ముందుగా నా కంప్యూటర్ Dell Dimension Desk Top(2003) with windows XP. నేను చెప్పబోయే మెలుకువలు అన్నీ దాదాపు అన్ని చోట్లా పనికొస్తాయి.
నీ కంప్యూటర్ లో 300 వందల వైరస్ లు వున్నాయి మేము బాగు చేస్తాము అని స్క్రీన్ మీద వస్తే ఆహా నా అదృష్టము అని క్లిక్ చేశాను. క్రెడిట్ కార్డు తో యాభై డాలర్లు కడితే బాగు చేస్తామని స్క్రీన్. డబ్బులు కడితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే!. నేను ఆ స్క్రీన్ క్లోజ్ చేశాను. మళ్ళా కంప్యూటర్ లో వైరస్సులు ఉన్నాయనే స్క్రీన్ వచ్చింది. డబ్బుల కోసం, ఒక కొత్త వైరస్ కంప్యూటర్ లోకి వచ్చిందని గ్రహించాను..
వెంటనే నా దగ్గర ఉన్న anti virus తో స్కాన్ చేశాను. Trojan horses , worms ఉన్నాయని చెబితే రిపైర్ చెయ్యమంటే కొన్ని repair చేసింది. నా దగ్గర ఉన్న anti virus అంత గొప్పది కాదల్లె వుంది, మళ్ళా వైరస్ లు ఉన్నాయనే స్క్రీన్, డబ్బులు ఇమ్మనే స్క్రీన్స్ ప్రత్యక్షం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కంప్యూటర్ ని turn off చేద్దామన్నా కుదరలేదు. పవర్ తీసేసి మళ్ళా ఆన్ చేశాను. మళ్ళా అవే స్క్రీనులు. Worms పాకుతూ విండోస్ (OS ) ని కంట్రోల్ లోకి తీసుకున్నాయల్లె ఉంది, కంప్యూటర్ నా కంట్రోల్ లో నుండి పోయింది.
ఏమిటలా మాటా పలుకూ లేకుండా కూర్చున్నారు అని అంటే భయపడుతూ చెప్పాను కంప్యూటర్ పాడయిందని. ఆవిడ వర్క్ కి వెళ్ళే హడావిడిలో ఉంది, మాట్లాడకుండా కంప్యూటర్ తో వచ్చిన backup డిస్క్ లు నా ముందర పడేసి, సాయంత్రానికి నేనోచ్చేసరికి సరి చెయ్యండి అని వెళ్ళిపోయింది.
దాదాపు ఈ వైరస్సులు అన్నీ బైట నుండి వచ్చేవే. ఉదా: మనకు వచ్చే ఈ-మెయిల్స్ నుండో , మనం browse చేస్తున్నఇంటర్నెట్ సైటులు నుండో, ఫయిల్సు డౌన్లోడ్ చేసు కుంటూ ఉంటేనో లేక ఎవరి వో ఫ్లాష్ డ్రైవ్ లు, సీడ్ లు తెచ్చి కాపీ చేసు కుంటూ ఉంటేనో, మన కంప్యూటర్ లోకి ఎక్కుతాయి. అవి చేసే యుద్ద కాండ వైరస్ లను బట్టి ఉంటుంది. కొన్ని నిశ్శబ్దంగా ఉండి, మన సంగతులన్నీ బయటకు సమాచారం పంపిస్తూ ఉంటాయి. కొన్ని మన ఫైల్స్ అన్నిటిలోనూ ఆక్రమించి, కంప్యూటర్ ని తమ స్వాధీనము లోకి తెచ్చుకుంటాయి. కొన్ని ఆ పనులన్నీ చేసేసిన తరువాత, నీ కంప్యూటర్ ఆక్రమించటం జరిగింది, డబ్బులు ఇస్తే బాగు చేస్తాను అని చెప్పటం జరుగుతుంది.
ఏమిచెయ్యాలో అర్ధం కాలేదు. నా దగ్గర ఇంకొక anti -virus CD లేదు. మంచి anti -virus డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి లేదు. వైరస్ ఎన్ని ఫైల్స్ ని నాశనం చేసిందో తెలియదు. గుడ్డిలో మెల్ల నా దగ్గర కొన్ని ముఖ్యమయిన ఫైల్స్ backup చేసుకున్నఫ్లాష్ డ్రైవ్ ఉంది. అందుకని వెంటనే హార్డ్ డిస్క్ ని ఫార్మాటు చేసి ఆపరటింగ్ సిస్టం(OS ) ని పెడదామని నిశ్చయించాను. తరువాత ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్ చేసుకోవచ్చు.
Backup డిస్క్ ల లోనుండి ఆపరేటింగ్ సిస్టం CD ని, CD డ్రైవ్ లో పెట్టి కంప్యూటర్ ఆన్ చేశాను. CD drive లో Operating System(OS) ఉంటే కంప్యూటర్ అక్కడనుండి తీసుకుంటుంది. ఇదివరకటి OS తీసేసి దానిమీద కొత్తది పెట్టమంటావా? (ఇల్లా అయితే మన పర్సనల్ ఫైల్స్ ఉంటాయి) లేక డిస్క్ ఫార్మటు చేసి కొత్త OS పెట్టమంటావా అని అడిగింది.(ఇల్లా అయితే పాత ఫైల్స్ అన్నీ పోతాయి). నేను ఇదివరకు అనుకున్నట్లు ఫార్మటు చేసి పెట్టమన్నాను. ఫార్మటు చేసి CD లోని XP OS లోడ్ చేసింది. దీనికి రెండు గంటలు పట్టింది.కంప్యూటర్ రీస్టార్టు అయిన తరువాత చూస్తే display స్క్రీన్ సరీగ్గా కనపడటల్లేదు. కంప్యూటర్ కి మోనిటర్ ఎటువంటిదో తెలియక default మోనిటర్ ని పెట్టింది.
కంప్యూటర్ కి మనము తగిలించే విడి భాగాలని peripherals అంటారు. ఉదా: మోనిటర్, ప్రింటర్. ప్రతీ పెరిఫెరల్ పనిచెయ్యాలంటే పెరిఫేరల్స్ కి రెండుభాగాలు ఉంటాయి. వాటి రెండు భాగాలూ, హార్డ్ మరియు సాఫ్ట్ వేర్స్ కలిసి పని చేయాలి. హార్డువేర్ మనకు కనపడుతుంది సాఫ్ట్వేర్ ఎవరోవ్రాసిన ప్రోగ్రాం, దానినే డ్రైవర్ అంటారు. మోనిటర్ కి సరియిన డ్రైవర్ లేక పోతే అది సరీగ్గా కనపడదు. నాకున్న backup disk నుండి సరియిన డ్రైవర్ ని లోడ్ చేశాను.మోనిటర్ సరియినది. అల్లాగే Nic card డ్రైవర్ కూడా లోడ్ చేశాను.దీనితోటి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. ప్రింటర్ డ్రైవర్ పెట్టాను ప్రింటర్ సరి అయినది. ఫ్లాష్ డ్రైవ్ నుండి నా పర్సనల్ ఫైల్స్ లోడ్ చేశాను. Now we are in business.
ఈ డ్రైవర్స్ లోడ్ చెయ్యటం లో కొన్ని మెలుకువలు ఉన్నాయి. కొన్నిCD పెట్టగానే కంప్యూటర్ లోడ్ చేసుకుంటుంది. కొన్నిటిని Zip ఫైల్ నుండి extract చెయ్యాలి. Extract చేసినప్పుడు సేవ్ చేసే ఫైల్ పేరును ఒకచోట వ్రాసుకోవటం మంచిది. తరువాత డ్రైవర్ లోడ్ చేసి install చెయ్యటానికి ఆ పేరు కంప్యూటర్ కి చెప్పాల్సోస్తుంది.
కంప్యూటర్ లో ఏ డ్రైవర్లు ఉన్నాయో ఏవి లేవో చెప్పటానికి device manager అని ఒకటుంది. ఏ device కి అయినా డ్రైవర్ లేక పోతే దానిలో అది పసుపు పచ్చ రంగులో కనపడుతుంది. మీరు ఆ device driver ని లోడ్ చేస్తే రంగు మారుతుంది. Device Manager ని చూడాలంటె, మార్గం క్రింద చూపుతున్నాను:
click Start -- right click my computer -- click properties -- click hardware -- click device manager.
లేక
right click My computer icon -- click manage -- click Device Manager.
కంట్రోల్ పానెల్ లో add hardware ద్వారా కూడా డ్రైవర్స్ ని install చేసుకోవచ్చు. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ పని చేస్తుంటే, మామూలుగా కంప్యూటర్ డ్రైవర్ లను అన్నిటినీ ఇంటర్నెట్ లో వెతుక్కుని install చేస్తుంది. పొరపాటున ఈ హడావిడిలో నేను మోడెం సాఫ్ట్వేర్ ని డిలీట్ చేస్తే తన అంతట తానే వెతుక్కుని install చేసుకుంది.
మీకు వీలయితే కంప్యూటర్ మీద నేను ఇదివరకు వ్రాసిన ఈ పోస్ట్ లు చూడండి.
కంప్యూటర్ లో ఏముంటాయి
21. ఓ బుల్లి కథ 9 -- కంప్యూటర్ లో ఏముంటాయి
22. ఓ బుల్లి కథ 10 -- కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తే
23. ఓ బుల్లి కథ 11 -- కంప్యూటర్ మొరాయిస్తే --
చివరి మాట: దాదాపు మూడు గంటల్లో ఈ పని పూర్తి చెయ్య వచ్చు గానీ నేను కష్టపడుతున్నానని ఇంట్లో నిరూపించు కోటానికి, ఆడుతూ పాడుతూ మూడు రోజులు తీసుకున్నాను. ఇంటి పని చెయ్యాల్సిన తప్పించుకోటానికి. మీ కంప్యూటర్ కి వైరస్లు తగిల్తే గాభరా పడకుండా వాటిని తరిమి కొట్టండి.