Sunday, December 26, 2021

187 ఓ బుల్లి కథ -- స్నో ఇన్ సియాటిల్

Snow in Seattle 




"స్నో ఇన్ సియాటిల్ " అంటే దాదాపు హైదరాబాద్ లో "స్నో"  పడినంత విచిత్రం. "సియాటిల్ 'Seattle ' " పట్టణం అమెరికాలో "వాషింగ్టన్ "అనే రాష్ట్రం లో పడమటి తీరంలో సముద్రం పక్కన ఉంటుంది. సామాన్యంగా చలికాలంలో కొద్దిగా చలిగా ఉంటుంది కానీ "స్నో" పడటం అనేది సామాన్యంగా ఉండదు. ఈ సంవత్సరం క్రిస్మస్ కాలంలో స్నో పడటం అనే "White Christmas "  ఇక్కడ చాలా అరుదు. ప్రకృతి వైపరీత్యం. 

ఒక నెల రోజులు పిల్లల దగ్గర గడపటానికి చికాగో నుండి రెండు రోజుల క్రిందట సియాటిల్  వచ్చాము. కొన్ని ఏళ్ళ క్రిందట ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా పుట్టింటికి వెళ్తున్నట్లు ఇక్కడికి వచ్చే వాళ్ళం. ఇప్పుడు చికాగో నుండి అదే నాలుగు గంటల విమాన ప్రయాణం ఒక యుగం లాగా తయారయింది. బహుశ దీనికి కారణం "సెక్యూరిటీ చెక్" లు కోవిడ్ లూ అయ్యుంటాయి. ఒకప్పుడు ఆనందించే విమాన ప్రయాణం, ఎప్పుడు అయిపోతుందా ఇంటికి ఎప్పుడు జేరుతామా అనే తీరుకు వచ్చింది. దానికితోడు పరిగెడుతున్న వయస్సు కూడా ఒక కారణం కావచ్చు.

మేము ఇంటికి రాంగానే "క్రిస్మస్ ట్రీ" పెట్టి "ఆర్నమెంట్స్" తో  అలంకరించి దీపాలు వెలిగించాము. "క్రిస్మస్ ట్రీ"  చిమ్నీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. చిమ్నీ లో నుంచి దూరి వచ్చి ప్రెజంట్సు ఇచ్చే "శాంతాక్లాస్ " ని ఇబ్బంది పెట్ట కూడదు కదా ! స్కూల్ పిల్లలు ఈ పండగ కోసం, దానితో వచ్చే ప్రెజంట్స్ కోసం నెలల బట్టీ ఎదురుచూస్తూఉంటారు. రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత పిల్లలకీ పెద్దలకీ ప్రెజంట్స్ ప్యాక్ చేశాము. "క్రిస్మస్" రోజు పొద్దున్నే లేచి ఎవరి ప్రజంట్స్ వాళ్ళం తీసుకున్నాము. పిల్లలు వాళ్ళ "లెగో " పజిల్స్ చెయ్యటం మొదలెట్టారు. 

కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. సాయంత్రం పండగ భోజనానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము. వంటలు చెయ్యటంలో అందరూ తలో చెయ్యి వేశారు. లేకపోతే, "లజానియా ",  వెజిటబుల్ పులావ్ దానిలోకి రైతా, డిజర్ట్ కి "panettone " ఒక్కళ్ళే చెయ్యటం చాలా కష్టం.   

అనుకోని వైట్ క్రిస్మస్ తో పండగ రోజు చల్లగా ముగిసింది. 

Sunday, December 19, 2021

186 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ -7 (Prasnopanishad )

ప్రశ్నోపనిషత్ లో ఇంతవరకూ అయిదుగురు శిష్యులు వేసిన వేదాంత ప్రశ్నలకు గురువుగారు పిప్పలాదుల  సమాధానాలు చూశాము. చివరి ప్రశ్న ఆరో ప్రశ్న సుకేశ భరద్వాజ క్రింది విధంగా వేశాడు : 

"కోసల దేశానికి యువరాజయిన హిరణ్యనాభుడు నన్ను ఒక ప్రశ్న వేశారు, పదహారు అంగాల పురుషుడు (షోడశకలం పురుషం వేత్థ ) ఎవరో నీకు తెలుసా ? అని.  అబధ్ధం చెబితే వారు సమూలంగా నశించి పోతారు. (అందుకని)నాకు తెలియదు అని చెప్పాను. ఈ పురుషుడు ఎక్కడ ఉన్నాడో  చెప్పండి " అని . (6-1)

అతనితో మహర్షి ఇలా చెప్పాడు: "ఓ సౌమ్యా ఆ పురుషుడు ఇక్కడే శరీరంలోపల హృదయంలో ఉన్నాడు. ఆ బ్రహ్మ నుంచే పదహారు అంశాల ప్రపంచం ఉద్భవించింది"అని. (6-2)

ఆత్మ నుండి ప్రాణము, తన నుండి శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, ఇంద్రియాలూ, మనస్సు, ఆహారం ఉద్భ వించాయి. ఆహారం నుండి శక్తి , తపస్సు, మంత్రాలూ, లోకాలూ, క్రియలూ వచ్చాయి. లోకాల పేర్లు సృష్టించ బడ్డాయి. (6-4)

మంత్రంలో చెప్పినవన్నీ మనం బ్రతకటానికి కావాలి. "బ్రతకటం" అనేది శరీరమునుండి విడిపోయినప్పుడు, శక్తి స్వరూపాలు అన్నీ వాటి వాటి మూలాల్లో కలిసి స్థూల శరీరాన్ని విడిచి పెట్టి పోతాయి. అంతేకాదు నదులు, ఏ విధంగా సముద్రంలో కలిసినప్పుడు వాటి నామరూపాలు వదిలే స్తాయో ఆవిధంగా, జీవించటానికి సృష్టించ బడిన వన్నీ మరణ కాలంలో వాటి వాటి నామరూపాలు వదిలి ఆత్మలో కలిసిపోతాయి.

(పిప్పలాదులు) వారితో చెప్పాడు : నాకు ఈ పరబ్రహ్మ గురించి తెలిసినదింతే . ఇంతకుమించి ఏమీ లేదు. (6-7)

గురువుగారు తనకు తెలిసిన దంతా చెప్పాను అన్న తరువాత శిష్యు లందరూ వారికి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించినందుకు గురువుగారికి, గురువుగారి గురువులందరికీ (గురు పరంపర) నమస్సులు అర్పిస్తారు. (6-8)

నామాట:

వేటినయినా సృష్టించాలంటే శక్తి (energy ) కావాలని మనందరికీ తెలుసు. దానికి ఆకారం, రంగు రుచి వాసనా లేవని కూడా తెలుసు. దానిని చూడలేము పట్టుకోలేమని కూడా తెలుసు. ఉదా: విద్యుత్, మైక్రోవేవ్, ఆకర్షణా శక్తి  వగైరా. 

విద్యుత్ శక్తి నుండి మైక్రోవేవ్ శక్తి  వస్తుంది, ఆకర్షణా శక్తి  కూడా వస్తుంది. మనం అర్ధం చేసుకోవటం కోసం మూడింటినీ శక్తి-1, శక్తి-2, శక్తి-3 అని పిలవకుండా విడి విడిగా పేర్లు పెట్టుకున్నాము.  

అల్లాగే శక్తి స్వరూపమయిన సృష్టికర్తకు, తాను సృష్టించిన శక్తి  స్వరూపాలకు, మన అవగాహన కోసం పేర్లు పెట్టి పిలుస్తున్నాము.

విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ, పరమాత్మ, జీవాత్మ, ప్రాణం, సూక్ష్మ శరీరం, కారణశరీరం ఇవన్నీ శక్తి  స్వరూపాలు. శరీరం లోకి జేరి దానికి జీవత్వం ఇస్తాయి, వచ్చిన  పని అయిపోగానే జీవాత్మ లోకి శక్తి స్వరూపాలు మిళిత మవుతాయి; అస్తమించే టప్పుడు సూర్య భగవానుడు లోకి కిరణాలు కలిసిపోయి నట్లు. మళ్ళా ఇంకొక శరీరం చూసుకుని ఆ  శరీరంలో విప్పారి, ఉదయపు సూర్య కిరణాలు విప్పారినట్లు, మిగిలి పోయిన పాప కర్మలు అనుభవించేటట్లు చేస్తాయి. 

జీవితంలో మనకిచ్చిన చిన్న విచక్షణ జ్ఞానంతో చేసిన పాప పుణ్యాలన్నీ సూక్ష్మ, కారణ శరీరాల్లో క్రోడీకరించి ఉంటాయి, తప్పించుకోలేము. మనసులో వాటిని తలుచుకోండి చాలు బయటికి వస్తాయి. వాటి పరిణామాలు మనం అనుభవించే దాకా మనము పుడుతూ చస్తూ ఉండాల్సిందే. అందుకనే ఈ చావు బ్రతుకుల విలయం నుండి తప్పించుకోటానికి మంచి పనులు చెయ్యటానికి ప్రయత్నించటం మంచిది.

క్లుప్తంగా ఇదీ సంగతి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

Prashna Upanishad - Ancient Indian View on Creation, Time, Matter and Soul

ఉపనిషత్ లు    

Monday, December 6, 2021

185 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 6 (Prasnopanishad )

సూక్ష్మంగా చెప్పాలంటే ప్రశ్నోపనిషత్ అంతా ఆరుగురు శిష్యులు అడిగిన ప్రశ్న లకు గురువుగారి సమాధానములు. నలుగురు శిష్యుల ప్రశ్నలకి గురువుగారు సమాధానములు చెప్పిన తరువాత, గురువుగారిని శిష్యుడు శైబ్య సత్యకామ అయిదవ ప్రశ్న క్రింది విధంగా వేశాడు : 

అధ్యాయం 5 శ్లోకం 1: (5-1)

అథ హైనం శై బ్య:  సత్యకామః  ప్రపచ్చ  : దాని తర్వాత శైబ్య సత్యకామ అడిగాడు 

స యో హ వై తద్భగవన్మనుష్యేషు  : ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా 

ప్రాయణా న్త మో ర  మభిధ్యాయీత : మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే  

కతమం వావ స  తేన లోకం జయతీతి : అతడు దానివలన ఏ లోకానికి వెళ్తాడు అని 

ఓ గురుదేవా మనుష్యుల్లో ఎవరైనా మరణం వరకూ ఓంకార ధ్యానం చేస్తే ఏ లోకాలకి వెళ్తారు? అని శిష్యుడు  శైబ్య సత్యకామ గురువుగారు పిప్పలాదుడిని అడిగాడు.

ఇక్కడ ఓం కారం గురించి ఒక మాట చెప్పాలి. "ఓం" అని నోటితో అనాలంటే మనం  "అ " "ఉ " "మ " అనే మూడక్షరాలను కలిపి ఉచ్చరించాలి.  

అధ్యాయం 5 శ్లోకం 6: (5-6)

తిస్రో మాత్రా మృత్యుమత్య: ప్రయుక్తా అన్యోన్యసక్తా :  : ఈ మూడు మాత్రలూ విడిగా వాడితే (ఉచ్చరిస్తే ) అనిత్య ఫలం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉండేలా 

అనవిప్రయుక్తా:  క్రియాసు : ధ్యానంలో సరీగ్గా వాడితే 

బాహ్యాభ్యన్తరమధ్యమాసుజ్ఞ సమ్యక్ప్రయుక్తాసు న కమ్పతేజ్ఞః  : జాగృత్ సుషుప్తి స్వప్నావస్తలకు పరమాత్మను గుర్తించిన జ్ఞాని చలించడు.

ఇక్కడ చెప్పేదేమిటంటే విడి విడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే అది పనిచేయదు, ఓంకార ఫలం పొందాలంటే ఓంకారం జపించేటప్పుడు అక్షరాలన్నీ పెనవేసుకుని ఒకటిగా రావాలి.

విడివిడి అక్షరాలుగా ఓంకారం జపిస్తే, ఒక మాత్ర  "అ " తో జపిస్తే నూ, రెండుమాత్రలు "అ " "ఉ " లతో జపిస్తే దేవతలు వారి వారి లోకాలకు తీసుకువెళ్ళి వారి వారి ఫలితం అనుభవించిన తరువాత మనుష్యలోకానికి తెస్తారు. మూడక్షరాలూ పెనవేసుకుని ఓంకారం జపిస్తే సామవేద దేవత వల్ల  బ్రహ్మలోకానికి వెళ్ళి మోక్షం పొందుతారు.    (5-7)

నామాట :

"పై లోకాలు" అనే మాటని అర్ధం చేసుకోటానికి ఈ క్రింది విశ్లేషణ ఉపయోగ పడచ్చు :

1. లోకాలు ఉన్నాయి అనే మాట విని ఆశ్చర్య పడవలసిన అవసరంలేదు. మన ఎదురుకుండా మనమే ఒక లోకాన్ని సృష్టించాము. అదే "Satellite " లోకం. మనము సృష్టించిన కొన్నివేల ఉపగ్రహాలు దానిలో తిరుగుతున్నాయి, కొన్ని రాలిపోతున్నాయి. అక్కడికి మానవులు వెళ్తున్నారు వస్తున్నారు (space Station). 

2. మన శరీరం ఒకటిగా పైకి కనిపించినా అది వేద శాస్త్ర ప్రకారం మూడు శరీరాల కలయిక అని చెబుతారు ("స్థూల శరీరం" (physical body ) , "సూక్ష్మశరీరం" (subtle body ), "కారణ శరీరం" (casual body )). 

మన "స్థూల శరీరం" (physical body ) మనకు కనపడే మన శరీరం. 

జ్ఞానేంద్రియాలనుండి వచ్చే సంకేతాలను వాటికి తగినట్టు ప్రతిస్పందన చేసిన తర్వాత  "మనసు" లో నిక్షిప్తం (record ) చేసేది "సూక్ష్మశరీరం" . మన జీవత్వానికి కారణం ఇదే.

మన మనసులో దాచిపెట్టబడిన సంకేతాలతో మన మనస్సు మనకి కొన్ని గుణాలు ఇస్తుంది.

"బుద్ధి" "జ్ఞానం" అనేవి నిక్షిప్తమైన సంకేతాల్ని వడగట్టితే (process ) వచ్చేది. 

"చిత్తం " అనేది మనసులోనున్న సాంకేతాలను అవసరమైనప్పుడు బయటకు తెచ్చేది.

"అహంకారం" మన మనసులో పోగు చేసుకున్న సమాచారాన్ని మన సొంతం అని వక్రీకరించగా వచ్చేది. ఇవి మనం అందరం మనకు తెలీకుండా రోజూ ఉపయోగించేవే. 

మన జీవిత రహస్యాలను దాచి పెట్టుకునేది "కారణ శరీరం" (casual body ). మనం గాఢంగా నిద్రపోతున్నప్పుడు మనని కనిపెట్టుకుని ఉండేది ఇదే. మనం గాఢ నిద్ర పోయామని మరునాడు గుర్తు పెట్టు కొని చెప్పేది కూడా మనలోని "కారణ శరీరం".  

మన శరీరం వదిలిన తరువాత మన జ్ఞాపకాలతో ప్రయాణించేవి సూక్ష్మ, కారణ శరీరాలు. మన ప్రారబ్ధం నిర్ణయించేది వీటిలో నిక్షిప్తం చేసిన సమాచారమే.

మనం నిద్ర కుపక్రమించే టప్పుడు wake up state లో ఉంటాము , తరువాత Dream లోకి వస్తాము ఆ తరువాత Deep Sleep లోకి వెళ్తాము  వీటినే జాగృత్, స్వప్న, సుషిప్తి అంటారు. వీటిని గురించి మాండూక్యోపనిషత్ లో వివరంగా తెలుసుకుందాము.

3. ఓంకారం గురించి చాందోగ్య ఉపనిషత్ గురించి చర్చించే టప్పుడు ఇంకా తెలుసుకుందాము.  ఓంకారం ఏవిధంగా ఉచ్చరించాలనేది గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి క్రింద లింక్ ఒకటి ఇచ్చాను.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ లు ఉపయోగపడుతాయి :

ఓం

ఉపనిషత్ లు    

11-Neema Majmudar

Wednesday, December 1, 2021

184 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 5 (Prasnopanishad )

 శిష్యుల వేదాంత ప్రశ్నలకి గురువుగారి సమాధానాలే  ఈ  ప్రశ్నోపనిషత్.  ఇంతవరకూ వేసిన ప్రశ్నలు, జగత్ సృష్టి ఎల్లా మొదలయింది, దానిలో మనుషులు ఎల్లా ఉద్భవించారు, ఎల్లా జీవిస్తున్నారు, ఎల్లా నిష్క్రమిస్తారు అని.

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

"ప్రాణం" శరీరం లోకి ప్రవేశించి అయిదు విధాలుగా విభజించుకుని మానవునిలో జీవత్వానికి మూలం అవుతుంది. కర్మ ఫలములు అనుభవించిన తరువాత  "ప్రాణం" శరీరంలోనుండి నిష్క్రమించిన వెంటనే శరీరంలో జీవత్వం పోతుంది.

ఇంక ఈ నాలుగవ అధ్యాయంలో శిష్యుడు అడిగిన నాల్గవ ప్రశ్నకి గురువుగారిసమాధానం చూద్దాం.

అధ్యాయం 4 శ్లోకం 1: (4-1)

అధ హైనం సౌర్యాయణీ గార్ఘ్యహః ప్రపచ్చ : మూడవ ప్రశ్న తరువాత సౌర్యాయణీ గార్గ్యుడు గురువుగారిని అడిగాడు 

భగవన్నెత స్మిన్పురుషే కాని స్వపస్తి కాన్యస్మి  జ్ఞాగ్రతి ? : ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో ఏవి నిద్రిస్తాయి ఏవి మేలుకొని ఉంటాయి?

కతర ఏష దేవః  స్వప్నాన్పశ్యతి కస్త్యైతత్సుఖం భవతి? : ఏ దేవుడు కలలను చూస్తాడు? ఈ సుఖం ఎవరికి చెందుతుంది?

కస్మిన్ను సర్వే  సమ్ప్రతిష్ఠితా భవన్తీతి   : ఎందులో అన్నీ లయమవుతాయి అని.

మనని ఎవరన్నా రాత్రి నిద్ర బాగా పట్టిందా అని అడిగితే ఏం చెబుతాము ? నిద్ర పట్టలేదనో, లేక రాత్రంతా కలలు అనో లేక హాయిగా నిద్ర పోయననో చెప్తాము.నిద్ర పట్టక పోవటం, రాత్రి కలలు రావటం ఒక విధంగా మనకు తేలుస్తాయనుకోవచ్చు. కానీ గాఢనిద్ర పోతున్నప్పుడు మన అవయవాలు ఏమీ పని చేయవే అటువంటప్పుడు మనము  హాయిగా  నిద్ర పోయామని ఎలా గుర్తుపెట్టుకుని చెబుతాము?

ఇదే సందేహం శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  కి వచ్చి గురువుగారిని అడుగుతాడు.

ఓ దేవర్షీ ఒక వ్యక్తిలో నిద్రిస్తున్నప్పుడు ఏ ఇంద్రియాలు మేల్కొంటాయి , ఏవి కలలను చూస్తాయి, (గాఢనిద్ర) పోతున్నప్పుడు వ్యక్తి శరీరంలో ఆ సుఖం అనుభవించి గుర్తుపెట్టుకుని చెప్పే వారు ఎవరు ? అని అడుగుతాడు. (4-1)

గురువు పిప్పలాదుడు శిశుడు గార్గ్యకి చెబుతాడు: అస్తమించే సూర్యుడు తన కిరణాలనన్నీ తీసుకు పోయి మరునాడు ఉదయిస్తున్నప్పుడు తన కిరణాలను ఎలా విస్తరిస్తాడో అలాగే  శరీరంలోని ఇంద్రియాలు నిద్రలో మనసుతో లీనమయి, మెలుకవ తో వాటి పనులతో ప్రజ్వరిల్లుతాయి. అందుకని నిదురలో ఉన్న వ్యక్తి,  వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించడు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు , నిద్రిస్తాడు. (4-2)   

ప్రాణ రూపంలో ఉన్న అగ్నులు మాత్రమే ఈ శరీరంలో మేలుకొని ఉంటాయి. (4-3)

( పంచ ప్రాణాలూ, మనస్సు మాత్రమే మేలుకొని ఉంటాయి. ఇక్కడ అగ్నులు అంటే మనం మనశరీరంలో కణాలలో అగ్ని ద్వారా జరిగే శక్తి  ప్రక్రియ అని అన్వయించుకోవచ్చు.  )

"సమానం" ఉచ్వాస నిశ్వాసాలను సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. అలాగే "ఉదానం" మనసనే యజమానిని (నిద్రతో) ఆనందం పొందేలా చేస్తుంది. (4-4) 

ఇక్కడ ఈ మనస్సు అనే దైవం కలలో, చూసిన వాటినీ చూడనివాటినీ , చూస్తుంది, వినినవాటినీ వినని వాటిని కూడా వింటుంది, అనుభవించినవీ అనుభవించనివీ, నిజమైనవీ నిజంకానివీ అన్నింటినీ చూస్తుంది.  (4-5)

(ఇక్కడ అనుభవించనివీ, చూడనివీ ఎల్లా చూస్తోంది అనే ప్రశ్న రావచ్చు. దానికి పండితులు చెప్పే సమాధానం అవన్నీ పూర్వ జన్మ వాసనలయి ఉండచ్చని. ).

వాసనలు నిలువచేసి ఉన్న చిత్తానికి అడ్డు తగిలినప్పుడు కలలు వచ్చుటకు వీలులేక "సుషుప్తి" (గాఢ నిద్ర) శరీరానికి వచ్చి ఆనందిస్తుంది. (4-6)

ఓ సౌమ్యుడా పక్షులు పగలు ఏవిధంగా దేశసంచారము  చేసి రాత్రికి వాటి చెట్టులో ఉన్న గూటికి చేరుకుంటాయో అటులనే అవి అన్నీ (శరీరంలో ని వన్నీ) పరమాత్మను చేరుకుంటాయి.  (4-7)

అవి అంటే శరీరంలో ఉన్న పంచ భూతాలూ, పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచప్రాణాలూ, నాలుగు అంతః కరణాలూ  పరమాత్మను చేరుకుంటాయి (తురీయంలో లయమవుతాయి).  (4-8)

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

అన్నీ బ్రహ్మలో ఐక్యమయిన తరువాత బ్రహ్మ గురించి ఎల్లా తెలుస్తుంది. మనమే బ్రహ్మగా మారినప్పుడు బ్రహ్మ జ్ఞానము ఎల్లా తెలుస్తుంది. బ్రహ్మ గురించి తెలుసుకోలేమని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

హే సౌమ్యుడా కారణ శరీరంలేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే అని ఎవరు గ్రహిస్తాడో అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

జీవాత్మ, ఇంద్రియాలూ, పంచ ప్రాణాలూ, పంచ భూతాలూ అన్నీ దేనిలో లీనమవుతాయో (అక్షర బ్రహ్మలో) తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అవుతాడు. సర్వ వ్యాపకం చెందుతాడు.  

నా మాట:

శిష్యుడు సౌర్యాయణీ గార్గ్య  "నిద్ర " గురించి అడిగిన ప్రశ్నకి  గురువుగారు పిప్పలాద మహర్షి చక్కటి ఉపమానం చెబుతారు. 

సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన కిరణాలు లోపలికి ఎల్లా తీసుకుంటాడో , "నిద్ర" వచ్చేటప్పుడు ఒక వ్యక్తిలో అటువంటిదే జరుగుతుంది, ఇంద్రియాలు నెమ్మదిగా వాటి పాటవాన్ని తగ్గించుకుంటూ విశ్రమణకు చేరుకుంటాయి. అందుకనే ఆ వ్యక్తి  నెమ్మదిగా విశ్రమించు స్థితి లోకి జారుకుంటాడు. రాను రానూ వినడు, చూడడు, వాసన చూడడు, స్పర్శించ డు, మాట్లాడాడు, ఆనందించడు, తినడు , విసర్జించడు, కదలడు, నెమ్మదిగా నిద్రకి ఉపక్రమిస్తాడు. 

జీవితంలో మనస్సులో నిక్షిప్త మయి సంఘటనలు కలల రూపంలో నిద్రలో కనిపిస్తాయి. ఒకప్పుడు మనకెప్పుడూ జరగని సంగతులు కూడా కలల లోకి రావచ్చు. వాటికి కారణం మన పూర్వ జన్మ నిక్షేపాలు కావచ్చు. కలల గమనానికి అడ్డు తగిలినప్పుడు, కలలు ఆగిపోయి "గాఢ నిద్ర" లో మునిగిపోతారు.

సూర్యుడు ఉదయించేటప్పుడు తన కిరణాల్ని ఎలా వ్యాపిస్తాడో అల్లాగే వ్యక్తి మేలుకుని నిద్ర లేస్తున్నప్పుడు ఇంద్రియాలు వాటి వాటి స్వస్థానాలకి వచ్చి తమ తమ పనులను చెయ్యటానికి ఉపక్రమిస్తాయి. 

పక్షులు పగలు దేశసంచారము చేసి రాత్రికి చెట్టులో ఉన్న గూటికి ఎలా చేరుకుంటాయో  అటులనే రాత్రిపూట ఇంద్రియాలు వాటి వాటి స్వస్థలానికి చేరుకుంటాయి. "ప్రాణం", మనస్సు తోపాటు అన్నీ జీవాత్మలో విలీనం అవుతాయి.

చూసేది, స్పహరించేది, వినేది, వాసన చూసేదీ, రుచి చూసేది, ఆలోచించేది, తెలుసుకునేది, నాలుగు అంతః కారణాల ద్వారా వ్యవహరించేది, పంచ కర్మేంద్రియములు ద్వారా వ్యవహరించేది ,అయిన ఈ జీవాత్మ అక్షర బ్రహ్మలో ఐక్యము చెందుతుంది. (4-9)

హే సౌమ్యుడా కారణం శరీరం లేని సూక్ష్మ శరీరంలేని, స్థూల శరీరంలేని పరబ్రహ్మని తానే  అని ఎవరు గ్రహిస్తాడో  అతను సర్వమూ తెలిసిన వాడవుతాడు. (4-10)

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు    

Monday, November 22, 2021

183 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 4 (Prasnopanishad )

ఇంతవరకూ జరిగిన వృతాంతం:ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ  కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ  గార్గ్య, సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్నలన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు పిప్పలాద ఋషి .

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రహ్మని సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ ప్రశ్న భార్గవ వైదర్భి గురువుగారికి వేస్తాడు : భగవాన్ ఒక వ్యక్థి స్థితికి ఎవరు కారకులు వారిలో శ్రేష్ఠులు ఎవరు అని. ఇక్కడ స్థితి అంటే జీవించటం అని అర్ధం చెప్పుకోవచ్చు.

దానికి గురువుగారు పిప్పలాదులు చెబుతారు : మొదట ఇంద్రియాలు, వాటి వల్లనే వ్యక్తి జీవించకలుగుతున్నాడని గర్వంగా చెప్పేవి కానీ  "ప్రాణం"  మధ్యలో వచ్చి తానే జీవత్వానికి కారణం అని చెప్పి నిరూపిస్తుంది. అందుకని అన్ని ఇంద్రియాలకీ "ప్రాణం"  పొసే "ప్రాణం" శ్రేష్టమైనది అని పిప్పలాదులు సమాధానం చెబుతారు.

మూడవ అధ్యాయం లో గురువుగారికి శిష్యుడు మూడవ ప్రశ్న వేస్తాడు.

మూడవ అధ్యాయం మొదటి మంత్రం: (3-1)

అధ హైనం కౌసల్యశ్చాశ్వలాయనః  ప్రపచ్చ  : ఆ తరువాత కౌసల్య అశ్వలాయన అడిగాడు 

భవన్కుత ఏష ప్రాణో జయతే కధమాయాత్యస్మిరీరే ? : మహర్షీ ఈ ప్రాణం ఎక్కడ నుండి వచ్చింది ? ఈ శరీరంలోకి ప్రాణం ఎల్లా వచ్చింది ?

ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే ? : తనను తాను విభజించుకుని ఎల్లా ప్రతిష్ఠించు కున్నది? 

కేనో త్క్ర మతే ? కథం బాహ్య మభిధత్తే  ?: ఎలా బయటకు వెళ్తుంది (శరీరం నుండి) ? ఎలా బాహ్య ప్రపంచానికి ఆధారమైనది ?

కధ మధ్యా త్మ మితి ? : 

మూడవ అధ్యాయం రెండవ  మంత్రం: (3-2)

తస్మై స హోవాచాతి ప్రశ్నా స్ప్రుచ్చ  సి : శిష్యునితో (గురువుగారు) అన్నారు నువ్వు కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు 

బ్రాహ్మిష్టో సీతి తాస్మాత్తే  హం బ్రవీమి : నీవు బ్రహ్మజ్ఞానివి (అర్ధం చేసుకునే శక్తి ఉన్నది) అందుకు దీనికి సమాధానం చెబుతాను 

మూడవ అధ్యాయం మూడవ  మంత్రం: (3-3)

ఆత్మన ఏష ప్రాణో జాయతే : ఆత్మ నుండి ప్రాణం పుట్టింది 

యథైషా పురుషే చ్చ యైత స్మిన్నే తదాత తం : పురుషుని వల్ల  ఏర్పడిన నీడలా  

మనోకృతేనా యాత్య స్మి ఇంమి రీరే : కర్మల వలన శరీరంలోకి వస్తుంది 

కౌసల్య అశ్వలాయన గురువుగారికి వేసిన మూడవ ప్రశ్న,మనిషిలో  "ప్రాణం" ఎల్లా వస్తుంది, శరీరంలో ఎల్లా ప్రతిష్ఠించు కుంటుంది, చివరికి శరీరాన్ని వదలి ఎల్లా వెళ్ళి పోతుంది?, చెప్పమని. (3-1)

గురువుగారు శిష్యుడికి తన సమాధానం అర్ధం కాదేమోనని  కొంత తటపటాయించినా, శిష్యుని సామర్ధ్యం తెలిసినవాడు కనుక, ఇది చాలా క్లిష్టమయిన ప్రశ్న అంటూనే దానికి సమాధానం చెబుతారు.  (3-2)

ఈ జగత్ అంతటికీ కారణం పరమాత్మ. పరమాత్మ నుండి "ప్రాణం" పుట్టింది. ఎల్లా పుట్టింది అంటే మనం ఎండలో నుంచుంటే నీడ వస్తుందే అలా. "ప్రాణం" పరమాత్ముని నీడ లాంటిది. నీడ ఎంత మిధ్యో పరమాత్ముని అంశం ఈ జగం కూడా అంతే మిధ్య . అది ఏశరీరంలోకి వస్తుంది? మనం చేసిన పూర్వ జన్మ కర్మల ప్రభావం వలన.  (3-3)

ఏవిధంగా ఒక చక్రవర్తి పరిపాలన సౌలభ్యంకోసం మంత్రులూ సామంత్రులు మొదలగు వారిని నియమించుకుని పాలిస్తారో అటులనే "ప్రాణం" శరీరంలో తన వారిని  విడివిడిగా తగిన స్థానాలలో నియమించుకుని శరీరాన్ని పరిపాలిస్తుంది. (3-4)

"ప్రాణం" తన అంశతో నలుగురు సహాయకులను సృష్టించుకుని , అపానం, సమానం, వ్యనం, ఉదానం అనే నలుగురు, శాఖా బాధ్యతలు అప్పజెప్పింది. అపానం బాధ్యత విసర్జన క్రియ, జీవోత్పత్తి , సమానం కి జీర్ణక్రియ, వ్యనం కి రక్తప్రసరణ క్రియ, ఉదానం కి తిరోగమన క్రియ అప్పజెప్పి ముఖ్యమయిన శ్వాసక్రియ దానికి కావాల్సిని కళ్ళు చెవులు ముక్కు (చక్షు శ్రోత్రే ముఖ నాసికాభ్యం ) తన పరిధిలో  ఉంచుకుంది "ప్రాణం". (3,5) (3,6) (3,7)

"సమానం" కి ఉన్న శాఖ జీర్ణక్రియ. తనకు హోమాగ్ని లాగా అర్పించబడిన ఆహారాన్ని తీసికుని పోయి ఏడు  జ్వాలలను ఉత్పత్తి చేసి ఏడు ఇంద్రియాలకు శక్తిగా ఇస్తుంది (2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నాలిక )

"వ్యానం " శాఖ  రక్త ప్రసరణం. ఆత్మ హృదయంలో ఉంది. ఈ హృదయంనుండి 101 నాడులు వస్తాయి (నాడీ నామ్ ఏతత్ ఏకశతమ్ ). వాటిలో ఒక్కొక్క దానికీ నూరు శాఖా నాడులు ఉన్నాయి. ప్రతి శాఖా నాడికీ 72000 ఉపనాడులు ఉన్నాయి (సహస్రాణీ ద్వాసప్తతి:). వీటిల్లో రక్త ప్రసరణక్రియ   "వ్యానం "నిర్వహిస్తుంది. (3-6)

"ఉదానం" స్థానం ఊర్ధ్వ భాగం. దీని శాఖ తిరోగమన క్రియ. మనం పడంది తింటే విసర్జన ద్వారా బయటికి పంపుతుంది. ప్రాణాన్ని సరి అయిన లోకాలకు చేర్చటం కూడా దీని పనే. పైకి వెళ్ళే ముఖ్యమైన నాడి  "సుషుమ్న" నాడి ద్వారా ఉపాసన చేసిన వారిని "ఉదానం" బ్రహ్మ లోకానికి తీసుకు వెళ్తుంది. మిగతా నాడులు మిగతా వారిని వారి వారి ప్రారబ్ధ కర్మ ప్రకారం, పుణ్యం చేస్తే పుణ్యలోకాలకి , పాపం చేస్తే నరకానికీ తీసుకు వెళ్తాయి. రెండూ చేసిన వారిని మనుష్య లోకానికి తీసుకు వెళ్తాయి (పాప ముభాభ్యామేవ మనుష్యలోకమ్ ). (3-7)

సూర్యుడే బాహ్య రూపంలో "ప్రాణం". పృథ్వి బాహ్య రూపంలో"అపానం". అంతరిక్షం బాహ్య రూపంలో "సమానం". వాయువు బాహ్య రూపంలో "వ్యానం "  (3-8)

శరీరంలో అగ్ని తత్త్వం వెళ్ళి పోయినప్పుడు అన్ని ఇంద్రియాలూ మనస్సులో లీనమయి పోయి ఇంకొక జన్మలో మరల బయటికి వస్తాయి. (3-9) 

మరణం సమయంలో అయిదు ప్రాణులూ ఏకమవుతాయి. అందుకనే జీర్ణక్రియ లాంటివి జరుగవు. ఈ సమైఖ్య  "ప్రాణం ", మనిషి కోరిన చివరి సంకల్పం ప్రకారం దాని స్ధానానికి వెళ్తుంది.      (3-10)

ఎవరైతే "ప్రాణం" గురించి అర్ధంచేసుకుని ఉపాసన చేస్తారో అతని సంతతి ఎన్నటికీ నశించదు, బ్రహ్మ లోకానికి వెళ్తాడు. (3-11) 

ఫల శృతి:

"ప్రాణం" ఎలాపుట్టింది? శరీరంలోకి ఎలా వచ్చింది? శరీరంలో ఎక్కడ ఉంది? ఎలా పరిపాలిస్తోంది? ఐదుగా ఎలా విభజించుకుంది ? ఇవన్నీ తెలుసుకుని ఉపాసన చేసిన వ్యక్తి అమరత్వం పొందుతాడు. (3-12)

నా మాట :

మొదట ఈ అధ్యాయం క్లిష్టంగా కనపడుతుంది గానీ రెండుమూడు సార్లు చదివితే తేలికగా అర్ధం చేసుకోవచ్చు.

సూక్ష్మంగా చెప్పాలంటే "ప్రాణం" మానవ శరీరంలోకి  ప్రవేశించి, శరీర దైనందిన కార్యక్రమాలకోసం, తనకుతాను అయిదు భాగాలుగా విభజించుకుని, జీవి చేత ప్రారబ్ధ కర్మ ప్రకారం "మానవ జన్మ" అనే శిక్ష అనుభవింప చేసి చివరకి "సుషుమ్న" నాడి ద్వారా నిష్క్రమిస్తుంది. 

ఇప్పటికీ పరిశోధకులు పరిశోధన శాలలో రోజూ ఇటువంటివే ముఖ్యమయిన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. 

అది ఏమిటి? ఎలా వచ్చింది ? ఏమి పనిచేస్తుంది? మనకేమి ఉపయోగం? ఎట్లా పోతుంది?     అనేవి.

ఎన్నో వేల ఏళ్ళ  నాటి క్రింద భారత దేశంలో మన పూర్వికులు ఈ పంధాలో ఆలోచించారంటే నిజంగా మనకి మనం మెచ్చుకోవాలి గర్వపడాలి.

మీరు ఈ ఉపనిషత్  అర్ధం చేసుకోటానికి  ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది:

ఉపనిషత్ లు  

Tuesday, November 16, 2021

182 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 3 (Prasnopanishad )

ఒక రోజు ఆరుగురు మహనీయులు కబందీ కాత్యాయన, భార్గవ వైదర్భి , కౌసల్య అశ్వలాయన, సౌర్యాయణీ గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు. భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

విష్ణుమూర్తి జగత్తుని సృష్టించడానికి బ్రాహ్మని  సృష్టించాడు. ప్రజాపతి(బ్రహ్మ) తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించింది. అదే మూల ప్రకృతిగా అనేక జీవుల పుట్టుకకు దోహదపడింది  అని చెబుతారు. 

అంటే వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

రెండవ అధ్యాయం మొదటి మంత్రం.

అధ హైనం భార్గవో వైదర్భి: పప్రచ్చ  : ఆ తర్వాత విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అడిగాడు 

భగవన్కత్యేవ దేవాః ప్రజాం విధారయన్తే ?  :  ఏ దేవతలు ఒక వ్యక్తికి స్థితికారకులు  

కతర ఏతత్ప్రకాశయన్తే ?  :   వారిలో ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు 

కః పునరేషాం వరిష్ఠ ఇతి  :  వారిలో ఎవరు శ్రేష్ఠులు అని            ( 2-1)

కబంధీ కాత్యాయనుడి మొదటి  ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పిన తర్వాత భార్గవుడు రెండవ ప్రశ్న వేశాడు. ఏ దేవతలు ఒక వ్యక్తి జీవించటానికి కారకులు ? వారిలో ఎవరు శ్రేష్ఠులు అని.

భార్గవుని ప్రశ్నలో  దేవతలు అనే పదం వాడారు కానీ ఆయన ఉద్దేశం ఒక వ్యక్తి లో ఉన్న ఇంద్రియాలు పని చేయటానికి ఎవరు కారకులు, వారిలో ఎవరు గొప్ప అని. మనం దీన్ని ఉదాహరణకి మనకు తెలిసిన  జ్ఞానేంద్రియాలు అని అనుకుందాము. జ్ఞానేంద్రియాలు లేక పోతే మనిషికి ఒక స్థితి అంటూ ఉండదు. 

మనం ఇంకో ఉదాహరణకి కన్ను తీసుకుంటే, కన్ను ఒక గాజు ముక్క, తన పని అల్లా కాంతికిరణాలని వెనకాల ఒక తెరమీదికి చేర్చటమే. మనము ఆ కిరణాల సముదాయాన్ని గుర్తించటం అనే పని ఇంకొక చోట, మనము చూడలేని చోట, జరుగుతుంది. మన దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఈ విధంగానే పని చేస్తాయి.  

వేల సంవత్సరాల క్రిందట ఈ ప్రశ్న వచ్చిందంటే నిజంగా గొప్పే. ఏ సమాధానం కనపడని  ప్రశ్నలకి మనకు కనపడని  దేవతలు చేస్తున్నారు అనుకోవటం నా ఉద్దేశంలో సహజమే.

రెండవ అధ్యాయం రెండొవ  మంత్రం.  (2-2)

తస్మై స హోవాచ  : అతడితో పిప్పలాద చెప్పాడు 

ఆకాశో హ వా ఏష దేవో వాయురగ్నిరాప:  : ఆకాశం వాయువు అగ్ని నీరు   

పృథివీ వాజ్ఞ న శ్చక్షు: శ్రోత్రం చ  :  పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు 

తే ప్రకాశ్యాభివదన్తి  :  దేవతలు వాటి పనిని గురించి గొప్పల చెప్పుకుంటున్నాయి 

వయమే తద్బాణ మవష్టభ్య విధారయా మః  :  శరీరం కలిపివుంచి మేమే శరీరాన్ని భరిస్తున్నాము      

మొదట ఆకాశం వాయువు అగ్ని నీరు పృద్వీ వాక్కు మనస్సు కళ్ళు చెవులు ఇవన్నీ శరీరాన్ని కలిపివుంచి శరీరాన్ని భరిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాయని పిప్పలాదుడు చెప్పారు.

నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం , వారే (సంసారం) అంతా భరిస్తున్నా రంటారు.

 తాన్వరిష్ఠ:  ప్రాణ ఉవాచ  : వాటిలో శ్రేష్ఠమైన ప్రాణం అన్నది 

మా మొహమా ప ద్యధాహ  మేవై : ఎవరుగొప్ప అను భ్రాంతి లో పడకండి   (2-3)

కానీ  మధ్యలో "ప్రాణం" వచ్చి నన్ను నేనే ఐదుగా విభజించుకుని ఈ శరీరాన్ని స్థంబం లాగా నిలబెడుతున్నాను. ఇంకొకళ్ళు గొప్ప అనే భ్రాంతి లో పడవోకండి అని అన్నది. కానీ  ఆ దేవతలు నమ్మలేదు అని చెప్పారు.

అందుకని "ప్రాణం" ఊర్ధ్వ దిశగా వెళ్ళిపోదామని బయలు దేరింది.  జ్ఞానేంద్రియాలలో  "ప్రాణం" ఉన్నది కాబట్టి అవి కూడా ప్రాణంతో వెళ్ళటానికి సిద్దమైనాయి. మరల "ప్రాణం" తన యధాస్థితికి వచ్చిన వెంటనే అవి గూడావాటి యధాస్థితికి  జేరినాయి. అందుకని అన్నిటికన్నా ప్రాణమే శ్రేష్టమైనది అని పిప్పలాదులు అన్నారు.

నా మాట:

నిజ జీవితం లో కూడా ఏది ముఖ్యమో ఎవరు ముఖ్యమో గమనించకపోతే కాపురాలూ, కంపెనీలూ పేక మేడల్లాగా కూలిపోతాయి. అటువంటప్పుడే  "ప్రాణం" లాగా ఎవరో వచ్చి మేలుకొలిపి రక్షిస్తూ ఉంటారు.

మన దేహం లో అగ్ని లేకపోతే శక్తి లేదు. నీరు లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవదు. వాయువు లేకపోతే మన శ్వాస లేదు. అల్లాగే మిగతా దేవతలన్నీ "ప్రాణ" ప్రేరేపణతో పనిచేసేవే.

ఈ రెండో అధ్యాయం లో మిగతా విశ్లేషణ అంతా "ప్రాణ" స్తుతి. అది ఎంత గొప్పదో చెబుతారు. మనిషిలో ప్రాణం లేకపోతే ఏమిజరుగుతుందో మనకందరికీ తెలుసు.

Sunday, November 7, 2021

181 ఓ బుల్లి కథ -- "ఎమిగ్డలా" (Amygdala) అరుస్తోంది

 

పై బొమ్మ మైక్రోసాఫ్ట్ పెయింట్ తో చెయ్యటం జరిగింది.

మన జ్ఞానేంద్రియాల నుండి  బయలు దేరిన సంకేతాలు మొదట వెన్నెముక (spinal card ) దగ్గరకి వస్తాయి. అక్కడ వెంటనే  చెయ్యాల్సిన పని ఉంటే అది కానిచ్చి మెదడులో థలామోస్  (Thalamus ) అనే చోటుకి జేరతాయి. ఉదా : మనం వేడి పెనం మీద చెయ్యి పిట్టామనుకోండి వెంటనే తీసేస్తామే, ఆ సంకేతం చేతికి వెన్నెముక (spinal cord ) నుండి వస్తుంది. ఆ తరువాత అది థలామస్ కి కూడా వెళ్తుంది.

థలామోస్ ఆ సంకేతాల్ని వెంటనే రెండు చోట్లకి పంపిస్తుంది , "ఎమిగ్డలా" (Amygdala) కి కార్టెక్స్ (cortex ) కి. 

"ఎమిగ్డలా" (Amygdala), ఆ సంకేతాలు లో ఏవన్నా అపకారం చేసేవి అని తాను అనుకుంటే వెంటనే  అవయవాలకు ఆజ్ఞలు జారీ చేసి ఆ పని ఆపమని చెప్పి చేయిస్తుంది. దీనిని fight flight  or freeze (FFF ) response  అంటారు. ఎదో ప్రమాదం జరగబోవచ్చని భావిస్తుంది కానీ అది నిజంగా జరుగుతుందో లేదో దానికి తెలియదు. "ఎమిగ్డలా" (Amygdala) గాబరా పడి  చేసే ఇటువంటి పనులు చాలా వరుకు జరగవు కానీ మనము "ఎమిగ్డలా" (Amygdala) ప్రేరేపణతో బాధ పడాల్సి వస్తుంది.

చాలా వరకు ఇటువంటి పనులని Obsessive Compulsive Disorder (COD ) అంటారు. మనం ఎదో చెయ్యకపోతే ఏమవుతుందో అనే బెంగతోనో భయంతోనో చెయ్యవలసి వస్తుంది. ఇవన్నీ "ఎమిగ్డలా" (Amygdala) పిలిస్తే (నుంచి) వచ్చిన ఆజ్ఞలు. COD చాలా రకాలుగా వస్తుంది, worry (what could go wrong and  potential outcomes), obsessions are another kind of obsessive thinking may involve repetitive thinking (Bruce may continuously thinking everyday that he may not complete his degree although he gets good grades),Perfectionism (people worry about what they do is not perfect), Compulsions ( repetitive behaviors or mental acts that a person engages into respond to a dreaded thought or situation or to reduce distress).

(COD ) ఈ "ఎమిగ్డలా" (Amygdala) చేసే తప్పుల వలన వస్తుందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. దీనివలన వచ్చేవి anxiety (బెంగ,ఆరాటం, ఆందోళన, చింత), worry (చింతించటం, దుఃఖించటం వగైరా ). మనము కొన్నిపనులు భవిష్యత్ లో జరుగుతయ్యో జరగవనో అని బాధపడుతూ వుంటాము (ఉదా : పెళ్లవుతుందా లేదా, పాస్ అవుతామా లేదా , ఆ అమ్మాయి నన్నుచేసుకుంటుందా? మొదలయినవి ). ఈ పనులు కొన్ని భవిష్యత్ లో జరగచ్చు జరగక పోవచ్చు. మనకి తెలియదు. వాటి  కోసం బాధపడుతూ చింతిస్తూ ఏవో చేస్తూనే ఉంటాము.

ఈ  "ఎమిగ్డలా" (Amygdala)  అరుపుల్ని ఆపడం ఎట్లా? మనస్సుకి తనకి తాను మార్చు కునే గుణం ఉంది కాబట్టి (neuroplasticity ) ఇది సాధ్యము. 

మొదట ఇవి  "ఎమిగ్డలా" (Amygdala) నుంచి వస్తున్నాయని గుర్తించటం. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు మనస్సులో ఇంకొక మంచి ఆలోచన తెచ్చుకుని ఆ పాత ఆలోచనని పోగొట్టటం. నిద్రలేమి కూడా ఈ ఆలోచనలకి కారణం కావచ్చు. Mindfulness, మెడిటేషన్, ఒకే వ్యాపకం మీద మనస్సుని కేంద్రీకరించటం చేస్తే కొంచెం ఉపశమనం పొంద వచ్చు.(మన మనస్సు ఏ ఒక సమయంలో అయినా వందల ఆలోచనలతో ఉంటుంది) . బాధలు ఎక్కువగా ఉంటే వైద్యులను కలవటం మంచిది. మన దేశంలో ప్రచారంలో ఉన్న సూర్య నమస్కారాలు, పూజ, ధ్యానం, జపం లాంటివి కూడా ఏకాగ్రతతో చేస్తే ఫలితం కనిపించవచ్చు.

నేను మన "Mind " ఎల్లా పనిచేస్తుందో తెలుసుకోవటం కోసం పుస్తకాలు చదువుతాను. చాలామంది శాస్త్రజ్ఞులు ఈ అంశం మీద పనిచేయటం మూలంగా కొత్త సంగతులు ఎప్పుడూ  వస్తూ ఉంటాయి. మొన్న ఈ సంవత్సరం ముద్రించిన క్రింది పుస్తకం లైబ్రరీ లో కనబడితే COD గురించి చదివాను. ఆ పుస్తకం వ్రాసిన వాళ్ళు ఇద్దరూ  licensed clinical psychologists. మీరు అమెరికాలో ఉంటే ఈ పుస్తకం చదవాలనిపిస్తే లైబ్రరీ లో అడిగితే తెప్పిస్తారు. దీని ఖరీదు $18.95.

Rewire Your OCD Brain (2021) 

(Powerful Neuroscience-Based Skills to Break Free from Obsessive Thoughts and fears)

by Catherine M. Pittman, PhD and William H. Youngs, PhD
Newharbingerpublications
www.newharbinger.com


Monday, November 1, 2021

180 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 2 (Prasnopanishad )

బ్రహ్మ నిష్ఠా గరిష్టు లైన ఆరుగురు శ్రోత్రియులు సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన, గురువు గారికి సరి అయిన కానుకలతో పిప్పలాద ఋషి ఆశ్రమానికి వచ్చి, అయ్యా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు.

ఒక సంవత్సరం పాటు మీరు నా ఆశ్రమ క్రమశిక్షణలో ఉండండి , అప్పటికీ మీ సందేహాలు తీరకపోతే మీరు వేసిన ప్రశ్న లన్నిటికీ నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతాను అంటాడు.

ఇక్కడ గమనించవలసినది ఎవరో వచ్చి ప్రశ్నలడిగితే సమాధానం చెప్పవలసిన బాధ్యత గురువుగారికి లేదు. పోనీ తాను చెబితే వాళ్ళకి తెలుస్తుందా లేక కంఠశోష మాత్రమే అవుతుందా అనేది గురువుగారికి తెలియదు. అందుకనే మీరు ఒక సంవత్సరం ఆశ్రమ నియమాలు పాటిస్తూ తన ఆశ్రమంలో ఉన్న తర్వాతే సందేహాలకి సమాధానాల సంగతి చూస్తాను అంటాడు గురువుగారు.

ఆశ్రమ క్రమశిక్షణతో ఒక సంవత్సరము గడిపిన తరువాత శిష్యుడు కబందీ కాత్యాయన మొదటి ప్రశ్న వేస్తాడు.

భగవన్కుతో హ వా ఇమాః  ప్ర జా: ప్రజాయన్తీ ఇతి   :  (1-3)

భగవాన్ ఈ ప్రాణకోటి ఎక్కటి నుండి పుట్టింది ? 

కాత్యాయన ప్రశ్నకి గురువుగారు క్రింది మంత్రాలలో సమాధానం చెబుతారు.

ప్రజాకామోవై  ప్రజాపతి:  :  ప్రాణులను సృష్టించ దలచి  ప్రజాపతి 

స తపః అతప్యత  :   తపస్సు చేశాడు 

స తపః తపస్తప్యా స మిథునం ఉత్పాదయతే :   తపస్సు తరువాత జంటను సృష్టించాడు  

రాయించ ప్రాణం చేత్యేతౌ  మే  బహుధా ప్రజా: కరిష్యత  ఇతి :  రయిని, ప్రాణాన్ని (సృష్టించి) ఈ రెండూ నాకోసం అనేక జీవాల్ని  ఉత్పత్తి చేస్తాయి అనుకున్నాడు.  (1-4)

ప్రాణకోటి ఎల్లా పుట్టింది అనే కాత్యాయన ప్రశ్నకి గురువుగారు ప్రజాపతి తపస్సు కారణంగా జీవోత్పతికి "రయి", "ప్రాణం" అనే ఒక జంట ఉద్భవించి, మూల ప్రకృతిగా (అనేక జీవుల పుట్టుకకు) దోహదపడుతుంది అని చెబుతారు. 

ఇక్కడ ప్రజాపతి అంటే ఎవరోకాదు విష్ణుమూర్తి సృష్టించిన బ్రహ్మ.  (ముండక ఉపనిషత్)

ఈ మంత్రం అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం కానీ ప్రయత్నిద్దాము. "ప్రాణం" అనే దానికి శక్తి  ఉత్పాదించేది  అనే అర్ధం చెప్పుకుంటే, శక్తిని ఉపయోగించేది  "రయి "  అవుతుంది. ప్రపంచంలో మనం చూసేవన్నీ జంటలు. సూర్యుడూ చంద్రుడూ, మగా ఆడా, పగలూ రాత్రీ, పుట్టుక చావు, తయారుచేసేవి తినేవి. 

ఉదాహరణకి సూర్యుడూ చంద్రుడూ తీసుకుందాము. సూర్య కాంతి లేనిది చంద్ర కాంతి లేదు. పగలూ రాత్రీ లేదు. శక్తి నిచ్చేది సూర్యుడు శక్తిని తీసుకునేది చంద్రుడు . వీటినుండి కాలమానం ఎల్లా వచ్చిందో చూడండి.

సూర్యుడు చంద్రుడూ తిరిగితే కానీ ఒక రోజు, 24 గంటలు పూర్తవదు. ఈ జంట వలన మనము కాలం గుర్తించి  రోజులు గుర్తించ గలుగుచున్నాము, పూర్ణమి అమావాస్య, ఉత్తరాయణం దక్షిణాయనం, కృష్ణ పక్షం శుక్ల పక్షం. వీటినుంచి ఋతువుల క్రమం కూడా గుర్తించాము.  ఇంతెందుకు మనం మన రోజూ దిన చర్య మొదలుకుని అంతా వీటి చుట్టూతా తిరుగుతాము.  

ఇంకో ముఖ్య ఉదాహరణ ఆడా మగా. వీళ్లిద్దరూ కలియక పోతే  మానవ జన్మ ఉండదు. భూమిమీద  మనుషులు కూడా ఉండరు.

అన్నం వై ప్రజాప్రతిస్తతో హ వై తద్రేతస్తస్మాదిమః  ప్రజా: ప్రజాయంత ఇతి   (1-14)

ఆహారమే ప్రజాపతి. అన్నం నుంచే మనుష్య బీజం ఉత్పత్తి అవుతుంది. ఆ బీజం నుండే మనుష్య సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది. (ఇక్కడ అన్నం అంటే తినే ఆహారమని అర్ధం)

శుక్రశోణిత సంయోగమేవ సృష్టి:  : స్త్రీ పురుషుల నుండి శుక్ర శోణిత బీజాలు కలిస్తే సృష్టి జరుగుతుంది.

వరసగా  మిధున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి, అన్న సృష్టి, రేతస్సు సృష్టి ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అనేక దశల తర్వాత ప్రజా సృష్టి జరుగుతుంది అని కాత్యాయన ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్పారు. (తస్మాదిమః ప్రజా: ప్రజాయంత ఇతి)

నా మాట: మనంజీవించటానికి సూర్య చంద్రులు చాలాముఖ్యం. అందుకనే సూర్యనమస్కారాలు వచ్చాయి. మనం నమస్కారాలు చెయ్యవలసిన అవసరం లేదు సూర్య దేవు డేమీ బాధపడడు. కానీ జీవితంలో మనకు సహాయం చేసిన వారినీ చేస్తున్న వారిని గుర్తించటం మన సభ్యత భాద్యత కూడా.

కాలం సృష్టించిన సూర్య చంద్రులు వందేళ్ల క్రిందటా ఇలాగే ఉన్నారు వందేళ్ల తరువాత కూడా ఇలాగే ఉంటారు. వారు సృష్టించే ఈ కాలంలో అరిగిపోయి ఒరిగిపోయేది మనమే . 

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Six pundits reached the Ashram of  Rishi Pippalada and requested him to clear some doubts they gathered during their philosophical journey. Pippalada suggested to them that they should stay with him for an year and then if they ask he may tell if he know the answer to those questions. 

The year went by and the first question came from Kathyayana about the theory of creation, how the creatures were born ?.  

To that question the guru replied, Lord Vishnu created Prajapathi(Brahma) and assigned the duty of creating the world. Prajapathi meditated on this assignment and produced a pair "Rayi" and "Prana"to create the world.

That is why every significant thing in this world comes in pairs. Ex: Sun and Moon, Male and Female.

Without Sun and Moon there is no concept of time, Year, month and seasons.

Without Male and Female there is no human beings.

ఇంకా మీరు చదివి తెలుసుకోవాలంటే ఈ క్రింద ఇచ్చిన లింక్ లు ఉపయోగ పడతాయి.

ప్రశ్నోపనిషత్

ఉపనిషత్తులు









Monday, October 25, 2021

179 ఓ బుల్లి కథ -- ప్రశ్నోపనిషత్ - 1 (Prasnopanishad )

ఈ ప్రశ్నోపనిషత్ , అధర్వణ వేదము  నుండి గ్రహించ బడినది. అధర్వణ వేదములో మూడు ముఖ్య ఉపనిషత్ లు ఉన్నాయి. అవి  ముండక, ప్రశ్న, మాండూక్య.  అందుకని అధర్వణవేద శాంతి మంత్రం ఈ మూడింటికీ వర్తిస్తుంది.

శాంతి మంత్రం:

ఓం భద్రం కర్ణేభిః  శృణుయామ దేవా:  :   మా చెవులతో మంచి మాటలు  వినుగాక 

భద్రం పశ్యే మాక్షభిర్యజత్రా:   :   బుద్ధితో అర్ధం చేసుకునేటట్లు చేయి 

స్థిరై రంగైస్తుష్టువాగంసస్తనూభిః  :  దేవతలని అనేక సూక్తుల ద్వారా ప్రార్ధించనీ 

వ్యశేమ దేవహితం యుదాయుః  : దేవుడిచ్చిన పూర్ణాయుష్షుని అనుభవించనీ 

స్వస్తి న  ఇంద్రో  వృద్ధశ్రవాః  :  ఇంద్రుడు మాకు మేలు చేయు గాక 

స్వస్తినః  పూషా  విశ్వవేదా :     :   ఈశ్వరుడిని అర్ధం చేసుకునేలా బుద్ధి ప్రకాశం చేయి 

స్వస్తి నస్తార్ క్ష్యో  అరిష్టవేమి: :  నా ఆధ్యాత్మిక ప్రయాణం ఆటంకం లేకుండా చేయి 

స్వస్తి నో బృహస్పతి ర్దధాతు  : నా బుద్ధిని పదును చేసి అన్నీ  అర్ద్మమయ్యేలా చెయ్యి 

ఓం శాంతి: శాంతి: శాంతి:  : ఆది దైవిక , ఆది భౌతిక , ఆధ్యాత్మిక  ఆటంకాలని తొలగించు 

ఓ దేవతలారా మా చెవులతో శుభప్రాయమైనవి విని, కళ్ళతో శుభప్రాయమైనవి చూస్తూ, వాటిని అర్ధం చేసుకునేలా బుద్దిని ప్రసాదించి, మమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యముతో ఉంచి, ఆపదలలో నుండి రక్షిస్తూ, మా ఈ ఆధ్యాత్మిక  జీవితాన్నీఆటంకాలు లేకుండా ముందుకు తీసుకు వెళ్ళండి.

జీవితంలో మనకు తెలియని సంగతులు తెలుసుకోవాలంటే మనకు వాటిని గురించి చెప్పేవాళ్ళు ఉండాలి తెలుసుకోవాలనే మన ప్రయత్నమూ కావాలి. వీటన్నింటికన్నా ముందర మనకి ఎవరన్నా చెబితే అర్ధం చేసుకునే శక్తి ఉండాలి. దీనితోపాటు ఆరోగ్యం సరీగ్గా ఉండాలి. మన ప్రయత్నాలకు అడ్డంకులు రాకుండా ఉండాలి. వీటిలో మనం చేసే ప్రయత్నం తప్ప మిగతావన్నీ ఇతరుల మీద ఆధారపడి నవే. ఈ ప్రపంచంలో మన మొకళ్ళమే చేయగలిగినవి చాలా తక్కువ. అది ఎప్పుడూ మనం గ్రహించి ఉండాలి.

ఈ ప్రశ్నోపనిషత్ లో  ఆరుగురు చదువుకున్న  శ్రోత్రియులు ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి తీర్చమని అడుగుతారు. 

తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందని తెలుస్తోంది గానీ, తాను చెబితే వాళ్ళకి  గ్రహించగల శక్తి  ఉన్నదో లేదో గురువుగారికి సందేహంగా ఉంది. నాకు ఇక్కడ "శుభోదయం" సినీమా, దానిలో హీరో గుర్తుకు వస్తున్నారు. 

IIT లలో చదవాలని చాలామందికి కోరిక ఉంటుంది. పెద్ద ఉద్యోగాలూ పెద్ద పదవులూ వాటితో వచ్చే సంపద అందరికీ ఇష్టం. కోరిక మాత్రమే IIT ప్రవేశానికి అర్హత కాదు గదా, IIT వాళ్ళకి వీళ్ళు పాఠాలు గ్రహించ కలిగే శక్తి  ఉన్నదో లేదో తెలియాలి కదా. అందుకే ప్రవేశ పరీక్షలు పెడతారు. 

అందుకనే గురువుగారు " అబ్బాయిలూ మీకు తెలుసుకోవాలనే కోరిక ఉన్నది సంతోషం. మీరు ఒక సంవత్సరం పాటు సుఖాలకి అతీతంగా ఆశ్రమ క్రమశిక్షణలో నా దగ్గర ఉండి శిష్యరికం చేయండి. అప్పుడు మీరడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలిస్తే నాకు చెప్పాలని అనిపిస్తే మీకు తప్పకుండా చెబుతాను " అంటాడు. 

గురువుగారి పేరు  పిప్పలాద మహర్షి ,  శిష్యుల ఆరుగురి పేర్లు , సుకేశ భరద్వాజ, శైబ్య సత్యకామ, సౌర్యాయణీ  గార్గ్య, కౌసల్య అశ్వలాయన, భార్గవ వైదర్భి , కబందీ  కాత్యాయన. 

అమెరికా లో పేరుపెట్టేవిధానం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లు,  ఇక్కడి నుండే నేర్చుకున్నారే మో  !.

సంవత్సరం అయిపొయింది గురువుగారికి శిష్యుల మీద నమ్మకం కలిగి వారి ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఉపక్రమిస్తారు.

వచ్చే పోస్టుల్లో గురు శిష్యుల సంవాదం గురించి తెలుసుకుందాము.

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

Prasnopanishad is one of the three major Upanishads taken from Atharva Veda. The other two being
Mundka and Mandukya Upanishads.

Six students of Vedanta reached the ashram of Pippalada Maharshi and respectfully requested him to shed light on some of their doubts in Vedanta, the Hindu philosophy. The Maharshi was not able to assess the ability of the students to grasp the subject. So he wanted them to stay in his Ashram for a period of one year following all the rules and regulations of the Ashram. After that, he will try to answer their questions if he knows the answers. The students agreed to it and spent one year in the Maharshi Ashram under strict controls of the Ashram. 

Prasnopanishad is the documentation of the question answer session between teacher and students.

Monday, October 11, 2021

178 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-3 (Mundakopanishad )

యజ్ఞ యాగాదులు క్రమం తప్పకుండా చేసి మంచి గృహస్థు అని పేరుతెచ్చుకున్న శౌనికుడు, మహా ఋషి బ్రహ్మజ్ఞాని అయిన అంగీరసుని ఆశ్రమానికి వచ్చి గురువుగారిని "ఏవి నేర్చుకుంటే ఇంకా ఏవీ నేర్చుకోవక్కరలేదు?" అని అడుగుతాడు.

అందుకు గురువుగారు "విద్యలు రెండు రకాలు అవి పరా, అపరా " అని చెబుతారు.  ప్రతిఫలాపేక్షతో చదివి చేసిన కర్మలన్నీ అపరా విద్యలు. వాటిని జిజ్ఞాసతో చేస్తే పుణ్యఫలం కలుగుతుంది గానీ అది అశాశ్వితము, పుణ్యఫలం కరిగి పోయిన వెంటనే పుణ్యలోకాలనుండి క్రిందకు దిగి వచ్చుట తధ్యము." అని చెబుతారు. 

ఈ జగత్ సృష్టించినప్పుడు , బ్రహ్మ తన సృష్టి అన్నిటిలోను తన "అంశ " ఉంచటం జరిగింది. అందుకే "అహం బ్రహ్మ" అని తెలుసుకోవాలి. నీలో ఉన్న ఆ బ్రహ్మ రూపాన్ని తెలుసుకుని దాన్ని ఆరాధిస్తే దానికన్నా జీవితంలో కావలసినవి ఏవీ ఉండవు. జీవితమంతా సత్ చిత్ ఆనందంతో గడుపుతావు అని గురువుగారు చెబుతారు.

ప్రకాశవంతమైన అనంతమైన బ్రహ్మ నీ హృదయంలో నెలకొని ఉన్నది. దానిలో శ్వాస పీల్చేవి రెప్పలార్పేవి అన్నీ ప్రతిష్ఠమై ఉన్నాయి. దానిని గురించి తెలుసుకొనుటయే శ్రేష్టమైన పరావిద్య.(2-2-1)

మనకున్న పరిజ్ఞానంతో మనలోని  ఆత్మ ఉన్నదని గ్రహించవచ్చు గానీ చూడలేము తాకలేము. ఉదాహరణకి పగలు పూట ఆకాశంలో నక్షత్రాలు ఉన్నా చూడలేము కదా . 

ఇంకొక ఉదాహరణ మనము చూసే "వెలుగు". మనము ఒక తలుపు తెరుచుకొని ఒక గదిలోకి వెళ్ళాము అనుకోండి. గదిలో ఏమున్నాయి అంటే ఏమి చెబుతాము ? మనకు కనపడేవి కుర్చీ, బల్ల, పుస్తకం, కలం అని చెబుతాము. అవి మనకు కనపడేవి, తాకితే అందేవి. తలుపు మూసేసి గదిలో ఏమున్నాయో చెప్పండి. ఏవీ కనపడవు. మొదట మనకి కనపడటానికి కారణం తరువాత కనపడక పోవటానికి కారణం "వెలుగు". ఈ వెలుగుని మనం చూడలేము, పట్టుకోలేము, వర్ణించలేము. అందుకే గదిలో మనం గుర్తించిన వాటిలో అదిలేదు. అసలు మనకి అది మనకు తెలుసనుకుంటాము గానీ తెలియదు (అతీతము ).
 
వెలుగులాగే మనలో ఉన్న, మన ఉనికికి కారణమయిన జీవాత్మని మనము చూడలేము వర్ణించలేము పట్టుకోలేము. మనని మనం ఎల్లా చూడలేమో మనలో ఉన్నజీవాత్మని గూడా మనము చూడలేము. అది ఒక అనుభూతి. మనకి మనం చూడటానికి ఉపయోగపడే అద్దం లాంటి పరికరం మనలోని జీవాత్మను చూడటానికి లేదు. (3-1-8)

అందుకే ఉపనిషత్  చెబుతోంది;  ఉపనిషత్తులు అందించిన ధనస్సుతో నీ ఉపాసనల ప్రభావముచే తీక్షణమైన బాణాన్ని బ్రహ్మచింతనతో ఎక్కుపెట్టి, నీ గమ్యం బ్రహ్మని చేరు. పరమాత్మే లక్ష్యంగా ఓంకార మంత్రం జపిస్తూ పరమాత్మతో మమేకమైపో. (2-2-4,2-2-5)

సకలజీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని ఎవరు గ్రహిస్తారో అతను మితభాషిగా ఉండి ఆత్మతోనే విహరిస్తూ ఆనందం పొందుతాడు. అన్ని కర్మలూ చేసి ఆదర్శంగా ఉన్న ఇతడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. (3-1-4)

జీవితంలో సత్యవాదులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. (3-1-6)
మన నోట్ల మీద మూడు సింహాల తో ఉండే  "సత్యమేవ జయతే" ఈ ముండకోపనిషత్ లోనుండి తీసుకోవటం జరిగింది. 

మనలో ఆత్మని  కనుగొనటానికి ఒక చిన్న పరిశోధన చెయ్యవచ్చు. మనకేమీ కనపడకుండా కళ్ళు మూసేసుకుందాము, ఏమీ వినపడకుండా చెవులు మూసేసుకుందాము, మన జ్ఞానేంద్రియాలు పని చెయ్యకుండా (తెలియకుండా) చూసుకుందాము, చివరికి మిగిలిన మన మనస్సుని ఎక్కడికీ పోకుండా అదుపులో పెట్టుకుందాము, మనకు తెలిసినంత వరకూ మనలో చివరికి మిగిలింది ఆత్మ ఏ కదా మనము చూడగలమా ? అనుభూతి పొందగలమా ? జ్ఞానులు మాత్రమే దానిని చూడగలుగు తారని (1-1-6) మంత్రం చెబుతోంది.

మనం ఆత్మానుభూతి పొందాలంటే, మనము సత్యవాదులమై , సక్రమమైన మార్గంలో నడుస్తూ ఆత్మ సాక్షాత్కారం పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు గారు సరిఅయిన మార్గం చూపించాలి. (1-2-11,1-2-12,1-2-13)

నా మాట:

వేదాంత భాషలో,
పరమాత్మ అంశ జీవాత్మ భౌతిక శరీరంలో ప్రవేశించి మన ఆటలు చూస్తూ ఉండి,  సమయం రాగానే మన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళి పోతుంది. మన జీవిత కాలంలో ఆడిన ఆటల సారాంశం మనం జీవితంలో చేసిన పుణ్య పాపాలు. ఆ పుణ్య పాపాలను బట్టి మన పునర్జన్మలు ఉంటాయి. 
మన జీవిత ఆటలు మనము అనుసరించిన పంచ మహా యజ్ఞాలు అయితే, మన జీవాత్మతో మనము మమేకమై జీవిస్తే, పునర్జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. 

1. మనకు ప్రాణమిచ్చి సర్వేంద్రియాలచేత పనిచేయించేది మనలో ఉన్న ఆత్మ. అదే జీవాత్మ అదే పరమాత్మ అంశ. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే.
2. ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలోనూ ఉండేది అదే పరమాత్మ అంశ.
3. మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించ గలిగితే , మనచుట్టూతా ఉన్న అందరిలోనూ ఆ పరమాత్మను చూడగలుగుతాము. 
4. మనలో (జీవుల్లో) ఎక్కువ తక్కువలు లేవు అందరూ ఒకటే అని తెలుసుకుంటాము.

తెలుగు చదవటం చేతకాని వాళ్ళకోసం (మా పిల్లలకోసం  ) క్రింద ఇంగ్లీష్ లో వ్రాస్తున్నాను.

This Mundaka Upanishad is a conversation between a student Sounika and a Guru Angeerasa.

A well-known famous family man named Sounika approaches a Brahma Rushi (teacher) Angeerasa and questions him "After learning which there is nothing to learn anymore".

Sounika is well-known in the community who does all his duties including the fire sacrifices as prescribed in the vedas.

Rushi Angeerasa has an ashram and teaches Vedic scriptures to his students. Angeerasa is in the lineage of people who learned Brahma vidya (creation of the world).

Vishnu created Brahma and asked him to create the world. Brahma created the world as we see today and told all the secrets to his eldest son. In those days, knowledge passed through generations by reciting and remembering scriptures. So Brahma Vidya passed through generations and finally reached Rushi Angeerasa.

Angeerasa tells Sounika that there are two types of knowledge one is para vidya and the other is apara vidya. Everything you do for getting rewarded is Apara Vidya. Whatever you learned and practiced until now is Apara vidya, by knowing and performing rituals as described in it you will not be seeing the end of the tunnel. Only Para vidya, the knowledge of God in you, will lead to salvation. And that is the Vidya (Brahma Vidya) you should learn.

When Brahma created the world, he put a piece of him in all things he created. That god in you is the one which makes you alive until it decides to leave the body. So what Angeerasa is telling Sounika is to realize the god in you through meditation, by that realization you will be with god all the time and the day to day things will not affect you.

Angeerasa teaches Sounika how to gain that knowledge, Brahma vidya, by concentrating and meditating on "OM".

The following Video in English of help in understanding the Upanishad.
ముండక ఉపనిషత్


ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని  ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.



*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 1  (2-2-1):

ఆవి: సం ని హితం గుహాచరం నామ : ప్రకాశవంతమైన చాలాదగ్గరగా హృదయమనే గుహలో సంచరించేదయిన

మహత్పదమత్రైతత్ సమర్పితమ్ : అనంతమైన బ్రహ్మలో ఇవన్నీ నెలకొని ఉన్నాయి

ఏజత్ ప్రాణాన్నిమిషచ్చ యదేతత్ జానథ సదసద్వరేణ్యం : చరించేవి జీవమున్నవీ చూడగలిగినవీ మీరందరూ తెలుసుకోండి కనపడేవి కనపడనివి ఉత్తమలక్ష్యం

పరం విజ్ఞానాద్ యద్వరిష్టం ప్రజానామ్ : పరావిద్య అదిశ్రేష్ఠం

ప్రకాశవంతమైన అనంతమైన బ్రహ్మ నీ హృదయంలో నెలకొని ఉన్నది. దానిలో శ్వాస పీల్చేవి రెప్పలార్పేవి అన్నీ ప్రతిష్ఠమై ఉన్నాయి. దానిని గురించి తెలుసుకొనుటయే పరావిద్య శ్రేష్టమైన విద్య అని తెలుసుకోండి.
*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 3  (2-2-3):

ధనుర్గ హీత్వౌ పనిధం మహాస్త్రం : ఉపనిషత్తులు చెప్పే ధనుస్సు మహాస్త్రాన్ని తీసుకుని

శరం హి ఉపాసానిశితం సన్దయీత : ధ్యానంచేసి పదునుచేయబడిన బాణాన్ని సంధించాలి

అయమ్య తద్భావగతేన చేతసా : బ్రహ్మ భావనతో నిండిన మనస్సుతో లోపలికిలాగి

లక్ష్యం తదేవాక్షరం సోమ్య విద్ధి : లక్ష్యాన్ని బ్రహ్మ తెలుసుకో సౌమ్యుడా

సౌమ్యుడా ఉపనిషత్తులు అందించిన ధనస్సుతో నీ ఉపాసనల ప్రభా వముచే తీక్షణమైన బాణాన్ని బ్రహ్మచింతనతో ఎక్కుపెట్టి, నీ గమ్యం బ్రాహ్మని చేరు.

*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 4  (2-2-4):

ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మం తల్లక్ష్య ముచ్యతే : ఓం కార మంత్రం ధనుస్సు ఆత్మయే బాణం పరమాత్మే ఆ లక్ష్యం

అప్రమత్తే న వేద్ధవ్యం శరవత్థన్మయో భవేత్ : ఏమరుపాటులేని మనసుతో ఛేదించాలి బాణం లాగా ఆ లక్ష్యంతో ఒకటైపోవాలి

పరమాత్మే లక్ష్యంగా ఓంకార మంత్రం జపిస్తూ పరమాత్మతో మమేకమైపోవాలి.
*********************************************************

రెండవ ముండకం ద్వితీయ ఖండం మంత్రం 5:

యాస్మిన్ ద్యౌ: పృథివీ చాన్తరిక్షమోతం :  పరమాత్మ అనే దారంలో భూలోకం భువర్లోకం 

మనః సహ ప్రాణైశ్చసర్వై:  :  సువర్లోకం నెలకొని ఉన్నాయి మనసు ప్రాణాలు కూడా అన్నీ 

తమేవైకం జానథ ఆత్మానమ్ అన్యా  : ఆ పరమాత్మ జీవాత్మ రెండూ ఒకటేనని తెలుసుకోండి 

వాచోవిముఞ్చథా అమృతస్యైష సేతు:    : వేదాంతం కాని వాటినన్నిటినీ వదిలిపెట్టండి ఇది అమరత్వానికి వారధి 

పరమాత్మ అనే దారంలో లోకాలన్నీ నెలకొని ఉన్నాయి.  పరమాత్మ జీవాత్మ ఒకటే. అమరత్వానికి  వేదాంతం కాని వాటిని వదిలి పెట్టండి.
*********************************************************
మూడవ ముండకం ప్రధమ ఖండం మంత్రం 4 (3-1-4):

ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి : ఈ పరమాత్మను సకల జీవులలో ప్రకాశిస్తున్నది

విజానన్ విద్వాన్ భవతే నాతివాదీ : ఏవివేకి గ్రహించిన వ్యక్తి మితభాషి అవుతాడు

ఆత్మక్రీడ ఆత్మరతి: క్రియావాన్ : ఆత్మలోనే రమిస్తాడు ఆత్మలోనే ఆనందిస్తాడు కర్మలను చేసేవాడు

ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ: : ఇతను ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడు

సకలజీవులలో ఉన్నది ఒకే పరమాత్మ అని ఎవరు గ్రహిస్తారో అతను మితభాషిగా ఉండి ఆత్మతోనే విహరిస్తూ ఆనందం పొందుతాడు. అన్ని కర్మలూ చేసి ఆదర్శంగా ఉన్న ఇతడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. 
*********************************************************

మూడవ ముండకం ప్రధమ  ఖండం మంత్రం 6  (3-1-6):

సత్యమేవ జయతే నానృతం : సత్యం మాత్రమే జయిస్తుంది అసత్యంకాదు 

సత్యేన పన్దా  వితతో దేవయానః : సత్యం చేత శుక్లగతి ఏర్పడి వుంది 

యేనాక్రమన్తి  ఋషయో హి ఆప్తకామా : దానిద్వారా కోరికలు తీరినవారు సగుణ బ్రహ్మ ఉపాసకులు వెళ్తారు 

యత్ర తత్సత్యస్య  పరమం నిధానమ్ : ఆ బ్రహ్మలోకం సత్యం యొక్క శ్రేష్ఠమైన మోక్ష మనే నిధి 

సత్యవాదులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. సత్యమే పలికే సగుణ బ్రహ్మ ఉపాసకులు, శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మలోకంలో శ్రేష్టమైన మోక్ష మనే నిధిని కనుగొంటారు. 

Monday, October 4, 2021

177 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-2 (Mundakopanishad )

విష్ణుమూర్తి బ్రహ్మని సృష్టించి తనని ప్రపంచమును సృష్టించమని చెప్తాడు. బ్రహ్మ "జగత్" ని సృష్టించటం జరిగింది(పరమాత్మ). సృష్టించటమే కాదు దానిని "ఆటోమేట్" కూడా చేశాడు (అది పూర్ణం దాని నుండి వచ్చిన ఇది పూర్ణం). అంతేకాదు తాను సృష్టించిన ప్రతిదానిలోనూ తన "అంశ" ఉంచటం జరిగింది (జీవాత్మ ). జీవు లన్నిటిలో ఉండే జీవాత్మని బ్రహ్మన్  (Brahman ) అనికూడా అంటారు.

బ్రహ్మ తన సృష్టి రహశ్యాలన్నీ మొదట తన జేష్ఠ పుత్రుడు అధర్వునికి చెప్పాడు. అప్పటినుండీ తరతరాలుగా ఆ రహస్యం ఒకరినుండి ఒకరికి వ్యాప్తి చెంది అంగీరసుని వరకూ చేరింది. 

ఈ ఉపనిషత్ లో ముఖ్యభాగం గురుశిష్యుల సంవాదాము. శిష్యుడు గృహస్థు మహాశాలి శౌనికునికి,  గురువుగారు బ్రహ్మజ్ఞాని అంగీరసునికి  మధ్యన అంగీరసుని ఆశ్రమంలో జరిగిన సంవాదన.

జీవితమంతా శాస్త్ర ప్రకారం నిత్యకర్మలూ యజ్ఞ యాగాదులూ చేస్తూ మేటి గృహస్థుడు గా పేరుబడ్డ శౌనికుడు

 "ఏది నేర్చుకున్న తర్వాత ఇంకా నేర్చుకోటానికి ఇంకేమీ ఉండదు? అంతా తెలుకున్నట్లు అవుతుంది? " 

అని గురువుగారైన బ్రహ్మజ్ఞాని అంగీరసుని అడుగుతాడు. దానికి గురువుగారు సమాధానం చెబుతారు.

విద్యలు రెండు రకాలు అపరా విద్యలు, పరా విద్యలు. అపరా విద్య లన్నీ బయట ప్రపంచానికి సంబంధించినవి. బయట ప్రపంచానికి సంబంధించి, పంచేంద్రియాల కోరికలు తీర్చటానికి ఫలాపేక్షతో నేర్చుకున్న విద్యలన్నీ అపరా విద్యల కిందకి వస్తాయి. ఆత్మకు సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం నేర్చుకున్నది పరా విద్య.

ఫలాపేక్షతో చేసిన యజ్ఞ యాగాదులు మొదలయినవి అపరా విద్యలు. వీటి వలన ఫలితం  తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

బ్రహ్మ జ్ఞాన విద్య పరా విద్య. ఫలా పేక్ష లేకుండా చేసిన పరా విద్య తో కలిగే ఫలితం శాశ్వితం. ఇదే మోక్ష మార్గం. ఇంతవరకూ అపరా విద్యలలో ప్రావీణ్యం సంపాదించిన వారు అదే జిజ్ఞాసతో పరా  విద్యలు అభ్యసిస్తే/ఆచరిస్తే పర త్త్వాన్ని పొంది మోక్షము సాధిస్తారు. 

*************************

మొదటి ముండకం మొదటి ఖండం మంత్రం 2 (1-1-2):

అథర్వ ణే   యాం ప్రవదేత బ్రహ్మా : బ్రహ్మ దేవుడు దేనిని అథర్వునికి చెప్పాడో 

అథర్వా  తాం పురోవాచాంగిరే  బ్రహ్మవిద్యమ్ ఆ బ్రహ్మవిద్యను అథర్వుడు పూర్వం అంగిరునుకి చెప్పాడు 

స భారద్వాజాయ సత్యవాహాయ ప్రాహ : అంగిరుడు భారద్వాజ గోత్రమునకు చెందిన సత్యవాహినికి చెప్పాడు 

భరద్వాజో అంగీరసే పరవరామ్ : భరద్వాజుడు అంగిరసునికి బోధించాడు 

లోకం సృష్టించిన బ్రహ్మ దేవుడు ఆ రహస్యాలన్నీ తన పెద్ద కుమారుడు అథర్వునికి చెప్పాడు. అధర్వుడు అంగిరునికి చెప్పాడు. అంగిరుడు భరద్వాజ గోత్రుడైన సత్యవాహినికి చెప్పాడు. భరద్వాజుడు అంగీరసునికి చెప్పాడు.

********************

మొదటి ముండకం రెండవ ఖండం 10వ మంత్రం (1-2-10):

ఇష్టాపూర్తం మన్యమానా  వరిష్టం : అనేక యజ్ఞాలూ అనేక పుణ్యకార్యాలూ ఇవే గొప్పవనుకుంటారు 

నాన్యచ్చ్రేయో వేదయన్తే ప్రమూడా: : తక్కిన శ్రేష్ఠమయినవి తెలిసికొనుటలేదు పరమ మూర్ఖులు 

నాకన్య పృష్టే తే  సుకృతే నుభూత్వా : వారు స్వర్గంలో పైలోకాలు పుణ్యఫలం అనుభవించాక 

ఇమంలోకం హీనతరం వా  విశన్తి  : ఈ భూలోకంలో పుడతారు లేదా ఇంకా హీనమైన లోకాల్లో పుడతారు 

ఫలాపేక్షతో యజ్ఞ యాగాదులు మొదలైయినవి చేసి అవే గొప్ప అనుకుంటారు. వీటి వలన ఫలితం లభిస్తుంది కానీ అది తాత్కాలికము, అశాశ్వితము. చేసిన పుణ్యము కరిగిపోయిన వెంటనే  వీరు మరల భూమిమీద జన్మించి పాప కర్మలు అనుభవించవలసి వస్తుంది. కర్మ ఫలాల పట్ల ఆసక్తి ఉన్నంత వరకూ వారికి జ్ఞానోదయం రాదు.

********************

నా మాట:

సంవత్సరాల క్రిందట కమ్యూనికేషన్ చాలావరకు వాక్ (నోటి) ద్వారానే ఉండేది. నోటికీ మనసుకీ ఇంపుగా ఉండి గుర్తు పెట్టుకునే విధంగా ఉండటానికి ఛందో నియమాలు సృష్టించి నోటి మాటలుగా రచనలు చేసేవారు. గురువులు వాటిని ఆశ్రమాల్లో (ఆ నాటి పాఠశాలలు ) శిష్యుల చేత వల్లె వేయించేవారు. ఆ విధంగా తరతరాలుగా వేదాలూ ఉపనిషత్తులు వాడుకలో ఉన్నాయి.

కొంత కాలానికి ఉచ్చారణ మూలాధారంగా అక్షరాలూ లిపి తయారు చేశారు. అక్షరాలకు ఉచ్చారణ మూలాధారం అగుటచే మన భాషల లిపి మనము ఉఛ్చరించి నట్లు వ్రాస్తాము (phonetic).

వ్యాసమహర్షి ఆనాటి వాడుకలో నోటిద్వారా ప్రాచుర్యము పొందిన వేదాలు ఉపనిషత్తులు మొదలయినవి సేకరించి వాటిని గ్రంథ రూపంలో తాటాకుల మీద వ్రాయటం జరిగింది. 
వ్యాసుడు అంటే కూర్పరి (composer, compiler  ) అని అర్ధం.

ఈ ఉపనిషత్ అర్ధం చేసుకోటానికి క్రింది లింక్ లోని ఉపన్యాసాలు ఉపయోగపడతాయి.

Monday, September 20, 2021

176 ఓ బుల్లి కథ -- ముండకోపనిషత్-1 (Mundakopanishad )

ముండకోపనిషత్ అధర్వణ వేదం నుండి తీసికొన బడినది. ఇది మనకున్న పది ముఖ్య ఉపనిషత్ లలో ఒక ముఖ్య ఉపనిషత్. దీనిలోని 65 శ్లోకాలు 3 భాగాల్లో ఉన్నాయి. ఒక్కొక్క భాగమూ మళ్ళా రెండు ఖండాలుగా గ విభజించబడ్డాయి. 1-1-3 అంటే  మొదటి ముండకం లోని మొదటి ఖండంలో 3వ మంత్రం. దీనిలో భాగాన్ని ముండకం అంటారు.

సామాన్యంగా ఉపనిషత్ లు శిష్యుడి ప్రశ్నతో మొదలయ్యి దానికి గురువుగారి సమాధానంతో ముగుస్తుంది. ఇక్కడ శిష్యుడు శౌనికుడనే గృహస్థు, గురువుగారిపేరు అంగీరసుడు.

గృహస్థయిన శౌనికునికి తాను చెయ్యవలసిన కర్మకాండలు, యజ్ఞ యాగాదులూ అన్నీ చేసినా ఇంకా ఏదోమిగిలిపోయిందన్న దిగులు. దగ్గర ఆశ్రమంలో ఉన్న అంగీరసుడనే మహాముని దగ్గరకు వెళ్ళి తన అసంతృప్తిని చెప్పి జీవితంలో ఏవి చదివితే అంతా తెలిసిపోయి ఇంకా  చదవవలసిన/చెయ్యవలసిన అవసరము ఉండదో చెప్పమని అర్ధిస్తాడు .

ముండకం 1 ఖండం 1 మంత్రం 3  (1-1-3):

శౌనకో హ వై మహాశాలో ఆంగీరసం   : శౌనికుడనే మహాశాలి అంగీరసుని 

విధివధుప్రసన్న హ  పప్రచ్చ           : శాస్త్రోక్తరీత్యా సమీపించి ప్రశ్నించాడు 

కాస్మిన్ను భగవో విజ్ఞతే                       : దేనిని తెలుసుకుంటే భగవంతుడూ 

సర్వమిదం విజ్ఞాతం భావతీతి           : ఈ సర్వస్వమూ  తెలిసికోబడుతుంది అని 

ముండకం 1 ఖండం 1 మంత్రం 4 (1-1-4):

తస్మై స  హోవాచ           : అతనితో అతను చెప్పాడు 

ద్వే విద్యే వేదితవ్యే ఇతి : రెండు విద్యలు  తెలుసుకోవలసినవి అని 

హ స్మ యద్                        : అవి 

బ్రహ్మవిదో వదన్తి                : మహాత్ములు చెబుతారు 

పరా చైవాపరా చ                 :  పరా విద్య అపరా విద్య 

శౌనికుడు యజ్ఞ యాగాదులు చేస్తూ సౌభాగ్యవంతమైన జీవితం గడుపుతున్న ఒక గొప్ప గృహస్థు . అంగీరసుడు వారసత్వముగా బ్రహ్మజ్ఞానము తెలిసికొనిన గురుపరంపరలో ఏడవ వ్యక్తి. 

వేసిన ప్రశ్న: ఏది తెలుసుకుంటే అంతా తెలుకున్నట్లు అవుతుంది? (ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవటానికి ఇంకేమీ ఉండదు అని)

ఈ ప్రశ్నకిసమాధానం 4 వ మంత్రంలో గురువుగారు చెబుతారు. పర విద్య, అపరా విద్య అని రెండు విద్యలు ఉన్నాయి అవి నేర్చుకుంటే అన్నీ నేర్చుకున్నట్లే అని మహాత్ములు చెబుతారు అని.

శౌనికుని ప్రశ్న మనం సులభంగా అర్ధం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళీ చదువు? ఈ  చదువులన్నీ ఎప్పుడు ఆపెయ్యాలి ? పిల్లలు అడిగే ఈ ప్రశ్నకి మనం సామాన్యంగా సమాధానం చెప్పం కానీ గురువుగారు శౌనికుని ప్రశ్నకి సమాధానం చెప్పటం ప్రారంభించారు. 

విద్యలు రెండు రకాలు పరా విద్య , అపరా విద్య . ఇంతవరకూ నీవు నేర్చుకున్న వన్నీ అపరా విద్యలు (వేదాలూ ఉపనిషత్తు లతో సహా ), నువ్వు గనక పరా విద్య కూడా నేర్చుకుంటే ఇంకేమీ  నేర్చుకోవక్కరలేదు, అని శిష్యుడు శౌనికుని తో చెబుతారు గురువుగారు అంగీరసుడు.

ముండకం 1 ఖండం 1 మంత్రం 5 (1-1-5):

తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో  అథర్వవేదః : వాటిలో అపరా విద్య ; ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం

శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛన్దో జోతిషమితి  :   శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం ఇవి 

అథ పరా యయా తదక్షరమథి గమ్యతే  : ఇక దేనిచేత ఆ అక్షరం బ్రహ్మ ; పొందుతారో; పరావిద్య 

ఇప్పటివరకూ చదివిన  ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వ వేదం శబ్ద శాస్త్రం కర్మ కాండలు వ్యాకరణం నిఘంటువు ఛందస్సు ఖగోళశాస్త్రం జ్యోతిష్యం అవన్నీ అపరావిద్య కిందకు వస్తాయి;  బ్రహ్మ జ్ఞాన సముపార్జన  పరావిద్య; అని గురువుగారు చెబుతారు. 

నా మాట:

మనలో చాలామంది "నేను" అంటే తన పంచేంద్రియాలూ అవి పనిచేసే పనులు అనుకుంటారు. ఇంకొంచెం ముందుకు పోయిన  వారు "మనసుని" గుర్తించి దాని పోకడల మీద, ప్రేమ పాటలు, విరహ పాటలూ, పాడుకుంటూ ఉంటారు. "నేను" అంటే ఇదేనా ! 

కాదు కాదు అంటారు పండితులు. ఇంకా మనకి తెలియనిది ఉంది మనలోఉన్న అంతఃకరణ (Conscience ) అని అంటారు. దానిని అర్ధం చేసుకోటానికి  ప్రపంచంలో  పెద్దపెద్ద తలకాయలు (Columbia , Harvard , MIT మేధావులు) కుస్తీ పడుతున్నారు. 

రాబోయే పోస్టుల్లో మన శాస్త్రాలు (ఉపనిషత్తులు) లో చెప్పిన పరా విద్య కి Conscience కి సంబంధం ఉందేమో తెలుసుకుందాము.

ఉపనిషత్తుల మీద తెలుగులో వ్రాసిన ఈ క్రింది ఉపన్యాసాలు చాలా ఉపయోగపడతాయి:

ఉపనిషత్

Monday, September 13, 2021

175 ఓ బుల్లి కథ -- అమెరికాలో మా తోట

   


అమెరికాలో సెప్టెంబర్ మొదటి సోమవారం "లేబర్డే" వస్తుంది. ఆ రోజు అందరికీ శలవ. అధికారికంగా వేసవి వెళ్లిపోయినట్లు లెక్క. వాతావరణం కూడా చల్లబడుతుంది. పెరట్లో వేసిన మొక్కలు కి కూడా ఇది చివరి నెల. అన్నీ వాడిపోయి విడిపోయి రాలిపోతాయి. ఈ సంవత్సరం గోంగూర, దోసకాయ, బీరకాయ, చిక్కుడు, టమాటో, ఎల్లో స్క్వాష్ వేశాము. దోసకాయలు బాగా వచ్చాయి. గోంగూర బాగా వచ్చింది. ఒక పది బీరకాయలు వచ్చాయి. మిగతావన్నీ నామకః పెరిగాయి గానీ ఉత్పత్తి చాలా తక్కువ. 
పెరట్లో తోట ఉంటే ఆ కిక్ వేరు. గోంగూర పచ్చడి ఎన్ని సార్లో చేసుకున్నాము. దోసకాయలతో చాలా చేశాము. దోసకాయ పచ్చడి ఎక్కువగా చేశాము , దోసకాయకూర, పప్పు వారానికి ఒకసారి. రెండేళ్ల క్రిందట మా మరదలు పద్మ రోజూ పెరట్లోకి వెళ్ళి ఏదో కోసుకువచ్చి కూరో పప్పో పచ్చడో చేసేది. పచ్చి  టమాటో తో పచ్చడి చాలా బాగుంటుంది. రెండు బీరకాయలు ఒకపూట కూరకి సరిపోతాయి. లేత బీరకాయ కూర లేత తాటి ముంజలు తిన్నట్లు ఉంటుంది. రాత్రి పూట లేత బీరకాయలతో చేసిన కూర తింటూ ఉంటే "కఠెవరం" లో చిన్నప్పటి రాత్రిళ్ళు బాసీపెట్టు వేసుకుని బయట కూర్చుని కంచాల్లో అన్నం తిన్న రోజులు గుర్తుకువచ్చాయి. మాఇంట్లో ఎందుకో బీరకాయ కూర రాత్రిళ్లే చేసేవాళ్ళు. ఎల్లోస్క్వాష్ పప్పు చాలాబాగుంటుంది. చిక్కుడే సరీగ్గారాలేదు. కాకరకాయ వేశాముగానీ మొక్కే రాలేదు. వేసవిలో grandkids వస్తే కుండీలో గుమ్మడి గింజలు నాటించి మొక్కలు వస్తే తోటలో వేయించాము. మొక్కలు మాత్రం బాగా పెరిగాయి గానీ పెద్ద గుమ్మడి కాయలు రాలేదు. పిందెలు మాత్రం ఉన్నాయి. 

ఇంకా రెండు నెలల్లో చెట్ల ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడులు అవుతాయి. ఆ తరువాత "స్నో" , చలి. మళ్ళా  అందరం ఏప్రిల్ కోసం ఎదురు చూడటం. విత్తనాలు ఇంట్లో వేసి మొక్కలని పెంచటం. "మే" లో వాటిని తోటలో నాటి రోజూ నీళ్ళుపోసి ఎంతవరకూ పెరిగాయో చూడటం. జీవితమే ఒక రంగుల రాట్నం అలా "ఆశా" "నిరాశ" లతో కదిలిపోతూ ఉంటుంది. 


Monday, September 6, 2021

174 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 5 ముగింపు (Ishopanishad)

దాదాపు రోజూ ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. మన పని రోజు మొదలవుతుంది. అలాగే సాయంత్రం అస్తమిస్తాడు. మన పని రోజు ఆగిపోతుంది. రాత్రి మొదలవుతుంది.

రాత్రిపూట చంద్రుని వెలుగులో విశ్రమిస్తాము. అది కూడా సూర్య భగవానుడు మనకోసం ఇచ్చిందే. స్వయంగా చంద్రునికి కాంతి నిచ్చే శక్తి  లేదు. సూర్యునికి మనమీద ఎందుకు అంత  ప్రేమ ? 

సూర్యుడు సముద్రాలూ నదులలో నీళ్ళని ఆవిరిగా మార్చి మేఘాలుగ చేసి మన వేపు తీసుకు వచ్చి వర్షాలు కురిపించి పంటలు పండిస్తాడు. ఎందుకలా సూర్యుడుచెయ్యాలి ?

మనం బతకాలంటే గాలి లోని ప్రాణవాయువు పీల్చాలి. బొగ్గుపులుసు గాలిని వదలాలి. మళ్ళా  గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువు తో నింపటానికి సూర్యుడు కావాలి. చెట్ల ఆకులద్వారా బొగ్గుపులుసు వాయువు తీసుకుని దానిని మార్చి ప్రాణవాయువు గాలిలోకి పంపుతాడు. 

ఇంతెందుకు మన జీవితం సుఖంగా గడపటానికి కావలసిన విటమిన్ డి ఇచ్చేది కూడా సూర్యుడే. శరీరానికి కొంత సేపు ఎండ తగిలితే చాలు. 

మనం గుర్తించినా గుర్తించక పోయినా మన జీవితం అంతా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి అవన్నీ ఎందుకు చేయాలి ?. తన కర్తవ్యం కాబట్టి. 

అందుకే యాజ్ఞవల్క్య మహా ముని రోజూ సూర్య భగవానుని ఆరాధించే వాడు. అప్పుడు  తన మనసులో మెదిలిన భావాలతో కూర్చినదే, ఈశా వాస్య  ఉపనిషత్. దానిలో కొన్ని ముఖ్య మంత్రాలు.

శాంతి మంత్రం:

 ఓం పూర్ణ మదః  పూర్ణమిదం  : అది పూర్ణం ఇది పూర్ణం 

పూర్ణా పూర్ణ ముదశ్చతే      : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినది 

పూర్ణస్య  పూర్ణమాదాయ పూర్ణ మేవా  వశిష్యతే  : ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం వచ్చినా ఆ పూర్ణం పూర్ణమే 

ఓం శాంతి  శాంతి శాంతిః॑

పరమాత్మ పూర్ణం. ఆ పూర్ణం నుండి వచ్చిన ఈ జగత్ పూర్ణం. అంతేకాదు ఈ పూర్ణం ఆ పూర్ణం నుండి రావటం మూలాన ఆ పూర్ణం ప్రతిభ ఏమీ తగ్గలేదు అది ఇంకా పూర్ణముగానే ఉంది. 

ఇక్కడ పూర్ణం అంటే సంపూర్ణం అని అర్ధం తీసుకుంటే మనకి శ్లోకం తేలిగ్గా అర్ధం అవుతుంది. ఉదాహరణకి: ఒక గింజ మొక్కగా మారుతుంది. అదే పెద్దదయి పూవులు కాయలు గాచి గింజలు తయారుచేసి ఎండిపోయి నశిస్తుంది. మళ్ళా ఆ గింజల నుంచి మళ్ళా మొక్కలు చెట్లు వస్తున్నాయి. మొక్క జీవితం ఒక స్వయం ప్రవర్తక క్రియ (automatic ). నిదానించి చూస్తే ప్రకృతిలో ఇటువంటివి ఎన్నో.

మనతో సహా ఈ జగత్ ఆ పరమాత్మ నుండి పుట్టింది కాబట్టే, ఆ "పూర్ణం"నుండి వచ్చిన ఈ "పూర్ణం", స్వ  "పూర్ణం"  మన ప్రమేయం లేకుండా, రోజూ తన పని తాను చేసుకుపోతుంది.

సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు కురుస్తున్నాయి , పంటలు పండుతున్నాయి. మనం జీవించటానికి ఆహారం, నీళ్ళు, గాలి లభ్యమవుతున్నాయి. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. మన ప్రమేయంలేకుండా నే కాలచక్రం ముందుకు కదిలిపోతూ ఉంది ఎందుకంటే మనమూ మనని సృష్టించిన పరమాత్మ రెండూ  సం "పూర్ణం"(Complete ) మరియూ స్వ "పూర్ణం"(automatic ) కూడా. 

మొదటి మంత్రం:

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  :   తప్పకుండా(వాస్య) పరమాత్మ(ఈశా) అని గుర్తించు 

యత్కించ  జగత్యామ్  జగతు     :       ప్రపంచంలో నీకు కనపడేదంతా

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)      :      ఈ కొత్త దృక్పధంతో చూడటం నేర్చుకుని (జీవితం) ఆనందంగా గడుపు

మాగృతః  కస్య  సిద్దనం                :     ఇంకొకళ్ళ ధనం కావాలని కోరుకోకుండా 

ప్రపంచంలో కనపడే అన్ని జీవులలోనూ పరమాత్మ అంశాన్ని చూస్తూ ధ్యానిస్తూ ఇంకొకళ్ళ సంపదకు ఆరాటపడకుండా జీవితం ఆనందంగా  గడుపు. 

ఇక్కడ ఆనందంగా గడుపు అంటే బార్లకి, క్లబ్బులకి వెళ్ళి తాగి తందనాలాడమని కాదు. పరమాత్మను స్మరిస్తూ ప్రార్ధిస్తూ జీవితం ఆనందంగా గడపమని. అలాచేయలేము అనుకుంటే క్రింది శ్లోకంలో చెప్పినట్లు చెయ్యమని ఉపనిషత్ చెబుతోంది..

రెండవ మంత్రం  :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రత్త గా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.

మన జీవితంలో మనం చేసే పనులు చాలావరకు ఇతరులతో చెయ్యవలసి ఉంటుంది. అందరినీ అన్నిటినీ మనం కట్టుబాటులో ఉంచలేము. వారి వారి కర్మ ఫలాల ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చెయ్యగలిగినదల్లా మంచి జరగాలని ప్రార్ధించటమే.

చివరి పద్దెనిమిదవ మంత్రం :

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్ :  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్ : మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో : మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ :   నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా నీకు నన్ను నేను అర్పించుకోవటమే. 


Monday, August 30, 2021

173 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 4 (Ishopanishad)

మనకున్న వేదాలు నాలుగు. ప్రతీ వేదం శాంతి మంత్రం తో మొదలవుతుంది. శాంతి మంత్రం ఆ వేదంలో చర్చించబోయే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. దానిలో ఉన్న ఉపనిషత్ చర్చాంశాన్ని  వివరంగా చెబుతుంది. వేదముల లోని విషయాలూ చర్చలూ సంస్కృత పదాలతో అల్లిన శ్లోకాలతో మృదువుగా గుంభనగా గోప్యంగా ఉంటాయి. వాటి ముడులు విప్పి సౌరభాలు ఆస్వాదించాలంటే నిష్ణాతులైన గురువులు అవసరం. ఈశావాస్య ఉపనిషత్ లో ఇటువంటి శ్లోకాలు 18 ఉన్నాయి.

ఈ సృష్టికి కారణం పరమాత్మ అనీ ఆయన అంశం ఆయన సృష్టించిన ఈ జగత్ లో జీవులన్నిటిలోనూ  జీవాత్మగా ఉంటుందనీ, చూడటానికి, తాకటానికి అది అతీతమని చెప్పే శాంతి మంత్రం తో శుక్ల యజుర్వేదం మొదలవుతుంది.

నిర్గుణ నిర్వికార అనంత మూర్తి జీవాత్మను సంభోదించేది "ఓం" కారం తోనే. ధ్యానించేది "ఓం" కారం తోనే. అలా ధ్యానం చేస్తూ మనలో ఉన్న ఆత్మ  తో మమేకమై ఆ ఆనందంతో మైమరచిపోతే జీవితం ఆధ్యాత్మిక తో ఆనందంగా గడపవచ్చును. ఇదే మొదటి శ్లోక సారాంశం.

ఏ కారణము చేత నయినా తనలోని జీవాత్మని భౌతిక శరీరాన్ని విడివిడిగా చూడలేక పోతే, వంద ఏళ్ళు బ్రతికి తోటి జీవులకి తోడుగా ఉంటూ, తనలోని ఆత్మని అందరిలో చూస్తూ కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తూ జీవించాలని నిర్ణయించుకోవాలి. ఇదే రెండవ శ్లోక సారాంశం.

భౌతికశరీరము  లోని పంచేంద్రియాల కోరికలు తీరుస్తూ, కామినీ కాంచన కీర్తికోసం పరితపిస్తూ  జీవితం గడిపితే చనిపోయిన తరువాత కారుచీకటి లోకం "అసుర" లో తనలాంటి తోటి జీవులతో ఇంకొక దేహం కోసం వేచి ఉండి మరల మరల భువి మీద జన్మించాల్సి ఉంటుంది. ఇదే మూడవ శ్లోక సారాంశం.

శ్లోకాలు 4 నుంచీ 14 దాకా ఆత్మ (ఈశ ) గురించి వర్ణించటం జరుగుతుంది. మనము సామాన్యంగా "నేను" అనేది మన శరీరం, దానిలోఉండే పంచేంద్రియాలూ, అవిచేసే విన్యాసాలుగా గుర్తిస్తాము. అవే మనని కామినీ కాంచన కీర్తుల కోసం పరితమించమని చెబుతాయి. ఈ విన్యాసాలకు (మన కోరికలకు) అంతు ఉండదు ఒకటి తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంతులేని వాటికోసం పరితపిస్తూ ఒకటి తరువాత ఒకటి కోరికలు తీర్చుకుంటూ (తీర్చుకోలేక విషాదంతో కుమిలిపోతూ) జీవితం గడుపుతూ ఉంటాము. ఇవే సుఖ దుఃఖాలకి కారణాలు. 

మనం గనక ఈ భౌతిక శరీరాన్నీ (దానిలోని పంచేంద్రియాల్తో సహా ) నడిపించే ఆత్మ (conscious ) మీద కేంద్రీకరిస్తే, మనలో దాని ఉనికిని గ్రహిస్తే, దానితో మమేకమయితే, ఈ భౌతిక శరీరం  గుప్పించే విన్యాసాలకు అతీతం అవుతాము. మనము చెయ్యాల్సిన పనిని చేస్తాము కానీ ఆకర్షణలకు లొంగము. సినిమా హాల్లో తెల్లటి తెర ఉంటుంది. ఆ తెరమీద రంగురంగుల సినిమాలు ఎన్నో వేస్తుంటారు. దానికి ఏ రంగూ అంటదు. అటువంటిదే మన ఆత్మ. దానితో మమేక మయితే భౌతిక శరీర విన్యాసాలకు అవి కురిపించే సుఖ దుఃఖాలకి మనం అతీతల మవుతాము. ఇక్కడ గమనించ వలసినది మనం ముందర మన కర్తవ్యకర్మ చేసిన తరువాతే ఆత్మ జ్ఞానము మీద కేంద్రీకరించాలి.

శ్లోకాలు 15 నుండీ 18 దాకా సూర్య ప్రార్ధన శ్లోకాలు. శుక్ల యజుర్వేదము రచయిత యాజ్ఞవల్క్య  ముని సూర్య ప్రార్ధన ఫలితమే ఈశా వ్యాస ఉపనిషత్ అని కూడా అంటారు. 

శ్లోకం 15:

హిరణ్మయేన పాత్రేణ            బంగారపు మూతతో 

సత్య శ్యాపి హితం ముఖం   "సత్యం" ముఖం కప్పి ఉన్నది 

తత్వం పూషణ్ అపా వృణో     ఓ సూర్య దేవా!  ఆ మూత తీసివేయి 

సత్య ధర్మాయ దృష్టయే   సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది 

ఓ సూర్య దేవా (పూషణ్ ) బంగారపు మూతతో "సత్యం" కప్పి ఉన్నది. ఆ బంగారపు మూత తీసివేయవా. సత్య ధర్మాలు ఆచరించే నాకు నిన్ను చూడాలని ఉంది. ( శ్లోకం 15)

(పూషణ్  అంటే పోషక కర్త. సూర్య దేవుడు సముద్రమునుండి నీరు తీసి మేఘముల ద్వారా వర్షము కురిపించి ఆహారము కొరకు పంటలుపండిస్తూ , సముద్రమును నింపుతూ జీవత్వము కొనసాగే విధంగా చేఇస్తున్నాడు. అంతే కాదు మన శరీరతత్వం కూడా సూర్యోదయము , సూర్యాస్తమయం  మీద ఆధారపడి ఉంటుంది.) 

నీవిచ్చిన ప్రాణం తోటి ఈ శరీరం ద్వారా ఇప్పటిదాకా "సత్యం" గా జీవితం గడిపాను. నా చరమ దశ ఆసన్నమైంది. ఈ నా శరీరాన్ని భస్మం చేసి  నువ్విచ్చిన నాలోని ప్రాణాన్నితీసుకుని నన్ను నీతో కలుపుకో .  శ్లోకం 17.

ఈ క్రింది చివరి ప్రార్ధన శ్లోకం మన అందరికోసం వ్రాసింది :

శ్లోకం 18:

అగ్నేనయ సూపధా రాయే అస్మాన్  ఓ అగ్నిదేవతా మాకు మంచి భాగ్య కరమైన మార్గం చూపు 

విశ్వాణి  దేవ  వయునాని విద్వాన్  మా పాప కర్మలన్నీ నీకు తెలుసు 

యుయోధ్య స్మజ్జు హురాణమేనో  మా మనస్సు లో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసివేయి 

భూయిష్టామ్తే నమ ఉక్తిమ్ విధేమ    నేను చెయ్యగలిగేదల్లా నీకు దాసోహమవటమే.

ఓ అగ్నీ మమ్మల్ని సరిఅయిన మార్గంలో నడిపిస్తూ జీవితం గడిపేటట్లు చేయి. నీకు నాగురుంచి అన్నీ తెలుసు. నేను తెలియక తప్పులు చేసివుండొచ్చు. క్షమించి వాటిని తీసివెయ్యి. నేను చెయ్యగలిగినదల్లా  నీకు నన్ను నేను అర్పించుకోవటమే. శ్లోకం 18.

Summary written in English for people who do not know how to read Telugu.

The devotee is praying sun God, who is responsible for our existence and survival on this earth, to bless him to see his true figure so that he can show his gratitude. The Sun is actually instrumental for our existence on this earth by absorbing water from the Ocean , creating clouds and rain, which in turn fill the Ocean and raises crops and provide food for our survival. The Sun rise and Sun set are somewhat closely mingled with our biological system and daily activities.

నా మాట:

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి

1.Swami Aparajitananda

2. The Upanishads





Monday, August 2, 2021

172 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 3 (Ishopanishad)

ఈ ఉపనిషత్ లోని శాంతి మంత్రం తో,  సృష్టి కర్త తాను సృష్టించిన వాటి అన్నిటిలోనూ తన అంశ  ఉంచుతారని తెలుసుకున్నాము. దానినే ఆత్మ అందాము. దానినే Consciousness  అని కూడా అంటారు.

ఈ ఉపనిషత్ లోని మొదటి మంత్రంతో పరుల సంపాదనమీద కన్నువేయకుండా, పాత సంగతులు మర్చిపోయి, మనలోని ఆత్మను ధ్యాన మార్గము (meditation ) ద్వారా గుర్తించి ఆరాధిస్తూ, సుఖంగా జీవితం గడపవచ్చని తెలుసుకున్నాము. దీనికి గురువుగారి సహాయము చాలా అవసరము అని కూడా తెలుసుకున్నాము. దీనినే జ్ఞాన యోగం అంటారు.

ఆధ్యాత్మిక జీవితం ఇష్టమున్నా, జ్ఞాన యోగం పాటించ లేని వారు  రెండవ మంత్రం ( కర్మ యోగము) ద్వారా ఫలితము పొందవచ్చునని ఉపనిషత్ కర్త విశదీకరించారు.

రెండవ శ్లోకం :

కురువం నేవేహ కర్మాణి  నువ్వు వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి.

జిజీ విషేచ్చతకం సమాః  : ఇతరులకు సహాయపు పనులు చేస్తూ.

ఏవం త్వయ్  నాణ్యథె థొస్తి  : నీలాంటి వాళ్లకి ఇదొక్కటే మార్గం.

నకర్మ లిప్యతే  నరే  : ఆ (సహాయము చేసిన) పనులు ఎప్పుడూ నిన్ను బాధ పెట్టవు.

నువ్వు మొదట వంద ఏళ్ళు బ్రతకాలని నిర్ణయించుకోవాలి. ఇతరులకు సహాయపడే పనులు చేస్తూ, తిరిగి ఏమీ ఆశించకుండా,  దేవునికి అర్పణబుద్ది తో జీవిస్తే నువ్వు చేసిన ఆపనులు నిన్నెప్పుడూ బాధపెట్టవు. నీలాంటి వాళ్లకి  (ధ్యాన మార్గము కుదరని వారికి) ఇదొక్కటే మార్గం. 

 "కురువన్ " అనే సంస్కృత పదానికి, ఇతరులు, దైవము అనే రెండు అర్ధాలు ఉన్నాయి.  మనందరిలో దైవస్వరూపం ఆత్మ ఉన్నది కనక,  ఇతరుల సేవ (మానవ సేవ)  దైవార్పణ బుద్దితో చేసి ప్రసాద బుద్దితో ఫలితములు స్వీకరిస్తే అదే మాధవసేవ గా గుర్తించ వచ్చు. 

ఇక్కడ ఎటువంటి పనులు చేయాలి అనే సమస్య వస్తే  భగవద్గీత (chapter 3) కర్మయోగ ఆచరణలోని పంచమహా యజ్ఞములు ఉపయోగపడుతాయి. అవి:

1. బ్రహ్మ యజ్ఞ : మత గ్రంధములు చదివి జ్ఞాన మార్జించుట.

2. దేవ  యజ్ఞ: ప్రకృతి , పరిసరాలను జాగ్రతగా చూచుట.

3. పితృ యజ్ఞ: తల్లి తండ్రులను గౌరవించుట .

4. మనుష్య యజ్ఞ: తోటి మానవులను గౌరవముగా చూచుట.

5. భూత యజ్ఞ: జంతు ప్రపంచమును ప్రేమతో చూచుట.


భౌతిక ఆకర్హణలకు లొంగిపోయి ఆధ్యాత్మికతకు ఆమడ దూరంలో వుండే వాళ్ళ గురించి మూడవ శ్లోకంలో చెప్పారు.

మూడవ శ్లోకం :

అసూర్యా నామతేలోకాః  : "అసూర్య" అనే పేరుతో ఉన్నలోకం (బాహ్య భోగాలకు మాత్రమే పరిమిత మైన  వాళ్ళ లోకం). 

అంధేన తమసావృతాః  : అది కారు చీకటితో నిండిన లోకం.

తాగం స్తే ప్రేత్యాభి గత్యంచి : వీరందరూ కొన్ని లోకాలకు వెళ్తారు.

ఏకే  చాత్మ మనోజనాః : ఆత్మను చంపుకునే వారు.  (తనలో ఆత్మ ఉందని చూడలేరు)

భోగ జీవితానికి అలవాటు పడి జీవించిన వారు , చనిపోయిన తరువాత చీకటి లోకం "అసూర్య" లో వారి వారి భోగ మిత్రులతో (పునర్జన్మకు ఎదురుచూస్తూ) గడుపుతారు.


Summary written in English for people who do not know how to read Telugu.

For those people who have spiritual interest but difficult for them to follow the strict principles of meditation, saints gave the 2nd poem as a solution.

The poem says: you must aspire to live for one hundred years working as best as you can for your fellow men and environment as prescribed in Karma Yoga. Basic principles of Karma yoga are: 1. Read the scriptures and attain knowledge. 2. Look after the environment. 3. Take care of your parents. 4. Take care of your fellow human beings. 5. Take care of the animals, they are also part of creation.

For those people who cannot follow either 1 or 2 mantras, the saints described them as "Bhogis", people much more interested in physical enjoyment other than spiritual enjoyment. In the 3rd poem, their fate  after death is described. They will spend their time (waiting for next birth) with same group of people as they are in a darkened location called "Asura" and will be born again and again until they reform themselves to spiritual life.

నా మాట:

ప్రకృతి, మనకి ఒక శరీరం, అది పని చేయటానికి కావలసిన ఇంద్రియాలూ, అవి సరీగ్గా పని చేస్తున్నాయ్యో లేదో తెలుసుకోవటానికి జ్ఞానేంద్రియాలూ ప్రసాదించింది. మన శరీరంలో మనకి కనపడనిది, మన ఇంద్రియాలకు జీవించే శక్తి నిచ్చేది ఒకటుంది అది మన "ఆత్మ" . 

మనం అవి ఎలా పనిచేస్తాయో తెలియకుండా చాలా వస్తువులు రోజూ వాడుతాము అల్లాగే మన శరీరంతో పనులు చెయ్యటానికి, మనలో  "ఆత్మ " ఉన్నదని  గ్రహించవలసిన అవసరం లేదు. 

మనలో పరమాత్మ అంశ "ఆత్మ" ఉన్నదని గ్రహిస్తే, ఈ సృష్టిలో మన చుట్టూతా ఉన్న వాటన్నిట్లో అదే పరమాత్మ అంశ ఉన్నట్లు గుర్తించి స్నేహ భావం పెంచుకుంటాము. దానితో మన జీవన దృక్పధము మారిపోయి సుఖ సంతోషాలతో జీవితం గడుపుతాము. దీనినే జ్ఞాన మార్గం, జ్ఞాన యోగము అంటారు. ఇదే మొదటి శ్లోకంలోని సారాంశం.

జ్ఞాన యోగం పాటించలేని వారికి మన ఋషులు ఇంకొకమార్గము రెండొవ శ్లోకంలో సూచించారు. కాకపోతే అటువంటి వారు ముందర వంద ఏళ్ళు బ్రతకాలని కోరుకోవాలని గట్టిగా చెప్పారు. ఆ సమయంలో చెయ్యవలసిన పనులుకూడా (పంచ మహా యజ్ఞములు)  సూచించారు. దీనినే కర్మ యోగం అంటారు.

పైరెండు శ్లోకములు పాటించ లేక భోగ విలాసములతో జీవితం గడుపుదామని అనుకునే వారికి ఏమవుతుందో మూడవ శ్లోకంలో సూచించారు. వారు సరయిన మార్గములోకి వచ్చేదాకా మరల మరల భువి మీద జన్మిస్తారని చెప్పారు. ఈ పునర్జన్మ కోసం వేచి ఉండే సమయం తమలాంటి భోగప్రియుల తో చీకటిలోకం "అసుర" లో గడపాల్సొస్తుందని చెప్పారు.

పీజ్జాలూ, బర్గర్లూ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులూ లేకుండా వేల ఏళ్ళ క్రిందట వంద ఏళ్ళు బ్రతికే వారంటే ఆశ్చర్యంగా ఉంది.

దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి.

1.Swami Aparajitananda

2. The Upanishads

Monday, July 19, 2021

171 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ - 2 (Ishopanishad)

వేదములు నాలుగు. ఋగ్వేదము సామ వేదము యజుర్వేదము అధర్వణ వేదము. వాటిలో  యజుర్వేదములు రెండు, శుక్ల యజుర్వేదము, క్రిష్ణ యజుర్వేదము. అన్నిటిలోనూ ఉన్నవి సంస్కృత శ్లోకములు. వీటినే మంత్రాలు అని అంటారు.

ఒక్కొక్క వేదము నాలుగు భాగాలుగ విభజించబడినది. మంత్రం, బ్రాహ్మణీకం, ఆరణ్యకం, ఉపనిషత్. ఈ నాలుగు వరుసగా జీవితంలో ఆచరించవలసిన బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు సంబంధించినవి. ఉపనిషత్ ని వేదాంతం అని కూడా అంటారు (వేదముల చివర). అన్నివేదములలోనూ మంత్ర భాగంలో మొదటి మంత్రం శాంతి మంత్రం. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే ఈ శుక్ల యజుర్వేదంలో మాత్రం ఉపనిషత్ మంత్ర భాగంలో ఉన్నది. ఈ మంత్రాలన్నీ చక్కటి సంస్కృత సమాసాలతో పొందుపరిచిన భావాలతో గుబాళిస్తూ ఉంటాయి.  

క్రిందటి పోస్టులో శుక్ల యజుర్వేదములో శాంతి మంత్రము గురించి తెలుసుకున్నాము. ఈ పోస్టులో  ఈ ఉపనిషత్ లోని ముఖ్యమయిన మొదటి మంత్రం గురించి తెలుసుకుందాము. 

మొదటి శ్లోకం :

ఓం  ఈశా  వాస్య  మిదగం సర్వం 

యత్కించ  జగత్యామ్  జగతు 

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా)

మాగృతః  కస్య  సిద్దనం 

మన జీవితంలో మనం ఎక్కువగా ప్రేమించేది మనల్నే. ఆ తరువాతే ఎవ్వరినైనా. మన శరీరం మీద గాయమయితే వచ్చే (ఇతరులు చీదరించుకునే) చీము నెత్తురికి కూడా ప్రేమగా జాగర్తతో కట్లు కడతాము, మన ప్రేమలూ పెళ్ళిళ్ళూ, బాధలూ భయాలూ ,సిగ్గూ ఎగ్గూ లేకుండా ఇతరులకి చెప్పుకుంటూ ఉంటాము. అంతా నేను నేను నేను.

మనని మనం పరిశీలించుకుంటే --- మనం మన పంచేంద్రియా లకి కట్టుబడి ఉన్నామని  తెలుస్తుంది. చాలావరకు వాటి సలహాలు/ఆజ్ఞలను మనం శిరసావహిస్తాము. వాటిల్లో మనకి బాధపెట్టేవి, మనము ఏమీ చెయ్యలేనివీ, ఎక్కువగా ఉంటాయి. వాడికి మనకన్నా ఎక్కువ డబ్బులున్నవనో, డబ్బులున్నవాడు పిసినిగొట్టు అనో, వాడి ఇల్లు పెద్దదనో, మన కారు వాడి కారు కంటే మరీ చిన్నదనో, పెళ్ళాం పిల్లలు తన మాట వినటల్లేదనో, బాస్ ఎక్కువ పని చేయిస్తున్నాడనో, తన కింద పనిచేసే వాళ్ళు సరీగ్గా పనిచెయ్యటల్లేదనో, ఏవో భావాలు ఎప్పుడూ మనస్సులో మెదులుతూ మనని కెలుకుతూ ఉంటాయి. 

దీనికి కారణం తాను దోష శూన్య మైన వాడిననీ (perfect ) మిగతావాళ్ళు కాదనీ (imperfect ) అని చెప్పవచ్చు. మన మనుకుంటున్న Imperfect వాళ్ళు గనక Perfect గ మారితే మన సమస్యలన్నీ పోతాయి. కానీ ఏది తేలిక? మన చుట్టూతా ఉన్న మనమనుకుంటున్న imperfect వాళ్ళని మార్చటమా లేక మనం ఒక్కళ్ళమే మారటమా?  మీ సమస్యలన్నీసరి అవ్వాలంటే ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి.  

"అందరినీ సృష్టించింది నేనే. అన్నిటి లోనూ ఉన్నది నేనే. నీలో ఉన్న భగవదంశని గుర్తిస్తే  అందరిలోనూ నన్ను చూడగలవు. ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా, ఉన్న దానితో జీవితం ఆనందంగా గడుపుతావు."

చిన్న చిన్న లొసుగులు అందరిలోనూ ఉంటాయి. ఎన్ని లొసుగులున్నా నిన్ను నీవు ప్రేమించుట లేదా అటులనే అందరూ నీలాంటి వారే అనుకో. 

మనం ఉంటున్న ఈ జగత్ ఎప్పుడూ ఒక చోట ఉండదు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సృష్టి ఎప్పుడూ ముందుకి జరిగి పోతూనే ఉంటుంది. జరిగిపోయిన సంగతులు గుర్తు చేసుకుంటూ జీవించకు, ఆ క్షణం తిరిగిరాదు. 

(దోష నిర్ధారణ నేను చూసుకుంటాను. ప్రాణం ఇచ్చేది తీసేది నేనే. నీ పద్దతి మార్చుకో. )"

ఇదే క్లుప్తంగా ఈ శ్లోక తాత్పర్యం.

యత్కించ  జగత్యామ్  జగతు  : నీతోపాటు ముందుకి సాగిపోతున్నఈ  జగత్ సృష్టిలో  నేనున్నాను. నేనేకదా వాటిని సృష్టించింది !.

ఓం  ఈశా  వాస్య  మిదం సర్వం  : "ఓం" అంటూ ప్రార్థిస్తూ  (meditate)  నీలో ఉన్న నన్ను గుర్తిస్తే  నీ చుట్టుపక్కల వారిలో గూడా నన్ను గుర్తిస్తావు. 

మాగృతః  కస్య  సిద్దనం : ఇంకొకళ్ళ సంపద  మీద కోరిక  పెట్టుకోకు.

తేన  త్యక్తేన  పుంజీ  తాః( థా) : నన్ను అందరిలోనూ  గుర్తించి నీ పాత ధృక్పధాన్ని మార్చుకుని ఇంకొకళ్ళ సంపద మీద కోరిక పెట్టుకోకుండా నీ జీవితం సంతోషంగా గడుపు.

సూక్ష్మంగా: నీలో ఉన్న ఆత్మ ని గ్రహించినప్పుడు, అదే ఆత్మ నీ చుట్టుపక్కల సృష్టి లోనూ ఉన్నదని గుర్తించి, వారూ నీలాంటి వాళ్ళే అని గ్రహించి సుఖంగా జీవితం గడుపుతావు .

1. క్షణ క్షణమూ మారిపోతున్న ఈ జగంలో (ప్రపంచంలో) పాత సంగతులు గుర్తుపెట్టుకోవడం మూలాన వచ్చేది ఏమీ లేదు. బాధలు తప్ప. వాటిని మెరిచిపో.

2. పక్కవాడి సంపద కోసం పాకులాడబోకు. అది మనోవేదనకి తప్ప పనికిరాదు.

3. నీలో ఉన్న ఆత్మని ఏకాగ్రతతో ధ్యానించి దానితో మమేకమవ్వు.

4. అందరిలో ఉన్నది నేనే. నిదానించి చూస్తే నీ పక్కనున్న వారిలో నూ నీ ఆత్మ కనపడుతుంది. అందరితో శత్రుత్వం పోయి మిత్రత్వం పెంచుకుంటావు. నేనే కదా మీ అందరినీ సృష్టించినది.

ఈ నాలుగు సూత్రాలూ అర్ధం చేసుకుని పాటించగలిగితే మీరు సత్ చిత్ ఆనంద్ లు అయి సంతోషంగా జీవితం గడుపుతారు. ఈ ఉపనిషత్  లో మిగతా శ్లోకాలు మీకు అనవసరం. అవి పై సూత్రాలు  పాటించలేని వారికి.

Summary written in English for people who do not know how to read Telugu.

We think most of the problems we encounter in life relate to the imperfect nature of others. And we want them to change so that we can solve all our problems. This is difficult to do because there are many. Instead if we change ourselves it is easy to get along with others.


Here the Upanishad says you are part of a creation as everybody else around you. In every living being I am there as a creator. First you get a sense of me in you by meditating . Once you realize me in you, you can see me everywhere around you and start loving everybody as you recognize everybody as you (We all love ourselves first). As the world is moving forward all the time, whatever happened in the past, forget them and enjoy your life without aspiring for another person's wealth.

నా మాట:
దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. దానికి క్రింది లింకులు చాలా ఉపయోగపడుతాయి.

1. Swami Aparajitananda

2. The Upanishads

Monday, July 12, 2021

170 ఓ బుల్లి కథ -- ఈశా వాస్య ఉపనిషత్ -1 (Ishopanishad)

ఈ ఉపనిషత్ ని ఈశావాస్య ఉపనిషత్, ఈశో పనిషత్ అనికూడా అంటారు.  దీని పేరు మొదటి శ్లోకం మొదటి అక్షరాల నుండి వచ్చింది. ఇది శుక్ల యజుర్వేదము నుండి గ్రహించ బడినది. దీనిలో 18 మంత్రాలు (శ్లోకాలు) ఉన్నాయి. శంకరాచార్యునికి ,వివేకానందునికి, మహాత్మా గాంధీకి ఇష్టమయిన ఉపనిషత్  ఇది.

ఇది చాలా క్లిష్టమయిన ఉపనిషత్. భావాలు అర్ధమవటానికి కొంచెం కుస్తీ పట్టాలి. నాకర్ధమయినంతలో మీకు విశదీకరిస్తాను.

ఒక గింజ నుండి మొక్క వస్తుంది. మళ్ళా ఆ మొక్క పెరిగి పెద్దదయి గింజలు తయారు చేసి ఇస్తుంది. ఆ గింజ నుండి మళ్ళా ఇంకొక మొక్క వస్తుంది. గింజకి మొక్కగా మారే జ్ఞానం ఉంది అల్లాగే మొక్కకి గింజ తయారు చేసే జ్ఞానం ఉంది. That is  complete (గింజ) This is  complete (దాని నుండి వచ్చిన మొక్క).

అల్లాగే ఆడపిల్ల పెద్దదయి తల్లిగా పిల్లలని కంటుంది. పిల్లలు పెద్దయి వాళ్ళల్లో ఆడపిల్లలు తల్లులుగా మారుతారు. తల్లికి పిల్లల్ని కనే ఉపకరణములు ఉన్నాయి. అల్లాగే ఆడ పిల్లలకి తల్లులయే పరిస్థితి ఉంది. That is  complete (తల్లి ) This is  complete (తల్లి నుండి వచ్చిన పిల్ల ).

పై చెప్పిన రెండు వాస్తవాలని పరిశీలిస్తే మనమొకటి గమనించవచ్చు. రెంటిలోనూ తననుండి కొత్తవి సృష్టించబడుతున్నాయి. వాటన్నిటిలోనూ ఆ సృష్టికి కావలసిన సరంజామా అంతా ఉంది. అంటే ఆ సృష్టికి కారణమైన శక్తి (energy ) ఒకటి (రూపములు మారుతున్నా) వాటిల్లో ఉంది అని తెలుస్తోంది. ఇటువంటి శక్తి స్వరూపాలు "గాలాక్సిస్" నుండి "డార్క్ స్పేస్", "బ్లాక్ హోల్ " దాకా జగత్ లో కోకొల్లలు. అందుకనే స్వయం శక్తి తో కూడుకున్న ఈ జగత్ "పూర్ణం" (complete ) అని చెప్పొచ్చు. 

ఇటువంటి పూర్ణమైన జగత్ ని సృష్టించటానికి మూలకారణ మైన శక్తికూడా "పూర్ణం" అయి ఉంటుంది. ప్రతి జీవి లోని జీవాత్మ ఆ పరమాత్మ అంశమే.

దీనినే శుక్ల యజుర్వేదము లోని శాంతి మంత్రం చెబుతోంది.

ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే   : అది పూర్ణం(అనంతం) ఇది పూర్ణం ఆ అనంతము నుండి ఈ అనంతం (ప్రపంచం) ఉద్భవిస్తోంది  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే  : అనంతం నుండి అనంతం తీసివేస్తే పూర్ణమేవ (అనంతమే)  అవశిష్యతే(మిగులుతుంది)

ఓం శాంతి: ఓం శాంతి: శాంతి: : ఓం శాంతి: శాంతి: శాంతి :

పూర్ణ మదః  పూర్ణమిదం :అది పూర్ణం(ఆ అనంతం complete ) దాని నుండి వచ్చిన ఇదిపూర్ణం (అనంతం complete  )

అందుకే ఆ  ("That ")  "పూర్ణం" నుంచి పుట్టింది కాబట్టే ఈ "పూర్ణం" (ఈ జగత్ ) రోజూ తనపని తాను చేసుకుపోతోంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షాలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. జీవించటానికి ఆహారం లభ్యమవుతోంది. జీవులు పుడుతున్నారు. పోతున్నారు. కాల చక్రం మన ప్రమేయంలేకుండా ముందుకు సాగిపోతూ ఉంది. 

Summary written in English for people who do not know how to read Telugu.

The seed makes a plant. The plant makes a seed. It is automatic and complete. The cycle repeats.

The mother delivers a baby girl. The baby girl after some years becomes a mother. It is automatic and complete.

Those real world examples suggest that this world, which is full of those cycles, is complete (Poornam) as we know. Shanti mantra of the upanishad says This poornam came from That poornam.

We do not know what "That"  is but we know "This", what came out of "That" is complete, because we are living in it. Whatever necessary for our survival they are there. The Sun is there Moon is there, Water is there, Wind is there, Plants and Trees are there to feed us. Since because "This" is complete, we can make a conjecture  "That" which created the complete "This"  must also be complete.


క్రింది సమాచారం గూగుల్ నుండి (From Google ) సేకరించినది :

The Law of Conservation of Mass

The same amount of matter exists before and after the change—none is created or destroyed. This concept is called the Law of Conservation of Mass.Jan 13, 2020

Where does energy come from if it Cannot be created?
But at the birth of the Universe – that is, everything – the energy needed for the Big Bang must have come from somewhere. Many cosmologists think its origin lies in so-called quantum uncertainty, which is known to allow energy to emerge literally from nowhere.
దీనినే మనం అనవచ్చు : పూర్ణ మదం (That is Complete). 


నా మాట:
దీనిని అర్ధం చేసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. క్రింది లింకులు చాలా ఉపయోగపడతాయి.

1.Swami Aparajitananda

2.  The Upanishads

                   Translated and Commentated

                               by

                       Swami Paramananda


                From the Original Sanskrit Text

వేదములు 4000 BC 5000 BC అయి ఉండచ్చని అంటారు. వేదములు మొదట "పర్షియన్" లో 17 వ శతాబ్దములో అనువదించ బడినవి. మీరుతప్పకుండా దీనిలో introduction చదవండి. https://www.gutenberg.org/cache/epub/3283/pg3283.txt


Monday, July 5, 2021

169 ఓ బుల్లి కథ -- అమెరికాలో అక్షరాభ్యాసం

దేవాలయం నుండి పూజారి గారు వచ్చి మా మనవడికి శాస్త్రోక్తంగా తెలుగులో అక్షరాభ్యాసం చేశారు. మేము ఇక్కడికి వచ్చిన కాలంలో గుళ్ళు గోపురాలు పూజారులు లేరు. మా పిల్లల అక్షరాభ్యాసం మా చేతులమీదగానే తెలుగులో జరిగింది. రెండోతరం వచ్చేసరికి అన్నీ వచ్చాయి. 

మనవడి  అక్షరాభ్యాసానికి నేను వ్రాసిన గేయం క్రింద ప్రచురిస్తున్నాను.

ఇందులో ఫెర్నాండో , నాటక్క కొలంబియా దేశం నుండి పిల్లలని పెంచటంలో సహాయం చెయ్యటానికి  వచ్చిన Au Pair  లు. వాళ్ళు స్పానిష్ మాట్లాడుతారు. పిల్లలు స్కాండీ స్కూల్, స్వీడిష్ స్కూలికి వెళ్తారు. స్కూల్ లో స్వీడిష్ మాట్లాడు తారు.ఇంట్లో అమ్మా నాన్న ఇంగ్లిష్ మాట్లాడుతారు. ఇంటికొచ్చిన బామ్మా తాత తెలుగు మాట్లాడుతారు. ఆశ్చర్యంగా పిల్లలు అందరూ అందరితో ఆడుకుంటారు, అర్ధం చేసుకుని చెప్పిన పనిచేస్తారు. అమెరికాలో పసితనం ఎంత క్లిష్టమో తెలుస్తోందిగా !.


అమ్మతో తెలుగులో అ ఆ లు 

నాన్నతో ఇంగిలీషు లో A B C లు 

పలకమీద బలపం పెట్టి 

పదిలంగా వ్రాయిస్తా 


స్కాండీ స్కూల్ లో స్వీడిష్ పాటలు 

నాటక్కతో స్పానిష్ ఇనదోస్త్రో స్ 

బామ్మతో చిన్న కధలు  

శ్రీ అత్తతో హాస్య కథలూ 

చిన్న చిన్నగా చెప్పిస్తా  


అమ్మమ్మ తో అప్పాలూ 

బాబూ తాతతో బెల్ పెప్పర్స్ 

ఫెర్నాన్దాతో పెరుగన్నం 

తినిపిస్తా తీరికగా 


రాఘవ్ మామ తో బిట్కాయిన్ 

తాతతో అప్షన్లు 

నిక్ మామ తో రేస్ కారులు   

అమ్మతో షేర్ మార్కెట్ 

సింధూ పిన్నమ్మతో రియలెస్టేట్ 

రహస్యాలన్నీ చెవిలో 

చెప్పిస్తా  వివరంగా


అమ్మా నాన్నా చెల్లి తో 

ముద్దొచ్చే తమ్ముడితో 

ప్రేమతో ఉండమని చెప్పి 

ముగిస్తా " ఆరి గోపాల్ "  అక్షరాభ్యాసం .

Monday, June 28, 2021

168 ఓ బుల్లి కథ -- కఠో పనిషత్ -3 (Kathopanishad)

మొదటి భాగంలో "నచికేతుడు" యమలోకానికి వచ్చి యముడిని కలవటం, యముడు నచికేతుడికి మూడు వరాలు ఇస్తాననటం, రెండు వరాలు తీసుకున్న తర్వాత నచికేతుడు మూడవ వరంగా మానవుల మృత్యు వాతని గురించి మృత్యు కారకుడు యముడిని చెప్పమనటం జరిగింది. యముడికి మృత్యు రహస్యాలు చెప్పటం ఇష్టం లేక దానికి బదులు ఇంకొక కోరిక కోరమనగా నచికేతుడు దానికి వప్పుకోక పోవటం కూడా జరిగింది.

నచికేతుని కిచ్చిన మూడవ కోరిక తీర్చటానికి రెండొవ భాగంలో యముడు నచికేతునికి మన అందరిలో ఉండే ఆత్మ గురించి చెబుతాడు. ఆత్మ అందరి  హృదయాలలోనూ నాడీ సముదాయం మధ్య ఆసీనమై ఉంటుంది కానీ, అది ఎవరికీ కంటికి కనపడదు , దానికి ఆకారం లేదు.  దానికి క్షీణత్వం లేదు. దేహానికి ప్రాణ మిచ్చేది అదే తీసుకుపోయేది అదే. అన్ని ప్రాణులలో ఉన్నదీ అదే. అది నశించదు , అది ఉన్న దేహం క్షీణించి నశించిపోతే ఇంకొక దేహం వెతుక్కుని దానిలో ప్రవేశిస్తుంది. 

మన  మనసు (mind ) జ్ఞానేంద్రియాల ద్వారా  బయట వస్తువులని గుర్తిస్తుంది. ఈ మనసువెనుక తెలివి తేటలు (intellect ) ఉన్నాయి. ఆతెలివితేటల తరువాత ఉన్నది ఆత్మ(Self ). దాని తర్వాత అవ్యక్తం (avyaktham ). దాని తర్వాత పురుష (Purusha ). దానితర్వాత ఏమీలేదు.

పుస్తకాలు తిరగ వెయ్యటం మూలానో, వేదాలు చదవటం మూలానో , తెలివితేటల మూలానో ఆత్మ జ్ఞానం (realization ) కలుగదు. బ్రహ్మ మనకి బాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనటానికి జ్ఞానేంద్రియాలు పెట్టాడు కానీ మనలో ఉన్న ఆత్మని  చూసుకోటానికి ఏమీ పెట్టలేదు.

ఈ ఆత్మకి పేరుకూడా పెట్టలేము. అతీతుడు (infinite ), ఆకారము లేనివాడు, మనకు తెలిసిన మాటలకి అందని వానికి ఏ పేరు పెడతాము ! అందుకనే ఋషులు "ఓం" అని సంభోదించారు. 

యోగా (Yoga ) తో ఆత్మను కనుగొన వచ్చు అంటారుగానీ అది కుదరదు. ఎందుకంటే యోగ అంటే జ్ఞానేంద్రియాలని స్వాధీనంలో ఉంచుకోవటం. ఇది తాత్కాలికం. వస్తూ పోతూ ఉంటుంది.

మనలో ఉన్న ఆత్మే మన తెలివితేటల్ని, మన జ్ఞానేంద్రియాలనీ పని చేయించేది. కానీ "మాయ" ఆత్మని గుర్తించకుండా చేస్తుంది. ఆత్మని గుర్తించ కలిగేది "నిర్వికల్ప సమాధి" తోనే.

ఎవరైతే కోరికలకు (Vishaya kara Vrittis ) అతీతుడో , మనసునీ జ్ఞానేంద్రియాలనీ అదుపులో ఉంచుకుంటాడో , సద్గుణుడో, తమలోని ఆత్మను అనుభూతి (feeling ) (Brahmakara Vritti ) ద్వారా గుర్తించ గలుగుతారో వారికి బాధలూ భయాలూ మరణము ఉండవు. బాధలూ భయాలూ మరణాలూ ఉండేది అశాశ్వితమయిన శరీరానికి గానీ శాశ్వితమైన ఆత్మకు కాదు. 

ఆత్మ  ఉనికిని కనుగొనుటకు ధ్యాన మార్గం (Meditation ) ఒక్కటే దారి. నువ్వు ఆత్మ కోసం వెదుకుతున్నావని నీ మనసుకుచేప్పు, మనసు చేత నీ తెలివికి(Intellect ) చెప్పి దానిచేత ఆత్మని వెతికించు. ఆత్మని కనుగొనవచ్చు. మొదట్లో బొటనవేలంత జ్యోతిని మనసులో సృష్టించుకొని దానిమీద ఓంకార జపం(Meditate ) చెయ్యి. ఆత్మ సంధానం పొందవచ్చు. దీనిని  ఆధ్యాత్మికతలో నిష్ణాతుడైన గురువు ఉపదేశంతో సాధించ వచ్చు.


ఫల శృతి:

నచికేతుడు యముని ఉపదేశం ననుసరించి కామక్రోధాదులను, మరణమును జయించి బ్రహ్మైక్యము పొందెను. 

ఎవరైతే నచికేతుడు, యముని కధ విందురో వారికి ఆత్మజ్ఞానం కలుగును.

ఎవరైతే వారి పూర్వికుల శ్రార్ధ కర్మలప్పుడు భక్తితో ఈ కధ చదువుతారో వారి పూర్వికులు మోక్ష్మము  పొందుదురు.

ఓం:  మనమెప్పుడూ ద్వేషించు కోకుండా, పోట్లాడుకోకుండా చేసి మనందరినీ ఆ పరమాత్మ రక్షించి ముక్తి ప్రసాదించు గాక. 


నా మాట:

ఈ ఉపనిషత్ లో చివర ఫల శృతి ఉంది. ఆ రోజుల్లో కూడా అసూయలూ వైషమ్యాలూ పోట్లాడుకోటాలూ ఉన్నాయన్నమాట. (మనలోమన మాట ఇద్దరు ఋషులు  పోట్లాడుకుని రెండు యజుర్వేదాలువ్రాశారు. మన ఈ ఉపనిషత్ కృష్ణ యజుర్వేదంలో నుండి తీసుకొనబడినది.)

ఆత్మ మన శరీరానికి ప్రాణంపోసి అన్ని అవయవాల చేత పని చేయిస్తుంది. కంప్యూటర్ భాషలో మాట్లాడితే కంప్యూటర్ పనిచేయటానికి ప్రాణం పొసే విద్యుత్ కిందకి వస్తుంది. 

( త్యాగయ్య గారు 250 ఏళ్ళ క్రిందట మననుండి హృదయాన్ని కదిలించే ధ్వని ఎల్లా వస్తుందో చెప్పారు. మనం  "ఓం " శబ్ద వ్యక్తీకరణకి వాటిని ఉపయోగించుకోవచ్చు.

1. ప్రాణానల సంయోగము వల్ల   ప్రణవనాద సప్త స్వరములు.

2. నాభీ హృద్ కంఠ రసనా నాసాదుల  

3. నిద్దుర నిరాకరించి  వేకువజామున లేచి 

4. శోభిల్లు సప్తస్వర 

ధ్వని పుట్టించాలంటే వాయువు అవసరం. తెల్లవారు ఝామున లేచి నిశ్చలత్వముతో, ఆ వాయువుని నాభి లో పుట్టించి హృదయం మీదకుండా కంఠమును తాకుతూ కదిలిస్తూ నాసికా ముఖ ద్వారాలనుండి బయటికి తెచ్చి సప్తస్వరాలను పలికించు.

మన "ఓం" శబ్ద సృష్టికి తద్వారా  మనలోని "ఆత్మ " ని కనుగొనటానికి (realization )  త్యాగయ్యగారి మాటలు ఎంతోఉపయోగపడతాయి.

త్యాగయ్య గారి గురించి పై చెప్పిన మాటలన్నీ ఈ క్రింది విజయ శివ గారి వీడియొ నుండి సేకరించినవి.

Margam - Tyagaraja