిమిషం కలియపెట్టాలి.
3. పోపులో బ్రోకలీ ముక్కలు , ఉప్పువేసి కాసిని నీళ్ళు జల్లి మూత బెట్టాలి .
4. షుమారు 15 నిమిషాలకి నీళ్లంతా పోయి ముక్కలు ఉడికి కూర తినటానికి తయారు అవుతుంది.




ఈ కూరకి నేను ఉపయోగించే చిట్కాలు:
1. Frozen 15oz బ్రోకలీ పాకెట్ కొంటాను.
2. ముందుగా బ్రోకలీ ముక్కలని pressure cooker లో 3 నిమిషాలు స్టీమ్ చేస్తాను.(ఒక విజిల్ దాకా అనుకోండి). దీని మూలంగా బ్రోకలీ త్వరగా ఉడికి, కూర త్వరగా తయారు అవుతుంది.
3. అసలు బ్రోకలీ ఉడకపెట్టి ఉత్తగా కూడా తినవచ్చు.


వంటలకు సంబంధించిన నా ఇతర పోస్టులు:

70 ఓ బుల్లి కథ 58 --- కేన్సర్ -- రిస్క్ తగ్గించే మంచి కూరలు

87 ఓ బుల్లి కథ 75 --- అవకాడో ముక్కల పచ్చడి

123 ఓ బుల్లి కథ 111--- బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ కూర

Broccoli compound targets key enzyme in late-stage cancer

Tuesday, October 30, 2018

146 ఓ బుల్లి కథ -- నైట్ అవుట్ ఇన్ మెన్హాటన్



న్యూయార్క్ దరిదాపుల్లోకి వెళ్ళినప్పుడల్లా మెన్హాటన్ కి వెళ్ళటం ఒక అలవాటై పోయింది. మెన్హాటన్ డౌన్ టౌన్ న్యూయార్క్. న్యూయార్క్ కి "Town never sleeps " అనే పేరుంది. మనకు అవసరాలకు కావలసిన కూరగాయాల నుంచీ హెయిర్ కట్ దాకా ఎప్పుడూ ఎక్కడో ఒక షాపు తెరిచే ఉంటుంది. ఇక్కడ బ్రాడ్వే వీధి నాటకాలకి ప్రసిద్ధి. మేము వచ్చినప్పుడల్లా ఎదో నాటకానికి వెళ్ళి రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి వెళ్తాము. కాకపోతే కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు. ఇంతదానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చిందే అని బాధ పడాల్సి వస్తుంది. ఒకరోజు రాత్రి సినీమా అయిన తరువాత (ఆదో పెద్ద గాథ ) ఆకలయి రెస్టారంట్ కోసం చూస్తే ప్రతి చోటా జనం క్యూ లో నుంచున్నారు. చివరికి ఒక "వేగన్" రెస్టారెంట్ లో సీట్లు దొరికాయి. నిజంగా చెప్పాలంటే పచ్చ గడ్డి పెట్టి వంద డాలర్లు తీసుకున్నాడు. అందుకనే ఈ రోజు భోజనం చేసి బయలుదేరాము.

ఈ తడవ "LA LA Land " అనే సినిమాకి వెళ్ళాము. ఈ సినీమాకి oscars లో తప్పు చదవటం మూలంగా ఒక క్షణం "Best Picture " అయింది. అబ్బాయి మమ్మల్ని సినిమా హాల్ దగ్గర దింపి, మన పేరు మీద సీట్లు రిజర్వ్ చేశాను టిక్కెట్స్ తీసుకోండి అని కారు పార్క్ చెయ్యటానికి వెళ్ళాడు. నాకు ఎప్పటినుండో కోరిక, టిక్కెట్లు, రిజర్వ్ డ్  కౌంటర్ దగ్గర తీసుకోవాలని, పెద్ద వాళ్ళలాగా ఫీల్ అవ్వచ్చు. సామాన్యంగా ఎడ్వన్చెరస్ పనులకి మా ఆవిడని పంపిస్తూ ఉంటాను. ఆవిడ ఎడ్వన్చెరస్ అని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మొగుడు తాళి కట్టి అమెరికాకి వెళ్తే, మూడునెలల తరువాత తను వీసా పుచ్చుకుని అమెరికా వంటరిగా వచ్చింది. ఇది నలభై ఏళ్ళ క్రిందటి మాట. అప్పుడు ప్లేన్లు అమెరికాకి అంచెలంచెలుగా వచ్చేవి. వస్తూంటే మధ్యలో పారిస్ లో ప్లేన్ ఆగిపోయింది "mechanical failure ". సరే అది బయల్దేరి మర్నాడు న్యూయార్క్ చేరేముందర న్యూయార్క్ airport (Kennedy ) లో బస్సు హైజాక్ చేసి రన్వే మీద పెడితే ప్లేన్లు లాండ్ అవటం గొడవయింది. ఇంకొకటి, ఒక ఇరవై ఏళ్ళ క్రిందట దేశం కాని దేశం హాంకాంగ్ లో subway టిక్కెట్లు కొనుక్కురమ్మని పంపించాను. విజయవంతంగా తీసుకు వచ్చింది. అందుకని ఈ మిషన్ కి ఆవిడే తగినదని నిర్ణయించుకున్నాను. వెళ్ళి అడిగింది ఇవ్వనన్నాడు. ఎందుకని అడిగింది. ఏ క్రెడిట్ కార్డు మీద రిజర్వ్ చేశారో చెప్పమన్నాడు. అబ్బాయి ఏకార్డు ఉపయోగించాడో తెలియదు. టిక్కెట్లు రాలేదు. అబ్బాయి కారు పార్క్ చేసి వచ్చి టిక్కెట్లు తీసుకున్నాడు. మా ఆవిడ గొప్పలు చెప్పటానికీ, నేను గొప్పగా ఫీల్ అవటానికీ ఇవాళ అవకాశం లేదు.

"LA LA Land" అంటే అది ఒక విధంగా కృత్రిమ ప్రదేశం అనే అర్ధమొస్తుంది. LA అంటే లాస్ ఏంజెలెస్, "హాలివుడ్" ఉన్న చోటు. ఈ సినీమా ఒక musical. అంటే పాటలు ఉంటాయన్న మాట.ఈ అర్ధంతో చూస్తే మన తెలుగు సినీమాలన్నీ musicals. ఇది "My fair lady ", "Fiddler on the Roof", "Sound of Music" లాంటి musical  కాదు కాకపోతే చాలా పాటలు ఉన్నాయి. మొదటి పాట "LA " హైవే మీద ట్రాఫిక్ జామ్ లో మొదలవు తుంది. అక్కడే అమ్మాయి అబ్బాయి  కలుసుకుంటారు కూడా. అమ్మాయి త్వరగా కారు ముందుకి నడపదు. వెనక కారులో ఉన్న అబ్బాయికి కోపమొచ్చి తన కారు పక్క లైన్ నుండి తెచ్చి అమ్మాయి కారు పక్కకి పెట్టి, డ్రైవర్లు పంచుకునే భీకర సౌజ్ఞలతో ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవించటం. ఎవరి అభిరుచుల ప్రకారం వారు ఉద్యోగాలు చెయ్యాలని నిర్ణయించుకోవటం. ఈ నిర్ణయం తో చివరికి వారాల  తరబడి అమ్మాయి గారు  ఒక చోట, అబ్బాయి గారు దేశంలో ఇంకోచోటా, ఉండటంతో, అమ్మగారు అలిగి వెళ్ళిపోవటం జరుగుతుంది. అబ్బాయి గారు ఇంటికి వచ్చేసరికి అమ్మాయి గారు ఉండరు. కానీ అమ్మాయి గారిని ఒక సినీమా కోసం audition కు రమ్మనే మెసేజ్ ఉంటుంది. అమ్మాయిగారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి ఆ మెసేజ్ ఇచ్చి ఆడిషన్ కి వెళ్ళమని ప్రోత్సహిస్తాడు. మిగతా కధంతా మామూలే. అమ్మాయిగారు పెద్ద నటి అయి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాజెల్లా తో హాయిగా ఉంటుంది. అబ్బాయి గారు రెస్టారంట్ లో పియానో వాయించే రోజూ వారీ పనివాడుగా మిగిలిపోతాడు.

సినీమా అవగానే వెతుక్కుంటూ కారు దగ్గరకి వెళ్ళి ఇంటికి జేరాము. రాత్రి పూట వెతికితే మెన్హాటన్ లో కూడా వీధి పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే సినీమా కన్నా పార్కింగ్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది.

(ఇది సంవత్సరం కింద ఎప్పుడో వెయ్యాల్సిన పోస్ట్. ఇప్పటికి వెలుగు చూసింది)


Monday, October 8, 2018

145 ఓ బుల్లి కథ ---- మన మెదడు (Brain ) ఎల్లా పనిచేస్తుంది ? - Part-9 - పంచేంద్రియాలు Our Senses


మనకున్న పంచేంద్రియాలు senses  ) పేరుకు తగ్గట్టు అయిదు, కళ్ళు, ముక్కు, చెవి, రుచి (నాలిక), మన దేహమంతా ఆక్రమించుకున్న స్పర్శ (తోలుskin ). అవే మన జ్ఞానేంద్రియాలు కూడా ఎందుకంటే మనకు జ్ఞానం వచ్చేది  వీటి ద్వారానే.

మనము పుట్టినప్పుడు మనకున్న జ్ఞానం శూన్యం. మనకి తెలిసినదల్లా ఏడవటం. అప్పటినుండీ  పంచేంద్రియాల నుండి వచ్ఛే సంకేతాలను మన మనస్సులో గుప్త పరుచుకుంటూ వాటిద్వారా బయటి పరిమాణాలకి స్పందిస్తూ జీవిస్తున్నాము.

అందుకనే సంవత్సరాల పాటు మనం జీవించిన జీవన విధానము, మనం పెరిగిన వాతావరణము, మన జీవితానికి పునాది అవుతుంది. మనం అందరం పెరిగిన వాతావరణాలు వైవిధ్యం కాబట్టి మన ఆలోచనలు వైవిధ్యంగా ఉండటంలో ఆశ్చర్యము లేదు. ఉదా : మనం చిన్నతనంలో దైవత్వం అంటూ పండగలు చేసుకుంటూ గుళ్ళకి గోపురాలకు తిరిగామనుకోండీ, అవి జీవితాంతం మన జీవితంలో భాగమవటానికి ఆస్కారం ఉంటుంది. అదే చైనా నుండి వచ్చిన వారిని దైవం గురించి అడగండి, వాళ్ళకి అదంటే ఏమిటో తెలియదు, ఆ దృక్పధంతో వాళ్ళు పెరగలేదు.

ఒకసారి మన మెదడులో మనము పెరిగిన వాతావరణ సమాచారము గుప్త పడిన తరువాత వాటిని తీసి వెయ్యటం చాలా కష్టం. పేరుకుపోయిన భావజాలాన్ని మార్చటం చాలా కష్టం. ప్రపంచం లోని సైఖియాట్రిస్టులందరూ ప్రయత్నించేది అదే.  అమెరికాలో ఉన్నా ఆవకాయ తినాలనిపిస్తుంది. ఎన్ని సార్లు ఇంటిని రీమోడల్ చేసినా పునాదిని మార్చలేము.

ఈ జ్ఞానేంద్రియాలు ఏవిధంగా పనిచేస్తా యనే వాటిమీద చాలా మంది పరిశోధనలు చేశారు.  నోబెల్ ప్రైజులు కూడా వచ్చాయి. అందులో Georg Von Bekesy ఒకరు.ఆయనకి  మన చెవి ఎల్లా పనిచేస్తుందో కనుగొన్నందుకు 1961 లో నోబెల్ వచ్చింది. నా జీవితంలో నోబెల్ ప్రైజ్ కి దగ్గరైంది, University of Hawaii లో ఆయన Research Lab లో పనిచేయటం వరకే. This is the nearest I got to the nobel prize.

మన పంచేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియమూ ఒక్కొక్క పరిస్థితికి స్పందిస్తుంది. ఆ స్పందనలు విద్యుత్ సాంకేతికాలుగా మారి మెదడుకు పంపబడతాయి. మెదడులో కొన్ని సంకేతాలు నిలువ ఉంటాయి కొన్ని అదృశ్యమవుతాయి. ఇదికూడా మన చేతుల్లో లేదు. కాకపోతే ఒకటి మాత్రం అందరికీ స్వానుభవం. మనం చిన్నప్పుడు బట్టీపట్టిన ఎక్కాలు, పద్యాలూ (ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు ) ఇప్పటికీ గుర్తు ఉన్నాయి. కారణం బహుశా ఎక్కువసార్లు వల్లెవేయటం మూలంగా మన మెదడు వాటిని ముఖ్యమైనవని గుర్తించి దాచిపెట్టిందేమో.

ఇవిగో మన పంచేంద్రియాలు అవి పని చేసే విధానము:

1. కన్ను: కంటి లో పడిన కాంతి కిరణాలు విద్యుత్ ప్రకంపనలు కలిగించి మెదడుకి అందిస్తాయి. వస్తువుల మీద పడిన కాంతి కంటికి తగలటం మూలంగా ఆ వస్తువుల ఆకారాలు మనము చూడకలుగు తున్నాము.

2. చెవి: శబ్దము చేసినప్పుడు, గాలి అలలు ఏర్పడి (నీటి కెరటాలు లాగా), అవి చెవిని తాకి విద్యుత్ సాంకేతికాలు గా మారి మెదడును చేరుతాయి.
మనకి ఏవైపు నుండి శబ్దం వస్తోందో తెలుసుకునేది రెండు చెవుల నుండీ వచ్చే సంకేతాల తేడా వలన. మనం బజార్లో చూస్తూ ఉంటాము, earplugs పెట్టుకుని నడిచే వాళ్ళని. వాళ్ళు ఎప్పుడో అప్పుడు చిక్కుల్లో పడతారు. ఎందుకంటే నడిచేటప్పుడు బయట శబ్దం ఏవైపు నుండి వస్తోందో వారికి తెలుసుకోవటం కష్టమవుతుంది.

3. ముక్కు: వాసన నుండి వచ్చే సూక్ష్మ కణములు (particles ) గాలిలో ప్రయాణించి ముక్కులో వున్న mucas లో రంగరించ బడి (dissolve ) నరాలకు తాకి విద్యుత్ సాంకేతాలుగా మారి మెదడును చేరుతాయి. అందుకనే వాసన లేని కార్బన్ మోనాక్సయిడ్ ని మనం గుర్తించలేము (mucas లో dissolve కి ఏమీ లేవు). అందుకనే గుర్తించటానికి వాసనలేని వంట గ్యాస్ కి వాసన కలుపుతారు.

4. రుచి: నాలిక మీద ఉన్న రుచి మొగ్గలు(taste buds ), తిన్న ఆహారంలోని రుచిని గ్రహించటం మూలంగా మెదడుకి విద్యుత్ సంకేతాలు వెళ్తాయి. మామూలుగా మనము గుర్తించే రుచులు నాలుగు. తీపి(sweet ), వగరు(sour ), ఉప్పు(salty ), చేదు(bitter ). వాటితో కొత్తగా ఉమామి(umami ) అనే రుచిని అయిదవ రుచిగా కలిపారు.

5. స్పర్శ : తాకిన స్పర్శకు చర్మము క్రింద ఉన్న నరములు స్పందించి విద్యుత్ సంకేతాలు మెదడుకి పంపుతాయి.

ఈ జ్ఞానేంద్రియాలు ఒక్కోక్కటిగాను , రెండుమూడు కలిసికట్టుగానూ పని చేస్తాయి. ఉదా: మనం ఇంట్లోకి వ్రవేశిస్తున్నాము, వంటగది నుండి మంచి వాసన వస్తోంది(ముక్కు). తినాలని కోరిక పుడుతుంది. వంటింట్లోకి వెళ్ళి చూస్తే (కన్ను), మనకు ఆ వంటకం తిన బుద్ది పుట్టా వచ్చు
లేక ఏహ్యం కూడా రావచ్చు. తినబుద్ది పుట్టి తిన్నామనుకోండి ఆనందంతో ఆస్వాదించ వచ్చు లేక ఉప్పు ఎక్కువయ్యి మింగలేక బాధపడ వచ్చు(రుచి).

మన కళ్ళు, చెవులు, చర్మము మన కదలికల గురించి సంకేతాలు ఎల్ల వేళలా మెదడుకి పంపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల కలయికతో మన మెదడు మన కండరములను ప్రేరేపించి, మనము క్రిందపడకుండా (balanced ) నడిచేటట్లు చూస్తుంది. వీటి సంకేతాల సమన్వయం (coordination )లేక పోతే బాలన్స్ తప్పిపోయి తూలవచ్చు.
నిద్రపోతూ మంచం మీద నుండి లేచినప్పుడు, షవర్లో నుంచిని స్నానం చేసేటప్పుడు (మొఖానికి సబ్బు రాసుకొని  కళ్ళు మూసి కదిలేటప్పుడు ) కొంచెం జాగర్తగా ఉండండి బాలన్స్ పోయి పడటానికి ఆస్కారం ఉంది.

మనము ప్రకృతిలో ఒక భాగం కనుక అందరం ఒకే విధంగా ఉండటం జరగదు (mutation ఒక కారణం అవుతుంది). మన  పంచేంద్రియాల ప్రతిస్పందనలలో కూడా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. కొందరిలో నాలిక మీద tastebeds ఎక్కువగా ఉండి ఉండవచ్చు. కొందరిలో తక్కువ ఉండవచ్చు. "మా ఆయన ఏమి పెట్టినా గుట్టు చప్పుడుగా తింటాడు", "మా ఆయన ప్రతి వంటనీ వంక పెడాతాడు" అనే మాటలకి అర్ధాలు ఇవే.

మనకి కనపడని వాటిని గుర్తించటానిని (instinct ), sixthsense అంటారు. ఉదా : మన వెనకాల ఎవరున్నారో గుర్తించటం, కళ్ళు మూసుకుని నడవటం వగైరా.

మనకి వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఇంద్రియాలలో పస తగ్గిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఆయా ఇంద్రియాలకు కావలసిన ఇంధనాలు (vitamins etc ) సరీగ్గా అందక పోవటం అవ్వచ్చు. దానికి కారణం మన జీర్ణ శక్తి తగ్గి, పోషక పదార్ధాలు రక్తంలోకి రావటం తగ్గటమేమో.

మాతృకలు :
1. Understanding the Senses (2010), Carol Ballard, Rosen Publishing Group Inc.
2. How does the Balance System Works

Thursday, September 27, 2018

144 ఓ బుల్లి కథ ---- అమెరికాలో వచ్ఛేస్తోంది చలికాలం




నా చిన్నప్పుడు మానాన్న గారు పళ్ళు తోముకోటానికి పందుంపుల్ల నోట్లోపెట్టుకుని మెట్లుదిగి భావి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. తిరిగి పైకి వచ్చేటప్పుడు ఆరోజు కూరగాయలు తుంపుకుని వచ్చే వారు. ఆ ప్రక్రియ అంటే నాకు చాలా ఇష్టం. బహుశ పల్లెటూరిలో చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ దొడ్లో భావి లేదు, పందుంపుల్లలూ లేవు. కానీ అదేపని నేను చాలా ఏళ్ళు సాయంత్రం పూట చేసేవాణ్ణి. ఇప్పుడు మా ఆవిడ చేస్తుంది. ఆవిడ చెల్లెలు క్రిందటి సంవత్సరం ఇక్కడ ఉన్నప్పుడు రోజూ పెరట్లోనుండి ఒక దోసకాయ కోసుకువచ్చి పచ్చడి చేసేది. పిలిచినప్పుడు వెళ్ళి ఆరగించటమే మన పని.

సెప్టెంబర్ వచ్చేసింది దానితో చలికూడా వచ్చేసింది. ఇంక చికాగో లో చెట్ల ఆకులు రంగులు మారి రాలి పోవటం మొదలెడతాయి. అందుకనే వచ్చే మూడు నెలలని Fall అంటారు. పెరట్లో వేసిన మొక్కలన్నీ ఎండిపోతాయి అందుకని మొక్కల మీద ఉన్న కూరగాయలు అన్నీ కోసేస్తారు. పై ఫోటో నిన్న మా ఆవిడ కోసుకువచ్చిన ఈ సంవత్సరపు చివరి పంట.

మీరు గమనించారో లేదో పంట ఎక్కువ పండలేదు. దానికి కారణం ఉంది. ఈ సంవత్సరం పెరటి తోట గురించి నేను ఎక్కువగా పట్టించుకోలేదు. మొదట్లో నేల దున్నిపెట్టాను అంతే.  ఆ తర్వాత మొక్కలు పెట్టటంలో బేదాభి ప్రాయాలు తన్నుకోవటం దాకా వచ్చి పీసుఫుల్ గ తోటపని ఇంట్లో ఆడవాళ్ళకి అప్పచెప్పాను. ఎప్పుడో అప్పుడు మనకి ప్రియమయిన పనులు ఇంకొకళ్ళకి అప్పగించాలి కదా. మొక్కలన్నీ ఆవిడే పెట్టింది. ఈ సంవత్సరం అందరికీ పంచి పెట్టేటంత పంట రాలేదు. ఒకప్పుడు నా హయాంలో సొరకాయ పాదు పెరటంతా పాకి  ఏభయి అరవై కాయలదాకా ఇస్తే వాటిని  కారు ట్రంకు లో వేసుకుని గుడికి తీసుకు వెళ్ళి పంచాము.

మా చికాగో ప్రాంతంలో, పెరట్లో మొక్కలు వేసి పండించుకుని  తినే భాగ్యం సంవత్సరానికి ఆరు నెలలు కూడా ఉండదు ( మే నుండి సెప్టెంబర్). సెప్టెంబర్ వచ్చేసరికి చలి వచ్చేస్తుంది. పెట్టిన మొక్కలు ఎండిపోవటం మూలంగా కూరగాయలన్నీ కోసెయ్యాలి లేకపోతే పాడయి పోతాయి. కొందరి ఇళ్ళల్లో పంట (ఇంట్లో ఉపయోగించే దానికన్నా) ఎక్కువ పండుతుంది. వీరు మిగిలిన వాటిని చుట్టు పక్కల వాళ్ళకి పంచుతూ ఉంటారు. మాకు ఈ సంవత్సరం వెంకట్ ఇంటినుండీ, శోభా వాళ్ళ ఇంటినుండీ వాళ్ళ పెరటి కాయగూరలు వచ్చాయి.

వెంకట్ పెరటి నుండి ఒక సొరకాయ,బీర కాయలు, పొదీనా ఆకు వచ్చింది. వెంకట్ నేను ఇమ్మిగ్రెంట్స్ కి ఇచ్చే క్లాస్ కి వస్తూ ఉంటాడు. మహారాష్ట్రలో ఎదో కుగ్రామంలో లెక్కల మాష్టారి ఉద్యోగం చేసి రిటైర్ అయి భార్యతో, పిల్లల దగ్గర ఉండటానికి వచ్చాడు. చిత్రం అమెరికాలో వాళ్ళది కంబైన్డ్ ఫామిలీ, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు. వెంకట్ వేదిక్ మాథ్స్ లో ఎక్స్పర్ట్. ఎప్పుడో ఆయన్ని ఇంటర్వ్యూ  చేసి ఒక పోస్ట్ వెయ్యాలి.

శోభా వాళ్ళ నుండి బీరకాయలు మిరపకాయలూ వచ్చాయి. వాళ్ళింట్లో బీరకాయ పాదు వేస్తే వెనకాల వాళ్ళింట్లోకి పాకి కాయలు కాచింది. సెప్టెంబర్ లో వెనకాల వాళ్ళింటికి వెళ్ళి బీరకాయలు కోసుకు వచ్చారు. ఎక్కువయితే అందరికీ పంచి పెట్టారు. మేము బీరకాయ తొక్కుతో పచ్చడి, బీరకాయ లతో కూర, పచ్చడి చేసుకున్నాము. మిరపకాయలు పొడుగ్గా మిరపకాయ బజ్జీలలో వాడేవి లాగా వున్నాయి కాకపోతే ఇవి జపనీస్ వేమో ఉట్టిగా తినచ్చు అసలు కారంగా లేవు. వాటితో మిరపకాయల బాజ్జీలు చేసుకుని తిన్నాము.

వచ్ఛే సంవత్సరం ఏమి చెయ్యాలో ఇప్పటినుండే ఆలోచించు కోవాలి. బహుశా పెరటితోట మళ్ళా నా చేతుల్లోకి తీసుకుంటాను. అక్టోబర్ లో ఇక్కడ  "ఇండియన్ సమ్మర్" అంటూ ఒక వారంరోజులు బయట ఉష్ణోగ్రత పెరుగుతుంది. నేల దున్ని (నా దగ్గర ఒక యంత్రం ఉంది), పెరటి తోటని వచ్ఛే సంవత్సరం పంటకి రెడీ చెయ్యాలి. వచ్చే సంవత్సరం పొట్లకాయ గింజలు ఎక్కడయినా దొరికితే పెరట్లో వెయ్యాలి. హెయిర్లూం టొమాటోలు తప్పకుండా వెయ్యాలి. ఇక ఉంటా మరి.